[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
దుర్యోధనుడితో మాట్లాడిన శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడితోపాటు సాత్యకిని కూడా పూజించి అందరూ తమతమ ఆసనాల మీద కూర్చున్నారు. తనవైపు చూస్తున్న అందరితోను, దుర్యోధనుడితోను ఇష్టంగా మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణుడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుణ్ణి భోజనం గురించి మాట్లాడాడు. అక్కడ తినడానికి అంగీకరించక శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు.
శ్రీకృష్ణుడి మాటలు విని దుర్యోధనుడు కర్ణుడితో నెమ్మదిగా “కర్ణా! శ్రీకృష్ణుడి మాటలు విన్నావు కదా! మొదట ఆ మాట తీరు పరిశీలిద్దాం. అప్పుడు ఆ మనిషి తీరు తెలుస్తుంది” అన్నాడు.
తరువాత “కృష్ణా! కావలసిన ఆహారపదార్థాలన్నీ మాకు తెలిసినంతవరకు సిద్ధం చేసి మేము ఆశతో ఎదురు చూస్తున్నాము. నువ్వు తినడానికి ఇష్టపడకపోవడం మన చుట్టరికానికి, న్యాయానికీ విరుద్ధమైన విషయం. నువ్వు కురుపాండవులకి సమానమైన చుట్టానివి. సాటిలేని ధర్మపరుడివి. ధృతరాష్ట్ర మహారాజుకి ఇష్టుడివి. అలాంటి వాడివైన నువ్వు మా ఇంట్లో భోజనం చెయ్యకపోవడానికి కారణం ఏమిటో చెప్పు” అన్నాడు.
దుర్యోధనుడి మాటలకి శ్రీకృష్ణుడు “రాయబారులు వచ్చిన పని చూడకుండా ముందుగా భోజనం చేయడం, వస్తువులు తీసుకోవడం, వస్త్రాలు తీసుకుని ధరించడం చెయ్యకూడదు. వచ్చిన పని పూర్తిచేశాకే అన్ని మర్యాదలు అంగీకరిస్తారు” అన్నాడు.
శ్రీకృష్ణుడి మాటలకి సుయోధనుడు “పద్మనాభా! తొందరపడడం అంత మంచిదికాదు. నా మాట విను. పని అవచ్చు, కాకపోవచ్చు. అవసరం వచ్చినప్పుడు ఆ సంగతి మాట్లాడవచ్చు. ముక్కుకి గుచ్చిన తాటిలో కాలు దూర్చడమెందుకు? కృష్ణా! వచ్చినవాడివి వచ్చినట్లు మా ఇంట్లో కమ్మగా భోజనం చేసి, హాయిగా కూర్చుని అన్ని విషయాలు చెప్పడం బాగుంటుంది కాని, భోజనం చెయ్యనని చెప్పవచ్చా? ఇందుకు కారణం నాకు తెలిసినంతలో ఏమీ లేదు. ఆలోచించకుండా ఏదో అనేశావు” అన్నాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అక్కడున్న వాళ్లందర్నీ ఒకసారి కలయచూసి ఏనుగు చిగురుటాకుని తొండంతో పట్టుకుని కదిలించే విధంగా దుర్యోధనుడి చేతిని తన చేత్తో పట్టుకుని కదిలిస్తూ “ఇలాంటి విషయాలు వివరించాల్సిన అవసరముంటే వివరిస్తాను విను” అన్నాడు.
శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో “ప్రేమతో తన ఇంటికి పిలిచి పెట్టే భోజనం మంచి భోజనం. ఆపద కలిగిన చోట అవును కాదు అని చెప్పడానికి వీలు లేని సంకట స్థితిలో తినే కూడు కూడా ఉచితమయిందే అవుతుంది. దుర్యోధనా! నువ్వు మా మీద ప్రేమ కలవాడివి కాదు. మాకు ధైర్యం నశించేలా ఇప్పుడు ముంచుకొచ్చిన ఆపద కొంచెం కూడా లేదు. కనుక, నీ ఇంట్లో తినడానికి ఇష్టపడట్లేదు. అంతేకాదు, శత్రువుల ఇంట్లో తినాలంటే వాళ్లు తమకేమి పెడతారో అనే భయం కలుగుతుంది.
అమృతమైనా యజమానులు తమ శత్రువులకి తినిపించడం మంచిది కాదు. క్షణభంగురాలైన ఈ శరీరాలకి ఎప్పుడు ఎలా చేటు మూడుతుందో చెప్పలేము కదా! నేను నీకు విరోధినా? అని ప్రశ్నిస్తావేమో.. విను. దుర్యోధనా! పాండవులంటే నీకు విరోధులు. నాకు వాళ్లు పంచప్రాణాలు. తమ ప్రాణాలకి ఎసరు పెట్టేవాళ్లు తమకి విరోధులు కావడంలో అనుమానమేముంది? కారణమేమీ లేకుండానే నువ్వు చిన్నతనం నుంచీ పాండవులకి అపకారమే చేస్తున్నావు. వాళ్లు నీకు సహోదరులు. పుణ్యకార్యాలు చెయ్యడమంటే ఇష్టపడతారు. పూజ్యులు. అటువంటి వాళ్లతో నువ్వు విరోధం కలిగి ఉండవచ్చా?
పుణ్యాత్ముల్ని బాధిస్తున్న మీ అందరి దగ్గర చెడు అన్నాలే ఉన్నాయి. ఒక్క విదురుడి అన్నమే తినతగినది అని నిర్ణయించుకున్నాను. కనుక నేను అక్కడికే వెడతాను” అని లేచాడు.
దుర్యోధనుడు పంపిస్తున్న సమయంలో బాహ్లికుడు, భీష్ముడూ మొదలైన కురువృద్ధులూ, ద్రోణుడూ మొదలైన పూజ్యులూ వెంబడించి “మా ఇళ్లల్లో మీ కోసం కానుకలు సిద్ధపరుచుకుని ఉన్నాము నీ రాకకోసం ఎదురుచూస్తున్నాము. మా ఇళ్లకి రండి!” అని వేడుకున్నారు. “నేను మీ అందరి ఇళ్లకీ వచ్చినట్లే, మీ పూజలన్నీ అందుకున్నట్లే అని అనుకోండి. ఇంక ఆగండి” అని వాళ్లని అక్కడే వదిలి విదురుడి ఇంటికి వెళ్లాడు.
విదురుడు ఆదరం, స్నేహం, నిలకడ కలిగిన భక్తితో శ్రీకృష్ణుడికి మంగళస్నానం చేయించాడు. తరువాత వండిన వంటకాలన్నీ వరుసగా వడ్డన చేయించాడు. శ్రీకృష్ణుడు ఆచారాన్ని అనుసరించి ముందు బ్రాహ్మణులు తిన్న తరువాత తానూ, తన తమ్ముడూ, సహచరులూ పవిత్రమైన, విశాలమైన అందమైన ప్రదేశంలో సంతోషంగా భోజనాలకి కూర్చున్నారు. మధ్య మధ్యలో విదురుడికి ఆనందం కలిగేలా మాట్లాడుతూ మహనీయంగా, కమనీయంగా తయారు చేసిన భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలనే నాలుగు విధాలైన భోజన పదార్థాల్ని శ్రీకృష్ణుడు ఆరగించాడు.
విదురుడు “పురుషోత్తమా! నా ఆతిథ్యం మన్నించు. నీకు ఆతిథ్యమివ్వడమే నాకు పరమ సంపద. వేరొక విధంగ నిన్ను అర్చించగలవాడు ఎక్కడా లేడు” అన్నాడు.
విదురుడు వినయంగా మాట్లాడుతూ స్వామిని ఆదరించాడు. భోజనమైన తరువాత శ్రీహరికి గంధం పూయడం మొదలైన సపర్యలన్నీ చేసి విదురుడు ధన్యుడయ్యాడు. తరువాత కవులు, గాయకులు మొదలైన అందరు విద్వాంసులు, స్తుతిపాఠకులు, వేణువులూదేవాళ్లు, వీణవాయించేవాళ్లు వివిధ విద్యల్లో ప్రవీణులై వినోదాన్ని కలిగించే కళాకారులందరూ ఆ జగన్నాయకుణ్ని దర్శించి కాలక్షేపం చేసి అవసరమైన ప్రయోజనాలు పొంది తమ తమ నివాసాలకి వెళ్లారు.
రాత్రి అవగానే విదురుడు లోపలి సౌధంలో హంసతూలికాతల్పం మీద శయనింప చేసి ఆయన దగ్గర తగిన పీఠం మీద తను కూడా కూర్చున్నాడు.
పడక మీద ఉన్న నారాయణుడితో విదురుడు “స్వామీ! ఇదొక పనిగా పనిగట్టుకుని నువ్వు ఇక్కడికి రావచ్చునా? దుర్యోధనుడు దురాత్ముడు. నీచుడు, దురహంకారపూరితుడు. అతడు నీ మాటలు వింటాడా? దుర్యోధనుడు అతడి పక్షాన చేరిన పదకొండు అక్షౌహిణుల సేనని చూసుకుని విర్రవీగుతున్నాడు. భీష్మ ద్రోణుల శక్తి మీద విశ్వాసం ఉన్నా కూడా ఒక్క కర్ణుడే తనకి జయం కలిగిస్తాడని మిడిసిపడుతుంటాడు.
నారాయణా! నువ్వు ఇక్కడికి వస్తున్నావని వినినప్పుడు కౌరవులందరూ చేరి తమలో నిర్ణయించుకున్న సంగతులు నీకు మనవి చేస్తాను. వాళ్లు నువ్వు చెప్పినదానికి అంగీకరించరు. పాండవులకి ఏమీ పంచి ఇవ్వరు. తామే ఈ భూమినంతటిని ఏలుకోవాలనుకుంటున్నారు. వాళ్లతో చేరిన రాజులందరు పాండవులు దిగ్విజయం చేసినప్పుడు వాళ్ల చేతిలో ఓడిపోయినవాళ్లు.
కనుక, తాము కూడా పాండవులతో (కర్ణుడితో పాటు) యుద్ధం చేసి చస్తాం లేదా గెలుస్తాం తప్ప మరో మార్గంలో వెళ్లమని నిర్ణయించుకున్నారు. అందువల్ల దుర్యోధనుడు అహంకారంతో ఉన్నాడు. కనుక, సంధి జరుగదు. కౌరవులకి వినాశకాలం దాపురించింది. అందుకే వాళ్లు యుద్ధానికి తయారవుతున్నారు. ఇలా ఒళ్లు తెలియకుండా ఎగిరిపడుతున్న ఆ దుష్టుల మధ్య నువ్వు కూర్చుని, వాళ్లు మాట్లాడే వివేకం లేని మాటలకి సర్ది చెప్తూ బదులు చెప్పడం బాగుండదు.
వాళ్లందరూ తెలివిలేనివాళ్లు. ఉపయోగించే మాటల విలువ వాళ్లకి తెలియదు. పరమ మూర్ఖులు కనుక నీ మాటలకి వాళ్లలో చైతన్యం కలగదు. వాళ్లవి చెడు ఆలోచనలు. స్వామీ! నీ మహామహిమ, నీ ప్రజ్ఞాపాటవం, నీ పౌరుషం నాకు తెలుసు. అయినా పాండవుల మీద ఉన్న ప్రేమ వల్ల, నీ మీద భక్తితోను నీకు చెప్తున్నాను. నువ్వు వాళ్లున్న సభకి వెళ్లద్దు” అని చెప్పాడు.
విదురుడు చెప్పినవన్నీ విని “విదురా! నీ వివేకం, ఆత్మీయత నా మీద చూపించి తల్లితండ్రులు చెప్పినట్టు మంచిని చెప్పావు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో వాళ్లకి తెలిసేలా చెప్పి, అందుకు వాళ్లు ఏమంటారో తెలుసుకుని దానికి తగినట్టుగా చేసి వెడతాను” అన్నాడు.
విదురుడితో మాట్లాడుతున్న శ్రీకృష్ణుడు
“విదురా! నాకు దుర్యోధనుడి దుర్మార్గమంతా తెలుసు. అతడితో చేరిన రాజులందరూ పాండవుల మీద పగతో ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసు. సంధి జరగదనీ తెలుసు. భూమండలమంతా బరువుతో ఒక పక్కకి ఒరిగి ఏనుగులతో, గుర్రాలతో కూడా భయంకరమైన మృత్యువు నోటిలోకి చేరాలని ఎదురుచూస్తోంది. ఇటువంటి మూర్ఖత్వాన్ని పోగొట్టడం చాలా పుణ్యం కలిగించే పని.
మానవుడు పుణ్యమో, పాపమో కలిగించే పనులు చేస్తుంటే మధ్యలో ఏదో ఒక కారణం వల్ల ఆ పని నెరవేరకపోయినా చేసిన ప్రయత్నం మాత్రం ఫలాన్ని పొంది తీరుతుంది అని పెద్దలు చెప్తారు. విదురా! ఇక్కడ నా మాట ఫలించినా ఫలించక పోయినా చేసిన పుణ్య ప్రయత్న ఫలితం మాత్రం దక్కుతుంది. అంతేకాకుండా బంధువుల మధ్య శత్రుత్వం ఏర్పడినప్పుడు అడ్డం పడి వాళ్లతో పోట్లాడి అయినా దాన్ని పోగొట్టకపోతే అలాంటి వాడిని విషయం తెలిసిన పెద్దలు ఘాతుకుడు అంటారు.
కురు పాండవుల సంధి కోసం ప్రయత్నిస్తాను. ధర్మబద్ధంగా మంత్రితో కలిసి ఉండే దుర్యోధనుడికి చక్కగా చెప్తాను. అతడికీ, పాండుకుమారులకీ ప్రజలందరికీ మంచి కలిగించే మార్గం పక్షపాతం లేకుండా చెప్తాను. ఇలా చెప్తున్నప్పుడు దుర్యోధనుడు నన్ను పాండవ పక్షపాతి అని అనుమానపడి నా మాటలు వినకపోతే వినకపోనీ, అదీ ఒకందుకు మంచిదే. ఇలా నేను రెండు కుటుంబాల విషయంలో జోక్యం చేసుకోకపోతే అన్నదమ్ములు వాళ్లల్లో వాళ్లు పోట్లాడుకుంటుంటే కృష్ణుడు వారించక తనకేమీ పట్టనట్లు ఉండిపోయాడు. తను అనుకుంటే పని చక్కదిద్దలేడా? అని అవివేకులు ఆడిపోసుకుంటారు.
అందుచేత పెద్దలు తాము బతకడానికి దారి చూపించే నా మాటలు మన్నిస్తే బాగుపడతారు. అలా నా మాటలు వినకుండా నువ్వు అన్నట్లు అసూయతో మనసులు పాడుచేసుకుని తిరగబడితే వాళ్లు నా ముందు నిలబడగలరా?” అని అన్నాడు.
విదురుడు “స్వామీ! మీరు చెయ్యాలనుకున్నట్లే చెయ్యండి” అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గర సెలవు తీసుకుని తను కూడా నిద్రపోడానికి వెళ్లిపోయాడు. శ్రీకృష్ణుడు విదురుడు మాట్లాడిన మాటలన్నీ ఒకసారి మననం చేసుకున్నాడు. ఇంతటి మహనుభావుడు ఎక్కడైనా ఉన్నాడా? అనుకుని పాలసముద్రపు తరంగాల్లా ఉన్న పరుపు మీద పడుకున్నాడు.
శ్రీకృష్ణుడు ఉదయాన్నే వైతాళికులు మేలుకొలుపు పాటలు పాడుతుంటే నిద్ర లేచి తన ఉదయపు కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకున్నాడు. ఇంతలో కృతవర్మ, సాత్యకీ వచ్చి కలిశారు. వాళ్లతోపాటు ఇంకా కొంతమంది ఇష్టులు తన చుట్టూ చేరిన వాళ్లతో నారాయణుడు ఉల్లాసంగా మాట్లాడుతూ కూర్చున్నాడు.
అదే సమయంలో దుర్యోధనుడు కర్ణుడు, శకుని, దుశ్శాసనుడితో కలిసి వచ్చి మధుసూదనుణ్ని మధురమైన మాటలతో పలకరించారు. వాళ్లతో శ్రీకృష్ణుడు కూడా ప్రేమగా మాట్లాడాడు. దుర్యోధనుడు “ధృతరాష్ట్రుడు బంధుమిత్రులు, స్నేహితులు మొదలైన పరివారంతో కొలుతీరి ఉన్నాడు” అని చెప్పాడు.
అది విని సంతోషంతో శ్రీహరి సిద్ధంగా ఉన్న రథమెక్కాడు. భేరులు, శంఖాలు, వింజామరలు మొదలైన మంగళ లాంఛనలతో గరుడకేతనం ప్రకాశిస్తూ ఉంటే రథం మీద బయలుదేరాడు.
దానికి ఒకవైపు సాత్యకి, కృతవర్మలు ఎక్కిన రథం; మరోవైపు దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని అనే నలుగురు దుర్మార్గులు ఎక్కిన రథం వస్తుండగా స్వామి పురజనులకి కనులవిందు చేస్తూ రాజభవనద్వారం దగ్గరికి చేరాడు. స్వామి రథం మందిరద్వారం చేరుతుండగానే కలిగిన సందడికి సభలో ఉన్నవాళ్లందరూ శ్రీకృష్ణుడి రాకకోసం గొప్ప ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. శ్రీమన్నారాయణుడు గొప్పదైన రథం మీదనుంచి కిందకి దిగాడు.
తన ఎదురుగా వచ్చి విదురుడు అందించిన హస్తాన్ని; తమ్ముడు సాత్యకి చేతిని రెండు చేతులతో ఊతగా అందుకుని నడుస్తుండగా ఎదురుగా వచ్చిన జన సమూహాన్ని కర్ణుడు, దుర్యోధనుడు దూరంగా పంపించారు.
బలసంపన్నులు, స్నేహితులయిన కృతవర్మ మొదలైన యాదవులు తన వెంట వస్తుండగా, తన సన్నిధిలో కౌరవులందరూ భాస్కరుడి దగ్గర తారల్లా, గ్రహాల్లా వెలవెల పోతుంటే, వెలుగులు విరజిమ్ముతున్న పుండరీకాక్షుడు సభలోకి ప్రవేశించాడు.
ఇతర రాజులందరూ శౌరికి ఎదురువచ్చి ఆహ్వానించారు. శ్రీకృష్ణుడు వాళ్లందర్నీ అభినందించాడు. తనకోసం ఏర్పాటైన రత్నఖచితమైన ఎత్తయిన బంగారు గద్దె మీద వెలుగులు చిమ్ముతూ కూర్చుని ఉండగా ఆకాశంలో నారదుడు మొదలైన మునీశ్వరులు కనిపించారు.
శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చిన మహామునుల్ని కౌరవులకి తాత అయిన భీష్ముడికి చూపించి “మనల్ని చూడాలని కుతూహలంతో మహనీయులైన నారదుడు మొదలైన మహర్షులు వచ్చారు. వీళ్లకి అర్ఘ్యపాద్యాలతో ఉపచారాలు చేయించు. వాళ్లు కూర్చోడానికి వెంటనే పీఠాలు వేయించు. నారదుడు మొదలైన మహామునులు కూర్చోకుండా మనం కూర్చోడం న్యాయం కాదు” అని భీష్ముడుకి చెప్పాడు.
భీష్ముడు సేవకుల్ని పంపించి మణులు తాపడం చేసిన బంగారు గద్దెలు చాలా తెప్పించాడు. అంతలో మునీశ్వరులు వచ్చారు. శ్రీకృష్ణుడు వాళ్లకి నమస్కరించి, ఆసనమివ్వడం, అర్ఘ్యపాద్యాలివ్వడం మొదలైన దివ్యోపచారాలతో పూజలు చేయించాడు.
వాసుదేవుడు కూర్చున్న తరువాత ధృతరాష్ట్రుడూ, మిగిలినవారూ ఆ మునులకి నమస్కారం చేసి తమ ఆసనాల మీద కూర్చున్నారు. దుశ్శాసనుడు, ధార్తరాష్ట్రుల్లో పదిహేడవ వాడయిన వివింశతి అనేవాడు వేసిన ఆసనాల మీద కృతవర్మ, సాత్యకి శ్రీక్రుష్ణుడుకి రెండు వైపులా కూర్చున్నారు.
దగ్గరలో దుర్యోధనుడు, కర్ణుడు ఒకే పీఠం మీద కూర్చున్నారు. విదురుడు శ్రీకృష్ణుడి ఆసనం దగ్గర అనుకుని మణిపీఠం మీద కూర్చున్నాడు. గాంధార రాజు శకుని తన కొడుకులతో కలిసి ఒకవైపు కూర్చున్నాడు.
మేఘంలా అందమైన శరీరపు రంగు కలవాడూ, పచ్చని పట్టుబట్ట ధరించినవాడూ, తామరరేకుల్లాంటి కళ్లు కలవాడూ అయిన శ్రీహరిని చూడగలిగినందుకు సభలోవాళ్ల కళ్లు అమృతాన్ని తాగినంత అనందంగా ఉన్నయి. శ్రీకృష్ణుణ్ని దర్శించుకున్న తమ మనసులు సంతోషంతో పరవశించగా నోట మాటలేకుండా ఉండిపోయారు.
