Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-157: ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్న శ్రీకృష్ణుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్న శ్రీకృష్ణుడు

శ్రీకృష్ణుడు గంభీరమైన కంఠధ్వనితో సభలో ఉండే వాళ్లందరూ వింటూ ఉండగా “మహారాజా! నీకు తెలియని పనులేమున్నాయి? అయినా భరతవంశం సంతోషించేలా నా ఇరు కుటుంబాల వారికి న్యాయమూ, మిక్కిలి శ్రేయస్కరమైనదీ చెప్పడం మంచిదని నేనిక్కడికి వచ్చాను.

కురురాజా! పాండవులు, కౌరవులు పాలూ నీరూ కలిసినట్టు కలిసి మెలిసి జీవించడం మంచిపని. వాళ్లు అలా ఉండేలా నువ్వే వాళ్లని నడిపించాలి. పాండవులు వేరు, కౌరవులు వేరు అనే భేదబుద్ధి నీకు లేదు కదా! మహారాజా! మీ భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, ఐకమత్యం, గౌరవం, కారుణ్యం మొదలైన సద్గుణాలు కలిగి పొగడ్తకెక్కింది. అటువంటి వంశంలో నువ్వూ, నీ ప్రియమైన సోదరుడూ పాండురాజూ గొప్ప సద్గుణాలు కలవాళ్లు.

నీ కొడుకులూ, నీ తమ్ముడి కొడుకులూ కూడా కీర్తిభారం వహించగలిగినవాళ్లు, మంచి స్వభావము, మంచి నడవడిక కలిగినవాళ్లు. వంశసంప్రదాయం ఇప్పుడు కూడ తప్పించడమెందుకు?

ధృతరాష్ట్ర మహరాజా! నువ్వు కురువంశస్థుల్లో పెద్దవాడివి. ఈ వంశం మొత్తానికి నువ్వే ఆధారం. నీ కుటుంబంలో ఎవరి నడవడికలు ఎలా ఉంటాయో వాటిని బట్టి కలిగే మేలు, కీళ్లు నీకే చెందుతాయి. కనుక, నువ్వు రెండు కుటుంబాల మంచిని కోరుకుంటూ అంతరంగ స్నేహం, బహిరంగ ప్రవర్తన ప్రజలు మెచ్చుకునేటట్లుగా ఎలాగైనా సరే వాళ్లని నువ్వే చక్కదిద్దవలసి ఉంటుంది.

రాజా! విను! దుర్యోధనాదులైన వీళ్లు ధర్మపరులు కాకుండా, మంచి పనులు చెయ్యకుండా, ఇలా  దారుణ బుద్ధితో బంధువుల మనస్సులు బాధ చెందేటట్లుగా దుష్టచేష్టలు చెయ్యడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. కౌరవులు, పాండవులు ఒక మంచి నిర్ణయానికి వచ్చి శాంతంతో జీవించడం మంచిది. అలా వాళ్లు ప్రసన్నంగా ఉండడం నాకూ, నీకూ, కురువంశానికీ, ఈ రాజులకి, భూమండలానికీ కూడా మంచిది.

అలా కాకుండా యుద్ధం చెయ్యవలసివస్తే మనందరికీ అపకారం జరుగుతుంది. కనుక మహారాజా! నా మాటల మీద నమ్మకం ఉంచి తప్పకుండా సంధి జరిగేలా చూడండి. రాజా! సంధి జరిపించవలసిన పని నీ చేతిలో ఉంది. అవసరమైతే పని చక్కబెట్టగలవు. కురుపాండవుల్ని శాంతపరచడం న్యాయం. ఎవరికైనా వివేకం కలిగించడానికి నువ్వు సమర్థుడివి. ఇది నిజం. అక్కడున్న భీమార్జునుల్ని యుద్ధరంగంలో ఎదుర్కోగలిగినవాళ్లు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పు.

ఇక్కడున్న ద్రోణ భీష్ముల పరాక్రమాన్ని లక్ష్యపెట్టకుండా పరిహాసం చేసేవాళ్లు అక్కడ కూడా లేరు. ఇలా రెండు వైపులా ఉన్న వీరులందరూ యుద్ధంలో చచ్చిపోవడం కంటే, అందరూ నీ బలగాలుగా ఉండి కలిసి మెలిసి నడుచుకోవడం మంచిది. మహారాజా! ఎలాగైనా వీళ్లు శాంతించేలా చెయ్యి.

లోకంలో రాజులందరు నీ పాద పీఠాన్ని ప్రేమతో సేవిస్తుండగా సముద్రపర్యంతం ఉన్న ఈ భూమండలాన్ని నువ్వు పరిపాలించడం తగినదే కదా! తల్లి తన పిల్లలపట్ల శత్రుత్వం వహించడం ఎంత సమంజసమో నువ్వే ఆలోచించు.

రాజా! నువ్వు కురుపాండవుల విషయంలో శ్రద్ధ చూపించకపోతే ఈ రెండు పక్షాలకే కాదు భూమి మీద ఉన్న ప్రజలందరికీ పాపం చేసినట్లు అవుతుంది. చివరికి నీకే హాని కలుగుతుంది. రాజా! కురు పాండవుల్లో ఎవరికి మరణం సంభవించినా, బాధలు కలిగినా నీకు ఎలా మంచి జరుగుతుందో ఆలోచించు.

పాండవులూ, కౌరవులూ మంచి విద్యావంతులు, పరాక్రమవంతులు, ఇంకా భుజబలం కలవాళ్లు. వీళ్లని ఎవరూ అడ్డగించలేరు. ఇలాంటివాళ్లు తమలో తమకి ఏర్పడిన కలహం వల్ల  యుద్ధంలో ఊరికే మరణించడానికి సిద్ధపడుతుంటే అడ్డగించకుండా చూస్తూ ఊరుకోడం మంచిదికాదు.

ఇంత కోమలమైన శరీరాలు వాడి బాణాలు అవతలి వైపుకి వెళ్లేలా గుచ్చుకుని నేల మీద కూలడం చూసి సహించడం శక్యమవుతుందా? రాజా! నీ ప్రాభవమూ, రాజనీతినీ, శాంతినీ సమస్త ప్రజలు మెచ్చుకునేలా కురుపాండవులు యుద్ధంలో నశించకుండా ఉండేలా సంరక్షించుకో” అని చెప్పాడు.

శ్రీకృష్ణుడు కొంచెం ఆగి మళ్లీ చెప్తూ “ధృతరాష్ట్ర మహారాజా! పాండవులు తండ్రి లేని పిల్లలు. వాళ్లని చిన్నతనంలో చల్లగా కాపాడావు. వాళ్లని కారణం లేకుండానే మధ్యలో విడిచి పెట్టడం న్యాయం కాదు. చివరివరకూ నువ్వు వాళ్లని ప్రేమతో కాపాడవలసిందే. రాజా! పాండునందనులు నీకు పరమ భక్తితో నమస్కరించి ఒకే గొంతుతో చెప్పమని నాతో చెప్పి పంపిన మాటలు చెప్తాను విను.

‘తండ్రీ నీ ఇష్టప్రకారం పన్నెండు సంవత్సరాలు అరణ్యాల్లో నివసించాము. పదమూడవ సంవత్సరం విరాటుడి రాజ్యంలో అజ్ఞాతవాసం చేశాము. ఈ విధంగా ఒడంబడిక నెరవేర్చాము. మేము రాజ్యంలో సగభాగం పొందగలమని దృఢనిశ్చయంతో ఉన్నాము. మాకు తల్లి, తండ్రి, చుట్టాలు – అన్నెందుకు అన్ని విధాలుగా రక్షకులు మీరే. మా వల్ల అపరాధమేదేనా ఉంటే కోపించి ఇలా కాదు అలా నడుచుకోండి అని సరిదిద్దండి.

మేము పదివేల సంవత్సరాలకైనా మిమ్మల్ని తప్ప ఇతరుల్ని ఆశ్రయించం. మేము ఎటువంటివాళ్లమైనా మమ్మల్ని, దుర్యోధనాదుల్ని సోదరులమని అనుకుంటారు గాని, లోకులు అనుకోరు. నీకు మంచి అభిప్రాయముంటే మాలో ఎవరు పనికిమాలినవాళ్లైనా వంశధర్మం చెడిపోకుండా నిలుస్తుంది’ అని నీతో చెప్పమన్నారు” అని చెప్పాడు.

శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో ‘ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం’ పాపం వల్ల, అబద్ధం వల్ల దగ్గరికి రాలేక చెడిపోడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే శక్తి ఉన్నా ఎవరు అడ్డుపడకుండా అశ్రద్ధ వహిస్తారో అది వాళ్లకే హాని కలిగేలా చేస్తుంది. ఆ స్థితిలో భగవంతుడు ధర్మాన్ని ఉద్ధరించడానికీ, సత్యానికీ శుభం కలగడానికీ ముందుకి వస్తాడు.

పాండవులు సభలో పెద్దలకి నన్ను చెప్పమని కోరిన మాటలు చెప్పాను. మహారాజా! నువ్వూ, నీ సభలో ఉన్న రాజులూ ఇందుకు సమాధానం  ఏం చెప్తారో చెప్పండి. నేను నీతి ధర్మాల్నీ, బాంధవ్యాన్నీ ముందుంచుకుని మనస్సులో ఉన్న మాటల్ని ఉన్నవి ఉన్నట్టుగా నిజమే చెప్పాను. నేను చెప్పిన పద్ధతి నీకు మంచినే కలుగచేస్తుంది. కోపం, గర్వం, ద్వేషం వదిలిపెట్టి నేను చెప్పినట్లే చేయండి.

కుంతి కుమారులకి భూమిలో సగ భాగం పంచి ఇవ్వడం కంటే మంచి పని గాని, ధర్మంగాని వేరొకటి ఉండదు. ఇంతకంటే తగిన మార్గం వేరొకటి ఇంకేముంది? మాట్లాడే విధానం తెలిసిన పెద్దలు మీరే చెప్పండి” అన్నాడు.

శ్రీకృష్ణుడు “ధృతరాష్ట్ర మహారాజా! నా మాటలు విను..”  అంటూ తన మనసులో మర్మం ఉంచుకోకుండ చెయ్యవలసిన పని వివరంగా తెలిసేటట్లు “పాండవుల తండ్రి భాగం పాండవులకిచ్చి, నీ రాజ్య భాగం నీ కుమారులూ మనుమలూ హాయిగా అనుభవిస్తూ ఉంటే చుట్టాలూ, స్నేహితులూ, సత్పురుషులూ మిమ్మల్ని కీర్తిస్తారు.

మహారాజా! ధర్మజుడి న్యాయమూ, ధర్మమూ, సత్యప్రవృత్తీ నీకు తెలుసు. అతడు మిమ్మల్ని ఆశ్రయించి ఎలా ఉన్నాడో మీకు తెలుసు. తగిన శక్తి కలిగి ఉండడం కూడా నీకు తెలుసు. ధర్మరాజు ఎటువంటివాడో నువ్వు ఎరుగుదువు. అయినా స్పష్టంగా చెప్తాను విను. అతడు ఇంద్రప్రస్థ పురంలో ఉంటూ నీకు గౌరవాన్ని ప్రఖ్యాతిని కలిగించాలని రాజుల గర్వం అడిగించి, వాళ్లందరు నిన్ను కొలవాలని గొప్పగా దిగ్విజయం చేసి అనేక సిరిసంపదలతో తులతూగుతూ ప్రశాంతంగా ఉన్నాడు.

అప్పుడు నీ తనయుడూ, అతడి మంత్రులూ చేరి శకునితో జూదమాడించి ధర్మరాజు సంపదల్ని మొత్తం హరించారు. అంతటితో తృప్తి పడక నిండు సభలో ద్రౌపదిని అవమానించారు. దుర్యోధనుడి చెడ్డ పనుల్ని నువ్వు అంగీకరించావు. ధర్మారాజు తన పరిస్థితిని అర్థం చేసుకుని సత్యం తప్పకుండా తన ఆజ్ఞ వల్ల భీమార్జునుల బలంతగ్గి కుంగిపోగా కంటినుంచి కారే కన్నీటిని పెడచేతితో తుడుచుకుంటూ ఘోరారణ్యాలకి వెళ్లాడు.

అక్కడ దుఃఖాల్లో మునిగి దైన్యం అనుభవిస్తూ ప్రతిజ్ఞని సక్రమంగా నెరవేర్చి కూడా ఇప్పుడు నీతో ఒద్దికగా జీవించాలని కోరుకుంటున్నాడు. ధర్మరాజుకి సాటి అయినవాడు ధర్మరాజే! అతడిని ఎంతని పొగడగలం? అతడి శాంత స్వభావం, సత్యనిష్ఠ ఇంతకు ముందు ఏ రాజులకున్నాయో చెప్పు. మంచితనం కలిగిన ధృతరాష్ట్ర మహారాజా! నీ పిల్లలైన కురుపాండవులు మంచి కోరి నేను ఇన్ని మాటలు చెప్పవలసి వచ్చింది. నీ కొడుకైన దుర్యోధనుడి మనసులో ఉన్న పరమ దురాశని పోగొట్టి పాండవుల్ని నీ దగ్గరికి పిలిపించుకో.

మహారాజా! పాండవులు ఎంత శాంత స్వభావం కలవాళ్లో అంత వీరత్వం ఉన్నవాళ్లు. వాళ్లు నీ పాద సేవ చెయ్యడానికి సంసిద్ధంగా ఉన్నారు. వాళ్లు అలా మీతో కలిసి మెలిసి నడుచుకోడం ఇష్టం కాకపోతే ఈ పాటికి యుద్ధం చెయ్యడానికి బయలుదేరి వచ్చేవాళ్లే! సంధి, సంగ్రామం – ఈ రెండింటిలో మీకు ఏది మంచిదని అనిపిస్తోందో దాన్ని నిర్ణయించి వెల్లడించండి” అని చెప్పాడు.

శ్రీకృష్ణుడు మాటలు సభలో వాళ్లందరికీ ఆనందాన్ని కలిగించాయి. నారాయణుడు ఎంత తగినట్లుగా మాట్లాడాడు. శౌరి మాటలకి తిరిగి మాట్లాడగల నీతి, నిపుణుడు, ధీరుడు, ఉపాయశాలి ఈ కొలువులో ఎవరున్నారు? అనుకుని నోరు విప్పకుండ, కదలకుండ, మెదలకుండ ఉండిపోయారు.

జమదగ్ని అనే మహర్షి దుర్యోధనుడితో “దుర్యోధనా! దంభోద్భవుడనే రాజు తనకి ఎవరూ ఎదురు లేరని గర్వంతో విర్రవీగుతూ నరనారాయణులనే దేవర్షులు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటుంటే వాళ్లని యుద్ధానికి ఆహ్వానించాడు. ఆ మహర్షులు తమతో యుద్ధం వద్దని ఎన్నో విధాలుగా చెప్పారు. అతడికి మొండిగా వాదిస్తూ ఉండిపోయాడు.

అతడు ఎంతకీ వినకపోతే నరుడు దర్భలు ధరించిన చేతితో బాణాలు వానగా కురిపించి దంభోద్భవుడి సేనల్ని నాశనం చేశాడు. అతణ్ని పరాభవించి చివరికి వదిలేశాడు. ఆ మహానుభావులు ఇద్దరూ పార్థుడు, శ్రీకృష్ణుడు అనే పేరుతో ఈ భూలోకంలో జన్మించారు. కనుక, ఆ దంభోద్భవుడిలా గర్వంతో నరనారాయణుల్ని ఎదిరించడం మంచిది కాదు. పాండవులతో కలిసి ఉంటేనే మంచిది” అన్నాడు.

దుర్యోధనుడికి గరుత్మంతుడి వృత్తాతం చెప్పిన కణ్వమహర్షి

కణ్వమహర్షి “దుర్యోధనా! జమదగ్ని మహర్షి చెప్పిన మాటలు తగినవి. తన శక్తినీ, ఎదుటివాళ్ల శక్తినీ గమనించకుండా గర్వంతో ఎదిరించడం మంచిది కాదు. పూర్వం గరుత్మంతుడికి అహంకారం అతడి శౌర్యానికి హాని కలిగించింది.

దేవేంద్రుడి రథసారథి మాతలి తన కుమార్తె గుణకేశికి ఆర్యకుడు అనే సర్పనాయకుడి మనుమడు, చికురుడు అనే వాడి కొడుకు అయిన సుముఖుణ్ని భర్తగా నిర్ణయించాడు. తరువాత ఆర్యకుడి దగ్గరికి వెళ్లి సుముఖుణ్ని తన కుమార్తెకి ఇచ్చి పెళ్లి చెయ్యమని అడిగాడు.

ఆర్యకుడు బాధపడుతూ “అయ్యా! సుముఖుడి తండ్రి చిరకుడిని గరుత్మంతుడు చంపేశాడు.. నెలరోజుల్లో సుముఖుణ్ని కూడా చంపేస్తానని కోపంతో పంతంగా చెప్పి వెళ్లాడు. ఇటువంటి పరిస్థిత్లో సుముఖుడి వివాహనికి అంగీకరించలేను” అన్నాడు.

ఆ మాటలు విని మాతలి “దేవేంద్రుడిని అడిగి సుముఖుడికి ఆయుర్దాయాన్ని ఇస్తాను. మీరు నాతో రండి” అని వాళ్లని వెంటబెట్టుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్లాడు.

వాళ్ల అదృష్టం వల్ల ఇంద్రుడూ, ఉపేంద్రుడూ ఒకచోటే ఉన్నారు. మాతలి వాళ్లతో తను వచ్చిన పని గురించి చెప్పాడు. అందుకు అంగీకరించిన దేవేంద్రుడు విష్ణుమూర్తికి చెప్పి చేయించాలని అనుకుని గరుత్మంతుడి విషయంలో తాను చాలు అనుకుని సుముఖుడికి దీర్ఘాయుష్షు ఇచ్చాడు. తరువాత మాతలి తన కుమార్తెని సుముఖుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.

ఆ సంగతి విని గరుత్మంతుడు అక్కడికి వచ్చి కోపంతో నారాయణుడి సమక్షంలో ఇంద్రుడిని “నువ్వు అదితి పుత్రుడివి. నేను వినత పుత్రుణ్ని. మనిద్దరికీ తండ్రి కశ్యపుడు ఒకడే. ఇద్దరం రాక్షసుల్ని వెతికి వెతికి చంపుదామా? ఇంద్రా! నేను నీ కంటే ఏం తక్కువ? నా నిర్ణయానికి నువ్వెందుకు అడ్డు పడ్డావు?” అని అడిగాడు.

గరుత్మంతుడి మాటలు విని ఇంద్రుడు “నీ గొప్పతనానికి విష్ణుదేవుడు తప్ప మరొకడు కారణం కాదు” అన్నాడు.

ఇంద్రుడి మాటలకి బాధపడి గరుత్మంతుడు “నా శక్తిసామర్థ్యాలు ఎలాంటివో నిజంగా గ్రహించలేక నన్ను తక్కువగా చేసి మాట్లాడావు. అదితి సంతానమయిన దేవతలందర్నీ ఒక్క ఈక మీద ధరించగలను. ఇంతటి బలం కలిగిన నన్ను ఇలా చిన్నబుచ్చుతావా?” అని ఎర్రబడిన కళ్లతో ఇంద్రుణ్ని చూస్తూ ఉండిపోయాడు.

అక్కడున్న గరుత్మంతుణ్ని చూసి నారాయణుడు వెటకారంగా నవ్వుతూ “అవివేకీ! నువ్వు ఎంత బరువుని మోయగలవురా? నా సామర్థ్యంతో నిన్ను నడుపుకుని వస్తుంటే నీకు ఇంత పొగరెందుకు? అంటూ ఆ పరమాత్మ తన ముంజేతిని అతడి వీపు మీద మోపాడు. ఆ బరువుకి గరుత్మంతుడు బెదిరిపోయాడు. ఆ చెయ్యి బరువుకు గరుత్మంతుడు రెక్కలు చాస్తూ, నోరు తెరుస్తూ నేలమీద పడి ఒళ్లు తెలియని స్థితిలో గట్టిగా అరిచాడు.

శ్రీహరి “గరుడా! భయపడకు!” అని చెప్పి అతడి ఈకల్ని సవరించి మళ్లీ ఎగరడానికి తగిన శక్తినిచ్చి దయతో పైకి ఎత్తాడు. అలా విష్ణుదేవుడు దయతో గరుత్మంతుణ్ని ఊరడించి “ఇంక గర్వం విడిచిపెట్టి బుద్ధి కలిగి ఉండు”  అని చెప్పి పంపించాడు. గరుత్మంతుడు వెళ్లిపోయాడు. కనుక గర్వం పనికి రాదు.

ఇదంతా మహాత్ముడైన నారద మహర్షికి తెలుసు అని దుర్యోధనుడికి నారద మహర్షిని చూపించి  “ఈయన మాతలి కుమార్తె పని మీద వాళ్ల వెంట వెళ్లాడు. ఈయనని అడిగి చూడు. అంతేకాదు, సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడి మహిమ ఇతడికి బాగా తెలుసు. ఆ ఆదినారయణమూర్తే ఈ దేవకీనందనుడు అని తెలుసుకో. ఈయన తోడ్పడుతున్న కుంతీపుత్రులతో పొత్తు కలిగి ఉండడమే నువ్వు చెయ్యతగిన పని” అని కణ్వమహర్షి చెప్పాడు.

Exit mobile version