[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
దుర్యోధనుడికి హితము చెప్పిన భీష్మద్రోణులు
శ్రీకృష్ణుడు మాటలు విని భీష్ముడు దుర్యోధనుడితో “నీ తండ్రిమాట ప్రశాంతమైన మనస్సుతో స్వీకరించు. మన కురుకులం పవిత్రమయ్యేట్లు పండితుల యందు ప్రేమగల నారాయణుడు ఇక్కడికి వచ్చేసి నీకు హితం తెలిపాడు. ఆయన మాటలు వినకపోవడం వినాశనానికి మార్గం.
వీళ్లందరూ ఆజ్ఞాపించినట్టు ఆచరించు. సుయోధనా! నీ తండ్రి ధృతరాష్ట్రుడు ప్రాణాలతో ఉండగానే విడవకుండా చుట్టాలనీ, రాజ్యన్నీ హద్దులేని కీర్తినీ ఎందుకు నాశనం చేయాలని ప్రయత్నిస్తావో చెప్పు. కృష్ణార్జునులతో పెట్టుకునే శత్రుత్వం ఈ సమస్త బంధువులే కాదు, భూమిలో ఎవరూ సహించలేరు. నువ్వు ఇహపరాలకి కీడు కలిగించక పాండవులతో కలిసి, మెలిసి జీవించడమే మంచిది” అని చెప్పాడు.
శ్రీకృష్ణుడు చెప్పిదాన్ని విని ద్రోణుడు “సుయోధనా! మీ తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, తాత అయిన భీష్ముడూ, గురుడైన నేనూ మీకు సుఖం కోరుతున్న వాళ్లం. మేలు కలిగించే మా మంచి మాటలు విను. దుర్మార్గుల పలుకులు గౌరవించక బంధువులైన పాండుపుత్రులతో కలిసి మెలిసి జీవించు.
నాయనా! గోవిందుడు ప్రేమతో వివరంగా చెప్పిన మంచి మాటలు విన్నావు. ఆ దారిలో నడుచుకో. అలా అయితే నీకు ఆయుష్షు, సిరి సంపదలు లభిస్తాయి. మా కళ్లతో మిమ్మల్ని చూసుకుంటూ హాయిగా ఉంటాము. నువ్వు శ్రీకృష్ణుడు మాటలు వినకపోతే ఆ ఫలితాన్ని అనుభవిస్తావు. ఇంతకు మించి నిండు సభలో నిన్ను ఏమీ అనలేము” అన్నాడు.
ద్రోణాచార్యులు చెప్పిన మంచి మాటలు విన్న తరువాత ధృతరాష్ట్రుడు తన కుమారుడి వైపు ముఖం తిప్పి “నువ్వు శ్రీకృష్ణుణ్ని ఆధారంగా చేసుకుని అక్కడికి వెళ్లి నీకు అన్నగారూ, పుణ్యాత్ముడూ అయిన ధర్మపుత్రుడిని చూడు. అందువల్ల మన పనులన్నీ సఫలమవుతాయి. నారాయణుడి మాటలు ఆచరించకపోతే ఆ తరువాత ఎన్నో కష్టాలు కలుగుతాయి”. ధృతరాష్ట్రుడు కొడుకుకి చెప్పాక ఇంకా నొక్కి చెప్పాలనుకున్నారు భీష్మద్రోణులు.
సుయోధనుడితో “రాజా! శ్రీకృష్ణుడు రథసారథ్యం చేస్తుండగా, గాండీవం చేత్తో పట్టుకుని అర్జునుడు యుద్ధరంగంలో ప్రత్యక్షం కాకమునుపే నువ్వు ధర్మరాజుని దర్శించి పని చక్కబెట్టుకుని కౌరవవంశాన్ని కాపాడుకో” అన్నారు.
భీష్మ ద్రోణులు మళ్లీ మట్లాడుతూ “సుయోధనా! నువ్వు ధర్మజుడి పాదాలకి అత్యంత భక్తితో నమస్కరిస్తే; అతడు నిన్ను ప్రేమతో పట్టుకుని లేవదీసి చాలాసేపు కౌగలించుకుంటే; భీముడూ, నువ్వూ, ఒకళ్లనొకళ్లు కౌగలించుకుటుంటే; అర్జునుడు, నకుల సహదేవుడు నీకు నమస్కారం చేస్తుంటే; వాళ్లని నువ్వు దగ్గరికి తీసుకుని కౌగలించుకుటుంటే.. ఇలా మీరు ఒకళ్లనొకళ్లు కౌగలించికుని బంధుత్వం పెంచుకుంటే స్నేహితులు, బంధువులు, మిమ్మల్ని చూసి సంతోషిస్తుంటే మీ కురువంశం ఎలా ఉంటుందో ఆలోచించు.
యుద్ధం చెయ్యడానికి వచ్చిన రాజులు, రెండు సేనా శిబిరాల్లో ఆనందం వ్యాపించగా తాము తమ తమ పట్టణాలకి తరలి వెడుతుంటే భూమి మీద ఉన్న ప్రజలు ఎంత ఆనందిస్తారో చెప్పలేము” అన్నారు.
కొంచెం ఆగి భీష్మ ద్రోణులు మళ్లీ దుర్యోధనుడితో “మీ రెండు కుటుంబాల వాళ్లూ రాజ్యం పంచుకుని హాయిగా అనుభవిస్తూ ఉండడం భూలోకంలో ఉన్న ప్రజలందరికీ సంతోషం కలిగిస్తుంది. కనుక, మేము చెప్పినట్లు చేసి అందరి ఆశీస్సులు అందుకో” అన్నారు.
భీష్మ ద్రోణుల మాటలు విని దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో “గురువైన ద్రోణుడూ, తాతగారు భీష్ముడూ, తండ్రి ధృతరాష్ట్రుడూ ఎప్పుడూ నన్ను తిడుతూ ఉంటారు. నువ్వు కూడా అలాగే నన్ను తిడుతున్నావుగాని న్యాయం ఆలోచించట్లేదు కదా!
‘ద్రౌపదిని భంగపరిచారు, అడవుల్లో మేము నానా కష్టాలూ పడ్డాము’ అంటూ పాండవులు నిష్కారణంగా మామీద కోపగించి వీరులై మమ్మల్ని చంపడానికీ, నాశనం చెయ్యడానికీ చూస్తారు. కృష్ణా! న్యాయంగా ఆలోచిస్తే నా వల్ల తప్పేముంది? ధర్మరాజు జూదరి అవడం వల్ల తానే శకునిని వెంబడించి, ఆలోచించకుండా తన చేతిలో ఉన్న మొత్తం భూమిని పోగొట్టుకున్నాడు. అంతటితో ఊరుకోకుండా మూర్ఖుడై మళ్లీ పందెం వేస్తే శకుని తనకి పాచికల ఆటలో ఉన్న ప్రావీణ్యం వల్ల గెలిచాడు.
ధర్మరాజు తన ఇష్టప్రకారమే చేశాడు. అంతే తప్ప అతడి కష్టాలకి నేను బాధ్యుడినా? కృష్ణా! మత్స్య, పాండ్య, పాంచాల దేశాల రాజులందరినీ కూర్చుకుని యుద్ధం చెయ్యాలని తనే మా మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటువంటి క్రూరమైన పనికి మేము ఎప్పుడు సిద్ధపడ్డామో చెప్పు.
కృష్ణా! క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేస్తూ చచ్చిపోతే వీరుడనే కీర్తి దక్కుతుంది. అక్కడ వీరస్వర్గం సుఖాలు కలుగుతున్నాయి. అందువల్ల మేము పౌరుషం వదిలిపెట్టి ఇంద్రుడికి కూడా నమస్కరించం. అప్పుడు చిన్నతనంలో న్యాయమేదో తెలియనప్పుడు అలా జరగనిచ్చాను. ఇప్పుడు మా తండ్రి, తాత అనాలోచితంగా నా శక్తి సామర్థ్యాలు గుర్తించక రాజ్యంలో సగభాగం పాండవులకి ఎవరైనా ఇవ్వాలని అనుకుంటే నేను ఎందుకు అంగీకరిస్తాను?
మునుపటి రుచిమరిగి మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షమై కుంతీపుత్రులు రాజ్యమేలాలని కోరుకుంటున్నారు. కాని, నేనిస్తానా? ఆనాటి దోపిళ్లు ఇకమీదట సాగవు. గురు, పితామహులు ద్రోణ భీష్ములు మా పక్షంలోనే ఉన్నారు.
మేమూ వాళ్లూ భూమిని పంచుకుని పరిపాలించడం జరగదు. ఇందుకు నువ్వేమీ సమాధానం చెప్పద్దు. సన్నని సూది మొన మోపినంత మాత్రమైనా భూమిని పంచి పాండురాజకుమారులకి నేనివ్వను. అటు వాళ్లో, ఇటు మేమో ఎవరో ఒకళ్లు యుద్ధంలో విజయం పొంది రాజ్యం చెయ్యడానికి నిర్ణయించాను” అన్నాడు.
దుర్యోధనుడి మాటలకి కోపంతో వచ్చిన చిరునవ్వు శ్రీకృష్ణుడు ముఖానికి కొత్త అందం తీసుకురాగా తెల్లతామరలవంటి కళ్లు ఎర్రతామరలుగా మారి కనిపించాయి.
దుర్యోధనుడికి అతడి పూర్వపు దుర్మార్గాలు చెప్పిన శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడు “దుర్యోధనా! నువ్వు చెప్పినట్లే రణరంగంలో కూలగలవు. ఇందుకు ఆలస్యం లేదు. శూరులై నువ్వూ, నీకు సాయపడడానికి వచ్చిన రాజులందరూ సిద్ధంగా ఉన్నారు. రేపే యుద్ధం వస్తోంది. ఉపశమనం పొందండి. నీ వల్ల దోషం లేదని చెప్పావు. సుయోధనా! ఒకనాడు పాండవులకి కీడు చేసి, మరొకనాడు చెయ్యకుండా ఉన్నావా? నువ్వు పుట్టింది మొదలు వాళ్లకి మానకుండా అపకారం చేస్తూనే ఉన్నావు.
తినే అన్నంలో విషం పెట్టించావు. పెద్దపెద్ద పాములతో కరిపించావు. కాళ్లూ చేతులూ కట్టించి గంగ మడుగులోకి తోయించావు. లక్క ఇంటిలో నివసిస్తున్నప్పుడు కాల్పించావు. ఇలా అనేక విధాలుగా పాండవుల్ని చంపడానికి ప్రయత్నించావు. కాని, వాళ్ల ధర్మం వాళ్లని కాపాడింది. వారెలాగో పైకి వచ్చి రాజ్య సంపద పొంది హయిగా జీవిస్తుంటే నీకు కన్ను కుట్టింది. దారుణమైన పాప పంకిలమైన మనస్సుతో జూదమొకటి ఏర్పాటు చేశావు.
ధర్మరాజుని కపట జూదంలో ఓడించడం వల్ల ఇంత అనర్థం జరిగింది. నువ్వొక్కడివి తప్ప లోకంలో ఎక్కడైనా తోబుట్టువులతో జూదమాడి, ఆడవాళ్లని జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకుని వచ్చి వస్త్రాలు ఊడదీయించినవాళ్లు ఉన్నారేమో నువ్వే చెప్పు.
సుయోధనా! పాంచాలికి నిండు సభలో పరాభవం జరుగుతున్నప్పుడు నువ్వూ, కర్ణుడూ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ సభలో మళ్లీ చెప్పతగ్గ మాటలు కావు. ఉత్తమ వంశంలో పుట్టిన, మంచి నడవడిక కలిగిన పరమ పతివ్రతని ఆ విధంగా మీరు పరాభవించడం కళ్లారా చూసిన ఈ జనలంతా వింటుండగా నా వల్ల ఏ నేరమూ లేదని అనడం నీ ఒక్కడికే చెల్లింది.
మా పైకి దండెత్తి రావడానికి సిద్ధంగా ఉన్నారని నేరమంతా పాండవుల మీద మోపితే మీకు ఆయుష్షు ఉంటుందా? నీ తండ్రి ధృతరాష్ట్రుడు, ఒకళ్ల తరువాత ఒకళ్లు చెప్తున్న మంచి మాటలు నువ్వు వినడం లేదు. శాంతి వహించడం నీకూ, పాండవులకీ చాలా మంచిది. పాండవులతో సంధి నీకు గిట్టదని తెలిసి కూడా శాంతికోసం నేను ఇంతగా నొక్కి చెప్తున్నాను”.
ఇలా నారాయణుడు అనేక విధాలుగా మంచి మాటలు చెప్తుంటే వినడానికి బాధపడుతున్న దుర్యోధనుడితో దుశ్శాసనుడు “మన తండ్రీ, ద్రోణాచార్యులూ, పితామహుడూ, నీ మేలు కోరి ప్రేమతో నీకు చెప్పే విధం ఇది కాదు. వాళ్లు చెప్పినట్లుగా పాండవులతో పొత్తు కుదుర్చుకుంటే నిన్ను వీళ్లు శ్రీకృష్ణుడి వశం చేసేస్తారు. ఈ మాట నిజం. ఇంక ఇక్కడ నువ్వు ఉండడం వల్ల ఏ విధంగానయినా హానే కలుగుతుంది.” అన్నాడు.
దుశ్శాసనుడి మాటలు విని బాహ్లికుడు మొదలైన కురువంశ వృద్ధుల్నీ, తమ తండ్రినీ, వాసుదేవుడినీ లక్ష్యపెట్టకుండా అహంకారంతో దుర్యోధనుడు సభ నుంచి వెంటనే లేచి వెళ్లిపోయాడు. సభ మొత్తం కలవరపడింది. దుర్యోధనుడి వెంట కర్ణుడు, సహోదరుల గుంపు, శకుని, మిత్రులైన రాజులు సభలోంచి అలా లేచి వెళ్లి గుంపుగా, వేరుగా, కోపంగా కొంచెం దూరంలో ఉండిపోయారు.
సభలోంచి వెళ్లి పోయి ఒకచోట గుంపుగా చేరిన దుర్యోధనుడు మొదలైన వాళ్లని చూసి భీష్ముడు “ఈ దుర్యోధనుడు తనూ ఒక రాజునని పనికిరాని అహంకారంతో పొగరెక్కి, బుద్ధిలేక, అత్యాశ, అజ్ఞానం, మదం, ఈర్ష్య అనే దుర్గుణాలకు లొంగి అమర్యాదగా సభలోంచి లేచి వెళ్లాడు. ఏ ఉద్దేశంతోనో వీని వెంబడి మరికొందరు రాజులు కూడా వెళ్లిపోయారు. వీళ్లు కొంతమంది మిక్కిలి పౌరుషంతో కూడిన మనసులు కలవారు. ఇప్పుడు ఏం చెయ్యాలో తోచట్లేదు” అన్నాడు.
భీష్ముడు శ్రీకృష్ణుడి వైపు చూసి “ఈ రాజులందరికీ వినాశకాలం దాపురించినట్లు ఉంది” అన్నాడు. శ్రీకృష్ణుడు సభలో యోగ్యులైనవాళ్లని చూసి “ఈ సుయోధనుడికి ఇంత పొగరా? ఈ సభలో ఉన్న రాజులందరు నావల్ల దీనత్వం పొందడం తగదని ఎందుకు ఆలోచించట్లేదు? దుర్యోధనుడి ఈ రకమైన ప్రవృత్తి మాన్పించడానికి మరో మార్గం ఏదీ లేదా? గొప్ప వంశాన్ని సంరక్షించడానికి ఆ కుటుంబంలో పుట్టిన చెడ్డబుద్ధి కలవాడు, అల్పుడు అయిన ఒకడిని పరిత్యజించడం తగదా?
ఈ కౌరవ జాతికి ఏర్పడిన పీడ తొలగదా? కంసుడు ఇలాగే తండ్రి మనసు నొప్పించి ధర్మం నశించేలా చేస్తుంటే కులబంధువులు వచ్చి నాకు చెప్పుకున్నారు. చెడు మాంసాన్ని కోసివేసే వైద్యుడిలా నేను ఆ దుష్టుడిని సంహరించి అతడి తండ్రి ఉగ్రసేనుడికి రాజ్యం పట్టం కట్టి కులానికి మేటిగా చేశాను. మీరు కూడ అలా చేయడం ఉచితం కదా?
దుర్యోధనుడి పీడ విరగడ అయితే అన్ని కష్టాలు తీరుతాయి. కురువంశం గొప్ప గౌరవం పొందుతుంది. కురుపాండవులు కలిసి జీవించే భాగ్యం లభిస్తుంది. కనుక, నేను చెప్పిన మార్గం మీకు మంచిది కదా?” అన్నాడు.
సభలో ఉన్నవాళ్లతో శ్రీకృష్ణుడు అన్న మాటలు విని ధృతరాష్ట్రుడు బెదిరిపోయి విదురుడితో “గాంధారి తెలివిగలది. తగినట్లు మాట్లాడే నేర్పు గలది. ఇక్కడికి వచ్చి కుమారుణ్ని శాంతింప చేస్తుంది. నువ్వు త్వరగా వెళ్లి ఆమెని సభకి తీసుకుని రా!” అని చెప్పాడు ధృతరాష్ట్రుడు. విదురుడు వెళ్లి ఆమెని వెంటబెట్టుకుని వచ్చాడు.
ఆ గాంధారీ దేవి విదురుడి వెంట వచ్చి తగిన ఆసనం మీద కూర్చుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆమెతో “నీ కుమారుడు విధేయత లేకుండా సభ నుంచి వెళ్లిపోయాడు. ఇటువంటి మూర్ఖుడు ఎక్కడైనా ఉంటాడా? నువ్వైనా చెప్పి దుర్యోధనుడిని శాంతింప చేయగలిగితే శ్రీకృష్ణుడి ఆజ్ఞ గౌరవించబడి, ఈ కురువంశం నాశనమవక బతికి ఉంటుంది” అన్నాడు.
అతడి మాటలకి గాంధారి “రాజా! నీ కొడుకు అవిధేయుడని తెలిసీ తెలిసీ అతడి ఇష్టప్రకారం ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నువ్వు పాండు కుమారులకి ఏమిచ్చినా వద్దని అడ్డుపడేవాళ్లు ఎవరో నువ్వే చెప్పు” అని చెప్పి గాంధారి తనూ, ధృతరాష్ట్రుడూ దుర్యోధనుణ్ని సభలోకి పిలిపించమని విదురుడికి చెప్పారు.
విదురుడు వెళ్లి చెప్పాడు. దుర్యోధనుడు కోపంతో ముఖం ఎర్రబడగా సభకి వచ్చాడు. అంతకు ముందు అతడితోపాటు సభలోంచి లేచి వెళ్లిన వాళ్లు అక్కడే నిలబడ్డారు. దుర్యోధనుడు తనొక్కడే వచ్చి పీఠం మీద కూర్చున్నాడు. గాంధారి అతడిని గమనించి మనసులో తిట్టుకుంటూ అతడికి ధర్మము, చుట్టరికము, రాజనీతి, బతికేమార్గం, అతనికి ఉన్న శక్తి, అతడికి ఎంత సహాయం అందుతుంది, కురువంశంలో ఉండే పెద్దల మనోభావాలు, పాండవుల శక్తిసామర్థ్యాలు స్పష్టంగా బుర్రకెక్కేలా చెప్పింది. అతడిని బతిమాలింది, కోపపడింది, అనేక విధాలుగా మంచిమాటలు తెలిసేలా చెప్పింది. కాని, అతడు తల్లి మాటలు గౌరవించలేదు. అహంకారంతో మళ్లీ లేచి వెళ్లి కర్ణుడు మొదలైన తన అనుచరులతో కలిసి దురాలోచన మొదలుపెట్టాడు.
