Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-160: శ్రీకృష్ణుణ్ని చెరపట్టాలనుకున్న దుర్యోధనుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

శ్రీకృష్ణుణ్ని చెరపట్టాలనుకున్న దుర్యోధనుడు

దుర్యోధనుడు తన అనుచరుల దగ్గరికి వెళ్లి “శ్రీకృష్ణుడి ఉద్దేశం మంచిది కాదు. అతడు గురువుని, భీష్ముణ్ని కూడా తనవైపు తిప్పుకుని మనందరి గర్వం అడిగేలా చెయ్యాలనుకుంటున్నాడు. ఇదంతా అతడి మాటల తీరుని బట్టి అర్థమవుతోంది. పూర్వం తాను కంసుణ్ని ఎలా చంపాడో గురువుగారికి, భీష్ముడికి, మనందరికీ చెప్తున్నాడు. అతడి కంటే ముందే మనం అతణ్ని వెంటనే బంధిస్తే మన పని జరుగుతుంది. పట్టుదల మానకండి.

శ్రీకృష్ణుణ్ని పట్టి బంధించి చెరలో పెట్టి పాండవులకి దడపుట్టేలా చేద్దాం. వెంటనే వాళ్లు దారికి వస్తారు. దారికి రాకుండా యుద్ధానికి వస్తే వాళ్లని మనం తేలికగా ఓడించవచ్చు. కోరలు తీసిన పాములు ఏం చెయ్యగలవు?”

శ్రీకృష్ణుణ్ని పట్టాలని దుర్మార్గపు ఆలోచన చేసి దుష్టచతుష్టయం అని పిలవబడే దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు; ఇంకా వాళ్ల పక్షంలో ఉన్న చెడునడత కలిగిన మరికొందరు రాక్షసుల్నే సంహరించిన శౌరిని బంధించాలని నిశ్చయించుకున్నారు.

దుర్యోధనుడు అతడి అనుచరులు వినయం లేకుండా భయంతో కళవళించడం, ఒకళ్లతో ఒకళ్లు గుసగుసలాడుకోవడం, అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల సందడి పెరిగింది. ఇదంతా గమనిస్తున్న సాత్యకి శౌరిని బంధించడానికి సన్నాహలు జరుగుతున్నాయని అర్థం చేసుకున్నాడు. సైగచేసి కృతవర్మని తనతో రమ్మని చెప్పాడు.

తనవెంట తీసుకుని వెళ్లి ‘యుద్ధానికి సిద్ధంగా ఉండు. నువ్వూ, సైన్యమూ బయట నిలబడండి. సభలో సంగతి మొత్తం నేను చూసుకుంటాను. దుర్మార్గులైన దుర్యోధనుడు అతడి అనుచరులు అన్నగారికి అపకారం చెయ్యాలని చూస్తున్నారు’ అని భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. సాత్యకి తమ మంచిని కోరేవాడూ యాదవుడూ అయిన కృతవర్మని సభ బయట యుద్ధానికి సిద్ధంగా ఉండమని పంపించి, తను వెంటనే సభలోకి వచ్చాడు.

శ్రీకృష్ణుడికి విషయమంతా చెప్పాడు. ఆయన అంగీకారంతో ధృతరాష్ట్ర, బాహ్లిక, ద్రోణాచార్య, భీష్మ, విదురులతో “అదుగో! కౌరవులు శక్తిలేనివాళ్లై శ్రీకృష్ణుడి మీదకి ఉరకాలని చూస్తున్నారు. అది వాళ్లవల్ల అయ్యే పనేనా? శౌరి అంటే ఏమనుకుంటున్నారు? జయలక్ష్మీవల్లభుడు, రాక్షసుల్ని సంహరించినవాడు. అటువంటి పురుషోత్తముణ్ని పట్టాలని అనుకోవడం బట్టలో నిప్పుని మూటగట్టినట్టే ఉంటుంది. దురాలోచన చెయ్యడం వల్ల పని నెరవేరుతుందా?” అన్నాడు.

సాత్యకి మాటలు విని అదిరిపడిన విదురుడు ధృతరాష్ట్రుడితో “మహారాజా! నీ కొడుకులు ఆలోచించడానికి కూడా శక్యంకాని పరాక్రమం కలిగిన శ్రీహరిని సాధారణ నరుడిగా అనుకుని ఎదుర్కుని బంధించాలని అనుకుంటే అగ్ని చుట్టూ మూగిన మిడతల్లా మాడి మసైపోతారు. కౌరవులకి, వాళ్లతో చేరినవాళ్లకీ చచ్చే సమయం వచ్చినట్టుంది” అన్నాడు.

విదురుడు మాటలు విని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో “మహారాజా! నా మీద కోపంతో ద్రోహబుద్ధితో కౌరవులు ఇంత చెడ్డ పనికి సిద్ధమయ్యారు. చాలా సంతోషం. నువ్వు నీకు రాజుగా ఉన్న అధికారంతో నాకు ఆజ్ఞ ఇస్తే నేను దోషం కలగకుండా నా శక్తివంచన లేకుండా జయించ శక్యం కాని భుజబలపరాక్రమం కలిగిన నీ కుమారుల శత్రుత్వాన్ని చక్కబెట్టి, తరువాతే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాను” అన్నాడు.

వాసుదేవుడి మాటలకి తొట్రుపడిన ధృతరాష్ట్రుడు – దుశ్శాసనుడు మొదలైన అనుచరులతో కలిసి దుర్యోధనుణ్ని తీసుకుని రమ్మని విదురుణ్ని పంపించాడు. విదురుడు వెళ్లి అనుచరులతో కలిసి ఉన్న దుర్యోధనుణ్ని సభలోకి తీసుకుని వచ్చాడు.

ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో “నీ శక్తి ఎంతో తెలుసుకోలేక దుర్బుద్ధితో రాక్షస సంహారి అయిన నారయణుడికే హాని కలిగించాలని నువ్వూ, నీ దుర్మార్గపు అనుచరులూ కలిసి అనుకుంటున్నారు. గాలిని గుప్పెట్లో పట్టుకోవాలని అనుకుంటే సాధ్యమయ్యే పనేనా? మహాపర్వతాన్ని పెకిలించడం సాధ్యపడుతుందా? కార్చిచ్చుని ఆర్పడం వీలవుతుందా? ఊరికే నాశనమైపోతారు సుమా! మిమ్మల్ని నేనేం చెయ్యగలను?

ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ని ఈసడించుకున్నాక విదురుడు అతడితో “శ్రీకృష్ణుడు బాల్యం నుంచే ఎక్కెడెక్కడ, ఎవ్వరెవ్వరిని, ఏమేమి చేసాడో నీకు తెలియదా? వృథాగా ఎందుకు నాశనమవుతావు?” అన్నాడు.

తన ఎదురుగా ఉన్న దుర్యోధనుణ్ని శ్రీకృష్ణుడు తేరిపార చూసి “నేను ఒంటరివాడిననే కదా నువ్వు నా మీదకు ఉరికి బంధించాలని చూస్తున్నావు” అంటూ చిరునవ్వు నవ్వాడు. అప్పుడు ఆ వాసుదేవుడి నుదుటి మీద బ్రహ్మదేవుడు, వక్షస్థలంలో రుద్రుడు, ముఖంలో అగ్ని, కుడి ఎడమ పక్కల్లో ఇంద్రుడు, యముడు, కుబేరుడు, ద్వాదశాదిత్యులు, మరుత్తులు, విశ్వేదేవతలు, అశ్వినులు జన్మించారు.

నాగలి, గాండీవం ధరించిన బలరాముడు, పార్థుడు ఎడమ కుడి చేతుల్లో ఉద్భవించారు. వీపునుంచి చేతుల్లో తమ తమ ఆయుధాలతో ధర్మరాజు, భీమసేనుడు, నకులుడు, సహదేవుడు ఆవిర్భవించారు. అనేకమైన ఆయుధాలు చేతుల్లో ధరించి యదు, వృష్ణి, భోజక, అంధక వంశాలకి చెందిన తన బంధువులైన వీరులు ఎందరో శౌరి తొడలనుంచి ప్రభవించారు.

భగవంతుడైన ఆ పురుషుడి అనేకమైన చేతుల్లో శంఖం, చక్రం, గద,  ఖడ్గం, శక్తి, శారంగం మొదలైన అనేక దివ్యాయుధాలు ప్రకాశించాయి. పురుషోత్తముడు కళ్లు, ముక్కు, చెవి రంధ్రాల నుంచి పొగతో కలిసి అగ్నిజ్వాలలు వ్యాపించాయి. త్రివిక్రముడి రోమకూపాల్నుంచి సూర్యకిరణాల కాంతులతో సమానమైన కాంతులు వ్యాపించాయి.

కళ్లు మిరుమిట్లుగొలిపే ఆ దివ్యతేజస్వరూపం చూడడానికి శక్యం కాక ప్రజలు కళ్లు మూసుకుని ఆశ్చర్యము భయము కలిసి కదలమెదలక ఉండిపోయారు. ఆ దేవదేవుడు నారదుడు మొదలైన మహర్షులవైపూ, భీష్ముడూ, విదురుడూ, ద్రోణుడూ, సంజయుడు వంటి వాళ్లవైపు చూసి వాళ్లకి దయతో తన విశ్వరూపం దర్శించడానికి దివ్యదృష్టిని ప్రసాదించాడు.

ఆ పుణ్యపురుషులు నారాయణుడి విశ్వరూపాన్ని చూస్తూ అనందసముద్రంలో ఓలలాడారు. ఆ సమయంలో దేవతల భేరీ నాదాలు మోగాయి. కల్పవృక్ష పూలు వర్షం కురిసినట్లు జల్లులా రాలాయి. సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు అనే దేవతలందరూ ఒకేసారి చేసిన జయజయధ్వానాలతో ఆకాశమంతా నిండిపోయింది.

అప్పుడు సభలో ఏర్పడిన కలకలధ్వనికి నారాయణుడి విశ్వరూప ప్రదర్శన అయి ఉంటుందని అనుకుని ధృతరాష్ట్రుడు “వాసుదేవా! ఆశ్రయించిన వాళ్ల భయాన్ని పోగొట్టే గొప్పవాడివి. నన్ను దయతో చూడు. నా అజ్ఞానాన్ని మన్నించు. నిన్నే శరణువేడుతున్నాను. నీ పాదాలు దర్శించే భాగ్యం అనుగ్రహించు” అని వేడుకున్నాడు.

ధృతరాష్ట్రుడి ప్రార్థన విని మనస్సు ద్రవించి ఆ దేవదేవుడు అంధుడైన ఆ మహారాజుకి దివ్యదృష్టిని  ప్రసాదించాడు. దేవుడిచ్చిన చూపుతో కళ్లనుంచి ఆనందభాష్పాలు కారుతుండగా అతడు శ్రీకృష్ణుడి విశ్వరూపం దర్శించి భక్తితో నమస్కరించి “పురుషోత్తమా! నిన్ను చూసి ధన్యుణ్నయ్యాను. నిన్ను చూసిన కళ్లతో ఇతరుల్ని చూడడానికి ఇష్టపడను. నువ్విచ్చిన చూపు నువ్వే వెనక్కి తీసుకో!” అన్నాడు.

ధృతరాష్ట్రుడి మాటలకి సభలో ఉన్నవాళ్లు విశాలమైన తెల్లటి కళ్లు కలిగిన ఆ రాజుని చుస్తూ ఉండిపోయారు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి కోరిక మన్నించి అతణ్ని తిరిగి గుడ్డివాడుగా చేశాడు. తన విశ్వరుపాన్ని కూడా ఉపసంహరించాడు. నారదుడు మొదలైన మహర్షులకి వెళ్లిరమ్మని సెలవిచ్చాడు. ఆ మహా ఋషులు అదృశ్యమయ్యారు.

అప్పుడు వాసుదేవుడు తన పీఠం నుంచి దిగాడు. అప్పటికే తన దగ్గరకు వచ్చి నిలబడిన సాత్యకి కృతవర్మల చెయ్యి పుచ్చుకుని మౌనంగా అక్కడి నుంచి బయలుదేరాడు” అని వైశంపాయనమహర్షి జనమేజయుడికి ఆహ్లాదంగా మహాభారతాన్ని వినిపించాడు.

జనమేజయమహారాజు వైశంపాయన మహర్షికి నమస్కరించి “మహనుభావా! శ్రీకృష్ణుడు సభనుంచి అలా వెళ్లిపోయిన తరువాత జరిగినదేమిటో వినాలని నా మనస్సు కుతూహలంతో నిండిపోయింది” అని అడిగాడు.

ఉద్యోగపర్వంలోని మూడవ ఆశ్వాసం సమాప్తం

Exit mobile version