[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
కుంతితో మాట్లాడిన శ్రీకృష్ణుడు
జనమేజయమహారాజు వైశంపాయన మహర్షితో “శ్రీకృష్ణుడు కౌరవ సభనుంచి వెళ్లిన తరువాత జరిగిన కథ వినాలని నా మనస్సు కుతూహలంతో నిండిపోయింది. మహర్షీ! నాకు ఆ కథని వివరంగా చెప్పు” అని అడిగాడు.
కథకుడైన వైశంపాయన మహర్షి శ్రోత అయిన జనమేజయ మహారాజుతో ఇలా అన్నాడు.
“వాసుదేవుడు సభనుంచి వెళ్లిపోగానే గాంధారీదేవి ఆశ్చర్యంతో లోపలికి వెళ్లిపోయింది. కౌరవులందరూ బంధుమిత్ర సహాయులతో కలిసి తన వెంట నడుస్తుండగా శ్రీకృష్ణుడు ముఖం చిన్నబుచ్చుకుని తొట్టికట్లు దాటాడు. అక్కడ రథసారథి దారుకుడు కనిపించాడు. శ్రీకృష్ణుడు రథం దగ్గర ఆగి అందర్నీ ఆగిపొమ్మన్నాడు.
ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి “కృష్ణా! కౌరవులూ, పాండవులూ విరోధం వదిలి పెట్టి కలిసి బతకమని నేను ఎన్ని విధాలుగా బుద్ధులు చెప్పానో, వంశధర్మం నిలపడానికి ఎన్ని విధాల శ్రమపడ్డానో ఇప్పుడు నీ ఎదురుగా కౌరవ జాతికి తెలిసింది కదా!” అని చెప్పాడు.
తరువాత మళ్లీ “కృష్ణా! నేను కల్మషం లేనివాడినని నువ్వు గుర్తిస్తే బంధువులందరు, మిత్రులు, గురువులు, లోకము నన్ను నిర్దోషినని గుర్తించినట్లే. కనుక, నేను ఎటువంటి వాడినో నువ్వు తెలుసుకోడమే నాకు ముఖ్యం.”
ధృతరాష్ట్రుడి మాటలు విని గోవిందుడు బాహ్లిక, భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి సదాచార్యుల్ని చూసి “ఇప్పుడు ఈ సభలో జరిగిన సంగతి మీకందరికీ స్పష్టంగా తెలిసింది కదా! ఈ ధృతరాష్ట్ర మహారాజు తాను దేనికీ ప్రధానుణ్ని కాదని తన తప్పులు ఏవీ లేవని చెప్పేశాడు. కనుక, నాకు ఇంక ఇక్కడ ఆగవలసిన అవసరం లేదు, వెళ్లివస్తాను. ఇక్కడ జరిగిన సంగతి అంతా ధర్మరాజుకి చెప్పాలి” అని చెప్పి నారాయణుడు అక్కడున్న వాళ్లని ఆగమని చెప్పి రథమెక్కాడు.
ధృతరాష్ట్రుడు, మిగిలినవాళ్లు సగౌరవంగా సాగనంపడానికి వెనక వస్తుండగా శౌరి కుంతీదేవి ఇంటి ముందు రథం దిగాడు.
ధృతరాష్ట్రుడు మొదలైనవాళ్లు తనని వెంబడిస్తుండగా కేశవుడు కుంతి ఇంటిలోకి వెళ్లి వినయవిధేయతలతో కుంతి పాదాలకి నమస్కరించాడు. కురుసభలో తాను మాట్లాడిన మాటలు, కార్యవాదిగా, ఖడ్గవాదిగా చెప్పిన మాటలూ, దుర్యోధనుడి చెడ్డ ప్రయత్నమూ క్లుప్తంగా చెప్పాడు.
ధృతరాష్ట్రుడి కొలువుకూటంలో జరిగిన వింతలు పాండురాజు పట్టపురాణి కుంతీదేవికి చెప్పి మళ్లీ అన్నాడు. “కౌరవులు తమపాటికి తాము హాయిగా రాజ్యభోగాలు అనుభవిస్తూ పొగరుతో తెలుసుకోలేకపోతున్నారు. మాకది మంచిదే. మంటలు వెళ్లగ్రక్కుతున్న అర్జునుడు అనే అగ్ని తనకి తగిన ఆహారం లభించినందుకు ఎంతో సంతృప్తి పొందుతుంది. నేను పాండునందనుల దగ్గరికి వెళ్లి వస్తాను. వాళ్లకి చెప్పవలసిన మాటలు చెప్పు” అన్నాడు.
అప్పుడు కుంతీదేవి పరాక్రమం నమ్ముకుని జీవించిన ముచుకుందుడు, సృంజయుడు అనే పూర్వపు రాజుల కథలు చెప్పి, ధర్మజుడు వీళ్ల గురించి విన్నాడో లేదో అని అక్కడి వాళ్లు వింటుండగా మళ్లీ అంది “గోవిందా! రాజులు పరాక్రమంతో జీవించాలేకాని, మరో మార్గం వాళ్లకి మంచిది కాదని జ్ఞానులు చెప్తారు. బలసంపన్నులు తమ కులధర్మాల్ని గౌరవంతో అనుష్ఠిస్తారు. తెలివిలేని వాళ్లు వంశాచారం వదిలిపెట్టి పౌరుషహీనమైన తిండికి అంగీకరించి హీనంగా జీవిస్తారు.
కృష్ణా! మీ మరుదులు సంధికోసం అనేక విధాలుగా శ్రమపడ్డారు. కాని, కౌరవులతో కలిసి బతకడం కష్టం. ఇప్పుడు సంధి తప్పిపోవడం కూడా మన మంచికే జరిగింది. నువ్వు ఈ విషయంలో సందేహపడవద్దు.
మధుసూధనా! క్షత్రియజాతికి తగినది పరాక్రమంతో కూడిన నడవడిక. దానికి వికాసంగా కపికేతనుడైన పార్థుడు రణోత్సాహం చూపించకపోతే నలుగురిలో తక్కువైపోడా? భుజబలగర్వితుడైన భీమసేనుడికి ఈ సంధి తగినది కాదుకదా! సకల లోకాలకి పూజ్యుడవైన నువ్వు ఈ పనికోసం ఇక్కడికి రావడం తగినదా? సంధి భగ్నమవడానికి దేవుడే మేలు చేశాడు” అంది.
కుంతిదేవి ఇంకా మాట్లాడుతూ “కౌరవులు నిండు సభలో నా కోడలు పాంచాలిని అవమానించడం నా కుమారులు మర్చిపోయారా? న్యాయమార్గాన్ని వదిలిపెట్టి అప్పుడు వాళ్లు అలా అడవులకి వెళ్లడం మంచి పనే కాని, న్యాయంగా తమకు రావలసిన అర్ధరాజ్యాన్ని ఇవ్వకుండా తామే అపహరించాలనుకుని కౌరవులు ధర్మాన్ని నాశనం చెయ్యాలని అనుకున్నప్పుడు తాము శాశ్వతకీర్తి పొందడానికి ప్రయత్నించవద్దా?” అంది.
తరువాత కుంతీదేవి శ్రీకృష్ణుణ్ని కౌగలించుకుంది. గోవిందుడు ఆమెకి నమస్కరించాడు. కుంతీదేవి శ్రీకృష్ణుడితో “నేను సుఖంగా ఉన్నానని నా కుమారులకి చెప్పు. భుజబలపరాక్రమంతో సంపాదించిన బ్రతుకు తెరువుతో బతకమని చెప్పు. పుండరీకాక్షా! వెళ్లిరా!” అని వీడ్కోలు చెప్పింది.
కర్ణుడిని రథమెక్కించుకుని రహస్యం చెప్పిన శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడు నెమ్మదిగా నడుస్తూ తన వెంట నడుస్తున్న ధృతరాష్ట్రుడు మొదలైనవాళ్లని ఆగిపొమ్మని చెప్పి రథమెక్కాడు. కర్ణుడి వైపు చూసి నన్ను సాగనంపి వద్దువుగాని రావయ్యా! అని అతణ్ని స్నేహపూర్వకంగా చెయ్యి పట్టుకుని రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. సాత్యకి కంచరగాడిదని ఎక్కి పక్కన వస్తుండగ శ్రీకృష్ణుడు బయలుదేరాడు.
తనని సాగనంపడానికి వచ్చిన కృతవర్మతో స్నేహంగా మాట్లాడి అతణ్ని ఆగిపొమ్మని చెప్పి నారాయణుడు ముందుకి వెడుతున్నాడు. అతణ్ని చూసి పట్టణప్రజలు “అయ్యో! వాసుదేవుడు చెప్పిన సలహాని గౌరవించని వీళ్లు ఎంత బుద్ధిమంతులు? యుద్ధంలో రెండువైపులా ఉన్న సైనికులంతా పరాక్రమంతో పోరాడి మరణిస్తారని అనుకోకుండా ప్రజలకి ఇంత హాని చెయ్యడానికి తలపెట్టారు. ఇంతటి దుర్మార్గులు ఎక్కడైనా ఉంటారా? ధృతరాష్ట్రుడి కుమారులు ఓర్వలేనివాళ్లు” అనుకుంటూ మార్గానికి రెండువైపులా నిలబడి చూస్తూండగా నారాయణుడు ఊరు దాటాడు.
తర్వాత ధృతరాష్ట్రుడు సభకి తిరిగి వచ్చి కూర్చుని అందరూ శ్రీకృష్ణుడు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. దుర్యోధనుడితో ద్రోణభీష్ములు “కుంతీదేవి ఇలా మాట్లాడుతుందని ఊహించుకోలేదు. ఆమె మాటలకి దిగ్భ్రాంతి కలిగింది. ఆమె మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. ఆమే, ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుడూ పని జరగడానికి అనుకూలంగా మాట్లాడడం తెలిసినవాళ్లు. ఈ రోజు వాళ్లు సాహసంతో ఇలా మాట్లాడారు. ధర్మరాజు అనే సముద్రానికి అడ్డుకట్ట లేకుండా పోయింది. ఈ విషయంలో మనం చేయగలిగిందేమిటో తోచడం లేదు” అన్నాడు.
కొంచెం ఆగి దుర్యోధనుడితో “దుర్యోధనా! ఆలోచిస్తే మాకు తోచిన కర్తవ్యం చెప్తాను. నువ్వు ధర్మబద్ధంగా ఆలోచించి గొప్ప కీర్తిమంతుడైన ధర్మరాజు దగ్గరికి వెళ్లు. ప్రజలందరూ మెచ్చుకునేట్లు ఈ కురుకులాన్ని సంరక్షించుకో. ఇంత అహంకారం ఉండకూడదు. వెంటనే వెళ్లి శ్రీకృష్ణుణ్ని కలుసుకో” అన్నారు.
భీష్మద్రోణుల మాటలకి దుర్యోధనుడు మొగం కోపంతో మండుతూ ఉండగా సమాధానం చెప్పకుండా ఉన్నాడు. అప్పుడు వాళ్లిద్దరూ తమ పీఠాలనుంచి తటాలున లేచి సుయోధనుడి వైపు చూసి “దుర్యోధనా! మా మాటలు విను. మేము సంసారపు ఆవలి తీరం చేరినవాళ్లం. ఇటువంటి మేము పోరాటానికి భయపడతామా? ఈ మేలు కోరి ఎన్నో రకాలుగా చెప్పి చూశాము. విధి నిర్ణయం ఎలా ఉంటే అలాగే అవుతుంది. ఇక మేము వెళ్లి వస్తాము” అన్నారు.
భీష్మద్రోణులు వెళ్లగానే ధృతరాష్ట్రుడు అభ్యంతర గృహానికి వెళ్లిపోయాడు. రాజకుమారుడైన సుయోధనుడు బయట ఉన్న సేవకుల్ని పిలిచి వెళ్లమని చెప్పి కొంతమంది పరివారాన్ని తీసుకుని తానూ తన భవనానికి వెళ్లిపోయాడు.
శ్రీకృష్ణుడు అలా వెళ్లి వెళ్లి గొప్ప ప్రేమతో సూర్యుడి కొడుకు కర్ణుడి మొహం చూసి ఇతరులెవరు వినకుండా అతడితో “కర్ణా! నువ్వు పెద్దల్ని సేవించినవాడివి. ధర్మం బాగా తెలిసినవాడివి. నే చెప్పేది చక్కగా విను. కన్యకగా ఉన్నప్పుడు కుంతీదేవి దివ్యమైన మంత్ర మహిమతో మార్తాండుడి వరం వల్ల నిన్ను కన్నది. అందుచేత పెద్దకుమారుడివి.
ఇది ధర్మసమ్మతం. ధర్మజుడు, అతడి తమ్ముళ్లు నువ్వు తమకి అన్నవని నా చేత నావల్ల తెలుసుకుని నీ పాదాలకి నమస్కరించి, బంధు, పుత్ర, మిత్ర బంధుసేనా సహితంగా కొలిచి రాజ్యభారం వహించడానికి నీకు పట్టం కడతారు. ఆ రకంగా నువ్వు రాజ్య పదవిలో ప్రకాశించగలవు. కనుక, నాతో కలిసి వాళ్ల దగ్గరికి రా!
కర్ణా! నిన్ను పాండవరాజ్యానికి అభిషిక్తుణ్ని చేస్తాను. నువ్వు అభిషిక్తుడవై రథం ఎక్కి నగరంలో ఊరేగేటప్పటి మహోత్సవంలో యువరాజై ధర్మజుడు నీకు వింజామరలు వీస్తాడు. భీమసేనుడు తెల్లగొడుగు పడతాడు. అర్జునుడు రథసారథ్యం వహిస్తాడు. పాంచాల, యాదవ, మాత్స్యరాజులు మొదలైన రాజులందరితో నకుల సహదేవులు మొదలైన కుమార వర్గంతో కలిసి మేమందరమూ గుంపుగా నీ దగ్గర కూర్చుని ఉంటాము. ఇలా దేవేంద్ర వైభవంతో గొప్పవాడివై భూమండలాన్ని పరిపాలించు” అని చెప్పాడు.
శ్రీకృష్ణుడు కర్ణుడితో మళ్లీ “కర్ణా! ద్రౌపది ఐదుమందితోపాటు నిన్ను కూడ ఆరవ భర్తగా స్వీకరిస్తుంది. పుణ్యాత్ముడవైన నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా పాండవుల్ని కలుసుకోడానికి రమ్ము.
కర్ణా! నువ్వు పాండవులతో చేరితే, కుంతికి కూడా తక్కిన బంధువులందరికీ, స్నేహితులకీ సంతోషం కలుగుతుంది” అన్నాడు.
శ్రీకృష్ణుడికి తగిన జవాబిచ్చిన కర్ణుడు
శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలకి కర్ణుడు “కృష్ణా! నువ్వు చెప్పిన విషయం కొంచెం నేనూ విన్నాను. కుంతీదేవి కనికరం లేకుండా నన్ను గంగలో పడేసి ఇంటికి వెళ్లింది. అప్పుడు సూతుడు దయతో నన్ను ఎత్తుకుని వచ్చి, తనకి అంతకు ముందు బిడ్డలు లేనందువల్ల తన ప్రియురాలైన రాధకందించాడు. అప్పటి నుంచి ఆమె పాలిచ్చి నన్ను పెంచింది. ఎంతో ప్రేమగా నన్ను కన్న కుమారుడిగా ఆ సూత దంపతులు ఇంతకాలం ఈ శరీరాన్ని పోషించారు.
ఈరోజు నా జన్మ వృత్తాంతం తెలిసి నేను ఇతరుల బిడ్డని కదా అని ఇంతవరకు పెంచిన ఆ సూతదంపతుల్ని వదిలేస్తే ధర్మం తప్పినవాడిని అవుతాను. కృష్ణా! నా మనసులో అంతటి క్రూరత్వం ఉందా? శ్రీకృష్ణా! నేను పెద్దల్ని భక్తితో సేవిస్తాననీ, ధర్మ తెలిసినవాడిననీ నువ్వే పలికావు.
రాధ, అతిరథుడు నాకు పుట్టినప్పటినుంచి చేయవలసిన వైదిక సంస్కారాలన్నీ తమ కులాచారానికి తగినట్లు చేశారు. అటువంటి తల్లితండ్రులకి తనయుడుగా నేను చేయవలసిన పనుల్ని చెయ్యకుండా వాళ్లని వదిలి పాండవుల దగ్గరికి రావడం ధర్మమా? చెప్పు” అన్నాడు.
కర్ణుడు శ్రీకృష్ణుడితో మళ్లీ మాట్లాడుతూ “కృష్ణా! నా వైపు సోదరులు, స్నేహితులు, నన్ను ఇష్టపడేవాళ్లు, తమ్ముళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లని వదిలి రావడం నాకు వీలు కాదని అనుకోకుండా కుంతీపుత్రుల్ని కలుసుకోడానికి రమ్మని పిలవడం బాగుందా? అంతేకాదు, ఈ కర్ణుడు సూతజాతివాడి కొడుకని అనుకోకుండా తన కొడుకులకంటే, తమ్ముళ్లకంటే నాకు సంతోషం కలిగిస్తూ నా ప్రతాపం, ఔన్నత్యం రోజురోజుకీ పెరిగేలా చేస్తూ సుయోధనుడు నన్ను తనంతటివాడిగా చేశాడు.
అటువంటి కురువంశ నాయకుడైన దుర్యోధనుడిని యుద్ధం చెయ్యవలసిన సమయంలో విడిచిపెట్టి రావడానికి ఏ ధర్మాన్ని అనుసరించి రావాలో నువ్వే చెప్పు. కృష్ణా! సుయోధనుడు యుద్ధంలో నన్ను అర్జునుడికి దీటని ఎంతో నమ్మకంతో ఉన్నాడు. అతడి నమ్మకాన్ని పోగొట్టి నేను కుంతీపుత్రుల్ని దగ్గరికి చేరడం తగినపనా? నేనూ అర్జునుడు యుద్ధంలో ఒకళ్లని ఒకళ్లు ఎదుర్కోకపోతే లోకులు నవ్వరా?
నేను పాండవుల దగ్గరికి రావడం వల్ల అర్జునుడికి అపకీర్తి కలుగుతుంది అనుకుంటే, నా విషయం కూడా వేరే చెప్పడం ఎందుకు? అంతే అవమానం కలుగుతుంది కదా? నువ్వు ఎంతో నిర్మలమైన మనస్సు కలవాడివి. కనుక, నాకు మంచి జరగడానికి ఏం చెయ్యాలో చెప్పావు. కాని, నువ్వు చెప్పినదంతా మంచే అయినా నా మనస్సుకి ఎక్కదు. నేను కుంతీపుత్రుడిని అనే నిజాన్ని బయట ఎవరికీ చెప్పకుండా నీ మనస్సులోనే ఉంచుకో.
ఎందుకని అడుగుతావేమో! ధర్మరాజు నాకు తమ్ముడని తెలుసుకుంటే రాజ్యభారాన్ని అంగీకరించడు. కాని, అటువంటి ధర్మాత్ముడు శాశ్వతంగా ఈ భూమికంతకీ రాజై పరిపాలించడం న్యాయం కదా? కృష్ణా! ధర్మరాజు తన తమ్ములు నలుగురూ హోత, ఉద్గాత, అధ్వర్యువు, బ్రహ్మ అని యజ్ఞం చేయించే యాజకులుగ ఉండగా, ఈ పని ఇలా చేయండి అని యజ్ఞకర్మలో ఉండే గుణదోషాల్ని కనిపెట్టి చెప్పే ఉపద్రష్టవిగా నువ్వు ఉండగా, కౌరవులు అనే పశువుల్ని చంపడం ద్వారా యుద్ధమనే యాగాన్ని ఇష్టంగా చేస్తాడు.
కృష్ణా! ధర్మరాజు యుద్ధ యజ్ఞం చేసే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మావంటి వాళ్లంతా ఉత్తమగతులు పొందుతారు” అన్నాడు.
శ్రీకృష్ణుడు కర్ణుడి మాటలు విని “కరుణతో నేను చెప్పిన మాటలు గౌరవించట్లేదు. అహంకారం దుఃఖాన్ని కలిగిస్తుంది. అర్జునుడితో ద్వేషంతో ఉన్న నీకు అతడితో జరిగిన పోరాటంలో పరాజయమో ప్రాణహానో.. ఈ రెండింటిలో ఒక్కటి తప్ప విజయం కలగదు. అనేకమందికి చెడు జరుగుతూ ఉంటే నీ మనస్సుకి శాంతి కలుగుతుందా?
గాండీవం, అక్షయతూణీరాల జంట, అమోఘమైన దివ్యాస్త్రాలు, అమితమైన భుజబలం తనకు తోడుగా ఉండగా రథం తోలుతూ సారథిగ నేనుండగా భయంకరంగా చెలరేగిన అర్జునుణ్ని యుద్ధంలో ఎదుర్కోడం నీకు శక్తికాదు. అన్ని విధలుగాను పాండవులే జయిస్తారు. ఆ విషయం అలా ఉండనీ.
నువ్వు హస్తినాపురానికి వెళ్లి ఇప్పుడే దుర్యోధనుడికీ, భీష్మద్రోణులకీ, మీకు సాయం చెయ్యడానికి వచ్చిన రాజులకీ చెప్పు. ఈ నెల అంతా చలి, వేడిమి లేక పూలతో, పండ్లతో, ధాన్యంతో నిండి తేలికగా పచ్చిక, వంట చెరుకు దొరుకుతుండగా చాలా బాగుంది. ఎనిమిది రోజుల్లో అమావాస్య వస్తుంది. ఆ రోజు పుణ్య తిథి. ఆ రోజు యుద్ధం ప్రారంభం కావాలి” అని చెప్పాడు.
శ్రీకృష్ణుడి మాటలకి కర్ణుడు “శకునాలూ, కలలూ రాబోయే యుద్ధాన్నే సూచిస్తున్నాయి. అందువల్ల కౌరవ పాండవులకి యుద్ధం జరుగుతుంది. ఈ పోరాటంలో ధర్మజుడికి గెలుపు కలుగుతుంది. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు వేరే చెప్పడం ఎందుకు?
కృష్ణా! అందుకనే కదా నేను పాండవుల దగ్గరికి రానని చెప్తున్నాను. ఈ యుద్ధానికి శకుని, నేను, దుశ్శాసనుడే కారణం. ఇది నిజం. వాళ్లిద్దరూ పాండవుల్ని కలిసినప్పుడే కదా నేను పాండవుల్ని కలవాలి? వాళ్లూ, నేనూ కుంతీపుత్రుల్ని కలవడం జరిగేపని కాదు.
శ్రీకృష్ణా! కురుపాండవులకు మధ్య జరిగే యుద్ధమనే మహా సాగరాన్ని ఈది విజయుణ్నై నిన్ను సందర్శిస్తాను. లేదా యుద్ధంలో మరణించి వీరస్వర్గం చేరి పరమేశ్వరుడవైన నిన్ను చూస్తాను. నాకు ఇంక సెలవిప్పించు” అంటూ స్వామిని కర్ణుడు కౌగలించుకున్నాడు.
శ్రీకృష్ణుడు కర్ణుడు తిరిగి వెళ్లడానికి అంగీకరించాడు. కర్ణుడు కృష్ణుడి రథం మీద నుంచి దిగి బంగారంతోను, మణులతోను నిండిన తన రథాన్ని ఎక్కి హస్తినాపురానికి వెళ్లిపోయాడు. అంతవరకు తన దగ్గరలోనే వస్తున్న సాత్యకిని శ్రీకృష్ణుడు రథమెక్కించుకుని దారుకుడితో రథాన్ని వేగంగా పోనిమ్మని చెప్పాడు.
ఆ సమయంలో విదురుడు బాధపడుతూ పాండురాజు పట్టపురాణి కుంతీదేవి ఇంటికి వెళ్లాడు. “అయ్యో! కౌరవవంశం అనే సాగరం ఇంకిపోయేలా యుద్ధం తప్పట్లేదు. శ్రీకృష్ణుడు చెప్పిన మంచిమాటలు కౌరవుల్లో ఒక్కడు కూడా మన్నించలేదు. అర్జునుడు అసహాయశూరుడు. అతడొక్కడే తన పదునైన బాణాలతో అగ్నిలా అందర్నీ దహించెయ్యగలడు.
గొప్ప పరాక్రమవంతులైన పాండవుల శక్తిసామర్థ్యాలు ఇంతకు ముందు వీళ్లకి తెలియనివి కాదుకదా? పాండుకుమారులు అన్ని కష్టాలు అనుభవించినా బంధువుల్ని నాశనం చెయ్యడానికి ఇష్టపడక అన్ని విధాలుగాను శాంతినే కోరుకున్నారు. అటువంటి మహానుభావులకి ఇటువంటి కౌరవులు తోబుట్టువులైనందుకు ఇన్ని బాధలు కలిగాయి.
విదురుడు కొంతసేపు యుద్ధం గురించి ఆందోళన పడుతూ కుంతీదేవి ఇంటిలో ఉండి తరువాత తన నివాసానికి వెళ్లిపోయాడు. విదురుడు వెళ్లిన తరువాత కుంతి తన మనసులో “తమ చుట్టాల్ని? యుద్ధం చెయ్యడం రాజ్య సంపద కోసం చంపడం ఉత్తమమైన యుద్ధమనేది దుఃఖాన్ని పోగొట్టడమవుతుందా? ద్రోణ, భీష్మ, కృప, కర్ణుల వీరావేశాలు మాన్పించడం తక్కువ ప్రయత్నంతో జరిగేవి కావు. ఆ ద్రోణ, భీష్మ, కృప. కర్ణుల్లో ఆ కర్ణుడి మనస్సు మాత్రం పాండవుల మీద కోపంతో మండిపోతూ ఉంటుంది. కురుసేనలో మిగిలిన యోధులకి యుద్ధం చెయ్యాలన్న కోరిక లేదు” అని ఆలోచిస్తోంది.
ఇలా ఆలోచిస్తూ “కర్ణుడికి అతడి జన్మ వృత్తాంతం చెప్పి తన తోబుట్టువుల మీద ప్రేమ కలిగిస్తాను. సోదరుల మీద ప్రేమ కలిగితే యుద్ధం చెయ్యాలన్న పట్టుదల మానుకుంటాడు కదా!” అని అనుకుని అతడి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంది.
కర్ణుడు గంగానది దగ్గర ఉన్నాడని విని అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో కర్ణుడు జపం చేస్తున్నాడు. నెమ్మదిగా వెళ్లి అతడి వెనక కూర్చుంది. జపం పూర్తిచేసుకున్న కర్ణుడు పాండురాజు పట్టమహిషిని చూడగానే సంభ్రమంగా దగ్గరికి వచ్చాడు. తన సూత గోత్రం, రాధేయ నామధేయం చెప్పి ఆమెకి నమస్కరించాడు. ఆమె వచ్చినపని, తాను అమెకి చెయ్యవలసిన పని ఏమిటో చెప్పమన్నాడు.
