Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-162: కర్ణుడికి అతడు తన పుత్రుడే అని చెప్పిన కుంతీదేవి

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

కర్ణుడికి అతడు తన పుత్రుడే అని చెప్పిన కుంతీదేవి

కుంతి కర్ణుడితో “నాయనా! నువ్వు సూతకులంలో జన్మించలేదు. మా తండ్రి కుంతిభోజుడి కుమార్తెగా కన్యగా ఉన్నప్పుడు గొప్ప మంత్ర బలంతో భాస్కరుణ్ని నా దగ్గరికి రప్పించాను. అతడు వచ్చి సంతోషంతో అనుగ్రహించగా నువ్వు నాకు జన్మించావు. కాబట్టి నువ్వు ధర్మప్రకారం పాండురాజు కొడుకువే. అటువంటి నువ్వు ఇతరుల సేవలో ఉండడం తగినపని కాదు.

ధర్మరాజు మొదలైన పాండవులూ, సుయోధనుడు మొదలైన కౌరవులకి కూడా నువ్వే తగిన రాజువి. కనుక, ఈ భూమినంతటిని పాలించే రాజువి నువ్వే. కర్ణుడు రాధ కొడుకు అనే హీనస్థితి నీకెందుకు?” అంది.

కుంతీదేవి చెప్తుండగానే “అమె చెప్పింది నిజం! నువ్వు ఆమె చెప్పినట్లు విని అభివృద్ధి పొందు. ఇదే నీకు మంచిది” అని కర్ణుడు వింటూ ఉండగా సూర్యబింబంలోంచి వినబడింది.

సూర్యుడు చెప్పిన మాట విని కూడా మనస్సు మార్చుకోక ధైర్యంతో “నువ్వు చెప్పింది నిజమే అయినా కూడా నేనొకటి చెప్తాను విను. క్షత్రియులకి చేయవలసిన సంస్కారాలేవీ నువ్వు నాకు చెయ్యలేదు. ఇప్పుడు ఇహపర సుఖాలు కలిగించడం కోసం నేను నీ కొడుకునని చెప్పి నీ వెంట రావడం మంచిదా? నువ్వే చెప్పు.

అన్ని మాటలెందుకు? పార్థుడి పరాక్రమం ఎంత గొప్పదో తెలిసి ‘నేను కుంతీదేవి కొడుకుని, సూర్యుడి వరప్రసాదం వల్ల పుట్టాను అని చెప్పుకుంటూ అతడి దగ్గరికి వస్తే ప్రజలు నన్ను భయపడి పాండవుల దగ్గరికి చేరాను’ అని అనుకోరా? దుస్తర (సాధించడానికి శక్యంకాని) శత్రువులు అనే సముద్రాన్ని ఈది గట్టుకి చేరాలని నన్ను తెప్పగా చేసుకుని విశ్వాసంతో ఉన్న దుర్యోధనుడిని అవసర సమయంలో వదిలెయ్యడం నాకు ధర్మం కాదు.

ఆయన వల్లే నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కౌరవుల తిండి తిని జీవిస్తున్నవాళ్లు వాళ్లకి సహాయపడడానికి ఇదే తగిన సమయం. ఎంత విశ్వాసం లేనివాళ్లైనా యుద్ధం జరిగే సమయంలో తమ పక్షాన్ని వదిలి వస్తారా?

ఇలా చేస్తే సహాయం చెయ్యడానికి వచ్చిన రాజులు మనల్ని నిందించరా? నేను దుర్యోధనుడి కోసం నీ కొడుకులతో యుద్ధం చేస్తాను. నీ మాట ఎంత ధర్మబద్ధంగా ఉన్నా కూడా నా నిర్ణయం మారదు.

నువ్వు ఈ పని మీద నా దగ్గరికి వచ్చావు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. అర్జునుడు తప్ప మిగిలినవాళ్లు నా చేతికి దొరికితే వాళ్లని నేను చంపను. అర్జునుడి మీద నాకు కోపం ఎక్కువ. అతడు నాకు దొరికితే చంపే తీరుతాను. అర్జునుడి చేతిలో నేను చచ్చిపోయినా అది నాకు కీర్తినే కలిగిస్తుంది.

నేను పోయినప్పుడు కూడా నీకు ఐదుమందే కొడుకులు. అతడు పోతే నీకు నాతో కూడా కలిపి ఐదుమందే అవుతారు. కాని, ఆరుమంది కొడుకులు అని అనడం ఇంక మానెయ్యి” అన్నాడు.

కర్ణుడి నిర్ణయం విన్నాక కుంతిదేవి అమితమైన దుఃఖంతో  “భగవంతుడి సంకల్పం ఇలా ఉంది. దీన్ని తప్పించడం ఎలాగూ శక్యం కాదు. నువ్వు చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోవద్దు. నీ నలుగురు తమ్ముళ్లని చంపకుండా వదిలిపెట్టు. యుద్ధం చేసి అర్జునుణ్ని చంపడానికి నేను అంగీకరించాను” అని చెప్పి కర్ణుణ్ని కౌగలించుకుంది.

అతడు ఆమె చెప్పినట్టే చేస్తానని చెప్పి ప్రేమతో ఆమెకి నమస్కారం చేసాడు. తరువాత ఇద్దరూ సంతోషంగా తమ నివాసాలకి వెళ్లిపోయారు.

శ్రీకృష్ణుడు ప్రయాణం చేసి హస్తినాపురం నుంచి ఉపప్లావ్యానికి వచ్చాడు. ధర్మరాజు అతణ్ని తగిన విధంగా పూజించాడు. భీముడు మొదలైనవాళ్లు, ద్రుపదుడు మొదలైన తగినవాళ్లు శ్రీకృష్ణుణ్ని దర్శించారు.

వాళ్లందర్నీ పలకరించి శ్రీకృష్ణుడు సభలో కూర్చుని ధర్మరాజుతో “దుర్యోధనుడు మొదలైనవాళ్లు పొగరుతో కళ్లు మూసుకునిపోయి ఉన్నారు. న్యాయంగా మాట్లాడే మాటలు విని సంధి చెయ్యడానికి వాళ్లు ఎందుకు అంగీకరిస్తారు? తమ బలం, ఎదుటివాళ్ల బలం తెలుసుకోగలిగినవాళ్లైతే ఆనాడు సభలో అంతంత నీచకృత్యాలు ఎందుకు చేస్తారు?” అన్నాడు కోపంగా.

తరువాత అక్కడున్నవాళ్లందరూ వింటుండగా తాను హస్తినాపురానికి వెళ్లి వచ్చి అక్కడ జరిగినదంతా తెలియచేశాడు. దార్లో కలిగిన బడలిక తొలగించుకునేందుకు, కమలాక్షుడు తన నివాసానికి వెళ్లాడు. ఆ రోజు రాత్రి ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి ఒక మంచి ప్రదేశంలో కూర్చుని శ్రీకృష్ణుణ్ని కూడా రమ్మన్నాడు.

తరువాత “కృష్ణా! నువ్వు దుర్యోధనుడితో అక్కడ ఏం మాట్లాడావో, అందుకు అతడు ఏం మాట్లాడాడో, అందుకు అతడు ఏం సమాధానం చెప్పాడో చెప్పు” అన్నాడు.

ధర్మరాజుకి కౌరవసభ విశేషాలు చెప్పిన శ్రీకృష్ణుడు

అది విని శౌరి “ధర్మరాజా! వాళ్లకీ, మీకూ యుద్ధం జరగకుండా ఉండేలా, స్నేహం కలిగేట్లు ఏది చేస్తే ఇద్దరికీ మంచి కలుగుతుందో, ఏది నిజమో దాన్ని వాళ్లకి స్పష్టంగా తెలిసేటట్లు న్యాయంగా చెప్పాను. నేను చెప్పిన మాటలేవీ పట్టించుకోకుండా వంకర జవాబులు చెప్తూ నన్ను హేళనగా మాట్లాడాడు. అతడు మాట్లాడిన మాటలు మీకు చెప్పడం వల్ల లాభం ఏముంటుంది?”  అన్నాడు.

శ్రీకృష్ణుడు మాటలు విని ధర్మరాజు “గోవిందా! దుర్యోధనుడు అలా వంకర మాటలు మాట్లాడుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు సర్ది చెప్పలేదా? భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సభలో ఉన్న మిగిలిన పెద్దలైనా అలా మాట్లాడకూడదని చెప్పలేదా?” అని అడిగాడు

ధర్మరాజు ప్రశ్నలకి శ్రీకృష్ణుడు  “మంచి మనసుతో ధ్రుతరాష్ట్రుడు చక్కగా, అనేక విధాలుగా చెప్పినా కూడా ఆ మాటల్ని దుర్యోధనుడు గౌరవించలేదు. వాళ్ల మాటలకి విరుద్ధంగానే మాట్లాడాడు. శంతనమహారాజు పవిత్ర వంశం అంతరించకుండా వృద్ధి చెందిన విధానము, ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డిగా ఉన్నప్పుడు పాండురాజు సామ్రాజ్యం మొత్తం తానే పరిపాలిస్తూ అంధుడైన అన్నని భక్తితో సేవించడం, కురువంశం ప్రకాశించేట్లు మీరు దిక్కులన్నీ జయించి గడించిన సంపదంతా కపట జూదంలో వాళ్లు అపహరించడము, నువ్వు సత్యం తప్పకుండా పదమూడేళ్ల ప్రతిజ్ఞాకాలం ధర్మయుక్తంగా పూర్తిచేయడం, రాజ్యంలో మీ తండ్రి భాగం మీకు ఇవ్వాలని, న్యాయం వదిలి మీ రాజ్యభాగం కూడా అపహరించాలని అనుకుంటే కౌరవులందరూ నాశనమవుతామనీ మొహమాటం లేకుండా చెప్పారు.

సభలో ఉన్న పెద్దలంతా విసుగు కనబర్చకుండా చెప్పవలసినదంతా చెప్పారు. కాని, దుర్యోధనుడు వాళ్ల మాటలు వినడానికి కష్టపడుతూ, తమ్ముళ్లూ, కర్ణుడూ, యుద్ధంలో అతడికి సాయం చెయ్యడానికి వచ్చిన రాజులూ తనను అనుసరిస్తుంటే సభలోంచి లేచి వెళ్లిపోయారు. ధృతరాష్ట్రుడు విదురుణ్ని పంపించి మళ్లీ అందర్నీ సభకి రప్పించాడు. గాంధారి తన మాటల్లో శోకం, ప్రేమ, ఉపాయం అన్నీ ఉండేలా తన  కుమారుడికి సంధికి అంగీకరించేట్లు చెప్పింది.

ఎవరు ఎన్ని విధాల చెప్పినా మన్నించక తన పక్షం వాళ్లందర్నీ కురుక్షేత్రానికి తరలి వెళ్లమని చెప్పాడు. భీష్ముడిని సర్వసైన్యాధ్యుక్షుణ్ని చేసి మన మీద దాడికి దిగుతాడు. ఇది కౌరవుల నిర్ణయం. నేను నా శక్తి మేరకి చెప్పాను. నారదుడు మొదలైన మహర్షులు దుర్యోధనుడికి అతడి అనుచరులకి నీతులు బోధించేట్టు చేశాను.

ఎవరేమి చెప్పినా అతడు దారికి రాలేదని కోపంతో నేను బెదిరించి, అవమానించి, తిరస్కరించి, చులకన చేసి పని జరగడానికి ప్రయత్నించాను. పని చెడిపోతుందేమో అని మళ్లీ శాంతంగా మాట్లాడాను. ఇంత చేసినా దుర్యోధనుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే కొన్ని మాయలు ప్రదర్శించాను. అన్ని విధాలా సంధికోసం ఎంత చెయ్యగలనో అంతా చేశాను.

కాని, దుర్మార్గుడైన దుర్యోధనుడు కొంచెం కూడా మారకుండా, అసూయతో తనకి ఎన్ని బాధలు వచ్చినా యుద్ధం చేస్తాడేగాని, మీకు రాజ్యభాగం ఇవ్వడు. కౌరవులకి దండోపాయం తప్ప ఇంకేదీ పనిచేయదు. ఇంక మీకు ఎలా చెయ్యాలని అనిపిస్తే అలా చెయ్యండి” అన్నాడు.

శ్రీకృష్ణుడు వివరించినదంతా విని ధర్మరాజు తమ్ముళ్ల వైపు చూసి “కౌరవుల సభలో జరిగిన సంగతులన్నీ శ్రీకృష్ణుడు వివరంగా చెప్పాడు కదా! ఇంక మనం సందేహించక్కర్లేదు. విరోధుల్ని నాశనం చెయ్యడానికి మన శక్తియుక్తులు అందరికీ తెలిసేటట్లు సిద్ధపడి రణరంగానికి కదలండి” అని తమ్ముళ్లకి చెప్పాడు.

తరువాత ధర్మరాజు దయాసముద్రుడైన శ్రీకృష్ణుణ్ని చూసి “కృష్ణా! కురువంశం నాశనం చెయ్యడానికి నా మనస్సు అంగీకరించక అనేక విధాలుగా ఆలోచిస్తోంది. వాళ్లతో పొత్తు కుదుర్చుకోడానికి ఎటువంటి మార్గం కనిపించట్లేదు. నారాయణా! నా మనసు ఎటువంటిదో, నా తమ్ముళ్ల ఉద్దేశం ఏమిటో నీకు తెలుసు. అక్కడ దుర్యోధనుడు మొదలైనవాళ్ల తీరుని, భీష్మ, ద్రోణ, విదురులవంటి పెద్దల ఆలోచనలు తెలుసుకుని వచ్చావు. మాకు ధర్మహాని కలగకుండా చెయ్యవలసిన పనేదో నువ్వే నిర్ణయించు” అని వేడుకున్నాడు.

ధర్మరాజు మాటలు విని శ్రీకృష్ణుడు “యుద్ధం తప్ప ఇంక చెయ్యడానికి ఏదీ లేదు. నేను చెప్పిన మంచి విషయాలు వినలేదన్నది ఒక్కటే కాదు, సుయోధనుడు నన్ను పట్టుకుని బంధించాలని అనుకున్నాడు. ఇంక ఆ అయోగ్యుడితో పొత్తుకి ఉపాయం ఏదీ నా మనస్సుకి తట్టడం లేదు” అన్నాడు.

తరువాత శ్రీకృష్ణుడు రహస్య ప్రదేశంలో విదురుడు మాట్లాడిన మాటలూ; భీష్ముడూ, ద్రోణుడూ, బాహ్లికుడూ మొదలైన పెద్దలకి దుర్యోధనుడు అతడి అనుచరులవల్ల మనస్సులో కలిగిన బాధ; కుంతీదేవి కౌరవులు వింటూ ఉండగా చెప్పిన మాటలూ అన్నీ వివరంగా చెప్పి ధర్మరాజు పట్ల ఏ అధర్మమూ లేదని చెప్పాడు. యుద్ధం చెయ్యడమే ప్రస్తుత కర్తవ్యం అని చెప్పాడు.

అప్పుడు తమ్ముళ్లందరూ అన్నగారి ముఖం వైపు చూసి మవునంగా ఉండిపోయారు. ధర్మరాజు తమ్ముళ్లవైపు చూసి “కౌరవులవల్ల మనం పడిన కష్టాలు గుర్తుకు తెచ్చుకుని మన తల్లి కుంతీదేవి యుద్ధం చెయ్యడానికే అంగీకరించింది. చుట్టాల్ని దారుణంగా చంపడానికి నా మనస్సు అంగీకరించట్లేదు. మనకి మంచి చేసేది, ధర్మపరంగా ఉండే మార్గం ఏముందో దాన్ని మీరే నిర్ధారించి అలా చేయండి” అన్నాడు.

అది విని అర్జునుడు ధర్మరాజుతో “ఏది మంచిదో, ఏది ధర్మమో, ఏది న్యాయమో మనకి ఎలా తెలుస్తుంది? అన్ని ధర్మాలూ తెలిసినవాడు నారాయణుడు. విదురుడు, పాండుమహారాజు భార్య కుంతీదేవీ మాట్లాడిన మాటల వల్ల సందేహమంతా తీరిపోయింది. శ్రీకృష్ణభగవానుడే యుద్ధం చెయ్యండి అని చెప్పినప్పుడు మనకి వేరే ఆలోచనలు ఎందుకు?” అన్నాడు.

అర్జునుడి మాటలు విని ధర్మరాజు “అయితే అలాగే కానివ్వండి. సకల ధర్మస్వరూపం తెలిసిన మహానుభావుడూ, మనల్ని రక్షించేవాడు వాసుదేవుడే. ఆయన కర్తవ్యాన్ని నిర్దేశించాక మనకి సందేహం ఉండకూడదు. దారుణ యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టండి” అన్నాడు.

ధర్మరాజు యుద్ధం చెయ్యడమే కర్తవ్యమని నిర్ణయించి “బాహుబలము, అన్ని రకాల వ్యూహాలు పన్నడంలో తెలివితేటలు కలిగి, ఏడు అక్షౌహిణుల సైన్యాన్ని నడిపించి, యుద్ధంలో భీష్ముడి పరాక్రమాన్ని అరికట్టగలిగిన గొప్ప విలుకాడు మనలో ఎవరో? మనం అటువంటి గొప్ప వీరుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చి గౌరవించాలి” అన్నాడు.

ధర్మరాజు చెప్పింది విని సహదేవుడు “రాజా కొడుకులూ, మనుమళ్లూ, సొదరులూ మొదలైన బలమూ; బాహుబలమూ; మనకి ఆధారమైన మత్స్యరాజు విరాటుడు సన్యాధిపత్యానికి తగినవాడే కదా?” అన్నాడు.

తరువాత నకులుడు “రాజా! పరివారం, గొప్పతనం, ప్రతాపం, భుజబలం ఎక్కువగా కలిగి; పనిచెయ్యడానికీ, ఖడ్గం తిప్పడానికీ అనేక మార్గాలు తెలిసినవాడూ; ద్రోణుడు, బీష్ములంటే కోపం ఉన్నవాడూ; గొప్ప పరాక్రమశాలి అయిన ద్రుపదమహారాజుని నీ సైన్యానికి అధిపతిగా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు” అన్నాడు.

సర్వసైన్యాధిపతిగా నిర్ణయించబడిన దృష్టద్యుమ్నుడు

నకులుడు ద్రుపదుడికి సేనాధిపత్యం అప్పగించడం మంచిదని చెప్పిన మాటలు విని అర్జునుడు “దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుణ్ని చంపడానికి అగ్నికుండం నుంచి పుట్టాడు. అతడితోపాటు రథం, గుర్రాలు, విల్లమ్ములు, కవచము, ఖడ్గాలు కూడ అగ్నికుండం నుంచి పుట్టాయి.

దృష్టద్యుమ్నుడు అగ్నిజ్వాలతో సమానమైన ఆకారం కలవాడు. బాహుబలం కలవాడు, ప్రతాపవంతుడు, సర్వసైన్యాధిపతిగా ఉండడానికి తగినవాడని అనుకుంటున్నాను. అతడు తప్ప మరొకడు భీష్ముడి ధాటికి తట్టుకోలేడు. మరి శిఖండి భయంకరమైన వీరుడు, ధైర్యశాలి, గొప్ప బలం కలవాడు. భీష్ముడి పాలిట మృత్యువుగా జన్మించినవాడు. అతణ్ని కూడా సర్వసైన్యాధిపతిగా చేయవచ్చు” అన్నాడు.

అర్జునుడు చెప్పింది కూడ విని ధర్మరాజు తన తమ్ముళ్లకి భగవంతుడైన శ్రీక్రుష్ణుణ్ని చూపిస్తూ “ఈ మహనీయుడు సమస్తమైన జంగస్థావరాల తారతమ్యాలు బాగా తెలిసినవాడు. ముఖ్యంగా ఈయన చెప్పే మాటలే మన గెలుపుకి ఆధారాలు. కనుక, ఈ మహాపురుషుడు నిర్ణయించినవాడే మన ఏడు అక్షౌహిణుల సేనకి అధిపతి అవుతాడు” అన్నాడు.

ధర్మరాజు మాటలు విని శ్రీకృష్ణుడు “దృష్టద్యుమ్నుడు సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండదగినవాడు. ఇతడిని ఏడు అక్షౌహిణుల సైన్యానికి నాయకుడిగా నిండు కొలువులో అభిషేకించు. సురలు, గంధర్వులు, ఖేచరులు, కింపురుషులు మొదలైన దేవతా సమూహాలు పన్నే సేనావ్యూహ కల్పనలన్నీ తెలిసినవాడు. వ్యూహరచనలో నేర్పుకలవాడే కాదు, గొప్ప వీరుడు కూడా. నీ దగ్గర ఉన్న రాజులందరూ బుద్ధిమంతులు, ప్రతాపం చూపించడంలో జ్వలించేవాళ్లే సందేహం లేదు. అయినా కూడా సేనలన్నింటినీ దృష్టద్యుమ్నుడి అధీనంలో ఉంచు” అన్నాడు.

శ్రీకృష్ణుడు సర్వసైన్యాధ్యక్షుణ్ని నిర్ణయించాక ధర్మరాజు “ఏడు అక్షౌహిణులకి విడివిడిగా అధిపతుల్ని కూడా నువ్వే నిర్ణయించు” అని వాసుదేవుణ్ని కోరాడు.

ధర్మరాజు అడిగినదానికి శ్రీకృష్ణుడు “తమకి సైన్యం ఉన్నా, లేకపోయినా అన్ని రకాల యుద్ధాల్లోను ప్రావీణ్యులైనవాళ్లని, అర్హుల్నీ నేను చెప్తాను. వాళ్లని నీ సైన్యం ఏడు అక్షౌహిణులని వాళ్ల సామర్థ్యాన్ని బట్టి ఎవర్ని ఎక్కడ ఉంచాలో చూసి ప్రత్యేక నాయకులుగా నువ్వే నియమించు” అన్నాడు.

ధర్మరాజు “కృష్ణా! నువ్వు చెప్పినట్లే చేస్తాను. వాళ్లెవరో నిర్ణయించి చెప్పు” అన్నాడు.

ధర్మరాజు అడిగినట్లు శ్రీకృష్ణుడు చెప్తూ “గొప్ప పరాక్రమరాశి ద్రుపదుడు, మానవులకి అతీతమైన ప్రతాపం కలిగిన విరాటుడూ; శత్రువులకి భయం కలిగించే స్వరూపం కలిగిన సాత్యకీ; గొప్ప పరాక్రమం కలిగిన జరాసంధుడి పెద్ద కొడు సహదేవుడూ; యాదవులలో ఉత్తముడు, ధైర్యవంతుడు చేకితానుడూ; గొప్ప వైభవం కలిగినవాడు, భుజబలం కలిగినవాడు శిసుపాలుడి కొడుకు ధృష్టకేతువూ; యుద్ధాలంటే ఎంతో గొప్ప ఆసక్తి కలిగిన శిఖండీ గొప్ప బలసంపన్నులు, ఉపాయం తెలిసినవాళ్లు, నువ్వంటే ప్రేమ ఉన్నవాళ్లు, చాలా గొప్పవాళ్లు, సాహసం కలవాళ్లు. వీళ్లు ఏడుగురిని ఏడు అక్షౌహిణులకి అధిపతుల్ని చెయ్యి” అని ఏడు అక్షౌహిణుల దండనాయకుల్ని నిర్ణయించాడు.

తరువాత శ్రీకృష్ణుడు “ధర్మరాజా! కౌరవసేన శక్తిలేనిది. మన బలాలు గొప్ప చేవకలవి. నువ్వు సంకోచించకుండా సేనల్ని నడిపించు. సేనకి అగ్రభాగంలో దేవుడే నిలబడి ఉంటాడు. నీ తమ్ముళ్లని దేవతలు కూడా గెలవలేరు. కౌరవుల్ని నాశనం చెయ్యడం వాళ్లకి కష్టం కాదు. తామరల గుంపుని ధ్వంసం చెయ్యడం ఏనుగులకి ఆటే కదా! నువ్వు యుద్ధానికి బయలుదేరు” అని చెప్పి శ్రీకృష్ణుడు తన నివాసానికి వెళ్లిపోయాడు.

ధర్మరాజు, అతడి తమ్ముళ్లు ఆ రాత్రి సంతోషంగా నిద్రపోయారు. తెల్లవారాక ధర్మరాజు తమ్ముళ్లతో, కుమారులతో, శ్రీకృష్ణుడితో, సామంతరాజులతో, మంత్రులతో, పురోహితులతో నిండు కొలువులో పరివారం అందరూ విటుండగా యుద్ధం నిర్ణయించినట్లు ప్రకటించాడు. అందరితో తగిన విధంగా మాట్లాడి శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించినట్లు ద్రుపదుడు మొదలైన వాళ్లని వేర్వేరు అక్షౌహిణులకి నాయకులుగా చేశాడు.

ధృష్టద్యుమ్నుడికి ఉత్తమ పద్ధతిలో అభిషేకం చేసి, సర్వసైన్యాధిపతిగా పట్టం కట్టారు. తరువాత ఆ ఎనిమిది మందిని మిగిలిన రాజుల్ని చూసి, మంచి మాటలతో పొగిడి, కౌరవులతో యుద్ధం చెయ్యడానికి కురుక్షేత్రానికి తరలి వెడదామని చెప్పాడు.

తరువాత ధర్మరాజు వాళ్లందర్నీ అర్జునుడికి చూపించి “అర్జునా! అన్ని వేళల్లోనూ, అన్ని చోట్లా వీళ్లందర్నీ కంటికి రెప్పలా కాపాడుతూ, అన్ని పనుల్నీ గమనిస్తూ గురువులా మంచిని బోధిస్తూ, వాళ్ల అభిప్రాయాల్ని మన్నిస్తూ కర్తవ్యాన్ని నిర్వహించు. ఈ పరమ పురుషుడే నీకు రక్షకుడు శుభాలు అనుగ్రహిస్తాడు” అని శ్రీకృష్ణుణ్ని చూపించాడు.

ధర్మరాజు రాజులందరి మనస్సు సంతోషపడేటట్లుగా స్నేహపూర్వకంగా, గంభీరంగా, యుద్ధానికి అందరూ సంసిద్ధమయ్యేలా మాట్లాడాడు. భయంకరమైన యుద్ధం చెయ్యడానికి నిర్ణయించుకుని సంతోషంతో ప్రస్థానభేరి మోగించమని ఆజ్ఞాపించాడు.

ధర్మరాజు యుద్ధ ప్రయాణ సమయంలో మోగించబడిన భేరియొక్క గొప్పదైన, కఠినమైన, భయంకరమైన భాంకారం వ్యాపించగా ఎక్కువ ఎండ కాసినప్పుడు మట్టి ముద్దలతో పెట్టిన పచ్చి గోడల్లా దిక్కులు బద్దలయ్యాయి. కాగుతున్న ఎసరు నీళ్లులా సముద్రాలు అంతకంతకి పొంగి గట్లమీదకి ప్రవహించాయి.

పడవ మీద అమర్చి గాలికెత్తిన తెరచాపలా ఆకాశమంతా నిండిపోయింది. ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకి భయపడి ఏడు కులపర్వతాలు ఆక్రోశిస్తున్నాయేమో అన్నంత ప్రతిధ్వని చెలరేగింది. కుమ్మరివాడి చక్రంలా భూమి గిరగిరా తిరిగింది. పటంలో గీసిన బొమ్మల్లా ప్రాణులన్నీ నిశ్చలంగా నిలబడిపోయాయి.

Exit mobile version