[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
పాండవుల్ని విడిచిపెట్టి తీర్థయాత్రలకి వెళ్లిన బలరాముడు
బలరాముడు కొంతమంది పరిజనం వెంట వస్తుండగా ధర్మరాజు సభని చూశాడు. ధర్మరాజు సంతోషంతో బలరాముణ్ని కౌగలించుకుని ఆసనమిచ్చి, అర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవించాడు. శ్రీకృష్ణ భీమార్జున నకుల సహదేవులు బలరాముడికి నమస్కరించారు. ద్రుపదుడు, విరాటుడూ మొదలైనవాళ్లు కూడా వినయంగా బలరాముడికి నమస్కరించారు.
వాళ్లందరితో తగినట్లుగా మాట్లాడి “కౌరవులూ, పాండవులూ క్రూరంగా బంధుజనాలకీ , భూమి మీద ఉన్న రాజులకీ కీడు జరిగేలా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇటువంటి దారుణమైన పని వాళ్లు చెయ్యవచ్చా? ఇంత దారుణంగా కురు పాండవుల మధ్య యుద్ధం జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.
అందుకోసం కోపం వచ్చి రెండు పక్షాలవాళ్లకి తగిన విధంగా నచ్చ చెప్పి సంధి సమకూరేట్లు చూడమని శ్రీక్రుష్ణుడితో చెప్పాను. నేను ఎంత చెప్పినా అతడు సంధి జరిగేలా చూడలేదు. మాట్లాడ్డమే తెలియని మూర్ఖులకి మంచి మాటలతో మంచి చెయ్యాల్సిన శ్రీహరి అలా చెయ్యకుండా వాళ్ల మీద కోపం తెచ్చుకుని సంధికార్యం చెడగొట్టి ఏం చెయ్యడానికి వచ్చినట్లు? కౌరవులు, పాండవులు తనకి చుట్టాలే కనుక ఇద్దరూ తనకి సమానమే కదా!
అయినా అతడికి అర్జునుడంటే అభిమానం ఎక్కువ. అందుకే కుంతీ పుత్రుల్ని కుదురుగా ఒకచోట ఉండనీయకుండా తన ఇష్టం వచ్చినట్టు వెంటబెట్టుకుని తిప్పుతుంటాడు. పాండవులకి విజయం తప్పదు. అన్ని విధాలుగానూ కౌరవులకి చావు తప్పదు. ఇందులో సందేహం లేదు. కనుక, దీన్ని నేను చెవులతో వింటూ కళ్లతో చూస్తూ ఎలా భరించగలను?
దుర్యోధనుణ్ని, వృకోదరుణ్ని గదాయుద్ధంలో ఇంత నేర్పరులని నేనే చేశాను. భీమ సుయోధనులు పరస్పరం చంపుకుంటుంటే ఎలా చూడగలను? గోవిందుడికి తెలియని న్యాయం, పురుషార్థం నాకు తెలియట్లేదు. ఈ కర్కశత్వాన్ని చూడలేక వినలేక సరస్వతీ తీర్థానికి వెళ్లే తలంపుతో మీకు చెప్పి వెడదామని వచ్చాను, వెళ్లివస్తాను” అని అన్నాడు బలరాముడు. అందుకు అంగీకరించి శ్రీకృష్ణుడు, ధర్మరాజు సాగనంపగా ఆయన తీర్థయాత్రకి వెళ్లాడు.
రుక్మి వృత్తాంతము
శ్రీకృష్ణుడి దేవేరి రుక్మిణి. ఆమె అన్న పేరు రుక్మి. అతడు బలపరాక్రమాలు కలవాడు. శ్రీకృష్ణుడికి శారంగం, అర్జునుడికి గాండీవం అనే ధనస్సులున్నట్లుగా తనకూ విజయం అనే పేరుగల దొడ్డవిల్లు ఉంది.
అతడు సైన్యంతో కలిసి వచ్చి ధర్మరాజుని దర్శించాడు. యుధిష్ఠిరుడు అతడిని తగిన విధంగా సత్కరించాడు. రుక్మి తగిన ఆసనం మీద కూర్చుని సభలో ఉన్న వీరులంతా వింటుండగా అర్జునుడితో “అర్జునా! యుద్ధం చెయ్యడానికి నీకు భయంగా ఉంటే చెప్పు. నీకు సాయంగా ఉండి ఎటువంటి శత్రువులనయినా గెలుస్తాను. నాకు ఈ భూమి మీద ఎదురు నిలవగలవాళ్లు ఎవరూ లేరు” అన్నాడు.
తనని గెలిచి తన చెల్లెలయిన రుక్మిణిని వెంటబెట్టుకుని వెళ్లిన శ్రీకృష్ణుడి ఎదుట రుక్మి సిగ్గు లేకుండా మాట్లాడిన మాటలు విని చిరునవ్వు నవ్వుతూ అర్జునుడు అతడి ముఖం చూసి “గంధర్వ సైన్యాన్ని ఎదిరించి చిత్రసేనుడి చెరచిక్కిన సుయోధనుడిని భార్యాపుత్రమిత్ర బంధు సహితంగా బంధవిముక్తుణ్ని చేసేటప్పుడూ, కురువీరులందరూ ఏకమై విరాటుడి గోవుల్ని మరలించుకుని వచ్చేటప్పుడు నీ జాడ నాకు తెలియదు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. ఇంక నీ మాటలు కట్టిపెట్టి అవసరం వచ్చిన చోటికి సాయపడడానికి వెళ్లు” అన్నాడు.
రుక్మికి సరైన సమాధానం ఇచ్చిన అర్జునుడు మళ్లీ మాట్లాడుతూ “పూర్వం నేను ఎవరి తోడూ లేక అనుకున్న దారిలో నడుస్తుండగా జరగవలసినదేదో జరిగింది. నేడు నాకు విష్ణుదేవుడి సాయమున్నది. ముందు ముందు ఎమి జరిగినా నాకు ఎవరి వల్లా భయం లేదు. ‘నాకు యుద్ధమంటే భయంగా ఉంది రావయ్యా!’ అని నేను అడిగినప్పుడు కదా.. నువ్వు వచ్చి వైరం తీరుస్తావు. నాకంతగా భయం కలిగితే ఈ వీరులున్నారు. నీకిష్టమైన చోటికి వెళ్లి ఇతరులెవరికైనా సాయపడు” అని అర్జునుడు చెప్పాడు.
అది విని రుక్మి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి దుర్యోధనుడి దగ్గరికి వెళ్లాడు. దుర్యోధనుడు రుక్మి తలబిరుసు మాటలు విని ‘ఇవేం మాటలు? నీ సాయం నాకు అక్కర్లేదు, వెళ్లిపొ’మ్మన్నాడు. కుండినపురి నుంచి వచ్చిన రుక్మి తను రావడం వృథా ప్రయాస అయిందని అనుకుని తిరిగి తన నగరానికి వెళ్లిపోయాడు.
ఇలా బలరాముడికీ, రుక్మికీ కురుపాండవ యుద్ధంలో పాల్గొనే అవకాశం చిక్కలేదు. కాని, ప్రపంచంలో ఉన్న రాజులందరూ యుద్ధం చెయ్యడానికి రెండు పక్షాల్లోనూ చేరిపోయారు.
అప్పుడు రాత్రి సమయంలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ని తన దగ్గరికి రమ్మని కబురు పంపించాడు. సంజయుడితో “యుద్ధం అనర్థాలకి మూలమని నాకు తెలుసు. అణకువ లేని నా కుమారుణ్ని బెదిరించి సంక్షోభం నివారించడానికి ప్రయత్నించి కూడా నాకు నోరు రాకుండటం విధి వైపరీత్యం. అలా జరిగినందుకు ఇప్పుడు విచారించి లాభంలేదు. ఏది జరగాలో అది జరగక మానదు. మనం చేయగలిగిందీ ఏదీ లేదు. రాజులు రణరంగంలో చావడమే మంచిది. అది అలా ఉండనీ. రెండు సైన్యలూ కురుక్షేత్రంలో దిగాక జరిగిన విశేషాలు ఏవైనా ఉంటే నాకు చెప్పు” అన్నాడు.
ధృతరాష్ట్రుడి మాటలకి సంజయుడు “రాజా! నీ కొడుకు మీద దోషం ఆరోపిస్తావు గానీ నీలో ఉన్న లోపం నువ్వు గుర్తించలేకపోతున్నావు. నీకు తెలియకుండా దుర్యోధనుడు పాండుకుమారుల్ని కష్టపెట్టాడా? అదంతా గడిచిపోయింది. సంగతులు వినదలిస్తే విను.
“దుర్యోధనుడు దుశ్శాసన, శకుని, కర్ణులతో మంతనాలాడి, శకుని కొడుకు ఉలూకుణ్ని పిలిచి ‘నువ్వు వెళ్లి పాండవుల్ని చూసి అక్కడ శ్రీకృష్ణుడి సన్నిధిలో ఉన్న ద్రుపదుడు, విరాటుడు మొదలైనవాళ్లు ఉండగా చెప్పమని కొన్ని కఠినమైన మాటలు చెప్పి పంపించాడు. ఉలూకుడు వెళ్లి సభలో ధర్మరాజుని చూసి ‘దుర్యోధనుడు మీకు చెప్పమని నన్ను ఆజ్ఞాపించిన మాటలు కొన్ని ఉన్నాయి. నా మీద కోపగించుకోకుండా వాటిని మీరు వినండి’ అన్నాడు.
అతడు చెప్పింది విని ధర్మరాజు “ఉలూకా! నువ్వు భయపడక్కర్లేదు. నిన్ను ఆ బుద్ధిమంతుడు చెప్పమన్న తుంటరి మాటలు ఎన్ని ఉన్నాయో వాటిని అన్నింటినీ సందేహం లేకుండా ఈ సభలో ఉన్నవాళ్లందరూ వినేలా చెప్పు” అన్నాడు.
ధర్మరాజు మాటలకి ఉలూకుడు “యుద్ధం చెయ్యడానికి చాలాకాలం ఎదురుచూసి ఎంతో దైర్యంతో వచ్చావు. సంజయుడితో మీ యోగ్యతకి మించి మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి. రాజ్యభాగం పోగొట్టుకున్నందుకు, ద్రౌపదిని అవమానపరిచినందుకు పగతీర్చుకునే సమయం ఆసన్నమైందని అనుకుని మీ బాహుబలం, మీ బాణవిద్యా కౌశలం చూపించడానికి కదనరంగంలో మేటివీరుడవై నిలబడు.
నీకున్న వాళ్లందరినీ సమకూర్చుకుని వ్యూహరచనలు చేసుకుని యుద్ధానికి తరలిరా! ఇంక తప్పించుకోడానికి వీలుకాదు. ఇంక భయపడి లాభం లేదు. సమయానికి రా! భీష్మద్రోణులు ఇద్దరు విడిచే బాణాల బారిన పడి అర్జునుడు బతకడం సాధ్యమా? మీ వాళ్లందరికీ ఆ గొప్ప పరాక్రమవంతుల దివ్యాస్త్రాల ఆయుధాల శక్తి సంపన్నతకి తెలియదా ఏమిటి?” అని చెప్పాడు.
తరువాత ఉలూకుడు భీముణ్ని చూస్తూ “ఈ భీముడు యుద్ధంలో దుశ్శాసనుడి రక్తం నేను తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. తాగడానికి తనకి శక్యమైతే తాగమని చెప్పు. మరి ఆలస్యమెందుకు? భీమసేనా! విను. బావిలోని కప్పలా నువ్వు నిన్ను మాత్రమే ఎరుగుదువు. గర్వంతో ఎదుటివాళ్ల బలపరాక్రమాల గురించి తెలుసుకోలేక పోతున్నావు. సంగ్రామంలో ఒకసారి మా చేత చిక్కి దెబ్బలు తినకుండా తప్పించుకో గలవా?” అన్నాడు.
తరువాత ఉలూకుడు “అర్జునా! తాటిచెట్టంత పొడవు కలిగిన గాండీవమనే విల్లు నీకుందనీ, కృష్ణుడు నీకు సాయంగా నీ వెంట ఉన్నాడనీ మాకు బాగా తెలుసు. ఈ ఆర్భాటాలకి బెదిరిపోయి మీకు రాజ్యంలో భాగం పంచి మేమివ్వము. ద్రౌపదిని నిండుసభలోకి ఈడ్చుకుని తెచ్చేటప్పుడు భీముడి గద, నీ గాండీవము ఏమయ్యాయి? జరిగిన అవమానం మర్చిపోయావా? మాటిమాటికి పౌరష వచనాలు ఎందుకు మాట్లాడుతావు?
అర్జునా! వలలుడు అనే పేరుతో వంటలవాడై భీముడూ, బృహన్నల పేరుతో నపుంసకుడవై నువ్వూ సిగ్గు కొంచెం కూడా లేకుండా రాజ్యం పాలించాలని ఆశపడి, విరాటుడి కొలువులో దీనులై నానా కష్టాలు పడ్డారు కదా! ఇది శూర లక్షణమో, బాహు విక్రమమో నువ్వే చెప్పాలి.
మాధవుడు టక్కుటమారాలు, ఇంద్రజాలాలు ఎన్ని పన్నినా కూడా గాలిలో కలిసిపోయే పగల్భ వచనాలు నోటికి అడ్డం లేకుండా నువ్వు ఎలా పేలినా కూడా, ఏభైవేలమంది అర్జునులు, శ్రీకృష్ణులు వచ్చినా కూడా మేము యుద్ధం చెయ్యకమానము. అన్ని మాటలెందుకు భూమిలో రవంత భాగం చీల్చి కూడా మీకివ్వం అన్నాడు.
ఉలూకుడి మాటలు విని భీమార్జున నకుల సహదేవులు ఒకళ్ల మొహం ఒకళ్లు చూస్తూ, కూర్చున్న తమ ఆసనాలు కదలడం, ముఖాలు ఎర్రగా మారడం మనస్సులో కోపంతో రగులుతున్న వాళ్లని చూశాడు శ్రీక్రుష్ణుడు. ఉలూకుణ్ని చూసి నవ్వుతూ “నువ్వు వెళ్లి మీ దుర్యోధనుడితో చెప్పవయ్యా! రేపే యుద్ధం. వీరుడవై ధైర్యంగా మరణించు. మరణించక తప్పించుకోలేవు.
శ్రీకృష్ణుడు సారథ్యం చేస్తుండగా వెళ్లిన రథం నిన్నెదిరించి నువ్వు ఎక్కడ దూరితే వెంటనే తానూ అక్కడికే దూరుతుంది. భీముడు పదివేల ఏనుగుల సత్తువ కలవాడు. అతడెప్పుడూ వట్టి మాటలు వాగేవాడు కాదు. యుద్ధంలో దుశ్శాసనుడి వక్షం చీల్చి నువ్వు చూస్తుండగానే రక్తం తాగగలడు” అన్నాడు.
తరువాత అర్జునుడు ఉలూకుడితో “మాకు యుద్ధంలో సాయపడడానికి వాళ్లున్నారు, వీళ్లున్నారు అని గొప్పగా చెప్తున్నావు. మీకు సాయంగా ఉన్నవాళ్లని, మిమ్మల్ని రేపు కదా స్పష్టంగా చూస్తాను. తనకి బాహుబలం లేకుండా ఇతరుల శక్తిని ఆశ్రయించి పరాక్రమం ప్రకటించాలనుకుంటే సాగదు.
కురుకులంలో గొప్పవాడూ, నియమ నిష్ఠలు కలవాడూ, ముసలివాడూ, పూజ్యుడూ అయిన భీష్ముడిని పురికొలిపి సేనలన్నింటికీ అధిపతివని ఉబ్బించి ఈర్ష్యతో అతన్ని చంపాలనుకున్నాడు దుర్యోధనుడు. భీష్ముణ్ని నమ్ముకున్నంత మాత్రాన తను ఒడ్డుకి చేరుకున్నట్టేనా? లోకంలో అందరికంటే భీష్ముడికి భుజబలం ఎక్కువని దుర్యోధనుడి ఉద్దేశం.
అది వట్టి భ్రమ. గాంగేయుణ్ని ఆధారంగా చేసుకుని మరణించకుండా ఉండాలని దుర్యోధనుడి భావన. కాని, అతడు నమ్ముకుంటున్న గాంగేయుణ్నే మొదటి ముద్దగా మింగుతాము. తరువాత గురువైన ద్రోణాచార్యుల్ని, మట్టుబెడతాము. తరువాత సూతపుత్రుడు కర్ణుణ్ని తరిమికొడతాము. అప్పటికిగాని సుయోధనుడి ఆశ చావదు.
దుర్యోధనుడు తన తమ్ముళ్ల, కుమారుల మరణాలు చూసి భీముడి గద దెబ్బతో భూమి మీద కూలినప్పుడైనా తన పాపపు పనులు గుర్తుచేసుకుంటాడు. ఆ విషయం అలా ఉంచు, నువ్వు తొందరగా వెళ్లి ఉదయమే మీ రాజుని యుద్ధానికి పంపు” అన్నాడు అర్జునుడు.
ధర్మరాజు ఉలూకుడికి తాంబూలము, ఆభరణాలు ఇచ్చి వెళ్లమని చెప్పాడు. తరువాత ద్రుష్టద్యుమ్నుణ్ని చూసి “రేపే యుద్ధమని మన సైన్యాలకి చెప్పి యుద్ధ సన్నాహాలు చేయించు” అని చెప్పి సభ చాలించి వెళ్లాడు.
ద్రుష్టద్యుమ్నుడు ద్రోణున్ని ఎదిరించే అవకాశం తనకి దక్కిందని సంతోషించాడు. భీష్ముణ్ని ఎదుర్కునే అవకాశం తనకి దొరికినందుకు శిఖండి పొంగిపోయాడు. దృష్టద్యుమ్నుడు శిఖండిని తోడుగా చేసుకుని రాజాజ్ఞని నిర్వర్తించాడు. పాండవుల దగ్గరినుంచి వచ్చిన ఉలూకుడు దుర్యోధనుడిని సభలో కలిసి కృష్ణార్జునులు మాట్లాడిన మాటలు ఉన్నవి ఉన్నట్లుగా తెలియచేశాడు.
దుర్యోధనుడు కర్ణుడివైపు చూసి “మన సేనలన్నింటికీ రేపే యుద్ధమని చెప్పి పంపించు, సకల సైన్యాల్ని సమాయత్తం చెయ్యి” అని చెప్పి పంపించాడు. దుర్యోధనుడు చెప్పినట్లు చేశాడు కర్ణుడు. ఇలా రెండు పక్షాలు చెలరేగి యుద్ధోత్సాహంతో ఉల్లాసంగా ఉన్నాయి” అని చెప్పాడు.
సంజయుడు చెప్పింది విని ధృతరాష్ట్రుడు మళ్లీ అతడితో “సంజయా! శ్రీహరి సహాయం కలిగిన అర్జునుణ్ని జయించడానికి భీష్ముడికి సాధ్యమవుతుందా? ఆ విషయం అలా ఉంచు. ఉలూకుడు చెప్పిన మాటలు విని సభలో ఉన్నవాళ్లు ఎవరేమన్నారో చెప్పు” అన్నాడు.
ధృతరాష్ట్రుడి మాటలకి సంజయుడు బదులిస్తూ “ఉలూకుడు చెప్పిన మాటలన్నీ విని భీష్ముడు నీ కుమారుడితో ఇలా చెప్పాడు విను ‘కురురాజా! నేనుండగా నీకు భయమెందుకు? నువ్వు మెచ్చుకునేలా సేనలన్నింటినీ సంరిక్షిస్తాను. దుర్యోధన సేనలని నడిపించడానికి, యుద్ధం చేయడానికి, సైన్యం తారుమారై చెదిరిపోయినప్పుడు కలత పోగొట్టి చక్కబరచడానికి నేను మిక్కిలి సమర్థుణ్ని. అతిశయించే నా పరాక్రమమే సైన్యానికి రక్షాకవచమని గ్రహించు” అన్నాడు.
భీష్ముడు ధైర్యవచనాలు చెప్పాక సుయోధనుడు “తాతా! నువ్వూ, గురుడైన ద్రోణాచార్యులూ మహాస్త్రాలెరిగిన వారిలో ఎంతో గొప్పవాళ్లు. మరి మీరుండగా భయమెందుకు? నేను గంధర్వ, కిన్నర, దానవ, దేవత వర్గానికే భయపడనప్పుడు అల్పులైన పాండవుల విషయంలో నాకు భయమెందుకు? ఒక్క చిటికెలో వాళ్ల మదమడిగిస్తాను” అన్నాడు.
