[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
భీష్ముడికి అంబ వృత్తాంతం చెప్పిన నారదుడు
అంబ వృత్తాంతం తెలుసుకోడానికి ప్రతిరోజూ తగినవాళ్లని పంపి భయపడుతూ ఉన్నాను. ఆమె తపోబలంతో నన్ను నిర్మూలిస్తానని చెప్పింది మొదలు బాధతో కృశిస్తున్నాను. కాని, శత్రురాజులతో యుద్ధం చేసి విజయం సాధిస్తూనే ఉన్నాను.
నేను ఒకరోజు వ్యాసమహర్షి, నారదమహర్షుల్ని కలుసుకుని అంబ విషయం గురించి భయంగా ఉందని చెప్పాను. వాళ్లు “దైవం తలపెట్టిన పనిని మానవ ప్రయత్నంతో మరలించడం శక్యం కాదు. నువ్వు ఈ విషయంలో బాధపడడం మానెయ్యి” అని చెప్పారు.
తరువాత నారదమహర్షి నాకు కాశీరాజు కూతురు గురించి చెప్తాను వినమన్నాడు. “అంబ యమునా నదీతీరానికి వెళ్లి అక్కడ ఘోరతపస్సు చేసింది. ఇక్కడి నుంచి విశ్వామిత్ర నివాసం మొదలైన సిద్ధాశ్రమాలన్నింటికీ వెళ్లి వెళ్లి ఆయా ప్రదేశాల్లో కఠిన నియమాలతో వ్రతాలు చేస్తూ ఉంది.
ఒకరోజు నీ తల్లి గంగాదేవి ఆమె దగ్గరికి వచ్చి “ఆడవాళ్లు చెయ్యలేని అతి కష్టమైన నియమాలు, వ్రతాలు చెయ్యడానికి కారణమేమిటి?” అని ప్రశ్నించింది.
“నేను భీష్ముడి వల్ల అవమానం పాలయ్యాను. మళ్లీ జన్మలోనైనా అతణ్ని చంపి పగతీర్చుకునే సామర్థ్యం పొందాలని ఇలా తపస్సు చేస్తున్నాను” అని అంబ సమాధానం చెప్పింది.
అంబ మాటలు విని గంగాదేవి “నువ్వ వక్రప్రవర్తన కలదానివి కనుక ఈ దేహం వదిలి నదివై ప్రవహించగలవు. ఇంతే కాని, నువ్వు మరేమీ చెయ్యలేవు” అని చెప్పింది.
అంబ నవ్వుతూ గంగ మాటలు లక్ష్యపెట్టక ముందు చేసిన తపస్సు కంటే తీవ్రమైన తపస్సు చేసింది. ఒకరోజు తన వ్రతఫలంలో అర్థభాగం అంబ అనే పేరుతో నదిగా మత్స్యదేశంలో ప్రవహించింది. మిగిలిన సగం తపోబలంతో తన స్వరూపం చెడకుండా ఉంచుకుని గంగాదేవి మహిమని తన తపోమహిమతో జయించింది.
గంగాదేవి శాపం వల్ల తన స్వరూపం పూర్తిగా పోగొట్టుకుని ఏరుగా పారవలసిన అంబ తన నిజ తపోబలంతో ఆకారం పోగొట్టుకోనందువల్ల గంగను గెలిచింది. అంబ పవిత్రమైన ఆశ్రమస్థలాల్లో తపస్సు చేస్తూ ఉండగా ఆమెకి శివుడు ప్రత్యక్షమయ్యాడు. మహర్షులు ఆశ్చర్యంతో చూస్తుండగా అంబని వరం కోరుకోమన్నాడు.
అంబ భీష్ముణ్ని చంపడానికి తగిన సామర్థ్యాన్ని ఇమ్మని శివుణ్ని కోరుకుంది. అలాగే జరుగుతుంది అన్నాడు శివుడు. అదెలా జరుగుతుందని శివుణ్ని అంబ అడిగింది. నువ్వు శరీరం విడిచి వెళ్లేటప్పుడు ద్రుపద రాజుకి మొదట కూతురుగా పుడతావు. తరువాత కొడుకువవుతావు. శిఖండి అనే పేరుతో మిక్కుటమైన భుజశక్తి, ధనుర్విద్యా నైపుణ్యం, దిట్టమైన పరాక్రమం అనే వాటితో ప్రకాశిస్తూ గొప్ప ప్రఖ్యాతి గడించిన యుద్ధంలో భీష్ముడిని సంహరిస్తావు. నా మాట వ్యర్థం కాదు. ఓర్పు పట్టు” అని చెప్పి రుద్రుడు అంతర్థానమయ్యాడు.
ఆ రోజే అంబ కట్టెలు ఒక చోట పోగు పెట్టుకుని నిప్పంటించి కోపంతో తన జ్వలిస్తుంటే అక్కడున్న మహర్షులు ఆశ్చర్యంతో చూస్తుండగా ‘నేను భీష్ముడిని వధిస్తా!’ అంటూ ఆ చితిమంటల్లో ప్రవేశించింది.
అంబ చితిలో ప్రవేశించిన సమయంలో ద్రుపదుడు తన పట్టపురాణి కోకిలాదేవి దుఃఖం పోగొట్టడానికీ, తనకి భీష్ముడి మీద ఉన్న కోపం వల్లా శివుణ్ని గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని ద్రుపదుణ్ని అడిగాడు. పాంచాలరాజు భీష్ముడిని చంపగల ఒక కొడుకుని ప్రసాదించమని వేడుకున్నాడు.
ద్రుపదుడి కోరిక విని శివుడు “ముందు నీకు కూతురిగా జన్మించి, తరువాత కొడుకుగా మారి భీష్ముడిని యుద్ధభూమిలో చంపకలిగిన చక్కని సంతానం నీకు కలుగుతుంది. నా మాట జరిగి తీరుతుంది” అని చెప్పి శివుడు అంతర్థానమయ్యాడు.
ద్రుపదమహారాజు సంతోషించి తన పట్టపురాణి కోకిలాదేవికి ఈశ్వరుడు వరాన్ని అనుగ్రహించిన విషయం చెప్పాడు. తరువాత కాశీరాజు కూతురైన అంబ యొక్క చైతన్యం రాజమహిషి గర్భంలో ప్రవేశించింది. ద్రుపదుడి భార్య గర్భం ధరించి రహస్యంగా ఒక కుమార్తెని కనింది, తమకి కుమారుడు పుట్టాడని లోకులకి చెప్పారు.
ద్రుపదమహారాజు తనకు కుమార్తె పుట్టినా కుమారుడికి చేయించవలసిన సంస్కారలన్నీ చేయించి శిఖండి అని పేరు పెట్టి కుమారుడుగా పెంచుతున్నారు. రహస్యానికి గల కారణం ఆ కన్యకి చెప్పారు. అక్షరాభ్యాసం చేయించి ద్రోణాచార్యుడి దగ్గర శస్త్రాస్త్ర విద్యలు నేర్పిస్తున్నారు. యవ్వనవతి అయిన శిఖండిని చూసి బాధపడ్డారు.
శివుడి వరం ఊరికే పోదని అనుకుని దశార్ణదేశాధిపతి హేమవర్మ కూతురితో శిఖండికి పెళ్లి జరిపించి కోడలిని ఇంటికి తెచ్చుకున్నారు. దశార్ణవరాజు కుమార్తె శిఖండి ప్రవర్తన అతడు ఏమరిపాటుగా ఉన్నప్పుడు తెల్సుకుని మనసులో బాధపడింది. అతడు స్త్రీ అని తెలుసుకుని కూడ ఎవరికీ చెప్పకుండా ఏమీ తెలియనిదానిలా ఉండిపోయింది.
ఒకరోజు శిఖండి మగవాడు కాదని తన దాసికి చెప్పింది. ఆమె దశార్ణ రాజుకి తెలియచేసింది. అతడు దుఃఖము కోపము కలిగి ద్రుపదుడి దగ్గరికి దూతని పంపించాడు. దూత ద్రుపదుడి దగ్గరికి వచ్చి “కొడుకని చెప్పి కుమార్తెని తీసుకుని వచ్చి నా కుమార్తెతో పెళ్లి జరిపించావు. ఇందువల్ల అవమానం తప్ప నువ్వు సాధించిన ప్రయోజనం ఏముంది? ఈ విషయం వివరంగా తెలుసుకోవాలని వచ్చాను. హేమవర్మ శత్రుభయంకరుడని నీకు తెలియదా? చెడ్డపని చేసి ఆయనకి కోపం తెప్పించావు. పోనీ రణరంగంలో అయినా నీ మగతనం చూపించవలసింది” అన్నాడు.
దూత మాటలకి ద్రుపదుడు “అలా ఎందుకు చేస్తాము? ఇంత వెర్రివాళ్లుంటారా?” అని నేర్పుగా పొందికగా మాట్లాడి నిజాన్ని బయటికి లాగడానికి ప్రయత్నించిన దూతని వీడ్కోలు చెప్పి పంపించేశాడు. హేమవర్మ కోపంతో ద్రుపదుడి మీదకి సైన్య సన్నాహంతో వచ్చి అతడి పట్టణ అగడ్త సమీప భూమి చుట్టూ ప్రదేశాన్ని ఆక్రమించి ముట్టడి చేశాడు.
హేమవర్మ తన సేనలతో ద్రుపదుడి పట్టణాన్ని ముట్టడించడంతో ద్రుపదరాజు దొరికిపోయిన దొంగలా తనకి సిగ్గుచేటు దుర్దశ దాపురించిందని బాధపడుతూ ఒక చోట మౌనంగా ఉండిపోయాడు. ద్రుపదుడి సేనానాయకులు యుద్ధ సన్నాహలు చేసుకున్నారు. ఇరుపక్షలవాళ్లూ ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు యుద్ధం మొదలుపెడదామా అని ఉత్సాహంగా ఉన్నారు. శిఖండి తనకు ఈ నింద పోవాలంటే మరణమే శరణ్యమని అనుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా రహస్యంగా దగ్గరలో ఉన్న అరణ్యంలోకి వెళ్లిపోయాడు.
యక్షుడివల్ల పురుషత్వం పొందిన శిఖండి
శిఖండి వెళ్లిన అరణ్యంలో స్థూలకర్ణుడు అనే ఒక యక్షుడు నివసిస్తూ ఉండేవాడు. అక్కడ మనిషి సంచారం ఉండదు. ఆ విషయం తెలిసిన శిఖండి మనోహరమైన స్థూలకర్ణుడి మందిరానికి వెళ్లి అక్కడ ప్రాణం తీసుకోబోతుండగా యక్షుడుకి విషయం తెలిసింది.
వెంటనే అక్కడికి వచ్చి “ఓ కాంతా! ఇలా వ్యర్థంగా ప్రాణాలు తీసుకోడానికి కారణం నాకు చెప్పు. నేను నీ మనోవ్యాధికి మందిస్తాను” అన్నాడు.
శిఖండి “మహేశ్వరుడికి తప్ప ఇతరులెవరూ నాకు సాయం చెయ్యలేరు. నాకు పురుషత్వం కలిగితేగాని నా మనసులో గాయం మానదు” అని తన విషయమంతా యక్షుడికి వివరించాడు.
“ఇదెంతపని. నేను నా మగతనం నీకిస్తాను. కాని, దానికి కొంత గడువుస్తాను ఈ రోజునుంచి పది రోజులవరకు నా మగతనాన్ని నీకిస్తాను, నీ కాంతాస్వరూపాన్ని నేను తీసుకుంటాను. నువ్వు విచారం వదిలిపెట్టి ఇంటికి వెళ్లు” అని తన మగతనాన్ని శిఖండికి ఇచ్చి సాగనంపాడు.
శిఖండి నగరంలోకి వచ్చి తన మందిరానికి వచ్చాడు. అక్కడ తన తల్లితండ్రులకి జరిగిన విషయం చెప్పి సంతోషపరిచాడు. తల్లితండ్రులు అతణ్ని ప్రశంసించారు. ఇంతలో తెల్లవారింది.
ద్రుపదుడు కాలకృత్యాలు తీర్చుకుని వియ్యంకుడితో మాట్లాడగల నేర్పు కలిగిన వాళ్లని పంపించి, ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా తొందర పడకుండా శిఖండి పురుషత్వం స్పష్టంగా తెలియచేసి, పరివారంతో ఆయనకి విందు చేశాడు, తరువాత వస్త్రాలు పెట్టి దశార్ణపతిని మంచిమాటలతో సాగనంపాడు. హేమవర్మ తను శిఖండి మీద మోపిన నిందకి తనను తాను దూషించుకుంటూ తన నగరానికి వెళ్లాడు.
ఆ సమయంలో యక్షుడు స్థూలకర్ణుడి భవనం దగ్గరికి విహారానికి విమానంలో కుబేరుడు వచ్చాడు. స్థూలకర్ణుడి అందమైన భవనాన్ని చూసి మెచ్చుకుంటూ కుబేరుడు తనతో వచ్చిన యక్షులతో “మనం వచ్చి ఇంతసేపయింది. అతడి కోసం వేచి చూస్తున్నామని తెలిసి కూడ బయటికి రాలేదు. ఇతడికి ఇంత పొగరెందుకు? ఆ పొగరే అతణ్ని ఇక్కడికి రానివ్వట్లేదు. ఇతడి తప్పు ఎల సహించాలి?” అన్నాడు.
ఇంతలో కిన్నరలు భవనంలోకి వెళ్లి స్థూలకర్ణుడి వృత్తాంతం తెలుసుకుని అతడి సంగతి మొత్తం కుబేరుడికి చెప్పారు. “ప్రభూ! స్థూలకర్ణుడు సిగ్గు వల్ల మీ దగ్గరకి రాలేకపొతున్నాడు” అని చెప్పారు.
వాళ్లు చెప్పింది విని కుబేరుడు “ఆడదయినంత మాత్రాన సిగ్గుపడవలసింది ఏముంది? అతణ్ని రమ్మని చెప్పండి” అన్నాడు.
స్థూలకర్ణుడు వచ్చి కుబేరుడికి నమస్కరించాడు. కుబేరుడు స్త్రీగా మారిన అతణ్ని చూసి “జరగబోయే పనికి అనుకూలంగా ఇతడు ఇలాగే వనితగా ఉండుగాక!” అన్నాడు.
కుబేరుడి వల్ల స్త్రీత్వం పొందిన స్థూలకర్ణుడు
స్థూలకర్ణుడు దుఃఖంతో కుబేరుడికి సాష్టాంగపడి నమస్కరించి మవునంగా ఉండిపోయాడు. అప్పుడు కుబేరుణ్ని సేవిస్తున్న నాయకులు కుబేరుడికి దయ కలిగేట్లు మంచి మాటలు చెప్పారు. “అలా అయితే శిఖండి బతికి ఉన్నంతకాలం పడతిగానే ఉండి, తరువాత నిజ స్వరూపాన్ని పొందుతాడు” అని శాప విముక్తి చేశాడు. తరువాత కుబేరుడు అలకాపురికి వెళ్లిపోయాడు.
స్థూలకర్ణుడు కుబేరుడి శాపంతో బాధపడుతున్నాడు. శిఖండి తన తల్లి తండ్రులకి చెప్పి న్యాయం తప్పకుండా అనుకున్న నియమం ప్రకారం పదిరోజులు గడువగానే స్థూలకర్ణుడి పురుషత్వం అతడికి తిరిగి ఇవ్వడం కోసం అతడి భవనానికి వచ్చాడు.
అనుకున్న ప్రకారం సమయం మించకుండా తన దగ్గరికి వచ్చిన శిఖండిని చూసి స్థూలకర్ణుడు “నీయందు ఏ దోషమూ లేదు. వచ్చినవాడివి వచ్చినట్లుగానే ఇంటికి వెళ్లిపో. ఇది దైవం నీకు అనుగ్రహించిన రూపం” అని జరిగిన విషయం మొత్తం అతడికి వివరంగా చెప్పాడు.
స్థూలకర్ణుడి దగ్గర సెలవు తీసుకుని సంతోషంగా తండ్రి దగ్గరికి వచ్చి జరిగినదంతా చెప్పాడు. ద్రుపదుడు సంతోషించి దేవతల్ని, గురువుల్ని, బ్రాహ్మణుల్ని పూజించి తన పుత్రుడైన శిఖండిని ద్రోణాచార్యులవారికి అసాధారణ శిష్యుడిగా చేశాడు” అని చెప్పాడు.
నారదుడు భీష్ముడికి అంబ వృత్తాంతం చెప్పి తానూ, వ్యాసుడూ తమ దారిన తాము వెళ్లారు. లోకులు ఒకళ్లకి ఒకళ్లు చెప్పుకోడం వల్ల శిఖండి వృత్తాంతం అందరికీ తెలిసింది. ఈ రకంగా కాశీరాజు కుమార్తె అంబ నన్ను సాధించేదిగా పుట్టింది.
నేను ఆడవాళ్లని, మొదట ఆడవాళ్లుగా ఉన్నవాళ్లని, ఆడవాళ్ల పేరు పెట్టుకున్న వాళ్లని, ఆడవారి ఆకారం కలిగినవాళ్లని చంపనని నియమం పెట్టుకున్నాను. శిఖండి మొదట ఆడదిగా ఉండి తరువాత పురుషుడయ్యాడు కనుక అతడు యుద్ధంలో ఎంత ప్రావీణ్యత ప్రదర్శించినా నేను అతణ్ని చంపను, బాధించంచను. అలా చేస్తే అంతకంటే అపకీర్తి నాకు వేరే ఉండదు. నేనేమైనా ఫరవాలేదుగాని, వ్రతభంగం చేసుకోలేను. ఇది నా నిర్ణయం” అని చెప్పాడు.
భీష్ముడు చక్కగా మెచ్చుకోతగినట్లుగా చెప్పిన విషయాలు దుర్యోధనుడు విన్నాడు. తన మనసులో కొంచెం బాధపడి పౌరుషం చెల్లించుకోడం ఈ బీష్ముడికి ఒక్కడికే తగింది అన్నాడు. తరువాత యుద్ధానికి సంబంధించిన విషయాల గురించి వీరులు పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటే వింటున్నాడు దుర్యోధనుడు.
తరువాత భీష్ముడితో “పితామహా! పాండవులకున్న సేనలన్నీ చంపడానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది? ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ఆశ్వత్థామ, కర్ణుడు కుంతీపుత్రుల సేనల్ని ఎంతెంత కాలంలో సంహరించగలరు?” అని అడిగాడు.
దుర్యోధనుడి సందేహానికి భీష్ముడు బదులు చెప్తూ “దుర్యోధనా! పాండవసేనల్ని యుద్ధభూమిలో చంపడానికీ, చెల్లాచెదరు చెయ్యడానికీ మాకు కలిగిన శక్తి యుక్తుల ఎలాంటివో నీకున్న సందేహం తీర్చుకోడానికి నువ్వు అడగడం మంచిపనే! రాజా! నేను చెప్పేది బాగా విను.
నేను నా సామర్థ్యపు ప్రమాణమెంతో చెప్తాను. మిగిలినవాళ్లు తమతమ సామర్థ్యాల గురించి వాళ్లే చెప్పుకుంటారు. అన్నీ నువ్వు విందువుగాని. ముందు నా ప్రతిజ్ఞ వినిపిస్తాను విను. నేను మహారథికుల్ని రోజుకి వెయ్యిమందిని చంపుతాను. అర్జునుడి శరాలు నొచ్చేటట్లు నా అవయవాల్లో గుచ్చుకుని నన్ను నేలమీద పడేసేవరకు నేను శత్రుసేనల్లో ఉన్న శూరుల్ని వధిస్తాను.
సుయోధనా! ఆ విధంగా నేను యుద్ధం చేసే రోజుల్లో రోజుకి వెయ్యిమందిని కాదు, పదివేలమందిని చంపగలననే సంకల్పం కలుగుతోంది. నీకున్న పదకొండు అక్షౌహిణుల సేనని నేర్పుతో నడిపించగలను. శత్రుసేనల్ని బాధపెట్టగలను.
నువ్వు నన్ను అడిగిన పని గురించి స్పష్టంగా విను. అనేక దివ్యాస్త్రాల శక్తిచేత ఆ పాండుకుమారుల బలగాలనన్నింటినీ నేనొక్కణ్నీ నెలరోజుల్లో నరికి వెయ్యగలను” అన్నాడు.
భీష్ముడు మాట్లాడిన తరువాత సుయోధనుడు “ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణులవైపు చూసి మీమీ సామర్థ్యాల గురించి కూడా చెప్పండి” అన్నాడు.
ద్రోణాచార్యుడు చిరునవ్వు నవ్వుతూ “రాజా! నేను ముసలివాడిని. ఎలాగయినా శక్తి ఉన్నంత వరకు పోరాడుతాను. నీయందు ప్రేమకలిగిన నీ తాతకి పట్టినట్టు నాకు కూడా పాండవ సేనల్ని నిర్మూలించడనికి నెల రోజులు పట్టవచ్చు” అన్నాడు.
“జనమేజయమహారాజా! విను” అని వైశంపాయనమహర్షి చెప్తూ ద్రోణుడు నెలరోజుల్లో పాండవ సైన్యాన్ని పరిమార్చగలనని చెప్పిన తరువాత కృపాచార్యుడు అంతకు రెట్టింపు రోజుల్లో వధిస్తానని చెప్పాడు. కృపాచర్యుడు చెప్పిన తర్వాత అశ్వత్థామ తను పాండవ సైన్యాన్ని పదిరోజుల్లో హతమారుస్తాన్నాడు.
అందరి మాటలు విన్న తరువాత కర్ణుడు “అన్ని రకాల దివ్యాస్త్రాలు, ఆయుధాలు అనే బడబాగ్నిని కమ్ముకొనేలా చేసి నేను పాండవుల సేన అనే సముద్రాన్ని ఐదు రోజుల్లో ఇంకిపోయేలా చేస్తాను” అని ప్రతిజ్ఞ చేశాడు.
అతడి ప్రతిజ్ఞ విని భీష్ముడు పకపక నవ్వి “సూతపుత్రా! చెప్పగానే సరిపోయిందా? మాటలు ఎన్నైనా చెప్పచ్చు. మన రాజు దగ్గర బదులు చెప్పేవాళ్లు లేరు కదా! నా మాట విను అర్జునుడి గాండీవం నుంచి వచ్చే కాంతులకి కళ్లు చికిలించుకు పోయినప్పుడు, అల్లెతాటి మోతతో చెవులు బద్దలైనప్పుడుగాని, నువ్వు ఇలా మాట్లాడ్డం మానుకోవు. అంతవరకు ఇలా వాగుతూనే ఉంటావు” అని భీష్ముడు కర్ణుణ్ని వారించాడు.
నీ కొడుకు దగ్గర ఇలా జరిగిన విశేషాలన్నీ వేగుల వల్ల విని ధర్మరాజు తన తమ్ముళ్లని తన దగ్గరికి పిలిపించుకుని వాళ్లతో “మన వేగులవాళ్లు ఇప్పుడే దుర్యోధనుడి స్కంధావారం నుంచి వచ్చారు.
దుష్టచిత్తుడైన దుర్యోధనుడు కొలువులో భీష్ముణ్ని, ద్రోణుణ్ని, కృపుణ్ని, అశ్వత్థామని, కర్ణుణ్ని చూసి “మీరెంతెంత కాలంలో సేననంతటినీ నిర్మూలించగలరు?” అని ప్రశ్నించాడట.
అందుకు సమాధానంగా భీష్ముడు తనకి ఒక నెల రోజులు పడుతుందని చెప్పాడు. ద్రోణాచార్యుడు కూడా ఒక నెల అనే చెప్పాడు. కృపాచార్యుడు రెండునెలలని చెప్పాడు. అశ్వత్థామ పదిరోజులన్నాడు. భుజబలపరాక్రమవంతుడైన కర్ణుడు ఐదు రోజుల్లో మన బలాలన్నింటినీ సంహరించగలనని ప్రతిజ్ఞ చేసాడట” అని చెప్పాడు.
తరువాత అర్జునుడి వైపు చూసి “వాళ్లు తమతమ శక్తులు ఏపాటివో చెప్పారు. నువ్వు కురు సైన్యాన్ని ఎన్నాళ్లలో చంపగలవో చెప్పు” అని అడిగాడు.
ధర్మరాజు అడిగిన ప్రశ్నకి అర్జునుడు చిరునవ్వు నవ్వుతూ “నీ మనసులో సందేహమెందుకు? నా విస్తారమైన భుజశక్తి ఎంతటిదో తెలుసుకోవాలని నువ్వు అనుకుంటే చెప్తున్నాను విను. నా విజృంభణం, ధైర్యం ప్రదర్శించి శ్రీకృష్ణుడి సహాయంతో చెలరేగి యుద్ధం మొదలుపెడితే ఒక్క నిముషంలో సురాసురులతో కూడా మూడు లోకాల్ని పిండి చేస్తాను.
విజయాన్ని పొందిన అనందం మనకి ఎలా కలుగుతుందని నువ్వు సందేహిస్తుంటే చెప్తాను విను. ఈశ్వరుడు కపటవేషంలో వచ్చి నాతో యుద్ధం చేసి మెచ్చుకుని అన్ని భువనాల్ని సంహరించడానికి ప్రళయకాలంలో ప్రయోగించే పాశుపతాస్త్రాన్ని నాకు అనుగ్రహించాడు.
అది నా దగ్గర సిద్ధంగా ఉంది. కనుక, శత్రువుల్ని నిర్మూలించడనికి నేను శ్రమపడక్కర్లేదు. పాశుపతాస్త్ర మహామహిమ ఎటువంటిదో భీష్ముడికి తెలియదు. ద్రోణాచార్యుడికీ, కృపాచార్యుడికీ, అశ్వత్థామకీ తెలియదు. కర్ణుడికి అసలే తెలియదు.
అంత మహా భయంకరమైన మహాస్త్రంతో అందరినీ దగ్ధం చెయ్యడం సమంజసం కాదు. తక్కిన ఆయుధాలతో విరోధుల్ని ఎదిరించి చంపితే మన ప్రతాపం ఎటువంటిదో లోకానికి తెలుస్తుందని నా అభిప్రాయం. ఆ సమయానికి జరగవలసినది ఏదో అదే జరుగుతుంది. ఇప్పుడు అదంతా ఎందుకు? నీ సైన్యంలో ఉన్న వీరులు కురు సైన్యంలో ఉన్న వీరులకంటే తక్కువవాళ్లని నువ్వు అనుకోవద్దు.
భీమసేనుడు, నకులసహదేవులు, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉత్తమౌజుడు, యుధామన్యుడు, ఘటోత్కచుడు మొదలైనవాళ్లంతా జగజట్లు. ఇటువంటివాళ్లెందరో మన పక్షంలో ఉన్నారు. అందరినీ పేరుపేరున చెప్పలేను.
ఏనుగులా నీ శక్తి ఏమిటో నీకు తెలియదు. నిన్ను దేవతలు కూడ జయించలేరు. ముల్లోకాలూ నీ ముందు నిలబడితే నిన్ను జయించలేరు. నీకు నిజంగా కోపం రాదు. వస్తే ఎవరు ఏమవుతారో చెప్పనక్కర్లేదు. మనకి తప్పకుండా విజయం కలుగుతుంది” అని అర్జునుడు ధర్మరాజుతో చెప్పాడని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించిన విషయం వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పాడు.
ఉద్యోగపర్వంలోని నాలుగవ ఆశ్వాసం సమాప్తం
ఉద్యోగపర్వం సమాప్తం- ఆదిపంచకం సంపూర్ణం
