[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
భీష్మపర్వము – మొదటి ఆశ్వాసము
దుర్యోధనుడి దగ్గరికి వచ్చిన వేదవ్యాసుడు
జనమేజయ మహారాజు మిక్కిలి నమ్రతతో, మన్నన చూపిస్తూ వైశంపాయనుడితో “మునులలో శ్రేష్ఠుడైన ఓ వైశంపాయన మహర్షీ! ఒకరినొకరు జయించాలనే కోరికతో పాండవులు, కౌరవులు ఎలా ప్రయత్నించారు. యుద్ధం జరిగిన విధానం వివరంగా తెలియచేయమని ప్రార్థిస్తున్నాను” అని అడిగాడు.
జనమేజయుడు అడిగినదానికి వైశంపాయన మహర్షి ఎంతో సంతోషించి, అతడి మనసులో ఉన్న ఆసక్తి తీర్చాలని అనుకుని “జనమేజయ మహారాజా, పుణ్యస్థలమైన కురుక్షేత్రంలో పాండవులు, కౌరవులు గుడారాలు నిర్మించి సేనలతో యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు సంజయుడి దగ్గర తన కొడుకుల గర్వాన్ని తలుచుకుని దుఃఖిస్తున్నాడు.
అది చూసి వ్యాసమహర్షి అక్కడికి వచ్చి ధృతరాష్ట్రుడితో “కుమారా! పోయేకాలం దగ్గరపడి రాజులకి యుద్ధం దాపురించింది. దీనికి నువ్వు బాధపడకు. ఈ యుద్ధాన్ని చూడాలని కోరికగా ఉంటే నీకు దివ్యదృష్టి ఇస్తాను” అన్నాడు. వేదవ్యాసుడు చెప్పింది విని ధృతరాష్ట్రుడు “అన్నదమ్ముల మధ్య జరిగే ఘోర యుద్ధం నేను చూడలేను, వినగలను. నేను వినే ఏర్పాటు చేస్తే చాలు” అన్నాడు.
అతడి కోరిక విని వేదవ్యాసమహర్షి కరుణించి యుద్ధవిషయాలు జరిగినవి జరిగినట్లుగా చెప్పమని సంజయుణ్ని నియమించాడు. వ్యాసమహర్షి ధృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు వినిపించే ఏర్పాటు చేశాడు. అంతేకాక, వార్తాహరుడైన సంజయుడికి కొన్ని అతిలోకశక్తులు ప్రసాదించాడు. సంజయుడు యథేచ్ఛగా యుద్ధభూమిలో అతివేగంగా విహరించవచ్చు. అతణ్ని ఏ ఆయుధాలు ఏమీ చెయ్యలేవు. ఇతరుల మనస్సుని పసిగట్టగలడు. దేవతల రూపాలు చూడగలడు. మాటలు వినగలడు.
ఇటువంటి వరాలు అనుగ్రహించి వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్రుడితో “ఈ యుద్ధం విధివిలాసం వల్ల వచ్చింది. భూభారం తగ్గగలదు. బాధపడకు” అని ఓదార్చాడు. “ధర్మం జయించుగాక! చింత వదిలి ప్రశాంతంగా ఉండు. నేను కురుపాండవుల కీర్తిని తెలియచేస్తాను” అని చెప్పాడు.
వేదవ్యాసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు “మబ్బులు లేకుండానే ఆకాశంలో ఉరుములు సంక్షోభం రేకెత్తించాయి. ఏనుగులు, గుర్రాలు అదేపనిగా కన్నీరు కార్చాయి. జంతువులు పక్షుల్ని కన్నాయి. ఆవులు జంతువుల్ని కన్నాయి. ఒకే స్త్రీ గర్భం నుంచి నలుగురైదుగులు బిడ్డలు ఒకేసారి పుడతారు. వాళ్లు పుట్టగానే ఆడతారు, కలకల నవ్వుతారు. అటువంటి అద్భుతాలు మనం చూడగలం. పొద్దుపొడిచే సమయంలోనూ, పొద్దుగుంకే సమయంలోనూ నల్లని కాంతితో భయంకరమైన మబ్బులు కమ్ముతున్నాయి. చంద్రుడిలో మచ్చ తలకిందులుగా కనిపిస్తోంది. ఇది ప్రజాక్షయ సూచనే కదా!
కౌరవుల ఇళ్లనుంచి, జెండాలనుంచి పొగలు రేగుతున్నాయి. ఆయుధాలు మండుతున్నాయి. ఇటువంటి అపశకునాలు ఎన్నో కనిపిస్తున్నాయి. స్వకులస్థులూ, అనేకమంది రాజులూ మరణించడం చూస్తూ ఊరుకోవడం తగిన పని కాదు. చెడుమార్గంలో నడుస్తున్న దుర్యోధనుడు మొదలైన కురుకుమారుల్ని వారించి నీ తమ్ముడి భాగం పాండవులకిప్పించి శాంతి జరిగేలా చూడడం మంచిది. మావంటి వాళ్లకి ఇష్టం లేని ఈ రాజ్యం నీకెందుకు?” అన్నాడు.
వ్యాసమహర్షి చెప్పిన మాటలు విని ధృతరాష్ట్రుడు వ్యాసుడితో “వ్యాసమహర్షీ! మీరు నా మీద కలిగిన ప్రేమతో నాకు ఈ విధంగా హితోపదేశం చేసి, కర్తవ్యబోధ కూడా చేశారు. ఇదివరలో నేను నా కొడుకులకి బుద్ధి చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాను, వాళ్లు నా అదుపు తప్పిపోయారు. వాళ్లని ఆజ్ఞాపించగల శక్తిసామర్థ్యాలు నాకు లేవు. నా వల్ల తప్పులేదని మీరు తెలుసుకోమని ప్రార్థిస్తున్నాను. దయచేసి నాకు హితవు చెప్పద్దు. చెప్పి లాభం లేదు. నేను ఇప్పుడు చెప్పగలిగింది ఇంక ఏదీ లేదని మీకు వినయంగా మనవి చేసుకుంటున్నాను” అని చెప్పాడు.
ధృతరాష్ట్రుడు చెప్పింది విని వ్యాసుడు “అది అలా ఉంచు. నేను చెప్పవలసింది ఏదైనా ఉందా?” అని అడిగాడు. ధృతరాష్ట్రుడు వ్యాసమహర్షితో “యుద్ధంలో గెలుపుని సూచించే శకునాలు తెలియచెయ్యి!” అని అడిగాడు.
వ్యాసుడు ధృతరాష్ట్రుడితో “హోమకాలంలో అగ్నులు పుణ్యపరిమళాలు వెదజల్లుతూ సవ్యదక్షిణంగా చక్కగా వెలుగుతాయి. వాలుగాలులు మనోహరంగా వీస్తాయి. భేరీలవంటి యుద్ధవాద్యాలనుంచి చక్కని, చిక్కని ధ్వనులు వినిపిస్తాయి. అంతేకాదు, యుద్ధంలో విజయం సంఖ్యాబలం మీద కాకుండా, దైవబలం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కలహం మంచిది కాదని పెద్దలంటారు” అని చెప్పి అతడు అంతర్థానమయ్యాడు.
వేదవ్యాసుడు చెప్పింది విని ధృతరాష్ట్రుడు వేడి నిట్టూర్పులు విడుస్తూ “ఓ సంజయా! రాజులు భూమికోసం ప్రాణాలు తెగించి, భయంకరమైన పోరాటాలు చేస్తారు. ఇది పూర్వకాలం నుంచి సాగుతున్న విషయం. భూమి అంటే రాజులకి ఎంత తీపోకదా! నీకు గొప్ప మహర్షులతో చాలా పరిచయముంది. నీకు ఈ ప్రపంచంలో విశేషాలన్నీ తెలుసు. కనుక, ఈ భూమి విషయాలు వివరంగా చెప్పు” అన్నాడు.
ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలకి సంజయుడు “ధృతరాష్ట్ర మహారాజా! నాకు తెలిసిన వరకు ఈ భూగోళ విషయాలన్నీ వివరంగా చెప్పగలను, శ్రద్ధగా విను!” అన్నాడు
ధృతరాష్ట్రుడికి భూపరిమాణం గురించి చెప్తున్న సంజయుడు
“ఓ ధృతరాష్ట్రమహారాజా! ఈ భూమి మీద చరాచరాలన్నీ పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి. భూమే అన్నింటికీ ఆధారమైన చోటు. అంతేకాక ఆకాశానికి లక్షణం శబ్దం; వాయువుకి లక్షణాలు రెండు. అవి శబ్దము, తాకుడు. నీటికి లక్షణాలు శబ్ద స్పర్శలే కాకుండా ద్రవత్వం కూడా ఉంది. భూమికి శబ్ద స్పర్శ రసాలతోపాటు వాసన కూడా ఉంది. అంటే, పంచభూతాల లక్షణాలన్నీ భూమికి ఉన్నాయి. భూతాల్లో పంచభూతాలు చెప్పుకోతగినవి. పంచభూతాల్లో భూమి చెప్పుకోతగినది, గొప్పది కూడా.
మహారాజా! మేరుపర్వతానికి దక్షిణంగా ‘సుదర్శనం’ అనే పేరుగల పెద్ద ప్రదేశం ఉంది. అది చాలా విస్తీర్ణంగా ఉంది. దాని పొడవు రెండు వేల ఏబది నూర్ల యోజనాలు. అందులో జంబూ వృక్షం ఉంది. ఆ చెట్టునుంచి పళ్లు పెద్ద చప్పుడుతో నేలమీద పడి విచ్చుతాయి. ఆ పళ్లరసం పెద్ద ఏరుగా తయారయి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి, పొంగి పొరలి ఉత్తర కురుభూముల ద్వారా ప్రవహించి చివరికి సముద్రాన్ని చేరుతుంది. జంబూనది అనే పేరుగల ఆ నది ప్రవహించే చోట్లన్నీ బంగారంగా మారిపోవడం వల్ల, బంగారానికి ‘జంబూనదము’ అనే పర్యాయపదం ఏర్పడింది. ఆ నదీ జలం తాగినవాళ్లకి ముసలితనం రాదు, ఏ రోగమూ రాదు, దాహం ఉండదు అని అంటారు.
ఆ నదికి పశ్చిమదిక్కులో నేరేడుచెట్ల గుంపు విస్తరించి ఉంటుంది. చెట్టు పేరు మీద ఆ ప్రాంతానికి జంబూద్వీపం అనే పేరు ఏర్పడింది. దానికే ‘సుదర్శన ద్వీపం’ అని మారుపేరు. ఆ ద్వీపం చుట్టూ ఉప్పునీటి సముద్రం ఉంది. ఆ ద్వీపానికి తూర్పు, పడమర దిక్కుల్లో పొడవుగా సముద్రం వ్యాపించి ఉంటుంది. ఇక ఇరువైపులా దేవతా జాతులతో కూడిన హిమాలయ పర్వతాలు, హేమకూట పర్వతం, నిషధ పర్వతాలు ఉంటాయి. అవి నల్లని, తెల్లని శిఖరాలతో విరాజిల్లుతూ ఉంటాయి. ఆ మూడింటికి ఇటు అటు వేల్పుకొండ తామరపువ్వులో ఉండే దుద్దులా సువర్ణమణిమయమై వెలుగొందుతూ ఉంటుంది.
ధృతరాష్ట్రమహారాజా! ఆ మేరుపర్వతపు పునాది చాలా లోతైంది, బలమైంది. దాని లోతు పదహారువేల యోజనాలు, పొడవు ఎనభై నాలుగువేల యోజనాలు అంటారు. ఇలా భూమికి మధ్యలో ఉన్న మేరుపర్వతం మీద దేవతలు, వివిధ వర్గాలు, దేవేంద్రుడు, బ్రహ్మ మొదలైనవాళ్లు తిరుగాడుతూ ఉంటారు. ఆ కొండ సానువులలో పార్వతీసమేతుడై శివుడు విహరిస్తూ ఉంటాడు. తొమ్మిది భాగాలుగా ఏర్పడిన జంబూద్వీపాన్ని, అందులో ఉండే జనపదాల్ని నీకు తెలిసేట్లు వర్ణించి చెప్తాను. ఉత్తర పర్వతానికీ, శృంగవంతం అనే పర్వతానికీ మధ్యలో గల ప్రదేశానికి ‘ఐరావతవర్షం’ అని పేరు. శ్వేతపర్వతం, శృంగవంత పర్వతాల మధ్యలోగల ప్రదేశం ‘హైరణ్మయ వర్షం’.
నీల పర్వతానికి ఉత్తర దిక్కులోను, దక్షిణ దిక్కులోను గల ప్రదేశం ‘రమణకవర్షం’. మేరుపర్వతానికి తూర్పు దిక్కులో ఉన్న ప్రదేశం ‘భద్రాశ్వవర్షం’. మేరు పర్వతానికి పడమర దిక్కులో ఉన్న ప్రదేశం ‘కేతుమాలావర్షం’. మేరుపర్వతానికి ఉత్తరదిక్కులో ఉన్న ప్రదేశం ‘హరివర్షం’. హిమాలయ పర్వతానికి అవతలి గట్టున ఉన్న ప్రదేశం ‘కింపురుష వర్షం’. హిమాలయ పర్వతానికి ఇవతలి వైపున ఉన్న ప్రదేశం ‘భారత వర్షం’. ఇలా ఉన్న భూమిలో “ధృతరాష్ట్ర మహారాజా! భరతవర్షంలో ఉత్తర దిక్కులో ఉన్న ప్రదేశాల్లో ఉత్తరోత్తరంగా శాక్తి, సామర్థ్యం, ఆరోగ్యం, ఆయువు, సౌఖ్యం, పుణ్య కార్య నిర్వహణలు ఎక్కువగా కనిపిస్తాయి” అని చెప్పాడు.
సంజయుడు చెప్పింది విని, ధృతరాష్ట్రుడు తనకు సమస్త ద్వీపాల విస్తీర్ణాలు, సమస్త సాగరాలూ వరుస క్రమంలో చెప్పమని సంజయుణ్ని అడిగాడు. సంజయుడు ధృతరాష్ట్రుడితో “జంబూద్వీప విస్తీర్ణము ఎనభైవేల ఆరునూరు యోజనాలు. దీనికి రెండింతలు లవణ, ఇక్షు, సుర, ఘృత, దధి, క్షీర, మంచినీటి జలాలతో నిండిన మహాసముద్రాల వైశాల్యాలు. జంబూద్వీప వైశాల్యానికి ఒకదానికొకటి రెండింతలుగా పక్షద్వీప, శాల్మలద్వీప, క్రౌంచద్వీప, కుశద్వీప, శాకద్వీప, పుష్కరద్వీప, వైశాల్యాలు ఉంటాయి.
ఈ ఆరు ద్వీపాలు జంబూ ద్వీపం కంటే అన్నింటిలోను పొగడబడుతూ, అనేక పర్వతాలతో, నానానదులతో, బహుజనపదాలతో కలిసి వరుసగా ఒకదానికంటే ఒకటి గుణవిశేషంలో అధికంగా ఉంటాయి. వీటన్నింటికీ కర్తయై, భర్తయై, క్షీర సాగరానికి ఉత్తరంలో కనకమయమైన ఎనిమిది చక్రాలతో, పెక్కు భూతాలతో ఉన్న మనోజ్ఞమైన మహనీయ శకటం మీద నారాయణుడు వైకుంఠవాసుడై ‘వైకుంఠుడు’ అనే పేరుతో విహరిస్తుంటాడు” అని చెప్పాడు.
అది విని ధృతరాష్ట్రుడు “భరతవర్షం అనే భూభాగం కోసమే కదా కౌరవులు, పాండవులు ఒకరితో ఒకరు పోరాడి వినాశనానికి పాల్పడ్డారు. ఇట్టి లోభ బుద్ధి కలవాళ్లు ఎక్కడైనా ఉన్నారా?” అని ధృతరాష్ట్రుడు బాధపడ్డాడు.
ధృతరాష్ట్రుడి మాటలు విని సంజయుడు “మహారాజా! పాండవులకి అత్యాశ లేదు. నీ కొడుకు దుర్యోధనుడు సహజంగా లోభి. పైపెచ్చు శకుని చెప్పుడు మాటలు విని, చెడ్డదారిని పట్టి ఇటువంటి ఆపదని తెచ్చుకున్నాడు. కొందరు రాజులు తమ తమ రాజ్యాలు సంరక్షించుకోవాలనే స్వార్థబుద్ధితో మీ మీద పరిపూర్ణ స్నేహం ఉన్నట్టుగా పైకి నటిస్తూ మీ పక్షంలో వచ్చి చేరి, పాండవుల్ని గెలవదలిచారు. ఇప్పుడు మీ పక్షంలో చేరిన రాజుల్ని విమర్శించడం న్యాయం కాదు. పూర్వకాలంలో కూడా భూరాజ్య సంపాదన కోసమేకదా.. భగీరథుడు, రఘువు, యయాతి, నహుషుడు మొదలైన మహారాజులు యుద్ధాలు చేసి గొప్ప యశస్సు అభ్యుదయం సాధించగలిగారు.
భారతవర్షంలో రాజ్యకాంక్షతో భోగలాలసతతో ఎందరో రాజులు అనేక యుద్ధాలు చేశారు. వాళ్లకి అంత ఆసక్తి కలిగించిన భరతవర్ష విస్తీర్ణం నీకు వివరిస్తాను. మలయం, శుక్తిమంతం, వింధ్యం, పారియాత్రం, మహేంద్రం, ఋక్షవంతం, సహ్యం అనే ఏడు గొప్ప పర్వతాలు ఈ భరతవర్షంలో కులపర్వతాలుగా ఉన్నాయి. ఈ పర్వత పంక్తులలో ఎన్నో రకాలైన మణులు సంపాదించవచ్చు. ఇంక గనులలో దొరికే లోహాల గురించి వేరే చెప్పనవసరం లేదు కదా!
ఇంకా ఉపపర్వతాలు అనేకం ఉన్నాయి. ధృతరాష్ట్ర మహారాజా! ఈ ఉపపర్వతాలలో ఇనుము, వెండి, రాగి, తగరం, బంగారం కుప్పపోసిన సంపదలా చాలా చోట్ల దొరుకుతాయి. అంతేకాక, కొండలవల్ల అధికమైన ధనం ఆర్జించవచ్చు. నేర్పు, పట్టుదల, న్యాయం అనే గుణాలు ఒకదానితో ఒకటి సంఘంటించుకో గలుగుతే చాలు.
గంగ, తుంగభద్ర, వేత్రవతి, వేదవతి, కృష్ణవేణి, పెన్న, యమున, తమస, శిరావతి, కావేరి, గోదావరి, నర్మద, బహుదా, సరయువు, శతద్రువు, వితస్త, విపాశ, తామ్రపర్ణి అనే పేరుగల మహానదులు, మరికొన్ని చిరుప్రవాహలు ఈ పర్వతాలనుంచి పుడుతున్నాయి. వీటి వల్ల అనేక రకాల ధనాలు, ధాన్యాలు సంపదలు లభిస్తాయి. ఈ నదులేకాక, అక్కడక్కడ ఎన్నో అడవులూ ఉంటాయి. ఆ అడవులనుంచి ధనం ఆర్జించే ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. అయితే రాజులు సామంతో కూడిన శక్తిసామర్థ్యాలు ప్రయోగించాలి.
పాంచాల, బర్బర, వత్స, మత్స్య, మగధ, మళయాళ, కళింగ, కుకురు, కోంకణ, టేంకణ, త్రిగర్త, సాముద్ర, సాళ్వ, శూరసేన, సుదేష్ణ, సుహ్మ, కురు, కరూశ, కాశ, కోసల, యవన, యుగంధర, ఆంధ్ర, సింధు, చేది, చోళ, పుళింద, పుండ్ర, పాండ్య, ఆభీర, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, విదేహ, విదర్భ, ద్రవిళ, దశార్ణ, కర్ణాట, గౌళ, అంగ, వంగ, వరాట, లాట, బాహ్లిక, బహుదాన, కిరాత, కేకయ, ఆశ్మంత, కాశ్మీర, గాంధార, కాంభోజ, కేరళ, మాళవ, నేపాళ, ఘూర్జర, కుంతల, అవంతి, కామరూపం మొదలైన భారత వర్షాలలోని జనపదాలు. అవి అనేక సంపదలకి ఆలవాలాలు. పురుషార్థాలలో ధర్మం, అర్థం, కామం అనుష్ఠానానికి పేరెన్నిక గన్నవి, అందమైనవి.
రాజు అన్ని విషయాలు విని తెలుసుకోవాలి. ప్రజల్ని రక్షించాలి. కేవలం న్యాయమే కాదు, ఆ న్యాయాన్ని కరుణతో రంగరించి రాబడుల్ని స్వీకరిస్తూ పరిపాలించాలి. ఆ విధంగా పేరుకెక్కిన రాజుకి భూమి కామధేనువుగా వర్థిల్లుతుంది. శక్తిసామర్థ్యాలు, ఉపాయం కల రాజులు తమకి ఎంతో విశాలమైన రాజ్యం ఉన్నా కూడా తృప్తి చెందక, తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు అనే విచక్షణ లేకుండా యుద్ధం చేసి భూమిని వారినుంచి బలవంతంగా లాక్కుంటారు.
మహారాజా! పూర్వకాలం నుంచీ రాజులు భూమికోసం పొరాడుతూనే ఉన్నారు కదా! ఇప్పుడు కౌరవులతో పాండవులు భూరాజ్యం కోసం పోరాడటం వెనుకటి నుంచీ నడుస్తున్నదే కాని, కొత్త తప్పు కాదు. దైవం ఏ వైపు అనుకూలిస్తుందో అటువాళ్లు యుద్ధంలో విజయం పొందగలరు. నువ్వు దుఃఖించాల్సిన పని ఏమీలేదు” అన్నాడు.
