Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-171: ధర్మరాజుకి ఉత్సాహం కలిగించిన అర్జునుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ధర్మరాజుకి ఉత్సాహం కలిగించిన అర్జునుడు

“అర్జునుడు ధర్మరాజు మాటలు విని చిరునవ్వుతో ఎక్కువగా మాట్లాడ్డం ఇష్టంలేక సమయానికి తగినట్లు మాట్లాడాడు. ‘ధర్మరాజా! ఇంతకు ముందు మునులలో గొప్పవాడైన నారదమహర్షి ఒకసారి నాతో ధర్మాన్ని నాశనం చేసేవాళ్లకి పెద్ద సైన్యం ఉండవచ్చును గాని, యుద్ధంలో చిన్నసేన ఉన్నా వాళ్లని శత్రువులే గెలుస్తారు. అది అలా ఉండనీ, అమానుష శక్తిసంపన్నుడయిన భీముడి గదా విహారం శత్రువులు సహించలేరు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలైన పాంచాల వర్గం అడ్డులేని పరాక్రమం కలిగి ఉంది. విరాటుడు, శంఖుడు మొదలైన మత్స్యదేశ సేనా సమూహం శత్రువులకి భయంకరమైంది.

సాత్యకి, చేకితానుడు మొదలైన యాదవుల బలగం నీకు జయం గలిగిస్తుంది. అభిమన్యుడు, ఘటోత్కచుడు మొదలైన కొడుకుల గుంపు లోకంలో కనిపించని అసాధారణమైన పరాక్రమం కలిగినది. నీ దయా వీక్షణం, కృష్ణుడు రక్షణ ఉంది. గాండీవం అనే పాముకి రెక్కలు వచ్చినట్లు ఉంది. అంతేకాదు, ఏనుగులా నీ శక్తి నీకు తెలియదు. నువ్వు దేవతలకి కూడా జయించడానికి వీలుకాని వాడివి. నువ్వు కోపగిస్తే ఎవరెట్లా అవుతారో నువ్వే చూడు’ అన్నాడు.

అర్జునుడి చెప్పింది విని ధర్మరాజు ‘కౌరవసేనాపతి భీష్ముడు ‘నర’ వ్యూహం పన్నాడు. దాన్ని దేవతలు కూడా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ధర్మరాజు అర్జునుడితో ‘కౌరవుల వ్యూహానికి అనురూపమైన గొప్ప వ్యూహాన్ని పన్నాలి’ అని కోరాడు.

అర్జునుడు పాండవ సేనాధిపతి అయిన దృష్టద్యుమ్నుడు పిలిచి ‘అచల’ వ్యూహం పన్నమని ఆదేశించాడు. పాండవసేనాపతి అయిన ధృష్టద్యుమ్నుడు తన సేనలలో నలువైపుల తిరిగి, అచల వ్యూహం అమర్చాడు. ఆ అచలవ్యూహంలో మునుముందు తాను అభిమన్యుడు మొదలైన పాండవకుమారులు, నకులసహదేవులు నిలబడ్డారు. అక్కడే, తనకు బాసటగా భీమసేనుడు నిలిచాడు.

ఉత్తరంవైపు, దక్షిణం వైపు తమ బలాలకి, చుట్టాలకి బలం చేకూరుస్తూ విరాటుడు – ద్రుపదుడూ –నిలిచారు. వ్యూహం మధ్యభాగంలో, జంగమ పర్వతాల్లో కనిపించే ఏనుగుల గుంపు మధ్య ధర్మరాజు రథం మీద ఉన్నాడు. ఛత్రచామరాలతో బ్రాహ్మణులు ఆశీర్వదించారు. ధర్మరాజు వాళ్లకి వస్త్రాలు, బంగారు కాసులూ బహూకరించాడు. ముందు అర్జునుడితో కాపాడబడుతూ శిఖండి, అటు కౌరవసేనలో భీష్ముడికి ఎదురుబొదురుగా నిలబడ్డాడు.

వెనుక భాగంలో మగధ దేశానికి చెందిన సహదేవుడు, దృష్టకేతుడూ పరాక్రమగర్వంతో నిలిచారు. ఆ విధంగా అందంగాను, భయంకరంగాను పాండవుల సైన్యం విలసిల్లింది. పాండవుల సైన్యం సముద్రంలా కనిపిస్తోంది. రథాలు దీవులుగా, ఎత్తైన ఏనుగులు కొండలుగా, గుర్రాలు కెరటాలుగా భటుల సమూహం భయంకరమైన జంతువుల్లా కనిపిస్తున్నాయి.

అర్జునుడు రథం మీద వెలిగే కోతి జెండా, రెండు సేనల్లో ఉండే జెండాలన్నింటినీ మించి, దుర్యోధనుడి సేనలకి భయం కలిగిస్తూ దేదీప్యమానంగా ప్రకాశించింది. పాండవసైన్యంలోను, కౌరవసైన్యంలోను ఉన్న దండనాయకులు ఎర్రని, తెల్లని, నల్లని కవచాలు ధరించి ఆవులమధ్య ఉన్న ఆబోతుల్లా అతిశయించిన గొప్పమాటలు ఆకాశమంతా వ్యాపించాయి.

కొన్ని ప్రదేశాల్లో సేనలు కౌరవ పక్షంలో చేరాయి. కొన్ని ప్రదేశాల్లో సేనలు పాండవ పక్షంలో చేరాయి. కొన్ని ప్రదేశాల్లో సేనలు వాళ్లల్లో వాళ్లకి కలిగిన అసూయవల్ల చీలిపోయి, ఒక చీలిక కౌరవ పక్షంలోను, మరొక చీలిక పాండవ పక్షంలోనూ చేరాయి. కాబట్టి, చిన్నపిల్లలు, ముసలివాళ్లు తప్ప మగవాళ్లు అందరూ విజయశ్రీని కాంక్షిస్తూ నేల పిగిలినట్టుగా, ఈనినట్టుగా ఒక చోటికి సేనలు చేరాయి” అన్నాడు.

సంజయుడు చెప్పేది పూర్తికాకుండానే ధృతరాష్ట్రుడు మళ్లీ ప్రశ్నించాడు. “సంజయా! ఆ సమయంలో పాండవుల సైన్యం, కౌరవుల సైన్యంలో ఏది ఎక్కువ ఉత్సాహంతో ఓలలాడుతున్నారు?” అని.

ధృతరాష్ట్రుడి ప్రశ్నకి బదులిస్తూ సంజయుడు “ధృతరాష్ట్రా! ఆ సమయంలో కౌరవులు, పాండవులు ఒకళ్లకంటే మరొకళ్లు పరాక్రమంతో ప్రకాశిస్తూ పరస్పరం ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారు. కౌరవుల సేనని, పాండవుల సేనని చూసినప్పుడు నాకు పాండవుల సేన బలవత్తరంగా అనిపించింది. ఎందుకంటే పాండవసేనలో నరనారాయణులు ఉన్నారు. నీ కొడుకు దుర్యోధనుడు యుద్ధాన్ని చేసే తెగువ వదలక అత్యంత వైభవంతో వెలిగాడు. పాండవులు, శ్రీకృష్ణుడూ వినోదానికి వచ్చినట్లు సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం అనే శంఖాల్ని పూరించారు.

శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం శంఖారావం, అర్జునుడు పూరించిన శంఖారావ నాదాలు విని పాండవసేనలు ఉప్పొంగిపోయారు. కౌరవసేనలు భయపడ్డారు. కౌరవ వ్యూహం మీద నెత్తురు వాన పడింది. ఇంకా ఎన్నో చెడ్డ శకునాలు కనిపించాయి.

ఎందుకు కనిపించవు? అపజయం రాక తప్పుతుందా? భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు పాండవులే గెలుస్తారు అని అనుకుంటూనే యుద్ధానికి తరలి వెళ్లారు. దానికేమిగాని కౌరవులు మాత్రం భయపడకుండా ఆ దుశ్శకునాలకి జంకకుండా యుద్ధవాద్యాలు మోగించేందుకు ఆజ్ఞ ఇచ్చారు.

ఆ సమయంలో పోరాటం అనే ఆటకి కౌరవ, పాండవ సేనలు ఉత్సాహంతో ముందుకొచ్చాయి. ఆ రెండు సేనలు ఎలా ఉన్నాయంటే తన అసలు రూపాన్ని వదిలిపెట్టి ప్రళయకాలంలో భయంకరంగా మారిపోయిన రెండు మహాసముద్రాల్లా కనిపించాయి. ఆ తరువాత కౌరవ పాండవ పక్షాల్లో వాళ్లు ‘యుద్ధం చేస్తూనే, అవసరానికి తగిన మాటలు మాట్లాడుతున్న శత్రువు మీద సందు చూసుకుని ఆయుధ ప్రయోగం చెయ్యకూడదు. యుద్ధం చేసేటప్పుడు కింద పడిపోయినవాడి జోలికి వెళ్లకూడదు. చేతిలో ఉన్న కత్తి జారి నేలమీద పడినప్పుడూ, భుజబలం తగ్గిపోయి యుద్ధం నుంచి తప్పుకున్న శత్రువుని చంపకూడదు. పిరికితనంతో యుద్ధం వదిలిపెట్టి పారిపోయేవాళ్లని, భయపడిన వాళ్లని ఎటువంటి శత్రువునైనా సంహరించకూడదు’ అని ఆ సమయంలో శపథం చేశారు.

రంగురంగులతో శోభిల్లుతున్న ఆ రెండు సేనలు సాటిలేని సమాన ధైర్యాలతో ఒకదానికి మరొకటి ఎదురుగా నిలబడినప్పుడు చిగురాకులతో, పువ్వులతో విలసిల్లే తోటలా నిశ్చలంగా ప్రకాశించాయి. ఆ సమయంలో దేవతలు, ఆకాశంలో సంచరించేవాళ్లు, కురుక్షేత్రంలో జరిగే మహాసంగ్రామాన్ని చూడాలని వేడుకతో తహతహలాడుతుండగా.. రెండు పక్షాల్లో ఉండే యోధులు యుద్ధాన్ని ప్రారంభించాలని ఉత్సాహపడుతున్నారు.

పాదచారిగా భీష్ముడి దగ్గరికి వెళ్లిన ధర్మరాజు

అజాతశత్రువుగా పేరు పొందిన ధర్మరాజు చిట్టచివరికి యుద్ధం చెయ్యడాని సిద్ధపడి కురుక్షేత్రానికి వచ్చాడు. ధర్మరాజు ఉన్నట్లుండి కవచం తీసేసి, ఆయుధాలతోపాటు రథం మీద పెట్టి, తాను రథం దిగి, మౌనంగా నమస్కారం చేసి భీష్ముడు ఉన్న చోటికి బయలుదేరాడు. అతడు వెళ్లడం చూసి అతడి తమ్ముళ్లు, శ్రీకృష్ణుడు, సాత్యకి, అతడికి ఎంతో దగ్గర స్నేహితులైన రాజులు, అతడి మనస్సులో ఏముందో తెలియక కంగారు పడ్డారు.

వాళ్లు కూడా వాహనాలు దిగి ధర్మరాజుని అనుసరించారు. ధర్మరాజుతో భీముడు ‘అన్నయ్యా! మేమందరం ఉండగా నువ్వు ఒంటరిగా నడిచి ఎక్కడికి, ఎందుకు వెడుతున్నావు?’ అన్నాడు. అర్జునుడు ‘శత్రువుల్ని ఎదిరించడానికి, ఓడించడానికి మనం ఎన్నో వ్యూహాలు పన్నాము. వాటినన్నింటినీ వదిలిపెట్టి, నువ్వు ఎక్కడికి ఎందుకు వెడుతున్నావు?’ అన్నాడు.

నకులుడు ‘శత్రువులు భయపడకుండా, దైన్యంగా బలహీనుడిలా ఎందుకు నడిచి వెడుతున్నట్లు?’ అన్నాడు. సహదేవుడు ‘ఉత్సాహంతో ఉరుకలెత్తుతూ యుద్ధం చెయ్యవలసిన సమయంలో ఎందుకు తగ్గినట్లు కనిపించేలా వెళ్లడం?’ అని ప్రశ్నించాడు. వాళ్లలా ప్రశ్నిస్తుంటే ధర్మరాజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెడుతూనే ఉన్నాడు.

వాళ్లతో శ్రీకృష్ణుడు నవ్వుతూ ‘ధర్మరాజు అభిప్రాయం నేను పసికట్టాను. ఇతడు భీష్ముడికీ, ద్రోణుడికీ, కృపుడికీ, శల్యుడికీ నమస్కారం చేసి యుద్ధం చెయ్యడానికి ముందు పెద్దలూ, పూజ్యులూ అయిన వాళ్ల అనుమతి పొందాలని వెడుతున్నాడు. పెద్దల ఆశీస్సులవల్ల విజయం కలుగుతుందని పెద్దలు చెప్పారు’ అన్నాడు.

అది విని అజాతశత్రువైన ధర్మరాజు వెంట వెడుతున్న వాళ్లు మౌనంగా చిత్రపటంలో బొమ్మల్లా ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డారు. కృష్ణుడు, అర్జునుడు, భీముడు, నకులసహదేవులు అనుసరించి తన వెనుక రాగా కుంతి పెద్ద కొడుకు ధర్మరాజు భీష్ముడి రథం దగ్గరికి చేరుకునేటప్పుడు కౌరవసేనలో వాళ్లు తల ఎత్తి చూశారు. అప్పుడు ఆ కౌరవ సేనలోనుంచి వినిపించిన మాటలు ‘అయ్యో ధర్మరాజు ఎందుకు ఇంత భయపడుతున్నాడు? అసలు భయపడడానికి మూలకారణం ఏమిటి? భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, అభిమన్యుడు, ద్రుపదుడు, విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి వంటి ఎందరో వీరులు తన పక్షంలో ఉండగా ధర్మరాజుకి ఈ పిరికితనం ఎందుకు? ధర్మరాజు పిరికివాడు కాదు. అతడు రావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. అసలు అతడి మనసులో ఏముందో’ అని రకరకాలుగా మాట్లాడుతున్నారు.

పాండవసేనలో ‘అతడు అభిమానవంతుడు. అతడు భీష్ముడితో ఏం మాట్లాడుతాడో.. భీష్ముడు ధర్మరాజుని ఏ విధంగా మన్నిస్తాడో.. చూడాలి. శ్రీకృష్ణుడు ఏమంటాడో? అర్జునుడు ఏమంటాడో? నకులసహదేవులు ఎలా మాట్లాడతారో? వీళ్లందరూ ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటో?’ ఇలా ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటున్నారు.

ధర్మరాజు గొప్ప సన్నాహలతో చక్కగా చిక్కగా అమర్చబడిన కౌరవ వ్యూహాన్ని చేరుకుని పితామహుడైన భీష్ముడి దగ్గరికి వెళ్లి, అతడి పాదాలకి నమస్కారం చేశాడు. తరువాత ‘పుణ్యపురుషుడవైన భీష్మపితామహా! నువ్వు అన్ని విధాలా పెద్దవాడవు, పూజించతగ్గవాడివి. దురదృష్టవశాన నిన్ను యుద్ధంలో ఎదిరించవలసిన అవసరం మాకు ఏర్పడింది. అయితే ముందుగా నీ అనుమతిని తీసుకుని, నీ దీవెనలు పొందిన తరువాత యుద్ధం చెయ్యాలని నేను నీ దగ్గరికి రెండు చేతులూ జోడించి వచ్చాను. నీ ఆశీర్వాదం లభిస్తే నేను శత్రువుల్ని జయించగలను’ అన్నాడు.

ధర్మరాజు మాటలు విని భీష్ముడు ‘ధర్మరాజా! నువ్వు రావడం మంచిదయింది. నువ్వు ఇలా రాకపోయి ఉంటే నాకు నీ మీద కోపం వచ్చి ఉండేది. నిన్ను శపించి ఉండేవాడిని. నువ్వు శత్రువుల్ని జయిస్తావు. నీకు నా ఆశీస్సులు. అంతేకాదు, నీకు నేను ఒక వరం ఇవ్వదలిచాను, కోరుకో! నువ్వు నన్ను నీవైపు యుద్ధం చెయ్యమని అడగడం తప్పు. ఇంకేది కోరుకున్నా నీ మాట చెల్లిస్తాను’ అన్నాడు.

ఆ మాటలు విని ధర్మరాజు ‘భీష్మపితామహా! నువ్వు రారాజైన దుర్యోధనుడి వైపే యుద్ధం చెయ్యి. నీ మనస్సులో మాత్రం నాకు మంచి జరగాలని కోరుకో’ అన్నాడు. భీష్ముడు ‘అలాగే’ అన్నాడు. తరువాత ‘అసలు నీ మనస్సులో ఉన్నమాట విప్పి చెప్పు!’ అని అడిగాడు.

ధర్మరాజు ‘మహానుభావా! నిన్ను యుద్ధంలో మేము గెలిచే ఉపాయం చెప్పు!’ అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు చిరునవ్వు నవ్వుతూ ‘నన్ను జయించడం ఆ దేవతలకి కూడా సాధ్యం కాదు. ఇంక మనుషుల మాట చెప్పడం ఎందుకు?’ అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ‘అందుకే కదా నిన్ను ఇలా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు.

ధర్మరాజు మాటలు విని భీష్ముడు దయతో ‘బంధుత్వంతో నా మనస్సులో ప్రవేశించి, నా హృదయాన్ని కరిగించి ప్రార్థిస్తే నా శక్తి సామర్థ్యాలు విడిచిపెట్టి ఘోర యుద్ధం మీద పట్టు సడలించి, నేను పట్టిన ఆయుధం పక్కన పెట్టేస్తే తప్ప, నన్ను ఎవరూ చంపలేరు. నాతో అది ఇది అని వాదానికి దిగవద్దు. ప్రస్తుతానికి మారు మాట్లాడకుండా వెళ్లిపో. నన్ను జయించే ఉపాయం చెప్పడానికి ఇది తగిన సమయం కాదు’ అన్నాడు.”

Exit mobile version