Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-172: గురు, కృప, శల్యులతో యుద్ధానికి అనుజ్ఞ తీసుకున్న ధర్మరాజు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

గురు, కృప, శల్యులతో యుద్ధానికి అనుజ్ఞ తీసుకున్న ధర్మరాజు

భీష్ముడు ధర్మరాజుతో ‘ధర్మరాజా! నువ్వు నన్ను మళ్లీ కలుసుకో’ అని చెప్పాడు. ధర్మరాజు సంతోషంతో ఆయన మాట శిరసావహించి తాతగారైన భీష్ముడి దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు. తనతోపాటు శ్రీకృష్ణుడూ, అర్జునుడూ అనుసరిస్తుంటే ధర్మరాజు ముందుకి వెళ్లి ద్రోణుడూ, కృపుడూ, శల్యుడూ ఉన్న చోట్లకి వెళ్లి వాళ్ల పాదాలకి నమస్కారం చేసి తాను వాళ్లతో యుద్ధం చెయ్యడానికి అనుమతి ప్రసాదించమని అర్థించాడు.

తనకి విజయం కలగాలని ఆశీర్వదించమని ప్రార్థించాడు. అప్పుడు ద్రోణుడు ‘ధర్మరాజా! నీకు భగవంతుడైన శ్రీకృష్ణుడే మంత్రిగా ఉన్నాడు. ఇంకొకరి దీవెనలు నీకెందుకు? ధర్మం ఎక్కడ ఉంటుందో.. అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో.. అక్కడే విజయం సిద్ధిస్తుంది’ అన్నాడు.

ధర్మరాజు ద్రోణుడితో మిమ్మల్ని చంపడం ఎలాగో చెప్పమన్నాడు. ద్రోణుడు ధర్మరాజుతో ‘నా చేతిలో ఆయుధం ఉన్నంతవరకు నన్ను ఎవరూ చంపలేరు. నేను నా ఉపవాస వ్రతం స్వీకరించి శస్త్రాల్ని విసర్జిస్తే, అప్పుడు నన్ను చంపవచ్చు. ఎంతో నమ్మదగినవాడు, నా గుండె భరించలేని కీడు మాట వినిపిస్తే నేను శస్త్ర సన్యాసం చేస్తాను. ఆ సమయంలో నన్ను సంహరించవచ్చు’ అన్నాడు.

తరువాత ధర్మరాజు కృపాచార్యుణ్ని సమీపించి ఆయన్ని ఎలా సంహరించడానికి వీలవుతుందో చెప్పమన్నాడు. కృపాచార్యుడు తనని ఎవరూ చంపలేరనీ, అయితే యుద్ధంలో ధర్మరాజు గెలవాలని దీవిస్తున్నానని చెప్పాడు.

తరువాత ధర్మరాజు శల్యుడితో ‘మామా! నువ్వు రాధేయుడైన కర్ణుడి రథసారథివి కావచ్చు. అప్పుడు అతడి తేజస్సు తగ్గిపోయేలా చూడు’ అని ప్రార్థించాడు. శల్యుడు ధర్మరాజుతో ‘నేను నువ్వు యుద్ధ సన్నాహాలు చేసేటప్పుడే నీకు వాగ్దానం చేశాను కదా! ఆ విధంగానే చేస్తాను’ అన్నాడు. ఇలా అందరి దగ్గర సెలవు తీసుకుని ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి తిరిగి వెళ్లిపోయాడు. ఆ సమయంలో సేనల గురించి తెలుసుకోవాలని కర్ణుడు సేనల దగ్గరికి వచ్చాడు.

శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్లి తగిన మర్యాదగా పలకరించి ‘కర్ణా! భీష్ముడిమీద కోపంతో నువ్వు యుద్ధంలో పాల్గోడం లేదని తెలిసింది. అయితే భీష్ముడు మరణించే వరకు నువ్వు సరదాగా పాండవ పక్షంలో చేరి యుద్ధం చెయ్యచ్చు కదా! భీష్ముడి మీద నువ్వు పగ తీర్చుకునేందుకు ఇది మంచి అవకాశం’ అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు శ్రీకృష్ణుడితో ‘నాకు ఏదో కోపం వచ్చి భీష్ముడి నాయకత్వంలో, అతడు యుద్ధం చేసేటప్పుడు నేను యుద్ధం చేయనని శపథం చేశాను. అంతేకాని రారాజు అయిన దుర్యోధనుడికి ఏనాడో నా ప్రాణం సమర్పించుకున్నాను. ఇంక వేరే పక్షంలొ చేరను. చేరే ప్రసక్తి లేదు. చేరడం న్యాయం కాదు’ అన్నాడు.

కర్ణుడు మాటలు విని శ్రీకృష్ణుడు అతడి స్వామి భక్తికి సంతోషించి పాండవుల దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు కౌరవసేన నుంచి తిరిగి వచ్చి తన సేనవైపు చూసి పెద్ద గొంతుతో ‘ఎవరైనా కౌరవ సేననుంచి పాండవ సేనలోకి వచ్చి చేరితే వాళ్లకి నా హృదయపుర్వకమైన స్వాగతం. వాళ్లని నేను నా తమ్ముళ్లతో సమానంగా చూస్తానని వాగ్దానం చేస్తున్నాను’ అన్నాడు.

ధర్మరాజు ప్రకటన విని, నీ కొడుకు యుయుత్సుడు “నేను వస్తాను. నన్ను మీ పక్షంలో చేర్చుకోండి’ అన్నాడు. దానికి ధర్మరాజు సంతోషించి మంచి మాటలతో అతడికి స్వాగతం చెప్పాడు. యుయుత్సుడు దుర్యోధనుడు మొదలైనవాళ్లు చేసిన చెడ్డపనుల్ని చెప్తూ, పాండవుల మంచి గుణాలు కిర్తిస్తూ తన సేనలతో పాటు పాండవ పక్షంలో చేరిపోయాడు. అప్పుడు అనేక వాద్యాలు మోగాయి.

సవతి బిడ్డలు సామరస్యంగా కలిసి మెలిసి ఉండలేరు కదా?! అది అలా ఉంచు యుయుత్సుడు తన పక్షంలో చేరినందుకు సంతోషించి అతడికి ఎన్నో మర్యాదలు చేసి ధర్మరాజు అతడిని ఆదరించాడు. ధర్మరాజు రథం ఎక్కి కవచం ధరించాడు. అప్పుడు ఆ గొప్పసేనలో మంగళవాద్యలు మోగాయి. అతడు సంతోషంతో కవచం తొడిగి, అమ్ముల పొదులు తాల్చాడు. ధర్మరాజు తమ్ముళ్లు, మిగిలినవాళ్లు తమ రథాలని ఎక్కి తమ స్థానాలకి వెళ్లిపోయారు. పాండవుల వ్యూహం ముందులాగే సన్నద్ధమయింది.

రెండు వైపుల పక్షాల్లో ఉన్న సైనికులు ఇంతకు ముందు పాండవులు పడిన పాట్లు తల్చుకుని బాధపడుతూ సంధి కోసం చేసిన ప్రయత్నాలు తల్చుకుని పాండవులని ప్రశంసించారు. ఇప్పుడు పాండవుల శత్రుపక్షంలో ఉన్న పెద్దలు భీష్మ, ద్రోణ, కృప, శలుల యందు చూపించిన పూజ్య భావాన్ని వర్ణిస్తూ ప్రేమని వెదజల్లారు” అని సంజయుడు చెప్పాడు.

అది విని ధృతరాష్ట్రుడు “సంజయా! మన సేనలు, పాండవుల సేనలు ధర్మక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన కురుక్షేత్రం చేరుకుని యుద్ధానికి సంసిద్ధమయ్యాక ఇంకా ఏం చేశాయో వివరంగా చెప్పు!” అన్నాడు.

సంజయుడు ధృతరాష్ట్రుడితో “పాండవుల వ్యూహాన్ని చూసి దుర్యోధనుడు గురువైన ద్రోణుడి దగ్గరికి వెళ్లాడు. ‘ద్రోణాచార్యా! గురుదేవా! నీ శిష్యుడైన ధృష్టద్యుమ్నుడు – ద్రుపదమహారాజు కొడుకు, పన్నిన వ్యూహం – పాండవ సేనా విన్యాసం చూడు. ఎంత గొప్పగా, బలంగా శోభిల్లుతోందో, ఆ సేనలో వీరులు శక్తిసామర్థ్యాలు కలవాళ్లు. భీముడికీ, అర్జునుడికీ దీటైనవాళ్లు. సాత్యకీ, విరాటుడూ, ద్రుపదుడూ, ధృష్టకేతుడూ, చేకితానుడూ, కాశీరాజు పురుజిత్తు, కుంతిభోజుడూ, శైబ్యుడూ, యుధామన్యుడూ, ఉత్తమౌజుడూ, అభిమన్యుడూ, ఉపపాండవులూ, శక్తిసామర్థ్యాలు కలిగిన రథికులూ, భీముడితో కాపాడబడుతున్న ఈ సేన మిక్కిలి బలం కలిగినదిగా కనిపిస్తోంది.

మన పక్షంలో సేనానాయకుల్ని చెప్తాను. నిన్ను, భీష్ముణ్ని గురించి వేరే చెప్పక్కర్లేదు కదా! కృపుడు, అశ్వత్థామ, శల్యుడు, వికర్ణుడు భూరిశ్రవుడు ఇంకా ఎందరో రథికులు ఉన్నారు. వీళ్లందరూ అస్త్రనిపుణులు, అనేక యుద్ధాల్లో ఆరితేరి ఉన్నారు. నా కోసం ప్రాణాలు త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా సమకూడి భీష్ముడి నాయకత్వంలో చాలా బలంగా కనిపిస్తోంది. మీరందరూ కలిసి భీష్ముడికి రక్షణ కల్పించాలి’ అని చెప్పాడు. అది విని ద్రోణుడు ‘సరే నువ్వు ఇంతగా నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు’ అన్నాడు. అది విని భీష్ముడు సంతోషంతో సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు ‘పాంచజన్యం’ అనే తన శంఖాన్ని ఊదాడు. అర్జునుడు ‘దేవదత్తం’ పూరించాడు. ధర్మరాజు ‘అనంతవిజయం’ అనే శంఖాన్ని పూరించాడు. అలాగే భీముడు ‘పౌండ్రం’, నకులసహదేవులు ‘సుఘోషం’, ‘మణిపుష్పకం’ ఊదారు. ద్రుపదుడు, విరాటుడు, సాత్యకీ, ధృష్టద్యుమ్నుడూ, శిఖండీ మొదలైన రథికులు తమతమ శంఖాలు ఊదారు.

ధృతరాష్ట్రమహారాజా! శ్రీకృష్ణుడూ, పాండవులూ పూరించిన శంఖాలధ్వని, కౌరవుల గుండెల్ని చీల్చి, పాండవుల సేనల మనస్సుని సంతోష పరిచాయి. తరువాత ఆయుధాలు ప్రయోగించి యుద్ధం చేయవలసిన సమయం దగ్గరపడడం వల్ల అర్జునుడు తన విల్లు గాండీవాన్ని తీసుకున్నాడు. అల్లెతాటిని మోగించి బాణాల్ని చేతిలో పెట్టుకుని కౌరవులయిన దుర్యోధనుడు మొదలైన వాళ్లని చూసి శ్రీకృష్ణుడితో ‘శ్రీకృష్ణా! ఇప్పుడు నేను కౌరవసేనలో ఎవరితో యుద్ధం చెయ్యాలో నిర్ణయించుకోవాలి. నాకు రెండు సేనలు కనిపించేటట్లుగా మధ్యలోకి తీసుకుని వెళ్లి రథాన్ని అక్కడ ఆపు’ అన్నాడు.

బంధుజనాల్ని సంహరించడానికి బాధపడిన అర్జునుడు

అర్జునుడు చెప్పినట్లు శ్రీకృష్ణుడు రథాన్ని భీష్ముడు, ద్రోణుడు చూస్తుండగా రెండు సేనలమధ్య ఆపాడు. ‘అర్జునా! నువ్వు కోరుకున్నట్లుగా రథాన్ని ఆపాను. కౌరవ వీరులందర్నీ నువ్వు చూడవచ్చు’ అన్నాడు. అర్జునుడు రెండు సేనల్లో ఉన్న సోదరులని, కొడుకులని, బంధువులని, మేనమామల్ని, చూసి ఇలా అన్నాడు ‘శ్రీకృష్ణా! చూశావుకదా! కళ్లు ఉండి కూడా దురాశతో గుడ్డివాడైన దుర్యోధనుడి మూలన ఈ మహాయుద్ధం దాపురించింది’ అని ఇంకా ఇలా అన్నాడు.

‘శ్రీకృష్ణా! యుద్ధభూమిలో పోరాటానికి చేరిన కావలసిన చుట్టాల్ని అందరినీ చూడడం నాకు దుఃఖంగా ఉంది. శరీరం విడిపోయినట్లుతోంది, గగుర్పాటు కలుగుతోంది. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. గాండీవం చేతిలోంచి జారిపోతోంది. ఈ క్రౌర్యానికి నేను ఒడిగట్టలేను. ఇంతమంది చచ్చిపోయాక, ఒంటరిగా ఈ భూమిని పరిపాలిస్తే కలిగే సౌఖ్యాలు ఏపాటివి?

ఎవరిని మెప్పించాలని ఈ భూమిని సమస్త సౌఖ్యాల్ని కోరుకుంటామో, వాళ్లందరూ పోరాటానికి రావడం, ప్రాణాలు, సంపదలు పణంగా పెట్టడం చూస్తున్నావు కదా! తాతల్ని, మామల్ని, కొడుకుల్ని, తండ్రుల్ని, సహోదరుల్నీ, గురువులందరినీ, గొప్పవాళ్లనీ, స్నేహితుల్నీ, నీచమైన స్వార్థపూరితమైన ఆలోచన చేసి సంహరించి, నేను పొందే రాజ్యసౌఖ్యలు – రక్తంతో తడిసినవి. అవి నాకు ఏ సంతోషాన్ని కలిగిస్తాయి? ఎటువంటి కీర్తిని తెచ్చిపెడతాయి? ఎలాంటి అభివృద్ధిని కలిగిస్తాయి?

ఎదుటి పక్షంలో ఉన్న చుట్టాల్ని చంపడం, ఈ పక్షంలో ఉన్న చుట్టాలు చచ్చిపోడానికి అంగీకరించడం – ఇది మంచిది కాదు. దీని వల్ల నాకు ఏ అభివృద్ధీ రాదు. చివరికి మిగిలేది పాపం. యుద్ధమార్గాన్ని నేను అంగీకరించలేను. ఈ భూలోకంలో ఒక భాగమైన కౌరవరాజ్యం కోసమే కాకుండా అన్ని లోకాలు పరిపాలించడానికైనా ఇటువంటి క్రూరమైన పని – ఘోర యుద్ధం చెయ్యలేను. ఒకవేళ శత్రువులు ఏదైనా చేసినా కూడా నాకు తిరిగి ఏమైనా చెయ్యడానికి కూడా మనస్సు అంగీకరించదు.

అయ్యో! దుర్యోధనుడు మొదలైనవాళ్లు తరువాత వచ్చే నష్టం గురించి, వంశనాశం అవుతుందని గుర్తించకుండా, ఈ ఘోర యుద్ధానికి సాహసించి వచ్చారు. వాళ్ల దోషం పూర్తిగా తెలిసిన నువ్వూ, నేనూ ఇటువంటి యుద్ధం చెయ్యడమెందుకు? యుద్ధంచేసి వాళ్లని చంపేసినా ఎటువంటి లాభం కలుగుతుంది? కులనాశనం జరిగితే, కులధర్మాలు నశిస్తాయి. కులధర్మాల్ని నాశనం చేస్తే, దుస్సంకరం (సాంకర్యం) ఏర్పడుతుంది. కులానికి కీడు చేసినవాళ్లు (చచ్చిపోయాక) నరక కూపంలో పడిపోతారు. ఇంత పాపం చెయ్యడానికి ఒడికట్టడమా? రాజ్యం మీద దురాశతో బంధువులందర్నీ చంపెయ్యడానికి సిద్ధమయ్యాము కదా!’ అని అంటూ అర్జునుడు తన చేతిని ఆసరాగా చేసుకుని రథం మీద కూలబడి పోయాడు.

ఇలా దుఃఖంతో కలతపొందిన మనస్సుతో, శోకంతో వశం తప్పి, పరమ కరుణాపురిత హృదయంతో విల్లు, బాణాలూ వదిలి కన్నీళ్లు కారుతుండగా కూర్చుండి పోయిన అర్జునుడిని చూశాడు శ్రీకృష్ణుడు. అతడితో ‘ఇటువంటి ఉండకూడని సమయంలో నీకు ఈ పనికిరాని ఆలోచన ఎలా కలిగింది? అవివేకం కలవాళ్లు ఇలా ఆలోచిస్తారు. ఇలా అలోచించడం నీకు తగినది కాదు. ఈ అవివేకం నిన్ను సరైన మార్గం నుంచి, పవిత్రమైన కీర్తి నుంచి తప్పిస్తుంది’ అన్నాడు.

శ్రీకృష్ణుడు మళ్లీ మాట్లాడుతూ ‘అర్జునా! ఆడవాళ్లు మాట్లాడినట్టు మాట్లాడడం నీకు తగినపని కాదు. మానసిక దారిద్ర్యాన్ని విడిచిపెట్టి ఉత్సాహంతో కర్తవ్య నిర్వహణకి నడుంకట్టు’ అన్నాడు. అర్జునుడు ఇంకా విషాదంలోనే ఉండి రథం మీద కూర్చునే ఉన్నాడు.

పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుడితో ‘అయ్యో! పూజ్యులైన భీష్మ, ద్రోణుల్ని బాణాలతో బాధించవద్దా? నువ్వే చెప్పు. గౌరవించ తగినవాళ్లని చంపడం పరాక్రమం ఉన్న వాళ్లకి న్యాయం కాదు. అంతకంటే భిక్ష అడిగి తెచ్చుకున్న అన్నం తింటే సుఖంగా ఉంటుంది. మొదలుపెట్టి ఎవరిని చంపితే గొప్ప జీవితం అవుతుందో ఆలోచిస్తే.. నాకు అది బతుకే కాదని అనిపిస్తోంది. విను! అలా చంపతగని, ధృతరాష్ట్ర కుమారులే కదా ఈ పన్నిన సేనలో ఉన్నారు? అన్ని ఇంద్రియాల్ని శుష్కింప చేస్తూ వ్యాపించే శోకాగ్ని ఇంద్రపదవి లభించినా చల్లారదు. కనుక, నేను యుద్ధం చెయ్యలేను.

పెద్దల్ని నొప్పించడం మంచిదికాదు. వాళ్లు మనల్ని జయించినా, వాళ్లని మనం జయించినా రెండింటిలోనూ మేలు కలిగేది లేదు. రెండూ దుఃఖాన్ని కలిగించేవే. నేను దీనుణ్ని, నీ శిష్యుణ్ని, జ్ఞానాన్ని పొందాలన్న కోరిక కలవాడిని, ధర్మం తెలియని మూఢుణ్ని. నాకు జ్ఞానోపదేశం చేసి, కర్తవ్యాన్ని తెలియ చెయ్యి’ అన్నాడు.

శ్రీకృష్ణుడు పకపకా నవ్వి ‘అర్జునా! ఏ మాత్రం బాధపడకూడని వాళ్ల కోసం మనస్సు కుంగిపోయేలా ఏడుస్తున్నావు. తెలివి లేని మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావు. జ్ఞానం కలవాళ్లు బతికున్నవాళ్లకోసం, విధివశం వల్ల చచ్చిపోయిన వాళ్లకోసం దుఃఖిస్తారా? మనసు వివేకంతో ప్రకాశించేదయితే దుఃఖాలన్నీ నశిస్తాయి’ అన్నాడు”.

Exit mobile version