Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-173: అర్జునుడికి తత్త్వజ్ఞానం ఉపదేశించిన శ్రీకృష్ణుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

అర్జునుడికి తత్త్వజ్ఞానం ఉపదేశించిన శ్రీకృష్ణుడు

“అర్జునా! మానవదేహం బాల్యం, యౌవనం, వార్థక్యం అనే అవస్థలు పొంది, చిరిగిపోయిన పాత బట్టలు విడిచి కొత్త బట్టలు ధరించినట్లు, ఆత్మ ఒక దేహన్ని విడిచి, మరొక దేహాన్ని పొందుతుంది. దేహాన్ని విడిచిపెట్టడం వల్ల ఆత్మ నశించదు. నశించేది శరీరం మాత్రమే. ఆత్మకి పుట్టుక, చావు అనేవి లేవు.

ఆయుధాలు శరీరానికే తప్ప ఆత్మకి హాని చెయ్యలేవు. ఆత్మ బాధించేవాడూ కాదు, బాధని పొందేవాడూ కాదు. ఆత్మకి అభావం లేదు. ఆత్మ శాశ్వతం, శరీరం నశిస్తుంది. దానికి అస్తిత్వం లేదు” అని శ్రీకృష్ణుడు అనేక విధాలుగా అర్జునుడికి ఆత్మతత్త్వాన్ని గురించి వివరంగా చెప్పాడు.

శ్రీక్రుష్ణుడు అర్జునుడితో మళ్లీ చెప్తూ.. “ఎవరికోసమూ బాధపడవలసిన అవసరం లేదు. అది సహజ పరిణామం అని సరిపెట్టుకోవాలి. ఓ అర్జునా! ఆత్ముడు నశిస్తాడు అనేవాడూ, ఆత్ముడు నశింపచేస్తాడూ అనేవాడూ- ఇద్దరూ వివేకం లేనివాళ్లే. ఆత్మ నశించదు. ఎవరినీ నశింప చేయదు. పురుషుడు, ఆత్మ అంటే నేనే; వేరొకడు కాదు, పురుషోత్తమత్వం అభివ్యక్తం కావడానికి ఆత్మత్వం అనే స్ఫూర్తి అన్ని పనులూ చేయిస్తుంది కదా!” అన్నాడు.

శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోపదేశం చేస్తూ “ఆత్మకి బాధించడమూ లేదు. బాధించబడడమూ లేదు” అని వివరించాడు. అర్జునుడి కోపావేశానికీ, దుఃఖానికీ మూలకారణం అతడి అహంకార మమకారాలే కనుక, వాటిని తొలగించాడు. అర్జునుడు చెయ్యవలసిన పని యుద్ధానికీ తగిన కర్తవ్యనిర్వహణ చెయ్యడం కనుక, దాన్ని వదలకూడదు. అది తెలియచెయ్యడానికి ఎన్నో వాక్యాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు.

శ్రీకృష్ణుడు అర్జునుడితో “క్షత్రియులకి ముఖ్య కర్తవ్యం యుద్ధం. దానివల్ల స్వర్గ లభిస్తుంది. లే! లేచి యుద్ధం చెయ్యి! సందేహించకు. ఫలితం మీద మమకారం విడిచిపెట్టి కర్తవ్యాల్ని నిర్వహించాలి. ఫలితాల్ని, జయాపజయాల్ని భగవదర్పితం చెయ్యాలి. తత్త్వజ్ఞానం లభిస్తే ఇంక కర్మనాశనం దానంతట అదే కలుగుతుంది” అన్నాడు.

శ్రీకృష్ణుడు ఇంకా ఎన్నింటినో దయతో చెప్పి అనేక మార్గాల్ని వివరంగా చెప్పి, అర్జునుడు అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పి, అతడి అనుమానాలనన్నింటినీ పోగొట్టాడు. కర్మలన్నీ ఎంతో కష్టపడి త్రుంచి వెయ్యక్కర్లేదు. పండిపోయిన ఆకులు చెట్టు నుంచి నేల మీద రాలిపోయేట్లుగా, సహజంగా ఎలా విడిపోగలవో ఆ విషయమంతా దయతో అర్జునుడికి శ్రీకృష్ణుడు వివరించాడు.

అర్జునుడు శ్రీకృష్ణుడితో “నువ్వు నాకు అందించిన సందేశం, చేసిన ఉపదేశం మిక్కిలి రహస్యమైనవి. నా మీద నీకు ఎంతో దయ ఉంది కాబట్టి, ఈ ఆత్మజ్ఞానం నాకు కలిగించావు. ఈ ఆధ్యాత్మిక తత్త్వం వినడం వల్ల నాకు కొంత భ్రమ తొలిగింది. యోగీశ్వరులు నీ రూపం చూడాలని తహతహలాడుతూ ఉంటారు. సాటిలేని విభూతితో వెలుగొందే నీ ఆకారం వీలైతే దయచేసి నన్ను కన్నుల పండువుగా దర్శించగలిగేలా చెయ్యి” అన్నాడు.

అర్జునుడితో శ్రీకృష్ణుడు “ఎన్నో రంగురంగులు, ఎన్నో విధాలుగా ఉన్న నా రూపంలో అనేక ఆశ్చర్యకరాలైన తీరుతెన్నులు కనిపిస్తాయి. వెలుగు వెల్లువతో కూడిన నా రూపం చూపిస్తాను చూడు. శత్రుసంహారం చేయగల సామర్థ్యం ఉన్న అర్జునా! విను మనుషులకి సహజంగా ఉండే కళ్లతో నా విశ్వరూపాన్ని వీక్షించే వీలు లేదు. కనుక, నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తాను” అన్నాడు.

శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టిని అనుగ్రహించాడు. యోగీశ్వరుడూ, లక్ష్మీవల్లభుడూ అయిన శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని అర్జునుడు సందర్శించాడు. ఆ విశ్వరూపుడి లోకాతీతమైన తేజస్సు వేయి సూర్యుల వెలుగుని మించిందని చెప్పవచ్చు. అది వర్ణించడానికి వీలుకానిది. ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యం పొంది, రోమాంచంతో పులకించిన శరీరంతో ఆనందంతో పరవశించిపోయి, చేతులు మోడ్చి నమస్కరించాడు.

శ్రీకృష్ణుడి విశ్వరూపం చూసి స్తోత్రం చేసిన అర్జునుడు

“పరమాత్మా! శ్రీకృష్ణా! లోకాతీతమైన నీ శరీరంలో, దేవతలు రాక్షసులు గంధర్వులు మొదలైనవాళ్లూ దివ్యమునులు, బ్రహ్మదేవుడు, చరాచరమైన సర్వ ప్రపంచం నాకు కనిపించింది. మొగాలు, భుజాలు, పాదాలు, ఎన్నో కనిపించాయి. కిరీటాలు మొదలైన ఆభరణాలు; చక్రం గద మొదలైన ఆయుధాలూ; రకరకాల పూలదందలు; వస్త్రాలు కనిపించాయి.

ఆశ్చర్యంలో మునిగి తేలాను. నీ దివ్యదేహానికి మొదలు మధ్య ఏదో, తుది ఏదో నాకు తెలియలేదు. నీ తేజస్సు మితిలేనిది. ఊహకు అతీతం. దేదీప్యమానం, ఎల్లప్పుడు వెలుగొందేది. నాకు చూడడానికి అలవి కాకుండా ఉంది. శ్రీకృష్ణా! నీ ఆకారం ఊహకి అందేది కాదు. ఈ సమస్త సృష్టికీ మూలకారణం నువ్వే అని గ్రహించగలిగాను.

తెలుసుకోగలిగింది నిన్ను మాత్రమే. ఈ భూమి, ఆకాశం దిక్కులు అన్నీ నీ రూపంలో అంతర్భాగాలే.

శ్రీకృష్ణా! సూర్యుడూ, చంద్రుడూ కళ్లుగా కలిగి, నీ ముఖాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. నీ యందు రుద్రులూ, ఆదిత్యులూ, మరుత్తులూ ప్రవేశిస్తున్నారు. గుంపులు గుంపులుగా వచ్చి మహర్షులు నిన్ను కీర్తిస్తున్నారు. వేల్పులు, సిద్ధులు, సాధ్యులు, ఆకాశంలో చరించేవాళ్లు ఆశ్చర్యంతో నిన్ను చూస్తున్నారు. లోకోత్తరమైన నీ విశ్వరూపం చూస్తే నాకు మతిపోతోంది. ధైర్యం సడలింది, భయం వేస్తోంది. ఇటు అటు కదలలేక మెదలలేక బాధపడుతున్నాను. నువ్వు దయతో సౌమ్యుడవై నన్ను అనుగ్రహించి కాపాడు.

శ్రీకృష్ణా! అగ్నిజ్వాలలు నీ ముఖాల్లోంచి వెలువడుతున్నాయి. ఆ వైపున ఉన్న దుర్యోధనుడు మొదలైనవాళ్లే కాకుండా, ఈ వైపున ఉన్న రాజులు కూడా గుంపులు, గుంపులుగా వచ్చి నీ ముఖంలో ప్రవేశించి మగ్గుతున్నారు. నువ్వు ఎవరో అని నేను సందేహిస్తున్నాను. అధిక కరుణ కలిగిన మనస్సు కలవాడవై అసలు నువ్వెవరో నాకు చెప్పవా?” అని ప్రార్థించాడు.

అర్జునుడు అలా చెప్పగానే పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు అతడితో ఇలా అన్నాడు. “నేను లోకాలన్నింటినీ నాశనం చేసే యముణ్ని సుమా! ఇప్పుడు ఈ కురుక్షేత్ర సంగ్రామ రంగంలో ఈ జనసందోహాన్ని సంహరించడానికి ఉద్యుక్తుడనయ్యాను. నువ్వు చంపుతున్నట్లు భ్రమలో పడక్కర్లేదు.

ఈ ద్రోణుడు, భీష్ముడు మొదలైనవాళ్లు అందరూ అవస్యం చావవలసిందే. నేను చంపే వీళ్లని అందరినీ నువ్వు చంపినట్టుగా కనిపించి విజయం గైకొని రాజ్యాన్ని ఏలుకో. నువ్వు నిమిత్తమాత్రుడివి సుమా! లే! ఇంక యుద్ధం చెయ్యి!” అన్నాడు.

ఆ మాటలు విని అర్జునుడు వడవడ వణుకుతూ చేతులు జోడించి, శ్రీకృష్ణుడికి నమస్కారం చేసాడు. డగ్గుత్తికపడ్డ గొంతుతో అర్జునుడు అన్నాడు “తెల్లని తామరపూలవంటి కన్నులు గల శ్రీకృష్ణా! నీరు, గాలి, సూర్యచంద్రులు, అగ్ని మొదలైన తత్త్వాలన్నీ నువ్వే. అన్ని లోకాల్ని నడిపేవాడివి నువ్వే. నువ్వు ఎప్పుడూ ఉండేవాడివి. ఎప్పుడూ పతనం లేని వాడివి.

శ్రీకృష్ణా! పరమాత్మా! నిన్ను తెలియక యదువంశంలో జన్మించిన మానవమాత్రుడిగా, స్నేహితుడిగా, మేనబావగా భావించి, కలిసి తిండి తినడం, వేళాకోళం ఆడడం చేశాను. నన్ను క్షమించు. శ్రీకృష్ణా! నీ యెడ నేను ఎన్నో తప్పులు చేశాను. వాటిని అన్నింటినీ తల్లితండ్రులు తమ బిడ్డలు చేసే తప్పుల్ని క్షమించినట్లుగా క్షమించమని ప్రార్థిస్తున్నాను!” అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ని ప్రార్థించాడు.

ఇంకా తృప్తి కలగక ఇలా అన్నాడు. “శ్రీకృష్ణా! ఇంతకు ముందు నేను చూడని నీ విశ్వరూపాన్ని చూసి ఆనందించాను. కానీ, ఎక్కువసేపు చూస్తే భరించలేని బాధ కలుగుతుంది. కాబట్టి, ఎప్పటిలాగే నీ శాంత స్వరూపం ధరించి నాకు సంతోషం చేకూర్చమని నిన్ను మళ్లీ వేడుకుంటున్నాను” అని అర్జునుడు ప్రార్థించాడు

అర్జునుడు అన్న మాటలు విని దయతో నిండిన హృదయంతో శ్రీకృష్ణ పరమాత్మ అతడితో ఈ విధంగా చెప్పాడు. “వేదాలు పఠించే విద్వాంసులుగానీ, కఠోర తపస్సు చేసిన మహర్షులుగానీ, గొప్పదైన భక్తి భావంతో మాత్రమే చూడగలిగిన నా విశ్వరూపాన్నిసాధారణ జనులు దర్శించలేరు. నీకు మాత్రమే చూపించాను. అర్జునా! నువ్వు బాధపడద్దు. ఆ అవసరం లేదు. నీ అజ్ఞానాన్నివిడిచిపెట్టి భయం లేకుండా ఆనందంతో ఉండు” అని శ్రీకృష్ణుడు చెప్పి, వెనుకటి ఆకారం ధరించి, ప్రశాంతమూర్తిగా కనిపించాడు.

ఆ సౌమ్య స్వరూపం చూసి అర్జునుడు “శ్రీకృష్ణా! నీ విశ్వరూపం చూపించినప్పుడు నేను కొయ్యబారి పోయాను. ఇప్పుడు ఆ భయం పోయింది. నేను తిరిగి యథాప్రకారంగా మనిషిని కాగలిగాను” అన్నాడు. అర్జునుడు చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుడు అతణ్ని ఓదార్చాడు. తరువాత అర్జునుడితో ‘నాకు ఇష్టమైన మంచి పనులు చేసేవాడూ, నాకు భక్తుడయినవాడూ మాత్రమే నన్ను పొందగలడు’ అని చెప్పాడు.

అంతేకాక, శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికమైన విజ్ఞానాన్ని అర్జునుడికి బోధించాడు. అర్జునుడు అడిగిన సందేహాల్ని అన్నింటినీ పోగొట్టాడు. అర్జునుడి గుండెలో ఉన్న కలతని పోగొట్టాడు. ఈ విధంగా అర్జునుడికి ఉపనిషత్తుల్లో ఉన్న సారం అనే సందేశాన్ని అందించి, “నువ్వు ఈ సందేశాన్ని అవగాహన చేసుకుని నీకు ఇష్టమైనట్టు చెయ్యి” అన్నాడు.

మళ్లీ మాట్లాడుతూ “ఇంకో మాట. ఇంతకంటే కూడా గొప్ప రహస్యం ఒకటి ఉంది. దానిని చెప్పగలను. జాగ్రత్తగా విను. అర్జునా! ఇది అన్నింటినీ మించిన గొప్ప సందేశం. చాలా జాగ్రత్తగా విను! ధర్మాలు ఎన్నో ఉండచ్చు. ధర్మాలకి ప్రత్యమ్నాయాలు ఉండవచ్చు. వాటిని అన్నింటినీ వదిలిపెట్టి, రక్షించేవాడిని నేను ఒకడినే! అని నమ్మి నన్ను శరణుపొందు చాలు. నీ పాపాలు అన్నీ పోగొట్టి నీకు సంతోషం చేకూర్చగలను.

ఇంద్రియనిగ్రహం, నీతినియమాలు గల సౌశీల్యవంతుడు, నా యెడ భక్తి కలిగినవాడికి మాత్రమే నేను నీకు చేసిన ఈ సందేశం అందించు. అంతేకాని, దృఢమైన మనస్సు లేనివాడికి తదితరులకి ఈ సందేశాన్ని వినిపించవద్దు సుమా!” అన్నాడు శ్రీకృష్ణుడు.

చివరగా శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక ప్రశ్న వేశాడు. “అర్జునా! నీకు చెప్పిన విషయాలు అన్నీ విన్నావు కదా, నీ అజ్ఞానం పోయిందా? నీ భ్రాంతి అంతా పోయింది కదా!” అని అడిగాడు.

అప్పుడు అర్జునుడు ఇలా చెప్పాడు “భ్రాంతి అనే చీకట్లు నానుంచి తొలిగి పోయాయి. నీ యెడ నాకు కుదిరిన పరిపూర్ణ భక్తి విశ్వాసం చేత అన్ని అనుమానాలు నాకు తొలిగిపోయాయి. నీ విశ్వరూపం సందర్శనం చేత నా జ్ఞానం దృఢంగా పాదుకున్నది. సర్వలోకాల్ని నడపడమే ఆటగా కలవాడా! శ్రీకృష్ణా! నువ్వు చెప్పినట్లే నేను నడుచుకుంటాను” అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుడికి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసాడు. వెంటనే అర్జునుడు గాండీవం ధరించి నిలబడ్డాడు” అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు.

మళ్లీ సంజయుడు “ధృతరాష్ట్ర మహారాజా! నేను ఋషివరేణ్యుడైన వ్యాసుడి కరుణవలన కృష్ణార్జునుల సంభాషణ విన్నాను. యోగీశ్వరుల హృదయానికి ఆనందం కలిగించే శ్రీకృష్ణుడి విశ్వరూపం సందర్శించగలిగాను. అంతేకాక, మహానుభావుడైన శీకృష్ణుడు అర్జునుడికి అందించిన దివ్యసందేశం యోగవిద్యాసార సంగ్రహం ఆలకించాను. ఆ మహానుభావుల సంభాషణలు – ప్రపంచ స్వరూపుడైన శ్రీకృష్ణుడి మహనీయ స్వరూపం మాటిమాటికి తలపోసి ఆశ్చర్యము, ఆనందం పొందుతూ ఉంటాను.

ఓ ధృతరాష్ట్ర మహారాజా! యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడూ, విలుకాండ్రలో శ్రేష్ఠుడైన అర్జునుడూ, ఎక్కడ కలిసి మెలిసి ఉంటారో అక్కడ నీతి సిరిసందలు, విజయం ఎల్లప్పుడూ ఉంటాయి” అని చెప్పాడు.

అది విని ధృతరాష్ట్రుడు “ఇలా యుద్ధానికి సంసిద్ధమై, గర్వంతో కురుపాండవులు నిలిచారు కదా! రెండు పక్షాల్లో ముందుగా ఎవరు యుద్ధం మొదలుపెట్టారు? యుద్ధం ఎలా జరిగింది? వివరంగా చెప్పు” అన్నాడు.

Exit mobile version