[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
విజృంభించి పాండవుల్ని బాధించిన భీష్ముడు
“ధృతరాష్ట్ర మహారాజా! విను. నీ కొడుకు దుర్యోధనుడు పంపగా దుర్ముఖుడు, కృపాచార్యుడూ, కృతవర్మ, శల్యుడు, వివింశతి, భీష్ముడికి బాసటగా నిలిచి ప్రకాశించే బాణాల మంటలతో పంచాగ్నులవలె ప్రజ్వరిల్లి అతడికి ప్రక్కల నిల్చారు. శత్రుసైన్యాన్ని తరుముతూ తాటిచెట్టు జెండాతో వెలుగొందేవాడూ, ఎత్తైన విగ్రహం కలవాడూ అయిన భీష్ముడు భయంకరుడై విజృంభించి పాండవసేన దరిచేరి చెలరేగి పాంచాల కేకయ రాజులు మొదలైనవాళ్లు పన్నిన వ్యూహాలన్నింటినీ చెదిరిపోయేటట్లు, పారిపోయేటట్లు, ఒరిగిపోయేటట్లు, పెల్లగిలేటట్లు, చికాకుపడేటట్లు రణక్రీడ సలిపాడు.
భీష్ముడు యుద్ధవిద్యలో గొప్ప నేర్పరి. శత్రుసేనల్ని చీలికలు చేస్తూ లోపలికి దూరుతాడు. గుంపులు చేస్తాడు. వంకర టింకరగా తిరిగి చించుతాడు. కోణాలు ఏర్పడేటట్లు, వృత్తాలు ఏర్పడేటట్లు తిరుగుతూ కలతపెడతాడు. భీష్ముడు యుద్ధం చేసిన సమయంలో సైన్యాలు తల్లడిల్లిపోయాయి.
ఎక్కడ చూసినా డొల్లిన శిరస్సులు, విరిగిన ధనువులు, భూమిపై పడిపోయే శరీరాలు, విరిగిన జెండాలు, మిక్కుటంగా స్రవించే నెత్తురు కనిపించాయి. ఈ విధంగా ప్రళయకాలంలో నాట్యం చేస్తూ చెలరేగే ఎనిమిది ఆకృతులుగల శివుడిలా విజృంభించే భీష్ముడిని ఎదుర్కునే వీరులు లేక, పాండవసైన్యం చేరి శుష్కించిపోయిన సమయంలో, అభిమన్యుడు బంగారు రంగుగల గుర్రాలు పూన్చిన రథం మీద కొండగోగు పువ్వు గుర్తుగల జెండా వెలుగుతుండగా కౌరవసేనని ఎదుర్కొన్నాడు.
ఇక్కడ అభిమన్యుడి పరాక్రమం వర్ణించబడింది. అభిమన్యుడు శల్యుడి మీద అయిదు బాణాలు ప్రయోగించి నొప్పించాడు. కృతవర్మ రొమ్ముని ఒక బాణంతో నొప్పించి వాడిబాణంతో దుర్ముఖుడి రథసారథిని సంహరించాడు. తరిమి వివింశతి విల్లుని విరగగొట్టాడు. వెడల్పైన బాణంతో కొట్టి ఇంకా మూడు వాడి బాణాలు శరీరంలో నాటుకునేలా వేసి, నాలుగు బాణాలతో కృపుడి గుర్రాల్ని కొట్టి అతడి ఉత్సాహాన్ని తగ్గించాడు.
తరువాత భీష్ముడి మీద విజృంభించి అతడి దేహంలో తొమ్మిది బాణాలు నాటి చెలరేగి సింహనాదం చేశాడు. అభిమన్యుడి పరాక్రమ ప్రాభవానికి దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు. భీష్ముడు మొదలైన వీరాధివీరులు ఈ అభిమన్యుడు అర్జునుడికి సాటివస్తాడు. అతడికంటే అధికుడేగాని, తక్కువ వాడుకాడు అని ప్రశంసించారు.
గంగాసుతుడు భీష్ముడు అర్జునుడికి కొడుకైన అభిమన్యుడి రథసారథిని, జెండాకర్రని ఆరు బాణాలతో ఖండించి వెలుగొందే మంత్ర బాణాలని ప్రయోగించాడు. అంతలో శల్యుడు, కృతవర్మ, దుర్ముఖుడు, వివింశతి, కృపుడు కూడుకొని అనేక బాణాలు అభిమన్యుడి మీద వర్షించారు.
అయితే అభిమన్యుడు పర్వతంలా చలించక నిలిచాడు. వాళ్లు తనమీద వర్షించిన బాణాలన్నింటినీ నిరోధిస్తూ, వాళ్లమీద వేరు వేరుగా బాణాలు గుంపుగా కురిపిస్తూ కురువీరుడైన భీష్ముడి తాటిచెట్టు జెండా పడిపోయేలా బాణాలు ప్రయోగించాడు. తాటిచెట్టు జెండా విరిగి నేలమీద పడిపోయింది. పాండవ సేనలన్నీఒక్కసారిగా సింహనాదాన్ని చేశాయి. బలం తగ్గి కౌరవసేనలోని యోధావళి చిన్నబోయింది.
అభిమన్యుడు భీష్ముడి జెండా కూల్చి, వీర విహారం చేసేటప్పుడు భీముడు సింహనాదం చేస్తూ అక్కడికి వచ్చి, తన తమ్ముడి కొడుకుకు బాసటగా నిలిచి, శత్రుసేనలు వెనుకంజ వేసేటట్లుగా తలపడ్డాడు. ఆ భీముడి మీద కోపించి, గంగాసుతుడైన భీష్ముడు ఎత్తుగా సింహం గుర్తుతో ఎగిరే అతడి జెండాను నేలపై కూల్చాడు. భీముడు భీష్ముడి మీద మూడు బాణాలు వేశాడు. కృపాచార్యుడి శరీరం నొచ్చేటట్లుగా ఒక్క బాణంతో గట్టిగా కొట్టాడు. ఎనిమిది బాణాలువేసి కృతవర్మ అవయవాలను నొప్పించి సింహనాదం చేశాడు. అంతేకాక వాయుపుత్రుడైన ఆ భీముడు శల్యుణ్ని సొమ్మసిల్లచేశాడు.
ఆ శల్యుడి మీద గౌరవంతో తన మీదకి ఉరికి వచ్చిన యోధుల్ని పరాక్రమ వేగంతో రథాల్ని తనపైకి మళ్లించిన వాళ్లని అందరినీ కరుడుగట్టిన రోషంతో అన్నట్లుగా విజృంభించి, వాళ్ల రథసారథుల్ని గుర్రాల్ని చీల్చి చెండాడి, ప్రవహించే నెత్తురు అనే నీటి కెరటాలతో తడిపి వేశాడు.
తరువాత అభిమన్యుడికీ, భీముడికీ బాసటగా సాత్యకి, ధృష్టద్యుమ్నుడు కేకయరాజులు అయిదుగురు, విరాటరాజు, అతడి కొడుకులు ముందుకి వచ్చి విజృంభించారు. భీష్ముడు తనను ఎదుర్కొన్న వీరులందరి మీద సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయపంచకం, విరాటుడు అతడి కొడుకుల మీద ఒక్కొక్కళ్ల మీద మూడేసి బాణాలు వాళ్ల శరీరాలు నొచ్చేటట్టుగా ప్రయోగించాడు. అంతట ఏనుగుల గుంపుతోపాటు ఉత్తరుడు శల్యుడిని ఎదుర్కొన్నాడు.
ఉత్తరుడి ఏనుగు తక్కిన ఏనుగుల గుంపుని మించి శల్యుడి రథాన్ని సమీపించి, గుర్రాల గుంపు పైకి విజృంభించి ఆశ్చర్యకరంగా గుర్రాల్ని నేలమీద పడవేసి తన కాలితో రాసింది. తాను విరథుడు కావడం వల్ల ఆగ్రహించి శల్యుడు, ఉత్తరుడి వక్షస్థలం చొచ్చుకుని పోయేటట్లు ‘శక్తి’ అనే అయుధాన్ని ప్రయోగించాడు. అంకుశం, తోమరం ఏనుగుమీదనే విడిచిపెట్టి ఉత్తరుడు చచ్చి నేలమీద పడిపోయాడు.
ఉత్తరుడిని సంహరించడంతో ఆగకుండా శల్యుడు రోషంతో తన కత్తి దూసి, వేగంగా ముందుకి దూకి, గొప్ప ఆవేశంతో ఆ ఏనుగు తొండం నరికి నేలపైకి విసిరేశాడు. తన పరాక్రమాన్ని సేనలు పొగుడుతుండగా శల్యుడు దగ్గరలో ఉన్న కృతవర్మ రథం పైకి కొండ మీదకి లంఘించే సింహంలా చేరుకున్నాడు.
ఉత్తరుడు నేలమీద కూలిపోగానే అతడి సొదరుడైన శంఖుడు మిక్కుటమైన కోపంతో శల్యుడి మీదకి దూకాడు. ఎనుగుని ఎదుర్కొంటే, ఏనుగుల గుంపుకి నాయకత్వం వహించే పెద్ద ఏనుగు, తక్కిన ఏనుగులు పరుగెత్తుకుని ఎలా వస్తాయో అలాగే కౌరవసేనాధిపతి భీష్ముడు, ఇతర రథికులు గర్వంతో శంఖుడి మీద విజృంభించారు.
భీష్ముడి తాకిడికి తట్టుకోలేక శంఖుడి రథ సమూహం, పెద్దగాలి తాకిడికి చెదిరిపోయే మబ్బు దొంతరల్లా చెదిరిపోయింది. ఆ దృశ్యం చూసి అర్జునుడు తన రథాన్ని అడ్డం తిప్పి ఆ చోటికి చేరుకున్నాడు.
మధ్యాహ్నసమయం అవడంతో కృతవర్మరథం నుంచి శల్యుడు కిందకి దూకి, గద చేత్తో పట్టుకుని ప్రకాశిస్తూ విజృంభించి, శంఖుడి సేన బాధపడేటట్లుగా అతడి గుర్రాల్ని నేలమీద పడగొట్టారు. మత్స్యదేశరాజు కొడుకు శంఖుడు విరథుడై, కత్తి చేత్తోపెట్టుకుని, రథం నుంచి దూకి వేగంగా అర్జునుడి రథం వెనుకకి పోయి దాక్కున్నారు.
భీష్ముడు తన బాణాలు అన్ని దిక్కుల్లో నిండిపోగా అర్జునుడి రథాన్ని విడిచిపెట్టి ద్రుపదరాజు బలం కోల్పోయి నిస్సహయంగా చూస్తూ ఉండగా అతడి సేనని అంతులేని వేగంతో ఎదుర్కున్నాడు.
అలా విజృంభించిన భీష్ముడు ఎండిపోయిన చెట్లతో ఉన్న అడవిని కార్చిచ్చు తగులపెట్టినట్టు చతురంగబలాల్ని ఒకదాని తరువాత ఒకదాన్ని వరుసగా నాశనం చేశాడు. కేకయరాజులు అయిదుగురి సేనలు చికాకుపడేటట్లుగా భీష్ముడు తన రథాన్ని నడిపిస్తూ బాణ వర్షంలో వాళ్లని ముంచెత్తాడు. గొర్రెలమంద మీదపడే పెద్దపులిలా భీష్ముడు లక్ష్యపెట్టకుండా విరాటుడి సైన్యాల్ని పెద్దపెట్టున దుమికి ఆకాశ సంచారులు ప్రశంసించేలా సంహరించాడు.
ఈ విధంగా పాండవ సేనలన్నీ కలతచెంది, ఇక్కడ, అక్కడ, కూలిపోతూ ఉండగా, భీష్ముడి అద్భుతమైన పరాక్రమానికి పాండవులు ఆశ్చర్యపడి ఒక చోటికి వచ్చి నివ్వెరపడి చూస్తున్నారు. “ఇప్పుడు సూర్యుడు అస్తమించినా నష్టం ఏముంది? నా ప్రకాశం చాలదా?” అన్నట్లు సూర్యుడిలా భీష్ముడు ప్రకాశించాడు.
చంద్రవంశాన్ని ప్రకాశింపచేస్తున్న భీష్ముణ్ని చూసి వెళ్లిపోయినట్లు సూర్యుడు అస్తమించాడు. పాండవసేనల్లో ఉన్న భటుల మొహాల్లా పద్మాలు ముడుచుకుపోయాయి. వాళ్ల మనసుల్లో ముసురుకున్న భయం అనే చీకట్లులా ఆ ప్రదేశమంతా చీకట్లు కమ్ముకున్నాయి. అప్పుడు యుద్ధం ఆపేశారు.
ధృతరాష్ట్ర మహారాజా! భరతవంశంలో ముఖ్యుడైనవాడా! అప్పుడు యుద్ధం ఆపేసి రెండు పక్షాలవాళ్లు ఎవరి ఆవాసాలకి వాళ్లు వెళ్లిపోయారు. తమ తాత భీష్ముడి శౌర్య ప్రసారానికి దుర్యోధనుడూ అతడి తమ్ముళ్లూ ఆనందంతో నిండిన మనస్సులతో ఉన్నారు. భీష్ముడి పరాక్రమ విజృంభణ గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు.
“మొదటి రోజు యుద్ధంలో అలా తల్లడిల్లిపోయిన పాండవులు తరువాత ఏం చేశారు?” అని ధృతరాష్ట్రుడు అడిగాడు.
భీష్మపర్వంలోని మొదటి ఆశ్వాసం సమాప్తం
