[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
భీష్మపర్వము-రెండవ ఆశ్వాసము
శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లిన ధర్మరాజు
వైశంపాయనమహర్షి జనమేజయ మహారాజుతో యుద్ధంలో కౌరవులు పాండవులకంటే పైచేయిగా ఉండడం విని ధృతరాష్ట్రుడు ఉత్సాహపడి, ఆ తరువాత జరిగిన వృత్తాంతాన్ని చెప్పమని సంజయుణ్ని అడిగాడు.
సంజయుడు ధృతరాష్ట్రుడితో “కురుక్షేత్ర సంగ్రామంలో మొదటిరోజు యుద్ధంలో కౌరవులు పాండవుల్ని మించిపోయారు. అందువల్ల ధర్మరాజు మనస్సు దుఃఖంతో నిండిపోయింది. తన తమ్ముళ్లని, ఇంకా కొంతమంది ఆప్తుల్ని వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి తన మనోవేదన చెప్పుకున్నాడు.
‘కార్చిచ్చు దట్టమైన అడవిని ఒకేసారిగా నాశనం చేసినట్లు మన సేన అంతటినీ విచక్షణ లేకుండా భీష్ముడు సంహరించాడు కదా! భీష్ముడి ప్రతాపం ఎంత గొప్పదో చూశావు కదా? కారుమబ్బుతో సమానమైన ఆ వీరుణ్ని యుద్ధంలో ఎవరు సంహరించగలడు? భీష్ముడు మహనుభావుడు, జగదేకవీరుడు. ఏదో గొప్ప వీరుడు అనుకున్నాను కాని, అది నా అవివేకం. ఇప్పుడు ఇతడి శౌర్యం ఎంత గొప్పదో తెలుసుకోగలిగాను. నీ బావలు అతడి బాణాల తాకిడికి తట్టుకోలేక పోయారు. దిక్పాలకులు కూడా భీష్ముడితో యుద్ధం చెయ్యడానికి సమర్థులు కారు అని నా అభిప్రాయం.
మన అర్జునుడు భీష్ముడిని అడ్డగించగలడని ఆశలు పెంచుకున్నాము. కాని, అతడు యుద్ధరంగంలో ఏమీ చెయ్యలేకపోయాడు. భీష్ముడి ధాటిని ఎదుర్కోలేక ఉదాసీనుడైపోయాడు. భీమసేనుడు ఒక్కడు మాత్రమే యుద్ధంలో తన శక్తి వంచన లేకుండా పోరాడాడు. అంతకంటే ఏమి చెయ్యగలడు? వీళ్లనీ, వాళ్లనీ నేను ఎందుకు నిందించాలి? యుద్ధం విరమించాలని నాకు అనిపిస్తోంది.
శ్రీకృష్ణా! నా పక్షాన యుద్ధం చెయ్యడానికి వచ్చిన రాజుల్ని అందరినీ భీష్ముడికి ఎరగా అందించలేను. నేను మళ్లీ అడవికి వెళ్లి అక్కడే కూరలూ, ఆకులూ తింటూ ఉంటాను. శ్రీకృష్ణా! మేము నువ్వు చెప్పినట్టే నడుచుకుంటున్నాము. ఎప్పుడైనా, ఎక్కడైనా, దేన్నైనా నీ ఇష్టాన్నే పాటిస్తున్నాము. మాకు అశుభం లేకపోవడం, శుభం కలగడం అది అంతా నీ లీలామహిమ మాత్రమే! దయచేసి ఇంక కర్తవ్యం ఏమిటో చెప్పు!’ అని ధర్మరాజు అడిగాడు.
శ్రీకృష్ణుడు ధర్మరాజు మనస్సులో కలుగుతున్న అలజడిని గుర్తించి ‘ధర్మరాజా! నీకు ఇంత ఆవేదన ఎందుకు? నీకు ఎదురెవ్వరు? నీ తమ్ముళ్లలో ఎవరిని చూసినా లోకాలన్నింటినీ జయించగల సమర్థులు. బలగర్వితుడైన భీష్ముణ్ని రణకోవిదుడైన శిఖండి జయిస్తాడు. నీకు ఇష్టులు కాని వాళ్లని అందరినీ నేను వరుసగా ఏదో ఒక విధంగా సంహరిస్తాను.
సత్యపరాక్రముడైన ఈ సాత్యకి భుజబలం, ఇతడి సమర విహారంలో ఉండే గడుసుతనం చూస్తున్నావు కదా! ఇతడి అస్త్ర ప్రయోగ నైపుణ్యం చాలా ఆశ్చర్యకరమైంది. నీ కోసం తమ ప్రాణాల్ని అర్పించడానికి సంసిద్ధులై, గొప్ప పరాక్రమంతో ప్రకాశించే ద్రుపదమహారాజు, మత్స్యదేశాధీశుడు విరాటరాజు బాసటగా నిలిచి నీకు రాజ్యసంపద కలిగించాలని ప్రయత్నిస్తూ ఉంటే నువ్విప్పుడు యుద్ధం చెయ్యడం మానడమెందుకు? వేయి మాటలెందుకు? సమర్థుడు, జగదేకవీరుడైన ధృష్టద్యుమ్నుడు ఒకడే చాలు, శత్రువుల విజృంభణ అంతా అరికట్టడానికి’ అన్నాడు.
కృష్ణుడి మాటలు విని ధర్మరాజు ధృష్టద్యుమ్నుడి వైపు చూసి ‘ధృష్టద్యుమ్నా! పాండవసైన్య సమూహాన్ని పరిపాలించగల సమర్థుడు ఇతడే! అని శ్రీకృష్ణుడు నిన్ను చూసి సర్వసైన్యాధ్యక్ష పదవిలో అభిషిక్తుణ్ని చేశాడు. నువ్వు కూడా నీ అధికారాన్ని గొప్పగా నిర్వహించావు. ఈ రాజులూ, నా తమ్ముళ్లూ, నేనూ కలిసి సేనాసమూహాన్ని పురికొల్పుకుని ఇప్పుడు శత్రువుల్ని జయించకపోతే ఆ పదవికి వన్నె కలుగుతుందా?’ అని ధర్మరాజు ధృష్టద్యుమ్నుణ్ని అభినందించాడు.
ధర్మరాజు తనని పొగిడినందుకు ఆనందపడి ధృష్టద్యుమ్నుడు ధర్మరాజుతో ‘ద్రోణుణ్ని చంపడానికి బ్రహ్మదేవుడు నన్ను పుట్టించాడని లోకానికి తెలుసు. దీన్ని పరాక్రమ సూచకంగా అనేకసార్లు చెప్పవలసిన పనిలేదు. అది అలా ఉండగా, కౌరవసేనలో భీష్ముడి వంటి పేరుపొందిన యోధులందరు నాకు ఎదురై నిలబడి నప్పుడు నేను ఎలా విజృంభించి ఎదిరిస్తానో గమనించి చూస్తూ ఉండండి’ అన్నాడు.
పృషత వంశస్థుల్లో ముఖ్యుడైన ధృష్టద్యుమ్నుడు ఉత్సాహంతో యుద్ధోత్సాహాన్ని కలిగిస్తూ పౌరుషంతో మాట్లాడిన మాటలు విని పాండవులు సంతోషించారు. అక్కడి రాజులందరూ ఆనందించారు. శ్రీకృష్ణుడు కూడా మిక్కిలి ప్రీతిచెందాడు. తరువాత యుధిష్ఠిరుడు ధృష్టద్యుమ్నుడితో ‘పూర్వకాలంలో రాక్షసులకీ, దేవతలకీ యుద్ధం జరిగింది. అప్పుడు దేవతల గురువైన బృహస్పతి దేవేంద్రుడితో ‘క్రౌంచ వ్యూహం’ చాలా గొప్పది, శత్రువుల దృష్టికి భయం కలిగించగలదు, అని స్పష్టం చేశాడు. నువ్వు రేపు ఆ క్రౌంచ వ్యూహాన్ని నిర్మించి నీ తెలివితేటలు చూపించు. అది అద్భుతంగా ఉండాలి’ అన్నాడు.
ధర్మరాజు మాటలు విని ధృష్టద్యుమ్నుడు తాను ధర్మరాజు చెప్పినట్లే చేస్తానన్నాడు. ధర్మరాజు ఆవేదన తగ్గింది. అతడు అందరినీ వాళ్ల వాళ్ల నివాసాలకి వెళ్లమని ఆదేశించి, తను కూడా తన లోపలి మందిరానికి వెళ్లిపోయాడు. తెల్లవారాక పాండవ సైనికుల హృదయాల్లా పద్మాలు వికసించాయి. సూర్యుడు పాండవభటుల పరాక్రమంలా ప్రచండ కిరణాలతో వెలుగొందాడు.
ధర్మరాజు కాలకృత్యాలు నిర్వర్తించి, బయలుదేరాడు. ధృష్టద్యుమ్నుడు ‘క్రౌంచ వ్యూహం’ ఏర్పాటుచేశాడు. అర్జునుడు గాండీవ ధనుస్సుతోను, కోతి జెండాతోను వ్యూహానికి ‘ముక్కు’ గా నిలిచాడు. కుంతిభోజుడు, శైబ్యుడు ‘కళ్లు’గా అమరారు. ద్రుపదుడు ‘తురాయి’ అయ్యాడు. దశార్ణరాజు, శూరసేనరాజు, కిరాతరాజు ‘కుత్తుక’గా ఏర్పడ్డారు. భీముడు, ధృష్టద్యుమ్నుడు ‘కుడి ఎడమ’ రెక్కలయ్యారు. అభిమన్యుడు, సాత్యకి, ద్రౌపది కొడుకులు, పౌండ్ర చోళపాండ్యులు, భీముడి దగ్గరికి చేరారు. నకుల సహదేవులు, ఘాటోత్కచుడు, శంబర వత్స రాజులు ధృష్టద్యుమ్నుడి దగ్గరికి చేరారు. కేకయరాజు, కాశిరాజులతో కలిసి విరాటుడు ‘మొలస్థానం’లో నిలిచారు. హూణవతి మొదలైనవాళ్లు ధర్మరాజు చుట్టూ చేరి వెనుక ఉన్నారు. ఈ విధంగా వ్యూహం ఏర్పడింది.
భీష్ముడు రెండవరోజు యుద్ధము
ఈ సూర్యోదయ సమయంలో తెల్లతామర పువ్వులు తెరిచిన తెల్లగొడుగుల్లా మనోజ్ఞంగా శోభిల్లాయి. కౌరవసైన్యం అంతులేని ఉత్సాహంతో ముందుకి తోసుకుంటూ సంరంభంతో యుద్ధభూమికి చేరింది. ఆ సమయంలో దుర్యోధనుడు తన పక్షాన ఉన్న వీర ప్రముఖులు భీష్ముడిని, ద్రోణుడిని, అశ్వత్థామని, కృపుడిని, శల్యుడిని, కృతవర్మని చూసి ‘మీలో ఒక్కొక్కడే పాండవుల సేనల్ని అన్నింటినీ జయించగలడు. మిక్కిలి భయంకర పరాక్రమం కలిగిన ఇంతమంది మహావీరులు ఒక్కటయ్యారంటే శివుడు కూడా మిమ్మల్ని యుద్ధంలో జయించలేడు.
మీరందరు జగదేకవీరులే! అయినా కూడా, పాండవులు రమణీయ భయానకమైన క్రౌంచవ్యూహంగా తమ సేనల్ని అమర్చారు. మనం కూడా ఆ వ్యూహానికి సరిపోయే మరికొన్ని బలమైన వ్యూహాలు గొప్పవి ఏర్పాటు చెయ్యాలి’ అని వ్యూహల్నిఏర్పరిచారు.
దుశ్శాసనుడు, వికర్ణుడు, విందుడు, అతడి తమ్ముడు, అవిందుడు, శూరసేన, యవన, త్రిగర్త దేశపు రాజులు వాళ్ల సైన్యము ఒకవైపు నిలబడ్డారు. ద్రోణాచార్యుడు, కుంతలరాజు, దశార్ణరాజు, విదర్భరాజు తమ తమ సేనలతో ఒకచోట నిలబడ్డారు. వీళ్లిద్దరికీ మధ్య గొప్ప సైన్యంతో భీష్ముడు నిలబడ్డాడు.
ఈ విధంగా కౌరవసైన్యం మూడు భాగలుగా ఏర్పడింది. దుర్యోధనుడు తన తమ్ముళ్లతో వెనక నిలబడ్డాడు. అతడికి తోడుగా అశ్మంత, కాశ్మీర రాజులు నిలిచారు. కురు పాండవ సేనలు రెండూ, యుద్ధానికి సన్నద్ధాలై, శంఖాలు, భేరులు, మద్దెలలు మొదలైన తూర్యరావాలు మోగాయి” అని చెప్పాడు సంజయుడు
అతడు చెప్పినది విని ధృతరాష్ట్రుడు “ఆ రెండు సేనలూ ఎలా పోరాటం సాగించాయో చెప్పు” అని అడిగాడు.
సంజయుడు “దుర్యోధనుడు చేయి ఊపుతూ గొంతెత్తి పురికొల్పగా, మన సేనలు గొప్ప సంరంభంతో పాండవ సైన్యాలని ఢీకొన్నాయి. భీష్ముడు పాండవ సేనని పన్నిన క్రౌంచపక్షి ఆకారంలోని ఆ వ్యూహపు రెక్కలు ఛేదించాడు. కంఠంలోని రేకుల్ని ఊడగొట్టాడు. తలని బ్రద్దలు చేశాడు. వ్యూహన్ని కలిచివేశాడు. ఏ వైపు చూసినా తానే కనిపించాడు. దిక్కులన్నీ నిండిపోయేలా బాణాలు ప్రయోగించాడు. భీష్ముడి విజృంభణ చూసి అర్జునుడు ఆగ్రహించాడు. అతడి కళ్లు ఎర్రబడ్డాయి. ఆ ఎరుపు అతడి ముఖానికి అందాన్ని పెంచింది.
