Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-177: భీష్ముడి మీదకి రథం తోలించి విజృంభించిన అర్జునుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భీష్ముడి మీదకి రథం తోలించి విజృంభించిన అర్జునుడు

శ్రీకృష్ణుడితో అర్జునుడు ‘శ్రీకృష్ణా! చూడు గంగాపుత్రుడైన భీష్ముడు మన సేనని ఛేదించి విజృంభిస్తున్నాడు. నన్ను లెక్కచేయడం లేదు. ఇతడి విజృంభణ ఇంక నేను అరికట్టాలి. నేను కూడా విజృంభిస్తాను. నిన్ను మెప్పిస్తాను. దేవతలు నా శౌర్యం పొగిడేటట్లు పోరాడుతాను. వేగంగా భీష్ముడి పైకి రథాన్ని పోనియ్యి’ అన్నాడు.

అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణుడు ‘వీరుడా! నువ్వు కోరినట్లే నేను రథాన్ని నడుపుతాను. ముందుగా నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. నువ్వు తొట్రుపాటు పడకుండా, ఉప్పొంగిపోకుండా, తగ్గిపోని పరాక్రమాన్ని, అస్త్రవిద్యనీ, భుజబలాన్నీ అందరూ ప్రశంసించేలా ప్రదర్శించు. మహాపరాక్రమశాలి అయిన భీష్ముడి మీద అద్భుతంగా దాడి చెయ్యాలి. అతడికి బాసటగా నిలబడి నిర్భయంగా వచ్చే శల్యుడికీ, ద్రోణుడికీ, దుర్యోధనుడికీ ఆశ్చర్యం, భయం కలిగేట్లు చెయ్యాలి’ అని చెప్పాడు.

ఇలా శ్రీకృష్ణుడు హితోపదేశం చేసి రథాన్ని తగిన వేగంతో నడిపాడు. అర్జునుడు తనకి అడ్డంగా వచ్చిన శూరసేన దేశానికి సంబంధించిన సేనల్ని అవలీలగా జయించాడు. అంత భీష్ముడు అర్జునుడిని ఎదిరించి విజృంభించి డెభ్బై ఏడు వాడి బాణాల్ని ప్రయోగించాడు. భీష్ముడికి సాయంగా వచ్చిన, ద్రోణుడు అర్జునుడి మీద ఇరవై బాణాలు; కృపాచార్యుడు అయిదు వందల బాణాలు; వికర్ణుడు మూడింటిని; శల్యుడు తొమ్మిదింటిని; దుర్యోధనుడు అరవైనాలుగు బాణాల్ని ప్రయోగించారు. భీష్ముడు, అతడికి తోడుగా వచ్చిన కౌరవ వీరులందరూ ప్రయోగించిన బాణాలు అన్నీ తనమీద పడినప్పుడు ఎడతెగని వాన కురిసేటప్పుడు శోభిల్లే విధంగా అర్జునుడు ప్రకాశించాడు.

అంతమంది కౌరవ వీరులు తనమీదకి వచ్చి యుద్ధం చేసినా పాండవమధ్యముడు చలించలేదు. అర్జునుడు భీష్ముడి మీద ఇరవై అయిదు బాణాలు వేశాడు. ద్రోణుడి మీద అరవై బాణాలు వేశాడు. కృపుడి మీద, వికర్ణుడి మీద, శల్యుడి మీద మూడేసి బాణాలు వేశాడు. రాజరాజు దుర్యోధనుడి మీద అయిదు బాణాలు వేశాడు. అసహాయ శూరుడిగా భీష్ముడితోను, అతడికి తోడుగా వచ్చిన వీరులతోను పోరాడుతున్న అర్జునుణ్ని చూసి, పాండవ పక్షంలోని వీరులు సాత్యకి, విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదీ పుత్రులు, అభిమన్యుడు అర్జునుడికి బాసటగా వచ్చి, భీష్ముడికి సాయం చేసేవాళ్లని ఎదుర్కున్నారు. అప్పుడు భీష్ముడు అర్జునుడిని ఏభై బాణాలతో కొట్టాడు. కౌరవులందరూ సింహనాదాలు చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అర్జునుడు వాళ్లని లెక్కచెయ్యకుండా రథాన్ని వేగంగా నడిపించి కౌరవసేనలోకి చొచ్చుకుపోయాడు. రథికుల్ని సంహరించాడు. సారథుల్ని చంపేశాడు. రథాలు మోడుల్లా కనిపించాయి. కౌరవ వీరులు చెల్లాచెరైపోయారు. మన సైన్యం భయపడింది. అది చూసి నీ కొడుకు దుర్యోధనుడు, నీ తండ్రి భీష్ముడితో ‘అడుగో అర్జునుడు నువ్వు చూస్తూ ఉండగా తన పరాక్రమం స్పష్టంగా వెల్లడయ్యేలా గర్వంతో మనవైపు పోరాడకలిగిన రాజులందరినీ అవలీలగా చంపగలిగాడు. నీకిది అంగీకారమా! కర్ణుడిని యుద్ధం చేయకుండా చేసి ఈ విధంగా ఉపేక్షించడం నీకు న్యాయమా?’ అని అధిక్షేపించాడు. ‘ఇతడు ఇటువంటి అనుచితమైన మాటలంటాడా’ అని భీష్ముడు తన మనస్సులో బాధ పడ్డాడు.

వెంటనే భీష్ముడు తన రథాన్ని అర్జునుడు ఉన్న చోటికి తరలించాడు. దుర్యోధనుడు, వికర్ణుడు, భీష్ముడికి కుడివైపు చేరారు. అశ్వత్థామ ఎడమవైపు చేరాడు. వాళ్లందరూ అర్జునుడి మీద బాణాలు ప్రయోగించారు. అర్జునుడికి తోడుగా అన్నదమ్ములు వచ్చి చేరారు. ఇలా ఇరువైపుల వీరులు శంఖాలు పూరించి ఉత్సాహంతో యుద్ధం చేశారు. అది దొమ్మి యుద్ధంగా పరిణమించింది.

భీష్ముడూ, అర్జునుడూ ఒకళ్ల మీద ఒకళ్లు బాణాలు వేసుకుంటున్నారు. ఒకళ్లు ఇంకొకళ్ల బాణాల్ని, జెండాల్ని బాణాలతో కొట్టారు. భీష్ముడు అనేక బాణాలు ప్రయోగించి అర్జునుడి రథసారథి అయిన కృష్ణుడి వక్షస్థలం ఛేదించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రక్తంతో తడిసి, ఎర్రటి చిగురుటాకులా ప్రకాశిస్తూ పారిజాత వృక్షంలా శోభిల్లాడు.

భీష్ముడు తన రథ సారథి శ్రీకృష్ణుణ్ని గాయపరచడం చూసి అర్జునుడు ఆగ్రహంతో భీష్ముడి సారథిని నొప్పించాడు. భీష్ముడు కూడ అర్జునుడి రథం కనిపించకుండా బాణాలతో ముంచెత్తాడు. భీష్ముడు వేసిన బాణాల వరదని అర్జునుడు అనే మహాగ్ని, బాణాలు అనే జిహ్వలతో తాగి వెలిగాడు. ఆ అగ్ని కురుసేనల్ని కార్చిచ్చులా బాధించింది. అయితే భీష్ముడు మేఘంలా బాణవర్షం కురిపించి ఆ కార్చిచ్చు నుంచి కౌరవసేనల్ని రక్షించాడు.

ఈ విధంగా ఒకళ్లకొకళ్లు తీసిపోకుండా సమానంగా గొప్పగా యుద్ధం చేస్తున్న భీష్ముడిని, అర్జునుడిని దేవతలకి సంబంధించినవాళ్లు అందరూ తమలో తాము ‘ఈ భీష్ముడు, అర్జునుడు ఒకళ్లకి ఒకళ్లు దీటైనవాళ్లు. మిగిలినవాళ్లలో వీళ్లకి సమానమైనవాళ్లు లేనే లేరు. భీష్ముడితో ఎదురునిలిచి పోరాడగలవాడు అర్జునుడు ఒక్కడే. అలాగే అర్జునుడితో యుద్ధం చేయగల సమర్థుడు భీష్ముడు ఒక్కడే.

వీళ్లతో యముడుగాని, దేవేంద్రుడు గాని యుద్ధం చెయ్యలేరు. పాండవుల్లో గొప్పవాడైన అర్జునుడి పరాక్రమం, కౌరవ ప్రముఖుడైన భీష్ముడి పరాక్రమం ఇంత గొప్పగా ఉంటాయని అనుకున్నామా?’ అనుకున్నారు. ఈ రకంగా చారణులు, సిద్ధులు, గంధర్వులు భీష్ముడిని, అర్జునుడిని ప్రశంసించారు.

ఇప్పుడు ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుణ్ని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు విజృంభించి, ధృష్టద్యుమ్నుడి సారథిని ఒక్క బాణంతో నొప్పించాడు. నాలుగు బాణాలతో గుర్రాల్ని పడగొట్టాడు. ఒక పెద్ద బాణంతో జెండాని మధ్యకి రెండు ముక్కలు చేశాడు. కౌరవసేన ఉత్సాహంతో ఉరకలు వేసింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిమీద కోపగించి అతడి మీద బాణాలవర్షం కురిపించాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి మీద గొప్ప బలమైన బాణాలు ప్రయోగించాడు. ద్రోణుడు వేసిన బాణాల్ని ధృష్టద్యుమ్నుడు ముక్కలు చేశాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి మీద వాడిగా ఉండే బాణాల్నిప్రయోగించాడు. ద్రోణుడు ఆ బాణాలన్నింటినీ ఖండించాడు. గొప్ప బాణాలన్నీ వమ్మై పోవడం చూసి కౌరవ పాండవ సేనలు పెద్దపెట్టున నినాదాలు చేశాయి.

ద్రోణుడు కోపంతో ధృష్టద్యుమ్నుడి విల్లు ఖండించాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి మీద ‘శక్తి’ ఆయుధాన్ని ప్రయోగించాడు. ద్రోణుడు ఆ శక్తి ఆయుధాన్ని మూడు ముక్కలుగా చేశాడు. ధృష్టద్యుమ్నుడు ఎన్ని శక్తుల్ని ప్రయోగించినా ద్రోణుడు వాటన్నింటినీ ఖండించాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి మీద గదని విసిరాడు. ద్రోణుడు ఆ గదని కూడా ముక్కలుగా చేశాడు. అంతేకాదు ఈటెలతో ధృష్టద్యుమ్నుడి కవచాన్ని ఛేదించి, అతడి శరీరాన్ని గాయపరిచి నెత్తురుతో ముంచేశాడు.

ధృష్టద్యుమ్నుడు తగ్గలేదు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి విల్లు ఖండించాడు. మరొక విల్లు తీసుకుని ధృష్టద్యుమ్నుడు అమ్ములు వేసి ద్రోణుడ్ని గాయపరిచాడు. ఆ గాయాల నుంచి కారుతున్న రక్తంతో తడిసిన ద్రోణుడు కొత్త పువ్వులు పూసిన మోదుగ చెట్టులా అందంగా కనిపించాడు. ద్రోణుడు మరొకసారి ధృష్టద్యుమ్నుడి విల్లు ఖండించి అతడి రథసారథిని గుర్రాల్ని సంహరించాడు. ద్రోణాచార్యుడు ధృష్టద్యుమ్నుణ్ని రథంలేనివాణ్ని చేశాడు. అయినా ఆ మహవీరుడు ధృష్టద్యుమ్నుడు కత్తి, డాలు తీసుకుని కిందకి దూకి విజృంభించాడు. అతడి రౌద్రాకారాన్ని చూసి కౌరవసైన్యం గజగజ వణికిపోయింది.

ద్రోణాచార్యుడి ధాటికి ధృష్టద్యుమ్నుడు తట్టుకోలేకపోయాడు. ద్రోణుడు పెద్ద కొండలా ఉన్నాడు. అతడు వదిలే బాణాలు కొండమీదనుంచి అతివేగంగా కిందకి దూకే నదిలా ఉన్నాయి. ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడికి ఎదురుదాడి చెయ్యడం శక్యం కాలేదు. ధృష్టద్యుమ్నుడు రథం లేకపోయినా తన మీదపడే వాడి బాణాల్ని డాలుతో తప్పించుకుంటూ ధైర్యంగా నిలబడ్డాడు.

ఆ సమయంలో అమితమైన వేగంతో భీముడు వచ్చి అతడికి అండగా నిలబడ్డాడు. భీముడు ద్రోణుడికీ, ధృష్టద్యుమ్నుడికీ మధ్య నిలబడి ద్రోణుడి మీద బాణవర్షం కురిపిస్తూ ధృష్టద్యుమ్నుణ్ని వేరే రథం మీదకి ఎక్కించాడు. అప్పుడు దుర్యోధనుడు రథంలేని ధృష్టద్యుమ్నుడిని భీముడు రక్షించడం చూసి చేతితో సైగ చేసి కళింగదేశపు రాజుని అక్కడికి రమ్మన్నాడు.

కళింగదేశపు రాజు వచ్చి భీముణ్ని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు విజృంభించి విరాటరాజుని, ద్రుపదరాజుని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో ధర్మరాజు వేగంగా వచ్చి ధృష్టద్యుమ్నుడికి అండగా నిలబడ్డాడు. చేది, కరూక దేశాల సేనలు భీమసేనుడికి అండగా నిలిచాయి. వెంటనే దుర్యోధనుడు ఆజ్ఞాపించడంతో కళింగదేశపు రాజు సేనతో కలిసి వచ్చి భీముణ్ని ఎదుర్కొన్నాడు. అప్పుడు కేతుమంతుడు అనే వీరుడు, ఆటవిక సేనా నాయకుడు, వేగంగా వచ్చి కళింగరాజు శ్రుతాయువుకి బాసటగా నిలబడ్డారు. దుర్యోధనుడు ఆ దృశ్యం చూసి ఎంతో సంతోషించాడు.

భీమసేనుడి బాసటగా ముందుకు వచ్చి నిలిచిన సేనలు, చేది కరూశ దేశాలకి సంబంధించిన సేనలు, కళింగ సేనల్ని తీవ్రంగా ఎదిరించి, తమ తమ కత్తులతో కూడా సగం సేన నేలకూలింది. మిగిలిన సగం పరాక్రమం తగ్గి పారిపోయింది. కేతుమంతుడు భీముడిపైకి విజృంభించాడు. కాని, అగ్నిలోపడి తప్పించుకోలేని శలభంలా భీముడి బాణాగ్నిలో పడి నశించిపోయాడు.

కళింగరాజు కుమారుడు శక్రదేవుడు భీమసేనుణ్ని ఎదుర్కొని భయంకరమైన బాణాలతో గుర్రాల్ని చంపేశాడు. భీముడు కోపంతో గదని అతడి మీద విసిరాడు. ఆ దెబ్బకి శుక్రదేవుడు సారథితోపాటు, జెండాతోపాటు, వజ్రాయుధం తగిలి కూలిన కొండలా నేల మీద కూలిపోయాడు. ఈ రీతిగా భీమసేనుడు, ఆశ్చర్యకరమూ, భయంకరమూ అయిన శౌర్యాన్ని ప్రదర్శించాడు.

భీముడు ఒక చేతిలో డాలు పట్టుకున్నాడు. ఆ డాలు ధృఢంగానూ, విశాలంగానూ ఉండి మధ్యలో బంగారు బిందువులు ఎన్నో పొదగబడి ఉన్నాయి. ఇంకో చేత్తో కత్తి పట్టుకున్నాడు. ఆ కత్తి ప్రళయకాలంలో యమధర్మరాజు నాలుకలా మహా భయంకరంగా ఉంది. అలా గుర్రాలు చచ్చిపోయిన రథం దిగాడు భీముడు.

తన కొడుకు శక్రదేవుడు చచ్చిపోవడం చూసి కళింగరాజు శ్రుతాయువు ఆగ్రహించి వేగంగా తన రథాన్ని భీముడి పైకి తరలించాడు. భీముడి మీద పిడుగుల్లాంటి బాణాల్ని ప్రయోగించాడు. భీముడు ఆ బాణాల్ని ముక్కలుగా తుంచేశాడు. శ్రుతాయువు గొప్పదైన గర్వంతో ఒకేసారి పధ్నాలుగు చిల్లకోలలు భీముడి మీద ప్రయోగించాడు. భీముడు చాకచక్యంతో వాటన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా తన చేతి కత్తితో ఖండించాడు.

Exit mobile version