Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-178: భీముడి చేతిలో చచ్చిన భానుమంతుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భీముడి చేతిలో చచ్చిన భానుమంతుడు

ఆ సమయంలో శ్రుతాయువు తమ్ముడు భానుమంతుడు, ఏనుగుల సమూహంతో అన్నను దాటి వచ్చి భీముడి మీద వాడిగా ఉన్న బాణాలు అనేకం ఒకేసారి వేశాడు. అంతేకాకుండా తాను ఎక్కిన ఏనుగుని పురికొలిపాడు. అది చూసి భీముడు దిక్కులు మారుమోగేటట్లుగా సింహనాదం చేశాడు. వెంటనే వేగంగా ఆ ఏనుగు దంతాల మీదకి ఎక్కి, తొక్కి తీవ్రమైన కోపంతో ఆకాశంలో రక్తధారలు కారేటట్లుగా అతన్ని తన కత్తి అంచులు తళతళ మెరిసేట్లు సంహరించి భీముడు భానుమంతుణ్ని యమలోకానికి పంపించాడు. మళ్లీ విజృంభించి ఏనుగు మెడ నరికి, అక్కడనుంచి తప్పించుకుని దూకి ఎర్రదనంతో మెరుస్తున్న కత్తితో ఉరుకుతున్న ఆ భీముణ్ని ఎదుర్కోమని కళింగరాజు తన చెయ్యి ఊపి సైనికుల్ని పురికొల్పాడు.

అతడి ఆజ్ఞప్రకారము శ్రుతాయువు చతురంగబలాలు భీమసేనుడిని చుట్టుముట్టాయి. భీముడు తను పాదచారిగా ఉండడము, ఒంటరిగా ఉండడము తెలుసుకుని ఆలోచించకుండా దర్పంతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అతడు తన చేతి ఖడ్గంతో ఏనుగుల కుంభస్థలాల్ని పగులగొట్టాడు. ఏనుగుల మెదడు కత్తికి అంటుకుని మొద్దుబారితే.. జెండా కొయ్యల్ని నరికి కత్తికి పదునుపెట్టుకున్నాడు. రథికులని, సారథులని కూడా నాశనం చేశాడు. అలా చెయ్యడం వల్ల మళ్లీ మొద్దయిన కత్తిని.. గుర్రాల శరీరాల్ని ఎముకలతో సహా కోసిపారేసి మళ్లీ పదును పెట్టుకున్నాడు.

ఉత్సాహంతో గుర్రాల మీద పడి వాటిని శ్రమ పెట్టేశాడు. కత్తిని అవలీలగా తిప్పుతూ కాల్బలం మీద పడి రకరకాలుగా విహారం చేస్తూ, చిత్రవథ చేస్తూ కౌరవ వ్యూహాన్ని చెల్లాచెదరయ్యేట్లుగా కలతచెందేట్లుగా, పారిపోయేట్లుగా చేశాడు. మధ్యాహ్న సమయంలో కళింగరాజు శ్రుతాయువుని ఎదుర్కొన్న సమయంలో భీముడి సారథి, కొత్తరథాన్ని హంగులన్నీ సమకూర్చి, గుర్రాలు పూన్చి తీసుకొచ్చాడు.

భీముడు సంతోషించి సారథివైపు గౌరవంగా చూసి రథాన్ని ఎక్కాడు. ధనుస్సు పట్టుకుని, అల్లెతాటిని బిగించేప్పుడు, కళింగరాజు భీముడి మీద పుంఖాలు పుంఖలుగా బాణాల్ని ప్రయోగించాడు. భీముడు అమితమైన కోపంతో రెచ్చిపోయి ఏనుగులా విజృంభించి శ్రుతాయువు మీద అయిదు బాణాలు వేసాడు. శ్రుతాయువు స్పృహతప్పి రథం మీద పడిపోయాడు. భీముడు అతడి రథచక్ర రక్షకుడైన సత్యుడిని, సత్యదేవుడిని సంహరించి ఆకాశం దద్దరిల్లేలా సింహనాదం చేశాడు.

అలా శ్రుతాయువు మూర్ఛపోగానే రథ సారథి రథాన్ని యుద్ధభూమి నుంచి తరలించి బయటికి తీసుకుని వెళ్లాడు. అప్పుడు చుక్కాని పట్టేవాడు లేని పడవలా కళింగసైన్యం క్షోభించింది. భీముడు విజయోత్సహంతో శంఖాన్ని పూరించాడు. అతడి శంఖారావాన్ని భీష్ముడు విన్నాడు. వెంటనే భీముణ్ని ఎదుర్కొన్నాడు.

ధృష్టద్యుమ్నుడు, శిఖండి, శత్రుభంజనుడైన సాత్యకి, భీముణ్నిదాటి ఉత్సాహంగా భీష్ముణ్ని ఎదుర్కున్నారు. వాడిగా ఉన్న బాణాల్ని అధికంగా ప్రయోగిస్తూ రథ సమూహాలు తనకి సహాయం చేస్తుంటే భీష్ముడు శిఖండి మీద తప్ప అందరినీ ఎదుర్కొని భీముణ్ని బాధించాడు. భీముడి రథానికి కట్టిన గుర్రాల్ని సంహరించాడు. భీముడు కోపంతో ‘శక్తి’ అనే బాణాన్ని భీష్ముడి మీదకి విసిరాడు. భీష్ముడు ఆ బాణాన్ని మూడు ముక్కలు చేశాడు. బీముడి కోపం ఇంకా పెరిగి, గదని చేత్తో పట్టుకుని రథం దిగి భయంకరమైన ఆకారంతో భీష్ముడి మీదకి విజృంభించాడు.

అదే సమయంలో సాత్యకి భీముణ్ని దాటి, మంత్రప్రయోగంతో అస్త్రాన్ని ప్రయోగించి భీష్ముడి రథసారథిని సంహరించాడు. అలా భీష్ముడి రథ సారధి చంపబడ్డాడు. గాలికంటే వేగం కలిగిన భీష్ముడి రథ గుర్రాలు వేగంగా పరుగెత్తుతూ భీష్ముణ్ని తీసుకుని వెళ్లిపోయాయి. ఆ ధాటికి భూమి అదిరిపోయింది. అప్పుడు కౌరవ సేనలో ఉన్న భటులు పారిపోయారు.

భీముడి ఎదురుగా ఉన్న ప్రదేశం శూన్యమైపోయింది. భీముడి వీరవిహారం, భీష్ముడి పరాజయం ధృష్టద్యుమ్నుడికి సంతోషం కలిగించాయి. ఆ క్షణంలో కౌరవసేనాపతి భీష్ముడు యుద్ధభూమిలో లేడు. ధృష్టద్యుమ్నుడు భీముడిని తన రథం మీదకి ఎక్కించుకున్నాడు. సాత్యకి కూడా కొంతవరకు భీష్ముడి తాత్కలిక పరాజయానికి కారకుడు.

అతడు తన రథాన్ని ధృష్టద్యుమ్నుడు, భీముడు ఉన్న రథం దగ్గరికి చేర్చి, భీముణ్ని చూసి అభినందిస్తూ.. ‘భీమసేనా! నువ్వు ఎంత గొప్ప పని చేశావు. ఏకాకిగా పోరాడి, కళింగ ప్రభువు శ్రుతాయువుని జయించి అవమానించి తరమగలిగావు. అతడి తమ్ముడిని, పుత్రుడిని, ఆప్తుల్ని కౌరవసేనల్ని చూస్తూ ఉండగా సంహరించావు’ అని ప్రశంసించాడు.

ఇంతలో శల్యుడు, కృపుడు, అశ్వత్థామ ఎదుర్కోడానికి వచ్చారు. అది చూసి ధృష్టద్యుమ్నుడు తన రథం మీద ఉన్న భీముడిని సగౌరవంగా కిందకి దించి అతడితో ‘నువ్వు వెనక నిలబడి చూస్తూ ఉండు’ అని చెప్పాడు. ధృష్టద్యుమ్నుడు వెంటనే వాళ్లవైపు రథం మళ్లించి, అశ్వత్థామ రథానికి పూన్చిన గుర్రాల్ని పది బాణాలతో కూల్చాడు. అతడు శల్యుడి రథాన్నెక్కి, ధృష్టద్యుమ్నుడి శరీరం మీద వాడి బాణాలు ప్రయోగించాడు. శల్యుడు, కృపుడు కూడా అలాగే బాణాలు గుప్పించారు.

ఈ విధంగా ధృష్టద్యుమ్నుడు ఒక్కడూ ముగ్గురు వీరులతో పోరాడటం దూరం నుంచి చూచి, అభిమన్యుడు తన రథాన్ని తోలుకిని వచ్చి, కృపుడి మీద, అశ్వత్థామ మీద తొమ్మిదేసి అమ్ములు గుప్పించి నొప్పించాడు. శల్యుడి శరీరం మీద ఇరువది అయిదు బాణాలు నాటించాడు. వాళ్లు కూడా అభిమన్యుడి మీద పన్నెండు బాణాలు ప్రయోగించారు.

ఆ సమయంలో నీ మనుమడు లక్ష్మణకుమారుడు వచ్చి అభిమన్యుణ్ని ఎదుర్కొన్నాడు. ఆయువుపట్టుని భేదించే బాణాలు అభిమన్యుడి మీద గుప్పించి నొప్పించాడు. అభిమన్యుడు యాభై అమ్ములు అతడి మీద ప్రయోగించి తన చేతి ఒడుపుని ప్రకటించాడు. లక్ష్మణకుమారుడు వెడల్పయిన బాణంతో అభిమన్యుడి వింటిని లస్తకము వద్ద తునిగేటట్లుచేసి – సింహనాదం చేశాడు. కౌరవులందరూ కూడా సింహనాదం చేశారు. అభిమన్యుడు వేరొక గట్టి వింటితో లక్ష్మణకుమారుణ్ని నొప్పించాడు. తన కొడుకు బాధపడిన సంగతి తెలుసుకున్న దుర్యోధనుడు అర్జునుడి కుమారుడి వైపు తన రథాన్ని తరలించారు. దానిని చూసి భీష్ముడూ, ద్రోణుడూ మొదలైన వీరులందరూ శీఘ్రంగా అభిమన్యుణ్ని ఎదుర్కొన్నారు.

వీరాధివీరులందరూ చేరి గుంపుగా వచ్చి తన పైన బడినా కూడా అభిమన్యుడు ధైర్యంతో వాళ్లందర్నీ ఎదుర్కొని నవ్వుతూ పోరాటం సాగించాడు. ఆ సమయంలో అభిమన్యుణ్ని అనేకమంది వీరులు చుట్టుముట్టడం చూసి అతడి తండ్రి అర్జునుడు తన రథాన్ని ఆకాశంలో నడిపించుకుని రణరంగానికి వచ్చాడు. వస్తూ వస్తూ కౌరవ సైన్యం మీద, దుర్యోధనుడి మీద, కౌరవసైన్యానికి అధిపతి అయిన భీష్ముడి మీద బాణవర్షం కురిపించాడు. దేవదత్త శంఖం పూరించాడు. అతని ధాటికి రణరంగం కంపించింది. ఆకాశ సంచారులు అతడిని కీర్తించారు.

ధర్మరాజు చెయ్యెత్తి తన సేనల్ని పురికొల్పాడు. పాండవ సేనలు ఒక్క పెట్టున విజృంభించి కౌరవసేనల్ని ఎదుర్కొన్నాయి. అప్పుడు నేలమీద నుంచి రేగిన దుమ్ము సూర్యబింబాన్ని కప్పేసింది. చీకట్లు కమ్మినట్లయింది. అయితే చనిపోయిన ఏనుగులు, గుర్రాలు, భటుల దేహాలనుంచి స్రవించిన నెత్తుటి ధారలవలన దుమ్ము మొత్తం అణిగిపోయింది.

తరువాత అర్జునుడు ప్రయోగించిన బాణ పరంపరలవలన కౌరవసేనలో ఖండఖండాలయిన విల్లులు, అమ్ములు, కత్తులు, ఇనుప గుదియలు, గండ్రగొడ్డళ్లు, ఇంకా ముక్కచెక్కలయిన గుర్రాల తలలు, ఏనుగుల కుంభస్థలాలు, కాలిభటుల పుర్రెలు, దట్టంగా పడిపోయిన చక్రాలు, జెండాలు, గొడుగులు, చామరాలు మొదలైన వాటితో రణరంగం భయంకరంగా కనిపించింది. తమ మీద ఉండే మనుషులు కూలిపోవడంతో చెడి తిరిగే గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు చెడిపోతే దీనులై తిరిగే ఆరోహకులు కలిగి మన సేన భీతితో వెనుకంజ వేసి పారిపోడం చూసి కృష్ణుడు, అర్జునుడు విజయగర్వంతో తమ శంఖాలు పాంచజన్యం, దేవదత్తం పూరించారు.

అప్పుడు భీష్ముడు, కౌరవసేన పరిస్థితి చూసి ద్రోణుడితో ‘శ్రీకృష్ణుడు రథానికి సారథిగా ఉండగా అర్జునుడు కౌరవసేనల్ని సంహరించాడు. ఆనాడు – రథం నడపడంలో శ్రీకృష్ణుణ్ని మించిన నేర్పుగల సారథి లేడని ప్రసిద్ధి. అంతగొప్ప సారథి లభించడం వల్ల అర్జునుడు రథికుడిగా రాణించి కౌరవసేనల్ని చీల్చి చెండాడగలిగాడు. అంతేకాక శ్రీకృష్ణుడి నాయకత్వంలో రథిక వీరుడైన అర్జునుడు గొప్ప ఆటగాడుగా మారిపోయి ఘోర యుద్ధరంగాన్ని క్రీడరంగంగా చేసుకుని వీరవినోద విహారం చేశాడు.

అర్జునుడిని చూస్తే, అతడు మూడవకన్ను విప్పిన పరమ శివుడిగా కనిపిస్తున్నాడు. మన సేనలు మన అధీనంలో లేవు. పారిపోయే సేనల్ని మళ్లించు. పారిపోకుండా రణరంగంలో నిలిచిన పోటరులైన భటులు కూడా, అలిసిపోయి ఉన్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈ రోజుకి యుద్ధం ఆపడం ఇంక మంచిది’ అని భీష్ముడు చెప్పాడు.

ద్రోణుడు అతడి మాటకి అంగీకరించాడు. అప్పుడు భీష్ముడు అందరినీ యుద్ధభూమి నుంచి నిష్క్రమించమని ఆజ్ఞాపించి కౌరవసేనల్ని మరలించాడు. పాండవులు పాంచాల సేనలు, మత్స్యసేనలు మొదలైన అనుచరులు చేస్తున్న సింహనాదాలు చెలరేగి ఆకాశం అంటుతుండగా తమ తమ శిబిరాలకి తరలి వెళ్లారు. ఇది రెండవనాటి సాయంకాలం జరిగిన యుద్ధం తీరు.

Exit mobile version