Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-179: భీష్ముడి మూడవరోజు యుద్ధం

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భీష్ముడి మూడవరోజు యుద్ధం

తెల్లవారగానే, భీష్ముడు కౌరవసేనల్ని అందర్నీ పోగుచేసి ‘గరుడవ్యూహం’గా తీర్చిదిద్దాడు. తను ఆ గరుడాకారంలో ఉన్న వ్యూహానికి ‘ముక్కు’గా నిలబడ్డాడు. భీష్ముడు ముక్కు స్థానంలో నిలబడడం వల్ల ఆ వ్యూహానికి అందం, బలం కూడా చేకూరాయి. గరుడాకారంలో ఏర్పడిన ఆ వ్యూహానికి ద్రోణుడు, కృతవర్మ ‘కన్నులు’గా నిలిచారు. కృపుడు, అశ్వత్థామ ‘శిరస్సు’ అయ్యారు.

త్రిగర్తులు, భూరిశ్రవుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీరరాజు సింధు భూపతి జయద్రథుడు ‘కంఠం’గా అయ్యారు. దుర్యోధనుడు, అతడి తమ్ముళ్లు ‘వీపు’ అయ్యారు. విందుడు, అనువిందుడు, కాంభోజరాజు, శూరసేనరాజు ‘తోక’ అయ్యారు. మాగధరాజు, కళింగరాజు మొదలైనవాళ్లు ‘కుడి రెక్క’ అయ్యారు. కర్ణాట, కోసల రాజులు మొదలైనవాళ్లు ‘ఎడమరెక్క’ అయ్యారు. మిగిలినవాళ్లు అటు ఇటు సర్దుకున్నారు.

అప్పుడు పాండవసేనలు కూడా యుద్ధభూమికి తరలి వెళ్లాయి. ఆ సమయంలో అర్జునుడు కౌరవసేనని చూసి ధృష్టద్యుమ్నుడితో ‘అర్థచంద్రాకారంలో మన వ్యూహాన్ని అమర్చాలి. ఎందుకంటే దుర్యోధనుడి వ్యూహాన్ని ఛేదించే ఉపాయం మనం అనుసరించాలి కదా!’ అన్నాడు.

అర్జునుడి సూచనమేరకి ధృష్టద్యుమ్నుడు పాండవ సేనని అర్థచంద్రవ్యూహంగా అమర్చాడు. భీముడు- పాండ్య, మగధ సేనలతో కూడినవాడై, కుడి కొనను నిలిచాడు. తరువాత విరాటుడు, ద్రుపదుడు నిలిచారు. నీలుడితో పాటు ధృష్టకేతుడు కాశీదేశ, కరూశదేశ సేనలతో పాటు నిలిచాడు. శిఖండితోపాటు ధృష్టద్యుమ్నుణ్ని ముందు పెట్టుకుని యుధిష్ఠిరుడు తన చుట్టూ ఏనుగుల దండుని కాపుగా పెట్టుకుని వ్యూహానికి మధ్యగా నిలిచాడు.

అటు పక్కగా సాత్యకి, నకులసహదేవులు, ద్రౌపది కొడుకులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కేకయరాజులు వ్యూహంలో భాగంగా నిలిచారు. జగద్రక్షకుడైన శ్రీకృష్ణుడు రథసారథిగా గల అర్జునుడు ఎడమ కొసను నిలిచాడు. మిగిలిన రాజులు యథోచిత స్థానాలలో నిలిచారు. ఈ విధంగా రెండు పక్షాల్లో సేనలు యుద్ధానికి సంసిద్ధమై బూరలు మొదలైన వాద్యాల ధ్వనులు ఆకాశాన్నంటేలా మిన్నుముట్టాయి.

ఉభయసేనలూ ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అర్జునుడు విజృంభించి కౌరవసేనలో కాల్బలాన్ని చికాకు పరిచాడు. రథాలు, రథాలమీద యుద్ధం చేసే వీరులూ, గుర్రాలూ, సారథులూ, జెండాలతోపాటు పొడి పొడి అయ్యేట్లు అమ్ములు ప్రయోగించాడు. ఏనుగులూ, భటులూ కూలారు. గుర్రాలు, గుర్రాల్ని ఎక్కి యుద్ధం చేసేవాళ్లూ, ముక్కలుగా అర్జునుడు కౌరవసేనని విధ్వంసం చెయ్యగా కౌరవులు అందరూ ఏకమై అతడిపై ఎదుర్కొన్నాడు.

దానితో పాండవులు అందరూ ఏకమై వాళ్లపైకి తమ రథాల్ని మళ్లించారు. కురు పాండవ సేనలు యుద్ధం చేస్తూ దుమ్ము పైకెగిరి ఒకళ్లకొకళ్లు తెలియని పరిస్థితిలో తామేవరో తెలిసేట్లుగా బిగ్గరగా తమ పేర్లు, తమ తండ్రుల పేర్లు, తాతల పేర్లు, తమ బిరుదులు ప్రకటించుకున్నారు.

భీష్ముడి నాయకత్వంలో కౌరవసేన, భీముడి నాయకత్వంలో పాండవసేన ఒకళనొకళ్లు ఎదుర్కొన్నారు. ఏ పక్షమూ వెనుకంజ వెయ్యలేదు, జంకలేదు. ఉభయపక్షాల పరాక్రమమూ వర్ణనాతీతం. కురు పాండవ సేనలతాకిడికి దుమ్ము చెలరేగింది. యుద్ధంలో ప్రవహించిన నెత్తుటి ధారలతో ఆ దుమ్ము అణిగింది. కురు పాండవ సేనల యుద్ధం, దేవతలు, రాక్షసులు చేసిన యుద్ధంలా ఉంది.

కురుపాండవ సేనలు యుద్ధం చేస్తున్నప్పుడు భీష్ముడు, ద్రోణుడు, పురుమిత్రుడు, సైంధవుడు, శకుని, వికర్ణుడు పాండవసేన మీద విజృంభించారు. భీముడు, ఘటోత్కచుడు, సాత్యకి, శైబ్యుడు, చేకితానుడు, ద్రౌపతీపుత్రులు వాళ్లని ఎదుర్కొన్నారు. ఘోరయుద్ధం జరిగింది. అప్పుడు రథసమూహాలతో దుర్యోధనుడు భీముడూ, అతడి కొడుకు ఘాటోత్కచుడూ ఉన్న చోటికి తరలి వెళ్లడం చూసి, భీష్ముడూ ద్రోణుడూ అతన్ని దాటి వెళ్లి వాళ్లని ఎదుర్కొన్నారు. అది చూసి అర్జునుడు భీముడి ఎదుటికి వెళ్లి గొప్ప అమ్ముల జడివాన కురిపించి, కౌరవుల విజృంభణ అరికట్టాడు అర్జునుడు. వీరులలో శ్రేష్ఠుడైన సాత్యకి, అభిమన్యుడు గాంధార సేనతో పరాక్రమం చూపి పోరాడారు.

శకునిసేన, సాత్యకి రథాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేసింది. సాత్యకి రథం దిగి, ధైర్యం విడువకుండా, ఉపాయంగా తప్పించుకుని అభిమన్యుడి రథం ఎక్కాడు. సాత్యకి, అభిమన్యుడు అంతులేని పట్టుదలతో శకుని మొదలైన వీరులమీద వాడిగా ఉన్న బాణాలు వేసి యుద్ధం చేశారు. ధర్మరాజు క్రౌర్యంతో భీష్ముణ్ని ఎదుర్కున్నాడు. గొప్ప సేనతో ఉన్న ధర్మరాజు, భీష్ముడి మీదపడి ప్రత్యక్ష్య యుద్ధం ప్రారంభించాడు. కౌరవసేన, ధర్మరాజు ధాటికి తట్టుకుని పోరాడింది. కౌరవసేన ఆ విధంగా నిలవడానికి కారణం, భీష్ముడి యొక్క విస్తారమైన శక్తి, ద్రోణుడి భుజబలం మీద కౌరవసేనకి గల గౌరవం.

భీముడితో యుద్ధం చేసి మూర్ఛపోయిన దుర్యోధనుడు

ఆ సమయంలో దుర్యోధనుడు భీముణ్ని ఎదుర్కొని బాణవర్షం కురిపించాడు. భీముడు చిరునవ్వు నవ్వుతూ ఒక కఠినమైన బాణంతో దుర్యోధనుడి శరీరం తూట్లుపడేట్లుగా కొట్టాడు. దుర్యోధనుడు రథం మీద మూర్ఛపోయాడు. దుర్యోధనుడు మూర్ఛపోవడం చూసి, సంభ్రమంతో అతడి సారథి రథాన్ని వేగంగా తోలుకుని వెళ్లాడు.

దుర్యోధనుడు యుద్ధభూమిని వదిలి వెళ్లిపొవడం చూసి కౌరవసేనలు కలతపడి, భయపడి వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. ఓడిపోయిన కౌరవసేన వెనక్కి తిరిగి పారిపోతుంటే క్రూరత్వంతో కూడిన ఆవేశంతో తన పక్క ధృష్టద్యుమ్నుడు తరిమికొట్టగా భీముడు విజృంభించాడు.

ఓ ధృతరాష్ట్రమహారాజా! కౌరవసేన పారిపోతూ ఉండగా, ద్రోణుడూ భీష్ముడూ మరలించడానికి ప్రయత్నించారు. అయినా కౌరవసేన నిలువలేక పోయింది. భీముడు పారిపోయే సేనని వెంబడించి తరిమికొట్టి సింహనాదం చేసినప్పుడు కౌరవసేన ఎదురుతిరిగి ప్రతిస్పందన చేయక నోరు మూసుకుని పారిపోయింది. సాత్యకి, అభిమన్యుడూ కలిసి వెన్నాడగా, శకుని సైన్యం ధైర్యం కోల్పోయి పారిపోయింది.

ఆ సన్నివేశం చూసి శకుని బంధువులతోపాటు పట్టుదల చెదిరి ఓటమికి లోనయ్యాడు. అర్జునుడి శత్రువులు ఎంత పట్టుదలతో ఎదుర్కున్నా అతణ్ని జయించలేరు. అతడు దుర్జయుడు. అతడు ఒక ఆటలోలా పరాక్రమం ప్రదర్శించి సింహనాదం చేస్తూ కౌరవసేనని ఒకవైపుకి చేర్చి, వెన్నాడి తరిమికొట్టాడు. అంతలో దుర్యోధనుడు మూర్ఛనుంచి తేరుకున్నాడు.

రణరంగం నుంచి రథాన్ని తరలించి తనని తెచ్చినందుకు అతడు సారథిని కోపంతో మందలించి, సంభ్రమంతో తిరిగి యుద్ధభూమికి చేరుకుని సింహనాదం చేశాడు. కౌరవసేనలు ధైర్యం పుంజుకుని నిలబడ్డాయి. ద్రోణుడు, భీష్ముడు చలించకుండా ఉన్న చోట్లోనే నిలబడి పాండవసైన్యాన్ని ఎదుర్కొన్నారు. కౌరవసేన క్రమక్రమంగా పుంజుకుని యుద్ధానికి ఉపక్రమించింది.

సేనల్ని కూడగట్టుకుని, వేగంగా భీష్మ ద్రోణులు ఉన్న చోటికి వెళ్లి దుర్యోధనుడు ‘మూడు లోకాలు కలిసి ఒక్క పెట్టున మీ మీదకి దండెత్తి వచ్చినప్పటికీ, మీలో ఒకడు చాలు వాళ్లని జయించడానికి, మీరు జీవించి ఉండగా మన సేన ఇటువంటి దురవస్థని పొందడం ఆలోచించదగ్గ విషయం. పాండవుల మీద మీకు పక్షపాతం ఉంది. ఈ విషయం మీరు ముందుగానే చెప్పి ఉంటే బాగుండేది కదా! ఆనాడే ఆ విషయం చెప్పి ఉంటే నాకూ కర్ణుడికీ ఏది తోస్తే ఆ విధంగా మా పాట్లు మేము పడి ఉందుము. వ్యర్థమైన ఆశతో నీ వల్ల భంగపడ్డాము. ఇంక మాటలెందుకు?’ అన్నాడు.

భీష్ముడు చిరునవ్వుతో దుర్యోధనుడిని ప్రీతి కలిగించే మాటలతో సంతోషపరిచి ‘దేవేంద్రుడితోపాటు దేవతల సేన దండెత్తి వచ్చినా సరే, యుద్ధభూమిలో పాండవులు నిలబడితే జయించడం సాధ్యం కాదు. శత్రువుల్ని ధ్వంసం చెయ్యగల దుర్యోధనా! నువ్వు ఇలా మాట్లాడడం న్యాయం కాదు సుమా! శాస్త్రాల్లో, అస్త్రాల్లో నిపుణులు, పరాక్రమోపేతులు అయిన పాండవులు ముసలివాళ్లు, ఆయువు క్షీణించినవాళ్లతో ఓడిపోతారా? పాండవులు జయింప శక్యం కానివాళ్లే అయినా కూడా నా శక్తివంచన లేకుండా పాండవుల సేనని సంహరించగలను. కావాలంటే, నువ్వూ, నీ బంధువులూ దగ్గరగా నిలబడి చూడవచ్చు’ అని చెప్పిన భీష్ముడు విజృంభించాడు.

దుర్యోధనుడు మొదలైనవాళ్లు సంతోషంతో శంఖాలు పూరించారు. సైనికులు ఉప్పొంగిపోయి భేరులు, మద్దెలలు, తూర్యలు మొదలైన వాద్యాల్ని మోగించారు. కౌరవుల శంఖనాదాలు, భేరీ, మృదంగము మొదలైన హర్షధ్వానాలు విని పాండవులు శాంఖనాదాలతో సైన్యాన్ని పురికొల్పారు” అని చెప్పాడు సంజయుడు

ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పింది విని “పూజ్యులతో ప్రశంసలందుకున్నసంజయా! దుర్యోధనుడి మాటలు విని భీష్ముడు ఎలా విజృంభించి తన పరాక్రమాన్ని ప్రదర్శించాడో, తరువాత యుద్ధం ఎలా జరిగిందో వివరంగా చెప్పు” అని అడిగాడు.

సంజయుడు ధృతరాష్ట్రుడితో “సూర్యుడు ఆకాశమధ్యానికి వచ్చి ప్రకాశించాడు. సూర్యుడి తేజస్సుతో సమానమైన తేజస్సు కలిగిన భీష్ముడు వాడి బాణాలతో అర్జునుణ్ని ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడు మొదలైన కౌరవవీరులు కూడా భీష్ముడితో పాటు విజృంభించారు. అటు పాండవ యోధులు కూదా విజృంభించారు. రెండు సేనలూ ఒక్కుమ్మడిగా చేరడం వల్ల ఘోరయుద్ధం జరిగింది.

ఉభయసేనల్లో యోధుల పరాక్రమాన్నీ ఆకాశంలో సంచరించే దేవతాగణాలు ప్రస్తుతించాయి. యుద్ధభూమిలో హుంకారాలు, మందలింపులు, నిరసనలు, పొగడ్తలు వీరులకు ఉచితమైన మాటలు జంత్రవాద్యాలనుంచి పుట్టిన ‘డాం’ భయంకరంగా వ్యాపించాయి. ముక్కలుగా నరకబడిన చేతులు, తలలు, శరీరాలు, బాణాలు, కత్తులు, గదలు, విల్లులు, కిరీటాలు, చేతి కడియాలు, భుజకీర్తులు దట్టంగా యుద్ధభూమి మీద పడ్డాయి.

ధృతరాష్ట్రమహారాజా! సగం చచ్చిన శరీరాలు చేపల్లాగా; నెత్తురు ప్రవాహంగా; మాంసఖండాల పోగులు బురదగా, నదీ ప్రవాహంలా యుద్ధభూమిలో ప్రవహించాయి. చిన్న చిన్న ముక్కలైన రథాలు, ఆకారం మారిపోయిన గుర్రాలు, గుట్టలుగా కూలి పడిపోయిన ఏనుగులూ యుద్ధభూమిని ఆవరించాయి. ఈ విధంగా అడ్డదిడ్డంగా ఉన్న యుద్ధ భూమిలో సంచరించడానికి వీలు కలుగక యోధులు అక్కడక్కడ గుంపులుగా కూడారు.

భీష్ముడు పరాక్రమంతో విజృంభించాడు. దిక్కులు పిక్కటిల్లేలా అమ్ములు ప్రయోగించాడు. యుద్ధరంగంలో ఎక్కడ చూసినా భీష్ముడే కనిపించాడు. మండే కర్రని గిరగిరా తిప్పినట్టు, గారడీ చేసినట్లుగా తన రథాన్ని తోలించాడు. అతడి ధాటికి ఎవరూ ఆగలేకపోయారు. ఒక్క బాణంతో అందరి బాణాల్ని ఒకేసారి ఖండించాడు. భీష్ముడి దృఢత్వం, లక్ష్యశుద్ధి సులువుగా అమ్ములు ప్రయోగించడంలో కలిగిన నేర్పరితనాన్ని ఆకాశసంచారులయిన చారణులు ప్రశంసించారు.

శత్రువుల చతురంగ బలాల్ని నేలమట్టం చేశాడు. అతడు క్రూరంగా వేస్తున్న బాణాలకి రథాలు విరిగాయి, ఏనుగులు చచ్చాయి, అశ్వాలు ముక్క చెక్కలయ్యాయి. పదాతులు నేలకూలారు. అడవిని కార్చిచ్చు దహించినట్లు భీష్ముడు విలయతాండవం చేశాడు. బాణాల్ని అభిమంత్రించి వదిలినట్లు ప్రళయకాల రుద్రుడిలా పరాక్రమ నృత్యం చేశాడు. పాంచాల యాదవ వీరులు చేష్టలుడిగి నివ్వెరపోయి చూస్తున్నారు. పాండవులు ఎమీ చెయ్యలేకపోయారు. పాండవసేనలు భయభ్రాంతితో అలమటించి పోయాయి.

అప్పుడు శ్రీకృష్ణుడు రథానికి కట్టిన గుర్రాల పగ్గాలు చేత్తో పట్టుకుని, అర్జునుడితో ‘ఓ అర్జునా! కృపాచార్యుడు, ద్రోణుడు, భీష్ముడు కలిసి ఉన్న కౌరవసేనని ఓడించగలనని నువ్వు ఎన్నోసార్లు చెప్పావుగా. ఇదిగో ఇప్పుడు అటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రళయ సమయంలో రుద్రుడిలా భీష్ముడు విజృంభించాడు. నువ్వు నీ పరాక్రమం చూపించి అతణ్ని ఎదుర్కోకుండా ఉండడం మంచిదికాదు’ అన్నాడు.”

Exit mobile version