Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-180: శ్రీకృష్ణుడు ప్రేరేపించగా భీష్ముణ్ని ఎదుర్కొన్న అర్జునుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

శ్రీకృష్ణుడు ప్రేరేపించగా భీష్ముణ్ని ఎదుర్కొన్న అర్జునుడు

“అర్జునుడు శీకృష్ణుడు చెప్పినది విని ‘నువ్వు ఇంత గట్టిగా నొక్కి చెప్పాలా? వెంటనే మన రథం భీష్ముడి వైపు తరలించు. నేను వాడిగా ఉండే అమ్ములు ప్రయోగించి భీష్ముడి పరాక్రమాన్ని అణిగేలా చెయ్యగలను’ అన్నాడు. అర్జునుడు చెప్పినట్లు శీకృష్ణుడు రథాన్ని భీష్ముడి పైకి తరలించాడు. రథికశ్రేష్ఠుడైన భీష్ముడు, సింహనాదం చేసి. గుర్రాల శరీరాల మీద, శీకృష్ణుడు మీద అర్జునుడి మీద ప్రకాశించే గొప్ప బాణాల్ని గుప్పించాడు. భీష్ముడు శీకృష్ణుడి రథానికి కట్టిన అశ్వాల్ని, అర్జునుణ్ని నొప్పించాడు. శీకృష్ణుడు తన బాధ మరిచిపోయి గుర్రాల్ని నిమిరి వాటి బాధ పోగొట్టి, రథాన్ని భయంకరంగా తోలాడు.

అర్జునుడు అల్లెతాటి ధ్వని వ్యాపించేలా ఒక ఈటె బాణంతో భీష్ముడి విల్లు విరిచాడు. భీష్ముడు వేగంగా మరొక విల్లు తీసుకున్నాడు. అర్జునుడు దాన్ని కూడా ముక్కలు చేశాడు. అర్జునుడి ప్రయోగ నైపుణ్యాలకీ, శక్తిసామర్థ్యాలకీ భీష్ముడు మనసులో మెచ్చుకుంటూ మరొక విల్లు తీసుకుని అమ్ములు ప్రయోగించాడు. ఈ విధంగా బీష్ముడు బాణాలు ప్రయోగించగా రథాన్ని చిత్ర విచిత్రంగా నడిపి ఆ బాణాలు తప్పిపోయేలా చేశాడు రథ సారథి శీకృష్ణుడు.

భీష్ముడు అంతటితో ఊరుకోకుండా శీకృష్ణుడినీ, అర్జునుడినీ అమ్ములతో నొప్పించాడు. తాను బాధపడుతూనే అర్జునుడు వాడి బాణాలు భీష్ముడి మీద గుప్పించాడు. భీష్ముడు ఆశ్చర్యంతో మళ్లీ అర్జునుడి మీద బాణాలు గుప్పించాడు. అప్పటికి మధ్యాహ్నమయింది. శీకృష్ణుడు తాను దెబ్బతిన్నాడు, అర్జునుడు కూడా దెబ్బతిన్నట్టు తెలుసుకున్నాడు. అయితే భీష్ముడి కరలాఘవం ఏ మాత్రం తగ్గలేదని గ్రహించాడు.

తన మనస్సులో ‘పాండవసేనలు సిగ్గులేకుండ పారిపోతున్నాయి. భీష్ముడిని ఎదిరించి పౌరుషం చూపించగల వీరుడు వీళ్లల్లో ఒక్కడు కూడా లేడు కదా!’ అనుకున్నాడు. ‘అర్జునుడు కూడా వేదనతో కుమిలిపోతున్నాడు. ఇక ఈ స్థితిలో దుర్యోధనుడి కోరికలన్నీ భీష్ముడు నెరవేరుస్తున్నట్లు అనిపిస్తొంది’ అనుకున్నాడు.

పాండవుల పక్షంలో యుద్ధం చేస్తున్న యాదవుల, కేకయుల, పాంచాలుర సేనలు పారిపోవడం చూసి పొగరెక్కిన విజయోన్మాదంతో కురుసైన్యం అన్ని వైపులా చేరి పాండవుల సేనల్ని చుట్టుముట్టుంది. ‘ఇప్పుడు నేను ఉపేక్షిస్తే లాభం లేదు. భీష్ముడిని చంపి ధర్మరాజుకి జయం చేకూర్చాలి’ అని ఆలోచించాడు శీకృష్ణుడు. అదీకాక భీష్ముడు వాడిబాణాలు ప్రయోగించడం వల్ల అర్జునుడు వాడిపోయాడు. కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ, భూరిశ్రవుడు, జయద్రథుడు, వికర్ణుడు, కౌరవపక్షంలో గొప్ప వీరులు అందరూ ఏకమై రథారూఢులైవచ్చి అర్జునుణ్ని ఎదుర్కొన్నారు.

ఆ సమయంలో సాత్యకి ఏనుగుల గుంపులతో వేగంగా చేరి రెండు పక్షాలవైపు వీరుల్ని సమీక్షించాడు. ‘మీరు చేసిన వాగ్దానాలు, ప్రతిజ్ఞలు మర్చిపోయారా? మీరు వెనుకంజ వేయచ్చా? భీష్ముడుగాని, గీష్ముడుగాని ఎవరైనా సరే మీరు బెదరకుండా ఎదిరించండి! నేనున్నాను మీకు భయమెందుకు?’ అన్నాడు.

వెంటనే విజృంభించి బెదిరిన సేనల్ని నిలిచి పోరాడమని చెప్పి అర్జునుడి రథానికి ముందుకు వచ్చి చేరిన సాత్యకితో శీకృష్ణుడు ‘పారిపోయే పిరికిపందల్ని నిలవండని హెచ్చరిస్తున్నావు? మిగిలినవాళ్లు కూడా పారిపోతే పారిపోనీ. దుర్యోధనుడు జయించి ఈ భూమిని ఏలుకోవడం చూసి నేను సహించగలనా? నా మాట విను. భీష్ముడిని సంహరిస్తాను. ద్రోణుడి పనిపట్టగలను. ఈ భూరాజ్యాన్ని కుంతీపుత్రులైన పాండవులకి కట్టబెట్టగలను. నా భుజపరాక్రమాన్ని చూసి, చక్రయుధాన్ని ప్రయోగించి వీరవిహారం చేస్తాను’ అన్నాడు.

చక్రం ధరించి భీష్ముడిమీదకి ఉరికిన శ్రీకృష్ణుడు

భూమి దద్దరిల్లేలా, కోమలమైన పట్టుబట్ట అంచులు కదులుతుండగా చక్రాయుధం కాంతులు వెల్లివిరుస్తుండగా కోపంతో ఎర్రబడిన భయంకర సింహనాదం శోభిల్లగా విజృంభించాడు. పాపాల్ని పోగొట్టే శీకృష్ణుడు, గర్వించి ఉన్న భీష్ముడు అనే మదపుటేనుగు మీద సింహం చూపే ఉద్వేగంతో సౌందర్యపు ఠీవితో ఎదుర్కొనేప్పుడు పైకి కనిపించే ఉద్రేకం, దర్పం, వేగోద్ధతి, వెలుగొందే ఆకృతి..! దీనిని చూస్తుంటే ప్రపంచాన్ని నాశనం చేయడనికి ఉద్యుక్తుడైన లయకారుడి ప్రవృత్తితో ప్రకాశించాడు. పులిని చూసిన లేళ్లగుంపులా దుర్యోధనుడి యోధముఖ్యులు భయపడి, కలతపడి, నివ్వెరపడి, చేష్టలు దక్కి చిత్రాల్లా నిలబడి ఉన్నారు. ఆ దుర్యోధనుడు కూడా మళ్లీ ఆలోచించలేని ఆవేదన పొందిన హృదయంతో తాను కూడా వెలవెలపోయాడు.

అప్పుడు భీష్ముడు ప్రేమతో తొట్రుపాటు లేకుండా ఆ శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ‘ప్రకాశించే వికసించిన పద్మాలవంటి కళ్లు కలవాడా! ఇలా నన్ను ధన్యుణ్ని చేస్తున్నావా? నువ్వు వచ్చి నన్నిప్పుడు నీకు తోచిన విధంగా చేద్దువుగాని వెంటనే రా! ఇది నాకు తగినదే కదా!’ అని భీష్ముడు అంటుండగానే అర్జునుడు వేగంగా రథం నుంచి కిందకి దుమికి పరుగెత్తి పోయి వెనుక నుంచి పురుషోత్తముణ్ని గట్టిగా పట్టుకున్నాడు.

అప్పుడు శీకృష్ణుడు పొడవైన చేతులు గల అర్జునుణ్ని, పొడవైన కొమ్మలతో ఉండే పెద్ద వృక్షాన్ని లాగుకుని పోయే పునుగాలి మాదిరి ఈడ్చుకుని పోయాడు. అర్జునుడు పది అడుగులమేర నేలను కాళ్లతో తొక్కిపట్టి మొండికేసి కూర్చుండి నిలబెట్టాడు. శీకృష్ణుడితో ‘యదువంశంలో శేష్టుడవైన ఓ శీకృష్ణా! నీ కోపం తగ్గించుకోవయ్యా! నువ్వే కదా పాండవులందరికీ సంరక్షుకుడివి. నువ్వే ప్రతిజ్ఞని తప్పితే.. ఇంక ప్రతిజ్ఞని పాలించే ధర్మరాజు మాటేమిటి? ధర్మరాజు పరాక్రమం ఏం కావాలి? శౌర్యము, ధైర్యము, బాహుబలము అన్నీ నశించి పోవా? ఓ లోకనాయకా! ఈ పని నీకు తగినదా? శీకృష్ణా! ఈ విధంగా ఆయుధం పట్టుకుని, ప్రతిజ్ఞ మీరి యుద్ధం చెయ్యడం నీకు తగునా? శాంతించు.

ఇంక నువ్వు భీష్ముడి మీదకి పోతే సాత్యకిని చంపినట్లే కదా! నీ సహాయంతో కౌరవసేనని రూపుమాపడం నాకు సులువు. నన్ను పనికిమాలినవాడిగా చెయ్యడం నీకు న్యాయమా? అయ్యయ్యో! నా పరాక్రమం తగ్గిపోయినట్లుగా చక్రాన్ని చేత్తో ధరిస్తావా?’ అన్నాడు.

అర్జునుడికి శపథం మీద గల దీక్షకి శీకృష్ణుడు సంతోషించాడు. క్రోధం పోగొట్టుకుని శీకృష్ణుడు వెనక్కి తిరిగి రథం దగ్గరికి వెళ్లి, సారథి పీఠం మీద కూర్చుని దిక్కులు మారుమోగేటట్లు పాంచజన్యం పూరించాడు. అర్జునుడు కూడా అదే విధంగా తన శంఖం దేవదత్తం పూరించాడు. తన విల్లు గాండీవానికి ఉండే అల్లెతాటిని భయంకరంగా మోగించాడు. కౌరవసేనలు కూడా, భేరులు మోగించి, మద్దెలలు వాయించి, బూరాలు ఊది, ఉత్సాహం ప్రకటించారు. అర్జునుడు కౌరవసేనని తాకి, పూనికతో, దూదిని దహించే అగ్నిలా సమీపించి, మిరుమిట్లు గొలిపే బాణాలు ప్రయోగించి ఆ సేనని కూల్చివేశాడు. అతడి పరాక్రమాన్ని ఆకాశంలో సంచరించే దేవతా చారణగణాలు ప్రస్తుతించాయి.

కౌరవసేనకి ముందుకి వచ్చి భూరిశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు విజృంభించి అర్జునుడి మీద శక్తి, గద, ఏడు బాణాలు, ఇనుప గుదియలు ప్రయోగించారు. అర్జునుడు శక్తి, గద, ఇనుపగుదియలకి ఒక్కొక్క బాణంతో, ఏడు బాణాల్ని ఏడు బాణాలతో ఖండించి – విజృంభించి ఐంద్రస్త్రం ప్రయోగించాడు. ఆ ఐంద్రాస్త్రం పెక్కు ఆకారాలుగల భయంకర బాణసముదాయం కింద మారి, కౌరవసైన్యాన్ని చికాకు చేసింది.

అర్జునుడు భీష్ముడి మీద వాడి బాణాలు ప్రయోగించి ఎదుర్కొన్నాడు. భూరిశ్రవుడి విల్లు ఖండించాడు. శల్యుడి దేహం మీద తొమ్మిది బాణాలు నాటాడు. దుర్యోధనుడి వక్షం మీద పెద్ద బాణాన్ని ప్రయోగించాడు. అప్పుడు విరాటుడు, ద్రుపదుడు మొదలైన వీరులు కౌరవసేనకి ఎదురుగా నిలబడి పోరాటం సాగించారు. అర్జునుడి గాండీవం యొక్క నారి నుంచి వచ్చే భీకరధ్వనికి తట్టుకోలేక కౌరవసేనలు నివ్వెరపోయారు.

నీ కొడుకులు పరాక్రమ ప్రకర్షతో అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. ఆ దొమ్మి యుద్ధంలో – ఐంద్రాస్త్రం చేత మన పక్షంలో గుర్రాలు నాశనమై పోయాయి. రథాలు ఒరిగిపోయాయి. ఏనుగులు నేల మీద కూలిపోయాయి. కాలిబలం నలిగిపోయింది. చామరలు, గొడుగులు, జెండాలు ముక్కలైపోయాయి.

ఆ సమయంలో అర్జునుడు నీ సేనలమధ్య నెత్తురు ఏరులు ప్రవహించేలా చేశాడు. అందులో వెంట్రుకలు నీటి పాచిగా ఏర్పడ్డాయి. తలకాయల్లో ఉండే కొవ్వు, మాంసం, మెదడు మొదలైనవన్నీ కలిసి బురదగా మారింది. ఆ రక్తనదిలో పిశాచాలూ, రాక్షసులు, దయ్యాలూ ఓలలాడాయి. అర్జునుడు దేవదత్తం పూరించాడు. శీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు. తరువాత వాళ్లిద్దరూ సింహనాదాలు చేశారు. అప్పుడు సూర్యుడు పడమటి కొండలలో చేరాడు.

తమ సైన్యాలు పొందిన దీనావస్థ ఆపడానికి సాధ్యం కానట్టి అర్జునుడి విజృంభణ, దివ్యాస్త్ర ప్రయోగం గురించి విచారించి, భీష్ముడు ద్రోణుడు, బాహ్లికుడు-తమ సేనల్ని ఉపసంహరించి- కాగడల వెలుతురులో తమ విడుదులకి వెళ్లారు. పాండవులు శీకృష్ణుడితోపాటు తమ్ముళ్లందరూ పొగుడుతూ ఉండగా ఉత్సాహంతో ఉప్పొంగిపోయి తమ తమ నివాసస్థానాలకి వెళ్లారు.

ఆ మూడవనాటికి కురుక్షేత్ర సంగ్రామ విశేషాల గురుంచి గుంపులు గుంపులుగా చేరి కౌరవభటులు ముచ్చటించసాగారు. ఆనాడు అర్జునుడు చూపించిన పరాక్రమం, అతడు ప్రయోగించిన ఐంద్రాస్త్రం గురించి తమ సైన్యంలో వివిధ దేశాలకి సంబంధించిన చతురంగబలాలు చెడిన తీరుతెన్నులు గురించి వాళ్లు చర్చించుకున్నారు.”

Exit mobile version