[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
భీష్ముడి నాలుగవరోజు యుద్ధం
“తెల్లవారగానే భీష్ముడు మొదట నడిచి యుద్ధరంగానికి వెళ్లాడు. అతడి వెంట సముద్రపు కెరటాల్లా కౌరవసేనలు వరుసగా బారులు తీర్చి కదిలి వెళ్లాయి. అమితమైన వేగంతో ద్రోణుడు, నీ కొడుకు దుర్యోధనుడు, బాహ్లికుడి వెంట కదిలి సేనల్ని కలుసుకున్నాడు. ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింపులు రథచక్రాల ధ్వనులు మిన్నుముట్టాయి. దట్టమైన మబ్బుల దొంతర్లలా కౌరవసేన ప్రసిద్ధమైన వీరరసంతో విస్తరిల్లి అంతటా కనిపించింది.
కౌరవసేనని చూస్తూ అర్జునుడు, శ్రీకృష్ణుడు ఒకేచోట సూర్యుడు, చంద్రుడు కలిసి ప్రకాశించినట్లు ప్రకాశించారు. కురుపాండవుల రెండు సేనలు జంత్ర వాద్య నినాదాలతో.. సింహనాదాలతో కత్తులనుంచి నిప్పురవ్వలు పైకి లేస్తూ ఉండగా ఒకళ్లనొకళ్లు ఎదుర్కొని యుద్ధం చేశారు. ఇరు పక్షాల్లో సైన్యాలు తండోపతండాలుగా ఒకచోట చేరుతూ, ఒకచోట విడిపోతూ, ఒకచోట మరలిపోతూ, ఇంకొకచోటా కదలలేక రెండు పక్షాలూ బాధపడ్డాయి.
ఎన్నో చోట్లలో, ఎన్నో రీతుల్లో, ఎన్నో సేనలు ఈ విధంగా పోరాటం సాగించగా ధృతరాష్ట్రమహారాజా! కురువంశానికే తాతగారైన భీష్ముడు, తాళధ్వజం ప్రకాశించగా అర్జునుడి మీద అధికంగా విజృంభించాడు. దుర్యోధనుదు, ద్రోణుడు, వివింశతి, కృపుడు, సోమదత్తుడు, శల్యుడు భీష్ముడితో కలిసి ఎదుర్కొనగా అభిమన్యుడు ఆ ఏడుగుర్నీ దేవతలు ప్రశంసించేలా ఎదుర్కొన్నాడు.
ఆ ఏడుగురు వీరుల బాణసముదాయాన్ని అభిమన్యుడు వారించడనికి వీలులేని తన బాణాలతో ఖండించి, హోమద్రవ్యాన్ని గ్రహించే అగ్నిహోత్రుడిలా యుద్ధభూమి అనే యజ్ఞవేదిక మీద ప్రకాశించాడు. భీష్ముడు అభిమన్యుణ్ని దాటివెళ్లి భయంకరమైన బాణాలు అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు ఆ బాణాలన్నింటినీ వరుసగా ఖండించాడు. పరాక్రమోపేతుడైన భీష్ముడు, అర్జునుడు పోరాడుతున్నప్పుడు ఉభయపక్షంలో ఉన్న వీరులు ఆశ్చర్యం పొంది కొంతసేపు వాళ్లని చూస్తూ ఉండిపోయారు.
అప్పుడు అశ్వత్థామ, భూరిశ్రవుడు, శల్యపుత్రుడు, చిత్రసేనుడు, మదపుటేనుగులు పిల్లసింగాన్ని చుట్టుముట్టినట్లు అభిమన్యుణ్ని చుట్టుముట్టారు. అభిమన్యుడు తన్ను చుట్టుముట్టేసిన వాళ్లని చూసి, చిరునవ్వుతో అశ్వత్థామ వక్షం మీద బాణం గుచ్చాడు. శల్యుడి కొడుకు జెండా తుంచాడు. వేగంగా నీ కొడుకు విల్లు నరికాడు. భూరిశ్రవుడిని నొప్పించాడు.
కౌరవులలో గొప్పవాడవైన ఓ ధృతరాష్ట్రమహారాజా! చురుకుగా, సులువుగా చేతినుంచి బాణాలు గుప్పటంలో, మిక్కుటమైన ఆత్మవిశ్వాసంలో అంతమంది గొప్ప వీరుల్లో ఈ ఒక్కరూ అర్జునుడి కొడుకు అభిమన్యుడితో సరికారు. ఆ విధంగా అనేకమందితో యుద్ధం చేసే కొడుకుని చూసి, అర్జునుడు సింహనాదం చేసి విజృంభించాడు. కౌరవ వీరులందరూ ఎవరికి వాళ్లే తాము అర్జునుడితో పోరాడుతున్నట్లుగా భ్రమ కల్పించి అర్జునుడు వాళ్లందర్నీ చికాకు పరిచాడు.
అప్పుడు దుర్యోధనుడు పంపించగా త్రిగర్తులు, కృతవర్మ, కేకయులు ముప్ఫై అయిదువేల రథికులతోపాటు అర్జునుడిని అతడి కొడుకు అభిమన్యుణ్ని చుట్టుముట్టారు. అంతలో కౌరవసేనని ఎదుర్కొని పోరాడుతున్న అర్జునుణ్ని చూసి పాంచాలరాజు కొడుకు ధృష్టద్యుమ్నుడు వేగంగా రథాన్ని అక్కడికి తరలించమని సారథిని ఆజ్ఞాపించాడు. ధృష్టద్యుమ్నుడు శత్రువుల బలం తగ్గిపోయేలా గొప్ప పరాక్రమంతో బాణాలు ప్రయోగించాడు.
ధృష్టద్యుమ్నుడు అర్జునుణ్ని దాటి కౌరవసేనని ఎదుర్కొన్నాడు. మూడు బాణాలతో కృపుడిని, పది బాణాలతో మద్ర ప్రభువు శల్యుణ్ని నొప్పించి, ఒక బాణంతో కృతవర్మని అతడి రథాన్ని, గుర్రాల్ని భూమి మీద పడేశాడు. శల్యుడి కొడుకు ధృష్టద్యుమ్నుణ్ని పదిబాణాలతోను, మరో పదిబాణాలతో అతడి రథసారథిని నొప్పించాడు. అప్పుడు అతడి ముఖం ఎర్రబారింది. అతడి పెదవుల మీద మందహాసం విరిసింది.
పృషతుడి మనుమడైన ధృష్టద్యుమ్నుడు ఆగ్రహంతో శల్యుడి కొడుకు వింటిని విరిచి శేషుడితో సమానమైన అస్త్రాల్ని అతడి శరీరంలోనాటాడు. ధృష్టద్యుమ్నుడు శల్యుడి కొడుకుని నొప్పించి, అతడి రథసారథిని గుర్రాల్నీ సంహరించాడు. శల్యుడి కొడుకు రథం లేకుండా తన ఆత్మాభిమామనమే తనకు వాహనంగా గర్వంతో నిలబడ్డాడు.
ధృష్టద్యుమ్నుడితో యుద్ధంచేసి మరణించిన శల్యుడి కుమారుడు
శల్యుడి కొడుకు రథం లేకపోయినా భయం లేకుండా కత్తిని, డాలుని పట్టుకుని రెక్కలు మొలిచిన పెద్ద పాములా విజృంభించాడు. అతడి ధైర్యసాహసాలకి అటు పాండవసేన, ఇటు కౌరవసేన ఇద్దరూ ప్రశంసించారు. శల్యుడి కొడుకు ధృష్టద్యుమ్నుడు ప్రయోగించిన బాణాలన్నింటినీ తన డాలుతో తోసేస్తూ సూర్యకిరణాలవంటి కాంతులు వెదజల్లే తన కత్తి ప్రకాశిస్తుంటే విజృంభించి యుద్ధం చేశాడు.
ధృష్టద్యుమ్నుడు విజృంభించి గద తీసుకుని వజ్రంతో కొట్టినట్టు కొట్టాడు. శల్యుడి కొడుకు డాలు ముక్కలై పోయింది. రెండవ దెబ్బకి అతడి శిరస్సు పగిలిపోయింది. తల ముక్కలై పోయినా అతడు పోరాటం సాగించాడు. కొంతసేపటికి కొండ విరిగి నేల మీద పడ్డట్టు అతడు నేలకొరిగి పోయాడు. కౌరవసేన కలతపడింది. కుమారుడు మరణించడం చూసి శల్యుడు ఆగ్రహావేశంతో ధృష్టద్యుమ్నుడి మీద విరుచుకు పడ్డాడు. అంతే పరాక్రమంతో పోరాడుతూ ధృష్టద్యుమ్నుడు శల్యుడి మీద అనేక బాణాలు వేశాడు” అని చెప్పాడు సంజయుడు.
ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పింది విని “సంజయా! మానవ ప్రయత్నం దేనికి? అంతా దైవాధీనమే. చూస్తున్నావుగా! సంఖ్యాబలంలో ఎక్కువై, మిక్కిలి విస్తరించి ఉన్న నా సేనని పాండవులు జయించగలరు. ఇప్పుడే తేలిపోయింది. చావు, బాధ మన వీరులకి తప్పదు. చిట్టచివరికి జయము, శుభము, సంపద పాండవులకే దక్కగలదు. దుర్యోధనుడి చెడు నిర్ణయం వల్ల నేను చెడు వార్తలు వినవలసి వస్తోంది. దుఃఖం అనుభవించవలసి వస్తోంది. జయించే దారి ఏదీ కనబడట్లేదు” అన్నాడు.
ధృతరాష్ట్రుడి బాధతో కూడిన మాటలు విని సంజయుడు “నిజమే! నీ సైన్యంలో భాగాలు చాలా వరకు నశించిపోయాయి. దొరలు మరణించారు. గుండె దిటవు చేసుకుని విను! శల్యుడు వేసిన బాణాలకి బాధపడి, ధృష్టద్యుమ్నుడు శల్యుడి మీద అనేక బాణాలు ప్రయోగించి శల్యుడి ధనుస్సు ముక్కలు చేశాడు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు అలిసిపోవడం చూసి అభిమన్యుడు శల్యుణ్ని ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడి ప్రోత్సాహంతో దుర్ముఖుడు, దుస్సహుడు, దుర్మర్షణుడు, సత్యవ్రతుడు, చిత్రసేనుడు, పురుమిత్రుడు, వివింశతి, వికర్ణుడు అభిమన్యుణ్ని ఎదిరించడానికి భయపడి ధృష్టద్యుమ్నుడి మీద నేక బాణాలు వేసి నొప్పించారు. అతడు ఏ మాత్రం చలింపక ఒక్కొళ్ల మీదే అనేక బాణాలు వేసి అంతమందినీ ఒక్కడే ఎదుర్కొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఆ సంగ్రామంలో నకులుడు, సహదేవుడు తమ మేనమామ శల్యుణ్ని ఎదుర్కోవలసి వచ్చింది.
శల్యుడు కౌరవపక్షంలో యుద్ధం చేస్తున్నాడు. నకుల సహదేవుల పరాక్రమం చూసి మేనమామ శల్యుడికి ఆశ్చర్యంతోపాటు ఆనందం కలిగింది. ఎందుకంటే నకులసహదేవులు వయస్సులో చాలా చిన్నవాళ్లు. శల్యుడు బహుముఖ ప్రజ్ఞాధురీణుడు. మహావీరుడు. అంతటివాణ్ని సకులసహదేవులు ఎదుర్కొన్నారు. శల్యుడికి అనందం ఎందుకంటే – తన మేనల్లుళ్లు అంత శౌర్యాన్ని ప్రదర్శిస్తున్నారని!
నకుల సహదేవులకి సహాయంగా ద్రుపదుడు, విరాటుడు వచ్చి చేరారు. విజృంభించి కౌరవసేనని తరిమి తరిమి కొట్టారు. కౌరవసేనలో చాలామంది శల్యుడికి సహాయంగా యుద్ధం చేశారు. అప్పుడు సూర్యుడు ఆకాశానికి మధ్యలో ప్రకాశిస్తూ మధ్యాహ్నమయిందని చెప్పాడు.
యుద్ధ సమయంలో శ్రీమదాంధ్ర మహాభారతంలో మధ్యాహ్న సమయ విరామంగాని, భోజనం ప్రస్తావన గురించిగాని చెప్పలేదు. భీమసేనుడు గదపట్టుకుని విజృంభించాడు. తన రథాన్ని దుర్యోధనుడి దగ్గరికి ఎదురుగా తోలించాడు. ‘ఈరోజు ఈ యుద్ధం పూర్తవాలి’ అన్నాడు.
అధికమైన కోపంతో కౌరవుల్ని ఎదుర్కొన్నాడు. భీముడి విజృంభణ చూసి మీ కొడుకులందరూ కలతపడ్డారు. నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు వివిధ గదా యుద్ధాల్లో ఆరితేరిన మగధుణ్ని భీముడి మీదకి పంపించాడు. దుర్యోధనుడు తనని ఎంచుకుని కోరి పంపించడం వల్ల ఉత్సాహం ఉరకలు వేస్తుండగా మగధుడు ఏనుగుల గుంపులతో భీముణ్ని ఎదుర్కొన్నాడు.
ఏనుగుల గుంపుల్ని చూసి భీముడు గదని మూపుమీద పెట్టుకుని గర్వంగా రథం దిగి కౌరవసేనలో ఏనుగుల్ని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో భీముడు తన వజ్రాయుధంతో కొండల రెక్కలు తునిమిన దేవేంద్రుడిలా కనిపించాడు. భీముడి సింహనాదంతో కౌరవసేనలో ఉన్న ఏనుగులు గుండెలు పగిలి వ్యథ చెందాయి. దేవతలు ప్రశంసించారు.
భీమసేనుడు యుద్ధరంగంలో విహరిస్తుంటే అతడికి రెండువైపులా నకులసహదేవులు, అభిమన్యుడు, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది కొడుకులు కలిసి ఏనుగుల గుంపులమీద బాణాలు ప్రయోగించారు. నకులుడి కొడుకు శతానీకుడు ఏనుగుల తలకాయలు నేల మీద పడేట్లు ఈటె బాణాల్ని ప్రయోగించాడు.
మగధరాజు విజృంభించి తన ఏనుగుని పురికొలిపి అభిమన్యుణ్ని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు ఒక భయంకరమైన బాణంతో ఏనుగు కుంభస్థలాన్ని ఛేదించాడు. ఆ ఏనుగు నేల కూలింది. అప్పుడు ఆశ్చర్యం కలిగించేలా అభిమన్యుడు ఒక వాడి బాణంతో మగధరాజుని సంహరించాడు. పీనుగులైన ఏనుగు, మగధరాజు నేల కూలారు.
ధృష్టద్యుమ్నుడు ప్రకాశించే బంగారు ములుకులున్న బాణాల సమూహంతో గొప్పవైన ఆ ఏనుగుల గుంపుని చికాకుపరిచాడు. దర్పంతో కలిసిన అతడి విజృంభణని చూసి శత్రువులు ప్రశసించారు. భీముడు భయంకరమైన గదాదండాన్ని చేత్తో పట్టుకుని, ఏనుగుల్ని వేటాడాడు. కొన్ని ఏనుగులకి తొండాలు నరికేశాడు. కొన్నింటికి దంతాలు పొడి పొడి చేశాడు. కొన్ని ఏనుగుల కుంభస్థలాలు పగులకొట్టాడు. కొన్ని ఏనుగులకి కాళ్లు విరక్కొట్టాడు. కొన్నింటి వీపులు పింజలు పింజలుగా చేశాడు. కొన్నింటి కడుపు ప్రక్క భాగాలు ముక్కలు చేశాడు. భీముడు గద పుచ్చుకుని విజృంభించి ఏనుగుల్ని వేటాడుతుండగా.. అభిమన్యుడు, ద్రుపదుడి కొడుకులు అతడితో సహకరించి చెలరేగి ఆ ఏనుగుల గుంపుని వాడిగా ఉండే బాణాలతో హింసించారు.
భీముడు సాహసంతో పాదచారిగా గద చేత్తో పట్టుకుని ఏనుగుల గుంపులోకి చొరబడ్డాడు. అభిమన్యుడు, ద్రుపదుడి కొడుకులు దూరంలో రథాలమీద నిలబడి బాణాలు ప్రయోగించి ఏనుగుల గుంపుని హింసించారు. భీముడి విజృంభణ వల్ల కొన్ని ఏనుగులు కూలిపోతున్నాయి. కొన్ని ఏనుగులు నెత్తురు కక్కుతున్నాయి, కొన్ని గుంపులో ఇరుక్కుని కింద పడిపోతూ ఉన్నాయి, కొన్ని నేలమీదపడి కొట్టుకుంటున్నాయి. భీముడు కూడ ఆ ఏనుగుల నెత్తురులో తానూ, గదాదండమూ తడిసి ప్రళయకాలంలో యముడిలా మగధసేనని చీల్చి చెండాడుతున్నాడు.
అటు అభిమన్యుడూ, ద్రుపదరాజ కుమారులు వేగంగా ప్రయోగించినన బాణాల వల్ల, భీముడి గదా ప్రహరణల వల్ల చిందరబందర అవుతున్న ఏనుగుల్ని, భీముడు ఆవుల్ని అదిలిస్తున్న గోపాలుడిలా ఉపాయంతో మరలించి తరిమి కొట్టాడు. పెద్ద గాలి దుమారానికి చెల్లాచెదరైన మబ్బుల్లా దెబ్బతిన్న ఏనుగులు తమ సైన్యం వైపుకి పారిపోయాయి. దుర్యోధనుడు ఆ ఏనుగుల్ని అదిలించి తమ సైన్యాల గుంపుని ప్రోత్సహించాడు. రాజు ప్రోత్సాహంతో ఉప్పొంగిన సైన్యం అమావాస్యనాడు ఉప్పొంగే సముద్రంలా విజృంభించారు. ఆ మహాసముద్రానికి చెలియలకట్టగా సింహనాదం చేస్తూ భీముడు కౌరవ సేనల్ని ఎదుర్కొన్నాడు.
ధృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు మొదలైన రథికులు భీముడికి కుడివైపున ఒకళ్లు, ఎడమవైపున ఇంకొకరు నిలబడి, పరాక్రమం చూపించి, కౌరవసేనమీద బాణాలు కురిపించి చికాకు పరిచారు. అడవిని చుట్టుముట్టి దహించే అగ్నిహోత్రుడిలా, భీముడు కౌరవసేనని నాశనం చేశాడు. అతడి శరీరం, మనస్సు అంతకంతకీ ఉత్సాహం పుంజుకున్నాయి. కురురాజు బలాలు నేలమీద సాగిలపడేట్టు భీముడు తొట్రుపాటు ఏ మాత్రం లేకుండా నీ సేనని బాధించాడు. భీముడి శౌర్యధైర్య సాహసాలు చూసి చారణలు ప్రశంసించారు.
భీమసేనుడి విజృంభణ చూసి కురుసేనలో వీరులు ఆశ్చర్యపోతూ నివ్వెరపాటుతో అతణ్ని సమీపించకుండా దూరంనుంచే చూస్తుండగా అప్పుడు సేనాధిపతి అయిన భీష్ముడు వచ్చి, ఉద్రేకంతో భీముణ్ని లక్ష్యపెట్టకుండా ఎదుర్కొన్నాడు. భీష్ముడు తన రథధ్వని మోగుతుండగా భీముడి మీద దట్టంగా, వేగంగా బాణాలు వేస్తూ విజృంభించాడు. పాండవసైన్యంలో ప్రముఖుడైన వీరుడు సాత్యకి, భీష్ముడిని వేగంగా పరాక్రమంతో ఎదిరించాడు.
ఈ విధంగా సాత్యకి భీష్ముడిని ఎదుర్కొనడం గమనించి కౌరవసేనలో ఉన్న రాక్షసవీరుడు అలంబసుడు ఆకాశం పగిలేలా పెద్దగా కేక వేశాడు. అందరూ ప్రశంసిస్తూ ఉండగా, కృష్ణుడి తమ్ముడైన సాత్యకిని ఎదిరించి పది బాణాలు అతడి అవయవాల్లో గుచ్చాడు. ఈ విధంగా అలంబసుడు మార్కొని మిక్కిలి నొప్పించగా సాత్యకికి కోపం వచ్చి నాలుగు బాణాలు ప్రయోగించి రాక్షస వీరుడైన అలంబసుణ్ని వెనక్కి మరలిపోయేట్లు చేసి విజయగర్వంతో సింహనాదం చేశాడు. ఆ సింహనాదం విని కురువంశంలో ప్రముఖుడు, సుప్రసిద్ధ రథికుడు అయిన సోమదత్తుడి కొడుకు, భూరిశ్రవుడు కుడికన్ను ఎర్రబడగా పరాక్రమోద్రేకంతో చూసి సాత్యకిని ఎదుర్కొన్నాడు. సేనలు అతన్ని ప్రస్తుతించాయి.
ఈ విధంగా సాత్యకి, భూరిశ్రవుడు ఒకరితో మరొకరు యుద్ధం చేశారు. భూరిశ్రవుడు తొమ్మిది బాణాలు ప్రయోగించి సాత్యకి శరీరం మీద గుచ్చుకొనేటట్లు చేశాడు. సాత్యకి బాణవర్షంలో భూరిశ్రవుణ్ని ముంచి నొప్పించాడు. ధృతరాష్ట్ర మహారాజా! ఆ సమయంలో దుర్యోధనుడు, తమ్ముళ్లు కోపంతో యుద్ధంలో చేరి భూరిశ్రవుడికి తోడుగా నిలిచారు. పాండవపక్షంలో పాండవులు, సాత్యకికి సాయంగా నిలిచి, కౌరవుల మీద అనేక బాణాలు ప్రయోగించారు. భీముడు భయంకర స్వరూపం ధరించి, నీ కుమారుల్ని అందరినీ వెనక్కి మరలించాడు.”
