Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-182: భీముణ్ని ఎదిరించి మూర్ఛపోయిన దుర్యోధనుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భీముణ్ని ఎదిరించి మూర్ఛపోయిన దుర్యోధనుడు

“తన తమ్ముడు యుద్ధంలో ఓడిపోయి పారిపోగా, దుర్యోధనుడు మాత్రం ధైర్యంగా నిలబడి భీముడిని ఎదిరించి అతడి మీద తొమ్మిది బాణాలు ప్రయోగించి అతడి శరీరం చిల్లులు పడేట్లు చేశాడు. అది చూసి భీముడు కన్నుల నుంచి నిప్పులు రాలగా నవ్వి, సూతుణ్ని పిలిచి వేగంగా రథాన్ని ఎక్కి, పది బాణాలు ప్రయోగించి దుర్యోధనుడిని కొట్టాడు. ధృతరాష్ట్ర మహారాజా! భీముడు అంతటితో ఊరుకోక దుర్యోధనుడి సారథి నందకుణ్నిమూడు బాణలతో కొట్టాడు.

దుర్యోధనుడు భీముడి రథసారథి విశోకుడిని మూడు బాణాలతో కొట్టి, భీముడి మీద అరవై అమ్ములు ప్రయోగించాడు. అంతేకాక ఒక బాణం ప్రయోగించి భీముడి విల్లు ఖండించాడు. భీముడు ఆగ్రహంతో వేరొక విల్లు ధరించి ఒక ఈటె బాణంతో దుర్యోధనుడి విల్లు ముక్కలు చేశాడు. రాజరాజైన దుర్యోధనుడు ఇంకో విల్లు తీసుకుని వజ్రంతో సమానమైన ఒక బాణంతో భీముడి వక్షాన్ని కొట్టాడు.

ఆ బాణం తాకిడికి భీముడు స్పృహతప్పి పడిపోయాడు. కొంతసేపటికి మూర్ఛనుంచి తేరుకున్న భీముడు ప్రళయకాలంలో యముడిలా విజృంభించాడు. ఎంతో వేగంగా శల్యుణ్ని ఎదుర్కొని అతడి మీద బాణవర్షం కురిపించాడు. నీ సైనికులు భీముడి ధాటికి జంకి, సింహాన్ని చూసిన ఏనుగులా అతడి సమీపానికి వెళ్లడానికి భయపడ్డారు. అప్పుడు మధ్యహ్నమయింది.

ఆ సమయంలో నీ కొడుకులు పధ్నాలుగుమంది, సేనాపతి, సుశేషణుడు, జలసంధుడు, సులోచనుడు, భీముడు, భీమరథుడు, భీమబాహుడు, దుష్ప్రధర్షుడు, దుర్ముఖుడు, వివిత్సుడు,ఇకటుడు, ఉగ్రుడు, ఆలోలుపుడు, సముడు అనే వాళ్లు అనేక బాణాలు భీముడి మీద ప్రయోగిస్తూ అతణ్ని చుట్టుముట్టారు.

భీముడు చిన్న లేడి పిల్లల మీద పడిన పెద్దపులిలా వాళ్లందర్నీ ఎదుర్కొన్నాడు. సేనాపతి తల ఒక ఈటెబాణంతో ఖండించాడు. జలసంధుడి మీద మూడు బాణాలు వేసి అతణ్నిసంహరించాడు. పొడుగు బాణంతో సుశేణుడి పొట్ట చీల్చాడు. అయిదు బాణాలతో భీమబాహుడిని చంపాడు. కుండలాలతో మెరిసిపోయే ఉగ్రుడి శిరస్సుని విశాలమైన నోరుగల ఒక బాణంతో కూల్చాడు. పలు బాణలు ప్రయోగించి భీముణ్ని, భీమరథుణ్ని చంపాడు.

అలాగే గొప్ప బాణాలతో సులోచనుణ్ని వధించాడు. భీముడు దుర్యోధనుడి తమ్ముళ్లైన రాజపుత్రుల్ని సంహరించడం చూసి మిగిలినవాళ్లు భయపడి పారిపోయారు. సేనాపతి అయిన భీష్ముడు ముందరకి వచ్చి భీముడు రాజపుత్రుల్ని సంహరిస్తూ ఉండగా రథికులు భయపడి పారిపోవడం న్యాయమా? అని సేనల్ని ఉత్సాహపరుస్తూ సైన్యాన్ని కూడగట్టుకున్నాడు. భగదత్తుడు భీముడి మీద తన మదపుటేనుగుని తోలి బాణాలతో అతడిని ముంచెత్తాడు. ఆ సన్నివేశం మబ్బులు సూర్యుణ్ని కమ్మేసినట్లు ఉంది.

అభిమన్యుడు మొదలైన వీరులు భగదత్తుడి ఏనుగుమీద బాణాలు ప్రయోగించారు. భగదత్తుడి ఏనుగు శరీరం మీద రక్తధారలు ప్రవహించాయి. ఆ ఏనుగు-సెలయేళ్లు ప్రవహించే నడకొండలా ఎంతో భయం కలిగించేలా భాసించింది. భగదత్తుడి ఏనుగు పాండవన్యాన్ని చంపేసింది. దాన్ని ఆపడం శక్యం కాక పాండవసేనలు నిశ్చేష్టంగా ఉండిపోయాయి. అది చూసి కౌరవసేనలు పరాక్రమంతో విజృంభించాయి. ఆ సమయంలో దుర్యోధనుడు తన రథం తోలించి భీముణ్ని ఎదుర్కొని, ఒక వాడి బాణాన్ని భీముడి పొట్టలో నాటాడు. భీముడు దాని ధాటికి తట్టుకోలేక జెండా కొయ్యని అధారంగా చేసుకోవలసి వచ్చింది.

మాయాబలంతో కౌరవసేన మీద విజృంభించిన ఘటోత్కచుడు

ఆ సమయంలో కౌరవసేన విజయగర్వంతో సింహనాదాలు చేసింది. ఘటోత్కచుడు తండ్రి భీముడి దగ్గరికి వచ్చాడు. ‘ఇది మాయ చేసి కౌరవ సేనల్ని ఓడించదనికి తగిన సమయం’ అని అనుకున్నాడు. కైలాసపర్వతం వంటి ఆకారంతోను, నాలుగు దంతాలతోను, నిలువరించడానికి వీలుకాని గొప్ప నడకతోను ఉన్న ఏనుగునెక్కి, వజ్రజ్వాలల్లా భయంకరంగా ఉన్న భుజదండాలతో, వెయ్యి కళ్లతో విరాజిల్లుతూ పాండవులకి సాయపడడానికి ఐరావతదిగ్గజాన్ని ఎక్కి కౌరవులకి ఇంద్రుడే వచ్చాడేమో అన్న అభిప్రాయం కలిగేట్లు ఘాటోత్కచుడు వచ్చాడు.

అంజనము, వామనము మొదలైన దిగ్గజాలు ఎలా ఉంటాయో అలాంటి మదగజాలనెక్కి ఇంద్రుడి వెంట తక్కిన దిక్పాలకుల్లా, తన తోటి రాక్షసులు రెండు వైపులా రాగా అతడు దుర్యోధనుడి పైకి వచ్చాడు. దుర్యోధనుడికి అడ్డుపడే భగదత్తుడి ఏనుగుని ఆక్రమించి ఘతోత్కచుడు బాణాలతో, తన ఏనుగు దంతాలతో, భగదత్తుడి మదపుటేనుగుని నొప్పించాడు.

మన సైన్యం నలిగిపోయి భయంతో దిక్కులు అదిరేటట్లు అరుస్తూ పారిపోయేటట్లు తరిమాడు. పై విధంగా భగదత్తుడి మత్తేభాన్ని పారద్రోలి, ఉత్సాహంతో ఘటోత్కచుడు విజృంభించి దుర్యోధనుడి వైపు తన దృష్టి సారించాడు. భీష్ముడు ద్రోణుడితో ఈ విధంగా చెప్తాడు. హిడింబ కొడుకు మాయా యుద్ధ విశారదుడు. కాబట్టి గర్వించి ఇతరులకి భయోత్సాహం కలిగిస్తున్నాడు.

భగదత్తుణ్ని పారదోలి ఘాటోత్కచుడు కౌరవరాజైన దుర్యోధనుడి పైకి లంఘించాడు. గర్వంతో ఈ రాక్షసుడి విజృంభణ అరికట్టకపోవడం పౌరుషం కాదు. ఈ ఘటోత్కచుడి విజృంభణం ఆపివెయ్యాలి. భగదత్తుడు మహావీరుడు అతడు ఘాటోత్కచుణ్ని ఓడించగల సమర్థుడే కాని ఏనుగు వెనుకంజ వేసింది. అయ్యో! పాపం అతడేం చెయ్యగలడు? ఆ అదను చూసుకుని ఘటోత్కచుడు రాజైన దుర్యోధనుడి మీదకి లంఘించాడు.

అతడి ఏనుగుని ఎదుర్కోండి! అని భీష్ముడు తన వీరుల్ని ఉత్సాహపరిచి రథాన్ని కోపంతో ముందుకి తోలాడు. భీష్ముడు ద్రోణాచార్యుడు మొదలైన రధికుల్ని కలుపుకుని దుర్యోధనుడికి ఘటోత్కచుడికి మధ్యగా చేరాడు. వాళ్లందరూ ఘటోత్కచుడి మీద అనేక బాణాలు ప్రయోగించారు.

ఇంక ఇటు పాండవపక్షంలో ధర్మరాజు మొదలైన పాండవులు, ద్రుపదుడు, విరాటుడు మొదలైన సేనాపతులు శత్రువులైన కౌరవుల మీద బాణవర్షం కురిపించారు. అలా ఘోరయుద్ధం జరిగింది. కౌరవసేనాధిపతి భీష్ముడు పాండవసేనల్ని చీల్చి చెండాడు. ఘటోత్కచుడు సింహనాదం చేసి విజృంభించాడు. అతడి కేకకి ఉప్పొంగిన అతడి ఏనుగుల ఘీంకారాలు చేసి కౌరవసేనల్ని చికాకు పరిచాయి.

భీష్ముడు కౌరవసేనల దీనావస్థని గుర్తించి ద్రోణుడితో ‘ఈ ఘటోత్కచుడితో ఇప్పుడు యుద్ధం చెయ్యడానికి మనస్సు అంగీకరించడంలేదు. సూర్యుడు అస్తమించాడు. నేటికి యుద్ధం విరమించి తిరిగి రేపు ఉదయం మళ్లీ యుద్ధం ప్రారంభిద్దాం’ అన్నాడు.

భీష్ముడి ప్రతిపాదన ద్రోణుడు అంగీకరించాడు. కౌరవపక్షంలో అందర్నీ యుద్ధం ఆపేయమని ఆజ్ఞాపించాడు. కౌరవసేనలు యుద్ధం విరమించి వెనక్కి వెళ్లిపోయారు. పాండవసేనలు సంతోషంతో మునిగి భేరులు, శంఖాలు మొదలైన వాద్య నినాదాలతో చెలరేగిన సింహనాదాలతో ఉత్సాహం ప్రకటించాయి. నీ కొడుకులు చిన్నబోయి తమ విడుదులకి వీరులతో కలిసి వెళ్లిపోయారు. ఘటోత్కచుణ్ని ప్రశంసిస్తూ పాండవ సేనలు తమ తమ శిబిరాలకి వెళ్లాయి” అని నాలుగవరోజు జరిగిన యుద్ధం వృత్తాంతాన్ని చెప్పాడు సంజయుడు.

అంతా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో “యుద్ధరంగంలో నువ్వు ఎప్పుడూ పాండవుల ఆధిక్యాన్ని, పౌరుష పరాక్రమాల్నీ ఎక్కువగా అభివర్ణించి చెప్పడం నా కొడుకుల్ని తక్కువ చేస్తూ ఉండడం వింటున్నాను. ఆ పాండవులు భీష్ముడిని, ద్రోణుడిని, శల్యుడిని, మిగిన శూరుల్ని ఏ మాత్రం లెక్క చెయ్యకుందా విజృంభించడానికి గల కారణం నాకు తేటతెల్లంగా తెలియచెయ్యి” అన్నాడు.

ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి సంజయుడు సమాధానం చెప్పాడు. “పాపరహితుడవైన ధృతరాష్ట్రుడా! పాండవుల ఆధిక్యం ఔషధాల మహిమ వలన, మంత్రాల బలం వలన ఉద్భవించింది కాదు. ఈ విషయం నేను ముందుగానే నీకు చెప్పాను. పాండవులు న్యాయమూ, సత్యమూ కలిగినవాళ్లు. నీ కొడుకులు న్యాయానికి లోబడరు. వాళ్లు అంతటి పాపం చేస్తుంటే నువ్వు చూస్తూ ఉండిపోయావు. ఆ పాపం ఇలా చెడు చేయకుండా ఎందుకుంటుంది? ధర్మం జయించదా? వాళ్లు గెలవడం, మీరు ఓడడం నిశ్చయం. విదురుడి మాటలు స్పష్టంగా విన్నాము కదా? నువ్వు నన్ను అడిగిన ప్రశ్ననే దుర్యోధనుడు నాలుగవరోజు యుద్ధం ముగిసాక రాత్రి భీష్ముడిని అడిగాడు. భీష్ముడు చెప్పిన సమాధానాన్నే నీకు వివరించి చెప్తాను.

భీష్ముడు దుర్యోధనుడికి ‘నీకు ఇదివరకే ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను. పాండవులకి బాసటగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. అందువల్ల వాళ్లు సాధించలేనిది ఏదీ లేదు. శ్రీకృష్ణుడు పరమాత్మ అవతారం. అతడిని తెలుసుకోగలిగినవాళ్లకి విపత్తులు రావు. పాండవులకి అతడి మహత్తు తెలుసు. వాళ్లు అతడి శరణు పొందారు. నువ్వు శ్రీకృష్ణుడిని లెక్కపెట్టవు.

నీకు ఒక రహస్యం చెప్పగలను. విను. మానససరోవర తీరంలో ఉత్తర దిక్కున ఉన్న కొండ శిఖరం మీద ఒకసారి దేవతలు, మునులు, అప్సరసలు మొదలైనవాళ్లు కొలవగా బ్రహ్మదేవుడు సభ తీర్చాడు. మణులతో దేదీప్యమానంగా ప్రకాశించే విమానం ఆకాశంలో ఉండడాన్ని బ్రహ్మదేవుడు చూశాడు.

ఆ విమానంలో పరమాత్మ ఉన్నట్లు తెలుసుకుని సంతోషంతో తొట్రుపాటుతో లేచి నిలబడి వందనం సమర్పించి ‘జగత్తుల్ని సృష్టించడం, కాపాడడం, నాశనం చేయడం అనే క్రియలందు వినోదించేవాడా! ఋషులందరితో ఆరాధింపబడేవాడా! గొప్ప గుణాభరణాలు కలవాడా! గుణరహితమూర్తీ! దుఃఖాల్నీ, భయాల్నీ పోగొట్టే పాదపద్మాలు కలవాడా! శుభము కలుగచేసే ఆకారం కలవాడా!’ అని ఇంకా అనేక విధాలుగా పరమాత్మని ప్రస్తుతించాడు.

‘నారాయణా! నీకు నేను గౌరవంతో పుట్టి ఈ లోకాలన్నింటినీ గొప్పదైన బుద్ధితో చేశాను. నీ రక్షణే వీటికి ఆధారం (బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పోషణకర్త). ఈ సమయంలో భూలోకం, రాక్షసులు చేసే చెడ్డపనుల వలన మిక్కిలి కలత చెందింది. నువ్వు దయచేసి యదువంశంలో జన్మించవయ్యా. నరుడికి మిత్రుడవైన ఓ విష్ణుదేవా! నువ్వూ, నీ మిత్రుడితోపాటు భూలోకంలో పుట్టి గొప్ప రాక్షసుల వలన బాధలు పోగొట్టి, భూభారాన్ని తీసివేయవయ్యా’ అని బ్రహ్మదేవుడు విష్ణుదేవుడినీ, అతడికి తోడు నీడగా ఉన్న నరుడు అనే పేరుగల మహాత్ముడిని ప్రార్థించాడు.

ఆ నారాయణుడు దయతో కలిసిన క్రీగంటి చూపులతో బ్రహ్మదేవుడిని చూసి ‘సరే – నీ ప్రార్థన ప్రకారమే జరుగుగాక’ అని ఆనతిచ్చి, మాయమయ్యాడు. ఆ బ్రహ్మదేవుడిని చూసి కొలువుకూటంలో ఉన్న వాళ్లందరూ ఆశ్చర్యం పొందారు. ‘బ్రహ్మదేవుడా! నువ్వు అంత గొప్ప వినయం చూపించి భక్తితో ప్రార్థించావు కదా! వాళ్లు ఎవరు?’ అని కొలువుకూటంలోవాళ్లు ప్రశ్నించారు.

బ్రహ్మదేవుడు తను పొందిన అంతులేని సంతృప్తితో ఈ విధంగా సమాధానం చెప్పాడు. ‘వీళ్లు గొప్ప ఋషులు, వీళ్లు ఆది పురుషులు, నరనారాయణులు, నాకు పూజనీయులు. ప్రజల మేలు కోసం, వీళ్లని భూలోకంలో పుట్టమని ప్రార్థించాను. వాళ్లు దయతో నా ప్రార్థన అంగీకరించారు. వినండి. భూమి మీద వినోదంగా పుట్టిన వీళ్లని కేవలం మానవులే అనుకుని లెక్కచెయ్యనివాళ్లు చెడిపోతారు. తెలుసుకుని భక్తితో కొలిచిన వాళ్లకి ఎచ్చటికైనా శుభం కలుగుతుంది’ అని తెలియచేసి బ్రహ్మ తనలోకానికి వెళ్లిపోయాడు. కొలువులో వాళ్లందరూ వాళ్లవాళ్ల స్థానాలకి వెళ్లారు.

ఇక్కడ ఈ వృత్తాంతము నారదుడు, పరశురాముడు, వేదవ్యాసుడు మొదలైనవాళ్ల వల్ల విన్నాను. ఇంతకు ముందే నరనారాయణులతో శత్రుత్వం వద్దని నిన్ను మహామునులు వారించలేదా? నువ్వు మహాగర్వంతో శత్రుత్వాన్ని మానలేదు. ఇకనైనా కృష్ణుణ్ని ఆశ్రయించి పాండవులతో పొత్తుతో మెలిగి బ్రతుకు’ అని చెప్పి భీష్ముడు ఊరుకున్నాడు.

దుర్యోధనుడు ఆ మాటల్ని నిర్లక్ష్యం చేశాడు. నువ్వూ, నీ కొడుకులూ మీకు తగినట్లుగా హితోపదేశాలు చేసే వాళ్ల ఆదేశాలే ఆచరిస్తారు” అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడితో మళ్లీ ఇలా అన్నాడు.

Exit mobile version