Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-183: భీష్ముడి అయిదవరోజు యుద్ధము

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భీష్ముడి అయిదవరోజు యుద్ధము

“పొద్దు పొడవగానే కౌరవసేనలు అలంకారాలు చేసుకుని – భీష్ముడి నాయకత్వంలో సముద్రాలు చెలియలకట్టని దాటి ఉప్పొంగి పొరలేట్లు యుద్ధానికి సన్నద్ధమై వెళ్లాయి. కౌరవసేన ‘మొసలి’ మోహరంగా ఏర్పడింది. పాండవసేన ‘డేగ’ ఆకారంగా ఏర్పడింది. పాండవ వ్యూహంలో డేగ ఆకృతి పన్నాగంలో భీముడు ‘ముఖస్థానం’లో ఉన్నాడు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి రెండు ‘కళ్లు’గా ఏర్పడ్డారు. సాత్యకి ‘తల’ అయ్యాడు. ‘కంఠస్థానం’లో అర్జునుడు నిలిచాడు. ‘ఎడమరెక్క’గా విరాట, ద్రుపదులు; ‘కుడి రెక్క’గా కేకయులు ఉన్నారు. వీపున అభిమన్యుడు, ద్రౌపదీపుత్రులు ఉన్నారు. ‘తోకగా’ నకులసహదేవులతోపాటు ధర్మరాజు నిలబడ్డాడు. ఈ విధంగా కురు, పాండవ బలాలు యుద్ధానికి సన్నద్ధాలై నిలిచాయి.

భూమి ఆకాశం మధ్య భాగాన్ని, తూర్యారావాలు నిండుగా ఆచరించాయి. ఉభయసేనలూ ఒకదానితో ఒకటి ఎదుర్కొన్నాయి. ధృతరాష్ట్రమహారాజా! భీముడు మకరవ్యూహంలో ఆటోపంగా మిరుమిట్లు గొలిపే గర్వంతో ప్రవేశించి చేరాడు. ఆ మకరవ్యూహం సముద్రంలా ఉంది. సముద్రంలో వినోదించే మొసలిలా భీముడు భయంకర స్వరూపంతో అందులో ప్రవేశించాడు.

కౌరవులు భీముడు పన్నిన మకర వ్యూహంలోకి చొరబడి భీష్ముడిని అమ్ముల గుంపుతో కప్పేశాడు. భీష్ముడు నెయ్యి పోసిన అగ్నిలా జ్వలించి పాండవసేనని కార్చిచ్చులో ముంచాడు. అప్పుడు అర్జునుడు వచ్చి, దేవతలు తనకి బహూకరించిన బాణాలు ప్రయోగించి, అడ్డులేని పరాక్రమంతో భీష్ముడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు వచ్చి ఎదుర్కొని భీష్ముణ్ని అరికట్టాడు. కౌరవ సేనని మొత్తాన్ని వెనక్కి మరలేటట్లు విజృంభించాడు.

ఆ సమయంలో నీ కొడుకు దుర్యోధనుడు.. గురువైన ద్రోణుడి దగ్గరికి వచ్చి ‘ద్రోణాచార్యా! మీరు పాండవుల్ని ఉపేక్షిస్తున్నారు. నువ్వూ, భీష్ముడూ కోపిస్తే మిమ్మల్ని దేవతలు కూడా జయించలేరు కదా! అర్జునుడు మన కౌరవ సేనని బాధిస్తుంటే.. మీరు చూస్తూ ఊరుకున్నారేమిటి?’ అని అడిగాడు.

దుర్యోధనుడి మాటలకి ద్రోణాచార్యుడు మనస్సులో బాధపడ్డాడు. దుర్యోధనుడితో ‘మునుపెన్నడూ పాండవుల ఆధిక్యాన్ని తట్టుకోవడం చూడలేదు కదా! సముద్రంలో ఒక సొరకాయ బుర్ర వేస్తే అది గ్రహించగలిగినంత నీళ్లనే గ్రహిస్తుంది. అంతేగాని, సముద్రంలో ఉన్న నీళ్లన్నీ గ్రహించలేదు. మా శక్తి అంతే. ఈ విధంగా రుచించని మాటలెందుకు?’ అని దుర్యోధనుడికి బదులిచ్చి ద్రోణుడు కౌరవసేనని దాటి ముందుకి వచ్చాడు. ఆయన్ని చూసి పాండవసేనలు తొట్రుపడి చెల్లాచెదరయ్యాయి. వెంటనే సాత్యకి వచ్చి ద్రోణుణ్ని ఎదుర్కొన్నాడు.

పాండవసైన్యాన్ని ఎదుర్కొన్న ద్రోణుడు

సాత్యకి ద్రోణుడిమీద బాణాలు వేగంగా గుప్పించాడు. సాత్యకి సాహసానికి నవ్వుకుంటూ ద్రోణుడు గొప్ప బాణంతో కొట్టాడు ద్రోణుణ్ని ఎదుర్కొంటున్న సాత్యకిని చూసి భీముడు అతడికి సాయం వచ్చాడు. ద్రోణుడి మీద వాడి బాణాలు గుప్పించాడు. భీముడు యుద్ధానికి రావడం చూసి భీష్ముడు, శల్యుడు ద్రోణుడికి బాసటగా నిలిచారు.

అప్పుడు భీముడికి అండగా ద్రౌపది కుమారులూ, అభిమన్యుడూ వచ్చి వాడి బాణాలు ద్రోణుడిపైనా, అతడికి సహాయంగా వచ్చిన భీష్ముడి పైనా, శల్యుడి పైనా వేశారు. ఓ ధృతరాష్ట్రమహారాజా! అప్పుడు శిఖండి అమితమైన వేగంతో తన వింటినారినుంచి పెద్ద శబ్దం చేస్తూ ఆకాశమంతా తన బాణాలతో కప్పుతూ వచ్చిన నీ సేనల్ని భయపడేటట్లు చేస్తూ భీష్ముణ్ని ఎదుర్కొన్నాడు.

ఒక ఆడదానితో నేను యుద్ధం చేస్తానా అని అనుకున్న భీష్ముడు యుద్ధం నుంచి తప్పుకున్నాడు. శిఖండితో యుద్ధం చెయ్యడానికి ఇష్టం లేక భీష్ముడు వెళ్లిపోవడం చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ని పురికొల్పాడు. ద్రోణుడు మహా పరాక్రమాన్ని ప్రదర్శించి తన పదునైన బాణాలతో శిఖండిని మరలించాడు. విధంగా కౌరవసేనలు కూడా గొప్ప యుద్ధం చేశాయి. పాండవ సేనలు వాళ్లని ఎదిరించాయి. ఘోరమైన సంకుల సంగ్రామం చెలరేగింది.

రణరంగంలో చెలరేగిన దుమ్ములే మబ్బులు; కత్తులు మొదలైన వాడిగా ఉండే ఆయుధాల నుంచి వెలువడే ధగద్ధగలే మెరుపు తీగల దండలు; అల్లెత్రాటి మోతలే మేఘగర్జనలు, ఆ సమయంలో ఇంక నెత్తుటి వర్షం కురియడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది.

గుర్రాల పేగులు గుట్టలుగా పడిపోయాయి. ఏనుగుల మృతకళేబరాలు దట్టంగా గుట్టగా పడున్నాయి. తెల్లటి బట్టలు నెత్తుటితో తడిసి జేగురు రంగులోకి మారిపోయాయి. అల్లాగే భటుల శరీరాలు కూడా గుట్టలుగా పడి ఉన్నాయి. కౌరవ పాండవ పక్షాలు ఘోరయుద్ధం చేస్తున్నప్పుడు రణరంగం మిక్కిలి భయంకరంగా మారిపోయింది. దిక్కులు కంపించాయి. చారణుల ప్రశంసాగీతాలతో ఆకాశం మారుమోగింది

భీష్ముడు, భీముడు తమ తమ సేనలకి నాయకత్వం వహించారు. భీముడికి అర్జునుడు సాయం చేశాడు. భీష్ముడికి ద్రోడుణు తోడయ్యాడు. వాళ్లిద్దరూ తమ పరాక్రమం, గొప్ప బలం చూపించి పోరాడారు. భీముడు, అర్జునుడు ఒకవైపు, వాళ్లకి ఎదురుగా భీష్ముడు, ద్రోణుడూ పోరాడుతున్నారు. ఆసమయం చూసి, అదే మంచి అదును అనుకుని దుర్యోధనుడు భీముడిని ఎదుర్కొన్నాడు.

కళింగ మత్తేభ యూధాలు భీముడి మీద ఒక్కుమ్మడిగా పడి యుద్ధం చేయడం పరిపాటి. ఒక్క దుర్యోధనుడు ఆ మత్తేభయూధాల సంకుల శక్తిని మేళవించుకుని భీముడి మీద దాడి చేశాడు. దుర్యోధనుడు భీముడిని ఎదుర్కోగానే నీ కొడుకులు అందరూ రథాలు తోలుకుంటూ వెళ్లి భీముణ్ని ఒక్కసారిగా ఎదుర్కొన్నారు. కొండని మబ్బుల దొంతర ఆవరించినట్లు కనిపించింది.

వెంటనే అర్జునుడు అల్లెతాటిని మోగించి వేగంగా గాలి విజృంభించినట్లు అమ్ముల సమూహాన్ని ప్రయోగించాడు. కౌరవసైన్యంలోని రథాలు, ఏనుగులు అన్నీ వెనుకంజ వేసి పారిపోయాయి. ఇంక మిగిలిన కౌరవసేన అంతా చిందరబందరగా మారి చివరికి రణశూరుడూ, సేనాపతీ అయిన భీష్ముడి వెనక్కి వెళ్లి నిలబడింది. కౌరవసైన్యం వెనక్కి వెళ్లిపోయింది. దుర్యోధనుడు ధైర్యంతో ముందుకి వచ్చి, చెయ్యి ఊపి.. తన సేనకి ప్రోత్సాహన్నిచ్చాడు.

శకుని.. సైంధవుడు సింధు, గాంధార, సౌవీర, త్రిగర్త, కళింగ మొదలైన దేశాల సేనల్ని తరలించుకుని వచ్చాడు. వాళ్లు దుశ్శాసనుడి నాయకత్వంలో భీముడిని, అర్జునుడిని ఎదుర్కొన్నారు. ధర్మరాజు.. చేది, కాశ, కరూశ, పాంచాల సైన్యాల్ని ప్రోత్సహించాడు. ధృష్టద్యుమ్నుడు ఆ సేనలకి నాయకత్వం వహించాడు.

ఆ సంగ్రామంలో.. విందానువిందులు – కాశీరాజుని; వికర్ణుడు –భీమసేనుణ్ని, సహదేవుణ్ని; చిత్రసేనుడు – శిఖండిని; దుర్యోధనుడు – విరటుణ్ని; త్రిగర్తులు – నకులుణ్ని; ద్రోణుడు – చేకితాన సాత్యకుల్ని; కృపుడు – కృతవర్మ, ధృష్టద్యుమ్నుణ్ని; అభిమన్యుడు – సాల్వ కేకయుల్ని; ధృష్టకేతువు, ఘాటోత్కచులు – కౌరవరాజు కొడుకుల్ని ఎదుర్కొన్నారు. ధర్మరాజు – శల్యుణ్ని ఎదిరించి యుద్ధం చేశారు.

ఈ భయంకరమైన యుద్ధం మధ్యాహ్నం వరకు నడిచింది. అస్త్రశస్త్రాల వల్ల రేగిన మంటలు పట్టపగలు ప్రకాశించే సూర్యుడి వేడి కిరణాలని మర్చిపోయేలా చేశాయి. ఇంక రథాల్ని తాకి నేలకి ఒరిగిన ఏనుగుల పీనుగులు; ఏనుగుల తొండాలకి తాకి నుగ్గునుగ్గయిన రథాలు; గుర్రాల గిట్టలతో తొక్కబడి నలిగి చచ్చిపోయిన కాలి భటుల కళేబరాలు; కాలిభటుల యొక్క ఎడతెగని దెబ్బలతో ఆగకుండా కారుతున్న నెత్తురు ధారలతో తడిసిన గుర్రాలు ఆకాశంలో సంచరిస్తూ చూస్తున్న వేల్పులకి దుస్సహంగా కనిపించాయి.

భీముడి పోరాటం మిక్కిలి భయంకరంగా సాగింది. భీష్ముడికి కోపం పెరిగి విజృంభించి భీముడి మీద అనేక బాణాలు వేసి అతడి శరీరం తూట్లు పడేలా చేశాడు. తాతైన భీష్ముడు.. మనుమడు అనే అభిమానం ఏమాత్రం లేకుండా వాడి బాణాలు ప్రయోగించి శరీరాన్ని తూట్లు పడేలా చెయ్యడం చూసేసరికి సాత్యకి ఒళ్లు మండిపోయింది. బరికోల చూసిన ఏనుగులా అతడు భీష్ముడి మీద దేవతలు ప్రశంసిస్తుండగా గొప్ప వాడి బాణాలు గుప్పించాడు.

ధృతరాష్ట్రమహారాజా! భీష్ముడు కోపంతో సారథి తల తెగేలా సాత్యకి బాణాన్ని ప్రయోగించాడు. వృష్ణివంశానికి చెందిన వీరుడు సాత్యకి రథ గుర్రాలు రథాన్ని అటు ఇటు ఈడ్చాయి. సైన్యం కలత పడింది. పాండవసేనలోంచి ‘సాత్యకి ఆపదలో చిక్కుకున్నాడు; అతణ్ని ఆదుకోండి; రథాన్ని మరలించండి; పట్టుకోండి; ఇక్కడికి తీసుకుని రండి; అతడి రథానికి అడ్డం నిలవండి; వేగంగా లోపలికి చొరబడండి’ అని అరుపులు వినిపించాయి.

విరథుడైన సాత్యకి మీద బాణాలు వెయ్యడం ఇష్టం లేక నీ తండ్రి భీష్ముడు విజృంభించి పాండవులు పన్నిన వ్యూహాన్ని భుజబలంతో ఛేదించసాగాడు. పిదప విరాటరాజు ప్రళయ సమయంలో యముడిలా విజృంభించి, మిక్కుటమైన సంరంభంతో తాకి, పాండవులు సంతోషించేటట్లుగా మూడు ఘోర బాణాలు భీష్ముడి మీద ప్రయోగించాడు.

విరాటుడు భీష్ముడి గుర్రాల్ని నొప్పించడంతో భీష్ముడికి కోపం వచ్చింది. ఆయన విరాటుడి మీద పది బాణాలు గుప్పించి, అతడి శరీరం మీద రక్తధారలు ప్రకాశించేట్లు బాణాలు ప్రయోగించాడు. భీష్ముడి శరప్రయోగ విన్యాసం చూసి, కౌరవసేనలేకాక, పాండవ సేనలు కూడా ప్రశంసించాయి. అప్పుడు భీష్ముడిని ఎదుర్కొనేందుకు వెడుతుండగా.. ప్రభువైన దుర్యోధనుడు సంతోషించేలా మధ్యలో అతడిని అశ్వత్థామ ఎదుర్కొని ఆరు బాణాలు వేశాడు. ఆ బాణాలు అర్జునుడి శరీరం మీద గుచ్చుకున్నాయి. అయినా అర్జునుడు నవ్వుతూ అశ్వత్థామ విల్లుని ఖండించాడు.

అశ్వత్థామ మరో విల్లు తీసుకుని అర్జునుడి మీద అనేక బాణాలు గుప్పించాడు. తను దెబ్బతిని బాధపడుతున్నా, పోరాటం ఆపకుండా కొనసాగిస్తున్న అశ్వత్థామ మీద దయ, గౌరవం కలిగి, అర్జునుడు బ్రాహ్మణుడితో తీవ్రంగా యుద్ధం చెయ్యడం ఎందుకని ఏదో వంకతో మరోచోటికి వెళ్లిపోయాడు.

భీముడు భయంకరమైన పరాక్రమ గర్వంతో భీష్ముడిని ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడు అడ్డం వచ్చి, పది బాణాలతో భీముడి శరీరం తూట్లు పడేట్లు చేశాడు. భీముడు దుర్యోధనుడి శరీరం తూట్లు పడేట్లు భయంకరమైన చురకత్తి బాణాలతో కొట్టాడు. ఈ విధంగా భీముడు దుర్యోధనుడు భీకరమైన పోరాటం సాగిస్తుండగా చూస్తున్న ప్రజలు ‘విజృంభించే విరోధులనే చీకటిని పారదోలే సూర్యుల్లా వీళ్లిద్దరూ ఈ విధంగా ఘోరంగా పోరాడడం ధృతరాష్ట్రుడు గర్వంతో దురాశతో కూడిన మూఢుడు కావడం చేతనే’ అనుకున్నారు. దుర్యోధనుడికి చిత్రసేనుడు, పురమిత్రుడు, భీష్ముడు తోడుపడ్డాడు.

వీళ్లు మిక్కిలి వేగంతో సేనల్ని తరిమికొట్టగా, వాళ్లని అర్జున కుమారుడు అభిమన్యుడు తన వింటి నారిని మోగిస్తూ ఎదుర్కొన్నాడు. ఏడు బాణాలతో పురమిత్రుడిని, డెభ్బై అమ్ములతో భీష్ముడిని, పది వాడి బాణాలతో చిత్రసేనుడిని అభిమన్యుడు బాధించాడు. తమని ఎన్ని బాణాలతో కొట్టాడో, అన్ని బాణాలతో చిత్రసేనుడు, పురమిత్రుడు అభిమన్యుణ్ని ఎదుర్కొన్నారు.

భయంకరాలైన తొమ్మిది అమ్ములు భీష్ముడు అభిమన్యుడి మీద ప్రయోగించాడు. అభిమన్యుడు చిత్రసేనుడి ధనుస్సు వేగంగా ఖండించి, రథం గుర్రాల్ని నొప్పించి, అతడి కవచాన్ని తూట్లు పడేలా చేసి, శరీరాన్ని గాయపరిచి ప్రకాశించడం చూసి, మిక్కిలి భయంకరంగా ఇతర రాజపుత్రులు వేగంగా సమీపించి బాణవర్షం అతడి మీద కురిపించారు.

అభిమన్యుడు మండు వేసవిలో కార్చిచ్చుతో ఎండిపోయిన అడవిని సులువుగా క్రమ్ముకుని కాల్చేటట్లుగా ప్రకాశవంతమైన బాణాగ్ని జ్వాలలు ఆ కౌరవరాజు పుత్రుల మీద వ్యాపింపచేశాడు. యుద్ధభూమిలో అందరూ పొగిడే ప్రకాశవంతమైన గుర్రాలు కలిగన అభిమన్యుడు నాట్యంచేసే శివుడిలా విజృంభించి శత్రువులు మెచ్చుకునేలా రణరంగంలో పరాక్రమంతో కూడిన నృత్యం చేశాడు.

అభిమన్యుడు లక్ష్మణకుమారుల యుద్ధము

విజృంభిస్తూ కౌరవసేనని బాధిస్తున్న అభిమన్యుణ్ని చూసి, రోషంతో శుభలక్షణాలు కలిగిన లక్ష్మణకుమారుడు అభిమన్యుణ్ని ఎదుర్కొని అనేక మంత్రబాణాల్ని ఉత్సాహంతో వర్షించాడు. అభిమన్యుడు ఆరు బాణాల్ని అతిశయించిన కోపంతో లక్ష్మణకుమారుడి కోమలమైన ఉదరంలో నాటుకునేట్లుగా ప్రయోగించాడు. లక్ష్మణ కుమారుడు వెనుకంజ వేయకుండా అర్జునకుమారుడైన అభిమన్యుడి మీద గట్టిబాణాలు వేశాడు.

అభిమన్యుడు ఆగ్రహంతో లక్ష్మణ కుమారుడి గుర్రాల్ని మొదట సంహరించి తదుపరి సారథిని కూల్చివేశాడు. మీ మనుమడు లక్ష్మణకుమారుడు రథం పోగొట్టుకున్నా భయపడకుండా, ‘శక్తి’ని అభిమన్యుడి మీద విసిరాడు. ఆ శక్తిని దేవేంద్రుడి మనుమడైన అభిమన్యుడు తన బాణలతో ఖండించాడు. శక్తిని ఖండించి, లక్ష్మణకుమారుడి శరీరం తూట్లు పడేలా అభిమన్యుడు అమ్ములు గుప్పించాడు.

అభిమన్యుడి చేతి బలం కౌశలం చూసి, కృపుడు రాజకుమారుడైన లక్ష్మణకుమారుణ్ని తన రథం మీదకి ఎక్కించుకుని ఆ స్థలం నుంచి తప్పించి తెచ్చాడు. కౌరవసేనలోని యోధవీరుల్ని ప్రోత్సహిస్తూ భీష్ముడు అప్పుడు పోరాటంలో విజృంభించాడు. ఏనుగుల, గుర్రాల, మనుష్యుల పీనుగులతో దట్టమైన వేల మబ్బులతో దట్టంగా కనిపించే ఆకాశంలా కనపడింది.

సాత్యకి విజృంభించి బాణాల్ని కౌరవసేనమీద గుప్పించాడు. అతడి బాణప్రయోగ విన్యాసం – ఆశ్చర్యకరం. లక్ష్యాల్ని సులువుగా స్ఫుటంగా తాకి, కౌరవసేనని కలిచివేశాయి. గొప్ప మనసుగల భూరిశ్రవుడు కూడా ఆహుతి చెయ్యబడిన అగ్నిలా మిక్కుటంగా జ్వలించి, సాత్యకిని ఎదుర్కొన్నాడు.

భూరిశ్రవుడు ప్రళయకాలంలో అగ్నిలా జ్వలించి, విజృంభించి, అమ్ములనే అగ్నిజ్వాలల్ని ప్రజ్వరిల్ల చేస్తుంటే భయపడి, సాత్యకితోపాటు యుద్ధం చేస్తున్న యోధులు వెనక్కి మరలారు. అప్పుడు సాత్యకి కొడుకులు పదిమంది ఘోరపరాక్రమంతో కౌరవశ్రేష్ఠుడైన భూరిశ్రవుడితో ‘ఓ! భూరిశ్రవా! ఏకాంత యుద్ధం (ఎక్కటికయ్యం) చెయ్యాలనే ఉదేశ్యంతో ఉత్సాహంగా వచ్చాము. ఎవ్వరూ మమ్మల్ని అడ్డగించలేరు. మాలో ఎవరో ఒకరిని నువ్వు ఎన్నుకుని యుద్ధం చెయ్యవచ్చు’ అన్నారు.

వాళ్ల మాటలు విని భూరిశ్రవుడు నవ్వుతూ ‘మీలో ఏ ఒక్కళ్లూ నా బాణధాటికి ఆగలేరు. మీకు చేతనైతే మీరందరూ నా చుట్టుపక్కల చేరి, నా మీద వాడి బాణాలు ప్రయోగించి పోరాడండి’ అన్నాడు. వాళ్లు కౌరవశ్రేష్ఠుడైన భూరిశ్రవుడి మీద బాణాలు ప్రయోగించారు. భూరిశ్రవుడు వాళ్ల బాణాలు ఖండించి వాళ్లనందర్నీ బాణవర్షంలో ముంచాడు. వృష్ణివంశీయులు సాత్యకి కొడుకులు మొక్కవోని పరాక్రమంతో కురువీరుడు భూరిశ్రవుడి మీద బాణవర్షం కురిపించారు. భూరిశ్రవుడు అమితమైన కోపంతో వాళ్లందరి ధనువులు ఖండించాడు. పది ధనుస్సులు ఖండించి తరువాత పదితలలు ఖండించి భూదేవికి బలిచ్చాడు. కౌరవసేనలు ఉప్పొంగిపోయాయి.

సాత్యకి కోపమూ, దుఃఖమూ కలగగా శత్రుసేన కలత చెందగా భూరిశ్రవుడి పైకి రథం తోలించాడు. రెండు రథాలూ ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. సాత్యకి భూరిశ్రవుడి సారథిని, గుర్రాల్ని సంహరించాడు. భూరిశ్రవుడు కూడా అట్లాగే చేశాడు. ఇద్దరూ రథాలు లేకుండా లంఘించి కత్తులు దూసి నిలబడగా భీముడు వచ్చి సాత్యకిని తన రథం మీదకి ఎక్కించుకుని పోయాడు.

అలాగే భూరిశ్రవుణ్ని కురురాజైన దుర్యోధనుడు గౌరవంగా తన రథం మీదకి ఎక్కించుకున్నాడు. అందరూ సంతోషంగా వెళ్లారు. ‘మలిసంజలో కలిసే సూర్యుణ్ని చూసి పొద్దు కుంకుతోంది. ఈ శత్రువులు యుద్ధం విడిచి శిబిరాలకి వెళ్లిపోతారు” అనుకొని అర్జునుడు నీ రథికులందరి మీద మంత్ర బాణాలు ప్రయోగించి అర్జునుడు కౌరవ సైనికుల్ని సంహరించడం చూసి సహించలేక పోయాడు సేనాపతి భీష్ముడు.

ఇరవై అయిదువేల రథాల్ని పోరాటానికి ప్రోత్సహించాడు. ఆ రథికులు అందరూ కలిసి వ్యాపించి అర్జునుణ్ని ఎదుర్కొన్నారు. వేగంగా ఇరవై అయిదువేల రథాలు ఎదుర్కొన్నాయి. కాని, అవి అర్జనుడి అమ్ములనే అగ్ని కార్చిచ్చులో పడి మరణించే శలభాల్లా మాడి పొడిపొడి అయ్యాయి. కౌరవసేన అతిశయం అణగారిపోయింది. రశ్మి తగ్గి, అంతకుముందే ఎర్రదనం శోభిల్లగా, సూర్యుడు పడమట కొండ శిరస్సున మెరుస్తూ రక్తసిక్తమైన యుద్ధభూమికి అలంకారమయ్యాడు.

అది సాయంకాల సమయసూచకం. దానితో భీష్ముడు తన హృదయంలో ఈ విధంగా అనుకొన్నాడు. ‘వాహనాలన్నీ అలిసిపోయాయి. సాయంకాలం అవుతోంది. ఇంక యుద్ధం చెయ్యడం ఎందుకు? విరమించడం మంచిది’ అని ఆలోచించి, ఈ విషయాన్ని ద్రోణాచార్యులు మొదలైనవాళ్లకి చెప్పి, సేనల పోరు ఆపించారు.

అందరూ కాగడాల కాంతులలో తమతమ విడుదులకి చేరారు. ధృతరాష్ట్రమహారాజా! రాత్రులందు కురు పాండవ పక్షాలలో రెండింటికీ సంబంధించిన భటులు హృదయానికి ఆనందం కలిగించే సంగీత సభలలో సాహిత్య గోష్ఠులలో కాలక్షేపం చేస్తూ ఉంటారు.”

Exit mobile version