Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-184: భీష్ముడి ఆరవరోజు యుద్ధము

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భీష్ముడి ఆరవరోజు యుద్ధము

“కురుక్షేత్రంలో ఏడవనాటి రాత్రి జరిగిపోయింది. తెల్లవారేటప్పుడు, అర్జునుడు ధృష్టద్యుమ్నుడిని, రావించి ‘మొసలి మొగ్గరం’ ఏర్పాటు చేయమన్నాడు. ధృష్టద్యుమ్నుడు అందరూ సంతోషించేటట్లుగా మకరవ్యూహం తీర్చి దిద్దాడు. అర్జునుడు, ద్రుపదరాజు ‘తలగా’ ఏర్పడ్డారు. నకుల సహదేవులు ‘కళ్ల’య్యారు. భీముడు ‘నోరు చివర’ నిలబడ్డాడు. అభిమన్యుడు, ద్రౌపది కొడుకులు, ఘాటోత్కచుడు ‘కపోలముల’య్యారు.

సాత్యకితో పాటుగా ధర్మరాజు ‘కంఠం’ దగ్గర నిలిచాడు. ధృష్టద్యుమ్నుడితోపాటు విరాటరాజు ‘వెన్ను’ దగ్గర ఉన్నాడు. కేకయరాజులు ‘ఎడమప్రక్కగా’, ధృష్టకేతుడు కరూశరాజుని ‘కుడిపక్కగా’ నిలబడ్డారు. కుంతిభోజుడు, శతానీకుడు ‘మొల’ దగ్గర ఉన్నారు. శిఖండి, ఇరావంతుడు ‘తోక’గా అయ్యారు.

భీష్ముడు మొసలి మొగ్గరానికి సాటిగా ‘క్రౌంచవ్యూహం’ ఏర్పాటు చేశాడు. తాను ద్రోణుడితోపాటు ముక్కు దగ్గర నిలిచాడు. కృపుడు, అశ్వత్థామ కళ్లయ్యారు. శిరస్సు దగ్గర కృతవర్మ, కాంభోజుడు, బాహ్లికుడు నిలిచారు. కుత్తుక దగ్గర శూరసేన రాజుతోపాటుగా దుర్యోధనుడు నిలబడ్డాడు. వక్షం దగ్గర సౌవీర రాజుతోపాటు, భగదత్తుడు ఉన్నాడు. వీపున విందుడు, అనువిందుడు నిలబడ్డారు. ఎడమప్రక్క సుశర్మ, కుడిప్రక్క యవనరాజు నిలబడ్డారు. వెనుకగా శ్రుతాయువుతో కలిసి భూరిశ్రవుడు నిలబడ్డాడు. ఈ విధంగా కురుసేన, పాండవసేన యుద్ధానికి సమాయత్తమై వెళ్లారు.

శంఖాలు, భేరులు మొదలైన జంత్రవాద్యాల ధ్వనులు మిన్నుముట్టాయి. ఆ సమయంలో పైకి ఎగిరి వెళ్లి విరిసే ద్రోణుడి శక్తిసామర్థ్యాలకి ఓర్వలేక, భీముడు మిక్కుటమైన కోపంతో ద్రోణుడి సేన వైపుకి తన రథం వేగంగా నడిపించాడు.

భీముడు ఈ విధంగా రథాన్ని నడిపించగా, అతడికి ఎదురు నిలవలేక తన ముందుగా నిలిచిన వీరులు వెనక్కి తిరిగి పారిపోగా, ద్రోణుడు ఆగ్రహంతో భీముడి శరీరం మీద తొమ్మిది అమ్ములు నాటేలా వేశాడు. భీముడు మిక్కిలి వాడిగా ఉన్న ఈటె బాణంతో ద్రోణాచార్యుడి సారథిని సంహరించాడు. సారథి మరణించగా తానే తన రథాన్ని నడుపుతూ గుర్రాల్ని తానే తోలుకుంటూ, యుద్ధం మీద ఉత్సాహం విడిచిపెట్టకుండా పరాక్రమం చూపిస్తూ శత్రువుల వ్యూహాన్ని చెదరగొడుతూ యుద్ధం కొనసాగించాడు.

నీ తండ్రి భీష్ముడు ద్రోణుడికి తోడుగా నిలిచి తరచుగా కేకయులు భయంతో, ఆందోళనతో, గాలిచేత చెదరగొట్టబడిన మబ్బుల్లా వెనక్కి తరలారు. విస్తీర్ణాలయిన సృంజయ సేనలు వెనువెంటనే ఓడిపోయాయి. రాజా! భీముడు విజృంభించిన కారణంగా కౌరవసేనకి విపరీతంగా నష్టం కలిగింది. ఇటు దుర్యోధనుడు, అటు ధర్మరాజు తమ సేనలని ప్రోత్సహించసాగారు. ఈ రీతిగా ధర్మరాజుని దుర్యోధనుడు ప్రోత్సహించగా, మకరవ్యూహంగా, క్రౌంచ వ్యూహంగా ఏర్పడిన పాండవ, కౌరవ సేనలు రెండూ, పరాక్రమంతో ఎదుర్కొన్నాయి” అని చెప్పాడు సంజయుడు.

ధృతరాష్ట్రుడు సంజయుడితో “మన సేనలో గొప్ప యోధులు ఎక్కువగా ఉన్నారు కదా! అయినా ఆ పాండవ సేనని జయించలేకుండా ఉన్నారు. ఇది దైవకృతమే కదా! పైగా ఆశ్చర్యకరమైనది కదా! ఇలా జరగవచ్చని విదురుడు ముందే చెప్పాడు. ఎన్ని విధాలుగా చెప్పినా దుర్యోధనుడు వినలేదు. కీడు తెచ్చుకున్నాడు. నా కొడుకు చెడ్డవాడు. అయితే, అది వాడి కర్మ. దైవకృతం ఎవరు తప్పించగలరు? బుద్ధి కర్మని అనుసరిస్తుంది. అంతే! ఇంక ఏ విధంగా జరగాలో అదే విధంగా జరుగుతుంది” అన్నాడు ధృతరాష్ట్రుడు.

అతడు చెప్పిన మాటలు విని సంజయుడు “ధృతరాష్ట్ర మహారాజా! నువ్వు దుర్యోధనుణ్ని నిందిస్తున్నావు. ఆ నింద వల్ల ప్రయోజనం ఏముంది? ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి నీ ఉపేక్షే కారణం. ఆనాటి జూదమే ఈనాడు యుద్ధంగా పరిణమించింది. ఓ! ధృతరాష్ట్రమహారాజా! ఇంక నువ్వు పశ్చాత్తాపం విడిచిపెట్టి విను!

ఆ సమయంలో భీముడు నీ సేనాసాగరాన్ని పాయలుగా చేసి ఒక చోట పలువురు నీ కుమారులు- దుశ్శాసనుడు, దుర్వుషహుడు, దుర్మదుడు, దుస్సహుడు, జయుడు, జయత్సేనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, సుదర్శనుడు, చారుమిత్రుడు, సువర్ముడు, దుష్కర్ణుడు, ఒక చోట కనిపించగా, మంచి అవకాశం దొరికినట్లు సంతోషించి వాళ్లని ఎదుర్కొన్నాడు.

కౌరవరాజ కుమారులు అందరు ‘భీముడు ఒక్కడూ ఏకాంతంగా ఒకచోట కనిపించాడు కదా! ఇప్పుడు ఇతడిని వదలరాదు. ఇది మంచి అవకాశం. మనమందరం ఇతడిని చుట్టుముట్టి చంపుదాము’ అని ప్రత్యక్షంగా దొరికిన సన్నివేశాన్ని సంగ్రహించి, పేరు పేరున ఒకళ్లనొకళ్లు హెచ్చరించుకొన్నారు.

భయంకరమైన ఆకాశగోళాలు, ప్రళయకాలంలో సూర్యుడు ముట్టడించేటట్లుగా, కౌరవ రాజకుమారులు గొప్ప పరాక్రమంతో, గర్వంతో, ఆటోపంతో, శత్రువుల్ని జయించాలనే కోరికతోనే ఉన్న భీముడిని వేగంగా ఎదుర్కొన్నారు. ఈ విధంగా నీ కొడుకులు చతురంగ బలాలతో భీముణ్ని చుట్టుముట్టారు. భీముడికి మంచి అవకాశం దొరికినందుకు సంతోషం కలిగింది. అతడు రథ సారథిని ‘నువ్వు ఈ రథాన్ని ఇక్కడే భద్రంగా పెట్టుకుని ఉండు’ అని ఆజ్ఞాపించి నేలమీదకి ఉరికాడు.

భీముడు ప్రళయకాలంలో యముడిలా విజృంభించి, ఏనుగుల కుంభస్థలాలు పగులగొట్టాడు. తొండాలు నరికేశాడు. పొట్టలు ముక్కలు ముక్కలుగా చేశాడు. తన జవసత్వాలు చూపించాడు. రక్తం కారుతుంటే అవి గైరికాది ధాతువులతో సెలయేరులతో కూడిన పర్వతాలుగా భాసించాయి. ఆ ఎనుగులు నేలమీద కూలపడిపోయాయి.

రణరంగంలో భీముడు వీరవిహారం చేశాడు. గదాయుధం ధరించి రణరంగంలో రథం వెళ్లలేని చోట్లకి వెళ్లగలిగాడు. రథాలని చూర్ణం చేశాడు. గుర్రాల్ని చిన్న ముక్కలుగా చేశాడు. కాల్బలం ముక్క చెక్కలయింది. పాదచారిగా వెళ్లిన భీముడి ధాటికి ఎదురులేకపోయింది. భీముడు రథం లేకుండా అనేక మందితో పోరాడాడు. ఓ! ధృతర్రాష్ట్ర మహారాజా! అతడి గొప్ప పరాక్రమం చూసేవాళ్లకి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. భీముణ్ని ఎంతోమంది కౌరవరాజు కొడుకులు తమ సేనలతో ఎదుర్కోవడం చూసి అంతవరకు ద్రోణుడితో ఎడతెగని పరాక్రమంతో పోరాడుతున్న ధృష్టద్యుమ్నుడు ఆ పోరాటాన్ని విరమించాడు. రథ సారథిని భీముడున్న చోటికి రథాన్ని వేగంగా తోలమని ఆజ్ఞాపించాడు. రథం అటువైపు తరలింది. అక్కడ రథం మీద భీముడు కనిపించలేదు. సారథి మాత్రమే ఆ రథం మీద కూర్చుని కనిపించాడు.

ధృష్టద్యుమ్నుడు దుఃఖంతో పూడిపోయిన గొంతుతో విశోకుడితో “భీముడు ఎక్కడ ఉన్నాడు? అతడి ఏమయినా అయితే నా శరీరంలో ప్రాణాలు ఉండవు. అయ్యో! నేనేం కావాలి? ఏమి జరిగిందో చెప్పవయ్యా!” అని అడిగాడు.

ధృష్టద్యుమ్నుడు అడిగినదానికి విశోకుడు ‘ధృతరాష్ట్ర్ర రాజకుమారులు గుమిగూడి మిక్కిలి భయంకరంగా భీముణ్ని చుట్టుముట్టారు. భీముడు గర్వంతో గద చేత్తో పట్టుకుని, రథం దిగి, నన్ను ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించి, లేడి గుంపు మీద దూకే సింహంలా యుద్ధం చెయ్యగల శక్తి సామర్థ్యాలు గల భీముడు వాళ్ల సైన్యంలోకి ప్రవేశించాడు’ అని చెప్పాడు.

భీమసేనుడికి సహాయపడిన ధృష్టద్యుమ్నుడు

విశోకుడు చూపించినవైపు వేగంగా వెళ్లి నేలమీద పడిన యేనుగుల గుంపుల్ని దాటుకుంటూ భీముడు వెళ్లిన దారిని వెతుక్కుంటూ వేగంగా రథాన్ని నడిపిస్తూ ‘ఓ! బకాసురుణ్ని సంహరించిన భీమా! నిన్ను కలుసుకుని నీకు సహాయపడాలని నేను వచ్చాను. ఇంక నువ్వు క్షేమంగా యుద్ధం చెయ్యవచ్చు. నిన్ను ఎదుర్కొన్న ఈ యోధుల్ని అందరినీ నేను అణిచేస్తాను’ అంటూ కౌరవుల సమూహాన్ని ఎదుర్కొన్నాడు.

ఆ తరుణంలో, నీ కొడుకు దుశ్శాసనుడు, కంఠస్వరం పెద్దదిగా చేసి, యోధ వీరులతో ఇలా అన్నాడు ‘ఈ దుర్మార్గుణ్ని చుట్టుముట్టండి! భీముడికి సహాయపడడానికి వచ్చిన ఇతణ్ని మీ పరాక్రమంతో మానిపించండి’ అన్నాడు.

అతడి మాటలు విని కౌరవ రాజకుమారులు అందరూ కలిసి ధృష్టద్యుమ్నుణ్ని చుట్టుముట్టారు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడు తనకిచ్చిన ‘ప్రమోహన’ అనే బాణాన్ని ప్రయోగించి రాజకుమారులు మూర్ఛలో మునిగేలా చేశాడు. భీముడు ఆ వ్యవధిని పురస్కరించుకుని ఒక మడుగులో చల్లటి తియ్యటి నీళ్లు తాగి ధృష్టద్యుమ్నుణ్ని కలుసుకున్నాడు.

అప్పుడు ద్రోణుడు సైన్యానికి ముందు భాగంలో ఉండే ధృష్టద్యుమ్నుడు కనిపించక దొరికిన సమయాన్ని ఉపయోగించుకుని ద్రుపదరాజుని తరిమికొట్టాడు. విజయగర్వంతో ద్రోణుడు శంఖం పూరించాడు. ద్రుపదుణ్ని తరిమికొట్టాక ధృష్టద్యుమ్నుడు ఎటు వెళ్లాడో వెతుక్కుంటూ వెళ్లి ప్రమోహన బాణంతో మూర్ఛపోయిన యోధుల్ని చూసి వేగంగా అక్కడికి వెళ్లి, ద్రోణుడు ప్రజ్ఞాబాణం ప్రయోగించి, మోహనబాణ శక్తిని పోగొట్టాడు. అప్పుడు తిరిగి కోలుకున్న ఆ కౌరవరాజపుత్రులు మళ్లీ యుద్ధం ప్రారంభించారు. ఈ విధంగా ద్రోణుడి సాయం వల్ల నీ కొడుకులు భీముడి మీద, ధృష్టద్యుమ్నుడు మీద విజృంభించారు.

అది చూసి ధర్మరాజు కేకయుల్ని అయిదుగుర్నీ; దౌపది కొడుకుల్ని అయిదుగుర్నీ; అభిమన్యుడి ముందు పెట్టుకుని వెళ్లి భీముడికి ధృష్టద్యుమ్నుడికీ సాయం చెయ్యమని ఆదేశించాడు. ఆ పన్నెండుమంది అంటే కేకయులు అయిదుగురూ, ఉపపాండవులు అయిదుగురూ, అభిమన్యుడూ, ధృష్టకేతుడూ తమ సైన్యాలతో సహా ఎదుర్కొన్నారు.

ద్రుపదరాజు కొడుకు ధృష్టద్యుమ్నుడు, భీముడు నీ సేన యొక్క అతిశయం అణగారి పోయేలా విజృంభించారు. ‘శత్రువులకి భయం కలిగించే భుజపరాక్రమం కలిగిన ఓ భీమసేనా! ఇది దొమ్మి యుద్ధం. నువ్వు ఈ విధంగా పాదచారివి కాకూడదు’ అని చెప్పి భీముణ్ని, కేకయుణ్ని రథం మీద ఎక్కమన్నాడు ధృష్టద్యుమ్నుడు.

ఆ సమయంలో ద్రోణుడు మధ్యాహ్నకాలంలో సూర్యుడిలా ఆ పాండవసేనల మీద తీవ్రమైన వాడి బాణాల్ని అతి వేగంగా ప్రయోగించాడు. ద్రోణుడి విజృంభణ చూసి ధృష్టద్యుమ్నుడు ధీరుడై ఉత్సాహంతో అతణ్ని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి విల్లు ఖండించాడు. వెనువెంటనే అతడి శరీరం మీద అమ్ములు గుప్పాడు. ధృష్టద్యుమ్నుడు వేరొక విల్లు పట్టుకుని ద్రోణుడి మీద డెభ్బై బాణాలు వేశాడు.

ద్రోణుడు ఆగ్రహించి భయంకరంగా ధృష్టద్యుమ్నుడి ధనుస్సు ఖండించాడు అమితమైన కోపంతో నాలుగు బాణాలతో అతడి గుర్రాల్ని, ఒక బాణంతో అతడి సారథిని- దేవతల్ని కీర్తించేటట్లుగా నేలపై కూల్చాడు. రథం పోగొట్టుకున్న ధృష్టద్యుమ్నుడు అభిమన్యుడి రథం మీదకి ఎక్కాడు. అతడి సేన ద్రోణుడి ధాటికి తట్టుకోలేక పారిపోయింది. అప్పుడు అతడు, భీముడు పారిపోయే సేనని ఆపారు. ఆ సమయంలో దుర్యోధనుడు తన రథ సేనతో వచ్చి సగర్వంగా భీముణ్ని చుట్టుముట్టాడు.”

Exit mobile version