Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-185: ద్రోణుడితో యుద్ధం చేసిన దృష్టద్యుమ్నుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ద్రోణుడితో యుద్ధం చేసిన దృష్టద్యుమ్నుడు

“అంతట మరియొక సారథి మిక్కిలి వేగంతో అతి వేగంగా పరుగెత్తే గుర్రాల్ని కట్టి తీసుకునిరాగా ధృష్టద్యుమ్నుడు తన రథమెక్కి గొప్ప పరాక్రమంతో ద్రోణుడి మీద విజృంభించాడు. ద్రోణుడితో ధృష్టద్యుమ్నుడు పోరాటం చూసి భీముడు కూడా తన రథసారథి విశోకుణ్ని రమ్మని రథాన్ని అక్కడికి తోలమన్నాడు.

ఉప్పొంగుతున్న ఉత్సాహంతో దుర్యోధనుడి మీద అమ్ములవాన కురిపించాడు. దుర్యోధనుడు ఒక్క బాణంతో భీముడి వక్షం మీద కొట్టాడు. భీముడు – మూడు బాణాల్ని, దుర్యోధనుడి రెండు చేతుల్లోను, రొమ్ము మీద గుచ్చుకునేట్లుగా భయంకరంగా ప్రయోగించాడు. దుర్యోధనుడు భీముడి బాణాలకి చలించక, అతడి మీద అనేక అమ్ములు ప్రయోగించాడు. దుర్యోధనుడు, అతడి తమ్ముళ్లు అతడి పైకి విజృంభించి, ఆ భీమసేనుణ్ని పట్టుకోవాలని, ఉత్సాహంతో అతణ్ని ఎదుర్కొన్నారు.

అప్పుడు అభిమన్యుడు, ద్రౌపది తనయులు ధృష్టకేతుడు, కేకయులు అందరూ భీముడికి బాసటగా నిలిచారు. భీముడు, వాళ్లందరు కలిసి భయంకరంగా కౌరవరాజకుమారుల మీద విజృంభించారు. వాళ్ల ధాటికి కౌరవరాజకుమారులు తట్టుకోలేకపోయారు. నీ కుమారవర్గం ఓడిపోయి భయంతో వేగంగా పారిపోయారు.

భీముడు తనకి లభించిన అవకాశం తప్పిపోయిందనీ, వాళ్లందరూ తనచేత చావకుండ తప్పించుకున్నారనీ మిక్కిలి విచారించాడు. తమ్ముళ్లని ఓడించి తరిమినందుకు దుర్యోధనుడికి కోపం వచ్చింది. అతడు సేనను ప్రోత్సహించి, సంరంభంతో భీముడు మొదలైన వీరులమీద విజృంభించాడు. మధ్యాహ్నం దాటిన వేళలో శత్రువులకి భయంకరుడైన భీముడికీ, కౌరవరాజైన దుర్యోధనుడికీ మధ్య వీలులేని భయంకరమైన సంగ్రామం జరిగింది.

ఆ సమయంలో వికర్ణుడు, చిత్రసేనుడు అర్జునుణ్ని కొడుకైన అభిమన్యుణ్ని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు ఆ వికర్ణుడి గుర్రాల్ని సంహరించి, విరథుడై అతడి మీద ఇరవై బాణాలు ప్రయోగించి అతణ్ని నొప్పించాడు. అతడు భయపడి చిత్రసేనుడి రథం మీదకి వెళ్లాడు. ద్రౌపది కొడుకులు అయిదుగురు భీముడికి సాయంగా వచ్చి, కురుపతి దుర్యోధనుడి మీద ప్రకాశించే బాణాల్ని వేసి, అయిదు బాణాలతో అతడిని నొప్పించి తరిమివేశారు.

అంతలో భీష్ముడు శత్రుసేనలో ప్రవేశించాడు. సేనాపతి అయిన భీష్ముడు ప్రవేశించి, పాండవసేన చేరిపోయేటట్లు చేశాడు. అంతలో అర్జునుడు వచ్చి భీష్ముడిని ఎదుర్కొన్నాడు. రెండు పక్షాలూ ఉత్సాహంతో పోరాటం కొనసాగించాయి. రక్తనదులలో రథాలని పడవలుగా ఉపయోగించి, వీరవరులు భుజబలం ప్రకాశించేలా పరాక్రమంతో విజృంభించి ఒకళ్లనొకళ్లు ఒరుసుకుంటూ రక్తజలక్రీడగా యుద్ధమనే ఆట ఆడారు.

అంతలో అరుణకిరణుడు తన ఎర్రటి కిరణాలతో తన పేరుకి తగినట్లుగా వచ్చాడు. భీముడు ‘ఈ రోజే దుర్యోధనుణ్ని సంహరించగలను’ అని అనుకుని తన రథాన్నిఅతడికి చేరువగా తోలించాడు. అతడి మొహంలో కోపం, మోహం ఆవరించాయి. భాగ్యవశం వల్ల చాలాకాలం నుంచి కోరుకుంటున్న పండుగ ఈరోజు సమకూడింది. కుంతీదేవి పడిన కష్టాన్నీ, ఆమె కోడలు ద్రౌపది యొక్క భంగపాటునీ తీరుస్తాను.

కృష్ణుడు రాయబారిగా వెళ్లి చేసిన బోధను నువ్వు లెక్కచేయకుండా ఉండడం ఉలూకుణ్ని పంపించి సభలో మాట్లాడించిన పరుషవాక్యాల్ని నీతో కక్కించి, నువ్వు పౌరుషం దక్కించుకోకుండా నిన్ను చంపే అవకాశం నాకు లభించింది. మగతనం కలిగి పారిపోకుండా నిలవమని, భీముడు భయంకరంగా దుర్యోధనుణ్ని ఎదుర్కొన్నాడు. అతడి రథానికి పూన్చిన గుర్రాల్ని, సారథిని చంపి, దుర్యోధనుడి విల్లు విరిచి వెలిగే జెండా కర్రని పరాక్రమంతో నరికి ప్రకాశించాడు.

దుర్యోధనుడు వేగంగా మరొక ధనువు గ్రహించేలోపుగానే, భీముడు పది తూపులతో కొట్టాడు. భుజబలంతో ఆ బాణాలు పాములు పుట్టలో చేరినట్లుగా దుర్యోధనుడి శరీరంలో ఎముకలని తాకి, గాయాలు చేశాయి. నెత్తురు కారిపోతూ ఉండగా దుర్యోధనుడు మూర్ఛ చెంది, స్పృహతప్పి పడిపోయాడు.

ఆ సమయంలో జయద్రథుడు వీరవరులతోపాటు భీముడిమీద విజృంభించాడు. అప్పుడు మూర్ఛిల్లిన దుర్యోధనుడిని కృపాచార్యుడు తన మీదకి ఎక్కించుకుని వెళ్లాడు. అభిమన్యుడు, ద్రౌపదేయులు, కేకయులు, భీముడిని దాటివెళ్లి, సైంధవుడిని ఎదుర్కొన్నారు. చిత్రసేనుడు, చిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, సులోచనుడు, నందుడు, ఉపనందుడు భయంకరంగా అభిమన్యుణ్ని చుట్టుముట్టారు.

బలశాలి అయిన అభిమన్యుడు అవకాశం చూసుకుని ఒక్కొళ్లని అయిదయిదు బాణాలతో నొప్పించగా వాళ్లు భయపడకుండా వేగంగా అతడిని అస్త్ర ధారలతో ముంచారు. సోదరులకి తోడ్పాటునందిచడానికి రథాన్ని కోల్పోవడం చేత వికర్ణుడు యుద్ధరంగం నుంచి వెళ్లిపోయినవాడు అవడం వల్ల అంతకుముందు విరథుడై వెళ్లిన వికర్ణుడు మళ్లీ వచ్చి తన్ను ఎదుర్కొన్నాడు.

అభిమన్యుడు కోపంతో అతడి అతిశయం అణగారిపోయేట్లు వింటిని తుంచి సారథిని సంహరించి, గుర్రాల్ని కూల్చి, కొత్తవెలుగులతో పాటు అతడి జెండాను భూమి మీద పడగొట్టాడు. అతడి అవయవాలు నొచ్చేటట్లు అవలీలగా తన గర్వం వెల్లడి అయేటట్లు బాణాలు వేగంగా ప్రయోగించాడు.

ద్రౌపది కొడుకులు అయిదుమంది పరాక్రమంతో అభిమన్యుడిని దాటి కౌరవరాజకుమారుల గుర్రాల్ని నొప్పించారు. జెండాల్ని త్రుంచాడు. వాళ్ల పరాక్రమం తగ్గిపోగా అమ్ములవానలో ముంచి నొప్పించాడు. అయితే నీ కుమారులు సిగ్గు అహంకారాన్ని పెంచగా వెనుతిరిగిపోకుండా నిలిచి ద్రౌపదేయులతో పోరాడారు. ఆ సమయంలో నకులుడి కొడుకైన శతానీకుడు పరాక్రమం ప్రదర్శించి, విజృంభించాడు. కేకయ దేశాధిపతులు, ద్రుపదుడు అతడికి బాసటగా చేరి నిలిచారు. వాళ్లు రథ, తురగ, గజ, సమూహాలతో శత్రువుల్ని ఎదుర్కొన్నాడు. అప్పుడు సూర్యుడు పడమటి కొండ మాటున చేరి అదృశ్యమయ్యాడు.

భీష్ముడు ప్రళయకాలంలోని యముడిలా విజృంభించి పాండవుల మొగ్గరాన్ని చీల్చి, తన సేనల్ని ఉపసంహరించి, విడుదులకి పొమ్మన్నాడు. తాను తన శిబిరానికి వెళ్లాడు. ఆనాటికి యుద్ధ విరమణ జరిగింది. పాండవులు డస్సిపోయి, చెమటలు కారే దేహాలతో తమ విడుదులకి వెళ్లిపోయారు” అని సంజయుడు ఆ విధంగా కురుక్షేత్ర సంగ్రామంలోని ఆరవరోజు తీరు తెన్నులు తెలియచేశాడు.

అంతా విని ధృతరాష్ట్రుడు సంజయుణ్ని ప్రశంసిస్తూ “సంజయా! దుర్యోధనుడు ఆ విధంగా నిస్సత్యుడై భీముడితో అన్ని దెబ్బలు తిని, యుద్ధంలో ఓడిపోయి స్పృహతప్పి పడిపోయాడు కదా! మళ్లీ ఎలా యుద్ధానికి వచ్చాడు? ఏం జరిగింది?” అని అడిగాడు.

భీష్మపర్వంలోని రెండవ ఆశ్వాసం సమాప్తం

Exit mobile version