Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-186: భీష్మగాంధారేయుల సంవాదము

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

భీష్మపర్వము – మూడవ ఆశ్వాసము

భీష్మగాంధారేయుల సంవాదము

జనమేజయ మహారాజు మిక్కిలి నమ్రతతో, వినయంగా వైశంపాయనుడితో తరువాత జరిగిన వృత్తాంతం చెప్తున్నాడు. “యుద్ధంలో దుర్యోధనుడు పౌరుషం కోల్పోయి వెనుకకి మళ్లాడని ధృతరాష్ట్రుడు మిక్కిలి దుఖపడుతూ తరువాత ఆ దుర్యోధనుడు ఏం చేశాడు” అని సూతపుత్రుణ్ని అడిగాడు. ధృతరాష్ట్రుడు, భంగపడిన దుర్యోధనుడి తరువాత వృత్తాంతాన్ని గురించి సంజయుణ్ని అడిగాడు.

సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పసాగాడు – “మనమెంతో ఆలోచనతో వ్యూహం చక్కపరుచుకుంటూ ముందుకు సాగుతున్నా, పాండవసేన దాన్ని నాశనం చేస్తోంది. దానికి తోడుగా నువ్వు చూస్తుండగానే భీముడితో భంగపడ్డాను కదా! కొండంత అండగా నువ్వు ఉండడం వల్ల పాండవుల్ని జయిస్తానన్న ఆశ నాకుంది. దాన్ని నువ్వు పోగొడుతున్నావు. నువ్వు దేవతల్ని కూడా జయించగల పరాక్రమం కలవాడివి. యుద్ధరంగంలో ఆ పాండవులు అంత పరాక్రమవంతులవడానికి కారణమేమిటి?” అని దుర్యోధనుడు భీష్ముడిని అడిగాడు.

దుర్యోధనుడి మాటలు విన్న భీష్ముడు నవ్వి “నువ్వు నన్ను ఇలా అనడం ఏమిటి? యుద్ధంలో నా శరీరం ఎక్కడైనా దాచుకొన్నానా? పాండవులు కాకుండా ఇతర యోధులైతే భయపడేవాళ్లే కదా? చెప్పు? పాండవులు ఎప్పటికీ జయించలేనివాళ్లే అని అనేకసార్లు చెప్పాను! అయినా కూడా నువ్వు జయించాలనే ఉద్దేశ్యంతో ఒళ్లు దాచుకోకుందా యుద్ధం చేస్తాను. నువ్వు బాధపడవద్దు” అని చెప్పాడు.

భీష్ముడి ఏడవరోజు యుద్ధము

దుర్యోధనుడు భీష్ముడి మాటలు విని ఊరట కలిగి ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాడు. ఉదయమే లేచి యుద్ధానికి వెళ్లాడు. భీష్ముడు కూడా తన సైన్యాన్ని తేరిపార చూసి యుద్ధరంగాన్నంతా వ్యాపించే విధంగా మండల వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మండల వ్యూహంలో మధ్యభాగాన్న దుర్యోధనుడున్నాడు. తమ్ముళ్లు అతడికి సాయపడే రాజులూ రెండుపక్కలా నిలబడ్డారు.

పాండవులు కూడా యుద్ధానికి వెళ్లారు. ధర్మరాజు మన సేనల్ని చూసి సేనాపతి ధృష్టద్యుమ్నుడుతో వజ్రవ్యూహాన్ని ఏర్పరచమని ఆదేశించాడు. ధృష్టద్యుమ్నుడు ఆ వ్యూహాన్ని ఏర్పరిచాడు. పాండవ సేన శత్రుబలాన్ని లెక్కచెయ్యకుండా కౌరవసేనని ఎదుర్కొంది. ద్రోణుడు విరాటుడినీ; అశ్వత్థామ శిఖండినీ; దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడినీ; శల్యుడు నకుల సహదేవుల్నీ; విందానివిందులు యుధామన్యుడినీ; చాలామంది రాజులు అర్జునుడినీ ఎదుర్కొన్నారు. ఇంకా పాండవసేనలోని భీమసేనుడు కృతవర్మనీ; అభిమన్యుడు చిత్రసేనుణ్నీ, దుశ్శాసనుణ్నీ, వికర్ణుడినీ; ఘటోత్కచుడు భగదత్తుడినీ; సాత్యకి అలంబుసుడినీ; ధృష్టకేతుడు భూరిశ్రవసుడినీ; చేకితానుడు కృపాచార్యుడినీ; ధర్మరాజు శ్రుతాయువునీ; చాలామంది రాజులు – భీష్ముడినీ ఎదిరించారు.

అప్పుడు శ్రీకృష్ణుడితో అర్జునుడు ‘భీష్ముడు మండల వ్యూహాన్ని సంఘటించి, అందంగా ఒప్పిదంగా నిలిపాడు. అందువల్లే కౌరవ సైనికులకి ఉత్సాహం అతిశయించింది. ఆ కారణం చేతనే పలువురు కౌరవసైనికులు నా మీదకి ఉరుకుతున్నారు. నేను వాళ్ల బలానికి భంగం కలిగించి, కష్టం కలిగిస్తాను కృష్ణా! చూడు’ అన్నాడు.

అర్జునుడు వింటి నారిని సారించి, రాజుల మీద అధికంగా బాణాలు ప్రయోగించాడు. వాళ్లు ఒక్కసారిగా విజృంభించి పదునైన బాణవర్షంలో కృష్ణార్జునుల్ని ముంచేశారు. అప్పుడు నీ కొడుకు సేనలు పెడబొబ్బలు పెట్టాయి. కౌరవరాజుల విజృంభణాన్ని చూసి కోపించి, అర్జునుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు.

అర్జునుడు వేసిన బాణం శత్రువులు వేసిన బాణాల ప్రభావాన్ని పోగొట్టింది. శత్రురాజుల శరీరాల్ని గాయపరిచింది. మదించిన ఏనుగుల గుంపునీ, గుర్రాల పౌజునీ (సమూహాన్నీ) కూల్చేసింది. వెర్రెత్తినదానిలా శత్రువులకి భయం కలిగిస్తూ మందరమనే పర్వతం సముద్రాన్ని కలిచేసినట్లు శత్రుసైన్యాన్ని కలతపరిచింది. కౌరవసేనలు భయపడి పరుగెత్తి భీష్ముడి రథం వెనుకకి చేరుకున్నాయి. త్రిగర్త దేశాధిపతి సుశర్మ మొదలైన రాజులు కూడా భయపడి తమ సైన్యాలు వెళ్లిన చోటుకే వెళ్లి దాక్కున్నాయి.

భీష్ముడు శత్రుసంహారం చేస్తూ ఉండగా దుర్యోధనుడు ఆ రాజుతో ‘సైన్యం లేకుండా అర్జునుడి పైకి భీష్ముడు ఒంటరిగా పోరాడుతుంటే, రాజునైన నా సమక్షంలో వీరులైన మీరు భీష్ముడికి అండగా ఉండకుండా పెడదారి పట్టడం న్యాయమా?’ అని దుర్యోధనుడు రాజుల్ని యుద్ధం వైపు మరల్చాడు. రాజులందరూ రారాజు మాటలు విని, యుద్ధానికి సన్నద్ధులై, భీష్ముడికి రెండు వైపులా నిలిచారు.

ఆ సమయంలో ద్రోణుడు రెండు బాణాలు వేసి, విరాటుడి వింటినీ, అతడి పతాకానికి ఉండే కర్రనీ తుంచేశాడు. ఆ విరాటుడు మరొక వింటిని అందుకుని, మూడు పదునైన బాణాలతో ద్రోణాచార్యుడి శరీరాన్ని, సారథిని నొప్పించాడు. నాలుగు బాణాలతో గుర్రాల్ని కొట్టాడు. రెండు బాణాలతో ద్రోణుడి ధనుస్సుని, టెక్కాన్ని (సిడిని) విరిచేశాడు.

ద్రోణుడు ఎనిమిది బాణాలు వేసి, విరాటుడి రథాన్ని కూల్చాడు. విరాటుడు తన కొడుకు రథమెక్కి, అతడితో కలిసి, పదునైన బాణాల ప్రవాహంలో ద్రోణుణ్ని ముంచెత్తాడు. ద్రోణుడు కోపంతో చాలా పొడవైన బాణాన్ని వేశాడు. అది మత్స్యరాజు కుమారుణ్ని గాయపరచి వీపుని తొలుచుకుని వెలుపలికి వచ్చింది. గాయపడిన శంఖుడు ధనుర్బాణాలు విడిచి నేలమీదకి పడిపోయాడు. ఆ దృశ్యం చూసి విరాటుడు ధైర్యం పోయి, అందరూ చూస్తుండగా భయంతో పరుగెత్తాడు. అతడి సేనలు కూడా చెల్లచెదరైపోయాయి.

ఆ సమయంలో శిఖండి పదునైన మూడు బాణాల్ని అశ్వత్థామ నుదుటి మీద గుచ్చుకునేలా వేశాడు. అశ్వత్థామ అనేక బాణాలు వేసి అతడి గుర్రాల్ని, సారథిని, టెక్కాన్ని, ధనుస్సుని నుగ్గు చేశాడు. దానితో శిఖండి డాలు, కత్తి తీసుకుని, నేలపైకి ఉరికి, డేగలా ఎగబడుతూ, అశ్వత్థామ వేసే బాణాల్ని అన్నింటినీ తన కత్తితో విరిచేస్తూ అతడి మీదకి వెళ్లాడు.

అశ్వత్థామ శిఖండి డాలుని బద్దలుకొట్టాడు. ఖడ్గాన్ని నరికి పదునైన బాణాల్ని అతడి శరీరమంతా గుచ్చాడు. శిఖండి వెనక్కి మరలకుండా అశ్వత్థామ నరకగా మిగిలిన కత్తి ముక్కని విసిరాడు. అశ్వత్థామ దాన్ని తన వరకూ రానీయకుండా మధ్యలోనే పొడి చేశాడు. శిఖండి సాత్యకి రంథం మీదకి వెళ్లాడు.

దుర్యోధనుణ్ని రథం లేకుండా చేసిన ధృష్టద్యుమ్నుడు

ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడి మీద బాణాలు గుప్పించాడు. దుర్యోధనుడు కూడ ధృష్టద్యుమ్నుడి శరీరం మీద అనేక వాడి బాణాలు వేశాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడి విల్లు విరిచేశాడు. దుర్యోధనుడు వేరే విల్లు తీసుకునే లోపునే దుర్యోధనుడి రథాన్ని నుగ్గు చేశాడు. దుర్యోధనుడు తన ఖడ్గాన్ని తీసుకుని మహాధైర్యంతో, భయంకారాకారంతో నేలమీద దూకి శత్రువుపైకి విజృంభించాడు. శకుని ఆ దుర్యోధనుడిని తన రథంలోకి ఎక్కించుకుని వెళ్లిపోయాడు.

పాండవ పక్షంలో సాత్యకి అలంబసుడనే రాక్షసుడిని బాణవర్షంతో ముంచెత్తాడు. ఆ రాక్షసుడు అర్ధచంద్రాకారంతో ఉండే బాణంతో సాత్యకి విల్లు ముక్కలు చేశాడు. అవయవాలనిండా బాణాలని గుచ్చేశాడు. రాక్షసమాయలు చేసి చాలా భయంకరంగా మాయాపరంపరలని అతడి మీదకి ప్రయోగించాడు.

సాత్యకి మాత్రం దేనికీ భయపడకుండా ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఆ రాక్షసుడి మాయలు మటుమాయం చేసి అతడిని తల్లడిల్లేలా చేశాడు. ఆ దెబ్బతో అతడు పారిపోయాడు. సాత్యకి కురుసైన్యం పైకి ఉరికాడు. కృతవర్మ భీముడిపైకి విజృంభించాడు. భీముడు కృతవర్మ సారథిని, గుర్రాల గుంపుని కూల్చేశాడు. గర్వంతో అనేక బాణాలు ప్రయోగించి, శత్రువు శరీరాన్ని శరాలతో నింపేశాడు.

ఇలా రథాన్ని పోగొట్టుకుని, బాణాలతో గాయపడ్డ శరీరంతో కృతవర్మ నిక్కపొడుచుకున్న ముళ్లపందిలా నీ మరిది అయిన వృషకుడి రథం మీదకి వెళ్లాడు. వాయుపుత్రుడైన భీమసేనుడు మన ఏనుగుల గుంపు మీదకి మిక్కిలి వేగంతో తన రథాన్ని నడిపాడు” అని చెప్పాడు.

సంజయుడు చెప్పింది విని ధృతరాష్ట్రుడు “సంజయా! మన పక్షంలో చావడం, బాధపడడం గురించి ఎక్కువగా చెప్తున్నావు. మరి పాండవ బలమైతే నాశనం లేకుండా యుద్ధం చెయ్యడాన్ని పదేపదే చెప్తున్నావు. అయ్యో! ఇది ఏమి మాయో అర్థం కావడం లేదు” అన్నాడు.

ధృతరాష్ట్రుడు అడిగినదానికి సంజయుడు “మన కౌరవసైన్యం తన శక్తి కొద్దీ పోరాడుతోంది. సముద్రాన్ని చేరిన నీళ్లు అందులో కలిసిపోయి తన స్వరూపాన్ని చూపించలేని విధంగా, తమ ప్రతాపాన్ని వీళ్లు చూపించలేకపోతున్నారు. అది వాళ్ల తప్పు కాదు. నీ వల్లే ఈ ముప్పు ముంచుకు వచ్చింది. దానికీ దుఃఖపడక్కర్లేదు. యుద్ధ పద్ధతిని ఆలకించు.

యుధామన్యుడు బాగా విజృంభించి అవంతి దేశపురాజులు విందానువిందులనే వాళ్లని పుంఖానుపుంఖంగా పదునైన బాణాలతో కప్పేసి, అనువిందుడనేవాడి రథాన్ని నుగ్గు చేశాడు. వాడు విందుడి రథమెక్కాడు. అప్పుడు పాంచాలరాజు యుధామన్యుడు విందుడి సారథిని ఒక బాణంతో చంపేశాడు.

రథానికి కట్టిన గుర్రాలు బాధపడి తేరుని లాక్కుని వెనక్కి మళ్లాయి. అందువల్ల విందుడిసేన తల్లడిల్లి పోయింది. పద్ధతిని అతిక్రమించి జరిగిన ఆ దొమ్మి యుద్ధంలో భగదత్తుడి ఏనుగు విజృంభించి పరుగెత్తింది. దానివల్ల పాండవులసేన తడబడి చిందరపందరైపోయింది. అప్పుడు ఘటోత్కచుడు నదీవేగాన్ని గొప్ప పర్వతం అడ్డుకున్నట్టుగా ఆ ఏనుగు పరుగుని ఆపాడు.

భగదత్తుడి ఏనుగు ముందు ఘటోత్కచుడు నిలవడము, ఏనుగు విజృంభించడం ఆగడమూ చూసి పారిపోయిన పాండవ సైన్యం ఎప్పటిలాగే మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది. ఘటోత్కచుడు భగదత్తుడి మీద బాణాలు కురిపించాడు. ఆ బాణాల్ని భగదత్తుడు తిప్పి కొట్టాడు. బలం కలిగిన పధ్నాలుగు చిల్లకోలలు కూడా అతడి మీద ప్రయోగించాడు.

ఘటోత్కచుడు వాటిని తుంచి డెభ్బై బాణాలు వేసి, సింహనాదం చేశాడు. భగదత్తుడు విజృంభించి, ఆ రాక్షసడి రథాన్ని కూల్చాడు. వాడు భగదత్తుడి మీద ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. భగదత్తుడు శక్తి ఆయుధాన్ని మధ్యలోనే తుంచేసి వేగంగా అనేక బాణాలతో నొప్పించాడు. అప్పుడు ఘటోత్కచుడు ఇంద్రుడి దెబ్బకి తట్టుకోలేక పారిపోయిన నముచిలా భయపడి పారిపోయాడు. భగదత్తుడు వదలకుండా ఘటోత్కచుడి సైన్యం మీదకి తన ఏనుగుని పురికొలిపి, చిందరపందర చేశాడు.

నకులుడు, సహదేవుడు ఇద్దరూ శల్యుడి మీద బాణవర్షాన్ని కురిపించారు. శల్యుడు నవ్వుతూ సునాయాసంగా నకులుడి రథాన్ని విరిచాడు. తరువాత సకులసహదేవులిద్దరూ ఒకే రథాన్నెక్కి విజృంభించారు. శల్యుడు మహారౌద్రంతో వాళ్లని బాధించాడు. ఓ! ధృతరాష్ట్రమహారాజా! సహదేవుడు ధైర్యాతిశయంతో, కాలు నిలదొక్కుకుని బాగా చూసి ఒక బాణాన్ని శల్యుడి మీదకి వేశాడు. రొమ్ముకి తాకేట్టు వేసిన ఆ బాణం రక్తం అంటుకోకుండా గుచ్చుకుని వెలుపలికి వెళ్లిపోయింది. ఆ దెబ్బకి శల్యుడు చచ్చినవాడిలా రథంలో పడిపోయాడు.

ఆ దృశ్యం చూసి కౌరవసేనలు కలతచెందాయి. శల్యుడు రథం మీద మూర్ఛపోయాడు. దానితో అతడి సారథి రథాన్ని వెంటనే దూరంగా తోలుకుని వెళ్లిపోయాడు. కవలలు అది చూసి విజయోత్సాహంతో పెద్ద పెద్ద కేకలు పెడుతూ తమ శంఖాల్ని గట్టిగా ఊదారు.

ఇంతలో సూర్యుడు ఆకాశం మధ్య భాగానికి చేరుకున్నాడు. అప్పుడు ధర్మరాజు శ్రుతాయువు మీద తొమ్మిది బాణాలు వేశాడు. వాడు వాటిని తిప్పి కొట్టి, పదునుగల ఏడు బాణాల్ని ఆ ధర్మరాజు శరీరంలో గుచ్చుకునేలా వేశాడు. అతడు కోపంతో పందిచెవిలాంటి బాణాలు వేసి, శ్రుతాయువు రొమ్ముని చీల్చి, ఒకానొక ప్రత్యేక బాణంతో అతడి ధ్వజాన్ని ముక్కలు చేశాడు.

శ్రుతాయువు ఏడు బాణాలు వేసి ధర్మరాజుకి బాధ కలిగేట్లు కొట్టాడు. ధర్మరాజు చాలా కోపం వచ్చి, వాడి గర్రాల్ని చంపాడు. వింటి బద్దని తుంచాడు. అతడి శరీరాన్నంతటినీ రక్తంలో ముంచెత్తాడు. దానికి వాడు భయపడి పారిపోయాడు. అప్పుడు కౌరవ సైన్యమంతా చిందరవందరైంది. పాండవుల సైన్యం ఎంతో సంతోషపడింది.

Exit mobile version