[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
చేకితాన కృపాచార్యుల ద్వంద్వయుద్ధము
చేకితానుడు కృపాచార్యుడి మీద పదునైన బాణాలు వర్షంలా కురిపించాడు. కృపాచార్యుడు చేకితానుడి విల్లుని, గుర్రాల్ని ముక్కలుగా చేశాడు. అప్పుడు చేకితానుడు గద తీసుకుని రథం దిగి వేగంగా నడిచి, గదతో కృపాచార్యుడి రథాన్ని తునకలు చేసి, చేకితానుడు వెనక్కి వెళ్లిపోగానే, కృపాచార్యుడు పదహారు బాణాలు అతడి ఎముకల్లో గుచ్చుకునేట్లు వేశాడు. చేకితానుడు తొందరగా తన రథంలో ఉంచిన ఖడ్గాన్ని చేత్తో పట్టుకుని, మెరుపు మెరిసినట్టు, ఒక్క క్షణంలో మీదపడి కృపుణ్ని నొప్పించాడు. అతడి వల్ల తాను కూడా నొప్పించబడ్డాడు. ఇద్దరూ మూర్ఛపోయి నేలమీదకి ఒరిగిపోయారు.
ధృతరాష్ట్ర మహారాజా! మనవైపున సుబలుడి కొడుకు, ఆ వైపున కరకర్షణుడు మూర్ఛచెంది నేలవాలిన ఆ ఇద్దరినీ (కృపాచార్యచేకితానుల్ని) వాళ్ల వాళ్ల రథాల్లో ఉంచుకుని వెళ్లిపోయారు. చేదిదేశపు రాజు ధృష్టకేతుడు, విజృంభించి తొంభై బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకి భూరిశ్రవసుడు బాధపడి కోపంతో పలు (అనేక) బాణాలు ప్రయోగించి ధృష్టకేతుడి గుర్రాల్ని తునకలు చేశాడు. అతడి శరీరంలో బాగా గుచ్చుకొనేటట్లు బాణాలు వేశాడు. అతడు తట్టుకోలేక శీఘ్రంగా శతానీకుడి రథం మీదకి వెళ్లిపోయాడు.
దుశ్శాసనుడు, చిత్రసేనుడు, వికర్ణులతో అబిమన్యుడికి ఘోరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అభిమన్యుడు ఆ ముగ్గురి రథాల్ని ధ్వంసం చేశాడు. భీముడు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తాన్ని తాగుతానని శపథం చేసిన విషయం గుర్తుకొచ్చి అతడు వాళ్లని బాధ పెట్టాడే గాని వాళ్లని చంపలేదు లేకపోతే చంపేసేవాడే.
అప్పుడు భీష్ముడు దుశ్శాసనుడు మొదలైనవాళ్ల దుస్థితిని గమనించి పలువురు రథికులైన రాజుల్ని వెంట తీసుకునివెళ్లి అభిమన్యుణ్ని ఎదుర్కొన్నాడు. కౌరవ సైన్యంలో పలువురు రాజులు ఆరితేరినవాళ్లు అవడం వల్ల అభిమన్యుడు ఒంటరివాడు, అర్భకుడు అవడాన్ని చూసి అర్జునుడు శీకృష్ణుడితో ‘ఓ!కృష్ణా! చాలామంది కౌరవరాజులు శౌర్యాతిశయంతో, వేగంగా భీష్ముడితో కలిసి వస్తున్నారు. ఆ గుంపు ఉన్నచోటికి మన రథాన్ని శ్రీఘ్రంగా పోనియ్యి’ అన్నాడు.
కృష్ణుడు అర్జునుడు చెప్పినట్లు అభిమన్యుడి మీదకి ఉరుకుతున్న సైన్యంవైపు రథాన్ని పోనిచ్చాడు. అప్పుడు త్రిగార్తాధిపతి సుశర్మ తన సైన్యానికి ముందుగా నిలబడి అర్జనుణ్ని ఎదుర్కొన్నాడు. అర్జునుడు ‘సుశర్మా! నువ్వు నీ దండులోకెల్లా చాలా మొనగాడివి. ఇక్కడ ఇప్పుడు నాతో యుద్ధానికి దిగావు. నిజంగా యుద్ధం చెయ్యాల్సిందే తెలుసా?’ అంటూ సుశర్మని, ఆయన సారథిని, గుర్రాల్ని అర్జునుడు బాణాలతో కప్పేశాడు. కౌరవసైన్యం ఒక్కుమ్మడిగా అర్జునుడి మీదకి వచ్చింది. పాండవుల సేన కూడా అర్జునుడికి ముందుగా నిలబడి యుద్ధానికి సన్నద్ధమయింది. ఆ రెండు సేనలకి దొమ్మి యుద్ధం జరిగింది.
అర్జునుడు ఎదురుపక్షంలో వాళ్ల కేతనాల్ని తెగగొట్టి, రథికుల, సారథుల, గుర్రాల ప్రాణాల్ని తీశాడు. గొడుగుల్ని, చామరాల్ని నుగ్గు చేశాడు. చాపాల్ని రూపం లేకుండా చేశాడు. కవచాల్ని బద్దలు కొట్టాడు. ఆయువు పట్టుల్లో బాణాలు గుచ్చాడు. శత్రువుల అవయవాలన్నింటికీ బాధ కలిగించాడు. శత్రువుల తలలు నరికాడు.
అలా అర్జునుడు స్థ్వైరవిహారం చేస్తుంటే ఆ వేడికి సూర్యుడు ఆకాశమధ్యానికి చేరుకున్నాడు. అప్పటికి మధ్యహ్న కాలం అయింది. అయినా కూడా యుద్ధం చేయడం ఆపకుండా త్రిగర్తదేశాధిపతి కోపంతో ఎదుర్కొన్నాడు. త్రిగర్తాధీశుడు సుశర్మ రథ రక్షకులు ముప్ఫై ఇద్దరు అర్జునుడి మీదకి వచ్చారు.
అర్జునుడు ఎగతాళిగా నవ్వి, వాళ్లందరినీ అరవైనాలుగు బాణాలతో కొట్టి నేల మీద పదేశాడు. సుశర్మ తనతో కలిసి యుద్ధం చేస్తున్న వీరుల్ని చూశాడు. చాలా కోపం వచ్చింది. అర్జునుడి మీదకి ఉరికాడు. అర్జునుడి సేనకి ముందుగా శిఖండి మొదలైన ద్రుపద మహారాజు జ్ఞాతులు, సుశర్మ మొదలైనవాళ్లని కమ్ముకున్నారు. అర్జునుడు తనకి దుర్యోధన సైంధవులు అందుబాటులో ఉన్నా కూడా శ్రీకృష్ణుణ్ని ఓరకంటితో చూస్తూ భీష్ముడి మీద యుద్ధానికి వెళ్లాడు.
ధర్మరాజు శల్యుడు తన మీదకి వస్తున్నా లెక్క చెయ్యకుండా భీముడు, నకులుడూ, సహదేవుడూ వీళ్లతో కలిసి అర్జునుడికి అండగా ఉండడానికి భీష్ముడున్న చోటుకి వెళ్లాడు. ఇంతలో పాండవులతో భీష్ముడు యుద్ధం చెయ్యడం చూసి దుర్యోధనుడు, సైంధవుడూ కూడా పాండవుల్ని ఎదుర్కొన్నారు. భీష్ముడికి సంతోషం కలిగేలా శలుడు, శల్యుడు, చిత్రసేనుడు బలవంతుడైన కృపుడితో కలిసి పాండవులమీద పదునైన బాణాలు కురిపించారు.
శిఖండి భీష్ముణ్ని ఎదుర్కొన్నాడు. అతడు వాడిని ఏమీ చెయ్యక అతడి విల్లు తునాతునకలు చేసి తిరిగి వెళ్లిపోయేట్లు చేశాడు. అంతలో ధర్మరాజు అతడు చేసిన ప్రతిజ్ఞని గుర్తు చేస్తూ మొహమాటం లేకుండా శిఖండిని చివాట్లు పెట్టాడు. శిఖండి మళ్లీ ఉత్సాహం తెచ్చుకుని భీష్ముడితో తలపడ్డాడు.
ఈ సందడిలో మద్ర దేశాధిపతి శల్యుడు అక్కడికి చేరుకుని గొప్ప ఆగ్నేయాస్త్రాన్ని శిఖండి మీద ప్రయోగించాడు. శిఖండి ఏమాత్రం చలించకుండా నిలబడి వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. శల్యుడు దాన్ని పాడుచేశాడు. భీష్ముడు ధర్మరాజు పతాకదండాన్ని, వింటిబద్దని ఒక బాణంతో విరిచేశాడు. భీముడు ఆవేశంతో గదను పట్టుకుని రథం మీదనుంచి దిగి దుర్యోధనుడి మీదకి దూకాడు. జయద్రథుడు సేనకి ముందు భాగానికి వచ్చి అయిదువందల వాడి బాణాలు భీముడి మీదకి వదిలాడు.
భీముడు ఆ బాణాల్ని లెక్కచెయ్యకుండా, గదని ఆడిస్తూ దగ్గరకు వచ్చి సైంధవుడి గుర్రాల్ని ఎముకలు నలిగేట్లు బాదాడు. సైంధవుడు రథం కూలిపోగా, మరొకడి రథం ఎక్కాడు. యుద్ధం చేసే రాజులందరూ శౌర్యం కోల్పోయారు. వాళ్ల వైపున ఉండే సైనికులంతా చెల్లాచెదరైపోయారు.
దుర్యోధనుడు భీముడి మీద దాడి చేశాడు. చిత్రసేనుడు మధ్యలో వచ్చి భీముడిని బాణాలతో కొట్టాడు. భీముడు ఉగ్రుడై తన గదని విసిరేశాడు. అది పిడుగులా ప్రకాశిస్తూ ఆకాశంలో వెలుగుతూ గొప్ప వేగంతో వచ్చింది. యుద్ధరంగంలో ఉండే వీరులంతా సెగలు, పొగలతో వస్తున్న భీముడి గదని చూశారు. ఎవరికి వాళ్లు ఆ గద తమ మీద పడుతుందనే అనుకున్నారు. తమ తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారేగాని దుర్యోధనుడి గురించి ఎవరూ పట్టించుకోలేదు.
ప్రాణభయం ఎంత గొప్ప వీరుల గర్వాన్నైనా తగ్గించకుండా ఉంటుందా? వెంటనే చిత్రసేనుడు తొట్రుపడకుండా కత్తిని, డాలుని పట్టుకుని నేలమీదకి ఉరికాడు. భీముడి గద చిత్రసేనుడి రథాన్ని, గుర్రాల్ని, సారథిని పిండి చేసింది. చిత్రసేనుడు రథం లేనివాడయ్యాడు. వికర్ణుడు అతడిని తన రథంలోకి ఎక్కించుకుని వెళ్లిపోయాడు.
భీష్ముడు ధర్మరాజు గుర్రాల్ని నేలకూల్చాడు. అతడి అవయవాలన్నింటికీ బాధ కలిగించాడు. ధర్మరాజు కోపంతో భీష్ముడి మీదకి శక్తిని ప్రయోగించాడు. భీష్ముడు నిబ్బరంగా నిలబడి దాన్ని కూల్చివేశాడు. దానితో ధర్మరాజు వెళ్లి నకులసహదేవుల రథంలోకి ఎక్కాడు. భీష్ముడు నకులసహదేవుల్ని కూడా బాణప్రయోగంతో లొంగదీశాడు.
ధర్మరాజు బాధపడుతూ సైన్యంలో రాజులందర్నీ ఉత్సాహపరిచి ముందుకి నడిపించాడు. వాళ్లందరూ భీష్ముణ్ని ఎదిరించారు. అనేక రకాలైన మృగాలు ఒకేసారి విజృంభించి ఎదిరిస్తుంటే నిశ్చలంగా నిలబడిన సింహంలా, అనేకమంది రాజులు ఎదుర్కొన్నప్పుడు భీష్ముడు ఉపాయంతో తోపుకాపరి తాటిపండ్లని రాలుస్తున్నట్లు మిరుమిట్లు గొలిపే బాణాలతో చాలమంది రాజుల తలలు నేలకి రాల్చాడు.
పాండవులు చేష్టలు మాని ఆశ్చర్యంతో చూస్తుండగా, శిఖండి తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన దగ్గరికి వచ్చాడు. వాడిని లెక్కచేయకుండా భీష్ముడు సృంజయుడి సేన మీద పడి దాన్ని బాధించాడు. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు బాగా విజృంభించి కురుసైన్యాన్ని కలతపెట్టారు. విందానువిందులు వేగంగా వచ్చి ధృష్టద్యుమ్నుడి గుర్రాల్ని కూల్చివేశారు. అతడు వెంటనే సాత్యకి రథం ఎక్కాడు. ధర్మరాజు తన పరాక్రమంతో విందానువిందుల్ని తరిమాడు.
అప్పుడు దుర్యోధనుడు చేయి ఎత్తి తన మొత్తం సైన్యాన్ని కవ్వించి తానూ యుద్ధానికి దిగాడు. తానూ, తన తమ్ముళ్లూ, భీష్ముడూ అందరూ కలిసి ఒకేసారి పాండవ సైన్యాన్ని కమ్ముకున్నారు. అక్కడ అర్జునుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. అంతలో ద్రోణాచార్యుడు అర్జునుణ్ని ఎదిరించి, భూమి, ఆకాశం మధ్యభాగాన్ని బాణాలు గుప్పించి కప్పేశాడు విజృంభించాడు.
నీ సేనలన్నీ ఆయన అండకి చేరుకుని ఉత్సాహంతో ఎగబడ్డాయి. అప్పుడు ధర్మరాజు బిగ్గరగా అరిచాడు. ఆయన వ్యూహంలో ఉన్న సైనికులంతా ఉత్సాహంతో యుద్ధం చేస్తుండగా సూర్యుడు అస్తపర్వతం మీదకెక్కాడు. యుద్ధరంగంలో నెత్తురు ఏరులై పారింది. ఆ ప్రవాహంలో కొట్టుకుని పోతున్న శవాల్ని లాక్కుపోయే భూతబేతాళాల రాపిళ్లతోను, యుద్ధభూమిలో కూలిన పీనుగుల్ని పీక్కుని తింటూ చెలరేగే నక్కల ఊళలతోను, ఆ సంధ్యా సమయం భయంకరంగా ఉంది.
త్రిగర్తదేశపు రాజువంటి ముఖ్యులైన రాజుల్ని తల్లడిల్లేలా చేసిన అర్జునుడు, సైంధవుడు మొదలైన రాజుల్ని అగచాట్లపాలు చేసి శౌర్యాతిశయంతో ఒప్పుతున్న భీమసేనుడు ధర్మరాజుల ఎదురుగా నిలబడ్డాడు. ధర్మరాజు యుద్ధం చాలించమని అనుజ్ఞ ఇచ్చాడు. ధర్మరాజు తన పరివారంతో సైన్యం నిలిచి ఉన్న చోటికి వెళ్లాడు. దుర్యోధనుడు కూడా తన పరివారంతో భీష్ముణ్ని చేరుకుని తమ సైన్యాన్ని యుద్ధం ఆపమని చెప్పి తమ గుడారాలకి వెళ్లిపోయారు. భీష్ముడు సేనాపతిగా జరిగిన యుద్ధంలో ఏడవరోజు రాత్రి తెల్లవారింది.
భీష్ముడు ఎనిమిదవరోజు యుద్ధము
ధృతరాష్ట్ర మహారాజా! పాండురాజు కొడుకులూ, నీ కొడుకులూ భయంకరంగా యుద్ధం చెయ్యాలని యుద్ధరంగానికి ప్రవేశించారు. భీష్ముడు ‘కూర్మవ్యూహాన్ని’ ఏర్పరిచాడు. దాన్ని చూసి ధర్మరాజు ధృష్టద్యుమ్నుడితో ‘భీష్ముడు పన్నిన కూర్వవ్యూహాన్ని చూశావు కదా! దానికి సరిపోయేలా ఏదైనా వ్యూహాన్ని ఏర్పాటు చెయ్యి’ అన్నాడు. ధృష్టద్యుమ్నుడు దానికి తగిన ‘శృంగాటక’ వ్యూహాన్ని పన్నాడు. ఈ విధంగా రెండు సైన్యాలు వ్యూహాలు ఏర్పరుచుకుని ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. అన్ని రకాల వాద్యాలు మారుమోగుతుండగా కౌరవపాండవులు యుద్ధానికి తలపడ్డారు. ఆయుధాల ఒకదానితో ఒకటి ఒరిపిడికి పొగలేని మంటలు ఎగబాకాయి.
రథాలు, ఏనుగులు, గుర్రాలు, భటులు వేగంగా కదలడం వల్ల రేగిన ధూళి ఆకాశాన్ని ఆవరించకుండా ఆయా సేనలయొక్క నెత్తుటి ధారల వర్షంతో అణిగిపోయింది. అంత ఘోరయుద్ధం జరుగుతున్న సమయంలో ధృతరాష్ట్రమహారాజా! భీష్ముడు సింహనాదం చేస్తూ తన సైన్యం ముందు భాగాన్ని చేరుకున్నాడు. పాండవసేనలో ఉన్న మహావీరులు అందరూ భీష్ముణ్ని ఎదిరించలేక మారుమూలలకి తప్పుకున్నారు.
భీముడొక్కడే సింహనాదం చేస్తూ భీష్ముణ్ని ఎదుర్కొన్నాడు. అతడి సారథిని హతమార్చాడు. కౌరవసైనుకులందరూ కంగారుపడుతుంటే గుర్రాలు రథాన్ని లాక్కుని వెనక్కి పరుగెత్తుకుని వెళ్లిపోయాయి. ఆ పట్టులో పాండవసేన చాలా ఉత్సాహపడింది. నీ కొడుకు సునాభుడనేవాడు పరాక్రమంతో చాలా దగ్గరికి వచ్చి భీముణ్ని ఎదుర్కొన్నాడు.
