Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-188: సునాభుడు మొదలైన కురుకుమారుల్ని చంపిన భీముడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

సునాభుడు మొదలైన కురుకుమారుల్ని చంపిన భీముడు

ధృతరాష్ట్రా! సునాభుడు, బకాసురుణ్ని కూడా చంపిన మహావీరుడైన భీముణ్ని ఎదుర్కొన్నాడు. భీముడు యమధర్మరాజులా విజృంభించి సునాభుడి తల నరికి విరగబడి నవ్వాడు. సునాభుడు భీముడి చేతిలో చచ్చిపోవడాన్ని సునాభుడి తమ్ముళ్లు ఏడుగురూ చూశారు. వాళ్లందరూ ఒక్కుమ్మడిగా భీముడి మీద పడ్డారు. రకరకాల బాణాలు ప్రయోగించి భీముడికి బాధ కలిగేలా చేశారు. దానితో కుంతీ కుమారుడికి విపరీతమైన రోషం కలిగింది.

ఎవరికీ తేరిపార చూడడానికి శక్యం లేకుండా ఆ సోదరుల్ని ఒక్కొక్కళ్లనీ వరుసగా ఉక్కుబల్లెంతో ఆదిత్యకేతుణ్ని; పదునుగల క్షురప్రముఖమనే ఆయుధంతో అపరాజితుడినీ; చురుకుగల బాణంతో బహ్వాశి అనేవాడిని; మంగలికత్తి వంటి ఆయుధంతో పండితుణ్నీ; జ్వలించే అర్ధచంద్రాకారపు బాణంతో కుండధారుణ్నీ; కరుకైన బాణంతో విశాలాక్షుణ్నీ; కటువైన బాణంతో మహాధరుడినీ ఏడుగురినీ చంపేశాడు.

అది చూసి నీ మిగిలిన కొడుకులందరూ ధైర్యాన్ని విడిచిపెట్టి భయంతో తొలగిపోయారు. ‘భీముడు ఆ రోజు సభలో చేసిన ప్రతిజ్ఞలన్నీ ఈనాడు యుద్ధంలో నెరవేర్చేటట్లు ఉన్నాడు. విదురుడు చెప్పిన నీతి మాటలు ఈ రోజు సార్థకం కాబోతున్నాయి. ఇంక వెయ్యి మాటలు ఎందుకు?’ అని రాజులందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. “ధృతరాష్ట్ర మహారాజా! నీ కొడుకుల యొక్క అవినీతిని, దుష్టచేష్టల్ని అరికట్టలేకపోయావు. అటువంటి నీ చేతగానితనం ఇప్పుడు ఇన్ని కష్టాలకి కారణమైంది. ఇంక దుర్యోధనుడు మొదలైన వాళ్లకి, భీముడి వల్ల చావు తప్పుతుందా? తప్పదు.

ఆ సంగతి అలా ఉంచు. అప్పుడు దుర్యోధనుడు తనచుట్టూ ఉన్న భటుల్నీ, శూరుల్నీ చూసి భీముడితో యుద్ధం చెయ్యడానికి వెళ్లమన్నాడు. తానేమో భీష్ముడి దగ్గరికి వెళ్లాడు. దుఃఖంతో బొంగురుపోయిన కంఠంతో అయనతో ‘కౌరవోత్తమా! ఇలా భీముడు మీదకి వచ్చి అతిశయించి, మిక్కిలి విజృంభించి, ఉప్పొంగి నా తమ్ముళ్లని చంపుతుంటే తప్పకుండా చూస్తున్నావు. నీకు కోపంగాని, దుఃఖం గానీ రాలేదా? సహాయపడకూడదని నిలబడి పోయావా? లేక ఉన్నవాళ్లందరూ ఒక్కసారిగా చావనియ్యమని ఇలా ఊరుకున్నావా?’ అని దుర్యోధనుడు అన్నాడు.

అతడి మాటలు విని భీష్ముడు తానూ దుఃఖపడి దుర్యోధనుడితో “దుర్యోధనా! ఇప్పటికి ఈ ఆపత్తు ఉత్పన్నమవుతుందని ఏనాడో నేను, ద్రోణాచార్యుడు, విదురుడు నీకు చెప్పాము. కాని, అప్పుడు నువ్వు మా మాటలు వినలేదు. మహాపరాక్రమవంతులైన పాండవులకి ఎదురుగా నిలబడి జయించడానికి ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదు. ఇంక మనబోటి వాళ్లం ఎంత కనుక?

దుర్యోధనా! కౌరవ కుమారుల్లో ఎవరైనా ఆ భీముడికి ఎదురైతే, అటువంటి వాడిని కాపాడడానికి ప్రయత్నించడానికి కూడా ఎటువంటి వీరుడికీ సాధ్యం కాదు. ఈ దుస్థితిని గురించి మనం ఏడవవలసిన పనిలేదు. నువ్వింక వీరస్వర్గాన్నే ధనంగా కోరి యుద్ధం చెయ్యి. రాజ్యం మీద ఆశని విడిచిపెట్టు. నేనేమో చేతనయినంతగా తెగించి యుద్ధం చేస్తాను. ఒకవేళ జయం మనదయితే ఆ జయాన్ని కాదంటామా!’ భీష్ముడు దుర్యోధనుడితో చెప్పిన మాటల్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు.

ధృతరాష్ట్రుడు సంజయుడితో “అస్త్ర గురువు ద్రోణాచార్యుడు, దేవతలకి కూడా అజేయుడైన భీష్మాచార్యుడు ఈ ఇద్దరూ మన పక్షాన ఉండి యుద్ధం చేస్తుంటే ఇంతమంది కొడుకులు చావడమా? భవిష్యత్తులో కలిగే ఈ విపత్తుని అంతటినీ ముందుగానే గాంధారి, నేను ఎంతగా చెప్పినా ఆ దుర్యోధనుడు దాన్ని పెడచెవిని పెట్టాడు. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇంక ఆ మాటలెందుకు? అది గతజలసేతుబంధనంలా ఉపయోగం లేనిది. ఆ కురుకుమారులు చావడాన్ని చూసి భీష్మద్రోణులు తరువాత ఏం చేశారు?” అని ధృతరాష్ట్రుడు అడిగాడు.

దానికి సంజయుడు “భీష్ముడు భయంకరమైన ఆకారంతో భీముడున్న వైపుకి రథం పోనిచ్చాడు. దాన్ని చూసి ధర్మరాజు చెప్పడంవల్ల ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకులు ముందుకు వచ్చి ఆ భీష్ముడితో తలపడ్డారు. అంతకు ముందే దుర్యోధనుడు చెప్పగా యుద్ధానికి దిగిన రథికుల్ని అర్జునుడు, చేకితానుడు, ద్రౌపదీపుత్రులతో కలిసి ఎదిరించాడు. అభిమన్యుడు, ఘటోత్కచుడు కలిసి దుర్యోధనుణ్ని ఎదుర్కొన్నారు. ఈ విధంగా మూడు గట్టి సైన్యాలు ఘోరయుద్ధం చేశాయి. కౌరవబలాలు వెనుకంజ వేయకుండా గట్టిగా పోరుతూ వచ్చాయి. అప్పుడు ద్రోణాచార్యుడు బలమైన బాణాలు ప్రయోగించి, ద్రుపదమహారాజు పన్నిన వూహాన్ని చిందరపందర చేశాడు. ఆకాశంలో విమానాల నుంచి చూస్తున్న దేవతలు ఆయన శౌర్యాన్ని ఎంతో పొగిడారు.

ధృతరాష్ట్ర మహారాజా! భీముడు బలంగా వేసిన బాణాల దెబ్బలకి ఏనుగుల గుంపులు మొద్దుబారి, అవయవాలు తెగిపోగా, నేలమీద పడ్డాయి. అది సూర్యకిరణాలు సోకగా చీకటి చెదిరిపోయినట్టుగా కనిపించింది. నకులుడు, సహదేవుడు శత్రువుల గుర్రపు దళాల మీదకి సంభ్రమంగా దూకారు. రౌద్రరసంతో చూసేవాళ్లకి భయం కలిగించేలా, చాలా గుర్రాల్ని నరికేశారు.

యుద్ధభూమి మొత్తం చచ్చిపోయిన గుర్రాలతో నిండి పోయింది. కురుపాండవ సేనల్లోని భటులు తమ రథాల్ని తోలడానికి కూడా దారి లేకపోయింది. అర్జునుడు వేగంగా బాణాలు వేసి రథికుల్ని హతమార్చాడు. యుద్ధభూమి చచ్చిన రథికుల బాహువులకి చెందిన రత్నాలు చెక్కిన హారాలతో, శరీరాల అవయవాల ముక్కలతో, నేల మీద రాలిన రంగు రంగుల పూల కుప్పలతో ప్రకాశించే ఉద్యానవనంలా ఉంది.

ఇరావంతుడు గుర్రాల గుంపుతో, కురుసేన దగ్గరికి వెళ్లి చొరబడడం చూస్తే దట్టంగా ఉండే పక్షుల గుంపు మీదకి ఉరికే ఏనుగుల గుంపులా కనిపించింది. శకుని తమ్ముళ్లు ఆరుగురూ తమ గుర్రాల గుంపుని ఇరావంతుడి మీదకి తోలారు. వెనక్కి తగ్గకుండా.. రాయి రాయితో డీకొన్నట్టుగా రెండు పక్షాలవాళ్లు గొప్ప యుద్ధం చేశారు. ఆరుగురు ఇరావంతుణ్ని చుట్టుముట్టి బాణాలతో హింసించారు. వంకర కొనలు కలిగిన ఈటెలతో పొడిచారు. అంకుశపు పొడుపు తినిన మదపుటేనుగులా కోపగించి అతడు విలుకాడు కాబట్టి, తన గుర్రాల్ని పక్కకి తప్పించి, మళ్లీ తిరిగి వచ్చి ఆ వీరుల మీద పలు బాణాలు ప్రయోగించి నొప్పించాడు. అప్పుడు దేవతలందరూ ఇరావంతుడి శౌర్యాన్ని మెచ్చుకున్నారు.

ఇరావంతుడు పెక్కుబాణాలు వేసి, శత్రువుల్ని భయపెడుతున్న సమయంలో అంతకు ముందే ఇరావంతుడి గుర్రం బాగా దెబ్బతిని ఉండడం వల్ల నేలకి ఒరిగిపోయింది. ఇరావంతుడు కింద పడకుండా చాలా జాగ్రత్తతో ధైర్యంతో ఒక గట్టి కత్తిని తీసుకుని వేగంగా నేలమీదకి దూకాడు. భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్న ఇరావంతుణ్ని చూసి విజృంభించి చుట్టుముట్టి, శకుని తమ్ముళ్లు ఆరుగురూ, ఇరావంతుడిని బల్లాలతో పొడిచారు. ఆయుధాలతో కొట్టారు.

ఇరావంతుడు ఎక్కువ నేర్పు, సామర్థ్యం, పరాక్రమం కలిగినవాడవడం వల్ల ఆ శత్రువులు ప్రయోగించిన అన్ని ఆయుధాల్నీ, తన ఖడ్గంతో చిత్రవిచిత్రాలైన విధానాలతో అవి తనమీద పడకుండా చేసుకుంటూ వాటిని అన్నింటినీ ఖండించేశాడు. ఇరావంతుడు నేల మీద నిలిచి యుద్ధం చేస్తున్నాడు. మనమేమో గుర్రాల మీద కూర్చొని యుద్ధం చేస్తున్నాము కాబట్టి, మనకి వీడిని హింసించడం సాధ్యం కాదు, అనే చెడు ఊహలో పడి ఆరుగురు సోదరులు గుర్రాలమీద నుంచి నేలపైకి దిగారు. పదునైన దిట్టములైన ఖడ్గాలు చేతబట్టుకుని ఆ ఇరావంతుడి దగ్గరికి వచ్చారు.

ఇరావంతుడు చుట్టి వచ్చి, ఒక్కొక్కడిని రెండు ముక్కలు చొప్పున ఆ ఆరుగుర్ని మొత్తం పన్నెండు తుంటలుగా నరికేశాడు. వీరావేశంతో పెనుబొబ్బలు పెట్టాడు. ఆరుగురు గాంధారరాజు కుమారుల్ని ఇరావంతుడొక్కడే చంపడాన్ని దుర్యోధనుడు చూశాడు. అతడికి అసహనం ఎక్కువయింది. తన సమీపంలో ఉన్న రాక్షసుడితో ‘అలంబుసుడా చూశావు కదా! అర్జునుడి కొడుకు ఇరావంతుడు ఒక్కడే మనసైన్యం మీద విరుచుకుపడి అడగారిపోయేట్టు చేస్తున్నాడు’ అన్నాడు.

ఇరావంతుణ్ని సంహరించిన అలంబుసుడు

దుర్యోధనుడు ఇరవంతుడున్న వైపుకి చూపించాడు. అలంబుసుడు వేగంగా ఇరావంతుడున్న వైపుకి వెళ్లాడు. తన మాయాబలంతో ఇరావంతుడి అశ్వసేన ఎంత ఉందో అంత అశ్వసేనని తానూ పుట్టించాడు. మాయతో పుట్టిన అశ్వసేన ఇరావంతుడి సైన్యాన్ని కమ్ముకుని, ఎదిరించి చంపేసింది, తరువాత ఆ మాయ గుర్రాల దండు కూడా నశించింది. ఇరావంతుడు ఒంటరివాడై పరాక్రమంతో అలంబుసుడిని ఎదిరించాడు. వేగంగా మెరుపు మెరిసినట్లు ఆ రాక్షసుడి మీద పడ్డాడు. కత్తితో పదునైన వింటిని ముక్కలు చేశాడు. అప్పుడు అలంబుసుడు ఆకాశానికి ఎగిరిపోయి, మాయాబాణాలు అతడి మీద గుప్పించి, నొప్పించాడు. ఇరావంతుడు కూడా కోపంతో ఆకాశానికి ఎగిరాడు. ఇరావంతుడు బలమైన కత్తితో అలంబుసుడిని నరికేశాడు.

వాడు వెంటవెంటనే యౌవనరూపాన్ని కొత్తగా పొందుతూ యుద్ధం చేశాడు. ఇరావంతుడు కూడా స్థిరంగా నిలబడి యుద్ధం చేస్తుండగా ఇరావంతుడు తన తల్లి యొక్క నాగవంశంలో ఉండే సాటిలేని ఇంద్రజాల విద్యల ప్రభావాన్ని మనసులో తలుచుకున్నాడు. వెంటనే చాలా నాగుల సమూహంతో ఆదిశేషుడి మాదిరి రూపాన్ని ధరించి, ఇరావంతుడు నాగులగుంపుతో అలంబుసుడి మీదకి ఉరికాడు.

ఆ రాక్షసుడు గరుత్మంతుడి ఆకారం ధరించి, ఇంద్రజాలంతో వాటిని అధీనంలోకి తెచ్చుకుని, పట్టుకుని, అన్ని పాముల్నీ తిన్నాడు. అప్పుడు ఇరావంతుడు కొంచెం ఇరుకున పడ్డాడు. ఆ సమయం కనిపెట్టి రాక్షసుడు ఇరావంతుడి మెడ నరికేశాడు. అతడి తల నేలమీద పడింది. అయినా ఆ ఇరావంతుడి ముఖానికి చావు కళ పట్టకుండా కళకళలాడుతూ పున్నమిచంద్రుడిలా ప్రకాశిస్తూనే ఉంది. ఇరావంతుడు చచ్చిన సమయంలో మిట్టమధ్యాహ్నమైంది” అన్నాడు సంజయుడు.

ధృతరాష్ట్రుడు “ఇరావంతుడు చచ్చిన తరువాత పాండవులు, వాళ్ల భటులు, వీరులు అంతా ఏమి చేశారో చెప్పు” అని అడిగాడు.

సంజయుడు ధృతరాష్ట్రుడితో “సోదరుడు మరణించడం చూసి ఘటోత్కచుడు కోపగించి ఆపడానికి వీలుకాని వేగంతో ముందుకొచ్చాడు. అతడి అనుయాయులైన రక్కసులు, ఏనుగుల్ని ఎక్కి యుద్ధ క్రీడోత్సాహంతో అతడిని అనుసరిస్తూ ఉండగా ప్రళయాగ్నిలా భాసించాడు. దిక్కులు అల్లాడగా పెడబొబ్బలు పెడుతూ కురుసైన్యంలోకి ఘటోత్కచుడు శూలం చేత్తో పట్టుకుని చొరబడ్డాడు. ఆ శూలం నుంచి పైకి వచ్చిన తళతళకాంతులు శత్రుసైనికులకి చాలా భయం కలిగించాయి. ఘటోత్కచుడు తన శూలానికి ఏనుగుల, గుర్రాల, భటుల దేహాల్ని వరుసగా ఒక దారంలోకి రకరకాల పూలని గుచ్చినట్లుగా గుచ్చుకొంటూ వచ్చాడు. దుర్యోధనుడు ఈ రాక్షసుణ్ని చూశాడు. మదం పట్టడం వల్ల ముందు వెనుకలు తెలియని ఏనుగుల గుంపులా మిక్కిలి వేగంతో నేర్పుగల పరాక్రమంతో దుర్యోధనుడు వాటిని ఎదుర్కొన్నాడు.

నీ కొడుకు సంతోషపడేలా వంగదేశపురాజు గొప్ప శౌర్యంతో ఏనుగుల గుంపు సహాయంతో శత్రువులకి భయం పుట్టించేలా రాక్షసుడైన ఘటోత్కచుడి దగ్గరికి వచ్చాడు. ఘటొత్కచుడు తనని సమీపించిన ఏనుగుల గుంపుని చూశాడు. గర్వంతో కత్తి చేత్తోపట్టుకుని చెలరేగి వాటిపైకి దూకి గొప్ప పరాక్రమంతో అవలీలగా ఏనుగుల తొండాలు, దంతాలు, చెవులు, తలలు, కాళ్లు వాటి రూపం తెలియకుండా పోయే విధంగా తునాతునకలు చేశాడు. దేవతలు కూడా ఇతడి శౌర్యాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. ఇలా ఘటోత్కచుడు కౌరవసేనలో ఏనుగులన్నింటినీ తునకలు చేశాడు.

దీన్ని చూసి దుర్యోధనుడు త్వరత్వరగా బాణాలవర్షంతో ముంచి కోపించి, అంతటితో ఊరుకోక వేగవంతుడు, విద్యుజ్జిహ్వుడు, బహ్వాశి అనే ముగ్గురు ప్రముఖులైన రాక్షసుల్ని చంపాడు. ఘటోత్కచుడి శరీరాన్నంతా బాణాలతో నింపేశాడు. రాక్షసుడు విల్లు చేత్తో పట్టుకుని కోపమనే అగ్నిజ్వాలల్ని వ్యాపించినట్లు బాణాల కాంతులు ప్రసరింపచేస్తూ దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు.

అతణ్ని చూసి ‘దుర్యోధనా! సత్యం కలిగినట్టి పాండవులకి నువ్వు ఆనాడు సభలో ఏ న్యాయంతో ఎంతగా అవమానం కలిగించావో, అనాడు సభలో ఉన్నవాళ్లంతా ఈనాడు ఇక్కడ చూస్తూ ఉండగా దాని ఫలాన్ని నీకు చూపిస్తాను’ అని హెచ్చరిస్తూ నల్లతాచుపాముల వరుసతో సమానమైన బాణాలతో దుర్యోధనుడి శరీరాన్నంతా నింపేశాడు.

ధృతరాష్ట్ర మహారాజా! నీ కొడుకు దుర్యోధనుడు వేసిన కరుకైన బాణాలకి జంకిపోకుండా, మాత్సర్యాన్ని వదలకుండా అతడి దేహంలో నాటుకునేటట్లుగా ఇరవై అయిదు బాణాలు వెంటనే ప్రయోగించాడు. ఘటోత్కచుడు మహాకోపంతో దుర్యోధనుడి మీద పడవేయడానికి యముడి నాలుక మాదిరి భయంకరమైన శక్త్యాయుధాన్ని ఎత్తాడు. ఇంతలో దుర్యోధనుడికి అడ్డంగా వంగదేశరాజు రాగా, అతడి ఏనుగుని రాక్షసుడు దానితో కూల్చాడు. వంగదేశరాజు నేలకి దూకాడు. వంగపతి ఏనుగు నేల కూలడంతో కౌరవసేనలు భయంతో పెద్దపెట్టున అరిచాయి. దుర్యోధనుడు తన్ను తానే ప్రోత్సహపరచుకొన్నాడు. ప్రోత్సాహ పరచేవారు లేరన్నమాట. అతడు భయంలేకుండా తాను ఒక్కడే వాడి ఎదుట నిలిచి ఎదుర్కొన్నాడు.

దుర్యోధనుడు ఘటోత్కచుడికి ఎదురుగా నిలబడి, ఎర్రటి జ్వాలలు అంతటా వ్యాపించే ఒక గొప్ప ఆయుధాన్ని మహాకోపంతో వాడి మీదకి విసిరాడు. వాడు ఆ ఆయుధాన్ని మధ్యలోనే ముక్కలు చెక్కలు చేసి దిక్కులు పిక్కటిల్లేటట్లుగా సింహంలా గర్జించాడు. భీష్ముడు ఘాటోత్కచుడు చేసిన సింహనాదాన్ని విని, కౌరవపక్షంలోని భటుల్ని, శూరుల్ని తేరిపారి చూసి, ‘ఘటోత్కచుడు చాలా పరాక్రమంతో దుర్యోధనుడిని ఎదుర్కొని అతడి ఏనుగుగున్నల గుంపుని చంపి, మహామారిలా రాజు పైకి ఎగబడ్డాడు. ఘటోత్కచుడు దేవతలకి కూడా జయింపరానివాడు. మీరందరూ అతి త్వరగా వెళ్లి, దుర్యోధనుడికి సాయపడండి’ అని సేనాపతి భీష్ముడన్నాడు.

ఆ మాటలు విని ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, చిత్రసేనుడు, బృహద్బలుడు, బాహ్లికుడు, అవంతీనాథుడు, భూరిశ్రవసుడు, సైంధవుడు, సోమదత్తుడు, వివింశతి, వికర్ణుడు, వీళ్లందరూ ఒకే ఎత్తున తమకు సహాయులైన అనేక వీరులతో, భటులతో, రథాలు కదిలించుకుని పోయి దుర్యోధనుడిని గుండ్రంగా చుట్టుకుని ఆ రాక్షసుడిని ఎదిరించారు.

వాడు కూడా తన రాక్షసబలాన్ని వెంట వేసుకుని బలంతో దేదీప్యమానుడై ఎదురొడ్డి నిలిచి యుద్ధం చేశాడు. అప్పుడు ఆ రెండు సైన్యాలు ఒకదాన్ని మించి మరొకటి పోటీపడి ఎదిరిస్తూ విజృంభిస్తూ యుద్ధం చేస్తూ ఉండగా, ఆ ఘటోత్కచుడు ద్రోణుడు ప్రధానుడుగా ఉండే ఆ పన్నెండు మంది వీరులపైన పలురకాల క్రూరములైన బాణాలనూ ప్రయోగించాడు.

Exit mobile version