[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
శకుంతల జన్మ వృత్తాంతము
కణ్వుడి ఆశ్రమంలోకి అడుగుపెట్టి అక్కడి ప్రకృతిని చూసి పరవశించాడు దుష్యంతుడు. తనకు ఆతిథ్యమిచ్చి గౌరవించిన శకుంతలని చూసి “నువ్వు ఎవరి కుమార్తెవి? ఈ ఆశ్రమంలో ఎందుకు ఉంటున్నావు? నీపేరేమిటి?” అని అడిగాడు.
“మహారాజా! ధర్మమే ప్రతిరూపంగా కలిగినవాడని, పూజ్యుడని ప్రజలతో ప్రశంసలందుకుంటున్న కణ్వమహర్షి నా తండ్రి. నా పేరు శకుంతల” అని చెప్పింది.
ఆమె మాటలు విన్నాడు దుష్యంతుడు. కాని, మనస్సులో అతడికి అనేక ఆలోచనలు కలుగుతున్నాయి. ‘నా మనస్సు ఎందుకో ఈమెను ఇష్టపడుతోంది. ఈమె నిజంగా కణ్వమహర్షి కుమార్తె అయితే.. అలా జరగకూడదు. ఎందుకంటే, నా మనస్సు ధర్మబద్ధమైంది, కూడని పని గురించి నా మనస్సు ఎప్పటికీ ఆలోచించదు. కణ్వమహర్షి ఇంద్రియాల్ని జయించినవాడని విన్నాను. శకుంతల చెప్పిన మాటల్ని నమ్మలేకుండా ఉన్నాను. నిజమేదో తెలుసుకోవాలి’ అనుకున్నాడు.
శకుంతల పుట్టుక గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. “శకుంతలా! నాలుగు విధాలైన ఆశ్రమాలలో ఉత్తమమైన సన్యాసాశ్రమాన్ని నిష్ఠతో పాటించేవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, కళంకం లేని చరిత్ర కలవాడు కణ్వమహర్షి. ఆయనకి నువ్వు కుమార్తెవు ఎలా అయ్యావో అర్థం కావడం లేదు!” అన్నాడు.
దుష్యంతుడు అడిగినదానికి శకుంతల “రాజా! ఒకసారి మా ఆశ్రమానికి వచ్చిన ఒక మహర్షి మా తండ్రిగారిని పద్మాలవంటి కళ్లతో ఉన్న ఈ శకుంతల ఎక్కడినుంచి వచ్చింది?” అని అడిగాడు. అప్పుడు నా జన్మ వృత్తాంతాన్ని నా తండ్రి ఆ మహర్షికి చెప్తుంటే నేను విన్నాను.
“ఒకసారి మహర్షుల్లో గొప్పవాడైన విశ్వామిత్రుడు అతి భయంకరంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న తపస్సుకి భయపడిన దేవేంద్రుడు అప్సరస మేనకని పిలిచి ‘నువ్వు ఎలాగయినా సరే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్లి ఆయన చేస్తున్న తపస్సుని ఆపుచెయ్యాలి. లేకపోతే స్వర్గరాజ్యానికి ఉండే గౌరవం నిలబడదు’ అని చెప్పాడు.
దేవేంద్రుడి మాటలు విన్న మేనక భయంతో ‘దేవేంద్రా! బ్రహ్మకున్నంత గొప్పతనం కలిగిన వసిష్ఠుడి కుమారుల్ని చంపి వసిష్ఠుడికే బాధ కలిగించాడు విశ్వామిత్రుడు. ఆయన భయంకరమైన కోపం కలవాడు. నీతో సహా దేవతలందరకీ విశ్వామిత్రుడంటే చాలా భయం. అంత కోపం కలిగిన విశ్వామిత్రుడి దగ్గరికి అందులోనూ తపస్సు చేసుకుంటున్న సమయంలో వెళ్లి అతడి తపస్సుకి భగం కలిగించడమంటే చిన్న విషయం కాదు. ఈ పనికి నన్ను పంపించడం న్యాయం కూడా కాదు.
విశ్వామిత్రుడు కోపగిస్తే కులపర్వతాలు బ్రద్దలౌతాయి. (కులపర్వతాలు: మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, గంధమాదనము, వింధ్యము, పారియాత్రము). అడుగున ఉన్న ఇసుక మాత్రమే మిగిలేటట్లు సప్త సముద్రాలు ఇంకిపోతాయి. (సప్త సముద్రాలు: లవణసముద్రము, ఇక్షుసముద్రము, సురాసముద్రము, సర్పిసముద్రము, దధిసముద్రము, క్షీరసముద్రము, జలసముద్రము). మూడు లోకాలూ చక్రం తిరిగినట్టు గిరగిరా తిరిగి పోతాయి. గాలి కదలడానికి కూడా భయపడుతుంది. భయంకరమైన కోప స్వభావం కలిగిన ఆ మహర్షి దగ్గరికి వెళ్లడానికి నాకు చాలా భయంగా ఉంది. స్వర్గరాజ్య గౌరవం కోసం అని చెప్తున్నావు కనుక, నా శక్తి కొద్దీ ప్రయత్నించి ఆ మహర్షి మనస్సుని నా వైపు తిప్పుకుంటాను’ అని చెప్పింది.
పిల్లగాలిని వెంట తీసుకుని విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న తపోవనంలో ప్రవేశించింది. దక్షిణ దిక్కునుంచి వచ్చిన గాలి మేనక కొప్పులో ఉన్న పువ్వుల వాసనతోను, మేనక శరీరానికి రాసుకున్న పూతలనుంచి వచ్చే వాసనలతోను కలిసి మహర్షి విశ్వామిత్రుడి మీదుగా వీస్తోంది. తపోవనంలో తిరుగుతూ మహర్షుల్లో గొప్పవాడు, తన తపస్సువల్ల ఇంద్రుడికే భయాన్ని కలుగ చేసిన విశ్వామిత్రుణ్ని చూసింది. ఆయన దగ్గరికి వచ్చి వినయంగా నమస్కారం చేసింది.
తరువాత తన చెలికత్తెలతో కలిసి పువ్వులు కోసుకుంటోంది. ఇంద్రుడు కోరుకున్నట్టుగా మేనక విశ్వామిత్రుణ్ని తన వైపు ఆకర్షించుకుంది. మేనకా విశ్వామిత్రులకి ఒక బిడ్డ కలిగింది. ఆ బిడ్డని అక్కడే ఉన్న ఇసుక తిన్నెల మీద వదిలి పెట్టి మేనక తన లోకానికి, విశ్వామిత్రుడు తపోవనానికి వెళ్లిపోయారు.
పసికందు ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విని రాక్షసులు, క్రూరమృగాలు నోటితో కరుచుకుని పట్టుకుని పోకుండా పక్షుల గుంపులు వాటి రెక్కలతో కాపాడుకుంటున్నాయి. ఆ సమయంలో మేము శిష్యగణాలతో కలిసి సమిథలు, పూలు, పండ్లు తెచ్చుకోడానికి అక్కడికి వెళ్లాము. అక్కడ పైనుంచి కిందకి దిగి వచ్చిన చంద్ర రేఖలా ఇసుక తిన్నె మీద వెలిగిపోతున్న ఒక పసిపాపని చూశాము. పాపని ఎత్తుకుని మా వెంట తీసుకుని వచ్చాము. శకుంతాల చేత రక్షించబడింది కనుక అమెకి శకుంతల అని పేరు పెట్టి పెంచుకున్నాము.
మహర్షీ! కన్నవాడు, అన్నం పెట్టినవాడు, భయం నుంచి రక్షించినవాడు ముగ్గుర్నీ స్త్రీలకి తండ్రులుగా చెప్తారు. అదే విధంగా పురుషులకి ఈ ముగ్గురే కాకుండా ఉపనయనం చేసినవాడు, వేదాలు చెప్పినవాడు మొత్తం అయిదుగుర్ని తండ్రులుగా చెప్తారు. శాస్త్రప్రకారం భయం నుంచి రక్షించినవాళ్లం కనుక మేము శకుంతలకి తండ్రులం. పెంచి పెద్ద చేశాము కనుక శకుంతల మా మనస్సుకి అనందాన్ని కలిగించే కూతురు. కణ్వమహర్షి వివరంగా నా జన్మ వృత్తాంతాన్ని మహర్షికి చెప్పాడు” అని తన గురించి దుష్యంతుడికి వివరంగా తెలియచేసింది శకుంతల.
శకుంతల దుష్యంతుల వివాహము
శకుంతల మహర్షి కుమార్తేమోనని అప్పటి వరకు భయపడుతున్న దుష్యంతుడికి శకుంతల చెప్పిన ఆమె వృత్తాంతం విన్నాక సందేహం తీరిపోయింది. ఆమె రాజకుమార్తె అని తెలిసింది. అతడి మనస్సు ఆనందంతో నిండిపోయింది. వెంటనే దుష్యంతుడు “శకుంతలా! అందమైన రూపము, శరీర కాంతి, మంచి గుణాలు కలిగిన నీకు, నార చీరలు కట్టడం, అడవిలో దొరికే పండ్లు తినడం, పర్ణశాలలో ఉండడం తగినవి కాదు. మహర్షులు నివసించే ఈ పల్లెలో ఉండడం నీకు తగినట్టుగా లేదు. నన్ను పెళ్లి చేసుకుంటే గొప్ప సంపదలతో, చెప్పలేనన్ని రాజ్యభోగాలు అనుభవిస్తూ, ఎత్తైన అందమైన మేడల్లో సంతోషంగాను, విలాసంగాను గడపవచ్చు.
వివాహం చేసుకోడానికి ధర్మ ప్రకారం ఆచరించే ఎనిమిది విధానాలు ఉన్నాయి. అవి బ్రాహ్మణం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, రాక్షసం, ఆసురం, గాంధర్వం, పైశాచం. ఉత్తమ క్షత్రియ వంశాలకి చెందిన వాళ్లకి గాంధర్వం, రాక్షసం అనే విధానాల్లో జరిగే వివాహాలు ధర్మంబద్ధంగా ఉంటాయి. మనిద్దరికీ ఒకరంటే ఒకరికి అనురాగం కలిగింది కనుక, గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుందాం!” అన్నాడు దుష్యంతుడు.
అతడి మాటలు విని శకుంతల “మహారాజా! కరుణాసముద్రులు, ధర్మపరులు నన్ను పెంచి పెద్ద చేసిన మా తండ్రి కణ్వమహర్షి త్వరలోనే వస్తారు. ఆయన వచ్చి మీరు చెప్పినదానికి అంగీకరిస్తే నన్ను మీకు కన్యాదానం చేస్తారు. ఆయన చేతుల మీదుగానే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను!” అని చెప్పింది.
ఆమె చెప్పినదాన్ని విని దుష్యంతుడు “తనకు తనే బంధువు, దిక్కు, కర్త అనే లక్షణాలతో ప్రసిద్ధి చెందిన గాంధర్వ వివాహం ఎంతో రహస్యంగాను, మంత్ర తంత్రాలు లేకుండాను ఉంటుంది!” అని శకుంతలకి గాంధర్వ వివాహం గురించి వివరంగా చెప్పి ఆమెని ఒప్పించాడు.
దుష్యంతుడు చెప్పినదాన్ని విని శకుంతల “మహారాజా! నీ అనుగ్రహం వల్ల నాకు పుట్టిన కుమారుడికి నీ విశాల సామ్రాజ్యానికి యువరాజ పట్టాభిషేకం చేస్తానని మాట ఇస్తే నేను ఈ వివాహానికి అంగీకరిస్తాను!” అని చెప్పింది. శకుంతల మాటలు విని దుష్యంతుడు ఎంతో సంతోషంతో ఆమె కోరికని అంగీకరించాడు. వెంటనే గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుని ఆమెతో సుఖాలు అనుభవించాడు. ఒకరోజు శకుంతలతో “నాకు వెంటనే చెయ్యవలసిన రాచకార్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను రాజ్యానికి బయలుదేరుతాను. నిన్ను వెంటబెట్టుకుని రమ్మని మంత్రుల్ని నీ తండ్రి కణ్వమహర్షి దగ్గరికి పంపిస్తాను!” అని చెప్పి శకుంతలని ఒప్పించి దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్లిపోయాడు.
శకుంతల కణ్వమహర్షి వచ్చాక తను చేసిన పనికి కోపగిస్తాడేమో అని భయపడుతోంది. వెళ్లిన పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన కణ్వమహర్షి శకుంతల హావభావాల్లో కనిపిస్తున్న మార్పుని గ్రహించాడు. జరిగినదాన్ని దివ్యదృష్టితో చూసి తెలుసుకున్నాడు. క్షత్రియులకి గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే అనుకుని ఊరుకున్నాడు.