మహాభారతం మొత్తం వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పినట్లు ఉంటుంది. జనమేజయుడు ఎవరూ అంటే పరీక్షిత్తు మహారాజు కొడుకు. పరీక్షిత్తు మహారాజు ఎవరూ అంటే అభిమన్యుడికి కొడుకు, పాండవులకి మనుమడు. ఈ మహాభారతంలో పరీక్షిత్తు మహారాజు గురించి తెలుసుకుందాం.
ఉదంకమహర్షి ఒకసారి జనమేజయ మహారాజుని కలిసి “దానాలు, యజ్ఞాలు చేస్తూ, భరతవంశాన్ని వృద్ధిపరుస్తూ, ప్రజలందరికీ మేలు చేస్తూ అర్జునుడితో సమానమైన, ఇంద్రియ నిగ్రహం కలిగిన నీ తండ్రి పరీక్షిత్తు మహారాజుని క్రూరుడైన తక్షకుడు తన భయంకరమైన విషంతో చంపేశాడు. అందుకు కారణం శమీకుడి కొడుకు శృంగి. నువ్వు కూడా బ్రాహ్మణులతో సర్పయాగాన్ని నిర్వహించి, భయంకరమైన అగ్నిజ్వాలల్లో తక్షకుడు మొదలైన పామున్నింటినీ నాశనం చేసి ప్రతీకారం తీర్చుకో” అని చెప్పాడు.
జనమేజయుడు సర్పయాగం మొదలుపెట్టాడు. దాన్నిపూర్తిగా చెయ్యనివ్వక మధ్యలోనే ఆపించేశాడు ఆస్తీకమహర్షి. జనమేజయుడికి ప్రాచీనమైన గొప్పదైన భారత కథ వినాలనిపించింది. వ్యాసమహర్షికి నమస్కరించి “పూజ్యులైన మహర్షీ! మీతో పాటు భీష్ముడు మొదలైన కురువంశ పెద్దలందరూ దగ్గర ఉండి పాండవులకి, కౌరవులకి తోడుగా ఉంటూ రాజ్యసంపదని పంచి ఇచ్చారు. వాళ్లు ఎవరి రాజ్యాన్ని వాళ్లు పాలించుకుంటూ ఉన్నారు. అంతలోనే ప్రజలందరూ నాశనమయ్యేటట్లు భారతయుద్ధాన్ని ఎందుకు మొదలుపెట్టారు?
పెద్దల మాట వినాలి కదా? మరి మీరు చెప్పినట్టు వాళ్లు ఎందుకు వినలేదు? యుద్ధం జరుగుతుందని తెలిసి కూడా మీరందరూ వాళ్లని ముందే ఎందుకు ఆపలేకపోయారు? అసలు ఈ కలహం ఎందుకు వచ్చింది? జరిగిన విషయాలన్నీ దయచేసి నాకు వివరంగా చెప్పండి!” అని అడిగాడు.
ప్రసిద్ధమైన భారత వీరుల సద్గుణాలతో కీర్తించబడిన, ప్రాచీనమైన బారతకథని జనమేజయుడికి వినిపించమని వేదవ్యాసుడు వైశంపాయనుడితో చెప్పాడు. వైశంపాయనుడు తన గురువు వేదవ్యాసుడికి నమస్కారం చేసి భారత కథని చెప్పడం మొదలుపెట్టాడు. జనమేజయ మహారాజుతో పాటు యాగం చూడ్డానికి వచ్చినవాళ్లు కూడా వైశంపాయనుడు చెప్తున్న భారతకథని వినడానికి సిద్ధంగా కూర్చున్నారు. ఇలా మొదలయ్యాయి మహాభారత కథలు. మన కథ మహాభారతంలో పరీక్షిత్తు మహారాజే కదా..!
మహాభారత యుద్ధమంతా పూర్తయ్యి దుర్యోధనుడు కొన ఊపిరితో ఉన్నాడు. అశ్వత్థామ అతణ్ని చూసి బాధతో శిబిరాల్లో నిద్రపోతున్న పాండవుల మిగిలిన సైనికుల్ని చంపేశాడు. అది తెలుసుకుని అర్జునుణ్ని తీసుకుని కృష్ణుడు అశ్వత్థామ మీద యుద్ధం చెయ్యడానికి రథాన్ని పరుగెత్తించాడు. భీముడికి పౌరుషం ఎక్కువ కదా.. ముందే వెళ్లిపోయాడు.
ఒకచోట ఒంటి నిండా బూడిద పూసుకుని తపస్సు చేస్తున్న అశ్వత్థామని చూశాడు. అశ్వత్థామ భీముణ్ని చూసి, అతడి వెనక వచ్చిన అర్జునుణ్నీ, ధర్మరాజునీ చూసి వాళ్ల దివ్యాస్త్ర జ్ఞానం తెలుసు కనుక భయపడ్డాడు. తను చేసిన మహాపాపానికి బాధపడి బ్రహ్మశిరోనామక దివ్యాస్త్రం తలుచుకుని ఒక రెల్లు గడ్డిపోచ పట్టుకుని దానిపైకి అస్త్రాన్ని ఆవాహన చేసి, ‘పాండవ నిర్మూలనం అవుతుంది గాక!’ అని కఠినంగా అంటూ కోపంతో మండిపడుతూ ప్రయోగించాడు.
దాని ప్రభావం తెలిసిన కృష్ణుడు అర్జునుడితో ‘అర్జునా! అర్జునా! అది బ్రహ్మశిరోనామక దివ్యాస్త్రం. దీన్ని వేరే అస్త్రం తిప్పికొట్టలేదు. నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్నే ప్రయోగించి దీన్ని నిరోధించి నిన్నూ, నీ సోదరుల్నీ త్వరగా కాపాడుకో’ అన్నాడు.
కృష్ణుడు చెప్పగానే అర్జునుడు రథం దిగి గురువు ద్రోణాచార్యులవారికి మనస్సులో నమస్కారం చేసుకుని బాణాన్ని వదులుతూ మొదట అశ్వత్థామకి హాని కలగకూడదని, తరువాత తనకూ, తన సోదరులకీ శుభం కలగాలని అనుకుని అస్త్రదేవతలకి నమస్కరించి శుభం కోరుతూ ప్రయోగించాడు.
పుణ్యాత్ముడైన నారదుడు, భరతవంశోద్ధారకుడైన వ్యాసుడూ కలిసి లోకాన్ని భయపెట్టే ప్రయత్నంలో ఉద్దండులైన అర్జునుణ్ని, అశ్వత్థామనీ శాంతింప చెయ్యడానికి మధ్యలో వచ్చి నిలబడి ‘ఓ పుణ్యాత్ములారా! ఎంతోమంది దివ్యాస్త్రవేత్తల్లో శ్రేష్ఠులూ, గొప్ప భుజబలపరాక్రం కలవాళ్లూ భూమిలో ఉన్నారు. వాళ్లు దీన్ని మనుష్యుల మీద ప్రయోగించారా?’ అన్నారు.
అది విని అర్జునుడు ‘మహామునీశ్వరులారా! నేను నా అస్త్రాన్ని ఉపసంహరిస్తే ఈ దుర్మార్గుడు తన అస్త్రంతో మమ్మల్ని అందర్నీ దహిస్తాడు. మరి మా క్షేమం గురించి మీరు ఆలోచించాలి’ అంటూనే ఆ మహాస్త్రాన్ని అనాయాసంగా ఉపసంహరించాడు. గురుభక్తీ, తపోయుక్తీ ఎక్కువ ఉన్న అర్జునుడు ఉపసంహరించగలిగాడు. అశ్వత్థామ తన అస్త్రాన్ని వారించాలని చూశాడు సాధ్యం కాలేదు.
అశ్వత్థామ “మునీశ్వరా! అవమానం వల్ల కలిగిన కోపంతోను, ప్రాణభీతితోను ఈ మహాస్త్రాన్ని ప్రయోగించాను. ఇది పాండవులందరినీ దహించి తీరుతుంది. ఇది పాపమే అని తెలిసినా ఆ పని చేశాను. నా అస్త్రం పాండవేయుల గర్భాలకి హాని కలిగించి తృప్తిపడి ఉపశమిస్తుందిగాక!” అన్నాడు. అశ్వత్థామ మాటలకి వ్యాసుడు ‘అలాగే చెయ్యి. వేరేదానికి ఆశించకు’ అన్నాడు. అన్ని గర్భాల్నీ నాశనం చేస్తాను గాక! అని మనస్సులో నిర్ణయించి ఆ మునీశ్వరుడితో అలాగే చేస్తానని పైకి చెప్పాడు అశ్వత్థామ.
శ్రీకృష్ణుడు అశ్వత్థామతో ‘పాండురాజు మనుమలందర్నీ చంపి పాపం కట్టుకున్నావు. ఇప్పుడు మనుమల గర్భాల్ని చంపాలనుకుంటున్నావు. గొప్ప దానాలతోను, ధర్మాలతోను, యజ్ఞాలతోను జనుల్ని సంతోషపెట్టి గొప్పదనం పొందే ఒకడిని పాండవ వంశం నిలబెట్టడం కోసం నేను రక్షిస్తాను” అన్నాడు.
అది విని అశ్వత్థామ కోపంతో ‘నువ్వు పాండవ పక్షపాతంతో ఇలా అంటే, నేను అలా ఎందుకు చేస్తాను? నువ్వు విరాటపుత్రి అయిన ఉత్తర గర్భాన్ని రక్షించాలని చూస్తావు. నా బాణంతో దాన్ని కూడా తప్పకుండా నాశనం చేస్తాను’ అని చెప్పాడు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతి.
శ్రీకృష్ణుడు ధర్మరాజు చేస్తున్న అశ్వమేధయాగం చూడాలని బలరాముడు, సాత్యకి మొదలైన యాదవులతో సుభద్రని వెంటబెట్టుకుని సంతోషంగా హస్తినాపురానికి వచ్చాడు. ఉత్సాహంతో విదురుడు ముందు నడుస్తుండగా ఎదురు వెళ్లి శ్రీకృష్ణుడిని మహాభక్తితో తీసుకుని వచ్చారు. యాదవులందరూ సంతోషంగా ఉన్న సమయంలో పూరువంశంలో శ్రేష్ఠుడూ, పూర్వమహారాజులా సకల సద్గుణ సంపన్నుడూ అయిన కుమారుడు ఉత్తరకు జన్మించాడు.
ఆ సమయంలో పురిటింట్లో ఉన్న వృద్ధస్త్రీలు కొడుకు పుట్టాడని వెంటనే బయట ఉన్న జనానికి చెప్పారు. ఆ జనమంతా సంతోషంతో కేకలు పెట్టారు. అంతలోనే చచ్చిన బిడ్డ పుట్టాడంటూ ఏడ్పులు చెలరేగాయి. మొదట శుభవార్త చెప్పిన వృద్ధస్త్రీలు దుఃఖంతో అశుభవార్త చెప్పేటప్పటికి జనులందరూ దుఃఖంతో మునిగిపోయారు. ఏడ్పులూ, పెడబొబ్బలూ అంతటా వ్యాపించాయి.
వాళ్ల ఏడ్పులు విన్న శ్రీకృష్ణుడు బాధ పడ్డాడు. సాత్యకితో కలిసి కుంతి ఉన్న చోటుకి వెళ్లాడు. కుంతీ, ద్రౌపదీ సుభద్రా పెద్దపెట్టున ఏడుస్తూ వచ్చారు. వాళ్లని చూసి అతడి మనస్సు దుఃఖంతో కలత పడింది. శ్రీకృష్ణుణ్ని చూసి కుంతీదేవి “నాకూ నా సంతనానికీ నువ్వే దిక్కు. కఠినాత్ముడైన అశ్వత్థామ ప్రయోగించిన శిరోనామకాస్త్రం నుంచి పుట్టిన అగ్నితో మాడి, నీ ముద్దుల మేనల్లుడు అభిమన్యుడి కొడుకు చచ్చిపోయి పుట్టాడు. శ్రీకృష్ణా! ఆ బాలుడిని నువ్వు తిరిగి బతికించు.
భయంకరమైన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ‘నేను తప్పకుండ ఉత్తర కడుపున పుట్టిన బిడ్డని కాపాడుతానని ప్రతిజ్ఞ చేశావు. ఒకప్పుడు నువ్వు ఉత్తరని కూడా ఓదార్చావు. దయామయుడవై ఆమె గర్భశోకాన్ని వదిలించవయ్యా! ఈ భరతవంశాన్ని నిలిపినవాడివి నువ్వే. కనుక, ఈ శిశువుని కూడా బతికించు” అని చెప్తూ కుంతి నేలమీద కూలిపోయింది.
శ్రీకృష్ణుడు ఆమెని ఓదార్చాడు. అంతలోనే సుభద్ర “అర్జునుడూ, అతడి భార్యనైన నేనూ దాని ఫలితాన్ని పొంది దుర్గతి పాలయ్యాము. మనుమడు కూడా ఇలా నాశనమైపోతే ఆయన ఏమై పోతాడో తెలియదు” అంది. సుభద్ర మాటలు విని శ్రీకృష్ణుడు మేఘగర్జనవంటి కంఠస్వరంతో అందరూ సంతోషంగా వింటుండగా ‘ఈ పసికందుని బతికిస్తాను. మీరు విచారించకండి’ అని పురిటింట్లో ప్రవేశించాడు.
చెదిరిన జుట్టుతో ఉత్తర ‘దేవా! భక్తుల దుఃఖం పోగొట్టడం నీకు గట్టి వ్రతం కదా! ఈ శిశువుని తిరిగి బతికించు. శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు కొడుకుని చంకనెత్తుకుని వాడితో మొక్కిస్తానని గంపెడాశ పెట్టుకున్నాను. కాని, అశ్వత్థామ చెలరేగి నా కోరిక నెరవేరకుండా చేశాడు” అంటూ కొడుకు శవాన్ని ఒళ్లో పెట్టుకుని ఏడుస్తోంది. దయామయుడైన శ్రీకృష్ణుడు ‘భయపడకు భయపడకు’ అని అభయమిచ్చి, కాళ్లు కడుక్కుని నీరు ఆచమనం చేసి, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అణచి వేశాడు.
శిశువు శవాన్ని మంచం మీద ఉంచమన్నాడు. నేను శత్రువుల విషయంలోనైనా అబద్ధం చెప్పనివాడినైతే; యుద్ధ సమయాల్లో ఎప్పుడూ మనస్సు చెదిరి వెనుకంజ వెయ్యనివాడినైతే; బ్రాహ్మణ జాతి పట్ల నాకు అధికమైన ప్రేమ ఉన్నట్లైతే; ధర్మమందు ఆసక్తి కలవాడినైతే; అర్జునుడి యందు ఏనాడూ శతృభావం లేనివాడినైతే; అసంగ్దిద్ధమైన ధర్మాన్ని ఆశ్రయించి నేను కంసుడు మొదలైనవాళ్లని సంహరిస్తే; నేను చేసిన పని ధర్మబద్ధమై కర్మనిష్ఠులకి సమ్మతమైతే; మహాసత్యమూ, ఉత్కృష్ట ధర్మమూ, అస్ఖలిత బ్రహ్మచర్యమూ నాయందు నెలకొని ప్రకాశిస్తుంటే ఈ మగబిడ్డకి ఇప్పుడే ప్రాణం వచ్చునుగాక!” అన్నాడు.
బాలుడికి ప్రాణాలు వచ్చి అతడి చిన్న చిన్న అవయవాలు కదిలాయి. అతడు కళ్లు తెరిచాడు. అది చూసి కుంతి మొదలైన కౌరవస్త్రీలు పరమానందం పొందారు. అన్ని జాతుల ప్రజలూ సంతోషించారు. ఆకాశవాణి శ్రీకృష్ణుణ్ని స్తుతించింది. పవిత్రమైన ఆ పురిటిల్లు వెలుగులు విరజిమ్మింది. ఉత్తర బతికిన బిడ్డని చూసి కళకళలాడుతున్న ముఖంతో సంతోషంగా బిడ్డని ఎత్తుకుని వేగంగా వచ్చి శ్రీకృష్ణుడి కాళ్ల దగ్గర వాలి నుదుటిని నేలకి మోపింది.
శ్రీకృష్ణుడు ఆమెని ప్రేమగా లాలించాడు. రాజా! విలువైన రత్నాలతో ప్రకాశిస్తున్న ఎన్నో అలంకారాలు ఆ బాలుడికి ఇచ్చారు. యాదవులు కూడా ఆశ్చర్యం కలిగించే నగలు పెట్టారు. ప్రజలందరూ వింటుండగా శ్రీకృష్ణుడు ‘తన వంశమంతా నశించి పోయినప్పుడు జన్మించాడు కనుక, ఈ అభిమన్యుడి కుమారుడికి ‘పరీక్షిత్తు’ అనే పేరు సముచితంగా ఉంటుంది’ అన్నాడు. ఇలా శ్రీకృష్ణుడు పాండవ సంతతిని నిలిపాడు. కౌరవవంశం నాశనమవుతున్న సమయంలో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు, విరాటమహారాజు కూతురు ఉత్తర దంపతులకి ధర్మస్వరూపుడైన పరీక్షిత్తు జన్మించాడు.
పరీక్షిత్తు మహారాజు ధర్మం, అర్ధం, కామం అనే పురుషార్ధాల్ని అతిక్రమించకుండా.. ప్రజలకి ఏ కష్టమూ కలగకుండా.. భూమి మీద ఉన్న ప్రజలందర్నీ కాపాడుతూ.. అరవై సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఒకరోజు అడవికి వెళ్లి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు. తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్లిపోయాడు. ఒక చోట తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షిని “మహర్షీ! బాణం దెబ్బతిన్న లేడి ఇటువైపు వచ్చిందా?” అని అడిగాడు. అతడి ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు. పరీక్షిత్తుకి శమీకుడి మీద కోపం వచ్చి దగ్గర్లో చచ్చి పడి ఉన్న ఒక పాముని తన బాణం కొసతో తీసి శమీకుడి మెడలో వేసి వెళ్లిపోయాడు.
శమీకుడి కుమారుడు ‘శృంగి’ తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకుని “నా తండ్రి మెడలో చచ్చిన పాముని వేసిన పరీక్షిత్తు అనే పేరుగల మహారాజు నేటి నుంచి ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక!” అని శాపం ఇచ్చాడు.
జరిగిన విషయాన్ని శమీకుడు తెలుసుకుని, శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. శృంగి శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోడం తనకు చాతకాదన్నాడు. శమీకుడు గౌరముఖుడు అనే పేరుగల శిష్యుణ్ని పిలిచి పరీక్షిత్తు మహారాజు దగ్గరికి వెళ్లి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పమన్నాడు. గౌరముఖుడు రాజు దగ్గరికి వెళ్లి గురువుగారు చెప్పమన్నట్లు చెప్పాడు.
శృంగి ఇచ్చిన శాపానికి భయపడి పరీక్షిత్తు తనను రక్షించుకోడానికి చెయ్యవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. నేర్పరులైన వడ్రంగుల్ని పిలిపించి, ఒంటిస్తంభంతో మేడ కట్టించుకుని రక్షణకి ఏర్పాటు చేసుకుని అక్కడే నివసించాడు. విషయం తెలుసుకున్నఅక్కడికి వచ్చిన అనేకమంది బ్రహ్మర్షులు, మహర్షులతో తనకి ఏడు రోజులే సమయం ఉందని మోక్షం పొందడానికి ఉపయోగించే పురాణాలు, ఇతిహాసాలు చెప్పించుకుని విన్నాడు.
కశ్యపమహర్షి వెంటనే పరీక్షిత్తు మహారాజుని బతికించాలని బయలుదేరాడు. తక్షకుడు అడవిలో కశ్యపమహర్షిని కలిసి వెనక్కి వెళ్లిపొమ్మన్నాడు. కశ్యపమహర్షి చూసి పరీక్షిత్తుకి మరణం తప్పదని తెలుసుకుని వెనక్కి వెళ్లిపోయాడు. తక్షకుడు సర్పాల్ని బ్రాహ్మణ రూపాల్లోకి మారమని, మంచి సువాసనలు వెదజల్లే తాజా పువ్వుల్ని, రుచిగా, తియ్యగా ఉండే పండ్లని మోదుగ ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకుని పరీక్షిత్తు మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్లమని తను కూడా అదృశ్య రూపంలో వాళ్లని అనుసరించాడు.
వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకులు తెచ్చిన పండ్లు, పూలు తీసుకున్నాడు పరీక్షిత్తు మహారాజు. తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో “శృంగిమహర్షి శాపం ఇచ్చి ఏడు రోజులు గడిచిపోతున్నాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు” అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంచండి” అని చెప్పాడు.
అందరికీ పంచడం అయిపోయాక తను కూడా ఒక పండుని చీల్చాడు. అందులో ముందు నల్లగా కనబడి, అంతలోనే ఎర్రని రంగుతో పాముగా మారి, అగ్ని జ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటికి వచ్చి పరీక్షిత్తు మహారాజుని కరిచి వెళ్లిపోయాడు. తక్షకుడి విషం వల్ల జనమేజయుడి తండ్రి పరీక్షిత్తు మహారాజు మరణించాడు!