Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-63: పాండవుల దిగ్విజయ యాత్ర

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఉత్తరదిక్కుని జయించిన అర్జునుడు:

ర్మరాజు భీమార్జున నకుల సహదేవుల్ని ఒక్కొక్కళ్లని ఒక్కొక్క దిక్కు జయించడానికి పంపించాడు. భీముడు తూర్పు దిక్కుకి, అర్జునుడు ఉత్తర దిక్కుకి, నకులుడు పశ్చిమ దిక్కుకి, సహదేవుడు దక్షిణ దిక్కుకి మితిమీరిన చతురంగ బలాల్ని తీసుకుని నాలుగు దిక్కులకి నలుగురు బయలుదేరారు.

వైశంపాయనుడు చెప్తున్న భారత కథ వింటున్న జనమేజయుడు “వైశంపాయన మహర్షీ, భీమార్జున నకుల సహదేవులు నాలుగు దిక్కులకి వెళ్లి అక్కడ ఉన్న రాజులతో కప్పాలు కట్టించుకుని అపారమైన ధనాన్ని ఎలా తీసుకుని రాగలిగారో నాకు వివరంగా చెప్పండి” అని అడిగాడు.

అర్జునుడు గాండీవాన్ని ధరించి అగ్నిదేవుడు ఇచ్చిన దివ్యరథాన్ని ఎక్కి బయలుదేరాడు. గొప్ప పరాక్రమంతో ఉత్తరదిగ్విజయ యాత్రలో మొదట పుళిందరాజుని ఓడించాడు. అన్ని ద్వీపాల మండలేశ్వరుల్ని తేలికగా వశం చేసుకున్నాడు. ఆ రాజులందరూ కూడా తనని అనుసరిస్తూ ఉండగా ప్రాగ్జోతిషం మీద దండెత్తాడు. ఆ దేశానికి రాజు భగదత్తుడు అపారమైన సైన్యంతో దండెత్తి వచ్చి అర్జునుడితో తలపడ్డాడు.

శబరులు, సాగరతీరవాసులు భగదత్తుడి సైన్యంతో కలిసి అర్జునుడి సేనలతో ఎనిమిది రోజులు భయంకరంగా యుద్ధం చేశారు. కాని, అర్జునుణ్ని గెలవలేకపోయారు. భగదత్తుడు అర్జునుడితో “అర్జునా! నేను ఇంద్రుడికి స్నేహితుణ్ని. నువ్వు ఇంద్రుడికి కుమారుడివి. నీతో యుద్ధం చేసి నిన్ను ఓడించడం నాకు సాధ్యం కాదు. నీకు ఏం చెయ్యమంటావో చెప్పు” అన్నాడు.

అర్జునుడు “నువ్వు నాకు ఏమీ చెయ్యక్కర్లేదు. కురువంశప్రభువు ధర్మరాజు రాజసూయ యాగం చెయ్యాలని అనుకుంటున్నాడు. అతడికి నువ్వు కప్పం కట్టి ఆ యాగం చూడడానికి రా!” అన్నాడు.

తరువాత భగదత్తుడు ఇచ్చిన ధనరాశుల్ని తీసుకుని ముందుకి వెళ్లిపోయాడు అర్జునుడు. తన చతురంగ బలంతో అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరులకు చెందిన మహారాజుల్ని యుద్ధంలో జయించి వాళ్ల నుంచి ధనాన్ని తీసుకున్నాడు.

ఉలూక దేశానికి అధిపతి అయిన బృహంతుణ్ని; ఉత్తర ఉలూక వామదేవ, మోదాపుర, సుదామ, సుసంకుల మొదలైన దేశాల రాజుల్ని జయించి; దేవప్రస్థంలో రాజైన సేనాబిందుణ్ని ఓడించి; విష్వగశ్వుడు అనేరాజు పరాక్రమాన్ని అణిచి; పర్వతదేశరాజుల గర్వాన్ని పోగొట్టి; బర్బర, శబర, తురుష్క రాజుల్ని లోబరుచుకుని; మాళవ, పౌండ్ర, కాశ్మీర, త్రిగర్త, లోహిత, సుధన్వ, గాంధార, కాంభోజ, కోసల దేశాలకి చెందిన రాజుల్ని ఓడించి విచిత్రమైన రత్నాల్ని, బంగారు వస్తువుల్ని, వాహనాల్నితీసుకున్నాడు.

చిత్రాయుధుడు రక్షిస్తున్న సింహపురాన్ని జయించాడు. సింహాసనం మీద కూర్చున్న ఆటవికులైన దస్యజాతివాళ్లని లోబరుచుకున్నాడు. శ్వేత పర్వతాన్ని దాటి కాంభోజకటకుడు అనే రాజు చేత పూజింపబడ్డాడు.

హాటక దేశంలో మానసము అనే పేరుగల కొలను, ఋషికుల్యాన్ని దర్శించాడు. అక్కడి రాజులు ఇచ్చిన అనేక వస్తువుల్ని, తిత్తిరి, కల్మాషం, మండూకం అనే పేరు గలిగిన, నెమలి, హంస, చిలుకరంగు వంటి రంగులు కలిగిన గుర్రాల్ని, పర్వతాలవంటి ఏనుగుల్ని తీసుకున్నాడు.

తరువాత హేమకూట నిషధ పర్వతాలు, దాటి గంధర్వ నగరాన్ని జయించి, నూరువేల యోజనాల వైశాల్యం కలిగి, స్వచ్ఛమైన బంగారంతో కుప్పబోసిన కాంతిలా ఉన్న మేరు పర్వతాన్ని దర్శించాడు. జంబూమహావృక్షాన్ని, జంబూ మహానదిని చూసి, ఆ నది ఒడ్డున మేరుపర్వతానికి కుడినుంచి ఎడమవైపుకి చుట్టుకుంటూ ప్రదక్షిణంగా వెళ్లి గంధమాదన పర్వతాన్ని దాటాడు.

ఆ దిక్కుకి రాజులైన సిద్ధ, విద్యాధర, చారణ, గంధర్వుల దగ్గరి నుంచి అనేక రకాలైన వస్తువుల్ని వాహనాల్ని తీసుకున్నాడు. మాల్యవంతము, నీలము అనే పర్వతాల్ని దాటి ఉత్తర కురు దేశాలకి వెళ్లి హరివాసము అనే నగరం మీద దండెత్తాడు.

భయంకరమైన ఆకారము, గొప్ప బలము కలిగిన హరివాస పురానికి ద్వారపాలకులుగా ఉన్న వాళ్లు అర్జునుడి దగ్గరకు వచ్చారు. దేవేంద్రుడిలా వెలిగిపోతున్న అతణ్ని చూసి “కురువంశంలో పుట్టిన వీరుడా! నీ వంటి శూరులు ఎక్కడా ఉండరు. నీ పరాక్రమం మాకు చాలా నచ్చింది. పూర్వం ఏ యుగంలోను ఏ రాజులూ నువ్వు వచ్చినట్టు బలసంపదతో ఇక్కడికి రాలేదు. ఈ ప్రదేశాల్ని ఉత్తరకురుభూములు అంటారు. నేలమీద తిరిగే సామాన్య ప్రజలకి ఇవి కనిపించవు. ఇక్కడి నుంచి నువ్వు సాధించి తీసుకోడానికి ఏదీ లేదు. అయినా మేము నువ్వు చెప్పినట్టే చేస్తాము. ఏం చెయ్యమంటావో చెప్పు” అన్నారు.

వాళ్ల మాటలకి అర్జునుడు “ధర్మరాజు రాజసూయ యాగం చెయ్యాలని అనుకుంటున్నాడు. ఆ యాగానికి మీ దగ్గర నుంచి ఏదేనా వస్తువు ఇవ్వండి. అందువల్ల ఆ మహారాజు సామ్రాజ్యం కీర్తితో ప్రకాశిస్తుంది” అన్నాడు. ఉత్తరకురుభూముల్ని పాలించే రాజులందరు అపరిమితమైన సంతోషంతో అమూల్యమైన అనేక రత్నాభరణాలు తెచ్చి ఇచ్చారు. అర్జునుడు ఆజ్ఞాపించినట్టు ఉత్తరకురుభూముల రాజులందరూ గౌరవంతో అర్జునుడికి కప్పాలు తెచ్చి ఇచ్చారు.

తూర్పుదిక్కుని జయించిన భీమసేనుడు:

భీముడు తన బలమైన సైన్యంతో బయలుదేరి తూర్పు దిక్కుకి వెళ్లాడు. పాంచాలరాజు అతణ్ని ఆదరించాడు. తరువాత విదేహరాజైన జనకుణ్ని ఓడించాడు. దశార్ణపతి అయిన సుధన్వుడితో గొప్ప యుద్ధం చేసి అతడి పరాక్రమానికి మెచ్చుకుని తన దగ్గర సేనాపతిగా చేసుకున్నాడు. అశ్వమేధయాగం చేసిన రోచమనుడు అనే రాజుని, అతడి తమ్ముళ్లని కూడా ఓడించి చేది దేశం చేరుకున్నాడు.

చేది దేశపు రాజు శిశుపాలుడు గొప్ప బలపరాక్రమాలు కలిగిన భీముడి దగ్గరికి వచ్చి ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగం గురించి తెలుసుకున్నాడు. ఎంతో ప్రేమతో అనేక ధనరాశులు, రత్నాలు ఇచ్చాడు. భీముడు శిశుపాలుడి నగరంలో కొన్ని రోజులు ఉండి తూర్పు దిక్కుకి వెళ్లాడు.

పుళిందపురంలో సుకుమార, సుమిత్రుల్ని; కుమార దేశంలో శ్రేణిమంతుణ్ని; కోసల దేశంలో బృహత్ బలుణ్ని; అయోధ్యాపురంలో దీర్ఘప్రజ్ఞుడు, కాశీరాజు, సుపార్శ్వుణ్ని; రాజపతి అయిన సుధన్వుణ్ని; మత్స్య, మలద రాజుల్ని; కర్ణాట, దక్షిణ మల్లుల్ని ఓడించి వాళ్ల దగ్గరనుంచి అపరిమితమైన ధనరాశుల్ని తీసుకుని మగధపతి అయిన జరాసంధుడి కుమారుడు సహదేవుణ్ని పలకరించి; హిమవత్పర్వతానికి పక్కన ఉన్న జలోద్భవము అనే దేశాన్ని; భల్లాట దేశాన్ని జయించి; ఇంద్ర పర్వతానికి దగ్గరలో ఉన్న బోయరాజులు ఏడుగుర్ని; శర్మక, వర్మకుల్ని; చంద్రసేన, సముద్రసేనుల్ని; కర్ణ, వత్స రాజుల్ని; పౌండ్రకవాసుదేవుణ్ని లోబరుచుకున్నాడు.

సాటిలేని పరాక్రమం కలవాడు అని ప్రజలతో కీర్తింపబడిన భీమసేనుడు తన అపారమైన సైన్యంతో తూర్పు దిక్కువైపు దండయాత్ర చేసి రాజులందరితో వేరు వేరుగా వంద కోట్ల రత్నాలు, వెండి, బంగారపు రాశుల్ని కప్పంగా తీసుకున్నాడు.

దక్షిణదిక్కుని జయించిన సహదేవుడు:

తన అపారమైన సైన్యాన్ని తీసుకుని సహదేవుడు దక్షిణ దిక్కుగా వెళ్లి సుమిత్రుడు, శూరసేనుడు, దంతవక్త్రుడు, యవనులు, గోశృంగగిరిలో నివసించేవాళ్లు మొదలైన రాజులందరినీ జయించి కుంతిభోజుడితో గౌరవించబడ్డాడు. శ్రీకృష్ణుడికి విరోధి భూరిబలుడికి కుమారుడు జంభకుడు అనేవాణ్ని యుద్ధంలో ఓడించి అతడి దగ్గర్నుంచి ఏనుగులు, గుర్రాలు, రత్న రాశుల్ని తీసుకున్నాడు.

నర్మదానదికి దగ్గరలో ఉన్న అవంతిదేశ రాజులు విందానువిందుల్ని ఓడించి ముందుకు వెళ్లి మహిష్మతీపురం మీద దండెత్తాడు. మహిష్మతీపురానికి రాజు, పరాక్రమవంతుడు నీలుడు అనే రాజు సహదేవుడితో గొప్ప యుద్ధం చేశాడు. యుద్ధం జరుగుతుండగా సహదేవుడి సైన్యంలో ఉన్న మదపుటేనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద కాల్బలాల మీద అగ్నిదేవుడు రగులుకుని వ్యాపించాడు.

వైశంపాయనుడు చెప్తున్న మహాభారతకథల్ని వింటున్న జనమేజయుడు అగ్ని సహదేవుడి సైన్యం మీద మంటల్ని ఎందుకు రగిలించాడో తెలియక దాన్ని గురించి చెప్పమని అడిగాడు.

వైశంపాయనుడు “జనమేజయా! పూర్వం నీలుడి వంశం వాడైన నిషధుడు అనే రాజు రాజ్యం చేస్తున్న సమయంలో అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపం ధరించి వేదాధ్యయనం చేస్తున్నాడు. ఆ సమయంలో పొరపాటుగా పరపురుషుడి భార్యతో కలిసాడు. రాజభటులు ఆ విషయం తెలుసుకుని అతణ్ని పట్టి బంధించి రాజు సమక్షంలో అతణ్ని శిక్షించబోయారు. వాయుదేవుడి మిత్రుడైన అగ్నిదేవుడు అవమానంతో పొగలు కక్కుతూ కోపంతో భయంకరమైన నిప్పురవ్వలు ఎగురుతూ ఉండగా నిషధుడికి తన నిజ స్వరూపాన్ని చూపించాడు.

అగ్నిహోత్రుడి రూపాన్ని చూసి నిషధరాజు భయపడ్డాడు. “మహాపురుషా! నా అజ్ఞానాన్ని క్షమించు” అని చేతులెత్తి నమస్కరించాడు. అగ్నిహోత్రుడు శాంతించి నువ్వు కోరుకున్న వరం ఇస్తాను అడుగు” అన్నాడు.

నిషధరాజు “ఈ మహిష్మతీ నగరం మీదకి బలమైన శత్రువులు విజృభించి జయంచడానికి వస్తే నీ చేత దగ్ధమై పూర్తిగా నశించేలా వరమియ్యి” అని అడిగాడు. అతడు అడిగిన వరాన్ని ఇచ్చి అందుకు బదులుగా తను అడిగినది కూడా చెయ్యమని అడిగాడు అగ్నిదేవుడు. అదేమిటో చెప్పమన్నాడు నిషధరాజు.

అగ్నిదేవుడు “రాజా! మహిష్మతీపురంలో ఉండే స్త్రీలు తప్పు చేసినప్పుడు వాళ్లని దండించకూడదు” అని అడిగాడు. నిషధరాజు అందుకు అంగీకరించాడు. అప్పటి నుంచీ అగ్నిదేవుడు మహిష్మతీ నగరాన్ని కాపాడుతూనే ఉన్నాడు. సహదేవుడు మాత్రం అగ్నికి భయపడలేదు. శుచిగా స్నానం చేసి ఆచమనం చేసి దర్భల మీద పడుక్కుని అగ్నిదేవుణ్ని వేదంలో చెప్పబడిన అగ్నిసూక్తాలతో స్తుతించాడు.

“అగ్నిహోత్రా! వాయుమిత్రా! నీవల్లనే వేదాలన్నీ లోకాల్ని పవిత్రం చేస్తున్నాయి. పవిత్రాలైన వాటిల్లో పవిత్రుడివి నువ్వు. యజ్ఞాలు కూడా నువ్వే. ధర్మపరుడైన ధర్మరాజు చేసే రాజసూయ యాగం నీకు ఇష్టమే కదా? దానికి విఘ్నం కలిగించడం నీకు న్యాయంగా ఉందా? అని సహదేవుడు ప్రార్థించగానే అగ్నిదేవుడు సహదేవుడి సైన్యానికి అగ్నిభయం లేకుండా చేశాడు.

నిషధమహారాజు దైవసమానుడైన సహదేవుడికి గుర్రాల్ని, మదపుటేనుగుల్ని, విలువైన వస్త్రాల్ని, రత్నాలతో చేసిన అనేక ఆభరణాల్ని ఇచ్చాడు.

సహదేవుడు మహిష్మతీపురాన్ని జయించి నిషధుడితో కప్పం కట్టించుకుని దక్షిణం వైపుకి వెళ్లి సౌరాష్ట్ర దేశంలో ఉండి రుక్మి, భీష్మక, శూర్పారక, దండక రాజులనుంచి దూతద్వారా ధనరాశుల్ని తెప్పించుకున్నాడు.

తరువాత సముద్రద్వీపాల్లో నివసిస్తున్న నిషాద, పురుషాద, ఏకపాద, కాలముఖ కర్ణ స్రావరణులు అనే నరరాక్షస జాతులవాళ్లనీ; రామశైల, కోలశైల, తామ్రద్వీప, సంజయంతీపుర నివాసుల్నీ వశపరుచుకున్నాడు.

తరువాత సహదేవుడు తాళవన, పాండ్య, కేరళ, కాళింగ, ద్రవిడ, యవన, కరహాటక రాజుల్ని ఓడించాడు. దక్షిణ సముద్రతీరంలో విడిదిచేసి విభీషణుడి దగ్గరికి దూతల్ని పంపించి ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడనీ, రాజులందరూ కప్పం కట్టారనీ, అతణ్ని కూడా కట్టమనీ కబురు చేశాడు. వెంటనే విభీషణుడు సహదేవుడు చెప్పినట్టు కప్పం తెచ్చి ఇచ్చాడు.

సహదేవుడు ధర్మరాజు ఆజ్ఞాపించినట్టే దక్షిణ దిశలో ఉండే రాజులతో ధనాలు, రత్నరాశులు, మంచిగంధం చెక్కలు, అగరు కొయ్యలు, మొదలైనవి ఎన్నో కప్పాలుగా తీసుకుని తన దిగ్విజయ యాత్ర పూర్తి చేశాడు.

పశ్చిమదిక్కుని జయించిన నకులుడు:

శత్రువులకి భయం కలిగించే సేనని తీసుకుని నకులుడు పశ్చిమ దిక్కుగా వెళ్లాడు. నకులుడు చతురంగ సైన్యంలో సింహనాదం, మదపుటేనుగుల ఘీంకారం, గొప్ప వేగం కలిగిన గుర్రాల సకిలింతల శబ్దం, రథచక్రాల ధ్వని సముద్రఘోషలా చెవుల్ని బ్రద్దలు చేస్తూ దిక్కులు మారుమోగేట్టు వ్యాపించింది.

మహాసేనుడు రక్షిస్తున్న మహితక దేశంలో దత్తకుడు, మయూరకుడు మొదలైన శూద్రులతో యుద్ధం చేసి మరు, మాళవ, బర్బర, కర్బర, శరీషక, దాశార్ణ దేశాల్ని జయించాడు. పుష్కరారణ్యంలో నివసించే యాదవుల్ని; సరస్వతీ సింధు తీరాల్లో ఉండే గ్రామీణుల్నీ పంచనద, అమర పర్వతాల్లో ఉండేవాళ్లనీ వశపరుచుకుని శ్రీకృష్ణుడికి తన రాకని తెలియపరిచాడు.

నకులుడు శాకలపురంలో ఉన్న తన మేనమామ మద్రరాజు శల్యుణ్ని కలుసుకుని అనేక వస్తువులు వాహనాలు తీసుకున్నాడు. పశ్చిమ సముద్రగర్భంలో నివసించే పరమ దుర్మార్గులైన బర్బర, కిరాత వీరుల్ని ఓడించాడు. పశ్చిమ దేశంలో రాజులందరి దగ్గరనుంచి బలవంతంగా తీసుకున్న ధనాన్ని పదివేల ఒంటెలతో మోయించుకుని తిరిగి వచ్చాడు.

ఆ విధంగా భీమార్జున నకులసహదేవులు నలుగురు గొప్ప పరాక్రమంతో నాలుగు దిక్కుల్ని జయించి భూమిమీద గల రాజులందరితో స్వచ్ఛమైన రత్నాలు, ధనము, వస్తువులు, వాహనాలు తీసుకుని వచ్చి ధర్మరాజుకి ఇచ్చారు.

కురువంశంలో గొప్పవాడైన ధర్మరాజు అన్ని విధాలైన సంపదలతో వరుణుడు, కుబేరులకంటే ఎక్కువ ధనవంతుడయ్యాడు. రాజసూయ యాగం గురించి ఆలోచిన్తున్న ధర్మరాజుతో అతడికి ఆప్తులైన మంత్రులు “ధర్మరాజా! నీ ధర్మ పరిపాలన వల్ల, సుగుణ సంపదవల్ల, కళంకం లేని ప్రవర్తనవల్ల ప్రజలందరికీ మేలు కలిగింది. రాజుని మోసం చేసేవాళ్లు, దొంగలు తగ్గిపోయారు. రోగం, పగ, భయం, దు:ఖం మొదలైన కష్టాలు పోయాయి.

పరాక్రమంతో నీ తమ్ముళ్లు రాజులందర్నీ జయించడం వల్ల రాజులందరూ నీ అధీనంలో ఉన్నారు. కనుక, నువ్వు రాజసూయ యాగం చెయ్యడానికి ఇదే మంచి సమయం.

మహారాజా! విలువైన రత్నాలు, వెండి, బంగారంతో ధనాగారం పూర్తిగా నిండుగా ఉంది. వస్తువుల్ని నిలువ ఉంచే గృహం నెయ్యి, ఉప్పు, నూనె, బియ్యం పప్పులు మొదలైన వస్తువులతో నిండి కోరికల్ని తీర్చే కల్పవృక్షంలా ఉంది. గొప్పయాజ్ఞికులైన బ్రాహమణోత్తములు అందరూ నీ అభివృద్ధిని కోరుతున్నారు. ఆలస్యం చెయ్యకుండా రాజసూయయాగం ప్రారంభించు” అన్నారు.

Exit mobile version