[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
ద్వైతవనానికి చేరిన పాండవులు
శ్రీకృష్ణుడు ధర్మరాజుకి సాల్వుడి కథ చెప్పి పాండవుల దగ్గర సెలవు తీసుకుని మేనల్లుడు అభిమన్యుణ్ని, చెల్లెలు సుభద్రని తన బంగారు రథం మీద కూర్చోబెట్టుకుని ద్వారకకి వెళ్లిపోయాడు. దృష్టద్యుమ్నుడు తన మేనల్లుళ్లు ద్రౌపది కొడుకులైన ప్రతివింధ్యుడు మొదలైనవాళ్లతో కలిసి ద్రుపదనగరానికి వెళ్లిపోయాడు. ఇంద్రసేనుడు మొదలైన ముఖ్యభటులు ఇరవైమందితోను, వేలకొలది బ్రాహ్మణులతోను పాండవులు ద్వైతవనానికి వెళ్లారు.
ఆ వనాన్ని చూసి ధర్మరాజు తమ్ముళ్లతో “ఇది చాలా భయంకరమైన అడవి. ఇందులో సింహాలు, శరభాలు, పాములు, పెద్దపులులు, మదించిన ఏనుగులు ఉన్నాయి. శత్రువులు మాయలు పన్నవచ్చు. ఈ అడవిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి” అన్నాడు.
అన్నగారి మాటలు విని అర్జునుడు “రాజా! బ్రహ్మజ్ఞానులు, తపోవృద్ధులు అయిన బ్రాహ్మణులు; అన్ని లోకాల్లోను యధేచ్ఛగా తిరగగల మహాత్ములు నారదుడు, వ్యాసుడు వంటి మహర్షులు నీతో ప్రతిరోజూ పూజింపబడుతూ నీ క్షేమాన్ని కొరుతున్నారు. నీ పరాక్రమం అందరినీ కాపాడుతుంది.
అందమైనది, నివసించడానికి వీలయినది ఆయిన ఈ అడవిలో మహర్షులు ఎంతోమంది నివసిస్తున్నారు. మనం కూడా ఇక్కడే ఉందాము” అన్నాడు. అందరూ అంగీకరించారు. అయిదుగురు వేరువేరుగా చెట్ల మొదళ్లలో నివసించడానికి వీలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. తమతో వచ్చినవాళ్లందరికీ అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ద్వైతవనంలో సంతోషంగా కాలం గడుపుతున్నారు.
ధర్మవేత్త, గొప్ప తపస్వి మార్కండేయ మహర్షి ఒకరోజు తన శిష్యులతో కలిసి వచ్చాడు. ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి మార్కండేయ మహర్షిని పూజించాడు. మహర్షి అడవిలో అష్టకష్టాలు పడుతున్న పాండవుల్ని ద్రౌపదిని చూసి “ఆనాడు తండ్రి ఆజ్ఞప్రకారం రాజ్యాన్ని వదిలి సీతతో తమ్ముడితో వనవాసం చేసిన శ్రీరాముణ్ని నేను చూశాను. ఈనాడు బ్రాహ్మణవంశాల్ని పోషిస్తూ, సత్యధర్మాల్ని పాలిస్తూ, గొప్ప కీర్తితో ఓర్పుతో ప్రకాశిస్తున్న ధర్మరాజుని చూస్తున్నాను.
ప్రాచీన రాజర్షులు సగర, భరత, నల, యయాతి, వైన్య, నాభాగ మొదలైనవాళ్లు ఇలాగే సత్యధర్మాలు పాటించి ఉత్తమలోకాలు పొందారు. మీరు నిత్యసత్యవ్రతులు ధర్మాత్ములు. మీకు అభీష్టసిద్ధి కలుగుతుంది” అని ఆశీర్వదించి వెళ్లిపోయాడు.
సాయంకాలం సంధ్యావందనం చేస్తున్న ధర్మరాజుని, సాయంసమయ హోమాల్ని వేల్చుతూ అగ్నిహోత్రాల్ని ప్రజ్వలింపచేస్తున్న వేలకొలదీ బ్రాహ్మణుల్ని చూసి బకదాల్ఫ్య మహర్షి “సద్గుణసంపన్నుడవైన ధర్మరాజా! మీకు అరణ్యవాసం వల్ల మేలు కలుగుతుంది. పవిత్రచరిత్ర కలిగి నాలుగు వేదాలు తెలిసిన బ్రాహ్మణోత్తములు పుత్రవాత్సల్యంతో ఎల్లప్పుడు మీ యోగక్షేమాలు చూస్తూ శుభాలు కలుగచేస్తున్నారు.
బ్రాహ్మణుల దయవల్ల పూర్వం వరోచనుడు మొదలైన రాజులు అపారమైన వైభవంతో భూమండలాన్ని ఏలగలిగారు. అగ్నికి వాయువు తోడైనట్టు రాజుకి బ్రాహ్మణుల సాయం తోడైతే శత్రువుల్ని జయించగలడు. బ్రాహ్మణహీనుడు, ధర్మహీనుడు అయిన రాజు ప్రజల అభిమానాన్ని పొందలేడు. ప్రజల అభిమానం లేకపోతే రాజ్యం సుస్థిరంగా ఉండదు. మీరు బ్రాహ్మణ ప్రియులు, ధర్మనిరతులు. మీకు అభ్యుదయం కలుగుగాక!” అని ఆశీర్వదించి వెళ్లిపోయాడు.
ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము
పాండవులు అరణ్యవాసంలో తమ కష్టాలు మర్చిపోయేలా కథలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజుతో “తన కొడుకు దుర్యోధనుడి మాట విని ముసలిరాజు ధృతరాష్ట్రుడు మిమ్మల్ని రాజ్యం నుంచి వెళ్లగొట్టి రాజ్యవైభోగాలకి దూరం చేశాడు. ఇప్పటికైన ప్రశాంతంగా ఉన్నాడా? ధృతరాష్ట్రుడి మనస్సు ఇనుములాంటిది. బండరాయివంటిది. ధర్మనిధులైన మిమ్మల్ని తన కొడుకులు పరుషంగా మాట్లాడుతున్నప్పుడు అతడు వారించలేదు.
నిర్మలమైన మేడలమీద విహరిస్తూ; ఉచితాసనాలమీద, పరుపులమీద ఉంటూ; చందనం అగరువంటి సుగంధద్రవ్యాలు మైపూతలుగా వాడుతూ; వినయవంతులైన రాజులతో సేవించబడుతూ ఉండే మీరు ఈ అడవిలో దర్భలమీద నిద్రపోవడం, దుమ్ము ధూళి పడిన శరీరంతో తిరగడం, అడవి జంతువుల్ని వేటాడి జీవించడం చూస్తూ నేను ఎలా ఓర్చుకోగలను? అన్ని సౌఖ్యాలు అమర్చి ఇచ్చిన బ్రహ్మదేవుడు కూడా శత్రువై అన్నీ తీసేసుకున్నాడేమో..
ధర్మరాజా! నీ ఆజ్ఞ అనే గొలుసులతో బంధించబడి, పౌరుషం పోగొట్టుకున్న నీ తమ్ముళ్లు కట్టివేయబడిన సింహ కిశోరాల్లా కష్టాల పాలయ్యారు. ఆనాడు ఇతర రాజులు పద్మరాగమణులు ధరించిన కిరీటాలతో తలలు వంచి నీ పాదాలకు మొక్కినప్పుడు నీ పాదాలు ఎరుపెక్కాయి. ఈనాడు ఈ కొండలమధ్య తిరగడం వల్ల కఠినమైన ధాతుశిలల్లో ఉండే ఎర్రరంగువల్ల నీ సుకుమారమైన పాదాలు ఎరుపెక్కాయి. ఎప్పుడూ సౌఖ్యాలు అనుభవించే నీకు భయంకరమైన అడవిలో నివసించడం వల్ల కష్టాలు కలిగాయి.
ఇదివరకు నువ్వు ప్రతిరోజు పదివేలమంది బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులకి బంగారు కంచాల్లో విందుభోజనం పెట్టేవాడివి. ఆ తర్వాత వాళ్ల భుక్తిశేషం తినేవాడివి. ఇప్పుడు అడవి దుంపలు, వేళ్లు, పండ్లు నీకు అహారమయింది. నీకు ఇటువంటి దశపట్టించిన శత్రువుల మీద కోపం లేకుండ ఉండడం మంచిదికాదు.
పదివేల ఏనుగుల బలం కలిగిన భీముడు కారడవిలో కాయలు, కూరలు తిని చిక్కిపోయి ఉన్నాడు. పొడవైన రెండు చేతులు కలిగినవాడైనా వెయ్యి చేతులు కలిగిన కార్తవీర్యార్జునుడి కంటె బలవంతుడై ఒకేసారి, ఒకేవేగంతో అయిదు బాణాల్ని ఒకే బాణంలా వేయగల నేర్పు ఉన్న అర్జునుడు అడవి జంతువుల మధ్య తిరుగుతున్నాడు. సౌఖ్యాలు అనుభవించవలసిన నకులసహదేవులు దీనస్థితిలో తిరుగుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఓర్పు వహిస్తూ ఊరుకోవడం న్యాయమా?
క్షమ గొప్పదా? తేజస్సు గొప్పదా? క్షమ, తేజస్సు ఆయా సమయాల్లో అవసరాల్నిబట్టి ఉపయోగించడం తెలియని రాజు ప్రజల అభిమానాన్ని పోగొట్టుకుంటాడని ఇతిహాసంలో చెప్పబడింది. పూర్వం బలిచక్రవర్తి తాత ప్రహ్లాదుణ్ని అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. ‘ప్రభువైనవాడికి అన్ని సమయాల్లోను ఓర్పు వహించడం తప్పు. అలాగే ఎప్పుడూ ప్రతాపం చూపించడం కూడా తప్పే.
ఎందుకంటే ఎప్పుడూ ఓర్పు చూపించేవాడిని చూసి సేవకులు భయపడరు. అవమానిస్తారు కూడా. ధనరక్షణ కోసం నియమించబడిన అధికారులు ధనాన్ని దొంగిలిస్తారు, గర్వాన్ని ప్రదర్శిస్తారు. ఎప్పుడూ తేజస్సునే ప్రదర్శించేవాడు ఎక్కువగా కఠిన శిక్షలు విధిస్తూ ప్రజలకి అమితమైన వేదన కలిగిస్తాడు. ఇంట్లో పాము తిరుగుతున్నట్లు ఎల్లప్పుడూ ఆరాటం కలిగిస్తాడు. కనుక సమయాన్ని బట్టి క్షమ, ప్రతాపం ప్రదర్శించినవాడే ఐహికాముష్మికస్థితిని పొందగలడు’ అని మనుమడు బలిచక్రవర్తికి ప్రహ్లాదుడు చెప్పాడు.
మొదట ఏదో ఒక తప్పు చేస్తే ఆ తప్పు చిన్న తప్పే అయితే క్షమించవచ్చు. కాని, ఎదిరించి వరుసగా అనేక సార్లు ఎక్కువ తప్పులు చేస్తున్న పాపులైన కౌరవుల్ని క్షమించడమెందుకు? ఇది ప్రతాపం ప్రదర్శించడానికి తగిన సమయం. దుర్మార్గులైన కౌరవుల్ని మీ తమ్ముళ్లు భయంకరంగా చంపగలరు.” అని చెప్పింది.
ద్రౌపది మాటలకి ధర్మరాజు “ద్రౌపదీ! కోపం చాలా పాపం. పురుషార్థాలైన ధర్మానికి, అర్ధానికి, కామానికి కీడు కలిగిస్తుంది. కోపం కలవాడు తన కర్తవ్యాన్ని గుర్తించలేడు. గురువుని కూడా నిందిస్తాడు. చంపకూడని వాళ్లని చంపేస్తాడు. ఆత్మహత్యకి పాల్పడతాడు. ధర్మంతో నడుచుకునే నా వంటి వాళ్లకి కోపగించడం తగదు కదా! వివేకం కలవాడు తన జ్ఞానంతో అగ్నివంటి కోపాన్ని చల్లర్చుతాడు.
ఓర్పు కలవాడికి అన్ని సమయాల్లోను విజయమే సిద్ధిస్తుంది. కోపం, దయ, పరాక్రమం, వేగం అనే నాలుగు గుణాలు తేజస్సు నుంచి పుట్టాయని, ఓర్పు కలిగినవాళ్లకి అవే బలమని కశ్యపగీతలో చెప్పబడింది. వేదాలు, యజ్ఞాలు, శౌచం, సత్యం, ధర్మం, విద్య సమస్త చరాచర జగత్తు క్షమ మీదే ఆధారపడి ఉన్నాయి.
బ్రహ్మజ్ఞానులూ; తపస్సు, వేదాధ్యయనం చేసిన యజ్ఞకర్తలూ పొందే పుణ్యలోకాలు క్షమాగుణం కలిగినవాళ్లే పొందగలరు. వ్యాసుడు, విదురుడు, భీష్ముడు, కృపుడు, ద్రోణుడు, సంజయుడు మొదలైన ధర్మాత్ములు నా క్షమాగుణాన్నే పొగుడుతారు. దుర్యోధనుడికి క్షమాగుణం లేకపోవడం వల్లే ధార్తరాష్ట్రులకి వినాశనం కలుగుతుంది” అని చెప్పాడు.
అంతా విని ద్రౌపది “శత్రువులు లేని ధర్మరాజా! నిర్మలమైన బుద్ధితో క్షమాగుణం మీదే మనస్సుని లగ్నం చేసి నువ్వు ధర్మంతో నడుచుకుంటున్నావు. అటువంటి దయాపరుడవైన నిన్ను ఆ ధర్మమే కాపాడుతుందనే నమ్మకంతో శత్రువులమీద కూడా అదే మనస్తత్వాన్ని కలిగి ఉండడం సరైన పనేనా?
అధర్మంతో ప్రవర్తిస్తున్న కౌరవుల్ని నీ ధర్మం ఏం చేస్తుంది? మోసం చేసేవాళ్లని మోసంతోనే చంపాలని పెద్దల మాట” అని ధర్మరాజుతో చెప్తూ తనలో తను ‘అయ్యో బ్రహ్మదేవుడా ధర్మమార్గంలో నడిచేవాళ్లని వదిలి, ధర్మమార్గంలో నడవని వాళ్లకి మంచి జరిగేలా చేస్తున్నావు. అధర్మపరులే నీకు నచ్చుతారా? ధర్మమార్గంలో నడిచేవాళ్లు నీకు నచ్చరా’ అనుకుంది.
ధర్మరాజు ద్రౌపదితో “నాస్తికులు మాట్లాడినట్టు ధర్మప్రవర్తనవల్ల మంచి జరగదని సందేహం నీకెందుకు? ధర్మాత్ములైన మైత్రేయ, మార్కండేయ, వ్యాస, వసిస్ఠ, నారద వంటి గొప్పవాళ్లు నన్ను ధర్మపరుడని గౌరవిస్తున్నారు కదా! అటువంటి యోగీశ్వరుల్ని మనం మన కళ్లముందే చూస్తున్నాం. మంచి నడవడికే ప్రత్యక్ష ధర్మం. నా పట్ల అన్యాయంగా ప్రవర్తించే ఇతరుల కోసం నేనెందుకు ధర్మాన్ని తప్పాలి?
వివేకంతో ఆలోచిస్తే ధర్మమే స్వర్గారోహణకి మెట్టు. తప్పస్సు, వేదపారాయణం, బ్రహ్మచర్యం, దానం, ధర్మం, యజ్ఞం అనే పుణ్యకార్యాలు ఫలితం కలిగించేవి కాకపోతే వీటిని అంతమంది ఋషులు ఎందుకు ఆచరిస్తున్నారు. నువ్వు, దృష్టద్యుమ్నుడు పుట్టిన విధానం పుణ్యకర్మఫలం ఉంది అనడానికి నిదర్శనమేగా?
పుణ్యకర్మలకి ఫలితాలు ఎలా ఉన్నాయో అలాగే పాపకర్మలకి కూడా ఫలితాలు ఉన్నాయి. పూర్వం బ్రహ్మదేవుడు తన కుమారులకి కర్మఫలం గురించి చెప్పాడు. వాళ్లల్లో కశ్యపుడు ధర్మం గురించి బోధించి పుణ్యఫలాన్ని పొందాడు.
బ్రహ్మ నిర్ణయం ప్రకారమే పుణ్యపాప ఫలాలు కలుగుతాయి. బ్రహ్మదేవుడి దయవల్లే మనుషులు పుణ్యకార్యాలు చేసి పునర్జన్మ లేకుండా దివ్యత్వాన్ని పొందుతారు” అని చెప్పాడు.
ద్రౌపది “చేసిన పనులకి కర్మఫలం అనుభవించాలి అని తెలియనంత వివేకం లేనిదాన్ని కాదు నేను. దురదృష్టం వల్ల పడుతున్న కష్టాలకి మనస్సు బాధపడి ఇలా మాట్లాడాను. ధర్మరాజా! నేను ధర్మం గురించి ఏమీ తెలియనిదాన్ని కాదు. శాస్త్రాలు, అందులో చెప్పబడిన విధులు, నిషేధాలు, ప్రమాణాలు కావు అని చెప్పే చెడ్డవాళ్లకి పుణ్యగతులు లేవు అని తెలియనిదాన్ని కాదు.
పూర్వం గొప్ప పండితులు నా తండ్రితో మాట్లాడుతున్నప్పుడు విన్నాను. మనుషులకి కర్మచెయ్యడమే కర్తవ్యం. ఏ పనీ లేకుండా జీవించలేరు. పొందే ఫలితం తక్కువే అయినా పనులు చేస్తున్నవాళ్లు మన కళ్ల ముందు కనబడుతూనే ఉన్నారు. విధి, మానవప్రయత్నమూ కూడా కర్మల వలన కలిగే ఫలితాలకి కారణాలు.
మనిషి మొదట తను చేస్తున్న పనిగురించి, అందువల్ల కలిగే ఫలితాన్ని గురించి ఆలోచించి తరువాత దీక్షతో ఆ పనికి పూనుకోవాలి. అటువంటి వాళ్లకి దేవుడు సాయపడి అనుకున్న పని పూర్తయ్యేలా చేస్తాడు.
తన ప్రయత్నం లేకుండా దేవుణ్నే నమ్ముకున్నవాడు చేసే పని సిద్ధించదు. మానవప్రయత్నంతో చేసే పనులు సుస్థిరంగా సురక్షితంగా ఉంటాయి. జాగ్రత్త పడకుండా దైవాన్నే నమ్ముకున్నవాడు నీటిలో నడిచే పడవలా మునిగి పోతాడు. కనుక లక్ష్యాన్ని నిశ్చయించుకుని, అది సిద్ధించడానికి ఉత్సాహంతో నీ సోదరుల పరాక్రమంతో శత్రువుల్ని జయించు. మన దారిద్ర్యాన్ని పోగొట్టు” అంది.
భీముడు ధర్మరాజుల సంవాదము
ద్రౌపది చెప్పిన మాటలని విని భీముడు “ధర్మరాజా! ఇది తండ్రి తాతలిచ్చిన రాజ్యము. దీన్ని శత్రువులు ఎవరూ జయించలేరు. అర్జునుడు దీన్ని రక్షించాడు. దేవేంద్రుడు కూడా ఈ రాజ్యాన్ని తీసుకోలేడు. దీన్ని ఇతరులకి అప్పగించి ధర్మాన్ని ఆచరించాలని భయంకరమైన అడవిలో వ్రతాలు చేస్తూ ఉండడం నీకు బాగుందా?
మాంసాన్ని సింహాల దగ్గరి నుంచి నక్క లాక్కున్నట్టు ఈ భూమండల రాజ్యసంపదని అపహరించి దుర్యోధనుడు స్నేహితులతో కలిసి ఏం చెయ్యాలని అనుకుంటున్నాడో. చెడ్డవాళ్లని ధర్మప్రవర్తనతో జయించడం జరిగేపని కాదు. ధార్తరాష్ట్రుల అహంకారాన్ని బలపరాక్రమాలతోనే జయించాలి. పురుషార్థాలు నాలుగింటిలో ధర్మకామాలకి అర్థమే ఆధారం. అదే అన్ని ప్రయోజనాల్ని సమకూరుస్తుంది.
అటువంటి అర్థాన్ని వదిలిపెట్టి మిత్రులు బాధపడేట్లు, శత్రువులు ఆనందపడేట్లు మునిలా ప్రవర్తిస్తూ ధర్మం, ధర్మం అంటూ ధర్మం పైనే మనస్సు లగ్నం చేసి బలహీనుడిలా బాధపడడమెందుకు? కౌరవవంశానికి ఇంద్రుడివంటివాడివి. పరాక్రమంతో ఓడించి సంపదల్ని పొందలేనివాడు నిరాశపడాలిగాని, నీ వంటివాడు నిరాశ పడకూడదు.
నీ అనుమతి తీసుకుని ఆనాడే శత్రువులందరినీ యుద్ధంలో చంపి ఉంటే, ఇప్పుడు మనం భయంకరమైన దుష్టజంతువుల మధ్య ఉండకుండా ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. చేసుకున్న ఒప్పందాన్ని అతిక్రమించడం అధర్మం అనే భయంతో యుద్ధంలో ఉండే ఉత్సాహాన్ని వదిలిపెట్టి మందబుద్ధితో ఉంటే, కౌరవులు మనల్ని పరాక్రమం లేనివాళ్లని అనుకుంటారు.
చచ్చిపోయినవాడిని సుఖదుఃఖాలు విడిచిపెట్టినట్టే, ధర్మాన్నే నమ్ముకున్నవాడిని అర్థకామాలు రెండూ విడిచి పెడతాయి. అప్పుడు ధర్మపరుడు మృతప్రాయుడవుతాడు. ధర్మార్థకామాల్ని సమానంగా సాధించేవాడే గొప్పవాడు.
ధనంలేనివాడు దానాలు, యజ్ఞాలు, ఉత్తముల్ని పూజించడం చేయలేడు. లోకాలు ధర్మానికి నిలయాలు. ధర్మాన్ని మించింది ఏదీ లేదు. అయినా ధనసాధనకి ఉపయోగించని ధర్మం క్షత్రియులకి తగినది కాదు.
యుద్ధాల్లో శత్రువుల్ని జయించడం ప్రజలకి భయం లేకుండా రాజ్యాన్ని పాలించడం, ప్రేమతో అర్హత కలవాళ్లకి దానం చెయ్యడం, బ్రాహ్మణుల్ని పూజించడం ఉత్తమ క్షత్రియుల ధర్మాలు. ఇవన్నీ పుణ్యలోకాలు చేరడానికి కారణాలు.
కేవలం ధర్మాన్ని పాటించడం వల్ల మాత్రమే శత్రువుల్ని జయించడం వీలుకాదు. నువ్వు శత్రువులతో చేసుకున్న ఒడంబడిక అనే నియమాన్ని వదిలిపెట్టి వాళ్లని జయించడానికి ప్రయత్నించు. గొప్ప కీర్తి కలిగిన సృంజయ, కేకయ, యదు, పాంచాల మొదలైన మిత్రులు ప్రేమతో సహాయం చేస్తారు.
ఎక్కువమంది బలహీనులు ఒక్కటిగా చేరితే తెనేపట్టులోంచి తేనే తీసుకోవాలని ప్రయత్నించే మనిషిని తేనెటీగలు కుట్టి కుట్టి చంపినట్టు బలవంతుణ్ని జయిస్తారు.
దుర్యోధనుడు పాలిస్తున్న రాజ్యంలో పల్లెటూళ్లల్లోను, పట్టణాల్లోను నివచించే ప్రజలు, బ్రాహ్మణోత్తములు నీ పాలనలో జీవించాలని కోరుకుంటున్నారు. ఇంక ఆలస్యమెందుకు? అన్ని ఆయుధాలు ఉన్న రథాన్ని ఎక్కి హస్తినాపురం వైపు విజయయాత్ర చెయ్యి.
క్షత్రియులతో గొప్పగా చెప్పుకోబడేది పరాక్రమం. వెంటనే గర్వంగా బయలుదేరి అర్జునుడి గాండీవం నుంచి బయటకి వచ్చే బాణాలతో ధృతరాష్ట్రుడి కొడుకుల్ని అరటితోటలో చెట్లని నరికినట్టు నరికెయ్యి.
నీ శత్రువులు అనేక రథాలతోను, సైనికులతోను, ఏనుగులతోను వస్తారని ఆలోచించకు. నా గద దెబ్బలకి వాళ్లు నిలవలేరు. ప్రజలకి చక్కటి పరిపాలన అందించడం కంటే గొప్ప ధర్మం మరొకటి ఉందా? రాజ్య సంపాదన చేసిన క్షత్రియుడు గొప్ప దక్షిణలిచ్చి యజ్ఞాలు చేసి బ్రాహ్మణులకి అగ్రహారాలు, వేలకొద్దీ ఆవులు దానంగా ఇచ్చి పాపాలన్నీ పోగొట్టుకుని మబ్బుచాటున వెలిగే చంద్రుడిలా ప్రకాశిస్తాడు” అని చెప్పాడు.
భీముడి మాటలు విని ధర్మరాజు “నీ మాటలు ధర్మపరంగాను, నీతిపరంగాను ఉన్నాయి. చాలా ఆలోచించిన తరువాత చెప్పావు. నువ్వు చెప్పినవన్నీ ఎంతో ఆలోచించాక తేల్చాల్సినవి. అరణ్యంలో పన్నెండేళ్లు, ఊరిలో అజ్ఞాతంగా ఒక సంవత్సరం గడుపుతామని పెద్దలున్న సభలో ప్రతిజ్ఞ చేసాను. ఆ ప్రతిజ్ఞ పాటించాలి.
నేను సత్యవ్రతాన్ని ఎప్పుడూ వదలలేను. చేసిన ప్రతిజ్ఞ విడిచిపెట్టను. మంచి సమయం కోసం వేచి చూడాలి. రాజ్యం, సంతానం, కీర్తి సత్యంతో సమానం కావు” అన్నాడు.
భీముడు ధర్మరాజుతో “శాశ్వతమని చెప్పలేని జీవితం శాశ్వతమనుకుని చెయ్యవలసిన పనులు ఆలస్యంగా చెయ్యడం మంచిదా? పుట్టినవాళ్లు చావక మానరు. మరణానికి ముందే విరోధం తీర్చుకోలేని మనిషి జన్మ వ్యర్థం. అంతమంది రాజుల ముందు మనం శత్రువుల చేత పడిన అవమానానికి ప్రతికారం చేసేవరకు నా మనసు రాత్రి, పగలు వేదనపడుతూనే ఉంటుంది.
నాకంటే ఎక్కువగా బాధపడేవాళ్లు అర్జునుడు, నకులసహదేవులు. వాళ్ల దుఃఖాన్ని పోగొట్టకుండా శత్రువులు ఆనందపడేటట్టు ధర్మాన్ని దయని పాటిస్తూ భయంకరమైన అడవిలో ఉండడం నీకు తగినట్టుగా ఉందా? నువ్వు ఆచరిస్తున్న ధర్మం బ్రాహ్మణులు ఆచరించేదిగా ఉందిగాని క్షత్రియులు ఆచరించే ధర్మంగా లేదు.
మనువు ధర్మశాస్త్రంలో రాసిన రాజధర్మాలు నీకు తెలియనివా? శత్రువుల్ని నాశనం చెయ్యకపోతే కీడు కలుగుతుంది. మనం అడవిలో ఎలాగో పన్నెండేళ్లు గడిపినా ఊరిలో ఎవరికీ తెలియకుండా ఒక్క రోజు కూడా గడపలేము. ధర్మరాజా! చిన్న పిల్లలనుంచి వృద్ధులవరకు కీర్తికెక్కిన రాజుల్లో నువ్వు సూర్యుడివంటి వాడివి. సింహాలవంటి నీ తమ్ముళ్లని తెలియనివాళ్లు లేరు.
మనం రహస్యంగా ఉండడమంటే మేరు పర్వతం కనపడకుండా దాగి ఉండడం వంటిదే. అరణ్యవాసం ఎలాగో గడిపి అజ్ఞతవాసం గడపలేకపోతే మన కష్టాలు ఎప్పటికీ తీరవు. ఒక సంవత్సరానికి బదులుగ ఒక నెల అనుకుంటే ఈ అడవిలో పదమూడు నెలలు గడిపాము. కాబట్టి పదమూడు సంవత్సరాలుగా లెక్కపెట్టడం కూడ ధర్మబద్ధమే. ఇది విజయాన్ని సాధించడానికి ఒక సాధనం” అన్నాడు భీముడు.
భీముడి వాదన వింటున్న ధర్మరాజు నిట్టూరుస్తూనే ఉన్నాడు. వాడిన ముఖంతో “గొప్పవాడవైన భీమసేనా! నీకు పాండిత్యం, పరాక్రమం, దర్పం, ప్రతిభ అన్నీ ఉన్నాయి. నువ్వు చెప్పినవన్నీ చెయ్యతగ్గవే. అయినా నే చెప్పింది కొంచెం నిదానంగా ఆలోచించు. మనం చేస్తున్నది చాలా గొప్ప కార్యం. తొందరపడకుండా అడుగు ముందుకు వేసేప్పుడు ఆలోచించాలి. బాగా ఆలోచించి జాగ్రత్తగా చేసే పనులకే దైవ సహకారం ఉంటుంది.
ధృతరాష్ట్రుడి కుమారులు అందరూ వీరులు. మనం వాళ్లని చులకనగా చూడకూడదు. ఎప్పుడూ మనల్ని చంపడానికి సిద్ధంగానే ఉంటారు. అంతేకాదు, కర్ణుణ్ని, భూరిశ్రవుణ్ని, శల్యుణ్ని జయించడం కష్టం. వాళ్లు దుర్యోధనుడికి స్నేహితులు.
ఇంతకు ముందు రాజసూయయాగం సమయంలో మన చేతిలో ఓడిపోయిన రాజులందరు దుర్యోధనుడి ప్రక్కన చేరిపోయి యుద్ధంలో మనల్ని ఓడించాలని ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నారు. వాళ్లందరూ అస్త్రశస్త్రవిద్యల్లో ఆరితేరినవాళ్లు. కర్ణుడు చాలా అహంకారి. ఛేదించడానికి శక్యం కాని కవచం కలిగినవాడు. అతడు విలువిద్య, పరాక్రమం తలుచుకుంటే నాకు నిద్రపట్టదు.
భీష్మ, ద్రోణ, కృపాచార్యులకి కౌరవులు, పాండవులు సమానులే! అయినా కౌరవుల దగ్గరే ఉండడం వల్ల వాళ్ల పక్షాన్నే యుద్ధం చేస్తారు. వాళ్లు దివ్యాస్త్రాలు ప్రయోగించడంలో అపారమైన పాండిత్యం ఉన్నవాళ్లు. వాళ్లని జయిస్తేనే కదా మనం దుర్యోధనుణ్ని గెలవడం. ఇన్ని విషయాలు మనం ఆలోచించాలి” అని చెప్పాడు.