Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-92: అర్థావసుడికి దేవతల వరాలు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

దేవతలు “అర్థావసు మహర్షీ! నీ తమ్ముడు చేసిన పాపాలు పోగొట్టడానికి పూనుకున్న ధర్మాత్ముడివి. నువ్వు చేసిన వ్రతాలు గొప్పవి. నీకు ఏ వరాలు కావాలో అడుగు ఇస్తాము” అన్నారు.

దేవతల మాటలు విని అర్థావసుడు “నా తండ్రిని, భరద్వాజమహర్షిని, యవక్రీతుణ్ని బతికించండి. పరావసుకి బ్రహ్మహత్యాపాతకం నుంచి తప్పించండి” అని కోరుకున్నాడు.

అర్థావసుడు రైభ్యమహర్షిని, భరద్వాజమహర్షిని, యవక్రీతుణ్ని బతికించాడు.

యవక్రీతుడు దేవతలతో “మహానుభావులారా! నేను అన్ని శాస్త్రాలు, వేదాలు తెలిసివాణ్ని, వ్రతాలన్నీ దీక్షతో చేసినవాడిని, నాకంటే ఎక్కువ శక్తి  రైభ్యమహర్షికి ఎందుకు వచ్చింది? అతడు నన్ను ఎలా చంపగలిగాడు?” అని అడిగాడు.

దేవతలు “గురువుగారికి పరిచర్య చేస్తూ కష్టనష్టాలకోర్చి నేర్చుకున్న విద్యలు రాణిస్తాయి. నువ్వు గురువుద్వారా విద్యలు పొందలేదు. రైభ్యుడు గురువుద్వారా జ్ఞానం పొందాడు కనుక అతడికి ఇటువంటి శక్తి లభించింది” అని చెప్పి దేవతలు వెళ్లిపోయారు. ఇది యవక్రీతుడు నివసించిన చోటు. ఇక్కడ నివసించినవాళ్లకి పాపాలు నశిస్తాయి.

ఇది కాలపర్వతము. ఇది ఏడు పాయల గంగానది. ఇది మనుష్యులకి కనిపించదు. ఇక్కడే ఉండి నిర్మలమైన మనస్సుతో సమాధియోగంలో ఉండి దర్శించండి. ఇది మందరగిరి. ఇక్కడ అనేక ఆయుధాలు ధరించి ఎనభైఎనిమిది వేలమంది గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు, దేవతలు దేవేంద్రుణ్ని కొలిచి వెడతారు.

ఇక్కడికి ఆరువందల ఆమడల దూరంలో కైలాసపర్వతం ఉంది. అక్కడ కుబేరుడు ఉంటాడు” అని వివరించాడు రోమశమహర్షి.

పాండవులు సమాధియోగంలో ఆ యా పుణ్యక్షేత్రాల్ని దర్శించారు. తరువాత ధర్మరాజు భీముడితో “ఈ మార్గం నడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. పెద్ద రథాల్ని, ఇంద్రసేనుడు మొదలైన ముఖ్యమైన భటుల్ని, ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణుల్ని, ద్రౌపదినీ వెంటబెట్టుకుని నువ్వూ, సహదేవుడూ వెనక్కి వెళ్లండి.

నేనూ, నకులుడూ రోమశమహర్షి చెప్పినట్టు అన్ని తీర్థాల్లోను స్నానం చేసి వస్తాము. మేము తిరిగి వచ్చేవరకు ద్రౌపదిని జాగ్రత్తగా చూసుకోండి” అని చెప్పాడు.

ధర్మరాజు మాటలు విని భీముడు “రాక్షసులతో నిండిన ఈ అడవిలో నిన్ను ఒక్క నిముషమైన వదిలి ఉండగలనా? పరమ పవిత్రుడైన అర్జునుణ్ని ఒక్కడిని వదిలిపెట్టి ఇంత బాధ పడుతున్నాము. నేను, సహదేవుడు, ద్రౌపది ఇప్పుడు మిమ్మల్ని కూడా వదిలిపెడితే భరించలేని బాధ, దుఃఖం మాకు కలుగుతాయి.

నువ్వూ మేము వేరుపడడం భావ్యం కాదు. చాలా అలిసిపోయి నడవలేనప్పుడు ద్రౌపదిని, నకులసహదేవుల్ని నా వీపు మీద కూర్చోబెట్టుకుని మిట్టపల్లాలతో ఉండే కొండలు, అడవులు దాటేవరకు మోసి తీసుకుని రాగలను. ఈ రథాలతో వెళ్లడం కష్టమైతే ఇంద్రసేనుడు మొదలైనవాళ్లని ఎక్కడైనా ఉంచి మనం ప్రయాణిద్దాం” అని చెప్పాడు.

అతడి మాటలు విని రోమశమహర్షి “మనం గొప్ప తపోబలంతోను, పరాక్రమంతోను గంధమాదన పర్వతానికి (పురాణాల్లో గంధమాదనపర్వతం భూలోకానికి స్వర్గలోకానికి పొలిమేరగా చెప్పబడింది) వెడదాము. అక్కడ ఇంద్రలోకంనుంచి రాబోతున్న మహావీరుడు, త్యాగస్వబావం కలవాడు, దేవతలతో పూజింపబడినవాడు అర్జునుణ్ని చూడగలము” అని చెప్పాడు.

ఆ మాటలకి అందరు సంతోషించారు. పాండవులు సపరివారంగా ముందుకి ప్రయాణం చేసి అటవికుల రాజు ‘సుబాహుడి’ రాజధానికి చేరారు.

సుబాహుడి నగరం ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండుగా ఉంది. అంతులేని అటవిక భటులతో క్రిక్కిరిసి ఉంది. పాండవులు సుబాహుడు అందించిన అతిథిమర్యాదలు స్వీకరించారు. తమ రథాల్ని, సారథుల్ని, గుర్రాల్ని, ఇంద్రసేనుడు మొదలైన భటుల్ని సుబాహుడి దగ్గర ఉంచి గంధమాదనపర్వతం వైపుకి నడిచారు.

ధర్మరాజు భీముడితో  “కోపం వస్తే వజ్రాయుధం అస్త్రంగా కలిగిన దేవేంద్రుణ్ని కూడ యుద్ధంలో ఓడించగల గొప్ప శౌర్యం కలవాడు; వేగంలో వాయుదేవుడికీ, తేజస్సులో సూర్యుడికీ సమానమైనవాడు; పద్మాల్లాంటి కళ్లు కలవాడు; ఆజానుబాహుడు; విలువిద్యలో ఆరితేరినవాడు; సింహపుమూపుల్లా ఉండే భుజాలు కలవాడు; విలుకాండ్రకందరికీ గురువు; ఎప్పుడూ గెలుపేకాని ఓటమి తెలియనివాడు; ఎప్పుడూ ఓర్పుగా ఉండేవాడు నీ తమ్ముడు అర్జునుణ్ని చూడాలని నా మనసు పరితపిస్తోంది.

అతడితో కలిసి ఉండడం ఎప్పటికి జరుగుతుందో. అందరి మనసులు ఇంతగా ఆకట్టుకున్న అర్జునుడు ఎందుకింత ఆలస్యం చేసాడో!” అన్నాడు. అర్జునుణ్ని తలుచుకుంటూ ముందుకి నడుస్తున్నారు.

గంధమాదనపర్వతం చేరుకున్న పాండవులు

బదరికాశ్రమంలో పాండవులు

పాండవులు ధర్మరాజుతో పాటు నడుస్తూ ఎత్తైన, పెద్దవైన ధాతువులుండే స్థలాలతో సందెచీకట్లు కమ్ముతున్నాయేమో అనే భ్రాంతి కలిగిస్తూ.. అనేక రంగులు గల రాళ్లతో, పక్షులతో, జంతువులతో అందమైన అనేక ఆభరణాలు ధరించి వెలిగిపోతున్న భూదేవిలా ఉన్న గంధమాదన పర్వతాన్ని చూశారు.

పాండవులు గంధమాదన పర్వతం దగ్గరికి చేరగానే పెద్ద గాలి దుమారం లేచింది. ఆకాశం వరకు దుమ్ము వ్యాపించింది. చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. పొదలు, లతలు నేలమీదకి జారిపోయాయి. చెట్లు గుంపుగా పడిపోయిన శబ్దానికి నింగి విరికి నేల మీద పడిందేమో.. కొండ శిఖరాలు విరిగిపోతాయాయేమో.. అనుకుంటూ భయంతో అటు ఇటు కదిలిపోయారు.

దుమ్ము దట్టంగా వ్యాపించి చీకటిగా ఉండడం వల్ల ఒకళ్లనొకళ్లు చూడలేకపోయారు. పడిపోయిన చెట్ల కొమ్మలు, తీగలు, పొదలు చేతుల్తో తోసుకుంటూ పెద్దపెద్ద చెట్ల మొదళ్ల దగ్గరకి చేరుకుని పాండవులు మూడు బృందాలుగా విడిపోయారు.

ధౌమ్యుడు, ధర్మరాజు, సహదేవుడు ఒకచోట; గద విల్లు పట్టుకుని భీముడు, ద్రౌపది ఒకచోట; రోమశుడు, నకులుడు, బ్రహ్మణులు ఒకచోట వేరు వేరుగా నిలబడిపోయారు.

పెద్ద వర్షం కురిసింది. మేఘాలు భయంకరంగా గర్జిస్తున్నాయి. పెద్ద పెద్ద వడగళ్లు పడ్డాయి. మిరుమిట్లు గొలిపేలా మెరుపులు మెరిసాయి. అంతా నీటితో నిండిపోయింది. కొండల దగ్గర ఉన్న పొదలు, పెద్ద పెద్ద సెలయేళ్ల దగ్గర ఉన్న పెద్ద చెట్లు వేళ్లతోపాటు పెకిలించబడ్డాయి.

అలా చాలాసేపు కురిసిన వాన వెలిశాక పాండవులు అందరు కలిసి మళ్లీ ప్రయాణం సాగించారు. ఎత్తుపల్లాలతోను, రాళ్లతోను ఉన్న దారిలో నడవలేక ద్రౌపది మూర్ఛపోయింది. భీముడు ఆమెని ఎత్తుకుని జింకతోలు చాపమీద పడుకోబెట్టి అరటి ఆకుల్తో విసురుతున్నాడు. నకులసహదేవులు చిగురుటాకులా ఉన్న అమె పాదాల్ని ఒత్తుతున్నారు.

ధర్మరాజు ద్రౌపది అవస్థని చూసి బాధపడ్డాడు. ఈ సుకుమారి నా వల్లే ఇన్ని బాధలు పడుతోంది. మహావీరులైన పాండవులకి భార్య అయితే తన కూతురు సుఖపడుతుందని ద్రుపదుడు మనస్సులో సంతోషించి ఉంటాడు అనుకుంటూ దుఃఖిస్తున్నాడు.

ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులు ధర్మరాజును తగిన విధంగా మాట్లాడి ఊరడిస్తున్నారు. కొంచెం చల్లటి గాలి తగలడంతో ద్రౌపది మూర్ఛనుంచి తేరుకుంది.

ధర్మరాజు భీముడితో “రాజకుమారి పాంచాలిని తీసుకుని భయంకరమైన రాళ్లతో నిండిన కఠినంగా ఉండే ఈ మార్గంలో నడవలేము. ఈమె నడవలేకపోతోంది ఆలోచించు” అన్నాడు.

భీముడు భయంకరులైన రాక్షసుల మధ్య ఉండి ఆకాశమార్గంలో సంచరించగలిగిన వీరుల్లో మొదటివాడు, ధైర్యవంతుడు, హిడింబి కొడుకు తన పెద్ద కొడుకు ఘటోత్కచుణ్ని తలుచుకున్నాడు.

ఒక్క క్షణంలో ఘటోత్కచుడు తన రాక్షస బలగంతో వచ్చి దేవతాప్రముఖులతో సమానమైన తండ్రులకీ, బ్రాహ్మణులకీ నమస్కరించాడు. చేతులు జోడించి నిలబడిన కొడుకుని భీముడు ఆలింగనం చేసుకున్నాడు. “నీ తల్లి ప్రతిరోజు ప్రయాణం చెయ్యడం వల్ల అలిసిపోయి నడవలేక పోతోంది. ఈమెని మోసుకుంటూ మా వెంట నడిచిరా!” అని భీముడు కొడుకుకి ఆదేశించాడు.

ఘటోత్కచుడు తండ్రితో  “ఈ దారి గట్టి రాళ్లు, మిట్టపల్లాలతో నడవడానికి శక్యం లేకుండా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ ఎత్తుకుని నేను సులువుగా తీసుకుని వెడతాను” అని చెప్పాడు.

ద్రౌపదిని, పాండవుల్ని, ధౌమ్యుణ్ని తన వీపు మీద ఎక్కించుకున్నాడు. బ్రాహ్మణుల్ని తీసుకుని రావడానికి తన రాక్షసబలగాన్ని నియోగించాడు. రోమశమహర్షి సిద్ధులు వెళ్లే ఆకాశమార్గంలో వెళ్లాడు.

పాండవబృందంలో వాళ్లు అందరూ ఆకాశవీధిలో ప్రయాణం చేసి పూర్వం నరుడు, నారాయణుడు అనే ఋషులు తపస్సు చేసిన ఆశ్రమం దగ్గర గంగ ఒడ్డున ఉన్న బదరీవనంలో దిగారు. మనోహరంగా ఉన్న బదరీవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

దేవతలు, సిద్ధులు, ఋషులు సేవించిన గంగానదిని చూసి అందులో స్నానం చేసి నియమంతో వ్రతాలు చేస్తూ సమాధియోగంతో మైనకశైలం, హిరణ్యశృంగం, బిందుసరం అనే పుణ్యక్షేత్రాల్ని చూసి బదరికాశ్రమంలో ఆరు రోజులు నివసించారు.

ఒకరోజు భీముడు, ద్రౌపది గంధమాదనపర్వత చరియల్లో రత్నాల అరుగులమీద తిరుగుతూ ఉండగా వేయిరేకులతో ఉన్న మనోహరమైన తామర పువ్వు ఒకటి గాలివాటుకి ఎగిరి వచ్చి వాళ్ల దగ్గర పడింది.

ఆ కమలాన్ని చూసి ద్రౌపది అంతకుముందు ఎప్పుడు తాను అటువంటి పువ్వుని చూడలేదని, ఆ పువ్వులో ఉన్న పరిమళం మరే పువ్వులోను లేదని అనుకుంది. అందమైన ఆ పువ్వుని చూసి ఇంతవరకు మనసుకి, కళ్లకి ఆహ్లాదం కలిగించిన ఇటువంటి పువ్వుని చూడలేదనీ, ఇటువంటి పువ్వులు ఇంకా కావాలి తెచ్చిపెట్టమనీ భీముణ్ని అడిగింది. ఆ పువ్వుని ధర్మరాజుకి చూపించడానికి వెళ్లింది.

సౌగంధికపుష్పం కోసం వెడుతున్న భీముడు

భీమసేనుడు ద్రౌపది కోరిక తీర్చాలని వెళ్లాడు. వీపుకి బంగారు తొడుగు ఉన్న విల్లు, పాముల్లా ఉన్న అమ్ములు ధరించి తామరపువ్వు తెచ్చిన గాలికి ఎదురుగా వెడుతున్నాడు. గంధమాదనపర్వతం మీద రత్నాలతో ఉన్న అనేక గుహలు, అరటి తోటలు, మందార పువ్వులు సుగంధాన్ని వెదజల్లుతున్న గాలుల్ని పీలుస్తూ తుమ్మెదల ఝంకారాలు, కోయిల పాటలు వింటూ తియ్యగా ఉన్న పళ్లని తింటూ ఆనందంగా ముందుకి వెడుతున్నాడు.

ఎదురుగా వస్తున్న జంతువుల్ని ఎదుర్కుంటూ ఒక ఏనుగుని ఎత్తి మరో ఏనుగు మీదకి విసురుతూ, ఒక సింహాన్ని పట్టుకుని మరో సింహం మీదకి విసురుతూ, చిన్న జంతువుల్ని అరచేతులతో కొడుతూ ఆహ్లాదంగా వెడుతున్నాడు.

గంధమాదనపర్వత మధ్య భాగంలో భీముడు నడిచి వెడుతుంటే అతడి అడుగులకి చెట్లు, తీగలు కదిలిపోయాయి. ఆకాశంలో సంచరించే సిద్ధులు, దేవతలు, నాగులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు మొదలైన వివిధ జాతులకి చెందిన దివ్యకాంతలు ఆ కొండ గుహల్లో దాక్కుని తాము అతడికి కనిపించకుండా భీముణ్ని ఎంతో ఇష్టంతో చూస్తున్నారు.

భీముడు ఉత్సాహంగా పెద్ద పెద్ద కొమ్మల్ని విరుస్తూ తీగలు పీకుతూ ముందుకి వెడుతున్నాడు. అతడి పాదాల తాకిడికి గంధమాదన పర్వతం అదిరిపోతోంది. ఎత్తైన శిఖారాల్ని ఎక్కుతూ వాయువు, గరుత్మంతుల వేగంతో మత్తేభంలా తిరుగుతున్నాడు.

తన సింహనాదానికి భయపడి పైకి ఎగిరిపోతున్న పక్షుల రెక్కలు తడిగా ఉండడం చూశాడు. తనకి దగ్గరలో కొలను ఉండి ఉంటుందని అనుకుంటూ వేగంగా వెళ్లాడు.

ఆ కొలను గట్టు మీద ఒక అరణ్యం ఉంది. అందులో చీకటిచెట్లు, తాడిచెట్లు, విశాలమైన ఆకులు కలిగిన అరటి చెట్లు ఉన్నాయి. ఆకుల కదలిక వల్ల చల్లగా ఉన్న ఆ కొలను నీళ్లల్లో స్నానం చేసి తామరపూలతో దండలు చేసుకుని మెడలో వేసుకున్నాడు.

విశాలమైన అరటి తోపులోకి వచ్చి శంఖం పూరించాడు. భీముడు చేసిన ఆ శంఖ ధ్వనికి పర్వతగుహలో పడుకుని ఉన్న హనుమంతుడు విని “ఇది గొప్పనాదం. మనస్సుకి ఆనందం  కలిగిస్తోంది. ఇది నా సోదరుడి శంఖారావమే” అని సంతోషంతో పులకించి పోయాడు.

Exit mobile version