Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-94: బంగారు తామరపువ్వుల కోసం భీముడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

అరణ్యపర్వము (మొదటి భాగము) నాలుగవ ఆశ్వాసము

ఆర్ష్టిషేణమహర్షి ఆశ్రమంలో పాండవులు

బంగారు తామరపువ్వుల కోసం భీముడు

మహాభారతకథని సూతుడు శౌనకుడు మొదలైన మహర్షులకి చెప్పాడు. పాండవులు నరుడు, నారాయణుడు మొదట తపస్సు చేసిన బదరికావనంలో కొన్నాళ్లు నివసించారు.

ఒకరోజు ధర్మరాజు తమ్ముళ్లతో “అర్జునుడు వెళ్లి ఐదేళ్లు గడిచింది. దివ్యాస్త్రాలు సంపాదించి రాబోతున్నాడు. గొప్ప పరాక్రమవంతుడు, బలశాలి, శత్రువుల్ని జయించిన అర్జునుణ్ని ఇక్కడ చూస్తాము” అన్నాడు.

పాండవులు గంధమాదన పర్వతంలో పుణ్యక్షేత్రాలు దర్శించి బ్రాహ్మణులతో కలిసి ఉత్తరదిక్కుకి కొంత దూరం ప్రయాణం చేశారు.

పదిహేడవరోజు వృషపర్వుడు అనే రాజర్షి ఆశ్రమం చేరుకున్నారు. వృషపర్వ మహారాజు పాండవులకి అతిథిసత్కారాలు చేసి గౌరవించాడు. అక్కడ వాళ్లు ఏడురోజులు ఉన్నారు.

తరువాత బ్రాహ్మణుల్ని రాజర్షి ఆశ్రమంలో ఉండమని చెప్పి ధౌమ్యుడు, రోమశుడు, కొంతమంది బ్రాహ్మణులతో కలిసి వృషపర్వుడు చెప్పిన మార్గంలో వెళ్లారు. ‘మాల్యవంతం’ అనే గొప్ప కొండని చూశారు. ఆ పర్వతం నిర్మలమైన పటికరాళ్లతోను, బంగారంతోను కలిసిన అందమైన గుహలతో తెల్లగా ఉంది. అక్కడ వినోదంగా గడుపుతూ ఎత్తైన ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకున్నారు.

చెట్లకు ఉండే పువ్వులు, పళ్లు, వాటి కోసం తిరిగే తుమ్మెదల ఝంకారం, గండుకోయిలల మధురమైన నినాదాలతో ఆ ప్రదేశం మారుమోగుతోంది. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుగుతూ ఉండగా శ్వేతకి అనే పుణ్య నదినుంచి మంచి సువాసనలు వెదజల్లుతూ అయిదురంగులు కలిగిన పువ్వులు గాలికి ఎగిరి వచ్చి పాండవులముందు పడ్డాయి. ఆ పువ్వుల్ని చూసి ఆశ్చర్యపోయారు.

ఏకంతంగా చంద్రకాంత శిలావేదిక మీద కూర్చుని ఉన్న భీమసేనుడితో ద్రౌపది “ఈ పువ్వులు ఇంతకు ముందు మనం చూసిన సౌగంధికలు అనే బంగారు పూలకంటె ఎక్కువ సుకుమారంగాను, సువాసనతోను ఉన్నాయి. ఇంతకు ముందెప్పుడు ఇటువంటి పువ్వులు నేను చూడలేదు. ఈ పువ్వులు నాకు తెచ్చిపెట్టు” అని అడిగింది.

భీముడు వెంటనే ఎత్తైన ఆ కొండమీదకి ఎక్కి అక్కడ అనేక మణులతో నిర్మించిన ప్రాకారాలతో ఉన్న కుబేరుడు నివసించే భవనాన్ని చూసి శంఖానాదం చేశాడు. అది విని అనేక ఆయుధాలు ధరించి సింహనాదాలు చేస్తూ యక్ష, రాక్షస భటులు భీమసేనుడితో తలపడ్డారు.

భీముడు వేసిన బాణాలకి చచ్చిపడిన రాక్షసుల దేహాల నుంచి కారిన రక్తంతో కొండవాగులన్నీ నిండిపోయాయి. భీముడి బాణాలకి తట్టుకోలేక రాక్షసులందరు యుద్ధం వదిలేసి వెనక్కి పారిపోయారు.

మణిమంతుడు అనే సేనాని గదాయుధాన్ని తీసుకుని భీముడి మీదకి విజృంభించాడు. కుబేరుడి స్నేహితుడు మణిమంతుడి మీద భీముడు అనేక బాణాలు వేసి భయంకరంగా ఎదుర్కున్నాడు. మణిమంతుడు కోపంతో భీముడి మీదకి గదని తిప్పి విసిరాడు. భీముడు మహావేగంతో మెరుపుతీగవంటి కాంతితో మిరుమిట్లు గొలుపుతూ వస్తున్న గదని తన పదునైన బాణాలతో ముక్కలు చేశాడు. అతడి కోపానికి రాక్షసభటులు భయపడిపోయారు.

తాను ప్రయోగించిన గొప్ప ఆయుధాలు ‘శక్తి’, త్రిశూలం వంటివన్నీ భీముడి ఆయుధాలతో వమ్ము కావడం చూసి ధైర్యం తగ్గిన మణిమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. భీముడు తన గదని తిప్పి తిప్పి అతడి మీదకి విసిరాడు. ఆ గద తగిలి మణిమంతుడు నేలమీద పడి మరణించాడు. మణిమంతుడు చచ్చిపోవడం చూసి మిగిలిన రాక్షసులు భయంతో తూర్పువైపుకి పారిపోయారు. ధర్మరాజు భీముడు కనిపించక ఎటువైపు వెళ్లాడో ద్రౌపదిని అడిగాడు.

ద్రౌపదిని, ధౌమ్యుడు మొదలైనవాళ్లని ఆర్ష్టిషేణుడు అనే ఋషి ఆశ్రమంలో ఉంచి ధర్మరాజు నకులసహదేవులతో కలిసి కొండ శిఖరాన్ని ఎక్కాడు. కుబేరుడి నగరానికి దగ్గరగా గద దెబ్బలకి చచ్చి పడి ఉన్న మంణిమంతుడు మొదలైన రాక్షసులతో రణరంగం మధ్య ఉన్న భీముడి దగ్గరికి వెళ్లాడు.

చావగా మిగిలిన రాక్షసులు అలకాపురానికి అధిపతి అయిన కుబేరుడి దగ్గరికి వెళ్లి భీమసేనుడి పరాక్రమం, మణిమంతుడు చచ్చిపోవడం గురించి చెప్పారు.

అది విని “ఇంతకు ముందు భయం లేకుండా బంగారు తామరపువ్వులు తీసుకుని వెళ్లాడు. ఇప్పుడు మణిమంతుడితో సహా అనేకమంది వీరుల్ని చంపి ఈ పువ్వుల్ని తీసుకున్నాడు” అని కుబేరుడు భీముడి బలపరాక్రమాలకి ఆశ్చర్యపోయాడు. దేవతలు, గరుడులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలైన తన పరివారంతో కుబేరుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. గద, కత్తి అమ్ములు ధరించి యుద్ధానికి సన్నద్ధంగా ఉన్న వాయుపుత్రుడు భీముడిని సంతోషంగా చూశాడు. బుద్ధిమంతులైన పాండవులు కుబేరుడికి నమస్కరించారు.

ధర్మమే ఆకారంగా ఉన్న ధర్మరాజుని చూసి “రాజా! నీ తమ్ముడు భీముడు నా స్నేహితుణ్ని చంపి నాకు కీడు చేశాడని బాధపడద్దు. అది అగస్త్యమహర్షి ఇచ్చిన శాపం వల్ల జరిగింది” అన్నాడు.

తరువాత భీముణ్ని తన దగ్గరికి పిలిచి “నువ్వు చేసిన సాహసం వల్ల నాకు అపకారం జరగలేదు ఉపకారమే జరిగింది. అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను” అన్నాడు. ధర్మరాజు కుబేరుడికి నమస్కరించి “అగస్త్యమహర్షి ఇటువంటి శాపం ఇవ్వడానికి కారణమేమిటో వివరంగా చెప్పమని అడిగాడు.”

శాపం గురించి చెప్పిన కుబేరుడు

“పూర్వకాలంలో కుశావతి అనే పుణ్యనదీతీరంలో దేవతలందరు సత్రయాగం చేస్తూ నన్ను కూడా పిలిచారు. నేను మూడు వందల మహాపద్మసంఖ్యలు కలిగిన యక్షరాక్షస పరివారంతో పుష్పక విమానం ఎక్కి బయలుదేరాను. మేము ఆకాశమార్గంలో వెడుతున్నప్పుడు భూమి మీద యమునానదీ తీరంలో అగస్త్యమహర్షి చేతులు పైకెత్తుకుని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు.

నా స్నేహితుడు తెలియక ఉమ్మి వేశాడు. అది అగస్త్యమహర్షి మీద పడింది. ఆగస్త్యమహర్షి నాతో ‘నువ్వు పక్కన ఉండగానే మణిమంతుడు గర్వంతో నన్ను చూసుకోకుండా నా మీద ఉమ్మి వేశాడు. ఇతరులని నొప్పించే గర్వం కలిగిన నీ స్నేహితుడు ఒక మనిషి చేతిలో చస్తాడు. అంతేకాదు నీ యక్ష, రాక్షస భటులు కూడ ఆ మనిషి చేతిలో చచ్చిపొతారు. ఆ పాపం అతడిని చూడడం వల్ల తీరిపోతుంది’ అని శపించాడు.

కాబట్టి మణిమంతుడి చావుకి, నా యక్ష, రాక్షస బలాలు చచ్చిపోవడానికి నీ తమ్ముడు కారణం కాదు. అగస్త్యమహర్షి ఇచ్చిన శాపమే కారణం. ధైర్యం, సామర్థ్యం, దేశకాలాలు, శౌర్యం, రహస్య మంత్రాంగం అనే అయిదు రాజనీతి అంగాలు తెలిసిన ప్రభువు భూచక్రాన్ని సవ్యంగ పరిపాలించి పుణ్యగతులు పొందుతాడు.

చేసే పనుల్లో అర్థం తెలుసుకోక తెగువతో వ్యర్థమైన ప్రయత్నాన్ని చేసేవాడికి పాపం కలుగుతుంది. ధర్మరాజా! నువ్వు నిర్మలమైన ధర్మంతో కలిసిన బుద్ధిమంతుడివి. పరాక్రమాన్ని ప్రదర్శించడానికి వీలు చాలు తెలుసుకోవాలి. నీ తమ్ముడు భీమసేనుణ్ని కేవలం తెగువమాత్రమే చూపించే ధైర్యవంతుడు కాకుండ ఉండమని చెప్పు.

మిమ్మల్ని యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు కాపాడినట్టే నేను కూడ కాపాడుతాను. మీకు ప్రతి రోజు అన్నం, నీళ్లు మొదలైనవి నా సేవకులు సమకూరుస్తారు. ఇంకా పదిహేను రోజులు మీరు ఆర్ష్టిషేణమహర్షి ఆశ్రమంలో నివసించండి. గొప్ప కీర్తి కలిగిన అర్జునుడు దేవతలవల్ల దివ్యాస్త్రాలు పొంది ఇప్పుడు దేవేంద్రుడి దగ్గర ఉన్నాడు. దేవేంద్రుడికి ఉపకారం చేశాడు.

అంతేకాదు, ఏడు అశ్వమేధయాగాలు చేసిన మీ తండ్రిగారి తాతగారు శంతనుడి ఆశీస్సులు అందుకున్నాడు. ఆయన మీ అందరి కుశలము అడిగారు. అర్జునుడు ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు అన్నీ మంచిరోజులు వస్తున్నాయి. మీ కోరికలు తీరుతాయి” అని చెప్పి తన పరివారంతో వెళ్లిపోయాడు.

ధర్మరాజు కుబేరుడు చెప్పినట్టు ఆర్ష్టిషేణమహర్షి ఆశ్రమంలో ఉంటున్నాడు. ఒకరోజు ధౌమ్యమహర్షి తన చూపుడు వేలితో ఉత్తరదిక్కుకి చూపిస్తూ “అదిగో చూడు.. అది మందర పర్వతము. అది మేరుపర్వతము. ఈ పెద్ద కొండకి ఎనిమిదివైపుల దేవేంద్రుడితో అష్టదిక్పాలకులు నివసిస్తారు.

మేరుపర్వతం చుట్టూ ఎప్పుడూ చంద్రుడు, సూర్యుడు, నక్షత్రసమూహము, సప్తర్షిమండలంతోపాటు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఆ పసిడికొండ మీద పద్మం ఆసనంగా కలిగిన బ్రహ్మ, మూడు కళ్లు కలిగిన పరమశివుడు, విష్ణుదేవుడు, వేల్పుల సమూహంతో సేవింపబడుతూ ఉంటారు” అని చెప్పాడు. పాండవులు ఆ ఆశ్రమంలో నెలరోజులు గడిపారు.

ధైర్యంలో మందరపర్వతం వంటివాడు, గొప్పగా ప్రకాశించే తేజస్సు కలవాడు, దేవేంద్రుడి కుమారుడు అయిన అర్జునుడు మిరుమిట్లు కొలుపుతున్న కాంతితో ప్రకాశిస్తున్న మాతలి నడిపే బంగారు రథం మీద ఎక్కి సూర్యుడిలా ప్రకాశిస్తూ స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చాడు.

రోమశుడికి, ధౌమ్యుడికి, ధర్మరాజుకి, భీమసేనుడికి పాదనమస్కారాలు చేశాడు. నకులసహదేవుల్ని ఎత్తి కౌగలించుకున్నాడు. ఆ దృశ్యాన్ని ద్రౌపది సంతోషంగా చూసింది. అందరూ సంతోషంగా మాతలిని సత్కరించారు. మాతలి దివ్యరథాన్ని తీసుకుని స్వర్గలోకానికి వెళ్లిపోయాడు.

ఆ సమయంలో చీకటిపడి ఆకాశంలో చంద్రుడు వెన్నెల పరిచాడు. అర్జునుడు సోదలందరితో కలిసి పడుక్కుని జరిన విషయాలన్నీ కథలుగా చెప్పాడు. తెల్లవారిన తరువాత ధర్మరాజు తపస్సంపన్నులైన మహర్షులతోను, ధౌమ్యుడు, రోమశుడు, సోదరులతోను కూర్చున్నాడు.

పాండవుల దగ్గరికి వచ్చిన ఇంద్రుడు

ఆకాశంలో దేవదుందుభుల మోతలు, కిన్నరుల పాటలు, గంధర్వుల గానాలతో మిరుమిట్లు గొలుపుతూ విమానాలు కనిపించాయి. దేవేంద్రుడు పాండవుల్ని చూడాలని అక్కడికి వచ్చాడు. పాండవులు ఎంతో ప్రేమతో దేవేంద్రుడికి ఎదురుగా వెళ్లి శాస్త్రోక్తంగా అతిథిసత్కారాలు చేసి అతడి పాదాలకి నమస్కరించారు.

ఇంద్రుడు కూడా పాండవులతో సహా అక్కడున్న అందరినీ ఆదరంగా పలకరించి సంతోషపెట్టాడు. తరువాత వాళ్ల దగ్గర కూర్చుని ఉన్న అర్జునుణ్ని చూపించి ధర్మరాజుతో “కుంతీదేవి కొడుకు ఈ అర్జునుడు చాలా గొప్పవాడు. నా వల్లనే దివ్యాయుధాల్ని సంపాదించాడు.

వాటిని ప్రయోగించంలో గొప్ప సామర్థ్యాన్ని పొంది నివాతకవచులు అనే రాక్షసుల్ని చంపి దేవతలకి మంచి చేశాడు. ఇతడు మహాతేజస్వి. తన శౌర్యంతో శత్రువుల్ని జయించి భూరాజ్యాన్ని నీకు ఇవ్వగలడు” అని చెప్పాడు. తరువాత దేవేంద్రుడు తన పరివారంతో కలిసి దేవతల రాజధాని అమరావతికి వెళ్లిపోయాడు. తమని ఆదరంగా చూసినందుకు పాండవులు ఎంతో సంతోషపడ్డారు.

కుబేరుడూ, ఇంద్రుడూ, పాండవులు కలిసిన ఈ కథని బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఒక సంవత్సర కాలం దీక్షతో చదివినవాళ్లు, విన్నవాళ్లు గొప్ప తేజస్సు కలిగి మహావైభవంతో భూమి మీద నూరేళ్లు బ్రతుకుతారు.

Exit mobile version