[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
దివ్యాస్త్రాల్ని వివరించిన అర్జునుడు
దేవేంద్రుడు స్వర్గలోకానికి తిరిగి వెళ్లిపోయిన తరువాత ధర్మరాజు అర్జునుణ్ని చూసి సంతోషంతో “శివుడు మొదలైన దేవతల అనుగ్రహం వల్ల దివ్యాస్త్రాలు సంపాదించి దేవతలకి గొప్ప మేలు చేశావని నిన్ను గురించి ఇంద్రుడు చెప్పాడు కదా!
నువ్వు పొందిన దివ్యాస్త్రాలు, వాటిని ఎలా పొందగలిగావు, దేవేంద్రుడికి సంతోషం కలిగేలా దేవతలకి ఎటువంటి మేలు చేశావు.. అన్నీ వివరంగా వినాలని కుతూహలంగా ఉంది. చెప్తావా?” అని అడిగాడు.
అర్జునుడు పూజ్యులైన రోమశ ధౌమ్యులకి, సోదరులకి ఇలా చెప్పాడు.. “నేను నువ్వు అజ్ఞాపించినట్టు మంత్రవిద్యోపాసన చేసి నిష్ఠతో తపస్సు చెయ్యాలని హిమాలయ పర్వతాలకి వెళ్లాను. దేవేంద్రుడు ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఈశ్వరుడి గురించి తపస్సు చెయ్యమని చెప్పాడు.
నేను ఈశ్వరుడి గురించి ఘోరతపస్సు చేశాను. ఈశ్వరుడు కిరాత రూపంతో వచ్చి నాతో భయంకరమైన యుద్ధం చేశాడు. నన్ను మెచ్చుకుని నిజస్వరూపం చూపించి నాకు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు.
తరువాత ఇంద్రుడు మొదలైన దేవతలవల్ల నేను ఐంద్రం, ఆగ్నేయం, యామ్యం, రాక్షసం, వారుణం, వాయవ్యం, కౌబేరం, గాంధర్వం, పైశాచం, బ్రాహ్మ్యం అనే అస్త్రాలు పొందగలిగాను. ఇంద్రుడి అనుమతితో మాతలి నడిపే దివ్యరథాన్ని ఎక్కి ఈ దేహంతోనే స్వర్గపురపు రాజధాని అమరావతికి వెళ్లాను.
దేవేంద్రుడే గురువుగా నేర్పిన అనేక దివ్యాస్త్రాలు వాడడము, వాటిని తిరిగి వెనక్కి పంపించే విధానము, మరోవైపుకి మరల్చే పద్ధతులు, జరిగిన దోషాలు పరిహరించే పద్ధతులు, ఎదుటివాళ్లు ప్రయోగించినప్పుడు వాటిని వమ్ముచేసే రీతులు అన్నింటిని పరిపూర్ణంగా నేర్చుకున్నాను.
దేవేంద్రుడు సంతోషపడి ‘అర్జునా! నా దగ్గర నువ్వు అస్త్రవిద్య నేర్చుకున్నావు. నేను చెప్పిన శత్రువుల్ని నీ సామర్థ్యంతో సంహరించి దేవతలకి మేలు చెయ్యడమే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. రాక్షసులు సముద్రగర్భంలో ఉంటూ నివాతకవచులు అనే పేరుతో పిలవబడుతున్నారు. మూడుకోట్లమంది రాక్షసులు బలగర్వంతో దేవతలకి బాధలు కలిగిస్తున్నారు. వాళ్లు యుద్ధంలో నీ చేతిలోనే చావగలరు’ అని చెప్పాడు.
తను ధరించిన ఆభరణాలు నాకు అలంకరించాడు. మణులు పొదిగిన కిరీటాన్ని నాకు ధరింపచేశాడు. చేత్తో ముట్టుకుంటేనే తెలిసేటటువంటి కవచాన్ని నాకు తొడిగాడు. కొండచిలువలా ఉన్న ఈ అల్లెతాటిని నా గాండీవానికి తనే సంధించి కూర్చి ఎక్కుపెట్టే విధానాన్ని నేర్పించాడు.
పదివేల హంసల, నెమళ్ల రంగులతో ప్రకాశించే గుర్రాలతో ఉండి మాతలి సారథ్యం చేసే రథం మీద కూర్చోబెట్టాడు. నివాతకవచుల్ని సంహరించి రమ్మని నన్ను పంపించాడు.
దేవేంద్రుడు చెప్పినట్టు బయలుదేరుతుండగా దేవతలు ‘వీరుడవైన అర్జునా! పూర్వం ఈ రథాన్ని ఎక్కి దేవేంద్రుడు అనేకవేలమంది రాక్షసుల్ని, దేవతల శత్రువులయిన వృత్రుడు, శంబరుడు, బలుడు వంటి గొప్ప బలపరాక్రమవంతుల్ని జయించాడు.
నువ్వు కూడా నీ శౌర్యంతో మాయలు ప్రదర్శించే నివాతకవచులు అనే దుష్టులైన రాక్షసుల్ని సంహరించు’ అని చెప్పి ‘దేవదూతం’ అనే శంఖాన్ని నాకు ఇచ్చారు.
నివాతకవచుల్ని జయించిన అర్జునుడు
నేను మాతలితో కలిసి వెళ్లి మహాసముద్రాన్ని చుశాను. ఆ సముద్రం నురుగుతో కలిసి కెరటాల దొంతరలతో చేపలు, తాబేళ్లు, మొసళ్లతో ఒక పర్వతంలా అనిపించింది. సముద్రం లోపల పెద్ద పెద్ద బురుజులతో, పెద్దపెద్ద వీధులతో అలంకరించబడిన నగరాన్ని చూశాను.
ఆ నగర ముఖద్వారం దగ్గర నిలబడి నా శంఖాన్ని పూరించాను. ఆ శంఖధ్వని అన్ని దిక్కులకీ వ్యాపించి, కొండగుహల్లో ప్రతిధ్వనించింది.
శంఖ ధ్వని విని రాక్షసులు మిక్కిలి కోపంతో నా రథాన్ని చుట్టుముట్టారు. వాళ్ల శరీరాల నల్లదనం వల్ల లోకమంతా చీకటి అలుముకున్నట్టయింది. వాళ్లు నా మీద అనేక బాణాలు ప్రయోగించారు. నేను కూడా ఒక్కొక్కళ్లమీద పదేసి బాణాలు వేశాను.
నా రథానికి అడ్డంగా వచ్చి భూమి ఆకాశం మధ్య ఉన్న ప్రదేశాన్ని అమ్ములతో కప్పేశారు. దేవతలు, మహర్షులు ఆశ్చర్యపోయారు. భయంతో రథం నడపలేక దేవేంద్రుడి సారథి మాతలి మూర్ఛపోయాడు. నేనే రథం నడుపుకుంటూ యుద్ధం చేశాను.. అది సాటిలేని గొప్ప యుద్ధం.
రాక్షసుల అస్త్రాలకి విరుగుడుగా అస్త్రాలు వేసుకుంటూ యుద్ధభూమిలో తిరుగుతున్నాను. గుర్రాలు రథాన్ని ఈడ్వలేకపోయాయి. ‘ఇంద్రుడి కుమారుడా! అర్జునా! ఎక్కడ ఉన్నావయ్యా!’ అంటూ మాతలి భయంతో అరిచాడు.
‘పూర్వం అమృతం కోసం రాక్షసులకి దేవతలకి జరిగిన యుద్ధం కంటే గొప్ప యుద్ధం. ఇప్పటి ఈ యుద్ధంలో రాక్షసులు అంతులేని పరాక్రమం కలవాళ్లు. ఇది బ్రహ్మదేవుడు నిర్ణయించిన ప్రపంచ ప్రళయం’ అని చెప్పి ‘ఈ యుద్ధంలో నువ్వు నా పరాక్రమాన్ని చూద్దువుగాని’ అన్నాను.
మాతలి ఆశ్చర్యపోయాడు. దేవేంద్రుడి అనుగ్రహం వల్ల పొందిన సూర్యాస్త్రాన్ని వేసి చీకట్లు పోయేలా చేశాను. మాతలి నన్ను అభినందిస్తూ ఆనందంతో పెద్ద కేక వేశాడు. నా గాండీవం నుంచి వెలువడిన భయంకరమైన బాణాలతో రాక్షసుల శరీరాలు తెగి కొండలు కూలినట్లు కూలిపోయారు.
చివరికి నివాతకవచులు నా మంత్రబాణాలతో మరణించి భూమి మీద పడ్డారు. రాక్షస స్త్రీల ఏడుపులు పెడబొబ్బలు ఆకాశాన్ని దద్దరిల్లేలా చేశాయి.
దేవేంద్రుడి ముఖ్యపట్టణం అమరావతి కంటే రాక్షసుల ముఖ్యపట్టణం చాలా అందంగా ప్రకాశిస్తోంది. అది చూసి విలువైన మణులు పొదిగిన ఇళ్లతో ఉన్న ఈ పట్టణంలో సుఖంగా జీవించకుండా దేవేంద్రుడు వేరే పట్టణంలో ఎందుకు ఉంటున్నాడని మాతలిని అడిగాను” అని చెప్పి ఆగాడు అర్జునుడు.
మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు. “మాతలి ‘ఓ అర్జునా! రాక్షసులవల్ల భయం కలిగినప్పుడు దేవతల క్షేమం కోసం సముద్రంలో ఈ పట్టణాన్నినిర్మించాడు. తరువాత రాక్షసులు తపస్సు చేసి ఈ పట్టణంలో ఉండడానికి యుద్ధంలో దేవతలతో ఓడించబడకుండా ఉండడానికి బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకున్నారు.
అందుకే ఈ పట్టణాన్ని రాక్షసులు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు వాళ్లని చంపడానికి దేవేంద్రుడు నిన్ను నియోగించాడు. దేవతల వల్ల జరగని పని నివాతకవచుల్ని నువ్వు సంహరించావు’ అని పొగుడుతూ మాతలి రథాన్ని వెనక్కి తిప్పాడు” అని చెప్పాడు.
ధర్మరాజుతో అర్జునుడు “నివాతకవచుల్ని సంహరించి తిరిగి వస్తున్నప్పుడు నాకు ఒక తపోవనము, ఆశ్చర్యం కలించేలా ఉన్న ఒక నగరము కనిపించాయి. ఇవి ఎవరివని మాతలిని అడిగాను. మాతలి నాతో ‘పులోమ, కాలక అనబడే ఇద్దరు రాక్షస యువతులు దేవమానం ప్రకారం వేయి సంవత్సరాలు గొప్ప నిష్ఠతో తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ఆరాధించారు.
ఈ విషయంనువ్వు వినలేదా? ఈ నగరంలో నివసించే తమ కొడుకులు దేవతలచేతిలో మరణించకుండా ఉండేలా బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొందారు. ఇది హిరణ్యపురం. ఇక్కడ పులోమ కొడుకులు పౌలోములు, కాలక కొడుకులు కాలకేయులు అనబడే రాక్షసులు అరవై వేలమంది ఉన్నారు. వీళ్లకి దేవతలతో చావు రాదు’ అన్నాడు మాతలి.
నేను వెంటనే రథాన్ని నగరం మీద దండయాత్రకి పోనియ్యమని చెప్పాను. మాతలి ఏడువాయువుల వేగంతో దేవతారథాన్ని దేవతల శత్రువులున్న నగరంలో ప్రాకార శిఖరాలపైకి నడిపించాడు.
వెంటనే రాక్షసులు విజృంభించి నన్ను దేవేంద్రుడు అనుకుని అరవై వేల రథాలతో వచ్చి చుట్టుముట్టారు. వాళ్లు కదలడానికి వీలు లేకుండా అనేక చెట్లు, బండరాళ్లని ఏర్పాటు చేసే బాణాల్ని వేశాను.
వాళ్లు కపటయుద్ధం చేయాలని నగరంతోపాటు ఆకాశంలోకి ఎగిరారు. నా బాణాల తాకిడికి భూమి మీద పడ్డారు. ఇంక లాభంలేదు అనుకుని ముక్కంటిని తల్చుకుని మాతలి అభినందిస్తుండగా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాను.
పాశుపతాస్త్రం మహిమ వల్ల సింహాలు, శరభాలు, పెద్దపులులు, ఏనుగులు, దున్నలు, ఎద్దులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు, పిశాచులు, గంధర్వులు పుట్టి రాక్షసుల్ని సంహరించారు. అలా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి పౌలోములు, కాలకేయులు అనబడే రాక్షసుల్ని యమపురికి పంపించాను.
వెనక్కి వచ్చి దేవేంద్రుడికి నమస్కరించాను. దేవేంద్రుడు మాతలి ద్వారా యుద్ధ విశేషాలు విని సంతోషంతో ‘అర్జునా! నువ్వు దేవతలకి మేలు చేశావు. నీ అన్నదమ్ములు నిన్ను చూడాలని తహతహలాడిపోతున్నారు. యుద్ధాల్లో నిన్ను మానవమాత్రులెవరు ఓడించలేరు.
ద్రోణుడు, అశ్వాత్థామ, కృపాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు నీ బాణాల తాకిడికి రణరంగంలో పూర్తిగా శక్తిని కోల్పోతారు’ అని చెప్పాడు. తరువాత ఇంద్రుడి దగ్గరనుంచి ఇక్కడికి వచ్చాను” అని స్వర్గలోకంలో తను చేసిన పనులన్నీ అందరికీ చెప్పాడు అర్జునుడు.
తన తమ్ముడు అర్జునుడు చెప్పిన శౌర్యసాహసాలు విని ధర్మరాజుకి సమస్త భూమండల సామ్రాజ్యము తమకి సంక్రమించినట్టుగా భావన కలిగింది. ధర్మరాజు “అర్జునా! నీకు దేవతలు అనుగ్రహించిన అస్త్రాలు అవి ఉపయోగించే విధనాలు మాకు చూపించు” అని అడిగాడు.
అర్జునుడు దేవతలు తనకిచ్చిన ఆయుధవిశేషాలు, మంత్రబాణాలు అన్నగారు ధర్మరాజుకి విడివిడిగా ప్రదర్శించి చూపిస్తున్నప్పుడు భూమి వేగంగా తిరిగింది. సముద్రాలు కలతచెందాయి.
దిక్కుల్లో ఉండే ఏనుగులు కుంగిపోయాయి. సూర్యుడి కాంతి తగ్గిపోయింది. వాయువులు అగ్నిజ్వాలలతోపాటు అణగారిపోయాయి. శివుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు ఆకాశంలో ఒక చోటకి చేరారు. దేవతలందరు నారదమహర్షిని పాండవుల దగ్గరికి పంపించారు.
నారదమహర్షి అర్జునుడితో “ఎదురుగా భేదించవలసిన లక్ష్యం లేకుండా ఈ దివ్యాస్త్రాల్ని ప్రయోగిస్తే అవి అన్ని లోకాల్నీ దహించివేస్తాయి” అని చెప్పి అస్త్రప్రదర్శన ఆపించాడు. తరువాత పాండవులు ఆ ఆశ్రమంలో పదినెలలు ఉన్నారు.
ఆ సమయంలో దేవతలు అర్జునుడి దగ్గరికి వచ్చి “మీరు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసము పూర్తి చేసిన తరువాత రఘువంశంలో పుట్టిన శ్రీరామచంద్రుడి కీర్తిలా నీ కీర్తి కూడా ముల్లోకాల్లోను వ్యాపిస్తుంది” అని ధైర్యం చెప్పి వెళ్లారు.
దేవఋషి రోమశుడు ధర్మరాజుకి ధర్మం గురించి బోధించి స్వర్గలోకానికి వెళ్లిపోయాడు. పాండవులు ఘటోత్కచుడి సేనలతో తిరుగు ప్రయాణం చేసి వృషపర్వుడి ఆశ్రమాన్ని చూశారు. బదరికాశ్రమంలో ఒక రాత్రి ఉండి సుబాహుపురానికి వచ్చారు.
అక్కడ తమ సేవకులు ఇంద్రసేనుడు మొదలైనవాళ్లని కలిసి తమ రథాలు ఎక్కి ఘటోత్కచుడికి వీడ్కోలు చెప్పారు. తరువాత హిమాలయాల్లో దేవర్షులు, బ్రహ్మర్షులు యజ్ఞాలు చేసి అనేక ప్రదేశాల్లో ఉన్న యూపస్తంభాలని చూస్తూ ఒక సంవత్సరం గడిపారు.