[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
సృష్టి స్థితి లయల విధాలు
“ధర్మరాజా! నీ ప్రశ్నలకి సమాధానాలు మహానుభావుడు అవతారమూర్తి అయిన శ్రీక్రుష్ణుడి ఆజ్ఞ తీసుకుని చెప్తాను. శ్రీకృష్ణుడు నీకు ప్రియమిత్రుడు, మంత్రి మాత్రమే కాదు. అతడు నాశములేనివాడు. ఎల్లప్పుడూ ఉండేవాడు. భూతాలన్నింటికీ ఈశ్వరుడు.
ఆదిదేవుడు, ముసలితనం లేనివాడు. మొదలు, తుది, మధ్య అనే భాగాలకి అతడు అతీతుడు. ఇంద్రుడు మొదలైన దేవతలతో పూజించబడేవాడు. పీతాంబరం ధరించి విశాలమైన కళ్లతో ఉండే ఈ శ్రీకృష్ణుడు పద్మాన్ని నాభియందు కలిగిన విష్ణుమూర్తి అవతారమే!
కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనే నాలుగు యుగాలు పన్నెండు వేల దివ్య సంవత్సరాల సమూహం. పై నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఒక వేయి మహాయుగాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు (బ్రహ్మదివసము) అవుతుంది.
బ్రహ్మదివసపు నూరు సంవత్సరాలు అనావృష్టి ఏర్పడుతుంది. ఆ కాలంలో సూర్యుడు ఏడు ఆకారాలు ధరించి మిక్కిలి తీక్షణమైన కిరణాలతో ప్రకాశించి నదుల్లోను, నదాల్లోను ఉన్న నీళ్లు తాగి లోకాలన్నింటినీ మండింపచేస్తాడు.
సూర్యుడి యొక్క వేడి ప్రళయకాలంలో వీచే గాలితో పాటు చెలరేగి మూడులోకాల్ని, పర్వతాల్ని, దేవతల, మనుష్యుల, పాముల, రాక్షసుల సమూహాన్ని ఒక్క క్షణంలోనే బూడిద అయ్యేట్టు చెయ్యగలదు.
క్షణ క్షణం పెరిగే ప్రళయకాల మేఘాలు, తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు, గోరోజనం రంగుగల కాంతులు కలిగి మిరుమిట్లు గొలిపే మెరుపుతీగలతో మనోహరాలై; గొప్ప వైశాల్యం కలిగిన కొండలు భయం కలిగిస్తూ; పిడుగులు ఆపకుండా కురిపిస్తూ; వజ్రాయుధంలాంటి భయంకరమైన నినాదాలు చేస్తూ; దిక్కులు పిక్కటిల్లేటట్లు వేగంగా ఆవరిస్తాయి.
ధర్మరాజా! అమితంగా కురిసిన వాన నీటి వల్ల మహాగ్ని అంతా ఆరిపోతుంది. తరువాత పూర్వంలాగే ఏరులు, సముద్రాలు నీటితో నిండి ప్రవహిస్తాయి. ఇంకా ఆ మేఘాలు చెదిరిపోకుండా ఆకాశంలోనే నిలిచి ఉండి చాలాకాలం గర్జిస్తూ వర్షిస్తూనే ఉంటాయి.
ఎడతెగకుండా కురిసిన వర్షాలవల్ల భూగోళమంతా రూపాన్ని పూర్తిగా పోగొట్టుకుని నీళ్లతో పూర్తిగా ఆవరింపబడి ఉంటుంది. నీరు చాలా లోతుగా ఉండడం వల్ల దిక్కులు, భూభాగాలు, ఆకాశం వేరువేరుగా గుర్తించడానికి వీలుపడదు. దట్టమైన చీకట్లు మూడు లోకాల్ని ఆవరిస్తాయి.
తరువాత బ్రహ్మదేవుడితో ఆజ్ఞాపించబడి ఒక పెనుగాలి విజృంభించి ఆపడానికి వీలులేకుండా వీస్తుంది. అది అన్నివైపుల విస్తరించి అన్ని మేఘాల్ని చెదరగొట్టి అణిచివేస్తుంది. ఆ గాలిని పీల్చి బ్రహ్మదేవుడు ఆ భయంకరమైన వరదనీటి మధ్య పద్మం మీద ఎంతో ఇష్టంతో నిద్రపోతాడు.
ఈ రకమైన కల్పాంతాలు ఎన్నో గడిచాయి. ఇంకా ఎన్నో కల్పాంతాలు గడవబోతున్నాయి. జరిగిన కల్పాంతకాలంలో దట్టంగా వ్యాపించిన పెనుచీకటి మధ్య దిక్కుతోచక నేను ఏకాంతంగా చాలాకాలం తిరగవలసి వచ్చింది.
ఒకసారి ఆ వరదనీటి మధ్య ఒక మర్రిచెట్టు కనిపించింది. ఆ మర్రిచెట్టు ఆకు పడక మీద నీలమేఘశ్యామలుడు, చంద్రబింబంవంటి ముఖం కలవాడు, సూర్యుడి తేజస్సువంటి తేజస్సు కలవాడు అయిన ఒక చిన్న బాలకుడు నిద్రించి ఉండడం చూశాను.
పువ్వులా సుకుమారంగా ఉన్న ఆ పసివాణ్ని చూసి నేను ‘ఈ సృష్టిలో లోకాలన్నీ నాశనం చెంది ఒకే ఒక సముద్రంగా మారిన ఈ ప్రదేశంలో బాలుడు ఒంటరిగా ఎందుకు నిద్రపోతున్నాడో. ఇతడు ఎవరో’ అనుకుంటూ నెమ్మదిగా ఆ బాలుడి దగ్గరికి వెళ్లబోయాను.
ఆ బాలుడు కళ్లు విప్పార్చుకుని నావైపు ఓరగా చూశాడు. తియ్యని కంఠధ్వనితో ‘అయ్యా! నువ్వు బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్నావు. నీకు విశ్రాంతి తీసుకోడానికి అవకాశం కలిగిస్తాను. నా శరీరంలోకి ప్రవేశించి సుఖంగా పడుకో’ అని తన నోరు తెరిచాడు. ఎవరో బలవంతంగా తోసినట్టు అతడి నోటిమార్గం నుంచి కడుపులోకి ప్రవేశించాను.
అందులో గంగ మొదలైన నదులతో, మేరుపర్వతంవంటి పర్వతాలతో, సముద్రాలతో, అనేక నగరాలతో, అనేక దీవులతో, భూఖండాలతో రకరకాలైన వ్యాపారాలు చేసుకునే ప్రజలతో పక్షులు, జంతువులు, పాములు, పశువులు తిరుగుతున్న ప్రదేశాలతోను ఉన్న భూభాగాల్ని చూశాను.
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో ప్రకాశిస్తున్న ఆకాశాన్ని చూశాను. వాయువులు సంచరించే మార్గాలు చూశాను. ఇంద్రుడు, వరుణుడు యముడు మొదలైన దేవతలు నివసించే లోకాలు చూశాను. పాములు, యక్షులు, రాక్షసులు, అసురులు, విద్యాధరులు మొదలైనవాళ్లు నివసించే లోకాల్ని చూశాను.
ఇన్ని విధాలుగా చెప్పేకంటే ఒక్కమాటలో చెప్తాను.. నేను సమస్తలోకాల్ని ఆ బాలకుడి కడుపులో ఉండడం చూశాను. అతడి కడుపులో ఉన్న భూప్రదేశంలో నూరుసంవత్సరాలు ఆశ్చర్యంగా తిరిగాను. కాని, ఒక్క చోట కూడా స్థిరంగా నిలవలేకపోయాను.
మనస్సు నిండా భయం ఆవహించింది. ఆ బాలుడు మాయావిగా అనిపించి అతడి పాదాల్ని మనస్సులో ధ్యానించాను. ఆ దేవుడు నన్ను దయతలచి తన నోటి నుంచి వేగంగా గాలితోపాటు నన్ను బయటికి తెచ్చాడు.
తరువాత మళ్లీ యథాప్రకారం మర్రిచెట్టు ఆకుమీద పడుకుని కనిపించాడు. నన్ను చూసి చిరునవ్వు నవ్వుతూ ‘నా పొట్టలో నువ్వు విశ్రాంతి తీసుకున్నావా?’ అని అడిగాడు.
నేను కొంచెం బెరుకుగా అతడి దగ్గరికి వెళ్లబోయాను. ఆ బాలుడి చేతి వేళ్లు తామరపువ్వు రేకులకంటె అందమైనవిగా, అతడి పాదాలు లేత చిగురాకుల కంటే సుకుమారంగా ఉన్నాయి.
అతడి పాదాల్ని నా తలమీద పెట్టుకుని ‘అయ్యా! నీ దయవల్ల అత్యంత ఆశ్చర్యం కలిగించే సకల చరాచర సృష్టిని నీ పొట్టలో చూశాను. నీ మాయా ప్రభావాన్ని గురించి తెలుసుకోలేకపొతున్నాను.
దేవా! స్థూలదృష్టికి నువ్వు ఒక పసివాడిగా కనిపిస్తున్నావు. సూక్ష్మదృష్టితో ఎంత ఆలోచించినా నీ గొప్పతనం నా ఊహకి అందట్లేదు. ఎటు చుసినా అంతుచిక్కని పెద్ద మహాసముద్రం. ఈ పెద్ద మర్రిచెట్టు ఏమిటి? ఆకు మీద నీ పడక ఏమిటి? నీ పొట్టలో పధ్నాలుగు లోకాలు పెట్టుకుని ఏమీ తెలియని పసివాడిలా పడుకోవడం ఏమిటి?
నాకు అన్ని విషయాలు తెలుసుకోగలిగే శక్తిని ప్రసాదించి దయచేసి నా భ్రాంతిని పోగొట్టి రక్షించు’ అని వేడుకున్నాను” అని చెప్పి ఆగాడు మార్కండేయమహర్షి.
నారాయణుడు చెప్పిన నారాయణమహిమ
మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు. “నేను ప్రార్థించగానే ఆ నారాయణుడు గొప్ప వాత్సల్యంతో తన దివ్యమైన మహిమ గురించి నాకు చెప్పాడు. ‘పుణ్యాత్ముడా! దేవతలు, మహర్షులు కూడా నా మహిమ గురించి తెలుసుకోలేరు. నువ్వు గొప్ప జ్ఞానవంతుడివి, అదృష్టవంతుడివి, తండ్రిని సేవించేవాడివి కనుక సంతోషంగా నీకు తెలిసేట్టుగా చెప్తున్నాను విను.
జలానికి పర్యాయపదము నీరు. నాకు నీళ్లు నివాస స్థానము. అందువల్ల నాకు నారాయణుడు (నారములు స్థానంగా కలవాడు) అని సార్థక నామధేయం ఏర్పడింది. నారాయణుడు అనే పేరు కలిగిన నేను అన్ని కాలాల్లోను ఉంటాను, పాలిస్తాను, జ్ఞానంతో కలిసిన ఆనందంతో ఈ లోకాలన్నింటినీ క్రమంగా మళ్లీ సృష్టిస్తాను. నేనే ఏలుకుంటాను. తగిన సమయం చూసి నేనే వాటిని లయం చేస్తాను.
పద్మాన్ని పీఠంగా ఉన్న బ్రహ్మదేవుడు, దేవతల్ని పాలించే ఇంద్రుడు, ధనానికి అధిపతి అయిన కుబేరుడు, సముద్రాలకి అధిపతి అయిన వరుణుడు మిగిలినవాళ్లందరు నా అంశని పంచుకున్న నా ప్రతినిధులే!
భూమి నా పాదాలు; అగ్నిహోత్రుడు నా ముఖం; సూర్యచంద్రులు నా కళ్లు; ఆకాశం నా శిరస్సు. ఇటువంటి అద్భుతమైన ఆకారంతో నేను ప్రకాశిస్తున్నాను.
నేను సాటిలేని దక్షిణలు ఇచ్చి ఎన్నో యజ్ఞాలు చేశాను. మేధావులైన బ్రాహ్మణోత్తములు, మెచ్చుకోతగిన దీక్షాదక్షత కలిగిన ప్రభువులు, మంచి గుణాలు కలిగిన వైశ్యులు, దానధర్మాలతో యజ్ఞాలు చేసే స్వభావం కలిగి నన్ను ఆరాధిస్తారు.
ప్రళయకాలంలో సముద్రంలో మునిగిపోయిన సమస్త భూగోళాన్ని వరాహరూపం ధరించి నేనే ఉద్ధరించాను. సముద్రాలతో, నదులతో, పర్వతాలతో, పట్టణాలతో, అడవులతో నిండి ఉన్న ఈ మొత్తం భూమండలాన్ని మనోజ్ఞమైన వేయి పడగలమీద ఆదిశేషుడి రూపంతో ధరిస్తున్నవాడిని నేనే.
బాడబము అనే అగ్నిగా మారి ఏడు సముద్రాల నీళ్లని నేనే తాగుతాను. ఆ నీళ్లని నేను ప్రళయకాలంలో విడిచిపెడతాను. సృష్టి ఆరంభించే సమయంలో నా నోటి నుంచి భుజాలనుంచి తొడలనుంచి, పాదాలనుంచి నాలుగు వర్గాలు సృష్టిస్తాను.
అలాగే నాలుగు వేదాలు – ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం నా ముఖాలనుంచి ఉద్భవిస్తాయి. ఇవన్నీ చివరికి ప్రళయకాలంలో తప్పనిసరిగా జరిగే మార్పుకి చెల్లాచెదరై చివరికి నన్నే చేరుతాయి.
అహంభావం లేనివాళ్లు; కోపం లేనివాళ్లు; అసూయ లేనివాళ్లు; మమకారం లేనివాళ్లు; ఆత్మజ్ఞానం తెలిసినవాళ్లు; సత్యదీక్ష కలిగిన మహర్షులు ముక్తికోసం నన్నే ఆరాధిస్తారు.
మొత్తం నక్షత్రాలు, తారలు, గ్రహాలు, ఆకాశము, వాయువులు, దిక్కులూ అన్నీ నా రూపాలే. అన్ని సముద్రాలు శయ్యగా చేసుకుని నేను సంతోషంగా పడుకుని ఉంటాను.
మహర్షీ! దానము, నిజం పలకడం, తపస్సు, మోక్షసంబంధమైన జ్ఞానం, అహింస అనబడే సౌమ్యమైన లక్షణాలు, కోరికలు, కోపతాపాలు, అజ్ఞానం అనే తామస గుణాలు నాయందే నిండి ఉన్నాయి.
ఇంకా నేను చెప్తున్నదాన్ని సావధానంగా విను. ఈ జగత్తులో స్పష్టంగా కనిపిస్తున్నదంతా నేనే. ఈ జగత్తులో కనిపించకుండా ‘లేదు’ అని అనిపిస్తున్నది కూడా నేనే. ఈ విషయాన్ని నిజమేనని ఎటువంటి సందేహము లేకుండా నమ్మవచ్చు.
లోకంలో ధర్మానికి ఎప్పుడు కీడు జరుగుతుందో, ఎప్పుడు అధర్మం విజృంభిస్తుందో, ఎప్పుడు రాక్షసులు క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెడతారో, ఎప్పుడు దేవతలు హీన స్థితికి దిగజారుతారో అప్పుడు మంచి కులానికి సంబంధించిన ఇళ్లల్లో పుట్టి దేవతల్ని దేవేంద్రుణ్ని కాపాడి యథాప్రకారం ధర్మమార్గంలో ఉండేటట్లు చూస్తాను.
పుణ్యాత్ముడా! కృతయుగంలో తెల్లని ఆకారంతోను, త్రేతాయుగంలో ఎర్రని ఆకారంతోను, ద్వాపరయుగంలో నల్లని ఆకారంతోను, కలియుగంలో పసుపుపచ్చని ఆకారంతోను ప్రకాశిస్తూ నాలుగు యుగాల్లోను నేనే ధర్మాన్ని నిలబెడతాను.
నా పరాక్రమంతో క్రమపద్ధతిలో నడిచే కాలచక్రాన్ని నిర్ణీతక్రమాన్ని తప్పకుండా నేనే నడుపుతాను. ప్రళయకాలంలో యముడి రూపం ధరించి ఈ సృష్టిని అంతటినీ నేనే సంహరిస్తాను. మొత్తం వృత్తాంతాన్ని నీకు వివరించి చెప్పాను. మూడు లోకాల్ని సృష్టించే బ్రహ్మదేవుడు కూడా నాలో సగభాగమే అని తెలుసుకో.
నారాయణుడు అనే పేరు కలిగిన నేను వేయి మహాయుగాల వరకు బాల రూపం ధరించి వటపత్రం మీద శయనించి అంతటినీ ఆవరించి ఒకే ఒక సముద్రం మీద యోగనిద్రలో మునిగి ఉంటాను. కల్పం చివరి ప్రళయాన్ని చూసి నువ్వు భయపడతుంటే వాత్సల్యంతో నీకు నా పొట్టలో దాచి ఉంచిన ప్రపంచాల్ని చూపించాను.
ఇంక నువ్వు నీకు ఇష్టమైన చోటికి వెళ్ళచ్చు. ఇంక నువ్వు నా నాభిలో ఉన్న కమలంలో నిద్రపోతున్న బ్రహ్మదేవుడు మేలుకుని సృష్టించే లోకాల్ని నువ్వు చూడగలవు’ అని చెప్పి ఆ బాలదేవుడు అప్పటికప్పుడే మాయమయ్యాడు.
అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే ఈ సంఘటనని నేను ప్రత్యక్షంగా అనుభవించడం వల్ల తెలుసుకున్నాను. శ్రీమన్నారాయణుడే వాత్సల్యంతో నాకు అలా దర్శనం అనుగ్రహించాడు. ఆ బాలదేవుడే ఇప్పుడు నీకు దగ్గరి బంధువుగా, మంత్రిగా, స్నేహితుడిగా ఉన్నాడు.
ఆ పుణ్యమూర్తిని, దయాగుణం కలవాడిని, కమలాలవంటి కళ్లుగల గొప్ప పూజనీయుడు శ్రీకృష్ణుడిని సందర్శించగల భాగ్యం నాకు దొరికింది. నా పుణ్యాలు ఫలించాయి.
ధర్మరాజా! ఈ దేవదేవుడైన శ్రీకృష్ణుడి దయవల్లే నేను ప్రళయకాలంలో కూడా దేవతలతో సహా అన్ని ప్రాణులు లయమందేటప్పుడు కూడా దుఃఖం లేకుండా నిర్వికారంగా ఉండగలిగాను.
దేవదేవుడైన శ్రీకృష్ణుడి దర్శనం కలగడం వల్లే పూర్వం జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని చెప్పగల శక్తి కలిగింది. గొప్ప ప్రభావం కలిగిన ఈ పుణ్యపురుషుణ్ని శరణు కోరండి” అని చెప్పాడు.