[శ్రీ పాలకుర్తి రామమూర్తి రచించిన ‘మహాభారతంలో ధర్మరాజు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
కాలాలకతీతంగా, సమాజాలకు అతీతంగా వైవిధ్య భరితమైన వ్యక్తుల మానసిక స్థితులను ఆవిష్కరిస్తున్నది ప్రాచీన భారతీయ సాహిత్యం. అలాంటి మహోన్నత సాహిత్యంలో ప్రముఖంగా చెప్పుకోదగినవి రామాయణ మహాభారతాలు. వ్యక్తి ఎలా ఉండాలో చెప్పింది రామాయణం కాగా ఎలా ఉండకూడదో తెలిపింది మహాభారతం అంటారు.
“యదిహాస్తి తదన్యత్ర – యన్నేహాస్తి న తత్ క్వచిత్” అంటూ ప్రతిజ్ఞాపూర్వకంగా భారతాన్ని వ్రాసారు వేదవ్యాసులవారు. ‘మహాభారత’ ఇతిహాసం మానవ వికాసానికి దిక్సూచిగా నిలుస్తుంది. అందులో ముఖ్యంగా ధర్మరాజు పాత్ర ఉదాత్తమైన పాత్రగానే కాక సార్వకాలికమైన మానవ ప్రకృతికి నిలువెత్తు దర్పణంగా కనిపిస్తుంది. ‘ధర్మో వివర్ధతి యుధిష్ఠర కీర్తనేన’ అన్న గొప్ప ప్రశస్తిని పొందిన పాత్ర మహాభారతంలో ధర్మరాజుది.
ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠరుడు. తండ్రి పాండురాజు సంకల్పంలోనే తన కుమారుడు ధార్మికుడైన నాయకుడు కావాలని ఉన్నది కాబట్టే యమధర్మరాజును స్మరించి కుమారుని పొందమని పాండురాజు కుంతిని కోరాడు. అలా పాండురాజు కోరిక మేరకు ధర్మదేవత అంశ చేత కుంతికి జనించినవాడు ధర్మరాజు.
మహాభారతంలో రెండు ప్రధానమైన పాత్రలు ఉన్నాయి.. ఒకటి యుధిష్ఠరుడు కాగా రెండవ పాత్ర దుర్యోధనుడు. దుర్యోధనుడు క్రోధమయమైన మహావృక్షం కాగా ధర్మరాజు ధర్మమయమైన మహావృక్షం అంటుంది భారతం. యుధిష్ఠరుడు అనే పేరుకు అర్థం.. యుద్ధంలో స్థిరంగా ఉండేవాడని. అలాగే దుర్యోధనుడు అంటే.. ఎదిరించలేని యోధులను కలిగిన వాడని అర్థం. విచిత్రం ఏమిటంటే ఈ రెండు పేర్ల వెనుకా ఉన్న సూచన.. యుద్ధం మాత్రమే. అంతేకాదు, తాత్వికంగా చూస్తే.. ఒకటి విద్య మరొకటి అవిద్య. విద్య అంటే మార్పుచెందని సత్యం.. కాగా తక్కినదంతా అవిద్యయే. ద్వంద్వ భావ సమ్మిళితమయినది సృష్టి. చీకటి వెలుగులు, సుఖము దుఃఖము ఇలాంటివి ద్వంద్వాలుగా చెపుతారు. ఈ ద్వంద్వ భావ సమ్మిళితమయిన సృష్టిలో ఈ విద్యావిద్యల మధ్య ఘర్షణ అనునిత్యం జరిగేదే. ధర్మదేవత అంశయైన ధర్మరాజునకు, కలి పురుషుని అంశయైన దుర్యోధనునికి అన్ని స్థాయిలలో అన్ని కాలాలలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అజేయుడైన దుర్యోధనుని ఎదిరించి నిలిచే వ్యక్తి సర్వకాల సర్వావస్థలయందూ అప్రమత్తంగా, సర్వ సన్నద్ధంగా, సమర శీలంతో, స్థిరంగా, సిద్ధంగా ఉండాల్సిందే.
యుద్ధం అంటే పరస్పర వైరుధ్యాల మధ్య సంఘర్షణ. యుద్ధం లేదా సంఘర్షణ వల్ల వస్తువు పరిణామం చెందుతుంది. పరిణామం చెందడం అంటే వస్తువు ప్రస్తుతస్థితిని కోల్పోయి మరొక స్థితిని పొందడం లేదా రూపాంతరం చెందడం. ఈ పరిణామం అనేది నిరంతర ప్రస్థానానికి ప్రతీక. వ్యక్తి ప్రస్థానం అవ్యక్తం నుండి వెలువడి తిరిగి అవ్యక్తంలోకి చేరుకోవడమే. దానినే పుట్టుక మరణంగా చెపుతారు. అలా అవ్యక్తం నుండి అవ్యక్తంలోకి చేరుకొనే దశలలో జరిగే పరిణామానుభవం కూడా యుద్ధమే. ఆ పరిణామానికి మరోపేరే మృత్యువు. ధర్మరాజు తండ్రియైన యమునిది మృత్యుతత్త్వం. మృత్యువుకు కుమారుడైన ధర్మరాజు కూడా ఈ ఘర్షణలో అందరినీ (తనవారినీ, ఎదుటి వారినీ) మృత్యువువైపే నడిపించాడు. చివరికి యుద్ధానంతరం స్వర్గారోహణ పర్వంలో కూడా ఇదే కనిపిస్తుంది.
మహాభారతంలో ధర్మరాజు పాత్రలో మనకు ముఖ్యంగా కనిపించేది సమతాగుణం. వ్యక్తికి సమతా గుణం యొక్క అవసరం ఏమిటి? జీవితంలో మంచి చెడ్డలను, మానవ స్వభావాలను, ఎదురయ్యే పరిస్థితులను సరిగా అవగాహన చేసుకోవడం, ఆత్మ విమర్శ చేసుకోవడం, ఔచిత్యాన్ని పాటించడం.. ఇలాంటి లక్షణాలను సంతరించుకోవాలి అంటే కావలసింది, సమతా గుణమే. సమత వల్ల సదాలోచన, దాని వల్ల సద్భావన, తద్వారా సద్వర్తన అలవడుతాయి. అలాగే ఓర్పు, నేర్పు, కార్య సాధనాశక్తి, యశస్సు లాంటివీ సమతాగుణం వల్ల సమకూరేవే. నాయకునిలో ఈ సమతా గుణం ఉంటే ధర్మబద్ధపాలకుడౌతాడు. స్థితప్రజ్ఞునిగా రూపుదిద్దుకుంటాడు.
ఈ సమతా గుణం పరివర్తన చెందితే కనిపించే లక్షణమే.. దమము. సమత… సమత నుండి ఆవిష్కృతమయిన దమము వల్ల వ్యక్తి ధార్మిక చైతన్యాన్ని సంతరించుకుంటాడు. అయితే.. ఈ సమతా గుణమూర్తిని లోకులు బలహీనునిగా పరిగణించే ప్రమాదమూ ఉన్నది. అలా భావించినంత మాత్రాన.. సమత శక్తిహీనత కాదు.. సమత అవివేకత కాదు.. అలాగే ధార్మికత నిష్క్రియాపరత కాదు.. ధార్మికత సన్యసత కాదు.
మానవుని ఐహిక జీవితంలో అర్థకామాలు ముఖ్య భూమిక నిర్వహిస్తాయి. అయితే ఈ అర్థకామాలే జీవితపరమార్ధాలా అంటే కాదనే సమాధానం. ఎందుకు? అంటే వాటి ప్రాధాన్యం జీవితం ఉన్నంత వరకే. అయితే అవి ధర్మమార్గంలో సాగితే ముక్తికి దారి చూపుతాయి. కానినాడు పతనావస్థకు దారితీస్తాయి. విజ్ఞత కలిగిన వ్యక్తులు అర్థకామాలు ఎక్కడ ఆగిపోవాలో తెలుసుకోగలుగుతారు.. లేనివారు వాటి వెంట జీవితాంతమూ పరుగులు తీస్తుంటారు. ఈ విధానం భారతంలోని ధర్మరాజు, దుర్యోధన పాత్రలలో మనకు స్పష్టంగా తెలుస్తుంది.
అంతేకాదు, జీవితంలో అత్యంత ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనుకోవడం ప్రతివ్యక్తికీ సహజమైన తపనయే. ఉన్నత స్థాయిని చేరడం అనేది అర్హతను పెంచుకుంటూ, అవకాశాలు వినియోగించుకుంటూ, సక్రమమైన పద్ధతిలో ఎదగడం సమంజసమే కాని ఒకరిని పడద్రోస్తూ పైకెదగాలని భావించడం తప్పవుతుంది.
భారతంలో ధర్మరాజు, దుర్యోధనుడు.. ఇరువురూ అధికారాన్నీ, ఐశ్వర్యాన్నీ, యశస్సునూ కోరుకున్నవారే. అందుకు తీవ్రంగా ప్రయత్నించిన వారే. కాకపోతే వారెన్నుకున్న మార్గాలే భిన్నమైనవి. అవే చరిత్రలో వారి స్థానాన్ని నిర్ణయించాయి.
పాండురాజు మరణానంతరం ధర్మరాజుకు 16 సంవత్సరాల వయసులో కుంతీదేవి వారిని తీసుకొని హస్తినాపురానికి వచ్చింది. హస్తినకు చేరాక అక్కడి పరిస్థితులు నెమ్మదిగా అవగాహనకు వచ్చాయి ధర్మరాజుకు. ముఖ్యులైన ధృతరాష్ట్ర దుర్యోధనుల మనస్సును అర్థం చేసుకున్నాడు. అసహనం మూర్తీభవించిన దుర్యోధనుడు, అనాదరణ చూపే పెదతండ్రి ధృతరాష్ట్రుడు తమ రాక పట్ల సుముఖంగా లేరనేది అవగాహనకు వచ్చింది. తన శక్తి సామర్థ్యాలతో సామ్రాజ్యాన్ని స్థిరంగా నిలిపిన తమ్ముడు మరణించాడని, తమ్ముని కుమారులను ప్రేమ పూర్వకంగా అభిమానించాలని, ఆదరించాలనే భావన వారిలో కనిపించడం లేదు.
పాండవులు హస్తినకు వచ్చేవరకు దుర్యోధనుడు కౌరవ సామ్రాజ్యానికి తానే ఉత్తరాధికారినని భావిస్తున్నాడు. ఆ సమయంలో పాండవుల రాక, వారిని ప్రజలు ఆదరించడం దుర్యోధనునిలో సహజంగానే అలజడిని కలిగించింది. అతనిలో అసహనాన్ని పెంచింది. కౌరవ సామ్రాజ్యం తనదనే తన ఆశలపై బూడిదను చల్లింది. అందుకే పాండవులను అంతమొందించేందుకు పన్నాగాలు పన్నాడు. అయినా వాటిని సహిస్తూనే ధర్మరాజు అప్రమత్తంగా ఉంటూ ఓర్పును ప్రదర్శించాడు.
నిజానికి కౌరవ సామ్రాజ్యం తమ తండ్రి పాండురాజుది. అంతేకాదు, కురుకుమారులలో పెద్దవాడూ తానే. అందువల్ల ఏ విధంగా చూచినా కౌరవ సామ్రాజ్యానికి తానే ఉత్తరాధికారి. అయినా తన అవగాహన మేరకు ధృతరాష్ట్రుడు తమకు రాజ్యం అప్పగిస్తాడనే నమ్మకం కలగలేదు. తొందరపాటు అనర్థహేతువనే సత్యాన్ని తెలిసినవాడు కావడంతో ధర్మరాజు దూరదృష్టితో ఆలోచించాడు, నిగ్రహంతో వ్యవహరించాడు. ఇప్పుడు రాజ్యాధికారం ధృతరాష్ట్రుని చేతిలో ఉన్నది. ఆయన పుత్రప్రేమ, మమకారాలకు బానిసయైనవాడు. ఈ పరిస్థితులలో రాజ్యాన్ని అప్పగించమని అడిగేందుకు తాను వయసులో చిన్నవాడు.. అక్కడ తనకా బంధుబలం లేదు.. ప్రజాబలం లేదు.. ఇక కురువంశంలో పెద్దలయిన భీష్మ విదురాదులు ఇరువురికీ సములు కాబట్టి తమకు వారి సహాయం పరిమితంగానే అందుతుంది. కాబట్టి తాను అశక్తునిగా, అసహాయునిగా ఉన్న సమయంలో తామేమాత్రం తొందరపడినా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారవుతారు. అందుకే సంయమనంతో, తమ్ములతో సహా తమకెన్ని అవమానాలు ఎదురైనా.. ఆపదలు ఎదురైనా వాటిని సహించాడే కాని రచ్చచేయలేదు.. ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. అప్రమత్తంగా ఉన్నాడు.
Do not sweat the small Stuff. Life is much bigger and there will be much bigger challenges in LIFE. ఉదాత్తమైన లక్ష్యాన్ని ఆశించినప్పుడు చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోవడం వల్ల ప్రగతిని పొందలేము. తనకు తెలుసు.. ధనస్సు వంగితేనే బాణం లక్ష్యాన్ని చేరుతుంది.. ఎదురైన కష్టాలను తాము శాసించాలి కాని కష్టాలు తమ జీవితాన్ని శాసించకూడదు. పరిణామాలను గుర్తించి నిర్ణయాలను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం ధృతరాష్ట్రుడు రాజ్యాధికారంలో ఉన్నా అతడు వయోవృద్ధుడు.. ఈనాడు కాకపోయినా రేపయినా వారసుని గురించి నిర్ణయం తీసుకోవాలి. దానికై భీష్మ విదురులపై ఆధారపడక తప్పదు. అయితే వారు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే స్వభావం కలిగిన వారు.. అందుకే అర్హతను పెంచుకునే ప్రయత్నం చేసాడు. పెద్దల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించాడు. వ్యక్తి ఎదుగుదలలో ఉపకరించేది విద్య. దాని ప్రాధాన్యతను గుర్తించాడు కాబట్టే ముందుగా విద్యపై దృష్టి పెట్టాడు. వ్యక్తుల ప్రకృతులను, పరిస్థితులనూ అధ్యయనం చేశాడు. తన వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకున్నాడు. ప్రజాక్షేత్రంలో పాటుపడ్డాడు. ప్రజాభీష్టాన్ని తనవైపు త్రిప్పుకున్నాడు. యౌవరాజ్య పట్టాభిషేకానికి ఇతడే అర్హుడని ప్రజలచేతనే చెప్పించుకోగలిగాడు. అందుకే తప్పనిసరి పరిస్థితులలో ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజును చేసాడు.
స్వతహాగా ప్రతిభావంతుడు.. దానికి తోడు పదవి దక్కింది. తన శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగించి నైపుణ్యాలకు పదునుపెట్టుకున్నాడు. పాలనా దక్షునిగా నిరూపించుకున్నాడు. మరికొన్ని దినములు పాండవులు హస్తినలో ఉన్నట్లయితే.. ప్రజలు అతనినే చక్రవర్తిగా పట్టాభిషిక్తుని చేయమని అడిగే ప్రమాదము ఉన్నదని గ్రహించిన ధృతరాష్ట్రుడు వారిని వారుణావతమునకు పంపించాడు.
అసూయాపరుడైన దుర్యోధనుడు.. ధర్మరాజుకు వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూచి పరితపించాడే కాని తన నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయలేదు. దానికి ఈర్ష్యాళువైన తండ్రి మమకారం తోడయింది. కుటిలత్వానికి మారుపేరయిన మంత్రియైన కణికుని నీతి వారికి మార్గం చూపింది. ఫలితంగా వారణావతంలో లక్షాగృహదహనం. ఇది వారి జీవితంలో పెను ప్రమాదం. అయినా విదురుని సహకారం, ధర్మరాజు దూరదృష్టి, అప్రమత్తతల వల్ల పాండవులా గండం గడిచారు. ఆ సంఘటనతో ఆగ్రహించిన తమ్ములను ఇది సమయం కాదని తానే చల్లబరిచాడు. పరిణామాలను అంచనావేయగలిగాడు కాబట్టే ఏకచక్రపురంలో తలదాచుకున్నాడే కాని.. సహనాన్ని కోల్పోలేదు, కయ్యానికి కాలుదువ్వలేదు.
తదుపరి కాలంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టడంతో తమ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిసాయి. ద్రౌపదీ పరిణయంతో బలవంతమైన పాంచాలరాజ్యం అండ లభించింది.. శ్రీకృష్ణుని ఆదరణతో యాదవబలం తమకు సాయమైంది. ఒక సంవత్సరకాలం పాంచాల దేశంలో ఉండడం వల్ల పరిస్థితులను సరిగా అవగాహన చేసుకున్నారు. బలాన్నీ బలగాన్నీ పెంచుకున్నారు. తప్పనిసరి పరిస్థితులలో ధృతరాష్ట్రుడు వారిని పిలిచి అర్ధరాజ్యాన్ని ఇచ్చి ఖాండవప్రస్థానికి పంపాల్సిన అవసరం వచ్చింది.
ఇక్కడే ధృతరాష్ట్రుని కుటిలత గురించి చెప్పుకోవాలి. ఖాండవప్రస్థం బలవంతులూ, అత్యంత క్రూరులైన నాగజాతివారికి నెలవు. వారు పగలంతా దట్టమైన ఖాండవవనంలో తలదాచుకుంటూ రాత్రులలో చుట్టూ ఉండే జనావాసాలను దోచుకునే వారు. దోపిడీలు, మానభంగాలు యథేఛ్ఛగా సాగిపోయేవి. పాండవులనా రాజ్యానికి పంపడంలో ధృతరాష్ట్రుడు కుటిల నీతిని అమలుపరచాడు. పాండవులు అక్కడ ఆ నాగజాతి వారిని అణిచివేస్తే, అదీ తన పాలనలోనే ఉన్నది కాబట్టి శాంతి భద్రతలను నెలకొల్పిన ఆ కీర్తి తనకే దక్కుతుంది. అలాకాక ఆ నాగజాతి వారి చేతిలో పాండవులు హతులైతే.. తనకు దాయాదుల బాధ శాశ్వతంగా తప్పుతుంది. అంతేకాదు, ఒకవేళ పాండవులు మరణించినా, బలవంతులైన పాండవులు నాగజాతివారిని చాలావరకు నశింపచేసాకే మరణిస్తారు కాబట్టి మిగిలిన వారిని పెద్ద సైన్యంతో తాను నిర్మూలించడం సులువవుతుంది. ఏవిధంగా చూచినా పాండవులను ఖాండవప్రస్థానికి పంపడం తమకు శ్రేయస్సును ఇస్తుంది. ఇదీ ధృతరాష్ట్రుని దుర్నీతి.
ఆత్మవిశ్వాసం, సహనం మూర్తీభవించిన వ్యక్తిత్వం ధర్మరాజుది. కాబట్టే మొత్తం రాజ్యానికి చక్రవర్తి కావలసిన తనకు అర్ధరాజ్యం మాత్రమే ఎందుకిస్తున్నారని వాదులాడలేదు. అరణ్యప్రాంతమని తిరస్కరించనూ లేదు.. నాగజాతి వారి నుండి ప్రమాదం ఎదురౌతుందని భయపడనూలేదు. వినయ విధేయతలతో అంగీకరించాడు. శ్రీకృష్ణుని సహాయంతో, విశ్వకర్మ నైపుణ్యంతో అక్కడ ఇంద్రప్రస్థ నగరాన్నీ, మయసభా భవనాన్ని నిర్మించాడు.
ఇలా ఉండగా, ఒకనాడు ధర్మరాజు సభాభవనంలోకి నారదుడు వచ్చి.. “పాండురాజు వచనంబులు నీకెఱింగించు వేడుక నిట వచ్చితి” అంటూ రాజసూయ యాగం చేయడం మీ తండ్రి అభిమతం అంటాడు. అయితే రాజసూయ యాగం జయప్రదంగా నిర్వహిస్తే ప్రజాక్షయం అయ్యే అవకాశం ఉన్నది అంటూ హెచ్చరికనూ చేసాడు. ఇప్పుడు ధర్మరాజులో సందిగ్ధత.. రాజసూయ యాగం చేయాలా వద్దా.. రాజసూయం చేయాలి అంటే దిగ్విజయం చేయాలి.. దానికి తమ శక్తిసామర్థ్యాలు సరిపోతాయా? ఒకవేళ సరిపోయి దిగ్విజయం చేసినా రాబోయే ప్రజాక్షయం అనే పరిణామాన్ని తానెలా నిరోధించగలడు? అందుకే కృష్ణుని పిలిచి తన సందిగ్ధతను నివేదించాడు. ‘పితృగణ హితార్ధంబుగ సత్క్రతు వొనరింప బుద్ధి గలదు..’ అయితే ప్రజా సంసృతి తత్క్రతువున అవుతుందనే శంకా ఉన్నది.. ఏమి చేయాలి? అంటూ కృష్ణుని సలహాను కోరాడు.. ఇక్కడ రాజసూయ యాగం చేయాలనే తన నిర్ణయంపై స్పష్టత ఉన్నది. కాకపోతే దాని పరిణామాలను ఎలా అధిగమించాలనే దానిపై స్పష్టత కావాలి. అందుకే కృష్ణుని సహాయం అవసరమయింది. ధర్మరాజు ఆంతర్యాన్ని గ్రహించిన కృష్ణుడు ఆ యాగ నిర్వహణకు నీవే అర్హుడివి అంటూ.. కార్యాచరణ ప్రణాళిక నిచ్చాడు. తదుపరి కృష్ణుని మార్గదర్శనలో సమర్థవంతమైన, పటిష్టమైన వ్యూహంతో, ధైర్యంతో ముందుకు సాగాడు.. తమ్ముల పరాక్రమంతో దిగ్విజయ యాత్రను నిర్వహించి ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.
ఇక్కడ ధర్మరాజు రాజనీతిజ్ఞతను చెప్పుకోవాలి. జరాసంధుని వధ నుండి ఆరంభమయిన దిగ్విజయయాత్రలో తాము జయించిన ప్రతి రాజ్యంలోనూ ఆ రాజ్య వారసులనే పాలకులుగా నియమించడం వల్ల ప్రతిఘటన తక్కువగా ఉన్నది. అంతేకాక ఆయా రాజులను యాగానికి సగౌరవంగా ఆహ్వానించడం వల్ల వారి సహాయసహకారాలు సంపూర్ణంగా అందాయి. అలాగే కృష్ణస్వామి మార్గదర్శనం, నారదాది మహామునుల ఆశీస్సులతో రాజసూయ మహాయాగాన్నీ ఘనంగా నిర్వహించాడు. భావి కౌరవ సామ్రాట్టు ధర్మరాజనే స్ఫురణ తన ప్రమేయం లేకుండానే ప్రపంచవ్యాప్తంగా ప్రచారమయింది.
అయితే మానవ స్వభావం విచిత్రంగా మారుతుంటుంది. ముఖ్యంగా వ్యసన శీలత పెద్ద బోనులాంటిది. వంచన అందులోకి సులువుగా ఆకర్షిస్తుంది. బయటపడడం అంత సులువు కాదు. వ్యసన శీలురలో మరొక్క లక్షణం ఉంటుంది. శక్తి తక్కువైన కొద్దీ రక్తి పెరుగుతుంది. లాలసతో సమస్తమూ పోగొట్టుకున్నా వ్యసనానికి బానిసలుగానే మిగులుతారు. ఈ వ్యసన శీలత ధర్మరాజులోనూ కనిపిస్తుంది. సద్గుణాలెన్ని ఉన్నా జూదంలో తనకు ప్రావీణ్యం తక్కువే అయినా, శకుని మాయోపాయానికి చిక్కి రాజ్యాన్నీ, తమ్ములనూ, తనను, భార్యనూ సర్వమూ పందెంలో ఒడ్డి ఓడాడు. వ్యసనపరత సమతనూ ప్రక్కకు తోసివేసింది. అవమానాల పాలయ్యాడు.. ఎక్కడ తగ్గాలో తెలియకపోవడం అతని పతనానికి హేతువయింది. వ్యక్తిత్వం పాతాళాన్ని తాకింది.
తదుపరి ద్రౌపది వస్త్రాపహరణ.. దాని తరువాతి పరిణామంగా ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరంగా తిరిగి తమ రాజ్యాన్నిచ్చినా, మరొకమారు ఆడిన జూదంలో అడవుల పాలయ్యాడు.
చక్కగా ప్రగతి పథంలో నడుస్తున్న సంస్థలో ఆ బృందంలోని సభ్యులలో ఒక్కరు తప్పుచేస్తారు. మొత్తం సమూహమే కష్టపడవలసి వస్తుంది, బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక్కడ ధర్మజుడు చేసిన తప్పుకు పాండవులందరూ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.
నిజానికి ప్రజ్ఞాశాలి, లోకజ్ఞుడైన ధర్మరాజునకు శకుని గురించి, అతని మాయోపాయాలను గురించీ తెలుసు. అయినా జూదమాడాడు అంటే.. అతనిలోని జూదవ్యసనమే కారణం. నిండు సభలో ద్రౌపది “తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా.. ఏను ధర్మ విజితనా అధర్మ విజితనా” అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానము ఇవ్వగలిగిన ధర్మ సూక్ష్మత ధర్మరాజునకు ఉన్నది. కాని యుక్తాయుక్త విచక్షణని మరచి ధర్మపత్నిని పందెంలో పెట్టడం అధర్మం కాబట్టే మౌనంగా ఉన్నాడు.
మాయాద్యూతంలో కౌరవులు అన్యాయంగా తమను ఓడించినా ధర్మరాజు నిరాశానిస్పృహలతో క్రుంగిపోలేదు. ఏదైతే మనచేతులలో నుండి జారిపోయిందో దాని ఫలితాన్ని అంగీకరించడం.. సహనంతో ఓర్పుతో సమయం వచ్చేవరకు ఎదురుచూడడం వ్యక్తిని ఉన్నతీకరిస్తుంది. ఎన్నోమార్లు జీవితంలో మన ప్రమేయం లేకున్నా ఓటమిని ఎదుర్కోవలసి వస్తుంది. నిజానికి ఓటమి మనకు పాఠాలు నేర్పేందుకు, మనలోని అంతర్గత శక్తులను గుర్తించి వెలికి తీసుకునేందుకు ఎదురౌతుందే కాని మనను నిరాశావాదులుగా నిలిపేందుకు కాదు.
బాధ పడడం వల్ల ఏ సమస్యా పరిష్కృతం కాదు.. ఆలోచనలు మాత్రమే సమస్యలను పరిష్కరిస్తాయి. సమస్య ఎదురైనవేళ ప్రయత్నమే దాని నుండి బయట పడవేస్తుంది కాని బాధపడడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ సత్యాన్ని అవగతం చేసుకున్న ధర్మరాజు తన కష్టాలకు కారణాలు వెతుక్కుంటూ, విధిని నిందిస్తూ కూర్చోలేదు. మాయాద్యూతమని ప్రతిఘటించనూ లేదు. నియమాలను ఉల్లంఘించే ప్రయత్నం చేయలేదు. అలాగని సన్యాసం తీసుకోలేదు. కౌరవ సభలో తమకూ ద్రౌపదికీ జరిగిన అవమానాలను, కౌరవులు పలికిన కఠోరమైన పలుకులను, శకుని చేసిన మోసాలను విస్మరించలేదు. సంపదలన్నీ పోయాయని చతికిలపడలేదు. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చనే నమ్మకంతో జీవించాడు. క్షాత్రంతోనే పోయిన రాజ్యాన్ని తిరిగి సాధించాలనే స్థిర నిర్ణయం తీసుకున్నాడు. ఈ ధర్మజ్ఞతయే అతని వ్యక్తిత్వాన్ని పెంచింది. ప్రజల సానుభూతిని సంపాదించింది. భీష్మ ద్రోణాదుల ప్రశంసలను పొందింది. ప్రజలలో కౌరవులపై ద్వేషాన్నీ పెంచింది.
ఇక్కడొక అంశాన్ని చెప్పుకోవాలి. జూదంలో ధర్మరాజు మూలంగా తాము సర్వస్వాన్నికోల్పోయి అడవుల పాలవడం వల్ల నలుగురు సోదరులూ, ద్రౌపది మనసులలో ధర్మరాజుపై ప్రతికూల భావనలు ఏర్పడలేదా? అంటే ఏర్పడ్డాయి అనేదే సమాధానం. కాని వారు ఆ ప్రతికూల భావనల నుండి అనుకూల భావనల వైపు నడవ గలిగారు. దానికి ధర్మరాజుపై ఉన్న నమ్మకం, ప్రేమ, అభిమానాలు ఒక కారణంకాగా, ఉన్నస్థితిని అవగాహన చేసుకొని దాని నుండి ఆనందాన్ని పొందడం ఎలాగో తెలుసుకోవడం మరొక కారణం. సహజమైన పరిస్థితులలో అందరి మధ్య ఆత్మీయతలు ఉండవచ్చు. కాని దుష్కరమైన పరిస్థితులలో ఆ ఆత్మీయతను పెంచుకోవడమే విజ్ఞత. అనుకూల భావనలు అసంపూర్ణ క్రియల నుండి సంపూర్ణ క్రియల వైపుకు నడిపిస్తాయి. గాయపడిన భావనల నుండి సమైక్య భావనల వైపునకు నడిపిస్తాయి. సమైక్య భావనలు అపార్థ భావనలను సరిచేసి, అవగత సత్యాలవైపు నడిపిస్తాయి. నిజానికి వీటన్నింటికీ ప్రాతిపదిక ఒకరిపై ఒకరికి నమ్మకం, అవగాహనలు మాత్రమే.. ఆ నమ్మకం, పరస్పర అవగాహనలే వారిని ఒక్క త్రాటిపై నడిపించాయి. కష్టకాలంలోనూ సమైక్యంగా నిలుప గలిగాయి. ఒకరిపై ఒకరికి విశ్వాసం, అంగీకారం ఉంటే.. వ్యక్తుల మధ్య పొరపొచ్చాలు రావు.. ఒకవేళ వచ్చినా త్వరలోనే సమసిపోతాయి.
మాయాద్యూత పరాజయమూ, ద్రౌపదీ పరాభవము అతనిని బాగా కలతపెట్టాయి. ద్రౌపది పరాభవానికి ప్రతీకారం తీసుకోవాలి.. పోగొట్టుకున్న రాజ్యాన్ని ఎలాగైన ధర్మమార్గంలోనే తిరిగి సాధించాలనే స్థిరనిర్ణయం తీసుకున్నాడు. ఇదీ అతని ముందున్న పెద్ద లక్ష్యం. ఆశయం లేదా లక్ష్యం ఉదాత్తమైనదైనప్పుడే దానిని సాధించేందుకు అపారమైన అంతర్గత శక్తిసామర్ధ్యాలు వెలుగు చూస్తాయి. అజ్ఞాతవాసానంతరం కౌరవులు అంత సునాయాసంగా రాజ్యాన్ని ఇవ్వరనీ తెలుసు. బలమే బలాన్ని గౌరవిస్తుందనేది ధర్మరాజుకు తెలుసు. అందుకే.. అరణ్యవాసాన్ని సాధనాపర్వంగా మార్చుకున్నాడు. త్యాగం లేకుండా అభ్యుదయం లేదు. ఆలోచనలు ఆశయం ఒక్కటిగా నడిస్తేనే ఆశించిన ఫలితాలు సాధించగలము. అన్ని ఆలోచనలూ ప్రయోజనం లేదా ఆశయం కేంద్రంగా వెలుగుచూడాలి. అప్పుడే ఆశయం నెరవేరుతుంది. ఆశయ సాధనలో తాను క్రియాశీలి కావాలంటే ముందుగా వ్యగ్రమైన మనస్సుకు ప్రశాంతత అవసరం. దానికై మునుల యొక్క, ఋషుల యొక్క బోధలను విన్నాడు. వారితో ధార్మిక చర్చలను చేసాడు. ధర్మసూక్ష్మాలూ తెలుసుకున్నాడు. మునులు ఋషులు చేసిన బోధలు, తాను తెలుసుకున్న ధార్మిక మర్మాలు తనకు నహుష ప్రశ్నల కాలంలోనూ, యక్షప్రశ్నల కాలంలోనూ చక్కగా ఉపకరించాయి. అంతేకాదు, చక్కని వ్యూహం ప్రకారం తమ్ములతోను, అనుయాయులతోను, ఆత్మీయులతోనూ సారవంతమైన చర్చలు జరిపాడు. నాయకునిగా చర్చలలోని సారాన్ని గ్రహించి నిర్ణయాలు తీసుకున్నాడు. కార్యాచరణ ప్రణాళికను తయారుచేసుకొని ఎవరెవరు ఏయే కార్యాలు నిర్వహించాలో వారికి ఆ బాధ్యతలు అప్పగించాడు. తన నిర్ణయమే అంతిమమయినా దానిని సోదరులు అందరూ తమ సమష్టి నిర్ణయమని భావించే విధంగా ప్రవర్తించాడు. లక్ష్యాన్ని సమష్టిగా చేరేందుకు అవసరమైన విధానానికి రూపకల్పన చేసి అందరినీ అటువైపు నడిపించాడు. పదమూడు సంవత్సరాల పిమ్మట రాబోయే యుద్ధానికి అవసరమైన అన్ని చర్యలను ప్రఛ్ఛన్నంగా చేపట్టాడు. సన్నాహాలను చేసాడు.
ఈరోజు ప్రశాంతంగానే ఉండవచ్చు.. కాని ఏ క్షణమైనా ఏవైపు నుండైనా ప్రమాదం ఎదురవవచ్చు.. అందుకే ప్రతిక్షణమూ సర్వసన్నద్ధంగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాడు. Today will be a COMBAT… “ఈ రోజు పోరాటం జరుగుతుంది..” అని సైనిక స్థావరాలపై వ్రాసి ఉంటుందంటారు. అందుకే అనివార్యంగా ఎదురయ్యే యుద్ధంలో విజయాన్ని సాధించే దిశలో అన్ని విధాలుగా సన్నద్ధమయ్యాడు, అవసరానికి తగిన అంగబలాన్నీ అస్త్రబలాన్నీ సమకూర్చుకున్నాడు.
‘ఉన్నది ఉన్నట్లు’గా చూచే తత్వాన్ని ఒంటబట్టించుకున్న ధర్మరాజులో లక్ష్యంపై స్పష్టత ఉన్నది. అలుపెరుగని పట్టుదల ఉన్నది. అతని కార్య దీక్షపై అతనికి నమ్మకమూ ఎక్కువే, ఆత్మ విశ్వాసమూ ఎక్కువే. చక్కగా భావాన్ని వ్యక్తీకరించ గలిగిన నైపుణ్యమూ ఉన్నది. సమయ సందర్భాలు, తమ శక్తిసామర్థ్యాలు ఎదుటివారి బలాబలాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగినవాడు. అలాగే విజయానికి అవసరమైన రీతిలో బృందాలను ఏర్పరచి వాటిని సక్రమంగా నడిపించ గలిగిన సంయమత ఉన్నది. అనుయాయులలో చివరివరకూ ఉత్సాహాన్ని నిలిపి ఉంచే విధానం అతనికి తెలుసు. అందుకే తమ్ములకు ఇరుబలాలలో ఉన్న బలాలు బలహీనతలను తెలియచేసి తాము ఎక్కడ ఉన్నతీకరించుకోవాలో తెలియచేసాడు. అలా తెలియచేయడమే కాదు.. భీష్మద్రోణుల శక్తిసామర్ధ్యాలు తెలిసినవాడవడం వల్ల, తనకు వేదవ్యాసులవారు ఉపదేశించిన ‘ప్రతిస్మృతి’ విద్యను అర్జునునికి ఉపదేశించి అర్జునుడిని దివ్యాస్త్రాల సాధనకై తపస్సు చేయమని పురమాయించాడు. దుర్యోధనుని గదాయుద్ధ నైపుణ్యం తెలిసిన వాడవడం వల్ల భీముడిని ఆ నైపుణ్యాలను పెంచుకునేందుకు నియోగించాడు.
శత్రుజన ఖేదంబును, మిత్రజన మోదంబునుంగదా సంపదలకుం దగియెడు ఫలంబులు అంటూ ఘోషయాత్ర పేరుతో అడవుల పాలయిన పాండవులను అవమానించాలని, అవకాశం ఉంటే అంతమొందించాలని సపరివారంగా, పక్కా ప్రణాళికతో వచ్చిన దుర్యోధనాదులు గంధర్వులకు చిక్కిన వేళ వారిని విడిపించి బుద్ధులు చెప్పి పంపించాడు. అలా అపకారికి ఉపకారం చేయడం అతనికి అజాతశత్రువుగా గుర్తింపు నిచ్చింది.
ఇక్కడొక మాట చెప్పుకోవాలి. దుర్యోధనుని పరివారం భయార్తులై దుర్యోధనుని రక్షించమని ధర్మరాజును కోరినవేళ “కాగల కార్యము గంధర్వులే తీర్చారని” తమ్ములు ప్రతిఘటించినా.. దుర్యోధనాదులను రక్షించడం వెనుక ధర్మరాజు దూరదృష్టి ఎంతో గొప్పది. కౌరవ సామ్రాజ్యం తమది. దుర్యోధనుడు తమ సోదరుడు.. దుర్యోధనుడు ప్రస్తుతం కౌరవ సామ్రాజ్యానికి ప్రతినిధి. అలాంటి వాడు ఒక సామాన్య గంధర్వుని చేతిలో బంధీ అయ్యాడు. తమ మధ్య ఎలాంటి భేదభావనలున్నా.. తన తమ్ముడు ఒక సామాన్యునిచే అవమానింపబడ్డాడనే అపవాదు ప్రచారమైతే.. అది తనకూ, తన సామ్రాజ్యానికీ మచ్చగానే మిగులుతుంది. అంతే కాదు, దానిని సామంతులు అవకాశంగా తీసుకోవచ్చు. దుర్యోధనాదులను తాను రక్షిస్తే.. ప్రజల మధ్య, పెద్దల హృదయాలలో గుర్తింపును పొందుతాడు. తాను రక్షింపక పొతే.. దుర్యోధనుడు బంధీఅయిన వార్త తెలిసిన భీష్మద్రోణులు దుర్యోధనాదులను ఎలాగైనా విడిపిస్తారు.. దానితో ఆ యశస్సు కౌరవ పాలకులకు పోతుంది.. దుర్యోధనుడు ఎలాగైనా రక్షింపబడుతాడు. అది తమ కారణంగా అయితే.. తమకు పేరువస్తుంది.. ఆ సూక్ష్మాంశాన్ని భీమాదులు గుర్తించలేకపోవడం వల్ల వారు వ్యతిరేకించారు. ఈ అపూర్వ నిర్ణయం ధర్మజుని లౌక్యాన్నీ, ధర్మజ్ఞతను, రాజనీతిని పట్టిస్తున్నది.
అలాగే.. వావివరసలు మరచి ద్రౌపదిని చెరబట్టాలని చూచిన సైంధవుని చంపబోతున్న భీమార్జునులను ఆపిన ధర్మజుని బంధుప్రీతి, సహనశీలత, క్షమాగుణం, ప్రశంసార్హాలు.
ధర్మజుని మాటనేర్పు అసాధారణమైనది. అజగర రూపంలో ఉన్న నహుషుని ప్రశ్నలకు ధర్మబద్ధమైన సమాధానాలు ఇచ్చి, భీముని విడిపించిన ధర్మజుని మాటనేర్పరితనం ప్రశంసార్హమైనది. అలాగే.. యక్షుని హెచ్చరికను పట్టించుకోకుండా తన సోదరులు నలుగురూ సరస్సులో నీటిని త్రాగి పడిన వేళ అతని ప్రశ్నలకు సమయస్ఫూర్తితో సమాధానాలిచ్చి వారిని బ్రతికించుకున్న ధీశాలి ధర్మరాజు. ఒక్కరినే బ్రతికిస్తానని యక్షుడు చెపితే భీమార్జునులను బ్రతికించమని కోరుకోలేదు. పైగా ఏమంటాడు.. “ధర్మ ఏవ హతోహన్తి, ధర్మో రక్షతి రక్షితః, తస్మాద్ధర్మం న త్యజామి మా నో ధర్మో హతోవధీత్!” ధర్మాన్ని అణిచివేస్తే అది వానిని అణిచివేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే అది రక్షిస్తుంది. అందుచేత నేను ధర్మాన్ని త్యజించను. “అనృశంస్యం పరోధర్మః” అన్నారు కాబట్టి నేను “అనృశంస్య రూపమయిన ధర్మాన్ని” పాటించదలిచాను.. అనృశంస్యం అంటే భేదభావం లేకపోవడం.. అదే ఉత్తమ ధర్మం. అయ్యా… అందుకే.. నా తండ్రికి కుంతి, మాద్రి ఇరువురు భార్యలు.. అందులో తన తల్లి కుంతి సంతానంలో తాను జీవించి ఉన్నానని అలాగే పినతల్లి మాద్రి సంతానంలో పెద్దవాడయిన నకులుని బ్రతికించమని కోరిన ధర్మజ్ఞత ధర్మరాజుది. మరొక వరం కోరుకొమ్మంటే.. తమ్ములను బ్రతికించమని కాక బ్రాహ్మణుని అరణిని తెచ్చివ్వమని కోరాడు. ఇది “నీ కొరకు కోరడాన్ని ఆపివేయి.. ఇతరుల కొరకు కోరు” (Stop desiring for yourself, Desire for others) అన్న అతని నిస్వార్థచింతనకు, పరార్థచింతనకు తార్కాణంగా నిలుస్తుంది.
అజ్ఞాతవాసంలో కీచకుడు ద్రౌపదిని అవమానించిన సందర్భంలో ధర్మరాజు ప్రదర్శించిన సమయస్పూర్తి, మాటనేర్పు, ఓర్పూ ప్రశంసార్హాలు. అలాగే, దక్షిణ గోగ్రహణ సమయంలో సుశర్మతో జరిగిన యుద్ధంలో భీమునిచే సుశర్మ చిక్కినప్పుడు అతనిని నగరంలోకి తీసుకువస్తే అతడు తమను గుర్తించే ప్రమాదం ఉన్నది తద్వారా తమ అజ్ఞాతవాసం భంగం అవుతుందని అతనిని విడిపించి పంపించడం ధర్మరాజు సమయజ్ఞతకు, క్షమతకు, ఉదాత్తమైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఉత్తరగోగ్రహణం పిమ్మట బృహన్నల వల్ల గెలుపు సాధ్యమయిందని కంకుభట్టుగా విరటుని కొలువులో చేరిన ధర్మరాజు, కాదు ఉత్తరుని వల్లనని విరాటుడు వాదించుకోవడం.. ఆ వాదంలో అంతులేని కోపంతో విరాటుడు ఆడుతున్న పాచికలతో ధర్మజుని కొట్టడం జరుగుతుంది. నిజానికి అది విరాటుని దెబ్బకాదు. పాచికలాట ధర్మజుని కొట్టిన మూడవ దెబ్బగా చూడాలి. మొదటిది ద్రౌపది పరాభవం, రెండవది అడవుల పాలవడం కాగా మూడవది ఇది.
అరణ్యాజ్ఞాతవాసాలు పూర్తయ్యే నాటికి పాండవులు అవసరమైన అంగబలం, అర్థబలం, అస్త్రబలం సమకూర్చుకున్నారు. అయితే యుద్ధాలలో అవి మాత్రమే విజయాన్ని సాధిస్తాయా.. లేదు. కావలసింది ప్రజల సానుభూతి, పెద్దల ఆశీస్సులు. ప్రజల సానుభూతి అధికార మార్పిడిని సులువు చేస్తుంది. పెద్దల ఆశీస్సులు అనూహ్యమైన అవకాశాలను అందిస్తాయి. అందుకే రాయబారాలు నడిపాడు. తప్పంతా కౌరవులదే అనే విధంగా నడిపిన రాయబారాల లక్ష్యం నెరవేరింది. చెట్టు సారం పండులో వ్యక్తమైన విధంగా, వ్యక్తి సారం అతని మాటలో వ్యక్తమౌతుంది. సంజయ రాయబారంలో ధర్మరాజు చూపిన వ్యక్తిత్వ పరిణతి, వాగ్వైభవం అపారమైనది. ఆ సందర్భంలో సంజయునితో “ఈ వాదనలన్నీ ఎందుకు? మేము ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్ణయించేది మీరు కాదు..” అనడం, అతని దృఢత్వాన్ని(Assertiveness) తెలియచేస్తుంది. అలాగని Assertiveness అనేది Aggressiveness కాదనేది గుర్తించాలి.
శ్రీకృష్ణుడిని రాయబారానికి పంపేసమయంలో కూడా ధర్మరాజు చెప్పిన అంశాలు చాలా జాగ్రత్తగా చూడాలి. కృష్ణా! సభలో రాజకీయ లౌక్యాన్ని ప్రదర్శించు.. ధృతరాష్ట్రుడు న్యాయము మరచి కటువుగా లేదా అన్యాయముగా మాట్లాడినా నీవు మాత్రము ఓర్పును విడువక పెద్దలైన భీష్మాదులకు మనపై గౌరవము, గారవము హెచ్చునట్టుల మాట్లాడమని ప్రార్థించడం వెనుక.. ధర్మరాజు హృదయాన్ని చూడాలి. సంధికి దుర్యోధనుడు అంగీకరించడని తెలుసు. ధృతరాష్ట్రుడు కుమారుల పక్షాన్నే నిలుస్తాడనీ తెలుసు. వారు కౌరవ సభలో కృష్ణుడిని బాధాకరమైన మాటలతో రెచ్చగొట్టవచ్చుననీ ఊహించాడు. అయినా ఓర్పు వహించి.. సభాసదుల మనసులు, భీష్మద్రోణాదుల మనసులు గెలిచేట్లుగా మాట్లాడమని చెప్పడం కనిపిస్తుంది. కృష్ణుని రాయబారంలో ధర్మరాజు ఆశించిన ఫలితం ఇదే. ధర్మరాజు ఈ సన్నివేశంలో చెప్పిన ప్రతిమాట వెనుక యుద్ధము జరగాలి.. కాని తప్పు వారి పక్షాన ఉన్నట్లుగా నిరూపితం కావాలి అనే అంతర్గత భావన కనిపిస్తూనే ఉంటుంది.
యుద్ధానికి వెళ్ళే సమయంలో భీష్మద్రోణ కృపాచార్యులకు నమస్కరించి వారి మనసులను గెలవడం, వారి అనుమతి తీసుకోవడం, అతని దూరదృష్టికి తార్కాణం. ముందుగానే తాతను, గురువును భక్తి, వినయము అనే రెండు అస్త్రాలతో కట్టిపడవేసాడు. అలాగే కౌరవుల పక్షంలో ఉన్న శల్యుని తమకు సహాయకారిగా చేసుకోవడం ధర్మరాజులోని లోకజ్ఞతకు, వినయశీలతకు, రాజనీతిజ్ఞతకూ దర్పణంగా నిలుస్తాయి. ముఖ్యంగా పాండవులకు సహాయముగా వచ్చే శల్యుని దుర్యోధనుడు రాజనీతిని ఉపయోగించి కపటోపాయముతో తన పక్షంలో చేర్చుకుంటాడు. అలాంటి దుర్యోధనుని కపటాన్ని మించిన రాజకీయ చతురత నుపయోగించి ఆ శల్యునినే కర్ణుని వధకు పావుగా ఉపయోగించుకోవడంలో.. ధర్మజుని రాజనీతి ఉన్నతంగా కనిపిస్తుంది. అలాగే యుయుత్సుతుని కౌరవుల నుండి విడదీయడంలో కూడా ధర్మరాజు రాజనీతిజ్ఞత కనిపిస్తుంది.
ఇంతటి సమతామూర్తి కూడా సంయమతను కోల్పోయిన సన్నివేశం కర్ణపర్వంలో కనిపిస్తుంది. కర్ణపర్వంలో, రెండవనాటి యుద్ధంలో, కర్ణుని దెబ్బలకు తాళలేక కుటీరానికి వెళ్ళిన సమయంలో అతనిని పలకరించేందుకు వెళ్ళిన కృష్ణార్జునులను వారు కర్ణుని చంపి వచ్చారనుకొని ఆదరించాడు, ఆనందించాడు. కాని, కర్ణుడు బ్రతికి యున్నాడని తెలిసిన వెంటనే అర్జునుని నిందించడం.. సమతను కోల్పోయిన అతని మానసిక స్థితికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే కర్ణుని చంపివచ్చిన కృష్ణార్జునులను కౌగిలించి.. “నా కంటికి నిదుర వచ్చు నేడు నీరజాక్ష” అనడం కర్ణుని పరాక్రమానికి ఎంతగా భయపడ్డాడో చెపుతుంది.
నీటి మడుగులో దాగిన దుర్యోధనుని వెలికి రప్పించడంలో ధర్మరాజు వాడిన భాష, పలుకు చతురిమ అపూర్వమైనవి. మడుగునుండి వెలికి వచ్చిన దుర్యోధనునితో “నీకు ఇష్టమైన ఆయుధంతో మాలో ఒక్కనితో యుద్ధం చేయి.. గెలిస్తే ఈ రాజ్యం ఏలుకో” అంటాడు. నిజానికి ఇది పరిణతి చెందిన వ్యక్తిత్వానికి ఉదాహరణగా కనిపిస్తుంది… కాని దుర్యోధనునితో గదాయుద్ధం చేయగలిగిన వారు తన బలగంలో లేరు. అతడు భీముని కాక మరొకనిని గదాయుద్ధానికి ఆహ్వానిస్తే.. “సాధించిన విజయం నిరర్ధక విజయ మౌతుంది.” అలాంటి అవకాశాన్ని దుర్యోధనునికి ఇవ్వడం ఎంత ప్రమాదకరమో తెలిసిన కృష్ణుడు భీముని ప్రేరేపించడం, దుర్యోధనుడు కూడా భీమునే కోరుకోవడం, భీమ దుర్యోధనుల గదాయుద్ధంలో కృష్ణుని సంజ్ఞతో భీముడు దుర్యోధనుని తొడలు విరగగొట్టడం.. తరువాతి పరిణామాలు. బహుశా.. మొత్తం భారతంలో కృష్ణుడు ధర్మరాజును కోపగించిన సన్నివేశం ఇదే అనుకుంటాను.
స్పర్ధలు కలిగినప్పుడు, కక్షలు కార్పణ్యాలు పెరిగినప్పుడు దృష్టి మొత్తం విజయసాధనపైనే ఉంటుంది. కాని తదుపరి పరిణామాల నేపథ్యంలో పశ్చాత్తాపం దహించివేస్తుంది. మహాభారత యుద్ధంలో ధర్మరాజు విజయసాధనకై అన్ని ప్రయత్నాలూ చేసాడు.. తన ప్రజ్ఞలనన్నింటినీ వినియోగించాడు. విజయం సాధించాడు.. అయితే ఆప్తుల మరణం, జరిగిన అపార ప్రాణనష్టం, అనంతమైన ధననష్టం అతనిని కలచివేసాయి. “మరణాంతాని వైరాని” అన్న శ్రీరాముని సూక్తి ధర్మరాజులో జాగృతమయింది. విజయం సంతోషానికన్నా దుఃఖాన్నే మిగిల్చింది. ముఖ్యంగా కర్ణుడు తన సోదరుడని తెలిసాక నిర్వేదచిత్తుడై సర్వసంగ పరిత్యాగానికి సిద్ధమయ్యాడు. నిజానికి అనంతకాలంలో మనిషి జీవితకాలం ఎంత.. అందులో అపార ధననష్టంతో, జననష్టంతో తాను సాధించే నేల ఎంత.. ఆ సంపద విలువ ఎంత? అందుకే, యుద్ధం తదుపరి జీర్ణించుకోలేక పోయిన ఆప్తుల మరణం అతనిలో కలిగించిన భావనలలో ముఖ్యమైనది.. “నాశనం కావలసిన చివరి శత్రువు మృత్యువే” అన్న సత్యమే.
సామాన్య మనః ప్రవృత్తి కలిగిన ఎవరైనా ఇంత గొప్ప విజయం సాధించడంతో ఎంతో పొంగిపోయేవారు. ఎంతైనా అహంకారం పెంచుకునేవారు. వైరిపక్షులలో మిగిలిపోయిన వారిని అవమానించేవారు. కాని ఉదాత్త మనస్వియైన ధర్మరాజు అందుకు భిన్నంగా వ్యవహరించాడు. తమకు కలిగిన అన్ని కష్టాలకు మూలకారణమైన ధృతరాష్ట్రునిపై కోపం చూపకుండా యుద్ధానంతరం ముందుగా గాంధారీ, ధృతరాష్ట్రులను సందర్శించి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులను తీసుకున్నాడు. వారికి పెద్దరికాన్ని ఇచ్చి గౌరవించడం ధర్మరాజు వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలిపింది. రాజ్యం అరాచకం కావద్దని ఆత్మీయులందరూ ఓదార్చాక కొంత సాంత్వన బొంది పట్టాభిషిక్తు డయ్యాడు. ధృతరాష్ట్రుని కనుసన్నలలో రాజ్యాన్ని పాలించాడు. ఎవరినీ విస్మరించకుండా.. వారివారి అర్హతలను, వయసునూ, విజ్ఞతలనూ, సమర్ధతలనూ, అనుభవాలను గుర్తించి తగిన రీతిగా బాధ్యతలను అప్పగించాడు. భీష్ముని వల్ల రాజ్యపాలన, ధర్మసూక్ష్మాలకు సంబంధించిన పలు అంశాలను అవగాహన చేసుకున్నాడు.
విజ్ఞానాత్మకంగా ఎంతో ఎత్తుకు ఎదిగినా భీష్మద్రోణాదుల మరణానికి తానే పరోక్షకారణమనే భావనలో బాధపడ్డాడు. బంధుమిత్రుల మరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దానికి ప్రాయశ్చిత్తంగా నిర్వహించిన అశ్వమేధయాగంలో అశ్వరక్షకుడుగా వెళ్ళిన అర్జునునితో “చంపకుమీ రాజుల ననుకంపాతిశయంబు మెఱయగా నడువుము” అని చెప్పడం అతని దయాగుణాన్ని తెలుపుతుంది.
చివరగా పరీక్షిత్తుని పట్టాభిషిక్తుని చేసి తమ్ములు, ద్రౌపది వెంటరాగా మహాప్రస్థానం సాగించాడు. వారిని అనుసరించిన ఒక కుక్కకు స్వర్గ ప్రవేశం లేదంటే తానూ స్వర్గానికి రానన్నాడు. తమననుసరించిన వారు ఎలాంటివారయినా వారిని సమానంగా గౌరవించడం సమతా దృష్టికే గౌరవాన్నిస్తుంది.
ధర్మరాజు తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూచాడు. జయాపజయాలను, మానావమానాలను చవిచూచాడు. ఎప్పుడూ పొంగిపోలేదు.. క్రుంగిపోలేదు. ప్రతి విజయాన్నీ తనకు మరొకమెట్టు ఎక్కేందుకు ప్రేరణగా తీసుకున్నాడు. అలాగే ప్రతి అపజయాన్నీ పరిణత దృష్టితో చూచాడు.. ఒక గుణపాఠంగా తీసుకున్నాడు. తనలోని ఉదాత్తతను ఆత్మీయులతో, ఆర్తులతో పంచుకున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ప్రలోభాలు పలకరించినా, ఎన్ని ఒత్తిళ్ళు ఎదుర్కోవలసి వచ్చినా తన జీవన విలువలను విడిచిపెట్టని అపూర్వమైన వ్యక్తిత్వం ధర్మరాజుది. ఒక విధానానికి కట్టుబడి ఆ విధానంలోనే వ్యూహాత్మకంగా విజయాన్ని సాధించాడు. విలువలతో కూడిన వ్యక్తిత్వం, వ్యక్తిని చిరంజీవిగా నిలబెడుతుంది. దీనికి నిలువెత్తు ఉదాహరణ ధర్మరాజు మాత్రమే.
వ్యక్తి స్వార్ధాన్ని అదుపులో ఉంచేది, వివిధ వ్యక్తుల స్వార్థాల మధ్య సమన్వయాన్ని సాధించేది, సుఖ శాంతులను పెంచిపోషించేది, వ్యక్తి ముక్తికి సోపానంగా నిలిచేది.. ధర్మం ఒక్కటే.. దీని ననుసరించి సాధించిన అర్థకామాలే గౌరవాన్నిస్తాయి.. ముక్తినీ ప్రసాదిస్తాయని ఆచరణలో చూపిన మహోన్నత వ్యక్తిత్వం ధర్మరాజుది. నిజానికి భారత జాతి తత్వమే శాంతి.. చక్రవర్తి మొదలుకొని సామాన్యుడి వరకూ ధర్మబద్ధ జీవితం సముపార్జించుకోవడం వల్లనే సకల శేయస్సులూ జాతికి అందుతాయి.. అనేదే మహాభారతం జాతికి అందిస్తున్న సందేశంగా భావించాలి. ఇదే ధర్మరాజు పాత్ర సమాజానికి అందిస్తున్న సార్వకాలిక, సర్వ జనీన సందేశంగా భావించాలి.
ధర్మరాజునకు ఇంద్రప్రస్థ భోగములు పెద్దగా మనసుకు తృప్తినిచ్చి యుండవు. ఏనాటికైనా హస్తినను వశపరచుకొని మహాభారత చక్రవర్తిగా చరిత్రమున నిలువవలె నన్న ఆకాంక్ష లోలోన ఉన్నదేమో తెలియదు. అయితే అలా అనుకునేందుకు మాత్రం అవకాశం ఉన్నది. అయితే ఎన్ని అవరోధాలు ఎదురైనా ధర్మమార్గంలో ఉన్నతుడిని కావాలనే కోరికతోనే జీవించిన విధానం కనిపిస్తుంది..
~
ఉపసంహారం..
ధర్మరాజు ఎంతటి ఉన్నతుడైనా, ఉదాత్తచరిత్ర కలిగిన వాడైనా కాని అతని ద్యూత వ్యసనం ఆయనకు మాయని మచ్చగానే పరిగణించాలి. ధృతరాష్ట్రుని మాటకాదనలేక జూదానికి సిద్ధపడినా ఒడ్డే పందెంలో సంయమనత పాటించకపోవడం, ఎప్పుడు ఆగాలో తెలియక ఒళ్ళు మరచి భార్యను పందెంలో పెట్టడం సమర్ధనీయం అనిపించదు.
అయితే ఆ బలహీనతలు ధర్మమూర్తిగా చెప్పబడిన ధర్మరాజులో వ్యాసులు ఎందుకు ఆపాదించారు.. ఇది ఒక ప్రశ్న..
తన ఇతిహాసంలో మానవ జీవితమును, వాని బలహీనతలను చెప్పాలి అని వ్యాసులవారు భావించినప్పుడు, ఆ బలహీనతలను సామాన్య పాత్రలయందు ఆపాదించి చెప్పడం వల్ల ఇచ్చిన సందేశం బలంగా సమాజంలోనికి పోదు. అందుకే మహోన్నత సంస్కారం కలిగిన వానిగా, ధర్మమూర్తిగా, వివేచనా శీలిగా, లోకజ్ఞునిగా కనిపిస్తున్న ధర్మరాజు పాత్రలో ఆ బలహీనతలను చెప్పి వాటి ప్రభావ తీవ్రత ఎలా ఉంటుందో చెప్పడం వల్ల ప్రయోజనం సిద్ధిస్తుంది.
మరొక ప్రశ్న? భీష్మద్రోణాదులు తమ మరణ రహస్యాన్ని ధర్మరాజుకు ఎందుకు చెప్పారు? భీష్ముడు మొదటి నుండీ కౌరవ రాజ్యానికి ధర్మకర్తగా ఉన్నాడు. అతను దుర్యోధనుని ప్రవర్తనను పరిశీలిస్తున్నాడు. అంతటి అహంభావి, కలి అంశచే జనించిన దుర్యోధనుని చేతిలో రాజ్యపాలన పెడితే జరిగే పరిణామాలను అంచనా వేసాడు. దానికి తోడు అతని చుట్టూ ఉన్న పరివారమూ.. అలాంటి వారే. మరి గత్యంతరం ఏమిటి? దానికి సమాధానమే ధర్మజుడు. అతని ప్రవర్తననూ పరిశీలించాడు. అతనే భావి సామ్రాజ్యాధినేతగా సరిపోతాడని భావించాడు. సమయం కోసం ఎదురుచూచాడు. యుద్ధ సమయంలో తన మరణ రహస్యాన్ని చెప్పాడు.
మహాభారతాన్ని ఆమూలాగ్రం పరిశీలిస్తే.. ధర్మరాజులో.. ఈ క్రింది లక్షణాలను కొన్నింటిని మనం గ్రహించవచ్చు.
అతనిలో నిజాయితీ, ఆశావాదం, వైరాగ్యము, స్పష్టత గలిగిన సంకల్ప శుద్ధి, ధర్మపాలన, సత్య నిష్ఠ, ప్రజారంజక పాలన, సరైన సమయంలో సరైన సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలగడం, చారుచక్షుత్వము, లౌక్యంతో కూడిన స్వయం ప్రేరణ, గురుభక్తి, వాగ్నైపుణ్యము, వివేకము, దూరదృష్టి, క్షాత్రము, ఓర్పు, సమత, సమయజ్ఞత, సహకరించడంలో రాజనీతిజ్ఞత, పరేంగితజ్ఞత, కార్య నిర్వహణా దక్షత, సోదరులపట్ల వాత్సల్యము, మోక్షదృష్టి లాంటి లక్షణాలు ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు విజయ సాధనా రతులైన ధీమంతులు సంతరించుకుంటే జాతి ఉన్నతీకరించబడుతుంది.
అరణ్యవాస సమయంలో ఎన్ని ఆశ్రమాలు దర్శించినా, ఎన్ని బోధలను విన్నా ధర్మరాజు ‘మెత్తని పులి’ గానే మిగిలిపోయాడు. అలాగే చివరి క్షణంలోనూ ధర్మరాజుకు తనవారిపై మమకారం తగ్గలేదు. ఇలాంటి భావనల నేపథ్యంలో, కేవల లౌకిక దృష్టితో ధర్మరాజు పాత్రను చూస్తే.. అతను సాధారణ స్థాయి మానవునిగానే కనిపిస్తాడు. కాని అతనిని ఒక కారణజన్మునిగా చూచిన వేళ మాత్రమే ఆ పాత్రలోని ఔచిత్యాన్ని అవగాహన చేసుకోగలము.
శుభం.. స్వస్తి..
ఉపయుక్త గ్రంథాలు..
- శ్రీమదాంధ్ర మహాభారతం.. కవిత్రయ రచన
- శ్రీ మహాభారత రహస్యము.. శ్రీ శిష్ట్లా సూర్యనారాయణ శాస్త్రి గారు
- మహాభారత తత్త్వ కథనం.. శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
- మహాభారత వైజయంతి.. ఇందులో ధర్మరాజు పాత్ర గురించి వ్రాసిన డా. అప్పజోడు వేంకట సుబ్బయ్య గారి రచన
- మహాభారత చరిత్రము.. శ్రీ పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
- శ్రీ మదాంధ్ర మహాభారతం – ధర్మరాజ పాత్ర.. సిద్ధాంత గ్రంథం – డా. కొల్లూరి నారాయణ రావు గారు
ఈ గ్రంథ రచయితల కందరికీ కృతజ్ఞతా పూర్వక నమస్సులు.
పాలకుర్తి రామమూర్తి సింగరేణి కాలరీస్‌లో పని చేసి ఫైనాన్స్ అండ్ ఎకౌంట్స్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. ‘భారతీ స్తవము’, ‘వేద సంస్కృతి – వివాహ సంస్కారోద్దేశ్యము’, ‘శ్రీ సరస్వతీ సన్నిధానము’, ‘గంగావతరణం’ వంటి సంప్రదాయ పద్య కావ్యాలతో పాటుగా ‘వ్యక్తిత్వం విజయపథం’ వంటి వ్యక్తిత్వ వికాస గ్రంథాలతో మొత్తం 17 పుస్తకాలు రచించారు. ఎన్నో వ్యాసాలు వ్రాశారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. 25 టెలీఫిల్మ్లలో పాల్గొన్నారు. యువతరానికి మేధోపరమైన, భావోద్వేగ నైపుణ్యాలను అందించడంలో ఆసక్తి.