Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారతంలో విరాటుడు – ఆధునిక ప్రపంచ రాజకీయాలు

[శ్రీ పాలకుర్తి రామమూర్తి రచించిన ‘మహాభారతంలో విరాటుడు – ఆధునిక ప్రపంచ రాజకీయాలు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

ప్రస్తుత రాజస్థాన్ రాష్ట్రంలో, జయపూర్ ప్రాంతంలోని దేశాన్ని ఒకప్పుడు మత్స్యదేశంగా పిలిచేవారని చెపుతారు. మహాభారతం మత్స్యరాజ్యానికి సమున్నత స్థానాన్ని కల్పించింది.. పాండవులు అజ్ఞాత వాసానికి అనువైనదిగా దానిని ఎన్నుకోవడం ఒకటి కాగా విరాటరాజు కుమార్తె ఉత్తర వల్ల పాండవ వంశం నిలవడం రెండవదిగా చెప్పుకోవచ్చు.

మత్స్యదేశాన్ని విరాటుడనే రాజు పాలించేవాడు. అతని సోదరులు పదిమందికి తోడుగా అతని భార్య సుధేష్ణకు పెత్తల్లి కుమారులైన కీచకులు నూటారు మంది రక్షణ కవచంగా, అంతర్గత శక్తికేంద్రంగా (Shadow Power Structure) నిలిచి యుండడంతో శత్రుదుర్నిరీక్షుడై రాజ్యాన్ని పాలిస్తున్నాడు, విరాటుడు.  జాగ్రత్తగా గమనిస్తే విరాటుని పాత్రలో అమాయకత్వం, ఆత్మీయత, మమకారం కలగలిపిన విధానం కనిపిస్తుంది. తాను స్వతహాగా మంచివాడే కాని బలం తక్కువ. ఇతరుల బలంపై ఆధారపడి రాజ్యాన్ని నడిపే విరాటుడు వారి అభిప్రాయాలను గౌరవిస్తూ తన బావమరుదుల అన్యాయాలను సహిస్తూ పాలన కొనసాగిస్తున్నాడు. బలవంతులైన బావమరుదులను ఎదిరించలేడు, అలాగని అన్యాయాలను సైరించలేడు.. ఇదీ అతని సంకటస్థితి. దానికి తోడుగా తనకు పొరుగుననున్న త్రిగర్త రాజ్యాధిపతి సుశర్మ అనేవానితో విరాటునికి పూర్వంనుండి వైరం ఉన్నది. అయితే కీచకుల బలానికి భయపడిన సుశర్మ సింహబలుని మరణం వరకూ తగ్గియున్నాడు.

అరణ్యవాస దీక్ష అనంతరం పాండవులు అజ్ఞాతవాసాన్ని గడిపేందుకు విరాటుని పట్టణాన్ని ఎన్నుకున్నారు. దానికి కారణం.. అంతర్గతంగా రాజకీయ బలహీనతలు ఉన్న రాజ్యంలో తమ ఉనికికి భద్రత ఉంటుంది. శత్రువులకు అనుమానం తక్కువగా ఉంటుంది. ఇది ధర్మరాజు దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆశ్రయం కోరివచ్చిన పాండవులను అయిదుగురినీ అయా విభాగాలలో ఉన్నత పదవులలో నియమించాడు, విరాటుడు. ద్రౌపది సైరంధ్రి పేరుతో సుధేష్ణ వద్ద చేరింది. ద్రౌపది సౌందర్యాన్ని చూచి కామించిన కీచకుడైన సింహబలుడు ఆమెను చెరబట్టే ప్రయత్నం చేయడం, అతనిని రహస్యంగా భీముడు అతని సోదరులతో సహా సంహరించడం జరిగింది.

హస్తినలో దుర్యోధనుడు పాండవుల అజ్ఞాత వాసాన్ని భగ్నం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాడు. కీచకుని మరణం విన్న సుశర్మ దుర్యోధనుని వద్దకు వెళ్ళి, అది భీముని పనే అయి ఉంటుందని, మరెవ్వరికీ సాధ్యపడదని చెపుతాడు. దుర్యోధనుని  మనసులో చక్కని ప్రణాళిక రూపు దిద్దుకున్నది. విరాటుని గో సంపద చాలా పెద్దది. అందుకే సుశర్మను తన సైన్యంతో మత్స్యదేశపు దక్షిణాన ఉన్న గో సంపదను అపహరించమని చెపుతాడు. దీనిని దాదాపుగా సుశర్మ ద్వారా దుర్యోధనుడు సాగించిన ఒక ప్రతినిధి యుద్ధంగా (Proxy War) చూడవచ్చు. తాను మరింత పెద్ద సైన్యంతో తెల్లవారి ఉత్తర ప్రాంతంలోని గోవులను అపహరించేందుకు సన్నద్ధమౌతాడు. తదనుగుణంగా సుశర్మ దక్షిణం వైపు గోవులను పట్టుకుంటాడు. దుర్యోధనుని ప్రణాళికలో.. ఒకవేళ పాండవులు మత్స్యదేశంలో ఉంటే తప్పక విరాటునికి సహాయ పడతారు.. దానితో వారిని గుర్తించి వారితో తిరిగి పన్నెండేండ్ల అరణ్యవాసమూ, ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేయించవచ్చు. ఒకవేళ పాండవులు అక్కడ లేకపోతే పలునాళ్ళుగా కీచకుని రక్షణలో ఉన్న విరాటుని గో సంపదను పూర్తిగా అపహరించవచ్చు. అవసరమైతే అతనిని తమకు సామంతునిగా ప్రకటించనూ వచ్చు. ఏ విధంగా చూచినా తనకది లాభదాయకమే.

అనుకున్న ప్రణాళిక ప్రకారం సుశర్మ అపారమైన సైన్యంతో వెళ్ళి మత్స్య నగర దక్షిణ దిక్కున నున్న గో సంపదను పట్టుకున్నాడు. విరాటుడు కూడా సైన్యంతో సన్నద్ధుడై బయలుదేరుతూ.. కంకుభట్టు పేరుతో తన ఆస్థానంలో ఉన్న ధర్మరాజు సలహా మేరకు భీమ, నకుల, సహదేవులను కూడా తనతో తీసుకువెళ్ళాడు. ఆ యుద్ధంలో ముందుగా విరాటుడు సుశర్మకు పట్టుబడడం.. పిమ్మట ధర్మరాజు సూచనమేరకు నకుల సహదేవులు చక్ర రక్షకులుగా భీముడు యుద్ధం చేసి విరాటుని విడిపించడమే కాక సుశర్మను బంధించి రథానికి కట్టి తెస్తాడు. చివరగా ధర్మరాజు అభ్యర్థనపై విరాటుడు సుశర్మను విడిచిపెట్టి పంపిస్తాడు.

సుశర్మను విడిచి పంపడంలో ధర్మరాజు రాజకీయ పరిణతి, సంక్షోభ నివారణా నైపుణ్యం, దూరదృష్టి కనిపిస్తుంది. యుద్ధసమయంలో పాండవులను సుశర్మ సరిగా పోల్చుకోలేకపోయాడు. తనను బంధించిన వేళ వారి పరాక్రమంపై తనకు అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. మత్స్యనగరానికి వెళితే సుశర్మకు ఆలోచించు కునేందుకు తగినంత సమయం లభిస్తుంది. తమను గుర్తించే అవకాశం ఉన్నది. దానివల్ల తమకు అపరిమిత నష్టం వాటిల్లుతుంది. అలాగని సుశర్మను సంహరించినా ఆ అనుమానం నిజమని తెలిసిపోతుంది. అందుకే విరటునితో చెప్పి క్షమాభిక్ష పెట్టినట్లుగా విడిచి పెట్టిస్తాడు.

అనుకున్న ప్రకారం తెల్లవారి ఉదయమే ఉత్తర దిక్కున ఉన్న గో సంపదను భీష్మద్రోణ కర్ణాదులతో వెళ్ళి దుర్యోధనుడు పట్టుకున్నాడు. బృహన్నలగా విరాట రాజ్యంలో ఉన్న అర్జునుడు ఉత్తరుని సారథిగా చేసుకొని కౌరవ సైన్యాన్ని ఓడించి గోవులను విడిపించడం జరుగుతుంది.

విరాటుడు తనకు శత్రుజయాన్ని సాధించిపెట్టిన పాండవులను ధనాదులతో సన్మానించాడు. అంతలో ఉత్తరుడు బృహన్నల సారథిగా కౌరవసైన్యాన్ని జయించి వస్తున్నాడనే వార్తను వింటాడు. తన కుమారుని విజయాన్ని రాజ్యంలో చాటింపు వేయమని భటులకు చెపుతాడు, విరాటుడు. కాదు అది బృహన్నల విజయంగా చాటింపు వేయించమని కంకుభట్టు (ధర్మరాజు) చెపుతాడు. నా కుమారుని విజయాన్ని పేడివాని విజయంగా అభివర్ణిస్తావా అనే కోపంతో విరాటుడు, చేతిలోని పాచికలతో కొట్టడం జరుగుతుంది. ఇంతలో ఉత్తరుడు వచ్చి “ఈ మహానుభావుని విషయంలో తొందరపడ్డావని” తండ్రిని మందలించడం, విరాటుడు ధర్మరాజును క్షమాపణను కోరడం జరుగుతుంది.

తెల్లవారి సభలో విరాటుని సింహాసనంపై కంకుభట్టు కూర్చుంటాడు. అది చూచిన విరాటుడు “నాతో జూదమాడడానిని సభలోకి అనుమతించిన నా సింహాసనాన్నే ఎక్కావే” అంటూ కోపగిస్తాడు.. అది విన్న అర్జునుడు “ఈతడు మహేంద్రుని సింహాసనమైనా ఎక్కే సమర్థత కలిగిన వాడు.. ఈ చిఱుత గద్దియకుం దగడే నరేశ్వరా” అంటూ తమ తమ పరిచయాలను చేస్తాడు. చివరగా అర్జునుని కుమారుడు అభిమన్యునికి ఉత్తరను ఇచ్చి వివాహం చేయడం విరాటపర్వంలో కనిపిస్తుంది.

చివరగా కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుని చేతిలో విరాటుడు నిహతుడవడం జరుగుతుంది.

చారిత్రిక ఇతిహాసాలలోనే కాక ఆధునిక ప్రపంచ రాజకీయాలలోనూ వ్యూహాత్మక ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. మహాభారతంలో మత్స్యదేశం పాండవుల అజ్ఞాతవాసానికి అనుకూల కేంద్రంగా, అలాగే కౌరవుల ఉత్తర దక్షిణ గోగ్రహణాలకు వేదిక అయినట్లుగానే, నేటి ప్రపంచంలోనూ భౌగోళికంగా కీలకమైన చిన్న లేదా మధ్యస్థ రాజ్యాలు అగ్రరాజ్యాల రాజకీయ – సైనిక ఆసక్తులకు కేంద్రాలవుతున్నాయి. దక్షిణాసియాలో బంగ్లాదేశ్ వంటి దేశాలపై అమెరికా, చైనా తదితర దేశాలు చూపుతున్న వ్యూహాత్మక ఆసక్తిని ఈ కోణంలో పరిశీలించవచ్చు..

గ్రీకు చరిత్రకారుడు థుసిడిడెస్ (Thucydides) “ఒక కొత్త శక్తి వేగంగా ఎదుగుతున్నప్పుడు, అప్పటికే ఆధిపత్యంలో ఉన్న శక్తి భయపడుతుంది”. ఆ భయం చివరికి ఘర్షణలకు, యుద్ధాలకు దారితీస్తుంది, అంటాడు. అరణ్యవాసం తర్వాత పాండవులు తిరిగి శక్తిని కూడగట్టుకుంటున్నారు. విరాటరాజ్యం వారికి వ్యూహాత్మక కేంద్రంగా కనిపించింది. అదే సమయంలో దుర్యోధనుడు దానిని ప్రమాద సంకేతంగా చూశాడు. పాండవులను బయటకు లాగాలనుకున్నాడు. వారి ఎదుగుదలను ప్రారంభ దశలోనే అణచాలని చూశాడు. వ్యూహాత్మకంగా కదిలాడు. ఫలితంగా విరాటునితో బహునాళ్ళుగా శత్రుభావనతో ఉన్న సుశర్మను ప్రోత్సహించాడు. సుశర్మ ఇన్ని నాళ్ళుగా కీచకునికి భయపడి ఒదిగియున్నాడు. ఇప్పుడు బలమైన కౌరవ సైన్య సహాయం అయాచితంగా లభించింది. కౌరవ వ్యూహంలో భాగమయ్యాడు.

ఎదుగుతున్న శక్తి, (పాండవులు) స్థిరాధిపత్య శక్తిలో (కౌరవులు) భయాన్ని కలిగించడం సహజ పరిణామం. ఆ ఉచ్చులో పడడం వల్ల పావులుగా మారిన శక్తులు (సుశర్మ) నశిస్తాయి. ఈ సంఘటనను జాగ్రత్తగా లోతుగా చూస్తే రాజకీయాల శాశ్వత స్వభావం అవగతమౌతుంది. నిజానికి ఇతిహాసాలు గతాన్ని జ్ఞాపకం చేసుకునే వ్రాతలు మాత్రమే కావు.. మానవ సమాజం పదే పదే పునరావృతం చేసే రాజకీయ–మానసిక వైవిధ్యాల గురించి చెపుతూ.. సరైన మార్గాన్ని చూపే అక్షర, అక్షయ్య గ్రంథాలు. ఈ నేపథ్యంలో మహాభారతం కేవలం ధర్మకావ్యం కాదు.. అది మానవ స్వభావాలను, అధికారం యొక్క విశ్వరూపాన్ని, అంతర్గత భయాదుల వల్ల ఏర్పడే ఫలితాలను, వ్యూహప్రతివ్యూహాలను, అవసరమైన చోట శత్రుత్వ, మిత్రుత్వాలను, ఆధిపత్య పోరాటాల వంటి శాశ్వత రాజకీయ సామాజిక సూత్రాలను ప్రతిబింబించే గ్రంథమని చెప్పవచ్చు. అందులో మత్స్యనగరాన్ని, విరాటుని పాత్రను సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నం చేసాను.

Exit mobile version