[శ్రీ బి.ఆర్.కె.వి. భాస్కర రావు గారు వ్రాసిన ‘మహానటి..’ అనే కథని అందిస్తున్నాము.]
ముందరి రోజు రాత్రే విషయం తెలియడంతో రాత్రంతా రకరకాల ఆలోచనలతో నిద్రపట్టలేదు కనకానికి. ఎప్పుడు తెల్లవారుతుందానీ ఎదురుచూసింది. రాత్రుళ్ళు నిద్రలేకపోవడం కనకానికి కొత్తేమీ కాదు. గతంలో ముడేసి షిఫ్టులు షూటింగ్ చేసిన సందర్భాలు ఎన్నో..
ఒకే ఒక్క నిట్టరాటు మధ్యలో పాతి పూరి గుడిసెగా వేసి చుట్టూ కొబ్బరి ఆకుల దడితో ఉన్న ఇంటిలో చాలా కాలం నుంచి కాలం వెళ్లతీస్తోంది అలనాటి నటి కనకం.
ఒకప్పుడు కిచెన్, రీడింగ్ రూం, నాలుగు బెడ్రూంలు, రెండు విజిటర్స్ హాల్స్ ఉన్న ఇంట్లో మహారాణిలా గడిపిన కనకంకి తానున్న పూరి పాకే అన్ని అయ్యింది నేడు.
పెద్ద పెద్ద హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన కనకం మంచి పొజిషన్లో ఉన్నప్పుడే పెళ్ళి చేసుకుంది ఓ డైరెక్టర్ని. పది సినిమాల వరకు అతగాడు డైరెక్ట్ చేసిన సినిమాలు హిట్టు అయ్యాయి. కనకం కూడా భర్త సినిమాలతో పాటు బయట సినిమాలు కూడా చేయడంతో మూడు పువ్వులు ఆరు కాయల లాగా సంపాదించడం మొదలెట్టారు ఇద్దరూ.
తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్టు వరుసగా రెండు సినిమాలు భర్త చేసినవి ఫ్లాప్ కావడంతో భర్తకు అవకాశాలు తగ్గాయి. ఆ రెండిటీలోనూ తానే హీరోయిన్గా నటించడం వల్ల ఆ ప్రభావం కనకం కెరీర్ మీద పడి తనకు కూడా అవకాశాలు పల్చబడ్డాయి.
దాంతో భర్త వద్దన్నా వినకుండా ఉన్న డబ్బంతా పెట్టి స్వంతం గానే కొత్త సినిమా మొదలెట్టాడు.
భార్యాభర్తలిద్దరూ కెరీర్ పరంగా వెనుకపడి ఉండటంతో బయ్యర్లు తక్కువ రేటుకే సినిమా పంపిణీ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా కూడా వీళ్ళ అంచనాలను తల్లకిందులు చేస్తూ డిజాస్టర్ అయ్యింది.
కనకం భర్త బాధను మర్చిపోవడానికి మద్యానికి బానిస అయ్యాడు. అప్పటికే ఓ మగబిడ్డ తల్లి అయ్యింది కనకం.
సక్సెస్ మీదున్న మక్కువతో ఈ సారి ఎలాగైనా హిట్ చేయాలనే తాపత్రయంతో ఫైనాన్సర్ దగ్గర ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి వేరే డైరెక్టర్‌ను పెట్టి తాను నిర్మాతగా మారి కనకం నెత్తి నోరు బాదుకుని చెప్పినా వినకుండా మరో సినిమా తీశాడు భర్త.
అది కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో కనకం భర్త పత్తాలేకుండా పారిపోయాడు. పాపం కనకం ఒంటరిగా సమస్యలతో పోరాడి స్వంత ఇంటిని వదిలేసి అద్దె ఇంట్లోకి వెళ్లిపోయింది .
గతంలో తనతో సినిమాలు చేసిన నిర్మాతల కాళ్ళు వేళ్ళు పట్టుకుంటే అప్పుడప్పుడు తల్లి వేషాలు, గెస్ట్ పాత్రలు ఇచ్చేవారు. కొడుకుని పెంచుకుంటూ ఇల్లు గడిపేది. తండ్రి భయం లేని కనకం కొడుకు కూడా చదువు మానేసి తల్లి సంపాదన మరిగి చెడుసావసాలు పట్టి పూర్తిగా నాశనమై పోయాడు. ఒక్కోసారి తల్లి తన దురలవాట్లకు సరిపడ డబ్బు ఇవ్వకపోతే కొట్టేవాడు.
ఎప్పటికైనా చిన్న ఇల్లు వేసుకోవాలని కొడుక్కి తెలవకుండా దాచిన డబ్బును ఓరోజు రాత్రి వేళ దొంగిలించి పారిపోయాడు. ఊహించని పరిణామానికి కుంగిపోయిన కనకం చాన్నాళ్ళ మంచం పట్టి లేవలేదు.
ఇల్లు అద్దె కట్టలేదని ఖాళీ చేయించాడు ఓనర్.
దిక్కులేని కనకం ఊరుచివర ఉన్న పోరంబోకు స్థలంలో చిన్న గుడిసెలో ఉండి సినిమావాళ్ళు ఇస్తున్న పింఛనుతో ఓ పూట తిని మరోపూట పస్తుండి బ్రతుకుతోంది.. అది కూడా నెలలో మొదటి పక్షంలో మాత్రమే, రెండో పక్షంలో రెండు రోజులకు ఒకసారి మాత్రమే అర్ధాకలితో తింటుంది.
ఆమె భోజనం చేసి రెండు రోజులు అయ్యింది.
తన అదృష్టం కొద్ది పెద్ద హీరో పేద కళాకారులకు సన్మానం చేసే క్రమంలో తనకు సన్మానం చేస్తానని ముందరి రోజు డ్రైవర్ వచ్చి చెప్పేడు. అది కూడా ఎలాగంటే “మీరేనా కనకంగారంటే”అని అడిగి “మీ అడ్రస్ వెతకడానికి తల ప్రాణం తోకకి వచ్చింది. అయినా ఇంత మూల ఉన్నవాళ్లకు సన్మానాలు ఎందుకో? స్టేజ్ ఎక్కులోపు చనిపోయేలా ఉంది ఈవిడ” అని కనకానికి వినపడేలా అనేసి మరల కొంచెం గట్టిగా “రేపు సాయంత్రం నాలుగింటికి కారు తీసుకుని వస్తాను. మా హీరోగారు మీకు సన్మానం చేసి డబ్బు ఇస్తారట. అవి తీసుకుని మీరు ఝామ్ ఝామ్గా బతకొచ్చు. మీ బంధువులక్కూడా కబురు పెట్టుకోమన్నారు మా సారు. మీరు నేనొచ్చే సమయానికి రెడీగా ఉండండి. లేటైతే ఈ గబ్బు వాసన పీల్చుతూ కూర్చోలేను.” అనేసి అతను కనకం సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడు.
బాధొచ్చింది కనకానికి. అహం అడ్డొచ్చి వెళ్ళడం మానేద్దామనుకుంది కాని ఆకలి గుర్తొచ్చింది. కనీసం తాను ఒప్పుకుంటానో లేదో అని కూడా ఆలోచించలేని ఆ హీరో గర్వానికి ఆశ్చర్యపోయింది.
రెండు రోజులుగా భోజనం లేదు. ఆకలితో పేగులు మెలిపెడ్తూపెట్టి నొప్పి వస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయి. కానీ డబ్బు వస్తున్నదన్న ఆశ కనకానికి వేయి ఏనుగుల బలం వచ్చి రెండు మూడు సార్లు మంచినీళ్ళు తాగి అటు ఇటు తిరుగుతోంది. పాత ట్రంకు పెట్టి తాళం తీసి దాన్లోంచి తనకు ఇష్టమైన పాత పట్టుచీరను తీసుకుంది. ఓ ప్రక్క కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. సభ ప్రారంభానికి ముందు డ్రింకు, టిఫిను ఇస్తారు కదా వాటివల్ల కొంచెం నీరసం తగ్గి స్టేజ్ మీద కూర్చోవడానికి ఓపికవస్తుందనే ధైర్యంతో ఉంది కనకం.
క్రిందటి రోజు కారు డ్రైవర్ అన్న మాటలు గుర్తొచ్చి రెడీ అయి నాలుగు కాకుండానే కూర్చుంది.
సరిగ్గా టైంకు కారు వచ్చేసరికి లేని హుందాతనం తెచ్చుకుని బయటకు వచ్చి చుట్టు ప్రక్కలవాళ్లు వింతగా చూస్తుండగా వాళ్లను చూసి గర్వంతో కూడిన నవ్వు నవ్వి కారెక్కింది.
చాలా కాలం తరువాత ఏసీ చల్లగా తగిలేసరికి ప్రాణం లేచొచ్చింది. కొంత దూరం వెళ్ళాక కాలు మీద కాలేసుకుంది. అంతలోనే సిగ్గుగా అనిపించి తీసేసుకుంది.
కొద్దిసేపటికి సభా ప్రాంగణానికి చేరిన కారు గేటుముందు ఆగేసరికి నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇద్దరు మహిళలు వచ్చి కనకాన్ని తీసుకుని లోపలకు వెళ్ళి ఓ ఏసీ గదిలో కూర్చోపెట్టారు. ఓవైపు నీరసంతో కాళ్ళు తడపడుతున్నా చెదరని చిరునవ్వును కనకం వదలలేదు.
ఆ గదిలో ఎవ్వరూ లేరు. ఎవరైనా వచ్చి కొంచెం మంచినీళ్ళు ఇస్తే బావుణ్ణు అనిపించింది.
సమయం గడిచేకొద్దీ ఒక్కొక్కరుగా వస్తున్నారు పాలరాతి శిల్పాలుగా మెరిసిపోతూ. చర్మంతో వ్యాపారం వల్ల దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
వచ్చిన వాళ్లెవరూ కనకానికి తెలియదు. తనతోటి నాయకలు ఎవరు లేరక్కడ. ఒకామె ఐతే లిప్‌స్టిక్ పెదాలపై పూసుకుని రెండు పెదాలను కలిపి గట్టిగా నొక్కుకుంటూ లోపలకు లాక్కుని బయటకు వదుల్తోంది వాటిని పెదాలకు పూర్తిగా అంటుకునేలా.
మరో ఆమె ఐతే కళ్లకు డాజ్లర్ ఐ లైనర్‌తో ఇంకా అందం పెంచుకుంటోంది.
ఇంకో వయ్యారి భామ తలజుట్టును రెండు పాయలుగా విరబోసుకుని ఒకటి వెనక్కి రెండోది ముందుకు వేసుకుని దానిని రెండు అరచేతులతోనూ పామడం తోనే ఉంది. కనీసం కనకాన్ని చూసి చిరునవ్వైనా చిందించే మనుషులే కరువయ్యారు అక్కడ.
అంతలో జ్యూసుల ట్రే తో ఓ అమ్మాయి వచ్చింది. అక్కడున్న వాళ్లెవరూ వాటినిచూసి ముఖం జుగుప్సగా పెట్టి ఇస్తుంటే వద్దన్నారు.
ఇక కనకం కూడా ఎంతో ఆకలిగా ఉన్నా వద్దంది. ‘మేడం ఆపిల్ జ్యూస్’ అని ప్రొడక్షన్ బాయ్ తీసుకువచ్చి ఇస్తుంటే అందం పోతుందని ఆనాడు కడుపుమాడ్చుకుని వద్దంటే ఈనాడు మొహమాటంతో వద్దనవలసి వచ్చి ఆకలిని జయించడానికి ప్రయత్నిస్తోంది మహానటి.
ఒక్కసారిగా సభంతా కలకలం వచ్చేసరికి హీరో గారు వచ్చినట్టు అక్కడున్న వాళ్లందరికీ అర్థమై లేచి నుంచున్నారు. అందర్నీ వేదిక మీదకు రమ్మనట్టు పిలుపు వచ్చేసరికి కనకంతో సహా అందరూ సభలో ఆసీనులయ్యారు.
అప్పటికే కనకానికి కళ్ళు తిరగడం ఎక్కువ అయ్యింది. ఈవిడ కోసం ప్రత్యేక కుర్చీ వేశారు.
ప్రార్థన అయ్యాక ఒక్కక్కరుగా వెళ్ళి తమవంతు వచ్చినప్పుడు కనకం నటన గురించి, వ్యక్తిత్వాన్ని గురించి చెప్పుకుంటూ వెళ్తున్నారు.
కనకంతో కూర్చున్న చిలకలైతే తెలుగు వచ్చినా రానట్టు కొన్ని పదాలను నత్తి నత్తి గాపలుకుతూ సభికులను నవ్వుకునేలా చేస్తున్నారు.
“నేను చిన్నప్పుడు ఏడుస్తుంటే మా అమ్మగారు కనకం గారు నటించిన సినిమాలు చూపిస్తుంటే ఏడుపు మానేదాన్ని” అని ఒక భామ..
“కనకం గారి నటించిన సినిమాల జాబితా నేను చూడకుండా గుక్కతిప్పుకోకుండా చెప్పగలను. అంత అభిమానం ఆవిడంటే నాకు” ఇంకో వయ్యారి..
“నిస్సిగ్గుగా చెప్తున్నాను నేను చేసే ప్రతి పాత్ర కంనకంగారైతే ఎలా చేస్తారో అలాగే చేయడానికి ప్రయత్నిస్తాను” పెద్ద జాణ గారి ప్రసంగం..
వాళ్లు చెబుతున్నవి అబద్ధాలని గ్రహించాడేమో సదరు హీరోగారు పిఎతో ఇంక ప్రసంగాలు ఆపమని చెప్పి తాను ప్రసంగం మొదలు పెట్టాడు. అతగాడి గురించి కూడా పెద్దగా తెలియని కనకం కళ్ళు మసకబారుతూ ఉండగా చూసింది. మసగమసగగా కనిపించాడు.
అతని ప్రసంగం పూర్తయ్యాక పెద్ద ఎత్తున సన్మానం జరిగింది. గుండెలు కొట్టుకోవడం నెమ్మదిగా మందగించినట్టు కనకానికి తెలుస్తోంది.
ఇంతలో భజమ్మీద చెయ్యి పడేసరికి తల తిప్పి పైకి చూసింది. ఆశ్చర్య పోయింది. ఎప్పుడు వచ్చి నిలుచున్నాడో కాని కొడుకు వచ్చి ఉన్నాడు.
ముఖం వెలిగిపోయింది, వణుకుతున్న చేతితో ఆప్యాయంగా నొక్కింది.
ఒక్కొక్కరుగా వచ్చి కనకం కాళ్లకు నమస్కరించి కొందరు దండతోనూ ఇంకొందరు శాలువ తోను సత్కరించి తోచిన డబ్బు కవర్లో పెట్టి ఇస్తుంటే వెంటనే కొడుకు దాన్ని తీసేసుకుంటున్నాడు. అప్పటికే గొంతు ఎండిపోతున్న కనకానికి అర్థమయ్యింది తానిక బ్రతకనని..
వచ్చిన వారంతా వెళ్ళిపోయారు.
ఎప్పుడూ వెళ్ళాడో తెలియదు కొడుకు కూడా డబ్బు కవర్లు పట్టుకుని పత్తా లేకుండా చెక్కేశాడు.
ఆ విషయం గమనించిన కనకం గుండె ఆశ్చర్యపోయి ఆగిపోయింది..
నిర్వాహకులు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు..
మరునాటి పత్రికలలో మహానటి మరణాన్ని పెద్దపెద్ద అక్షరాల్లో వేశారు..
ఆకలి చాటు మరణాలకు సాక్ష్యం ఎవ్వరు????
