ఈ మధ్యకాలంలో వచ్చిన మరో మంచి చిత్రం మహానటి. ఇప్పటి తరానికి తెలియకపోవచ్చేమోగాని వొక తరం ముందు వరకూ అందరికీ తెలిసిన, ఇష్టపడిన, గుర్తుంచుకున్న మహానటి సావిత్రి. ఆమెను పోల్చడానికి సరిపోయే నటి ఇంకెక్కడా లేదు, ఆమె uniqueness ఆమెదే. ఈ చిత్రంలో ఆమె అభినయం సరే, ఆమె జీవితంలోని విశేషాలను మన కళ్ళ ముందు వుంచాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇతను ఇంతకు ముందు తీసిన “ఎవడే సుబ్రహ్మణ్యం” ప్రేక్షకులనూ, విమర్శకులనూ ఆకట్టుకుని ఇతనికి మంచి పేరును తెచ్చిపెట్టింది.
అప్పట్లో ఇప్పుడున్నటువంటి మీడియా జోరు లేకపోవడం వొక కారణం. అప్పటికే వివాహితుడైన జెమిని గణేశన్ ప్రేమలో పడి వివాహం చేసుకోవడం, ఆమెకు సామాజికంగా ఇబ్బందులను తీసుకొచ్చింది. అప్పటి సమాజం తీరే అలా వుంది. అవన్ని లక్ష్య పెట్టకపోయినా జెమినిలో వస్తున్న మార్పులు ఆమెను చాలా కష్టపెడతాయి. (Abhimaan లో లాగా) సావిత్రికి stardom తగ్గకపోగా జెమినికి తగ్గుతుంది. ఆత్మన్యూనతలో చిక్కుకుని తనకు తెలీకుండానే ఆమెను మానసికంగా హింసిస్తుంటాడు. తాగుబోతవుతాడు, మరో స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు. అతని బాధ పంచుకోవడానికి ఆమెకూడా తాగుతుంది, కాని ఆమె సహనం నశించాక అతన్నుంచి వేరు పడుతుంది. యెముక లేని చేతులతో దానాలు చేయడం, అమాయకంగా వుంటూ అందరినీ నమ్మి, తన ఆస్తిపాస్తుల సంరక్షణ చేయక పోవడం, అందరూ ఆమెను దోచుకుపోతున్నా తెలీకపోవడం ఇవన్నీ ఆమెను ఆర్థిక పతనం వైపుకు తీసుకెళ్తాయి. సుగరు వ్యాధి వచ్చి ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇద్దరు పిల్లల సంరక్షణా ఆమె తల్లినే చూసుకుంటుంది. అయితే ఆమెకు తన గురించి బాగానే తెలుసు. ఈ తాగుడనేది వ్యసనమో, మరొకటో కాదు వొక వ్యాధి, దాన్ని వైద్యంతో నయం చేసుకోవాలి అంటుంది. తన కోరిక యెప్పటికైనా de-addiction centre పెట్టాలని అంటుంది. మానసికంగా, ఆర్థికంగా, శారీరికంగా కృంగిపోయి చిన్న వయసులోనే ఆమె తన అవసానదశకు చేరుకుంటుంది.
అప్పట్లో పత్రికలలో వచ్చే వార్తలు, ఇంటర్వ్యూలు వీటి వల్ల కొంత సమాచారం అందరికీ వుండేది. ఆమె జీవితం గురించి తెలిసిన వాళ్ళు అయ్యో అనుకున్నారే తప్ప నటిగా ఆమెను ఆదరించారు. “గోరింటాకు” వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియెట్ లో వున్నా. నాకు బాగా గుర్తు, బక్కచిక్కి పోయి ముఖంలో మునుపటి కళ కోల్పోయిన ఆమెను చూసి అందరూ “అయ్యో సావిత్రి ఇలా అయిపోయిందేమిటి” అని బాధ పడ్డ వాళ్ళే. ఇదెందుకు చెబుతున్నానంటే ఆమె స్టేటస్ అందరి ఇళ్ళల్లో వొక ఆడపడుచుకుండే స్టేటస్.
కీర్తి సురేశ్ కు సావిత్రి పోలికలు వుండడమే కాదు ఆమె జాగ్రత్తగా పరిశీలనలు చేసి ఆ కళ్ళు తిప్పడం, మూతి విరుపులు, ఆ నవ్వూ అన్ని చక్కగా reproduce చేసింది. ఆమె లేకపోతే ఈ సినెమానే లేదు. వొక చిన్న అసంతృప్తి మాత్రం వుంది. సావిత్రి అభినయంతో పాటు స్పష్టమైన, శక్తివంతమైన ఉచ్చారణ. కీర్తి కొన్ని సార్లు అచ్చంగా సావిత్రిలా చేస్తే, ఇంకొన్నిసార్లు ఇప్పటి నటులలా చేసింది. ఇంకొంచెం శ్రధ్ధ తీసుకుని వుంటే బాగుండేది. దుల్కర్ సల్మాన్ నటన చాలా బాగుంది. అతన్ని తక్కువ “గ్రే” గా చూపించినట్టు అనిపించింది యెందుకో. మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేశారు. కాకపోతే ఆ మౌఖిక పోలికలు, నటనల్లో పోలికలు అంత తృప్తికరంగా లేవు. కొట్టవచ్చినట్టు కనబడేది తెలుగు ఉచ్చారణ. ఇప్పటి సినెమాలు చూస్తే ముందే తయారుగా వుంటాము కాబట్టి యేదీ అంతగా బాధించదు. కాని మహానటిలో వొక పక్క సీనియర్లందరూ చక్కగా మాట్లాడుతుంటే జూనియర్లు మాట్లాడేవి పంటి కింద రాళ్ళల్లా తగులుతున్నాయి. అవి సొంతంగా చెప్పుకున్నవైనా, డబ్బింగువైనా. విజయ్ దేవరకొండ హిప్పీ జుత్తు, బెల్ బాటంస్, పాతకాలం స్కూటర్ వరకు బాగుంది కాని మాట్లాడితే “యెవడే సుబ్రహ్మణ్యం”, “పెళ్ళి చూపులు”, “అర్జున్ రెడ్డి” లో లాగానే పలుకుతాడు. కాలం,ప్రాంతం యేదైనా, పాత్ర ఆంథొని అయినా, ఆల్బర్ట్ పింటో అయినా, అక్బర్ అయినా విశ్వనాథ శాస్త్రి అయినా వొకేలా మాట్లాడితే యెలా? ఇంకో పక్క నాని లాంటివాళ్ళు చిత్తూరు యాస కూడా నేర్చేసుకుని మాట్లాడేస్తుంటే.
నాగ్ అశ్విన్ కి మెటాఫిజిక్స్ లాంటి తాత్త్వికతపట్ల మొగ్గు వున్నట్టుంది. యెవడేలో నప్పింది. కాని ఇందులో సిటిజెన్ కేన్ లో రోజ్‌బడ్ లాంటి ప్రయోగం అతకలేదు. సాహెబ్ బీబి ఔర్ ఘులాం లో మీనా కుమారి తాగడం (ఆమె జీవితం కూడా సావిత్రి జీవితాన్ని కొంత పోలి వుంటుంది) లో లాగా ఇందులో బాధలు పంచుకునే భాగంగా జెమినితో కలిసి తాగడం ఆ సన్నివేశాలు బాగున్నాయి. యెక్కువ సెంటిమెంటాలిటి జోలికి పోకుండా మంచి పని చేశాడు. సావిత్రిని మనం ఇండస్ట్రీలోని వ్యక్తుల కళ్ళతో చూస్తాము. సమంతా ప్రేమకథను (అది సావిత్రి సినెమాలో అవసరమా?) తగ్గించి ప్రేక్షకుల, అభిమానుల దృష్టికోణంలో కొన్ని సన్నివేశాలుంటే బాగుండేది. 1981 లో కూడా ఆమె మరణ వార్త పెద్ద వార్తే. జూనియర్ జర్నలిస్టులకివ్వడం కన్విన్సింగ్ గా లేదు. ఇప్పటి యువతరం ఇలా తెలుగు మాట్లాడుతున్నారు గాని 80లలో బాగానే వుండేది. కొందరు వున్నారు మహామహులు, తమ సినెమాల్లో భాష తెలిసి, ఉచ్చారణ తెలిసిన వారినే తీసుకుంటారు. స్మితా పాటిల్, షబానా ఆజ్మిలను మెచ్చుకున్న సత్యజిత్ రే కూడా తను శత్రంజ్ కే ఖిలాడి, సద్గతి హిందీలో తీసినప్పుడే వారినితీసుకున్నాడు,తప్ప, బెంగాలీ సినిమాల్లో వారిని తీసుకోలేదు.
చిన్న వయసులో సావిత్రి చనిపోవడం వెనుక విఫల ప్రేమ వున్నదా, ఆర్థికంగా యెదురు దెబ్బలు తినడమా, తాగుడా? లేక అన్నీనా? సినెమాలను జడ్జి చేయవచ్చేమో కాని జీవితాలను కాదుగా. ఆమె పడ్డ బాధలకు సానుభూతి వుంటుంది, అలానే ఆమె అభినయకౌశలానికి సదా నీరాజనాలు పడతారు. అలాంటివాళ్ళు యెంతమంది వున్నారని!
సంగీతం, పాటలూ, వేశభూషణాలు బాగున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డేని సేంచెజ్ లోపెజ్ కెమెరా పనితనం. చాలా బాగుంది.
నాగ్ అశ్విన్ , కీర్తికి, దుల్కర్కి thanksలు. నాగ్ నుంచి మరిన్ని మంచి చిత్రాలకోసం యెదురు చూడొచ్చు.
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.