Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహారాష్ట్ర మధురిమలు

[ఇటీవల మిత్రుల కుటుంబాలతో మహారాష్ట్రలోని పలు ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఆ అనుభూతులను పంచుకుంటున్నారు శ్రీమతి పైడిమర్రి పద్మ.]

నా పేరు పద్మ. మావారు ఫెడరల్ బ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఇలా రిటైర్ అయ్యిన కొంత మంది స్నేహితులం ఒక గ్రూపుగా ఏర్పడి ప్రతీ సంవత్సరం ఏదో ఒక రాష్ట్రానికి వెళ్ళి అక్కడి అందాలు చూసి, వాటి చరిత్ర తెలుసుకుని పది రోజులు సరదాగా గడిపి వస్తున్నాము. అలాగే ఈసారి మహారాష్ట్రలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు చూసి వచ్చాము. వాటి గురించి అందరితో పంచుకోవాలనిపించి నా అనుభవాలు వ్రాస్తున్నా.

అందరం కలసి 6వ తేదీ రాత్రి ముంబై ఎక్స్‌ప్రెస్ ఎక్కాము. 7 ఉదయం సుమారుగా 8 గంటలకు పూణేలో దిగాము. అంతకు ముందే RV ట్రావెల్స్ వాళ్లతో మాట్లాడుకోవడం వల్ల వాళ్లే హోటల్స్ బుక్ చేసారు. హోటల్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ట్రావెల్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన గైడ్ (సంతోష్) సహాయంతో మా యాత్ర ప్రారంభించాము.

మొదటి రోజు అంటే 7వ తేదీన మేము ముందుగా పాలీ అనే ప్రాంతంలో స్వయంభువుగా వెలిసిన భల్లాలేశ్వర్ వినాయకుడిని దర్శించాము. భల్లాలుడు అనే భక్తుడి పేరు మీద వెలసిన వినాయకుడు ఈయన. సుమారుగా 300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఇది.

అక్కడనుంచీ మహద్ అనే ఊరిలో స్వయంభువుగా వెలిసిన వరద్ వినాయకుడుని దర్శించుకున్నాము. కోరిన వరాలు ప్రసాదించే వినాయకునిగా ప్రసిద్ధిచెందారు.

***

రెండవరోజు ఉదయాన్నే బయలుదేరి తెయ్యూరూ అనే ఊరిలో స్వయంభువుగా వెలసిన చింతామణి వినాయకుడిని దర్శించుకున్నాము. మన చింతలు తీర్చే వినాయకుడిగా ప్రసిద్ధిచెందారు.

చింతామణి వినాయకుడి ఆలయంలో

అక్కడనుంచీ మోర్గావ్ అనే ఊరిలో స్వయంభువుగా వెలసిన మయూరేశ్వర వినాయకుడిని దర్శించుకున్నాం. చుట్టూ వున్న కొండల మీదనుంచీ చూస్తే ఊరంతా మయూరం (నెమలి) ఆకారంలో కనిపిస్తుందట. అందుకే ఇక్కడ వెలసిన వినాయకుడికి ఆ పేరు వచ్చింది.

తరువాత సిద్దిటెక్ అనే ఊరిలో వెలసిన సిద్ది వినాయకుడిని దర్శించుకున్నాం. ఈయన గూడా స్వయంభువుగా వెలసినవారే. మనం తలపెట్టిన కార్యక్రమాలు సిద్ధించేటట్టుగా చూస్తారు. విష్ణువుకు సిద్ధిని ప్రసాదించిన క్షేత్రంగా గూడా చెబుతారు.

అక్కడనుంచీ రంజన్ గావ్ అనే ఊరిలో స్వయంభువుగా వెలిసిన శక్తివంతమైన మహా వినాయకుడిని దర్శించుకున్నాము.

***

మూడవరోజు ఉదయాన్నే బయలుదేరి మహాబలేశ్వర్ చేరుకున్నాము. ముందుగా మహాబలేశ్వర్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన శివుని ఆలయానికి చేరుకున్నాము. చాలా పురాతనమైన ఆలయం. పదహారవ శతాబ్దానికి చెందినది.

ఇక్కడ శివలింగం రుద్రాక్ష ఆకారంలో స్వయంభువుగా వెలిసింది. ప్రపంచంలో ఇలా ఇంక ఎక్కడా లేదుట. గుడి గూడా పిరమిడ్ ఆకారంలో వుంటుంది. శివాజీ మహారాజు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ తన తల్లి జిజియాబాయికి బంగారంతో తులాభారం వేసి అది అక్కడే దానం చేసేసారుట.

శివుని ముందు ఉండే నంది ఒక మహర్షిని పట్టుకుని ఆపేస్తున్నట్టుగా వుంటుంది. ఒకసారి భృగుమహర్షి శివుని అనుమతి తీసుకోకుండా లోపలకు వెళ్ళడానికి ప్రయత్నించారుట, అప్పుడు నంది ఆయన్ని ఆపేసిందిట. ఎంత అద్భుతంగా చెక్కారో ఈ విషయాన్ని. మన పూర్వీకుల తెలివికి తల వంచి నమస్కరించాలి.

చుట్టూ సహ్యాద్రీ పర్వతశ్రేణి మరింత శోభనిస్తూ వుంటుంది.

మహాబలి, అతిబలి, అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారుట. అందులో మహాబలికి శివుడు ఇచ్చిన వరం వల్ల అతని పేరు మీదుగా ఈప్రాంతానికి మహాబలేశ్వర్ అని పేరు వచ్చిందని అంటారు.

శివాలయం పక్కనే పంచగంగ గుడి గూడా ఉంది. ఇక్కడ సావిత్రీ, గాయత్రీ, కృష్ణా, నదులు కలసి ప్రవహిస్తాయి. ఆ నీటిని మనం తీర్థంగా తీసుకోవచ్చు.

***

నాలుగవ రోజు ముందుగా స్ట్రాబెర్రీ తోటలు చూసాము. చిన్న చిన్న మొక్కలు వాటి నిండా స్ట్రాబెర్రీస్ చూడటానికి ఎంత బాగుందో.

అవి చూసాకా ఆసియా లోనే రెండవ అతి పెద్దదైన పీఠభూమిని చూడటానికి వెళ్ళాము. ఇది పంచగనిలో ఉంది. చాలా ఎత్తులో వుంటుంది. గుర్రాల మీద వెళ్ళాలి. అందరం గుర్రాలు ఎక్కాము. చుట్టూ చూస్తే కొండలూ, కిందకి చూస్తే లోయలు, పైకి చూస్తే సూర్యుడి ప్రతాపం, మధ్య మధ్యలో గాలికి రేగిన ఇసుక, గుర్రాల కోసం చిన్న నీటి కొలను, దూరంగా ఓచెట్టూ, వీటి మధ్యలో మేమందరం ఏదో ఖజానా కోసం వెతుకుతున్నట్టు గుర్రాల మీద ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభవం.

పైన పాండవుల అడుగుజాడలు గూడా కనిపిస్తాయి. ప్రకృతి పరంగా ఏర్పడిన గుహను గూడా లోపలకు దిగి చూసాము. ఇవన్నీ చూస్తుంటే అందరం 60+ అని మర్చిపోయాం.

ఇక్కడ నుంచీ నాలుగు గంటలు ప్రయాణం చేసి కొల్హాపూర్ చేరుకున్నాము.

***

ఐదవ రోజు ఉదయం నాలుగు గంటలకే బయలుదేరి మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాము. నల్లరాతితో చేసిన అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం వల్ల కుంకుమ పూజ, అభిషేకం చేసుకున్నాము. అన్నీ మగవాళ్ళ చేతనే చేయిస్తారు. రెండుసార్లు అమ్మవారిని దర్శించుకున్నాము.

ఈ గుడిని ఏడవ శతాబ్దంలో చాణుక్యులు నిర్మించారని అంటారు. కొల్హాసురుడు అనే రాక్షసుడిని మహాలక్ష్మి అమ్మవారు సంహరిస్తారుట. అతని కోరిక మేరకు అతని పేరు మీద కొల్హాపూర్ ఏర్పడిందని అంటారు. సతీదేవి కన్ను పడిన ప్రదేశంగా గూడా చెబుతారు. అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటి.

ఫెడెరల్ బ్యాంక్ కోల్హాపూర్ శాఖ బయట – రిటైర్డ్ ఎంప్లాయీస్

అమ్మవారి దర్శనం తరువాత దగ్గరలోనే వున్న నర్సోబావాడి క్షేత్రం దర్శించుకున్నాము. ఇది దత్తాత్రేయ స్వామి అవతారాల్లో వకటయిన నరసింహస్వామి నివసించిన ప్రాంతంగా చెబుతారు. ఇక్కడ పంచగంగా, కృష్ణా నదీ కలసి ప్రవహిస్తాయి. దత్తాత్రేయ స్వామి పాదుకలు గూడ ఉన్నాయి.

తరువాత అక్కడినుంచీ పండరీపురం చేరుకున్నాము. ఎప్పటినుంచో స్వామిని దర్శించాలన్న కోరిక మొత్తానికి తీరింది. ఏమి అద్భతం అండీ, భక్తుడు అన్న మాట కోసం దేవుడు అలా నిలబడిపోవడం. ఎంత చూసినా చూడాలనిపించింది స్వామిని.

చంద్రభాగా నది ఒడ్డున ఉంది ఈ ఆలయం. 12వ శతాబ్దానికి చెందినది. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే ఇక్కడ వెలసిన పాండురంగడు. నడుము మీద చేతులు పెట్టుకుని ఇటుక మీద నిలబడి వుంటారు. మనం స్వయంగా స్వామి పాదాలను తాకవచ్చు. ఎంతో అదృష్టం కదా!

పుండరీకుడు అనే భక్తుని కోరిక మేరకు కిందకువస్తారు స్వామి. ఆయన వచ్చిన సమయానికి పుండరీకుడు తల్లి తండ్రుల సేవలో ఉంటాడు. స్వామి పిలిస్తే పుండరీకుడు తల్లి తండ్రులను సేవించుకుంటుంన్నాను కాసేపు యీ ఇటుక మీద నిలబడమని చెప్పాడుట. స్వామి భక్తుని కోరిక మేరకు దానిమీద నిలబడి ఉండిపోయారు. మరాటీలో విట్టూ అంటే ఇటుక అని అర్థం. అందుకే స్వామిని విఠలుడు అని కూడా పిలుస్తారు.

గుడి లోపల రుక్మిణీ, సత్యభామ, రాధ, విగ్రహాలు గూడా ఉన్నాయి.

అక్కడ నుంచీ గంటన్నర ప్రయాణం చేసి తులజాభవాని దర్శనం కోసం తులజాపూర్ చేరుకున్నాం. ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందినది అని చెబుతారు. 51 శక్తి పీఠాలలో ఒకటి. ఛత్రపతి శివాజీ తరచూ అమ్మ వారి ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చేవారుట.

***

ఆరవ రోజు ఎల్లోరా గుహలు చూడటానికి బయలుదేరాము. వీటిని ఆరు, పదకొండు శతాబ్దాల మధ్య రాష్ట్రకూటులు నిర్మించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గూడా గుర్తించింది.

వీటి గురించి ఎంత చెప్పినా సరిపోదు. భారతదేశ శిల్పకళ ఎంత అద్భుతమైనదో తెలియాలంటే ఎల్లోరా గుహలు చూడవలసినదే. ఏదేశ ప్రగతికైనా సరే సాంస్కృతిక మూలాలు చాలా అవసరం. అప్పటి జీవనవిధానం, వాళ్ళ పద్ధతులు, అన్నీ మన తరాలకు అందించడానికి మన పూర్వీకులు ఎంత శ్రమ పడ్డారో ఇవి చూస్తే తెలుస్తుంది.

ఎల్లోరా గుహలను మూడు భాగాలుగా నిర్మించారు. బౌధ్ధ, జైన, హిందూ, మతాలకు సంబంధించిన శిల్పాలు ఉంటాయి. అన్నీ ఒక్కరోజులో చూడడం అసలు సాధ్యం కాదు.

బుద్దుని జీవిత చరిత్ర, ఆయన బోధనలు, శిల్పాల రూపంలో ఎంత బాగా చెక్కారో. అప్పటి కాలంలోనే డైనింగ్ టేబుల్ ఎలా ఉండాలో చెక్కి చూపించారు మనకి. అది చూస్తే నిజంగా ఎంత ఆశ్చర్యం వేస్తుందో.

ఇంకా ముఖ్యంగా చెప్పుకునేది హిందువులకు సంభందించిన కైలాష్ ఆలయం. దీనిని రావణ గుహ అని కూడా అంటారు. ఇది మొత్తం ఒకే శిలతో నిర్మించారు. ఎక్కడా అతుకులు ఉండవు. మనం గుహ లోపలకు వెడుతుంటే ముందుగా గోడకు అటూ, ఇటూ, వాల్మీకి, వ్యాసుని, చిత్రాలు చెక్కి ఉంటాయి. ఎందుకంటే మనం లోపలకు వెళ్ళాకా గోడలమీద రామాయణ, మహాభారత గాథలు కనిపిస్తాయి. వాటిని రచించినది వీరే అని తెలియచెయ్యడానికి ఎంత చక్కటి ఆలోచన చేసారో కదా!

ఇంకొక అడుగు ముందుకు వెయ్యగానే పైన గోడమీద గంగా, యమునా, సరస్వతి దేవతలు నదుల రూపంలో కనిపిస్తారు. ఎందుకంటే మనం లోపలకు వెళ్ళే ముందు శుచిగా కాళ్ళు కడుక్కుని వెళ్ళినట్టు. ఎంత మంచి ఆలోచనో.

ఇంక లోపలకు వెళ్లగానే రుద్రుని తాండవం, కైలాస పర్వతం మీద శివ పార్వతులు కూర్చుని ఉండగా రావణాసురుడు పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నం చెయ్యడం ఇదంతా శిల్పాల రూపంలో కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి.

శివ పార్వతులు సరదాగా కూర్చుని ఏదో ఆట ఆడుకుంటూ వుంటారు. తల్లిని గెలిపించాలని వినాయకుడు, కుమారస్వామి, పార్వతీదేవికి సహాయం చేస్తారు. అలా చెయ్యడం శివుని వాహనమైన నందికి నచ్చక కన్నీరు కారుస్తుంది. ఈ ఉదంతం అంతా శిల్పాల రూపంలో ఉంది. చూసి తీరవలసిందే.

ఇంకా ఇలాంటి కథలు ఎన్ని ఉన్నాయో రాస్తే పెద్ద నవల గూడా సరిపోదు. లోపల పెద్ద శివలింగం అద్భుతంగా ఉంటుంది. ప్రతీ గోడా ఒక అందమైన కథలా ఉంది. ఎన్ని దేవతా మూర్తులు ఉన్నాయో చెప్పలేము.

ఈ ఆలయాన్ని అంతా తమ భుజాల మీద మోస్తున్నట్టుగా చుట్టూ ఏనుగులు చెక్కారు.

ఇంత ఆనందాన్ని అనుభవించాలంటే రాసినా, చదివినా, సరిపోదు. ఒక్కసారైనా చూడవలసినదే. అప్పటి కళాకారులు పడ్డ కష్టానికి ప్రతిఫలం మనం ఎవ్వరం ఇవ్వలేము. మనం చూడాలి. మన ముందు తరాలు చూసేటట్టు చెయ్యాలి. అదే మనం వాళ్ళకు ఇచ్చే నివాళి.

ఎల్లోరా నుంచీ స్వయంభువుగా వెలసిన ద్వాదశ జ్యోత్రిలింగాలలో ఒకటైన ఘృష్నేశ్వర్ శివుడిని దర్శించుకున్నాం. స్వయంగా చేతులతో శివలింగాన్ని తాకి అపరిమితమైన ఆనందానికి లోనయ్యాము.

అక్కడనుంచీ దగ్గరలోనే ఉన్న చిన్న భద్ర మారుతి ఆలయానికి వెళ్ళాము. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే హనుమ మనకు పడుకుని ఉన్న రూపంలో కనిపిస్తారు. మనదేశంలో ఇలాంటివి రెండే ఉన్నాయిట. ఇంకొకటి అలహాబాదులో వుంటుంది. దాన్ని పెద్ద భద్ర మారుతి ఆలయం అంటారుట.

***

ఏడవరోజు అజంతా గుహలు చూడటానికి వెళ్ళాము. ఎల్లోరా శిల్పకళ అయితే అజంతా అంతా చిత్రలేఖనం. ఇవి ఎల్లోరా కన్నా పురాతనమైనవి. రెండూ, ఆరు శతాబ్దాలలో నిర్మించినట్టు చెబుతారు. వాకటక రాజుల కాలంలో బాగా ఆదరణకు నోచుకున్నాయి. అజంతాలో ఉన్న చిత్రాలు అన్నీ బుద్ధుని జన్మ వృత్తాంతాన్ని, అప్పటి జాతక కథలు సూచిస్తూ వుంటాయి. ఇవి గూడా యునెస్కో చే వారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి. చాలా మటుక్కు పాడయిపోయాలు. ఎంతో జాగ్రత్తగా చూస్తే కానీ అర్థం కావడంలేదు. అన్ని వందల సంవత్సరాల క్రితం అంత అందంగా ఎలా వేసారో మన ఆలోచనకి అందదు.

అజంతా గుహలు

వీటిని ఆదరించవలసిన అవసరం మనందరిపైనా వుంది.

***

ఎనిమిదవ రోజు అష్ట వినాయకుని గుడులలో మిగిలిన రెండూ దర్శించుకున్నాము.

ముందుగా ఓజర్ అనే ఊరిలో ఉన్న విఘ్నహర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వినాయకుడిని దర్శించుకున్నాం. ఈయన మనం తలపెట్టిన పనులకు విఘ్నాలు లేకుండా చూస్తారు. ఈయన గూడా స్వయంభువుగా వెలసిన స్వామి.

అక్కడనుంచి లేన్యాద్రి అనే ప్రాంతంలో గిరిజాత్మజుడు అనే పేరుతో వెలసిన వినాయకుడుని దర్శించుకున్నాం.

ఇక్కడ వినాయకుడు చాలా ఎత్తులో కొండల మీద ఉన్నాడు. 350 మెట్లు ఎక్కాలి. డోలీలు గూడా ఉన్నాయి.

తరువాత అక్కడనుంచి లక్ష్మీ దేవి ఆలయం చూసాము. పూణేలో చాలా ప్రసిద్ధి చెందిన దగ్గుషేట్ వినాయకుడిని దర్శించుకున్నాం. కొంచం షాపింగ్ గూడా చేశాము.

అది లేకపోతే యాత్ర పూర్తి అవ్వదుకదా.

***

ఇంక ఆఖరి రోజుకు వచ్చేసాము. మహారాష్ట్ర చూడటానికి వచ్చీ కోటలు చూడకపోతే ఎలా, ఛత్రపతి శివాజీ మహారాజుని తలచుకోకుండా ఉండగలమా, వున్న సమయంలోనే శనివార్ వాడ అనే పేరుగల కోట చూసాం.

ఇది 1736లో పీష్వా బాజీరావు నిర్మించారుట. కోట గోడలు చూస్తుంటే మరాఠా రాజుల విజయాలు, వాటి వెనుకే కుట్రలూ, ప్రేమలూ , ఒకటేమిటి ఎన్నో విషయాలూ మౌనంగా వాటిలో దాచుకున్నట్టు ఉంటాయి.

***

అది చూసాకా తిరిగి హైదరాబాద్ కి ప్రయాణమయ్యాము.

ఇవండీ మేము చూసిన మహారాష్ట్రలోని మధురమైన విశేషాలు.

Exit mobile version