Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహారాష్ట్రలో తెలుగు వారి దశ – దిశ మార్చే మలుపులు

హారాష్ట్రలో తెలుగు వారు, తెలుగు మూలాలున్నవారు ఒక కోటి సంఖ్యకు పైగా ఉన్నా, సామాజికంగా, రాజకీయంగా మనం ఎదగవలసిన ఎత్తుకు ఎదగలేదు. దానికి ముఖ్య కారణం, కుల సంఘాలు, గ్రామ సంఘాలు, ప్రాంత సంఘాలుగా కొన్ని వందల సంస్థలు ఉండి కూడా, మన తెలుగు ప్రజల మధ్య ఐక్యత లేకపోవడమే. మన తెలుగు వారి సంఘాల మధ్యే, ఈర్షా అసూయలు, పదాధికారుల అహాలు పొడసూపి, మన వారి అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి.

మహారాష్ట్ర మొదటి సభాపతి తెలుగు వారు, ఆ తర్వాత ఉపసభాపతి తెలుగువారు, సోలాపూర్ పట్టణం మొదటి మేయర్ తెలుగు వారు. ఒకప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు మూలాలున్నవారు, గతంలో కొందరు తెలుగు వారు పార్లమెంట్ సభ్యులుగా, మహారాష్ట్ర శాసన సభ సభ్యులుగా ఉన్నారనీ, మునుపు ముంబయి మేయర్లుగా తెలుగు వారు చేశారనీ గొప్పలు చెప్పుకోవడమే కాని, గత పాతికేళ్లలో రాజకీయంగా ఎంత మంది తెలుగువారు  ఎదిగారంటే, పెద్దగా చెప్పుకోదగ్గ పరిస్థితి లేదు. మహారాష్ట్రలో మన కంటే తక్కువ సంఖ్య ఉన్న ఇతర భాషల వారు మేయర్లుగా, మంత్రులుగా చేశారు, చేస్తున్నారు. మహారాష్ట్రలో మన తెలుగు వారికి తగిన గుర్తింపు, పాలనలో వారి భాగస్వామ్యం సాధించాలనే ఉద్దేశంతో “మహారాష్ట్ర తెలుగు సంస్థల సమాఖ్య – ఫెడెరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర” (Federation of Telugu Associations of Maharashtra, F-TAM) ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారందరిని ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దానికి కర్త, కర్మ, క్రియ శ్రీ గంజి జగన్ బాబు మరియు శ్రీ అశోక్ కంటె గార్లు. మహారాష్ట్రలో, ముఖ్యంగా ముంబయిలోని తెలుగువారి సంఘాలను ఒక్క త్రాటిపై తెచ్చే ఉద్దేశంతో, ముంబయికి తలమానికమై, గదులు సభాగృహాలు ఉన్న సంఘం ఆధ్వర్యంలో, ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఐతే ఆధిపత్యంపై ఏకాభిప్రాయం కుదరక, పదాధికారుల వ్యక్తిగత అహాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. మనలోని అనైక్యత మరోసారి బహిర్గతమయింది. ఇద్దరు తెలుగు వాళ్లుంటే మూడు సంఘాలు ఎలా ఏర్పడతాయో బహిర్గత మయింది.

దానితో నిరాశ చెందిన అశోక్ కంటే తానే పూనుకొని కొన్ని సంఘాల సహకారంతో కొందరు పెద్దల ఆర్థిక సహాయంతో, బోనాలు, బతుకమ్మ లాంటి కార్యక్రమాలు ఒంటి చేత్తో, మూడు, నాలుగు వేల మంది తెలుగు ఆడపడుచులు పాల్గొనేలా భారీ ఎత్తున నిర్వహించాడు.

ఆ తర్వాత, గంజి జగన్ బాబుతో కలిసి మహారాష్ట్ర తెలుగు సంఘాల సమాఖ్య (Federation of Telugu Associations of Maharashtra -F-TAM) ఏర్పాటు చేశాడు.

అటు పిమ్మట, తానే పూనుకొని, F-TAM ని ప్రభుత్వంలో రిజిస్టర్ కూడా చేయించాడు. మూడు విశ్వవిద్యాలయాల అధినేత, విద్యాధికుడు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీకలకు మానేజింగ్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఉన్న, డా. పుచ్ఛా వేంకట రమణ గారు ఆర్థికంగా హార్దికంగా F-TAM కి అండదండలుగా ఉంటూ, దానికి గౌరవ చైర్మన్‌గా ఉన్నారు. గంజి జగన్ బాబు అధ్యక్షుడుగా మరియు కంటె అశోక్ కార్యదర్శిగా F-TAM ని పరుగులు పెట్టిస్తున్నారు.

గంజి జగన్ బాబు మరియు కంటె అశోక్, మహారాష్ట్ర సామాజిక రంగంలో విప్లవం సృష్టిస్తున్న జంట.

 మాఝా మహారాష్ట్ర తెలుగు మంచ్‌తో మొదలైన వీరి కలయిక, ఇప్పుడు మహారాష్ట్ర తెలుగు సంఘాల సమాఖ్య (Federation of Telugu Associations of Maharashtra, F-TAM) గా బలపడి, ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో దూసుకు పోతోంది. మహారాష్ట్రలోని తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తింప జేస్తోంది. తెలుగు వారి దశను, దిశను మారుస్తోంది. బి.జె.పి. తెలుగు సెల్ స్థాపనకు దారి తీసిన వారి కష్టం, మహారాష్ట్రలో తెలుగు వారు రాజకీయంగా కూడా ఎదగడానికి తోడ్పడుతోంది.

గంజి జగన్ బాబులో ఒక దార్శనికుడు ఉన్నాడు. మహారాష్ట్రలో తెలుగు వారి అభివృద్ధికై అతని వద్ద ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. కంటె అశోక్ గారిలో ఒక సమర్థవంతమైన నిర్వాహణ దక్షుడు ఉన్నాడు. ఆయనకు మహారాష్ట్రలోని, ముఖ్యంగా ముంబయిలోని అన్ని సంఘాలతో సత్సంబంధాలున్నాయి. పలు సాంస్కృతిక బృందాలతో అనుబంధం ఉంది. గంజి జగన్ బాబు పాలు అయితే, కంటె అశోక్ పంచదారగా ఆ పాలకు ఒక కొత్త రుచిని చేకూరుస్తున్నాడు. వారి కలయిక మహారాష్ట్రలోని తెలుగు ప్రజలకు తీయని పాల రుచినిస్తోంది. తెలుగువారు సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన శ్రీ శ్రీ శ్రీ త్రీదండి చిన్న జీయర్ స్వామి గారిని F-TAM, 2022 లోనే ముంబయికి రప్పించి, మూడు వేల మంది కూర్చునేలా, ఆసియా ఖండంలోనే అతి పెద్దదయిన షణ్ముఖానంద సభాగృహంలో, ఆయన ద్వారా ముంబాయి తెలుగు ప్రజలకు గంజి జగన్ బాబు మరియు కంటె అశోక్ గార్లు, ఆధ్యాత్మిక ప్రవచనం అందించారు. ప్రముఖ కవి, రచయిత పేరడి కి పెట్టింది పేరైన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారిని పిలిపించి ముంబాయి కవులను వారిని ఒకచోట కలిపి దాదాపు పన్నెండు వందల మందితో నిండిన హాలు మొత్తం నవ్వుకునే పేరడిని పండించేలా చేశారు. గరికపాటి నర్సింహారావు గారి ద్వారా 2024 నుండి 2025లో మొత్తం 7 కార్యక్రమాలు ముంబాయి చెంబూర్, పోవాయ్, ఐరోలీ, ఖార్ ఘర్, భీవండీ , సోలాపూర్ లలో ఘనంగా నిర్వహించిన ఘనత F-TAM ది. అది ఎంతైనా మెచ్చుకోతగ్గ విషయమే.

ఇక ప్రత్యేకంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిని ముంబయికి రప్పించి, మార్చి 14 & 15, 2026 శని, ఆదివారాలు రెండు రోజులు, ఐరోలీ, చెంబూర్ లలో ఆయన అమూల్యమైన ప్రవచనాలు అందజేసేలా ఏర్పాటు చేశారు F- TAM వారు.

అలాగే తెలుగు విద్యార్థులకై మార్గదర్శనానికై కొన్ని కార్యక్రమాలు, ఏబిల్ షిప్పింగ్ అధినేత శ్రీ గణేశ్ బింగి గారి ఆర్థిక సహకారంతో వేయి మంది విద్యార్థులకు విద్యా విషయక సలహాలతో పాటు పెన్ డ్రైవ్‌లు వితరణ చేశారు. విద్యార్థులకు అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు.

సామాజిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలతో పాటు ముంబయిలోని మన తెలుగువారు రాజకీయంగా కూడా ఎదగాలనే ఉద్దేశంతో శ్రీ గంజి జగన్ బాబు గారు, శ్రీ అశోక్ కంటె గారు, ముంబయి బి.జె.పి. పెద్దలతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారి అకుంఠిత ప్రయత్నాల వల్ల బి.జె.పి. పార్టీ వారు మనల్ని గుర్తించి 07-02-2017 న అప్పటి బి.జె.పి. ముంబయి అధ్యక్షులు, అడ్వకేట్ ఆశీష్ శేలార్ గారు శ్రీ గంజి జగన్ బాబు గారిని బి.జె.పి. ముంబయి తెలుగు సెల్ సమన్వయకునిగా, నియమించారు. శ్రీ మంగల్ ప్రభాత్ లోఢా గారు బి.జె.పి. ముంబయి అధ్యక్షులుగా నియమింప బడ్డాక తేది 17-10-2020 న బి.జె.పి. ముంబయి కార్యవర్గంలో మన బి.జె.పి. తెలుగు సెల్‌ను చేర్చి, దానికి శ్రీ జగన్ బాబు గంజి గారిని ప్రముఖులుగా ప్రకటించారు. ఆ తర్వాత శ్రీ గంజి జగన్ బాబు మరియు శ్రీ అశోక్ కంటే గారి జంట మన తెలుగువారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో ఎన్నో సంప్రదింపులు జరిపారు. వారు రకరకాల సామాజిక/సాంస్కృతిక & ఆద్యాత్మిక కార్యక్రమాలతో ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. ముంబయిలో బి.జె.పి. తెలుగు సెల్ బాధ్యునిగా శ్రీ గంజి జగన్ బాబు గారి నియామకంవల్ల ప్రభుత్వ అధికారులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. తెలుగు మూలాలున్న శ్రీ సుధీర్ మునగంటివార్ గారితో అంతకుముందే మాఝా మహారాష్ట్ర తెలుగు మంచ్ కార్యకలాపాల ద్వారా, శ్రీ గంజి జగన్ బాబు గారికి, అశోక్ కంటె గారికి మంచి పరిచయం ఉండింది. ఆ అనుబంధాల చొరవతో అప్పటి మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రివర్యులుగా కూడా ఉన్న శ్రీ సుధీర్ మునగంటివార్ గారిని మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ ఏర్పరచాలని కోరడం జరిగింది. దాని పర్వసానమే తేది 08-10-2024 న మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ ఏర్పడి శ్రీ పి.వి. రమణ గారి అధ్యక్షతన ఓ నిర్వాహక బృందం ఏర్పడినట్టు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఏర్పాటు వెనుక శ్రీ జగన్ బాబు గంజి మరియు శ్రీ అశోక్ కంటే గారి మూడేళ్ల కృషి ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, కొన్ని సంస్థలు మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ ఏర్పడడానికి ఏ మాత్రం చొరవ చూపకుండా, కేవలం విమర్శలకే పరిమితం అవుతున్నాయి. ఒక ప్రభుత్వం, ఇతర భాష సాహిత్య అకాడెమీ ఏర్పరచడం ఆషామాషీ వ్యవహారం కాదు. దాని వెనుక F-TAM వారు, ఆయా సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో ఎన్నో సందింపులు జరుపబడిన చరిత్ర ఉంది.

ఐతే ఇక్కడ మన తెలుగువారు గమనించని అంశం, తాము ఏ మాత్రం బాధ్యత తీసుకోకుండా, ఏ ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం విమర్శించడం మాత్రమే. F- TAM చేపట్టిన  పనుల రూపం, అవి సామాన్య తెలుగు ప్రజల సంక్షేమానికి ఎంత ఉపయోగ పడగలవో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంచి పనులను సమర్థిస్తూ, తమకు నచ్చని పనులకు దూరంగా ఉంటే, సమాజహిత కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. ఇంకో విషయం, తాము సంస్థలో సభ్యత్వం తీసుకొని, ప్రశ్నిస్తే జవాబు చెప్ప వలసిన బాధ్యత F- TAM పదాధికారులపై ఉంటుంది. తద్విరుద్ధంగా, దూరంగా ఉండి, విమర్శిస్తే దానికి విలువ ఉండదు. F- TAM కి జవాబుదారీ ఉండదు. ఇంగ్లీషులో ఓ నానుడి ఉంది. “Lead, follow or get out of the way” సత్తా ఉంటే నాయకత్వం వహించాలి, లేక పోతే నాయకులను అనుసరించాలి, కానీ అవేవీ చేయకుండా ఇతరులు చేసే మంచి పనులకు అడ్డంకులను సృష్టించడం మంచిది కాదు.

మహారాష్ట్రలో కొత్త మంత్రివర్గం ఏర్పడ్డాక, ఇతర సాహిత్య అకాడెమీల బృందాల తోపాటు, మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ నిర్వాహక బృందం కూడా రద్దయింది. కొత్త నిర్వాహక బృందం ఏర్పడలేదు. ఐతే శ్రీ జగన్ బాబు గారు శ్రీ అశోక్ కంటె గారు, డా. అంబల్ల జనార్దన్ గారు, కార్యక్రమ సమన్వయకులుగా ఉండి, మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపి ఈ ఆర్థిక సంవత్సరం, మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దాని ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తేది అక్టోబర్ 08, 2025 న డా. అంబల్ల జనార్దన్ గారు, మున్షీ ప్రేంచంద్ గారి ‘కఫన్’ కథ ఆధారిత హిందీ నాటికను, తెలుగులోకి అనువదించి, ముఖ్య పాత్రలో నటించిన ‘శవ సంస్కారం’ నాటికతో మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆ తర్వాత మరో ఎనిమిది కార్యక్రమాలు, 24-03-2026 వరకు మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా జరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. వారికి గౌరవ పారితోషికాలు ఇచ్చింది. ఎందరో కవులను, కళాకారులను వెలుగులోకి తెచ్చింది. ముంబయి, నవీ ముంబయి, భివండీ, ఠాణే, చంద్రపూర్, పుణే మొదలగు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలు, మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారిని ఒక్క త్రాటిపైకి తెచ్చాయి. వారి మధ్య సంబంధాలు ఏర్పరచి, దూరాన్ని తగ్గించాయి. అంతే కాదు, సాహిత్య, కళా రంగాల వారికి, మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ, భారీ పురస్కారాలు కూడా ప్రకటించింది. వాటికి కొందరు దరఖాస్తులు చేసుకున్నారు కూడా.

ఐతే కొందరు నిత్య శంకితులు, విఘ్న సంతోషులు అయిన  మన తెలుగు వారే కొందరు  ఆయా కార్యక్రమాలలో పాల్గొనకుండా నష్ట పోయారు.

ఐతే కొందరు ఇతర తెలుగు వారికి శ్రీ జగన్ బాబు గారంటే పడదు. కాని శ్రీ అశోక్ కంటే గారు అనుసంధాన కర్తగా ఉండి, పలు సామాజిక కార్యక్రమాలు F-TAM ద్వారా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఒక విధంగా శ్రీ జగన్ బాబు గారి  దూకుడుకు కళ్లెం వేస్తూ, F- TAM మరియు బి.జె.పి. తెలుగు సెల్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

ఒకే పార్టీలో ఉన్న ముంబయిలోని మన తెలుగు వారందరు ఐకమత్యంగా ఉంటే, కొన్ని కార్పొరేటర్ పదవులు, కొన్ని శాసన సభ్యుల పదవులు మన తెలుగు వారికి దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, మన తెలుగు వారిని గుర్తించింది కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండి ప్రభుత్వం ద్వారా మరిన్ని సౌకర్యాలు మన తెలుగు వారికి కల్పించేలా కృషి చేయవలసి ఉంది. మహారాష్ట్రలో మన ఉనికికి తగ్గ ఫలితం దక్కే అవకాశం ఉంది. కావలసింది, మన లోని ఐక్యత మాత్రమే. వివిధ సంఘాల పదాధికారులు, వ్యక్తిగత అభిప్రాయభేదాలు, మన సహజ ఈర్ష్యాసూయలు, అహాలు అందరి బాగుకై, పక్కన పెట్ట వలసిన అవసరం ఉంది.

తెలుగు వారు తమ గత వైభవాన్ని పునరుద్ధరించే దిశగా  మహారాష్ట్రలోని విశ్వవిద్యాలయాల్లో “తెలుగు పీఠం” నెలకొల్పడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఈ విషయంలో F-TAM, గత సంవత్సరం గంజి జగన్ బాబు, అశోక్ కంటె, అంబల్ల జనార్దన్, ఇతర బృంద సభ్యులతో, అప్పటి మహారాష్ట్ర గవర్నర్, ప్రస్తుత దేశ ఉపాధ్యక్షులు శ్రీ రాధాకృష్ణన్ గారిని కలసి, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని విషయమై, వారు ఆయా విశ్వవిద్యాలయాలకు ఉత్తరాలు రాశారు కూడా. ఇప్పుడు మన తెలుగు సంస్థలు కలిసికట్టుగా  ఆ సమస్య పరిష్కారానికై మరింత కృషి చేసే అవసరం ఉంది. అలాగే రాజకీయంగా ఎదగవలసిన అవసరం ఉంది. దానికి, మన నాయకులు, మన తెలుగు వారితో పాటు, ఇతర భాషల వారితో సఖ్యంగా ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజల్లో మన తెలుగువారి ఉనికికి గుర్తింపు పొందాలి. F-TAM మరియు మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ నిర్వహించే కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలి. అప్పుడే మనం ఆయా పార్టీల పెద్దల దృష్టిలో పడి, మనకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. మన తెలుగు వారు, వివిధ పార్టీల ఝండాలను మోసే, ‘కింగ్ మేకర్లు’గానే ఉండకుండా ‘కింగ్’ లు గా మారే అవకాశం ఉంది.

మొత్తం మీద ప్రస్తుతం మహారాష్ట్రలో మన తెలుగువారి దశ మెరుగు పడింది. మనం దిశ మార్చుకొని, ఐకమత్యంగా, విశాల భావాలతో “బహుజన హితాయ – బహుజన సుఖాయ” నానుడితో ముందుకు సాగాలి. మన తెలుగు వాడిని, వేడిని మహారాష్ట్ర దశదిశలా చాటాలి.

Exit mobile version