Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురావిజయంతో శ్రీరంగనాథుడి చెర విడిపించిన ‘మహాసేనాని గోపన్న’

[డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య రచించిన ‘మహాసేనాని గోపన్న’ అనే చారిత్రక నవలని సమీక్షిస్తున్నారు శ్రీ యం.వి.రామారావు.]

వేదశాస్త్రాలతోపాటు అస్త్రశస్త్రాల్లో నిష్ణాతుడిగా వీరుడిగా, ప్రభువుగా గోపనామాత్యుడు అవతరించాడు. వీరత్వంతో బ్రాహ్మణులు కూడా రాజ్యాలను ఏలే ప్రభువులు కాగలరని నిరూపించాడు. మధుర సుల్తానుల దాడిలో 47 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్న శ్రీరంగ శ్రీరంగనాథస్వామిని పునః ప్రతిష్ఠ చేయడంలో గోపన్న విజయనగర యువరాజు కంపన రాయలుతో కలిసి సఫలమయ్యాడు. మొదట మధుర సుల్తాన్ కోట కన్ననూరుపై దాడిచేసి విజయం సాధించాడు గోపన్న. అనంతరం కంపన, గోపన్న మధురపై దాడిచేసి సుల్తాన్ తలను నేలకు పడేలా చేసి దక్షిణాదిని తురుష్కుల దాడి నుంచి రక్షించారు. గోపన్న సర్వసైన్యాధ్యక్షుడిగా విజయనగర సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసారు. చిన్నతనం నుంచి పండిత దేశీకులవారి శిక్షణలో పండితుడిగా, వీరుడిగా ఆవిర్భవించాడు. గోపన్నకు శ్రీరంగనాథుని అజ్జాతవాసంపై వ్యక్తం కాని భయంకర కలలు వచ్చేవి. ఆ కలల అర్థం తెలియక అశాంతికి గురయ్యేవాడు. కలలు వచ్చేవి ఒక సత్కారం కోసం అని తరువాత తెలిసింది. ప్రతిజ్ఞ చేసి అది సాకారం అయ్యే సమయంలో పదేళ్లు గడిచిపోవడంతో ఎంతో మనోవేదనకు గురైనాడు. మధుర సుల్తాన్ తలను నేలకు రాల్చి, చివరకు శ్రీరంగనాథుని పునః ప్రతిష్ఠ గురువు దేశీకులవారితో   చేయించి ప్రతిజ్ఞను నేరవేర్చుకున్నాడు.

రచయిత డా. టేకుమళ్ల వెంకటప్పయ్య (నెల్లూరు) ‘మహా సేనాని గోపన్న’ అనే చారిత్రిక కాల్పనిక నవల ద్వారా 14వ శతాబ్దానికి చెందిన తురుష్కుల దారుణాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. అనేక ఆధార గ్రంథాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా చారిత్రిక ప్రాముఖ్యతకు భంగం రాకుండా నవలను మలచడంలో కృతకృత్యులయ్యారు. ముఖ్యంగా ముసల్మాన్ దండయాత్రలతో శ్రీరంగం క్షేత్రం ఏవిధంగా ధ్వంసమైంది, ఆనాటి పరిస్థితులను సజీవదృశ్యాలుగా చూపించడంలో విజయం సాధించారు. విజయనగరాధిపతి బుక్కరాయల కుమారుడు కంపన, మహాసేనాని గోపన్న శ్రీరంగనాథుని వైభవం ఎలా పునరుద్ధరించారనేదే ఈ నవల ఇతివృత్తం.

రచయిత సంఘటనాత్మకంగా, ఇతివృత్తం దెబ్బతినకుండా, చారిత్రక నేపథ్యాన్ని అభివ్యక్తీకరిస్తూ సరళంగా, సులభగ్రాహ్యంగా సజీవ దృశ్యాలుగా పాఠకులకు అక్షర విందు చేసారు. రచయిత సామాజిక సమస్యలు అనే ఖండకావ్యం, ధర్మదత్తోదయం అనే ఆధునిక ప్రబంధాల రచనలు చేసి పండితుల ప్రశంసలు అందుకున్నారు. అష్టవిధ కధానాయకులు, హరి సంకీర్తనాచార్య అన్నమయ్య  సంకలనాలకు సంపాదకులుగా వ్యవహరించారు. భక్తి సంగీత పరివస్య రూపకాన్ని రచించారు.

కథలోకి వెళితే..

గోపనాచార్యుడి అక్షరాభ్యాసంలో ఆయన తండ్రి నరసింహచార్యులు ‘ఓం నమః శివాయః నమః’ రాసిన తరువాత ‘సిద్ధం నమః’ రాస్తుండగా పురోహితులు శిరోమణి అడ్డుకున్నారు. ఇది జైన మతాచారం, మన ఆచారం కాదు. జైనులే విద్యాబోధకులవడం చేత అలా వ్రాయించేవారు. నీవు ‘ఓం నమః సిద్ధేభ్యః’ అని రాయమన్నారు. అదే శాస్త్ర సమ్మతమన్నారు.

“వర్ణావశీమప్యజానంతో లోకాలోకై ర్గౌరవాభ్యధికాః

సువర్ణ కారతులా ఇవ నిరక్షరా అపిస్కంధైరుద్యంతే.”

‘ఓం నమః సిద్ధం’ అనే ఉత్తర హిందూ దేశ ఆచారాన్ని దక్షిణ దేశంలోనే కాక తెలుగువారూ అవలంబిస్తున్నారు. గాథా శప్తశతి దక్షిణ దేశకావ్యం కాబట్టి ఇక్కడి ఆచారమని పెద్దలు భావిస్తున్నారు. దేశికాచార్యుల గురుకులంలో  గోపన్నను తండ్రి నరసింహామాత్యుడు చేర్చాడు. గోపన్న ఆరేళ్ల వయస్సు లోపే శబ్దమంజరి, ధాతుమంజరిపై పట్టు సాధించి తైత్తిరీయ యజుర్వేదాన్ని సుస్వరంతో అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఒక రోజు ఇద్దరు ఏడుస్తూ ఆశ్రమం ముందు నుంచి వెళుతున్నారు. గురువు గారిని ఆ విషయం అడిగాడు. నాయనా నీవు పసివాడు, తరువాత చెబుతానన్నాడు. “స్వామి నాకు సందేహం. చిన్నతనం నుంచి కలలో సింహం గాండ్రింపు వినిపిస్తోంది. సింహంతో ఉన్న వ్యక్తికి నాలుగు చేతులున్నాయి. సింహం చుట్టూ శంఖువులు, చక్రాలు తిరుగుతున్నాయి. సింహం గర్జిస్తునే ఉంటుంది. దాని గురించి నా తల్లిదండ్రులకు అడిగినా చెప్పలేదు” అన్నాడు. ఆ విషయం విని దేశీకులవారు నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే గోపన్నను కౌగలించుకుని నీ వల్లే ఒక సత్కార్యం జరగాల్సి ఉంది. సింహం చెరను విడిపించేవాడివి నీవే. అది దుస్వప్నంగా భావించవద్దు అన్నారు. అంతలో ఒక గురుడు పక్షి ఆశ్రమంలోకి వచ్చి గోపన్నను చూసి ఎగిరిపోయింది.

గోపన్న10 ఏళ్లపాటు గురువుగారి వద్ద వేద వేదాంగాలు అభ్యసించాడు; గురువు దేశీకులవారు అగస్త్య సంహిత గూర్చి గోపన్నకు  వివరించాడు. సప్త రుషులు లోని అగస్త్యునికి గూర్చి, ఆయన ప్రతి చర్య జన కళ్యాణానికే దోహదపడిందని తెలిపారు. శ్రీరాముడు  యుద్ధం చేస్తున్నప్పుడు అస్త్రశస్త్రాలు ఎన్నో ప్రయోగించాడు. రావణుని నిహతుడిని ఎలా చేయాలో అర్ధంకాక సందిగ్ధంలో ఉండగా అగస్త్యుడు వచ్చి ఆదిత్యహృదయం  బోధించాడు. ఋగ్వేదంలో కొన్ని శ్లోకాలు ఆయన, భార్య లోపాముద్ర రాసారని చెబుతారు. మాతృగర్భంలో కాక కుండలో వశిష్ఠునితో పాటు జంటగా జన్మించాడు. విద్యుని గర్వమణచడం, వాతాపి అనే రాక్షసుడిని జీర్ణం చేసుకుని బాటసారుల చావులను అరికట్టడం చేసాడు. ప్రాచీన సింధు నాగరికతలో అగస్త్యుని పేరును సూచించే చిహ్నాలు ఉండడం గమనార్హం. జ్ఞానం, సౌందర్యం కలిగిన లలితాదేవి స్వరూపంగా లోపాముద్రను భావిస్తారు. అగస్త్య సంహితలో ఆరు రకాల విద్యుత్ గురించి మహర్షి వివరించారు. ఆత్రేయ రామానుజులు వారు దేశీకులవారి ఆశ్రమంలో గోపన్నను చూసి మంచి శిష్యుడని కితాబు ఇచ్చాడు. అతనిని చూస్తే బ్రహ్మణుడిలాకాక వీర కుమారుడిగా కనిపిస్తున్నాడు. జాతకం నిశితంగా పరిశీలించి మరో ఐదేళ్లు యుద్ధవిద్యలు గోపన్న నేర్చుకోవాల్సి ఉందన్నారు. ముందుగా తాలింఖానాలో మల్లవిద్య నేర్చుకుని అనంతరం విజయనగరంలో యుద్ధవిద్యలు నేర్చుకోవాలన్నారు రామానుజులవారు.

యుద్ధవిద్యలు సాంగోపాంగంగా నేర్చుకున్నాడు  గోపన్న. ధనుర్విద్య, విన్యాసాలు, ఖడ్గవిద్య, గుర్రాలను మచ్చిక చేసుకోవడం వంటి విద్యల్లో నిష్ణాతుడు అయ్యాడు. ఇతన్ని చూసి బ్రాహ్మణ కుమారుడా, రాజ కుమారుడా అని విప్రులు ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి దేశీకాచార్యులవారు విచ్చేయగా అందరూ వందనం చేసారు. గోపన్నను పిలిచి ఇప్పుడు నీకు 19 సంవత్సరాలు వచ్చాయి. నీకు కొన్ని విషయాలు చెప్పాలని కొండమీదకు తీసుకు వెళ్లాడు.

హైందవ ఆలయాలను ధ్వంసంచేస్తూ ముష్కరులు సాగిస్తున్న ఈ దుష్ట పాలనలో పవిత్ర నదుల నీరు రక్తసిక్తం.. అని ఆయన గొంతు పూడుకు పోయింది. గురువర్యా.. బ్రాహ్మణుడనైన నాకే ముసల్మానుల అకృత్యాలు వింటుంటే రక్తం ఉడికిపోతున్నది, తప్పక ప్రతీకారం చేస్తానన్నాడు గోపన్న.

అదే నాకు గురుదక్షిణ.. చెబుతా విను అని దేశీకాచార్యులు చెప్పసాగారు. గత 10 సంవత్సరాలలో దక్షిణాదిపై రెండుసార్లు తురుష్కుల దండయాత్ర జరిగింది. ఖిల్జీ సేనాని మాలిక్ కాబూల్ ఓరుగల్లును, హోయసల రాజ్యాలపై దండయాత్ర చేసి గెలిచాడు. అక్కడి నుంచి శ్రీరంగం చేరి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ఢిల్లీ తీసుకుపోయాడు. ఒక నాట్యం బృందం ఢిల్లీ సుల్తాన్ని మెప్పించి మళ్లీ తెచ్చి ప్రతిష్ఠిచారు. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. 1323లో  మాలిక్ కుమారుడు ఉలుగ్ ఖాన్ ఆలయాలను ధ్వంసం చేస్తూ శ్రీరంగం చేరుకున్నాడు. స్వామి భక్తులు కులశేఖరులవారు  ఆలయం నిర్వాహకులకు తెలిపి అప్రమత్తం చేసాడు. పంజుకొండప్ప అనే వీరుని ఆధ్వర్యంలో యువకులు ఆలయరక్షణకు నడుం బిగించారు. ఆలయంలోనే ఉండి మూలవిరాట్టుకు సుదర్శన బంధ మంత్రాన్ని జపించి సుదర్శన చక్రాన్ని ప్రేరేపించి అడ్డుగోడ కట్టారు. మహాలక్ష్మీ రంగనాయకి విగ్రహాన్ని సంపెంగి చెట్టు క్రింద  పాతిపెట్టించారు. శ్రీరంగని ఉత్సవవిగ్రహాలతో ప్రధాన అర్చకుడు లోకాచార్యులు ఆలయం దాటాడు. ఈ బృందం కావేరీ నది చాటేలా కులశేఖరుడు చూసాడు. ఆలయ ద్వారాలకు పేడపూసి లోపల ఏమీ లేదన్న భ్రమ కలిగించామని దేశీకులవారు తెలిపారు. కులశేఖరుడు కొండపైన రెండురోజులు సుల్తాను సైన్యాన్ని నిలువరించారు.

దేవదాసి సేనానిని మురిపించి గోపురం. వద్దకు తీసుకు వచ్చి క్రిందకు తోసి తానూ ఆత్మాహుతి చేసుకుంది. విషయం తెలుసుకున్న సుల్తాన్ సైన్యం గుడిలో ప్రవేశించి ధ్వంసం చేసి, అగ్నికి ఆహుతి చేసి మధుర వెళ్ళిపోయారని ఆ ఉదంతాన్ని వివరించారు. గోపన్న తండ్రి నరసింహామాత్యులు దక్షిణ భారత విషాద కథనాలు మరిన్ని వివరించారు. ఖిల్జీ హయాంలో రామేశ్వరం వరకూ దక్షిణ భారతం వారి వశమైంది. ఆ తరువాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన మహమ్మద్ బీన్ తుగ్లక్ కాలంలో ఆంధ్ర, తమిళ రాజ్యాలన్నీ తురుష్కుల వశమయ్యాయి. మధురై కూడా వారి ఏలుబడిలోకి వచ్చింది. కర్ణాటకలోని హోయసల, కౌటిల్య రాజ్యాలు స్వతంత్రంగా ఉండి సవాలు విసురుతున్నాయి. కంపిలి యాదవరాజు రామచంద్రుడు-1 హోయసల రాజులతో యుద్ధంచేసి అనుభవం గడించాడు. కంపిలుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు. మాలిక్ కాబూల్ కంపిలి రాయుని ఓడించలేక వెనుతిరిగాడు. కాకతీయ సామ్రాజ్యం క్షీణదశలో ఉన్న సమయంలో అక్కడి మంత్రులు హరిహర, బుక్కరాయలు లను తన కొలువులోకి ఆహ్వానించాడు. తుగ్లక్‌ను ఎదిరించి ఓడిపోయిన బాహుద్దీన్ కంపిలి(కుంతల)ను ఆశ్రయించాడు. దాంతో తుగ్లక్ కంపిలిపై యుద్ధం ప్రకటించాడు. 1327లో హోసకోట యుద్ధంలో విధి వక్రించి కంపిలిరాయలు మరణించాడు. అంతకు ముందే కంపిలి యువరాజు కుమారరాముని అరేబియన్ గుర్రాన్ని మోసంతో తుగ్లక్ కాలు నరికారు. అదే యుద్ధంలో కుమారరాముడు వీరమరణం పొందుతాడు. తండ్రీకుమారులు ఇద్దరూ మృతి చెందడంతో హరిహర బుక్కరాయలను ఢిల్లీ తీసుకు వచ్చి ఇస్లాంలోకి మార్పించారు. ఇదిలా ఉండగా బాహుద్దీన్ హోయసల రాజు బల్లాలుడిని ఆశ్రయించాడు. దాంతో తుగ్లక్ యుద్ధం ప్రకటించేసరికి, ఎదిరించే ధైర్యంలేక బాహుద్దీన్‌ను తుగ్లక్‌కు అప్పగించాడు బల్లాలుడు. బల్లాలుడు సుల్తాన్ సామంతుడు అయ్యాడు. దాంతో మొత్తం భారతదేశానికి తుగ్లక్ చక్రవర్తి అయ్యాడు. కంపిలిలో తిరుగుబాటు అణచడానికి సుల్తాన్ హరిహర, బుక్కరాయలను పంపాడు. విద్యారణ్యులు వారిని మళ్లీ మతం మార్చి హిందూమతం పునరుద్ధరణ చేయమని కోరాడు. వారు పుంజుకుని బల్లాలుని, సోమదేవుని ఓడించి అనగొంది(హంపి)ని రాజధానిగా సామ్రాజ్యం స్థాపించారు. సుల్తానుల ప్రాభవం తగ్గడంతో మధుర సుల్తాన్‌గా జలాలుద్దీన్ 1334లో ప్రకటించుకున్నాడు. ఐదేళ్ల తరువాత గయాజుద్దీన్ రాజయ్యాడు. అతడు క్రూరంగా హిందువులను ఊచకోత కోస్తున్నాడని నరసింహాచార్యులు చెప్పి మగించాడు.

గోపన్నను నారాయణపురం పాలకుడిగా బుక్కరాయలు నియమించినట్లు  నరసింహాచార్యులు శుభవార్త చెప్పాడు. యువరాజు కంపన రాయలు ముల్బుగల్ రాజ్యానికీ సేనానిగా గోపన్నేనని చెప్పాడు. విద్యారణ్యస్వామి (శ్రీ మాధవాచార్యులు) దేశికాచార్యుల సహాధ్యాయి. ఆయన శృంగేరీ శారదాపీఠానికి 12వ పీఠాధిపతి. విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకుడు. ఆయన నిర్ణయించిన మూహూర్తంలో భాగంగా వేరే శంఖారావం కొద్ది క్షణాల వ్యవధితో వినిపించడంతో అదే నిజమని యంత్రపూజ జేస్తారు. దాంతో విద్యారణ్యులు వగచి అయినా ఈ సామ్రాజ్యం 250 సంవత్సరాలు అప్రతిహతంగా సాగుతుందని ధైర్యం చెప్పారు. బుక్కరాయలు రాజ్య నిర్వహణ, హరిహర రాయలు దండయాత్రలతో రాజ్య విస్తరణ ప్రారంభించారు. బల్లాలుడు మధుర సుల్తాన్ చేతిలో మరణించగా, బుక్కరాయలు హోయసల రాజ్యంపై దాడి చేసి పెనుగొండ కోట వద్ద విజయం సాధించారు. 1344 నాటికి విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించారు.

గోపన్న విద్యారణ్యులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. తనకు చిన్నతనం నుంచి వస్తున్న కల గురించి చెప్పి సింహం ఎందుకు గర్జిస్తున్నదని అడిగాడు. నీ సందేహం తీరాలంటే అతిభీస్తవ స్తోత్రం పఠించమన్నారు. ఆ తరువాత కంపరాయలను కలిసాడు. తిరిగి నారాయణపురం వస్తూ కుముదశ్రీ ని ఒక గుడిలో చూసాడు. మారువేషంలో గోపన్న నారాయణపురంలో పర్యటిస్తూ ఒక విదేశీయుడిని చూసాడు. అతడు మారిష్ (స్పెయిన్) దేశయాత్రికుడు బట్టుటా. అతడు 20 ఏళ్ల నుంచి ప్రపంచ యాత్ర చేస్తున్నట్టు చెప్పాడు. విజయనగరరాజుల పాలన గురించి ప్రశంసించాడు. ప్రపంచంలో ఏ ముస్లిం రాజ్యంలో లేని భయంకర వాతావరణం మధుర సుల్తాన్ పాలనలో చూసానని వాపోయాడు. ఇస్లాం భోధనలకు విరుద్ధంగా అతను ఎందుకు హిందువుల పట్ల అన్యాయంగా ఉంటున్నాడని ప్రశ్నించాడు. అల్లాహ్ నుంచి తప్పించుకోలేరు, అతడ్ని శిక్షించడానికి ఒకడ్ని పుట్టించే ఉంటాడని అన్నాడు. ఈ మాటలు విన్న గోపన్న రక్తం మరిగిపోయింది. వాడి తల నెలరాల్చేవాడిని నేనే అంటూ లేచి తాను కూర్చున్న పెద్ద బండను పిడిగుద్దు గుద్దాడు. అది ముక్కలవడంతో బట్టుటా విస్మయానికి గురైనాడు. ఒక్కోసారి లేచి నులుచుని “సలామాలేకుం” అంటూ “ఎవరు మీరు” అని ప్రశ్నించాడు. “నేను నారాయణపురం పాలకుడిని. మీరు మీ దేశం త్వరగా వెళ్లండి. మీరు వెళ్లేలోగా మధుర సుల్తాన్ తల నేల రాలుతుంది.అది మీ రిహ్లాలో లిఖించండి” అని గోపన్న జవాబిచ్చాడు. తిరిగి వస్తూ గుడిలో కుముదశ్రీని చూసి మారువేషంలో ఉన్న గోపన్న తనను ప్రేమిస్తున్నదని తెలుసుకుంటాడు.

ఒకరోజు గోపనాచార్యులు విజయనగరానికి గుర్రంపై బయలుదేరాడు. విజయనగర చుట్టూ సప్త ప్రాకారాలు చూస్తూ నైరుతీ దిక్కున ఉన్న చెరువు గట్టుమీద పదిమంది బాటసారులు కనిపించారు. ద్రవిడులుగా ఉన్నవారిని రక్షకభటులు అడ్డగించారు. మాది శ్రీరంగం, ప్రభువుని దర్శించుకోవాలని వచ్చామన్నారు. చివరికి సుంకం కట్టించుకుని అనుమతి పత్రం ఇచ్చారు. దాంతో వారు లోనికి ప్రవేశించి బ్రాహ్మణుల ఇంట భోజనం చేసి అతిథి అభ్యాగతులపై, విజయనగరవైభవం గూర్చి వెన్నోళ్ల కొనియాడారు. రాచనగరు వద్ద భటులు అడ్డగించడంతో గోపన్న వారికి అనుమతి కల్పించాడు. రాచనగరులో మండపం వద్ద వారిని సమావేశపరిచి వారి విషయాలను వివరించమన్నాడు. వారిలో వృద్ధుడు ‘తాము శ్రీరంగం వారసులమని, 35 ఏళ్లుగా అనేక చోట్ల తిరుగుతున్నాం. శ్రీరంగనాథుడే పరుల పంచనుండగా మా కష్టాలేమున్నాయి లెండి’ అన్నాడు. అనాటి దారుణాలను వివరించాడు.

అక్షయనామ సంవత్సరం ఫాల్గుణ మాసంమాఘ పౌర్ణమి రోజు శ్రీరంగంలో కావేరీతీరంలో దేశీకాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇంతలో ఒక బ్రాహ్మణుడు పరుగున వచ్చి తురుష్కులు అందరినీ ఊచకోత కోస్తూ సమయవరం వరకూ వచ్చారని వార్త మోసుకువచ్చాడు. దాంతో దేశికాచార్యులకు ఏమిచేయాలో పాల్పడలేదు. ఇంతలో మరో గూఢచారి క్రోసుదూరంలో శత్రువులు ఉన్నారని కబురు తెచ్చాడు. దాంతో లోకాచార్యులతో ఆలోచించి ఉత్సవాలు ఆపేస్తున్నామని ప్రకటించారు. దాంతో లోకాచార్యులతో కలిసి మేము విగ్రహాలతో తిరుకొట్టియూరు చేరుకున్నాం. మధ్యలో ముష్కరులు మిమ్మల్ని అడ్డుకుని హింసించి అమ్మవారి ఆభరణాలు లాక్కున్నారు. లోకాచార్యులు దేవాలయ ధ్వంసం వార్త విని స్మృహ కోల్పోయారు. ఈ బృందంలో వస్తాదు తిప్పన్న అనే రజకుడు ఉన్నాడు. “మా భార్యా పిల్లలు ఉన్నారో లేదో తెలియదంటూ మాలో ఒక్కొక్కరి కథ ఒకో విషాదం అని వారు చెప్పారు. మా కథలు విని జాలిపడే వారే తప్ప ఆదుకునేవారు లేరు” అన్నాడు తిప్పన్న. అయినా ‘శ్రీరంగని దయ ఉన్నంతవరకూ పోరాడతాం. మా తాతయ్య, మనవాళ్లని చంపినా దుఖఃపడేవాడిని కాదు. వారి క్రూరత్వానికి భరించలేకున్నాను. తప్పక వారికి బుద్దిచెప్పి మరీ మరణిస్తాన’న్నాడు తిప్పన్న. గోపన్న వారికి ధైర్యం చెబుతూ మీ తాతగార్ని  హింసకు గురిచేసిందెవరని ప్రశ్నించాడు. “మా తాత కూడా రంగని భక్తుడు. ప్రతి మాట ముందు శ్రీరంగనాథా అనడం అలవాటు. 10 ఏళ్ల నన్ను భుజాన ఎక్కించుకుని లోకాచార్యుల బృందంలో వస్తున్నాడు. మధ్యలో ఎవరో ఆయనను క్రింద పడేసి కుళ్లపోడిచారు. మీ రంగడెక్కడ చెప్పమని హింసించారు. నాకూ రంగని కళ్లారా చూడాలని ఉందన్నాడు. వెంటనే వారిలో ఉన్మాది రెచ్చిపోయి మా తాత కళ్లు రెండు పీకిచేతిలో పెట్టి ఈ కళ్లతోనేనా చూసేది అన్నాడు. మా అమ్మను చెరపట్టి తీసుకుపోయారు. రాత్రంతా కళ్లనుంచి కారుతున్నా రక్తంతో తాత అలాగే ఉన్నాడు. ఉదయం నేను, తాత ఒక వంట చెరుకు ఎడ్ల బండి ఎక్కి శ్రీరంగం చేరాం. అక్కడ ఊరు వల్లకాడులా ఉంది.నేనా చిన్నవాడిని. తాత రంగడు దుస్తులను ఉతికే ముందు తడిపి ఆ నీటిని తీర్ధంగా సేవించేవాడు. అది సర్వవ్యాధి నివారణగా పరమౌషధంగా భావించేవాడు. ఆయన ప్రాణాలు ఇంకా నిలబెట్టడం వెనుక రంగడు ఏదో పరమార్థం కోసం ఉంచాడని భావించాల్సి ఉంది” అని అన్నాడు తిప్పన్న. “కొన్నాళ్లకు అమ్మ వచ్చింది. నన్ను కౌగలించుకుని ఏడ్చేది. ఎలాగైనా వారిమీద ప్రతీకారం తీసుకోవాలని యువకులను కలుపుకుని సాముగరిడీలు నేర్చుకున్నాం. ఒక మాజీ సైనికాధికారి మాకు యుద్ధవిద్యలు నేర్పించారు. తాత ఒక రాత్రి ‘ఒరేయ్ తిప్పా.. మళ్లీ శ్రీరంగడి దుస్తులు తీర్థం సేవించి ప్రాణాలు వదలాలని ఉందిరా’ అని ఏడ్చాడు. అప్పుడు నాకు పట్టుదల పెరిగింది. ఎలాగైనా శ్రీరంగడిని మళ్లీ ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాను. మేము యుద్ధవిద్యలు నేర్చుకున్నవారం వేయ్యి మంది ఉన్నాం. అన్ని గ్రామాలు కలిసి 20 వేలమంది వరకూ ఉన్నారండి. మీ వంటి రాజవంశీయులు పూనుకుంటేనే జరుగుతుంది, కాదనకండి” అని గోపన్న కాళ్లు పట్టుకుని తిప్పన్న ప్రాధేయపడ్డాడు. తిప్పన్న మాటలకు గోపన్న చలించిపోయాడు. అప్పుడు తనకు వస్తున్న కల అర్థమై కర్తవ్యం బోధపడింది. లోకాచార్యులు మరణించే సమయంలో శ్రీరంగని విగ్రహాలు బాధ్యత తన శిష్యుడైన పిళ్లైకు అప్పగించారని ఆ బృందంలో మరొకరు చెప్పారు. పిళ్లై తిరువనంతపురం చేరారన్నారు. వారు బల్లాలుని ఆశ్రయించారు. తిప్పన్న బృందానికి ఒక సత్రం ఏర్పాటు చేసి నేను మళ్లీ వచ్చేవరకూ ఇక్కడే ఉండమని గోపన్న గుర్రమెక్కి విజయనగరం వైపు సాగాడు.

దక్షిణ ప్రాంతంలో కంపిల, హొయసల రాజ్యాలు బలంగా ఉండడంతో సుల్తాన్‌లకు కంటగింపుగా ఉండేది. తుగ్లక్ కంపిలునితో యుద్ధానికి రాగా బల్లాలుడు తటస్థంగా ఉండి కంపిలి ఓటమి, రాజు మరణానికి పరోక్షంగా కారణమయ్యాడు. చివరకి సుల్తాన్‌కు బహుఉద్దీన్‌ను సమర్పించి విధేయత ప్రకటించాడు. జలాలుద్దీన్ మధురకు సుల్తాన్ ప్రతినిధి అయ్యాడు. జలాలుద్దీన్ స్వతంత్రంగా వ్యవహరించడంతో మిగతా రాజులు కప్పం కట్టడం మానివేశారు. వారిలో  బల్లాలుడు ఉన్నాడు. అతడు స్వార్థపరుడు. శ్రీరంగవాసులకు ఏ విధంగా ఊరికే సహాయం చేస్తాడని గోపన్న మనస్సులో ఆలోచన వచ్చింది. కంపిలి ప్రతినిధిగా మహమ్మద్‌ను సుల్తాన్ నియమించాడు. మహమ్మద్ అకృత్యాలకు ప్రజలు తిరగబడ్డారు. సుల్తాన్‌కు మహమ్మద్‌ను తొలగించి స్థానిక ప్రభువును నియమించమని మంత్రులు సూచించారు. అదే విజయనగరం రాజ్యస్థాపనకు నాందీ వాచకమైంది.

ప్రతాపరుద్రుని బంధీగా తీసుకు వచ్చినప్పుడు హరిహర, బుక్కరాయలు కంపిలి ప్రభువును ఆశ్రయించారు. కంపిలిని జయించడంతో వారిని ఢిల్లీ పంపి ఇస్లాంలోకి మార్చారు. ఇప్పుడు కంపిలిని సరిదిద్దడానికి హరిహర, బుక్కరాయలే దిక్కయ్యారు. ఒకప్పటి మంత్రులే రాజప్రతినిధులైనారని ప్రజలు తిరుగుబాటు విరమించారు. కంపిలిని సమర్థవంతంగా తీర్చిదిద్దారు. బల్లాలుని సైన్యం కంపిలివైపు చూడకండా బలమైన దెబ్బతీసారు. మధురపాలకుడు జలాలుద్దీన్‌ను తిరుగుబాటుదారులు హత్యచేసారు. ఆ తరువాత వచ్చిన ఇద్దరు సుల్తాలులను అదే విధంగా చంపారు. తరువాత గయాజుద్దీన్ గద్దె నెక్కాడు. దేవాలయాలను కొల్లగొట్టే పనిలో ప్రజలను హింసిస్తున్నాడు. 1264లో కన్ననూరు యుద్ధంలో 80 ఏళ్ల బల్లాలుడు గయాజుద్దీన్ చేతిలో హతుడైనాడు. హరిహర, బుక్కరాయ సోదరులు ఒకనాడు తుంగభద్రా తీరంలో వేటకుక్కలను కుందేళ్ళు తరిమి కొడుతున్న తీరు చూసి ఆశ్చర్యపోయారు. అలా విజయనగరం సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1336లో విద్యారణ్యుల ఆశీర్వాదంతో వారు స్థాపించారు. కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థానం, సుల్తాన్ మంత్రాంగం, కంపిలిదుర్గ పాలకులుగా నేర్చుకున్న అనుభవం విజయనగరం పటిష్టానికి దోహదపడ్డాయి. మధుర మినహా హోయసల రాజ్యం అంతా వారి స్వాధీనంలోకి వచ్చింది.

ఢిల్లీ సుల్తాన్ దక్షిణాపథ ముట్టడితో తమిళనాట ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రజలు చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. పల్లవ, చోళులు పాలన అంతరించి పాండ్యరాజుల పాలన సాగుతున్నది. వారి అంతః కలహాలతో సుల్తాను వారిని తరిమి కొట్టడంతో వారు మధుర నుంచి తెన్కాశిలో తలదాచుకున్నారు. తమిళ నాట సుల్తాన్‌లకు ఎదురులేకపోయింది. విజయనగరరాజ్య స్థాపనతో తమిళనాట కొంత ఊరట కలిగింది.

క్రియాశిద్ధి పండితులు రాకతో  గోపన్న మధుర సుల్తాన్ అకృత్యాలను పండితులవారికి వివరించాడు. అక్కడి ప్రజలు 37 సంవత్సరాలుగా పడుతున్న కష్టాలను వివరించాడు. మధుర వైష్ణవుల ఊచకోత, ఆ బృందం శ్రీరంగనాథుని గూర్చి చెప్పిన విషయాలు చెప్పాడు. వారిని కాపాడలేని సైన్యాధికారి పదవి తనకెందుకని వాపోయాడు. ఇటీవల తిరు నారాయణపురం వెళ్లినప్పుడు మధుర వైష్ణవులందరూ వారి విషాదగాథలు వివరించడం తెలిపాడు. వారిలో ఒక వృద్ధుడు స్వామి విగ్రహాలు తిరుపతి ప్రాంతానికి తీసుకువెళ్లినట్లు తెలిసిందని, 18 ఏళ్లు గడిచినా వారి ఆచూకీ తెలియలేదన్నాడు. ఆ విగ్రహాలను వెతికిపట్టుకోమని వారు కోరినట్లు చెప్పారు. విగ్రహాలు వెతకనా, సైన్యాధిపతిగా కర్తవ్యం చేయాలా అన్న అర్థంకాని మీమాంస ఏర్పడిందని  పండితులకు చెప్పాడు గోపన్న. అదే రోజు రాత్రి నాకు విషపు తేలు కుట్టింది. బాధతో విలవిలలాడాను. వైద్యులను రప్పించగా వారు ఒక మొక్క పసరు వల్ల నెప్పి తగ్గుతుందని తెలిపారు. దాంతో ఆ బృందంలోని వారు తలో దిక్కుకూ వెళ్లి సాధించి తెచ్చారు. ఆ మొక్కరసం రాయడంతో నెప్పి తగ్గింది. అది తెచ్చిన వ్యక్తి ఈ దేశాన్ని కూడా  ఒక విషపురుగు కాటేసింది. మేము నాలుగు వైపులా వెదికి తెచ్చినట్లు మీరు, మీ ప్రజలు విగ్రహాలను వెతికి పట్టుకోలేరా అని ప్రశ్నించే సరికి నేను నిశ్చేష్టుడయ్యానన్నాడు. ఈ విషసర్పం వల్ల దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవనవిధానం నాశనం అవుతున్నాయి. త్వరపడండి, దేశాన్నికాపాడండి అని అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ విషయాన్నీ గోపన్న పండితులవారికి చెప్పి బాధపడ్డాడు. నాకు ఈ పదవి, అధికారాలూ వద్దు. ఒక శుద్ధమైన వైష్ణవుడిగా జీవించాలనుకుంటున్నానని చెప్పాడు. శ్రీరంగనాథుని శ్రీరంగం చేర్చాలనే గోపన్న సంకల్పం క్రియాశీల పండితులను ఆశ్చర్యపరిచింది. మధుర, బహుమనీ సుల్తానులు మధ్య శత్రుత్వం కొనసాగితే పర్వాలేదు, లేకపోతే విజయనగరానికి ప్రమాదమని గ్రహించాలని పండితులవారు సూచించారు.

గోపన్న పదవి వదులుకోవడానికి సిద్ధపడితే మహారాణి గంగ, పండితులవారు స్వాంతన పరిచారు. మార్గదర్శనం కోసం గోపన్న వేదాంత దేశీకులవారిని సందర్శించాడు. ఆయన శ్రీరంగనాథుని వెతకడానికి తిరుమల వైపుకు  వెళ్లమన్నారు. గోపన్నకంటే ముందే నలుగురు అశ్వికులు ఆ బాటలో వెళ్లారు. వారిలోమహిళ ఉంది. ఆమె పేరు మంజరి. ఆమెతోపాటు దత్తుడు, రాజ్య వల్లభుడు, సింగళకరుడు అడవులు మీదగా చంద్రగిరిని చేరుకున్నారు. రాజ్య వల్లభుడు కలశేఖరులు, వాసంతికాదేవి కుమారుడు. “వీరబల్లాలుని కొలువులో ఉన్న కులశేఖరులవారు యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు వాసంతిక సేవ చేసింది. వారి సత్యమంగళం నుంచి శ్రీరంగని విగ్రహం తెప్పించి వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి గాయాలతో కులశేఖరుడు మృతి చెందాడు. అప్పటికే  వాసంతికదేవి గర్భవతి. స్వామి విగ్రహంతో 60మంది బయలుదేరాం. ఇప్పుడు పలచబడ్డారు. విగ్రహాన్ని మేల్కొట చేర్చాం. తిరుమల వెళ్లాలని ఐదుగురు బయలుదేరాం. స్వామి విగ్రహాం, ఆభరణాలతో బయలుదేరాం. చంద్రగిరి ముష్కరులు దాడికి గురైతుందని తెలిసి హతాశులైనాం. మా దారి మార్చుకుని అడవి బాట పట్టాము” అని పింగళకరుడు వివరించారు.  ముసల్మాన్ సైనికులు ఎదురుపడేసరికీ వారిని మలయగర్ ఎదుర్కొన్నాడు. మేము పారిపోయాం. వారు అతని కాళ్లు నరికేశారు. సైనికులు మమ్మల్ని వెతకడానికి మరింత సైన్యం కోసం వెళ్లారు. మాకు ఆ విషయం చెప్పి కన్నుమూశాడు. అలా మేము అడవిలో వేగంగా అంజనాద్రికి చేరుకున్నాం. మిగతా ముగ్గురు కొండ ఎక్కుతామని, సింగళకరుని క్రింద కాపాలా ఉంచివెళ్లారు. కాసేపటికి సైన్యం అంజనాద్రి వేపు రావడం కనిపించింది. పొదల్లో దాక్కున్నాను. చివరికి సైన్యం కొండ ఎక్కుతున్న కొండవరులను చుట్టిముట్టింది. మూడు వైపులా చుట్టుముట్టిన సైన్యాన్ని తప్పించుకోవడానికి తీగెలతో విగ్రహాన్ని 82 ఏళ్ల కురుగురుదాసును కట్టి క్రిందకు దింపారు మిగతా ఇద్దరూ. ఆ తరువాత దాసు క్రిందకు దొర్లికుంటూపడ్డాడు. గంట తరువాత చూస్తే దాసు శవం కనిపించింది. అది చూసి విల్లిపుత్తూరు దాసు గుండె ఆగి మరణించాడు. చివరికి శ్రీరామదాసు ఒంటరిగా ఏడుస్తూ మిగిలిపోయాడు. వీరి గురించి తాను (సింగళకరుడు) వెతికినా విగ్రహం, దాసు కనిపించలేదు. అక్కడకు వచ్చిన కోయవాళ్లతో వెళ్లిపోయానన్నాడు. చివరికి చంద్రగిరి చేరాడు. కుమార్తె మంజరిని సత్రంలో పనిచేయమన్నాడు. వల్లభుడు ఇదంతా విని ఆవేశపడ్డాడు. మేము మళ్లీ చంద్రగిరి బాటపట్టాం. విగ్రహం దొరక్క ఆనాడు సైన్యం ఆగ్రహంతో వెనుతిరిగింది కనుక విగ్రహం అక్కడే ఉండవచ్చని సింగళకరుడు అనుమానం వ్యక్తం చేసాడు. ఆభరణాలు కొండ దిగువ భూమిలో దాచామని చెప్పాడు. కోయగూడెం చేరుకున్నారు. అక్కడ ఆశ్రయం పొందారు. విగ్రహం, నగలు దొరక్కపోవడంతో సుల్తాన్ సైన్యం తమ గూడెం తగలబెట్టారని, ఆ అగ్గిఅడవంతా వ్యాపించిందని  కోయదొర చెప్పాడు. శ్రీరామదాసు అగ్నిలో మరణించాడా అనే అనుమానం వ్యక్తం చేయగా అడవి అటు పక్కన ఉన్న మరో కోయగూడెంను విచారణ చేయాలని కోయదొర చెప్పాడు. మంజరి వెళ్లడం ప్రమాదమని చెప్పడంతో ఆమెను చంద్రగిరి పంపే ఏర్పాటు కోయదొర చేసాడు. వల్లభుడు, దత్తుడు, సింగళకరుడులకు తోడు మరో ఇద్దర్ని పంపాడు. చెంచు గూడెం చేరిన వీరు వారి సహాయంతో అంజనాద్రి పరిసరాల్లో గాలింపు ప్రారంభించారు. వారికి వింత ఆకారం కనిపించింది. ఆ తరువాత సుగంధం అలముకుంది. వారికి విగ్రహం ఉన్నచోట సుగంధం ఉంటుందని గుర్తుకు వచ్చింది. దత్తుడు పెద్దగా  కనిపించిందని అరిచాడు. రాజవల్లభుడు, సింగళకరుడు వచ్చి విగ్రహం ముందు ‘శ్రీరంగా కరుణించావా’ అని సాగిలపడ్డారు. వారి ముందుకు వింత ఆకారం వచ్చి నిలుచుంది. చివరికి ఆ ఆకారం శ్రీరామదాసుగా గుర్తు పట్టారు. 18 సంవత్సరాలుగా తైలం సంస్కారం లేక అడవి మనిషిగా మారాడు. తనవారు కళ్లముందు మరణించడంతో మతితప్పింది. అక్కడే ఉన్న కందమూలాలు తింటూ అక్కడే విగ్రహం పక్కనే పడుకుని 18 ఏళ్లు గడిపిన మహాభక్తుడు దాసు అనుకున్నారు. మిగతా వారిని తీసుకురమ్మని దత్తుడిని పంపారు.

శ్రీరంగనాథుని విగ్రహం దొరికిన విషయం చంద్రగిరి యాదవరాజుకు వల్లభుడు కబురు పంపాడు. రాజు వచ్చి స్వామి విగ్రహం ముందు సాష్టాంగపడ్డాడు. దత్తుడి ఆచూకీ కనుగొనాలని వల్లభుడు రాజును కోరాడు. చివరికి దత్తుడిని కనుగొన్నారు. దాసు ఆభరణాలు ఉన్న ప్రదేశం చూపిస్తాడు. స్వామి విగ్రహాన్ని, ఆభరణాలను తిరుమలలో ఉంచాలని నిర్ణయిస్తారు. పల్లకీలో శ్రీరంగనాథుని తిరుమల చేరుస్తారు. తిరుమలలో శ్రీరంగనాథునికి యాదవ రాజు ప్రత్యేక మండపం నిర్మిస్తానని చెబుతాడు. శ్రీరంగనాథునికి రంగనాయకుల మండపంలో పాంచరాత్ర ఆగమోత్తకంగా ఆరాధన ఏర్పాట్లు జరిగాయి. విషయం తెలుసుకున్న గోపన్న తిరుమల వెళ్లి శ్రీరంగనాథుని చూడాలని బయలుదేరాడు. తిరుమలలో వల్లభుడు, దత్తుడు కొంతకాలం ఉండాలని అనుకున్నారు. దక్షిణాపథంలో సుల్తానుల ముట్టడి ప్రభావంతో తిరుమల చేరిన కంచి వరదరాజస్వామి, అహోబిలం నారసింహుడులను యాదవ రాయలు వారికి చూపించాడు. వారు వస్తారనే సన్నిథులను సిద్ధం చేసానని తెలిపాడు. శ్రీరంగనాథుని సన్నిథిలో తమిళ ప్రబంధాల గానం ఏర్పాటు చేయాలని రాజుకు వారు చేసిన విజ్ఞప్తిని ఆయన అంగీకరించాడు. దాన్ని కొంతమంది వ్యతిరేకించడంతో వల్లభుడు తమిళగానం చేయాల్సిందేనని నిరాహారదీక్షకు పూనుకున్నాడు. దత్తుడి ద్వారా విషయం తెలిసి రాజు వచ్చి అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేసి వల్లభుడికి చికిత్స అందించాడు. అయినా వల్లభుడు శ్రీరంగనాథుని పునః ప్రతిష్ఠ జరిగేవరకూ దీక్ష మానన్నాడు. గోపన్న తిరుమల చేరి మలయప్పను దర్శించుకుని అక్కడే ఉన్న మూర్తిని వాకబు చేసాడు. అర్చకులు అది శ్రీరంగనాథుడని చెప్పగా ఆనందం పొందాడు. విగ్రహాన్ని తెచ్చినవారిలో వల్లభుడు రాజు ప్రాసాదంలో చికిత్స పొందుతున్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. గోపన్న వల్లభుని పరామర్శించాడు. “నేను  శ్రీరంగంలో రంగనాథుని ప్రతిష్ఠ చేయడానికి ప్రాణాలైనా అర్పిస్తాను.సుల్తాన్ తల నేలవాలేవరకు విశ్రమించనని శపథం చేసా,నీవు దీక్ష విరమించుము” అన్నాడు. వల్లభుడు కోలుకున్న తరువాత దత్తుడితో కలిసి ఇంటికి వెళ్లాలని బయలుదేరారు. రాజు, గోపన్న అనుమతి తీసుకుని తిరుమల నుంచి వెళ్లారు. సింగళకరుడు, మంజరిని వెతుక్కుంటూ కంచి వచ్చారు. అక్కడ మంజరి ఇంటికి రాగా తన తండ్రి సింగళకరుడు గాయాలతో చనిపోయాడని చెప్పింది. తిరుమల నుంచి వచ్చిన గోపన్న తుంగభద్ర తీరంలో కంపనను కలిసాడు. శ్రీరంగనాథుడు తిరుమల చేరిన విషయం వివరించాడు. అలాగే తనకు వచ్చిన కలలు చెప్పి, ఇటీవల కలలో శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై కంపనతో కలిసి 39ఏళ్లుగా అరణ్యవాసం చేస్తున్న నన్ను మళ్లీ శ్రీరంగం చేర్చాలని ఆదేశించారని, తాను వల్లభుడితో చేసిన శపథం కూడా చెప్పాడు. తాను దక్షిణ దేశ దాడులకు సిద్ధమేనని, బుక్కరాయలు అనుమతి తీసుకోవాలని కంపన చెప్పాడు. మహామండలేశ్వరుడు బుక్కరాయల సమక్షంలో కంపన, గోపన్న సుల్తానుల ఏలుబడిలో మధుర, శ్రీరంగం ప్రజలను పడుతున్న బాధలు వివరించారు. మధురై సుల్తానులతో యుద్ధం అంటే లక్షల్లో సైన్యం సిద్ధం చేయాలంటూ దక్షిణాది యువకులు లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారని గోపన్న వివరించాడు. మధుర సుల్తాను మీద దాడి చేస్తే బహుమనీ సుల్తానులు ఊరికే ఉండరని చెప్పాడు. నగరంలో సైన్యం లేదని తెలియగానే దాడి చేస్తారు. మధురపై దాడి చేయాలంటే ముందు బహుమనీలను కట్టడి చేయాలని, దక్షిణాది ప్రాంతం ఒకే గొడుగు క్రింద రావాలని నా ఆశయమని బుక్కరాయలు మాటలకు కంపన స్పందించాడు. ‘తండ్రీ! ఆజ్జాపించండి నేను, గోపన్న సిద్ధంగా ఉన్నామ’ని అన్నాడు. ఈ మాటలు శ్రీరంగనాథుడు నాతో పలికించాడని బుక్కరాయలు అనగానే సభికులు హర్షం వ్యక్తం చేశారు. మా మహారాణి 20 సంవత్సరాల నుంచి శ్రీరంగంలో శ్రీనాథుని రథయాత్ర జరపాలని, తామ్రపర్ణి నదిలో స్నానం చేయాలని కోరుతున్నారని తీర్చలేక పోతున్నానని వాపోయారు. తిరుపతి దుర్గాధిపతి యాదవ రాయలు కూడా మా సహాయం ఆడుగుతున్నాడు. ఇవన్నీ దైవ నిర్ణయాలుగా భావిస్తున్నానన్నారు. మొదట కంచి శంభువరాయలను ఓడించాలని. బహుమనీ సుల్తానులు గమనించి మధురైపై దాడి చేయాలని వ్యూహరచన చేసారు. సంతోషంతో  తిరుగు ప్రయాణంలో గోపన్న విజయనగరం శివార్లకు చేరుకున్నాడు. నారాయణ పురం చేరిన గోపన్న ముసలి వేషంలో కుముదిని రాక కోసం కోనేటిగట్టు వద్దకు రాగా ముసలి స్త్రీ ఎదురుపడింది. ముసలివేషంలో వచ్చి గోపన్నను ఆట పట్టించి చివరకు వేషం తీసివేసింది. కుముదినితో  పెళ్లి శ్రీరంగనాథుని విగ్రహం చేరిన తరువాతేనని గోపన్న చెప్పాడు. దండయాత్రకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. విజయనగరంలో యుద్ధం వాతావరణం నెలకొంది. యుద్ధానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని కంపన గంగా సమేతంగా కాంచీపురంపై దండయాత్ర చేసి కంపన రాయలు స్వాధీనం చేసుకున్నాడు. రాజు రాజనారాయణుడు రాజగంభీరరాజ్యానికి పారిపోయాడు. కంపనలను కాంచీపురం ప్రజలు స్వాగతించారు. భారవి కవి పట్టణాలలో  కంచి మేటి అని 600 సంవత్సరాల ముందే చెప్పాడని కంపన గంగతో చెప్పాడు. కంచిలో మళ్లీ హైందవ సంస్కృతి పునరుజ్జీవించింది. అక్కడి నుంచి రాజగంభీరపురంపై దండయాత్రకు సిద్ధమయ్యారు.

వల్లభుడు తప్పిపోయిన యువరాణి మధురాంగి ఆచూకీ కనుగొని తల్లి అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని కోరికతో కోట వద్దకు చేరారు. మధురాంగి చెలికత్తె వీరికి ఆహారం పంపి క్షుద్బాధను తీర్చింది. చివరకుపాండ్య యువరాణిని కలుసుకున్నాడు వల్లభుడు. ఆ రాజ్యాన్ని జయించిన కంపన వారిని దర్బార్‌కు రమ్మని సందేశం పంపడంతో వెళ్లారు. గోపన్న ద్వారా వీరి గురించి తెలుసుకుని కంపన వారిని ఆదరించాడు. అలాగే వల్లభుని ప్రేమవిషయం తెలుసుకుని పాండ్య యువరాణిని గౌరవంగా తండ్రి దగ్గరకు పంపే పని అతనికి అప్పజెప్పారు. ఈ మార్గంలో ముందు మీ తల్లిని దర్శించి ఆ తర్వాత పాండ్య రాజు వద్దకు వెళ్లమన్నాడు. వారి ప్రయాణం మధ్యలో దొంగలు అటకాయించడంతో వల్లభదత్తులు వారిని చంపేశారు. యువరాణితో మాట్లాడే అవకాశం రాలేదని వల్లభుడు బాధపడుతుంటాడు. గాయాలతో వల్లభుడికి జ్వరం వచ్చి సంధి కలవరింతలు చేస్తాడు. అప్పుడు దాహం అని అరిస్తే రాకుమారి నీళ్లు ఇవ్వడం గుర్తుంది. ఆ తర్వాత పాండ్య రాజు శంభురాయలు విజయనగర సామంత రాజుగా అంగీకరించడంపై వల్లభుడు ఆనందం పడ్డాడు. సత్యమంగళం చేరి తల్లి వాసంతికను కలిసి తాను శ్రీరంగనాథుని కనుగొన్నానని, విగ్రహాన్ని తిరుమల చేర్చినట్లు తెలిపాడు. తల్లిని కలిసి శ్రీరంగని పునః ప్రతిష్ఠ తరువాతే వివాహం అని మరల పునరుద్ఘాటించాడు. తిరిగి యువరాణితో ప్రయాణం కొనసాగిస్తుండగా ఏనుగులు అడ్డగించడంతో అందరూ చెల్లాచెదురై వారు. మధురవాణి, వల్లభుడు పల్లపు ప్రాంతానికి దొర్లివెళ్లారు. అక్కడ కోయజంట కనిపించి వారిని సురక్షితమైన గుహలోకి తీసుకువెళ్లారు. ఉదయం దత్తుడు వచ్చి అందరూ క్షేమంగా ఉన్నారని చెబుతాడు. మళ్లీ ప్రయాణం చేసి చివరకు పాండ్య రాజ్యం చేరారు. రాజకుమార్తెను క్షేమంగా తీసుకువచ్చినందుకు రాజు వల్లభదత్తులకు కృతజ్ఞతలు తెలిపాడు. కొన్నాళ్లకు తిరిగు ప్రయాణం ఆయ్యారు. విరహ బాధతో వల్లభుడు దత్తుడితో వెళుతుండగా ఒక సత్రం వద్ద  గుర్రంపై వచ్చిన మధురాంగి వల్లభునికి రత్నఖచిత ఖడ్గం బహూకరించి వీడ్కోలు పలికింది. వల్లభుడు మరికొంత దూరం ప్రయాణించి ఆమెను మరువలేనని దత్తుడికి చెప్పి మళ్లీ వాయువేగంతోసత్రం వద్దకు వచ్చి ‘మధురా’ అంటూ విలపించాడు. ఇక్కడే ఉన్నా ఆర్యా అని పిలుపు వినిపించింది. యువరాణిని అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు. ఇద్దరూ మనసు విప్పి వారి ప్రేమను పరస్పరం చెప్పుకున్నారు. ఆమె తనను గాంధర్వ వివాహం చేసుకోమని కోరింది. కాని తల్లికి ఇచ్చిన మాట మేరకు త్వరలో శ్రీరంగనాథుని స్వస్థలం చేర్చి వస్తానని ఆమెను ఊరడిస్తాడు. అలాగే తాను మధురాంగిని తప్ప మరోకరిని వివాహం చేసుకోనని, సాధ్యం కాకపోతే అవివాహితుడిగానే ఉంటానని ఆమెకు వాగ్దానం చేసి బయలుదేరాడు.

కాలచక్రం ఆగలేదు. మరో పదేళ్లు గడిచిపోయాయి. తిరువణ్ణామలై కొండ పశ్చిమ భాగంలో  విష్ణు జెంచి చెందిన సింగవరంలో రంగనాధ దేవాలయం ఉంది. తిరుమల నుంచి రంగనాథుని అక్కడకు చేర్చి పూజాదికాలు ఏర్పాట్లు చేసారు. శ్రీరంగనివిగ్రహ పునఃప్రతిష్ఠ జరిగేవరకూ వివాహం చేసుకోనన్న గోపన్నను తల్లిదండ్రులు, కంపన ఒప్పించి కుముదినితో పెళ్లిచేసారు. వారికి కుమారుడు జన్మించాడు. శ్రీరంగని విముక్తి కొరకు గోపన్న ఆలోచన ఆగలేదు. మధుర సుల్తాన్ చర్యలపై దృష్టి పెట్టాడు. ఒకరోజు గోపన్న రంగనాథుని దర్శించి బయటకు రాగానే ఇద్దరు యువకులు ఒక వృద్ధురాలిని తీసుకువచ్చారు. వచ్చినవారిలో వల్లభుడు గోపన్నకు నమస్కారం చేసాడు. వల్లభుడు తన తల్లి వాసంతికను గోపన్నకు పరిచయం చేసాడు. ఆమె గోపన్న గారూ.. మీరు మధురను ఎప్పుడు ముట్టడించబోతున్నారని సూటిగా అడిగారు. గోపన్నచకితుడైనాడు. పదేళ్ల క్రితం తాను చేసిన ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చింది. శ్రీరంగస్వామిని ఎప్పుడు శ్రీరంగం చేరుస్తారు, అందుకే నేను బతికున్నది అంటూ ఆ వృద్ధమాత స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను స్మృహలోకి తెప్పించగా, ఆమె కన్నీళ్లతో ఉంది. గోపన్న నెమ్మదిగా “అమ్మా..ఇంకా కొద్దిరోజులు ఓపికపట్టాల్సిఉంది, తప్పదు” అన్నాడు. శంభురాయుని కోట ముట్టడి తరువాత మధుర పై దాడి చేస్తారని భావించానంది. “నిజమే.. నేనూ అలాగే ఊహించాను. బహుమనులు క్రూరులు, వారు విజయనగర పక్కలో బల్లెంలా ఉన్నారు. వారి సరిహద్దులో ఆక్రమణలను ఎదుర్కొటంతో పదేళ్లు గడిచాయి” అన్నాడు గోపన్న. ఇప్పుడిప్పుడే మన సైన్యం బలం తెలిసి తగ్గారన్నాడు. “అయితే ఇప్పుడు మధురను ముట్టడించడానికి ఆటంకాలు తొలగాయా?” అంది. బుక్కరాయలు, కంపనలతో మాట్లాడాలన్నారు. వాసంతిక మళ్లీ స్పృహ తప్పడంతో రాజు వైద్యుడి పిలిపించి గోపన్న నిష్క్రమించాడు. తన ప్రతిజ్ఞ తీరకుండా వివాహం చేసుకున్నందున ప్రతిరోజు శ్రీ రంగనాథుని క్షమాపణ కోరుతునే ఉన్నాడు. ఆవేశంతో జెంచి ఆలయానికి వెళ్లి వాసంతిక స్వామి ముందు ఈ పాలకులు అధికార  లాలసులు అంటూ నిందించిన విషయం తెలుసుకుని సిగ్గు పడ్డాడు. పూజారితో స్వామి నుంచి రెండు పూబంతుల్లో తులసి ఆకు, అరటి ఆకు పెట్టి తీసుకురండి అన్నాడు. ఆ తరువాత ఓం.. నమో నారాయణ అంటూ ఒక బంతిని తీసుకోగా తులసి ఆకు వచ్చింది. దాంతో సంతోషంగా ‘ఇంక ఆగను, స్వామి అనుగ్రహం కలిగింది.. ముందుకు వెళ్తాన’ని అన్నాడు. కంచిలో కంపన రాగానే పరిస్థితి మారింది. గోపన్న ప్రతిజ్ఞ మీరినందుకు కంపన కూడా బాధపడ్డాడు. భార్య గంగతో రాత్రి మీనాక్షి కలలో కనిపించిన ఆశీర్వదించిందని చెప్పాడు. “మధుర దుస్థితి విలపిస్తూ మీనాక్షీ చెప్పింది. అగస్త్య మహర్షి సమర్పించిన దివ్య ఖడ్గం బహూకరించింది. గోపన్నతో కూడి మధురకు చెర విడిపించమని తెలిపింది. మెలుకువ వచ్చి చూడగా నిజంగా కనిపించింది” అన్నాడు. వాసంతిక మధుర మీనాక్షి వేషంలో వచ్చి కంపనకు ఉపదేశం చేసింది. అంతకు ముందు భర్త కులశేఖరుని వద్ద పని చేసిన పరిచారిక కంపన వద్ద పనిచేస్తున్నది. ఆమె సహాయంతో ఈ పనిచేసింది వాసంతిక. అలాగే నీకు పాండ్య యువరాణి ఇచ్చిన ఖడ్గం ఇచ్చానని కుమారుడు వల్లభుడితో చెప్పింది. వల్లభుడు రోదిస్తుండగా “మనం నీ తండ్రి చనిపోయిన తరువాత సామాన్యులమే. యువరాణిని మర్చిపో” అని ఊరడించింది.

గోపన్న కంచి చేరగానే కంపన తనకు వచ్చిన కల గురించి, ఖడ్గం గురించి చెప్పాడు. అలాగే శ్రీరంగనాథుని ఆశీర్వాదం గోపన్న చెప్పాడు. సమాలోచనలో మధురసుల్తాన్ రెండు లక్షల సైన్యాన్ని ఎలా ఎదుర్కొవాలో చర్చించారు. మధురలో లక్ష, సమయపురంలో మరొక లక్ష ఉన్నారని ఒకరిపై దాడి చేసి సగం మందిని నాశనం చేస్తే మిగిలిన సగం మనం వెంట వస్తారని, ఆ తరువాత మిగిలిన లక్షపై దాడి చేయవచ్చని వ్యూహాన్ని గోపన్న చెప్పాడు. బలంతో కాక వ్యూహంతో జయించాలని నిర్ణయించారు. కంపన భార్య గంగా సలహా ఇచ్చింది. లక్ష సైన్యం ఉన్న వీరభళ్లాలుని సుల్తాన్ గూఢచారుల సహాయంతో గెలిచిన విషయం వివరించింది. గంగ ఆలోచనకు అందరూ ఆమోదం తెలిపారు.

రాజు వల్లభుడు, దత్తుడిని పిలిపించి ముస్లిం వేషాలతో మధుర పంపాడు గోపన్న. 47 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో చాలా ప్రజలు బాధలను భరించలేక మతం మార్చుకుని ఉద్యోగాల్లో చేరారు. ఎవరు ముస్లిం, ఎవరు హిందువో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఇంటి దగ్గర వీర భల్లాలుని గాథలు చెప్పుకుంటూ పగలు క్యాజీ  అంటూ కాలం గడిపేస్తున్నారు. దత్తుడు, వల్లభుడు సమయపురం చేరారు.సుల్తాను అక్కడే ఉన్నాడు. వారు ముందుగా వల్లభుడి తల్లి బంధువు సింగప్పిరాన్ ఉంటున్న అళగియమనవాళం చేరుకున్నారు. సింగప్పిరాన్ కుమారుడు తిరుమణత్తూన్ నంబిని కలుసుకున్నారు. నంబి తదితర వైష్ణవులు కావేరి ఒడ్డు నుంచి ప్రతిరోజూ శ్రీరంగనాథుని గోపురం చూసి కాని భోజనం చేయమని చెప్పడంతో వల్లభుడు ఆనందించాడు.ఇక్కడ మరో విగ్రహం సత్యమంగళం నుంచి తెచ్చారని చెప్పడంతో వల్లభుడు అవాక్కయ్యాడు. కాని అది నిజమైనవిగ్రహం కాదని బెంజి లో గోపన్న ఆధ్వర్యంలో క్షేమంగా ఉందని తెలిపాడు. ‘మా తండ్రి పేరు చెప్పి కోటలో స్వేచ్ఛగా తిరగచ్చని వారికి తెలిపాడు. మేము సుల్తాను ను దర్శించినప్పుడు  మధువు, దేవదాసిని సమర్పిస్తామ’ని అందుకు క్షమించాలన్నాడు. వల్లభుని చూసి ఆకర్షితురాలైన దేవదాసి రుక్మిణీతో సంభాషించి వల్లభుడు తన ఆశయం వివరిస్తాడు. సుల్తానును కలిసి రుక్మిణిని సమర్పించడంతో సుల్తాన్ ఖుషీ అయ్యాడు. ఎందుకు నంబికి ఆదరణ అన్నది అర్ధమైంది. రుక్మిణి సుల్తాన్ వద్దకు వెళుతూ చూసిన చూపు, ఆనాడు పాండ్య యువరాణి చూపు గుర్తుకువచ్చి వల్లభుడి మనసు బాధగా మూలిగింది. వీరిని సైన్యాధికారి వద్దకు తీసుకు వెళ్లి, వారు తమ స్నేహితులని, కోట, రాజభవనాలు చూడాలని కోరుతున్నారని తెలిపాడు. రెండు రోజులు కన్నూరు కోట మొత్తం చూసి తిరుగు ప్రయాణం అయ్యారు. సుల్తాన్ సైన్యంలో 50 వేలమంది ఐరోపా సైనికులున్నారని గ్రహించారు. వారిని పలకరించగా సుల్తాన్ చేష్టలను దుయ్యబట్టడంతో వారు యుద్ధం వస్తే సహాయం నిరాకరణ చేస్తారని అనిపించింది. సుల్తాన్‌కు ఉన్న బలహీనత ఆసరాగా ఆయనకు సుఖవ్యాధి వచ్చేలా చేసి సిద్ధం యోగి వద్దకు చికిత్సకు తీసుకు వెళ్లి వైద్యం పేరుతో విషం రసాయనాలను మింగిద్దామని వీరు ముగ్గురూ నిర్ణయించారు. నంబి ఇది ప్రమాదకరమైనది తెలిసినా శ్రీరంగనాథుని కోసం సిద్ధపడ్డాడు. రుక్మిణితో సుల్తాన్ సుఖిస్తున్నాడని తెలిసి ఆమెకు సమాచారం పంపాడు. ఆమె జీవితాంతం సుల్తాన్ ఖైదీ కంటే ప్రాణాలర్పించడమే మేలని నిర్ణయించుకుంది. సుల్తాన్‌తో తన తల్లి అనారోగ్యంగా ఉందని వారంలో వస్తానని చెప్పి గ్రామం చేరింది. అక్కడ సుఖవ్యాధిగ్రస్థుడైన యువకుడితో గడిపి మళ్లీ సుల్తాన్ వద్దకు వెళ్లింది.ఒక నెల తర్వాత సుల్తాన్‌కు రోగ బాధ తీవ్రమైంది. యూరోపియన్ వారు ఇచ్చిన మందులకు లొంగలేదు. ఆయుర్వేదానికి వెళ్లమని కొందరు చెప్పారు. ఆ సమయంలో నంబి సుల్తాన్ దుస్థితి తెలుసుకుని తాను వచ్చానని చెప్పాడు. రుక్మిణిని కలిసి మధుర సమీపంలోని వైద్యశాలకు వెళ్లమని సుల్తాన్‌కు నూరిపోయమని చెప్పాడు. సుల్తాన్ సుఖవ్యాధితో మధుర చేరాడని వార్త కంపన, గోపన్నకు అందింది. ముళ్త్వే ప్రాంతంలో యుద్ధసన్నాహాలు పర్యవేక్షించి తిరునారాయణపురం వెళ్లి దేశీకులవారి ఆశీర్వాదం తీసుకున్నాడు. తన ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని ఓదార్చాడు. నేను జీవించి ఉండగా రంగనాథుని సేవించుకునే భాగ్యం కోసం ఎదురు చూస్తున్నానన్నాడు.

1371లో యుద్ధానికి విజయనగరం సైన్యం సిద్ధమైంది. రోజురోజుకీ ఆయుధాలతో ప్రజలు సైన్యంలో చేరుతున్నారు. శత్రుపక్షం నుంచి కూడా తమ సైన్యంలో చేరుతున్న సంఖ్యను చూసి ఆశ్చర్యపోతున్నారు. బెంజి నుంచి శ్రీరంగనాథుని విగ్రహాన్ని తెప్పించడంతో ప్రజలు ఆనందానికి అంతులేదు. నాలుగురోజులకు సైన్యం సమయపురం చేరింది. సత్యమంగళం నుంచి సోమన్న ఆధ్వర్యంలో మరో బృందం వీరితో కలిసింది. సుల్తాన్ సైన్యం కోట వెలుపల 50 వేల మంది, లోపల 50 వేలమంది ఉన్నారు. కోట లోపలకి వెళ్లిన వల్లభదత్తులకు అతృతతో ఎదురు చూస్తున్నారు. సుల్తాన్ లోపల, బయట సైన్యాన్ని కలవనీయకూడదని గోపన్న వ్యూహం చేసాడు. వీరికి తోడు గంగాదేవి నాయకత్వంలో స్త్రీ సైన్యం కూడా కలిసింది. సైన్యం వెనుక భాగాన శ్రీరంగనాథుడు ఉన్నాడు. విగ్రహం వద్దకు గోపన్నచేరి రావణుని వధించే  ముందు రాముడు పఠించిన ఆదిత్యహృదయాన్ని పఠించి స్వామిని దారి చూపమని ప్రార్థించాడు. ఇంతలో దక్షిణ దిశలో అలికిడి వినిపించింది. ఒక శ్రీవైష్ణవుడు కత్తిపోట్లతో నెత్తురు కారుతూ గోపనాచార్యులను కలవాలని వచ్చాడు. నాపేరు ఉత్తమ నంబీ, నన్ను వల్లభుడు పంపాడని తెలిపాడు. యుద్ధం ప్రారంభించమన్నారని  నంబీ తెలిపాడు. నంబికి చికిత్స చేయించమని ఆదేశించి గుర్రాన్ని గోపన్న పరిగెత్తించాడు. కోట వెలుపల ఉన్న విదేశీ సైన్యాన్ని ఊచకోత ప్రారంభించారు. సుల్తాన్ సైన్యం బయటకు రావడంతోనే వారి తలలు గాలిలో ఎగిరాయి. అపారమైన విజయనగర సైన్యాన్ని చూసి సుల్తాన్ సైన్యం ఆయుధాలు పడేసి పరుగులు ప్రారంభించారు. లొంగిపోయిన వారు మతం మారినా హిందువులుగా గోపన్నకు శరణువేడారు. తమకు అవకాశం ఇస్తే లోపలికి వెళ్లి ఐరోపా సైన్యాన్ని తుది ముట్టడిస్తామని ప్రాధేయపడ్డారు. ఇంతలో వార్తాహరుడు వచ్చి ఉత్తమ నంబికీ స్మృహవచ్చిందని చెప్పి గోపన్నకి ఒక సమాచారం అందించాలని చెప్పాడని చెప్పాడు. గోపన్న తంబిని కలవగా తాను గోదాదేవి వంశం వాడినని చెప్పాడు. యుద్ధం వార్త తెలియగానే సుల్తాన్ అప్రమత్తమై సైన్యానికి ఆదేశాలు జారీ చేసాడు. ఐరోపా సైనికులు యుద్ధంలో పాల్గొనాలని ఫర్మానా ఇస్తూ 20 మంది ముసల్మాన్ యోధులను కన్ననూరు పంపాడు. విషయం తెలిసి దత్తుడు, వల్లభుడు ధైర్యంగా వారిని మార్గంలో చంపి వేసారు. కోట ముట్టడి చేయమని మీకు సమాచారం అందజేస్తామన్నారు. ఐరోపా వారిని బయటకు రాకుండా చూసుకుంటామన్నారని నంబి చెప్పాడు. ఇంతలో సుల్తాన్ సైనికులు మా గ్రామానికి తిరిగి వచ్చిదాడి చేసారు. సుక్షితులైన మేము వారిని నరికివేసాం. కాని వారు వెనక నుంచి  కత్తులతో దాడి చేయడంతో గాయపడ్డామన్నారు. అప్పుడు వల్లభుని సందేశం గుర్తుకు వచ్చి నేను అతి కష్టంతో దేకుతూ వచ్చానన్నాడు ఉత్తమ నంబి. అతని దేశభక్తి, శ్రీరంగనిపై భక్తికి గోపన్న ఆశ్చర్యపోయాడు. గోపన్న మరునాడు మధుర ముట్టడించారు. వ్యూహాలతో ఎక్కడికక్కడ తన సైన్యాన్ని పెట్టాడు. లొంగిపోయిన సైనికులు బ్రతిమాలితే వారిని కోట లోపలకు పంపాడు. శుభవార్త కోసం గోపన్న ఎదురుచూస్తున్నాడు. ఒక్కసారిగా కోట నలుమూలల నుంచి పొగ, ఆర్తనాదాలు వినిపించాయి. తూర్పు ద్వారం తెరుచుకుని ఐరోపా సైనికుల తలలు క్రిందకు పడుతున్నాయి. క్రిందకు తాళ్లతో దిగుతున్న ఐరోపా సైన్యాన్ని బాణాలతో కొట్టమని తమ సైనికులకు చెప్పాడు గోపన్న. ఎట్టకేలకు గోపన్న కన్ననూరు కోట స్వాధీనం చేసుకున్నాడు. సమయపురం విజయానంతరం కోట మొత్తం పరికించగా ఒక సొరంగంలో వల్లభదత్తులు బందీలుగా ఉన్నారు. గోపన్న స్వయంగా వారి కట్లు విప్పి నిజమైన విజయనగర వీరులు మీరేనని అభినందించాడు. వారిమెడలో రత్నాల, ముత్యాల హారాలు వేసారు. హెయశలేశ్వరుని ఆలయంలోకి వెళ్లగా అది దేవాలయంగా కాక ఆయుధాగారంగా ఉంది. గోపన్న మూలానికి ఉన్న విగ్రహాలను తెప్పించి పూజారిని రప్పించి కంపన తో కలిసి ప్రార్ధన చేసారు.మరునాడు శ్రీ రంగనాథుని శ్రీరంగంలో ప్రతిష్ఠకు పోతున్నామని అందరి ముందు గోపన్న ప్రకటించాడు. అందరూ జైరంగనాథా అని నినాదాలు చేసారు. సమయపురం నుంచి ఊరేగింపుగా శ్రీరంగడు బయలుదేరి ప్రజల జేజేల మధ్య అళగియమనవాళ గ్రామం చేరుకుంది. తిరుమలలో వేయికాళ్ల మండపం నిర్మించిన సాళువ నరసింహ రాయుడు మనవడు తదితర నాయకులు బిగ్గరగా రంగారంగా అంటూ పల్లకీ మోసారు. గంగాదేవి నోటి వెంట ఆశువుగా శ్లోకాలు వస్తున్నాయి. శ్రీరంగానికి స్వామి ఇద్దరు దేవేరీలతో శ్రీరంగడు భక్తుల జేజేలు మధ్య వైభవోపేతంగా చేరాడు. గోపన్న మాట్లాడుతూ వేదాంత దేశికుల వారు స్వామివారి గర్భగుడికి అడ్డుగోడ కట్టారు. ఆయన నేడు శతాధిక వృద్ధులు. ఆయన చేతులమీదగా మళ్లీ పునః ప్రతిష్ఠ జరుగుతుందన్న గోపన్నమాటలకు ప్రజలు కరతాళధ్వనులు చేసారు. గాయపడిన నంబిలిద్దరిని మంచాల మీద తీసుకు వచ్చారు. ఇంతలో కలకలం రేగింది. వల్లభుని గోపన్న ఏమిటని ప్రశ్నించగా ఈ విగ్రహం నిజమైనదని వాదనలు జరుగుతున్నాయన్నారు. రెండు విగ్రహాలనూ  ఏది అసలేమైంది తేలేవరకూ పూజిద్దామని పెద్దలు నిర్ణయించారు. ఇంతలో కంపన నుంచి కబురు వచ్చింది. గోపన్న గబగబా బయటకు వచ్చి వల్లభా! రేపే మనం మధురపై దండయాత్ర చేయబోతున్నామన్నాడు. సుల్తాన్ తల తెగి పడే క్షణం కోసం ఎదురు చూస్తున్నామన్నాడు. కంపన కు రక్షణగా ఉండాలన్నారు. వారు 30 వేల సైన్యంతో బయలుదేరితే 50 వేలు దాటింది. చివరకు లక్ష దాటనుందని వల్లభదత్తులు గోపన్న చెవిన వేసారు. ఐదురోజుల్లో సైన్యం ఉత్సాహంగా మధుర సరిహద్దులకు చేరుకుంది. కావేరి దాటి వైఘైనది ఓడ్డున ఉన్న మధుర వైపు సైన్యం సాగింది. గోపన్న నీవు కన్ననూరు విజయం సాధించావు. నాకు మధురపై యుద్ధం చేసి సుల్తాన్‌ను వధించే అవకాశం ఇవ్వమని కంపన కోరాడు. తాము వెంటే ఉంటామని గోపన్న అన్నాడు. మధ్యాన్నానికి మధుర కోట వద్దకు చేరుకున్నారు.10 అడుగులలోతున్న అగడ్తకు నీరు ఆపివేశారు. కోటనుంచి ఎవరూ బయట రాలేదు. మరుసటి రోజు కోట ముట్టడి ప్రారంభించారు. కోటలోపలికి అగ్ని గోళాలు, బాణాలు సంధించారు. కొంతమంది తాళ్లతో పైకి వెళ్లే ప్రయత్నం చేసారు. ఏనుగులతో కోట తలుపులు బద్దలు కొట్టించారు. కోటలోకి సైన్యం ప్రవేశించింది. కోట తన చేతులు  దాటిపోతున్నదని సుల్తాన్ బహృద్దీన్ స్వయంగా యుద్దానికి వచ్చాడు, కంపన, సుల్తాన్ సింహాల్లా పోరాడుతున్నారు. వల్లభ, దత్తులు కంపనకు రక్షణగా నిలబడ్డారు. భీకరపోరాటంలో కంపన కత్తిని సుల్తాన్ నాభిలో పోడిచాడు. కత్తి నడుం నుంచి బయటకు వచ్చింది. శరీరం రెండు ఖండాలుగా కూలడానికి సిద్ధంగా ఉన్నస్థితిలో కత్తిని మెడమీద వేసాడు. మెడ తెగి మొండెం నుంచి వేరు కానుండగా గోపన్న ఎక్కడి నుంచి వచ్చాడో గానీ తలను శూలానికి గుచ్చి పైకి లేపాడు. సుల్తాన్ మొండం క్రింద పడిపోయింది. శూలాన్ని పైకెత్తి నమో నారాయణ అంటూ అరుస్తూ తన ప్రతిజ్ఞ నెరవేరినందుకు ఆనందంగా కదనరంగం చుట్టూ.. కలియ తిరిగాడు. సైనికులు సుల్తాన్ తలను బంతిలా ఆడుకున్నారు. ప్రజలు హర్షంతో జైజై కంపన, జైజై గోపన్న జయహో అని కేకలు వేసారు. తురుష్కులు కోటను వదిలి అడవుల్లోకి పారిపోయారు. మధుర వీధుల్లో వరాహపతాకం రెపరెప లాడింది. వేద పండితులు పూర్ణ కుంభంతో ఆలయంలోకి కంపనను తీసుకువచ్చారు. రాతి గోడ తొలగించడంతో మూల విగ్రహం మధుర మీనాక్షి అందరికీ దర్శనం ఇచ్చింది. 48 సంవత్సరాలు క్రితం అలంకరించిన విగ్రహం ఇప్పటికీ తాజాగా ఉండడం చూసి కంపన ఆనందాతిరేకంతో ‘తల్లీ.. ఇక్కడ పెద్ద కోవెల నిర్మిస్తానని. ఆశీర్వదించాలని’ నమస్కారం చేసాడు. వేదాంత దేశికులవారు పల్లకీ వద్దని కాలినడకన వస్తున్నారని, రేపు చేరుకుంటారని సమాచారం వచ్చిందని గోపన్న చెప్పాడు. శ్రీరంగనాథుని ప్రతిష్ఠ అనంతరం కంపనరాయలకు పట్టాభిషేకం బుక్కరాయలు నిర్ణయించారని తెలిసి అందరూ ఆనందం వ్యక్తం చేశారు.

ఏది అసలైన విగ్రహం అనే విషయంపై ఇంకా వాదోపవాదాలు జరుగుతున్నాయి. తాము కష్టపడి  ప్రేమతో తెచ్చిన విగ్రహాలపై భక్తులు సందేహించడం వల్లభునికి నిరుత్సాహం కలిగించింది. 102 ఏళ్ల దేశీకులవారు  మేల్కొట  నుంచి శ్రీరంగం కాలినడకన చేరుకున్నారు. దేశీకులవారి సలహా మేరకు రెండు విగ్రహాలను పక్క పక్క పెట్టించారు. 60 ఏళ్ల పైబడిన వారు, శ్రీరంగనాథుని గతంలో దర్శించుకున్నవారు దేవాలయానికి రమ్మని గోపన్న దండోరా వేయించారు.  తురుష్కుల దాడులతో అందరూ ఊరువిడిచి పోవడంతో ఎవరూ రాలేదు. చివరకు కొందరు 90 ఏళ్ల వృద్ధుని తీసుకొచ్చారు. అతని కళ్లు తురుష్క సైనికులు లొట్టలు చేసారు. ఆయనకు కనపడవు. దాంతో ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. చివరకు గోపన్న భక్తులను అతను చెప్పేది వినమన్నాడు. అతను గ్రామవాసులను ఉద్దేశించి నేను రజకుడ్ని. ఆ రోజుల్లో అభిషేకం తరువాత స్వామి బట్టలు నేను శుభ్రం చేసేవాడిని. దాంతో అందరూ అతని పట్ల ఆదరంగా చూసి ఏమి చెబుతాడోనని వినసాగారు. స్వామి దివ్య వస్త్రాలను ఉతికే ముందు నాకు ఒక అలవాటు ఉంది. వస్త్రాలను ఉతికే ముందు నీటిలో ముంచి, పిండి ఆ నీటిని పవిత్రతీర్థంగా తీసుకునే వాడినన్నాడు. రెండు విగ్రహాలను దుస్తులు కట్టి అభిషేకించి వాటిని తనకిమ్మన్నాడు. దేశీకుల వారి ఆదేశంతో అభిషేకం తరువాత ఆ దుస్తులు రజకునికి ఇప్పించారు. వృద్ధుడు ఏమి చెబుతాడా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొదట ఆకుపచ్చని పట్టువస్త్రాలు పిండి తీర్థంగా తీసుకున్నాడు. రెండోది ఎర్రపట్టు వస్త్రం పిండి తీర్థంగా తీసుకున్నాడు. ఎర్రపట్టువస్త్రం నుంచి నాకు మునపటి రుచి వస్తున్నది. ఇదే అసలైన రంగనాథుడని, “కరుణించావా స్వామి” అని నిర్ధారించాడు. గోపన్న అతడ్ని తగురీతిలో సత్కరించి, ఇకపై కూడా నీ వంశీకులే రంగనాథుని వస్త్రాలు శుభ్రం చేయాలన్నాడు. ఆ జనం మధ్యలోంచి ఒక వస్తాదు వచ్చి తాత నీ చివరి కోరిక తీయడమే కాదు, రంగనాథుని గుర్తించే భాగ్యం కలిగిందన్నాడు. గోపన్న ఆ వస్తాదును విజయనగరం కోటలో చూసినవాడిగా గుర్తించి భుజం తట్టాడు. అందరూ గర్భగుడిలో ప్రవేశించి స్వామిని దర్శించుకున్నారు.ఇంతలో భారీ వర్షం పడింది.సంపెంగి వృక్షం మొదట్లో ఎదో మెరుస్తోంది. దేశీయులవారు గుర్తుకు వచ్చి రంగనాయకి మూల విగ్రహాన్ని వెలికి తీయించారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నగరం మొత్తం పులకించింది. అక్కడికి వచ్చిన రాజులు, సామంతులు తమ శక్తి మేరకు స్వామి వారికి బంగారు నాణేలు సమర్పించారు. ఆ రోజు రాత్రి గోపన్నకు ఎలాంటి భయానక కలలూ లేకుండా ప్రశాంతంగా శ్రీరంగనాథుడు దర్శనమిచ్చాడు. కంపనరాయలుకు మధురలో రాజ్యాభిషేకం జరిగింది. అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. పాండ్య రాజకుమారి మధురాంగి భర్తతో రావడంతో వల్లభుడు ఖిన్నుడయ్యాడు. తండ్రి చనిపోతూ చివరి కోరికగా తప్పని సరిగా చేసుకుందని వారితో వచ్చినవారు తెలిపారు. ఈ సందర్భంగా గంగాదేవి మధురా విజయం అనే వీర కంపరాయ చరితం అనే గ్రంథాన్ని రచిస్తున్నానని తెలిపింది. అంత దేవాయీ మహారాణి గంగను కంపన నీ అందం చూసి మొహించాడనుకున్నాం గాని నీవు కాకతీయరాణి మరో రుద్రమదేవి అని పొగిడింది. కంపన తన మిత్రుడు గోపనాచార్యుడే మధురవిజయానికి మాలకారకుడని సన్మానించాడు. సర్వసైన్యాధ్యక్షులు గోపన్నకు జై అని ప్రజలు కేకలు పెట్టారు. విప్రులు కూడా శౌర్యపరాక్రమాలతో ప్రభువులు కావచ్చని మా గోపన్న రుజువు చేసాడని  బుక్కరాయలు అభినందించాడు. శ్రీరంగనాథుని తూర్పు గోపురాన్ని దేశీయులు వారి సూచనతో వెళ్లాయి గోపురంగా పిలుద్దామన్నాడు కంపన. దేవదాసి త్యాగానికి చిహ్నంగా ఆమె పేరు మీద వెల్లాయిగా పెట్టామన్నారు. మధురా విజయంలో ఈ సంఘటనలు కూడా ప్రస్తావించాలని గంగాదేవికి కంపన తెలిపాడు. అల్లాఉద్దీన్ ఖిల్జీ శ్రీరంగం పై దాడి చేసి 23 వేల బ్రాహ్మణులను, శ్రీవైష్ణవులను ఊచకోత కోసిన విషయం విదితమే. అప్పుడు ప్రతిఘటించిన మరో 12 వేలమందిని ప్రజలను చంపాడు. ఆలయంలోని బంగారం మొత్తం దోచుకున్నారు. ఉత్సవ దివ్యమూర్తులు స్వర్ణమయం. వాటిని ఢిల్లీ తీసుకువెళ్లాలని  చేసిన ప్రయత్నం విఫలం చేస్తూ పిళ్తైలోకాచార్యులు ఉత్సవ విగ్రహాలతో మధుర పారిపోయారు. తిరునల్వేలి తీసుకు వెళుతూ మరణించారు. ఆ తరువాత తిరుమల చేర్చడం తెలిసిందే. 1323లో బయటకు వచ్చిన విగ్రహాలు 1371 వరకూ దేవాలయం చేరలేదు. గుడి మీద దాడి చేసినప్పుడు వెళ్లాయి అనే దేవదాసి సైన్యాన్ని తన ఆటపాటలతో అలరించడంతో లోకాచార్యులు బయటకు వెళ్లగలిగారు. సైన్యాధిపతిని తూర్పు గోపురం పైకి తీసుకువెళ్ళి క్రిందకు తోసి వేసింది. అనంతరం తానూ దూకి ఆత్మత్యాగం చేసింది. దేవదాసీలు మరణించినప్పుడు రంగడి ఉగ్రాణం నుంచే అంత్యక్రియలకు నిప్పు వెళ్లే ఆచారం ఉంది. ఇవన్నీ మధురా విజయంలో ప్రస్తావిస్తానని గంగ తెలిపింది. మధురాంగి వివాహం అయిందని తెలిసి వల్లభుడు విరాగియై శ్రీరంగనాథుని సేవలో ఉండిపోయాడని గోపన్న చింతిస్తూ భార్య కుముదినితో చెప్పాడు. వారి కుమారుడు అయ్యన్న నాన్నగారూ! ఆ మేఘాలు శ్రీదేవి భూదేవి సహిత రంగనాథునిగా కనిపిస్తున్నాడన్నాడు. అయ్యన్నను మహా వీరుడిని చేస్తారా, అమాత్యుడ్ని చేస్తారా అన్న భార్య ప్రశ్నకు మనం నిమిత్తమాత్రులం, శ్రీరంగనాథుని చిత్తం మేరకు అన్నీ జరుగుతుందన్నారు. తురుష్కుల పాలనలో జీర్ణమైన దేవాలయాలు పునరుద్ధరణే తన జీవిత ధ్యేయమని చెప్తూ జై శ్రీరంగ.. రంగ అన్నాడు.

***

మహాసేనాని గోపన్న (చారిత్రక కాల్పనిక నవల)
రచన: టేకుమళ్ళ వెంకటప్పయ్య
ప్రచురణ: టేకుమళ్ళ ప్రచురణలు,
పేజీలు: 334
వెల: ₹ 150.00
ప్రతులకు: 9490400858,
9110580418

Exit mobile version