(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
నా పేరు మహతి. నాకో అన్న, ఒక తమ్ముడు. మా ముగ్గురి తర్వాత చాలా కాలానికి అంటే నాకు అయిదేళ్ళు వుండగా పుట్టిన కళ్యాణి, నా చెల్లి. మా నాన్న పేరు గౌతమ్. ఆయన పేరుకి తగ్గట్టే మా అమ్మ పేరు అహల్య. మా నాన్నకీ, అమ్మకీ కూడా శరత్ సాహిత్యం అంటే ఇష్టం. అందుకే మా అన్న సురేంద్రని సురేన్ అనీ, తమ్ముడు నరేంద్రని నరేన్ అనీ పిలిచేవారు. నన్ను మహీ అని మా వాళ్ళు పిలిచేవాళ్ళు. మా నాన్న మా అమ్మని అహీ అని పిలిచేవాడు. ఇహ మా చెల్లెలి కైతే బోలెడు పేర్లు. కల్యాణీ అనో, కల్లూ అనో, కన్నీ అనో, ఇవేవీ కాకుండా ‘చంటి’ అనో పిలిచేవాళ్ళం. అది మహా ఇంటెలిజెంట్. నా అన్నాతమ్ముడు కూడా మాంఛి క్లెవర్లే. నా విషయానికొస్తే నేనంత ఇంటెలిజెంట్‍ని కాను అనే చెప్పాలి. కారణం మా తాతయ్య, అమ్మమ్మ.
వాళ్ళకి మా అమ్మ ఒక్కర్తే కూతురు. ఉండేది ‘కర్రావూరి ఉప్పలపాడు’లో. అదో తింగరి వూరు. నాకు మూడేళ్ళ వయసప్పుడు మా అమ్మానాన్నల్ని బతిమలాడి నన్ను వాళ్ళ వూరికి తీసికెళ్ళారు. నాకు అయిదో ఏడు వచ్చేవరకు ఇంట్లో చైత్రమూ వైశాఖమూ చెప్పడమే గాని బళ్ళో వెయ్యలేదు.
మా నాన్న మా తాతయ్యని బెదిరించి నన్ను బళ్ళో చేర్చాడు. బళ్ళో వెయ్యకపోవడానికి కారణం నన్ను వాళ్ళు క్షణం కూడా వదిలి వుండలేకపోవడం అని తరవాత చెప్పారు. కర్రావూరి ఉప్పలపాడు తింగరి వూరు అని చెప్పాను గదా.. ఆ వూరి గురించి చెప్పకపోతే నా అసలు సిసలు పరిచయం మీకు కలగదు.
“ఏవండీ బాగున్నారా?” అని ఎవర్నైనా సరే అడగండి.
“ఏటీ? నేను సత్తే బాగుంటాదని అనుకుంటున్నావా?” అని ఇంతెత్తున లేస్తారు.
“కోపం ఎందుకండీ.. నేనడిగింది బాగున్నారా అని. అంతే కదా?” అన్నారనుకోండీ, “ఇంతింత కళ్ళున్నై, కనపట్టం లేదా? బాగులేకపోతే బజారు కెట్టా వత్తాను?” అని ముఖం చిట్లిస్తారు. అదే మనిషి నీరసంగా ఎక్కడన్నా కనిపించారనుకోండి.
మీరేం చేస్తారూ? గత అనుభవం గుర్తుకొచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ దారిన మీరు పోయే ప్రయత్నం చేస్తారు. అవునా?
అయితే వాడు మాత్రం వూరుకోడు. అంత నీరసంలోనూ ఠక్కున లేచి “ఏవయ్యా ఎదురుగుండా నీరసంగా వున్న నన్ను చూసి కూడా ఎల్లిపోతన్నావంటే ఏమనుకోవాల? మొహం మొహం తెలిసినోళ్ళం గదా.. మంచీ చెడ్డా కనుక్కోవద్దా..?” అని దీర్ఘాలు తీస్తాడు. అయ్యా ఇదీ మా వూరోళ్ళ సంగతి. అయితే దేనికామాట చెప్పుకోవాలి.. వెటకారాలే గానీ, కొట్లాటలు దెబ్బలాటలు వుండేవి కాదు.
ఏ క్షణంలో మా నాన్న నన్ను స్కూల్లో బలవంతంగా చేర్చాడో గానీ, ఎంత చదివినా ఏవరేజ్ మార్కులు తప్ప ఏనాడూ ‘క్లాసు’లు రాలేదు. మిగతా వాళ్ళందరూ ఫస్టు క్లాసూ సెకండు క్లాసూ డిస్టింక్షనూ అని చెప్పుకుని జబ్బలు చరుచుకుంటుంటే నేను మాత్రం కేవలం పాస్ మార్కులతో ఓ తరగతి నుంచి మరో తరగతికి పాకుతూ వుండేదాన్ని. ఇద్దరు మాస్టర్లు మాత్రం నాకు తెలీని నాలో వున్న టేలెంట్‍ని గుర్తించారు. వాళ్ళల్లో మొదటిగా చెప్పుకోవల్సింది రామ్ చరణ్ గార్ని. ఆయన ‘రాజశ్రీ’ అనే కలం పేరుతో కథలు రాసి పత్రికలకి పంపేవారు. చాలా బాగా పాటలు పాడేవారు. 6th లో వుండగా అందరి చేతా తలో పల్లవీ బలవంతంగా పాడిస్తూ నేను పాడగానే “యా..! అద్భుతం!!” అని మెచ్చుకున్నారు. అంతేకాదు, ఆయన స్వయంగా రాసుకుని ట్యూన్ కట్టుకున్న పాటల్ని నాకు నేర్పి ఫంక్షన్స్ లోనూ యానివర్సరీ రోజుల్లోనూ పాడించేవారు. అలా నా 10th వరకూ ఎన్నో బహుమతులు నేను గెలుచుకున్నాను.
“మా మహీని పాటల్లో కొట్టేవాళ్ళు యీ జిల్లాలోనే లేరు!” అని ఆయన గర్వంగా అందరితో చెప్పేవారు.
ఇక మా రెండో మాస్టరు సీతారామాంజనేయులు గారు. ఓ రోజున నేను నాకంటే ‘మొద్దు’ అయిన అన్నపూర్ణకి ఓ సైన్సు పాఠాన్ని వివరించే ప్రయత్నం చేస్తుంటే గమనించి, “మహతీ.. నువ్వు బేడ్ స్టూడెంట్‍వే, అంటే, ఏవరేజ్ స్టూడెంట్‍వే కావొచ్చు, కానీ ఫెంటాస్టిక్ టీచర్‍వి కాగలవు! బాగా కృషి చెయ్యి” అని బాగా ప్రోత్సహించారు.
మా అమ్మానాన్నా అన్నదమ్ములూ వున్నది పట్నంలో. నేను పెరిగింది పల్లెటూరిలా వుండే ఒక చిన్న టౌన్‍లో. సెలవుల్లో అమ్మానాన్నల దగ్గరకి వెళ్ళేదాన్ని. నేను వెళ్ళిన మరుసటి రోజే మా తాతయ్యా అమ్మమ్మా దిగేవాళ్ళు. నేనంటే అంత ప్రేమ వాళ్ళకి. సెలవులన్నీ హాయిగా గడిచిపోయేవి. సినిమాలూ షికార్లే కాక నవల్సు బాగా చదివేదాన్ని ఆ సెలవుల్లో.
యండమూరీ మల్లాదీ – మల్లాదీ యండమూరీ – ఇలా ఎవరు గొప్ప అని ఫ్రెండ్స్‌తో చర్చలు జరిగేవి. మా ఇంట్లో అలాంటి చర్చలు జరిగితే మా అమ్మా నాన్న నవ్వి “వీళ్ళు సరే, అసలు చదవలవలసిన వాళ్ళు ఎందరున్నారో తెలుసా?” అని ఓ పెద్ద లిస్టు చదివారు. విశ్వనాథ, కొడవటిగంటి, గోపీచంద్, తిలక్, శరత్ చంద్ర, మైకేల్ మధుసూదన దత్, ముళ్ళపూడి, శ్రీశ్రీ, ఆరుద్ర.. ఓరి నాయనోయ్.. ఎందరి పేర్లో. తెన్నేటి హేమలత, మాలతీ చందూర్, రామలక్ష్మీ ఆరుద్ర, యద్దనపూడి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, అబ్బూరి, కోడూరి.. అబ్బా.. ఇంతమంది రచయిత్రులా అనిపించింది. తెగ చదివేశా. కొన్ని నన్ను వూహల్లో తేలిస్తే మరికొన్ని నన్ను మౌనంలోకి నెట్టేవి. లైబ్రరీ లోనే గంటలు గంటలు గడిచేవి.
అప్పుడు పరిచయమయ్యాడు అభిలాష్. నాకంటే రెండేళ్ళు పెద్ద. క్వయిట్‍గా కూర్చుని ‘అనువాద నవలలు’ చదువుతూ వుండేవాడు. క్యూరియస్‍గా ఓ రోజు అతను చదివే నవల పేరు చూశా. ‘కౌంట్ ఆఫ్ మాంట్‍క్రిస్టో’ అనుంది.
అతను దాన్ని చదివేశాక చదివే ప్రయత్నం చేశాను. అన్నీ ఇంగ్లీషు పేర్లూ, మనది కాని వాతావరణం.
“చదువు మహతీ, చాలా బాగుంటుందీ!” అన్నారు లైబ్రేరియన్ విశ్వం.
“వొద్దండీ.. నాకు ఎక్కట్లా” చెప్పాను.
“చదివితేగా ఎక్కేది!” నవ్వారు విశ్వం గారు.
“తరవాత చదువుతా!” పోస్ట్‌పోన్ చేసి, మాదిరెడ్డి సులోచన నవల ఒకటి పట్టుకున్నా.
మూడో రోజున అభిలాష్, అదే, ‘అభీ’ అన్నాడు, “మీరు అనువాదాలు ఎక్కవన్నారుట గదా.. నేనూ అలానే అనుకున్నా.. చదివాక పిచ్చెక్కింది. ఇదిగో ముందు యీ పుస్తకం చదవండి. చాలా బాగుంటుంది!” అని ‘ప్రకృతి పిలుపు’ అనే (జాక్ లండన్ నవలకి అనువాదం, ఒరిజినల్ పేరు ‘కాల్ ఆఫ్ ద వైల్డ్’) పుస్తకం చేతిలో పెట్టాడు.
10th పరీక్షలైనా నన్ను అప్పటి దాకా ‘మీరు’ అని ఎవరూ పిలవలేదు. నేను పెద్దమనిషినయ్యిందీ ఆ సంవత్సరమే. అయినా ‘పైటలు’ మాత్రం వేసుకునేదాన్ని కాదు. అంత అవసరమూ రాలేదు.
అతను నన్ను ‘మీరు’ అని సంబోధించడం నాకు చాలా చాలా నచ్చింది. ఎంతగా అంటే, అతను చెప్పాడు గనక ఆ నవలని చదివి తీరాలి అనుకునేదాకా.
అది ‘బక్’ అనే ఓ కుక్క జీవిత కథనం. అలస్కా చలీ, స్లెడ్జి బళ్ళ (కుక్కలు లాగే బండి లాంటి దాన్ని ‘స్లెడ్జ్’ అంటారు) పోటీలూ, బక్‍ని ఓడించాలని చూసే ‘స్పిడ్జ్’ పైయ్యెత్తులు నన్నో మాయలోకానికి తీసుకుపోయాయి.
ఇక ఆ తరువాత నాకూ అనువాదాల పిచ్చి పట్టుకుంది. ఇదంతా అసలెందుకు చెబుతున్నానా అని కదూ మీరు అడిగేది?
జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్ని మలుపులూ నా విషయంలో తిరిగింది. ఒక సామాన్య మధ్య తరగతి ఆడదాని జీవితంలో ఏవుంటుందీ జరగడానికీ, అనే ప్రశ్న అందరిలోనూ వుదయిస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. అయితే ఏది అయినా జరిగింది జరిగినట్టు యథాతథంగా రాస్తే? భారతీయ పవిత్రాత్మలు పగిలి ముక్కలైపోవూ? అందుకే ఏ ఆడదీ పెదవి విప్పదు. విప్పితే భూనభోంతరాళాలు పిక్కటిల్లిపోతాయి.
బట్.. హు కేర్స్? నేను లెక్క చెయ్యదలచుకోలేదు. అందుకే పాఠకులారా.. తరవాత నేను రాసేదాన్ని చదవాలో వద్దో మీరే నిర్ణయించుకోండి. నాకు తెలుసు – అందరూ ‘సుగర్ కోటెడ్’ టాబ్లెట్లకీ, కాప్సుల్స్‌కీ అలవాటు పడ్డారని. నేను మాత్రం సుగర్ కోటింగ్ ఇవ్వదలచుకోలేదు. ఎందుకంటే నిజంగా చేదుగానే వుంటుంది మరి!
నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ ప్రకారం నాకు పాటలు పాడటం వొచ్చనీ, మంచి పాఠకురాలిననీ మీకీ పాటికి అర్థమయ్యే వుంటుంది. ఆ రెండూ ప్లస్ పాయింట్లే. అంతేకాదు కొద్దో గొప్పో గర్వించదగ్గవి కూడా.
పద్మాల్ని చూసి మైమరిచిపోయేవాడు, వాటి కిందున్న బురదని గమనించడు. గమనించినా పెద్దగా పట్టించుకోడు. వాటి అందం అటువంటిది. మరి అందగత్తె అయిన పిల్లకి బురద అంటితే గమనించినా పట్టించుకోకుండా వుండగలడా? పద్మం అందానికీ పడతి అందానికీ తేడా ఏమిటీ?
“తప్పమ్మా..! చెప్పినట్టు వినాలి. అంతేగాని ప్రతిదానికీ ప్రశ్నలు వెయ్యకూడదు..!” అమ్మమ్మ రోజుకు పదిసార్లు అయినా ఇదే మాట అంటూ వుండేది నాతో. కారణం నేను ప్రశ్నలు వెయ్యడం.
“ఎందుకు వెయ్యకూడదు?” నేను.
“ఆడపిల్లలంటే బుద్ధిగా చెప్పినట్టు వినేవాళ్ళన్న మాట. అప్పుడే పుట్టింట్లోనూ అత్తవారింట్లోనూ మంచి ‘పేరు’ వస్తుంది!”
“నా పేరు నాకుందిగా.. మహతి.. అది మంది పేరేగా?” నేను.
“పేరంటే ఆ పేరు కాదు. నీకు తెలీదులే ఇప్పుడు. పెద్దయ్యాక చెబుతా!” కొంచెం చికాగ్గా అమ్మమ్మ.
5వ తరగతి అంటే 5th స్టాండర్డ్‌లో అడిగిన అదే ప్రశ్నని 10th చదువుతుండగా అమ్మమ్మనే అడిగాను.
“ఓసి భడవా.. ఎంత గుర్తే నీకు!” అని ఆశ్చర్యపోతూ మురుసుకుందే గానీ సూటిగా సమాధానం చెప్పలేదు.
కానీ నాకు కొంత తెలిసింది.
10th పరీక్షలు అవంగానే నా క్లాస్‍మేట్ కుసుమకి పెళ్ళి చేశారు. కారణం ఏమంటే వాళ్ళ బామ్మ చావు బతుకుల్లో వుండి మనవరాలి పెళ్ళి చూడాలని అన్నదిట.
ఎంత గొప్పవాళ్ళం మనం..!
చచ్చేవాళ్ళ కోసం బతికున్నవాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపెయ్యగలం. అర్జంటుగా సంబంధం వెతికి మూడు ముళ్ళూ వేయించారు. అది ఒకటే ఏడుపు. పెళ్ళికొడుక్కీ కుసుమకి తొమ్మిదేళ్ళు తేడా. తేడా సంగతి పక్కన పెడితే ఆ మహానుభావుడికి చాలా ‘సుగుణాలు’ వున్నాయని తరవాత తెలిసింది. కాపరానికి పోయే ముందు ఒకే ఒక్క మాట అది నాతో అన్నది.. “మహీ.. యీ పెళ్ళి నిజంగా నా మనసుని చంపేసిందే. నిన్న రాత్రి జరిగింది శోభనం కాదు వెకిలితనంతోనూ ‘ఆబ’తోనూ కూడుకున్న ఓ నాటకం.. ఒకే ఒక్క విషయం వుంది.. గుడ్డిలో మెల్ల లాగా.. యీ భర్త అనే ప్రబుద్ధుడి ఇంటి పేరు నా ఫేవరెట్ నాగార్జున ఇంటి పేరే!” అన్నది. నాగార్జున సినిమాలంటే దానికి పిచ్చి. నాగేశ్వర్రావు గారి సినిమాలు వూళ్ళోని టెంట్ హాల్‍కి వస్తే “మా మామగారి సినిమా వచ్చిందేవ్..!” అనేది.
సరే.. దేవినేని కుసుమ కాస్తా అక్కినేని కుసుమ అయింది. అసలు ఇంటిపేరు ఎందుకు మారాలీ? ఈ తోటలో నించీ ఆ తోటలోకి ఓ మామిడి మొక్కను నాటితే, అది పేరు మార్చుకుని పనస మొక్క అవుతుందా?
పెళ్ళయిందగ్గర్నించీ దానికి ‘ఆరళ్ళు’ మొదలయ్యాయి. టెలీఫోన్లు అప్పుడు ఇంటింటికీ లేవు. ఉత్తరాలు జోరుగా ఉండేవి. అది పక్కింటి అమ్మాయిని బతిమాలి ఉత్తరాలు వ్రాయించేది. ఈ తల్లిదండ్రులకి నిజం చెబితే, మనిషి కంటే వాళ్ళు సృష్టించుకున్న పేరుప్రతిష్ఠలు ముఖ్యం. ఏ దరిద్రుడు యీ పేరూ ప్రతిష్ఠా అనే రెండు దౌర్భాగ్యపు పదాలు కనిపెట్టాడో గానీ వాడ్ని నిలువునా చీల్చి ఉప్పుపాతర వెయ్యాలి. కుసుమ తల్లిదండ్రులు పట్టించుకుంటేగా? సరికదా, బోలెడు నీతులు చెబుతూ ఉత్తరాలు రాశారు.
ఈ ‘నీతి’ అనేది పులితోలుని కప్పుకుని చాలా గాడిదలు – చాలా ఏమిటి, లక్షల గాడిదలే లోకాన్ని ఏలుతున్నాయి.
డబ్బూ పదవీ వుండేవాడు ఏది చేసినా ‘నీతి’ కిందకే వస్తుంది. లేనివాడైతే ‘నీతిమాలిన పనీ’, ‘నీతిమాలిన వాడూ’ అని యీసడింపబడతాడు.
చచ్చే ముందర మనవరాలి పెళ్ళి చూడాలని గగ్గోలు పెట్టిన ముసల్ది మాత్రం కుసుమ పెళ్ళైన పదిహేనేళ్ళ దాకా గుండ్రాయిలా మహదారోగ్యంతో బతికింది. పెళ్ళి చేసుకున్న కుసుమ మాత్రం శోభనం రోజునే మానసికంగా చచ్చింది.
***
మా కాలేజీ పేరు కె.వి.ఎస్. కాలేజి. నేను అడుగుపెట్టగానే కురాళ్ళల్లో చిన్న అలజడి. నేనేమీ మహా అందగత్తెని కాదు గానీ, కనుముక్కు తీరు చాలా బాగుందంటారు. నా ఒంటి రంగు నాకు పెద్ద ఎస్సెట్. ఆల్‍మోస్ట్ గులాబీ రంగు. ఆరోగ్యం దేవుడు నాకిచ్చిన వరం. ఎక్కడా మిల్లీమీటరు ఎక్కువా తక్కువా ఉండేది కాదు. చాలా పొందికైన శరీరం నాది. మరీ పొడుగూ కాదు పొట్టీ కాదు.
“అబ్బ.. ఏం స్టైలు రా..!” కళ్ళు పెద్దవి చేసి నా వంక చూస్తూ అన్నాడొకడు. వాడ్ని చూసి నాకు జాలి వేసింది. ‘ఎదగని’ మనిషి, ఎంతో ఎదిగినట్టు ఊహించుకుని చేసే కామెంటు అది. వాడ్ని తిట్టాలనీ అనిపించలేదు – కోపమూ రాలేదు.
ఇంటర్ ఫస్టియర్‍లో మా క్లాస్ రూమ్‍లో వున్నది ఇరవై ఎనిమిది మంది అబ్బాయిలూ, పన్నెండు మంది అమ్మాయిలు.
ఫస్టు బెంచీలోనే కూర్చొని “నా పేరు మహతి” అన్నాను పక్కనున్న పిల్లతో. కొంచెం నలుపైనా కళగానే వుంది. “నా పేరు అనంతలక్ష్మి” స్నేహపూరితంగా చూస్తూ అన్నది. “నైస్ టు మీట్ యూ!” అన్నాను. “సేమ్ టూ యూ!” అన్నది చిన్నగా నవ్వి.
ఓహో ‘యీ పిల్ల వాగుడుకాయ కాదు’ అనే నిర్ణయానికి వచ్చాను. “నా పేరు ఉష.. ఉషారాణి..!” కరచాలనం కోసం చెయ్యి జాచి అన్నది అప్పుడే వచ్చిన మరో అమ్మాయి.
“సో నైస్.. నా పేరు మహతి!” షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నాను. ఇంతలోకీ లెక్చరర్ వచ్చారు. డయాస్ మీద కెక్కి, “హలో స్టూడెంట్స్.. నా పేరు రవీంద్రనాధ్. మీ ఇంగ్లీష్ లెక్చరర్‍ని. ఇఫ్ యూ డోంట్ మైండ్ – వరుసగా డయాస్ మీదకి వచ్చి మీ పరిచయం చేసుకోండి!” చిన్నగా నవ్వారు. గొంతూ బాగుంది. మనిషి కూడా చాలా స్మార్ట్‍గా వున్నాడు.
“నా పేరు హరగోపాల్.. అవటానికి తెలుగువాడినైనా కొంత కాలం నార్త్‌లో వుండడం వల్ల హిందీ బాగా వచ్చు. పాటలు పాడడం నా హాబీ. వినడం అంటే ఇంకా ఇష్టం.” తెల్లగా, పొడుగ్గా ఉన్నతను తనని తాను పరిచయం చేసుకున్నాడు.
‘ఇతనిలో ఏదో ఉంది!’ అనుకున్నాను చూడగానే.
ఆ తరవాత ఆడా మగా అందరూ వరసగా పరిచయాలు చేసుకున్నారు. చివరగా వచ్చిన కుర్రాడు విచిత్రంగా అనిపించాడు. “నా పేరు తిరుమల రావు” అని ఆగాడు. అందరూ “గోవిందా.. గో.. విందా!” అని అరిచారు.
“గుడ్.. మీరిలా అరవాలనే నేను ఆగాను. గోవింద నామ స్మరణ చేసినందుకు థాంక్స్. మనుషుల్ని గమనించడం, మనసుల్ని చదవడం నా హాబీ. పుస్తకాలు చదవడం అంటే పిచ్చి. ఎంత పిచ్చంటే, పుస్తకం కోసం నా ప్రాణం ఇచ్చేంత!” అన్నాడు.
అతని మాట ఎంత సూటిగా ఎంత స్పష్టంగా వున్నదంటే, విన్న మరుక్షణమే నాకు అనిపించింది ‘ఇతను ఎంతో లోతైన వాడు’ అని.
అందమైన ముఖం కాదు గానీ ఏదో విచిత్రమైన లక్షణం అతనిలో వుంది. అయస్కాంతం ఇనుముని ఆకర్షించినట్టు – అతని మొహం చిత్రంగా అందరి ఎటెన్షన్‍నీ తన వైపు లాక్కుంది. అప్పుడు హరగోపాలూ యీ తిరుమల రావు కూడా నా వంకే చూస్తూ మాట్లాడినట్టు నాకు అనిపించింది. వెనకాల బెంచీలో వుండే ‘రహీమా’ కూడా ఇదే మాట అన్నది.
నెల రోజుల్లోపే స్టూడెంట్స్‌లో ఎవరి గ్రూపు వాళ్ళకి ఏర్పడ్డది. నాకు మాత్రం ఇద్దరు ముగ్గురు బాగా క్లోజ్ అయ్యారు. అనంతలక్ష్మి, ఉష, భారతి బాగా క్లోజ్ అయితే, రహీమా, రేఛల్ ఓ మాదిరి ఫ్రెండ్స్ అయ్యారు
(ఇంకా ఉంది)
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు” అనే పుస్తకాలు వెలువరించారు.