Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహతి-46

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[ఓ రోజు డా. సూరి వస్తారు. హాస్పటల్‍కి వెళ్ళకుండా నేరుగా తాతయ్యగారి దగ్గరకు వచ్చి ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అంటారు. విషయమేంటని తాతయ్య అడిగితే, ఎన్నిసార్లు చెప్పినా శ్రీధర్ పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదనీ, తాతయ్యే ఆయన్ని పెళ్ళికి ఒప్పించాలని అంటారు. పెళ్ళి మీదకి గాలి మళ్ళిందని తనతో ఓసారి అన్నారని మహతి చెప్తుంది. శ్రీధర్ గురించి, బంధువుల గురించి చెప్తారు డా. సూరి. డా. శ్యామలకి శ్రీధర్ అంటే ఇష్టం ఉన్నట్టు ఉంది, శ్యామల మీద శ్రీధర్ అభిప్రాయం కనుక్కోమని సూరి గారు చెప్తారు. మీరు శ్రీధర్ మీద శ్యామల గారి అభిప్రాయమ్ తెలుసుకోండని చెప్తాడు తాతయ్య. తాతయ్య వాకింగ్‍కి వెళ్ళిన సమయంలో అహల్య ఫోన్ చేసి మహీతో మాట్లాడుతుంది. సమయం వృథా చేస్తున్నావంటూ కొంచెం కటువుగా మాట్లాడుతుంది అహల్య. ప్రజలకి ఉపయోగపడే పనులు చేయద్దని తాను అనననీ, కానీ. ఏది చెయ్యాలన్నా మొదట మహి తన కాళ్ళ మీద తాను నిలబడే శక్తి సంపాదించాలని అంటుంది అహల్య. ఏం జరిగిందో మహీకి అర్థం కాదు. అడిగితే, ఏం జరగలేదని, తనకో మార్గం ఏర్పరచకుండా తాను ప్రశాంతంగా ఉండలేనని అంటుంది అహల్య. ఇంతలో తాతయ్య రావడంతో ఆయనతో కాసేపు మాట్లాడి, చివర్లో తాను చెప్పిన విషయం గురించి మహీకి మళ్ళీ గుర్తు చేసి ఫోన్ పెట్టేస్తుంది అహల్య. అసలేం జరిగిందో ఎంత ఆలోచించినా మహతికి అర్థం కాదు. ఏం జరిగిందని తాతయ్య అడుగుతాడు. అహల్య మాటలు సహజంగా లేవని అంటాడు. ఇంతలో త్రిపుర గారు వస్తారు. బాగా అలసిపోయినట్లున్న ఆమె కాస్త టీ ఇవ్వమని మహీని అడుగుతారు. మహిళా మండలి మీటింగ్‍లో తనని ‘గొడ్రాలు’ అన్న సంగతి చెప్పి బాధపడతారు. వాళ్ళ మధ్య రాజకీయాలు చర్చకు వస్తాయి. మధ్యలో తాతయ్య వచ్చి దైర్యం చెప్పి వెళ్తాడు. తాతయ్య చెప్పిన మాటలూ తనకీ వర్తిస్తాయని అనుకుంటుంది మహతి. – ఇక చదవండి.]

మహతి-3 మహి-13

“మహీ.. నేను ప్రేమలో పడుతున్నానని అనిపిస్తోంది. అఫ్‌కోర్స్, జీవితాన్ని ప్రేమించడం వేరు.. తనని తాను మరిచి వేరెవరినో సర్వస్వంగా భావించి ప్రేమించడం వేరు. ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. లోకంలో భాషలు ఎంత పేదవి. భావాన్ని కొంచెం తెలుపగలవేమో కానీ మనసు అనుభవాన్ని తెలుపలేవుగా. అయినా నా స్థితిని ఓ పాటు ప్రతిబింబించింది. వింటావా?

పల్లవి:

దిల్ అప్‍నా ఔర్ ప్రీత్ పరాయీ
కిస్‍నే హై యే రీత్ బనాయీ
ఆంధీ మే ఇన్ దీప్ జలాయీ
ఔర్ పానీ మే ఆగ్ లయాయీ ॥ దిల్॥

(హృదయం మనది. కానీ అది ఎప్పుడూ ప్రేమించేది వేరొకరినే. ఎవరూ యీ రీతి ప్రవేశ పెట్టిందీ? దేవుడా యీ ప్రేమ ఎతటిది అంటే సుడిగాలిలో దీపాన్ని వెలిగించగలదు.. నీళ్ళలోనూ నిప్పు రాజెయ్య గలదు)

చరణం:

హై దర్డ్ ఐసా కే సెహనా హై ముష్‍కిల్
దునియా వాలోంసే కెహనా హై ముష్‍కిల్
ఘిర్ కే ఆయా హై తూఫాన్ జైసా
బచ్ కే సాహిల్ పే రెహనా హై ముష్‍కిల్ ॥ దిల్॥

(ఈ తీయని బాధ ఎటువంటిదంటే భరించడం చాలా కష్టం. నోరు విప్పి ఎవరితోనైనా చెప్పుకోవడం ఇంకా కష్టం. ఓ తుఫానులా మీద పడుతుంది. ఆ తుఫానుని తట్టుకుని ఒడ్డు మీద నిలబడటం ఇంకా ఇంకా కష్టం.)

చరణం:

దిల్ కో సంభాలా నా దామన్ బచాయా
ఫైలీ జబ్ ఆగ్ తబ్ హోష్ ఆయా
గమ్ కే మారే పుకారే కిసే హమ్
హమ్ సే బిఛ్‍డా హమారీ హీ సాయా ॥ దిల్॥

(నిబ్బరించు కోవాలనుకున్నాను. సాధ్యం కాలేదు. నిప్పు జ్వాలగా మారి దహించినప్పుడు మాత్రమే స్పృహ లోకి వచ్చాను. చెప్పలేని బాధతో ఎలుగెత్తి ఎవరినో పిలిచాను. వారు రాలేదు సరిగదా నా నీడే నను విడిచి వెళ్ళిపోయింది)

మహీ.. నాకు తెలిసిన కొంచెం హిందీతో స్వేచ్ఛానువాదం చేశాను. పాట మాత్రం తప్పక వింటావు కదూ! ప్లీజ్.

నాకు తెలిసిన అరకొర హిందీ భాషతో తెనిగించడానికి సాహసం చేశాను. ప్రస్తుత నా మనఃస్థితి చెప్పడానికి ఈ పాటని మించిన సాధనం లేదు. అర్థం చేసుకుంటావు గదూ!” అలా ఉత్తరం మొదటి పేజీ చదవగానే నవ్వొచ్చింది. అల ఎదుట వుంటే గాట్టిగా కౌగిలించుకోవాలనిపించింది. భగవంతుడి భాష సంగీతమైతే మానవుడి హృదయఘోష సాహిత్యం. పాట విన్నాక తెలిసింది సి.నా.రె. గారు అమ్మవారిని ‘సంగీత సాహిత్య సమలంక్రితే’ అని ఎందుకన్నారో. మళ్ళీ ఉత్తరం చేతిలోకి తీసుకున్నా.

“పాపం తిమ్ము. అప్పటి విషయాయి తలచుకుంటే సిగ్గేస్తోంది. అప్పటిది ప్రేమ కానే కాదు. ఓ అపరిపక్వ మూర్ఖత్వం. ఓ మొండితనం. పాపం అతన్నీ ఎంత బాధపెట్టాను. మహీ, ప్రేమ హృదయంలో జనించడానికి కారణాలూ అర్హతలూ ఏవీ లేవే. అది పుడుతుంది. బస్ అంతే.. ఎందుకు పుడుతుందో, ఎప్పుడు పడుతుందో పుట్టాక గానీ తెలీదు. చిత్రం తెలుసా! ఎవరిని ప్రేమించానో వారి ముందర మూగనైపోతున్నాను. మాట పెగలదేం!”

అర్ధాంతరంగా లేఖని ముగించింది అల. ఆపైన ఏం వ్రాయాలో దానికీ తెలిసి వుండదు. అవునూ.. జవాబు ఏం రాయాలీ? జవాబు రాయాలంటే ప్రేమంటే ఏమిటో నాకూ తెలిసి వుండాలి గదా. ఇప్పటి వరకూ నా మనసులో ఒక్కసారైనా ఆ మెరుపు మెరవలేదు. మళ్ళీ నవ్వొచ్చింది. అన్నీ తెలుసు అనుకోవడం వేరు. తెలిసిన దాన్ని వివరించడం వేరు. అసలు ఏమీ తెలీని దాన్ని గురించి ఎలా, వివరించడం?

ఒకటి నిజం. అమ్మ మాటలు నాతో ఎన్ని ఆలోచనలు రేపాయో, ఆ ప్రభావం నా మనసు మీద ఎంతగా పడిందో. ఆలోచనలతో సతమతమైపోతున్న వేళ మండుటెండలో చల్లని మర్రిచెట్టు నీడలా వచ్చింది అల ఉత్తరం. అలసిన మనసుని సేదతీర్చే దివ్య ఔషధమయింది ఆ బుల్లి ఉత్తరం.

డా. శ్రీధర్ రాగానే తాతయ్య నన్ను పిలిచి టిఫిన్ కాఫీ తెమ్మన్నాడు. వేడి వేడి ఇడ్లీలు, మాంఛి కారప్పొడి, ఆవకాయ లోని ఆవపిండితో వడ్డించాను కాఫీ తాగుతూ వుండగా, “శ్రీధర్ బాబూ.. నువ్వో ఇంటివాడివైతే చూడాలని వున్నది” సింపుల్‍గా అన్నాడు తాతయ్య. శ్రీధర్ ఓ నిమిషం అవాక్కై, ఆ తరువాత తేరుకుని, “తప్పకుండా తాతగారూ. మొన్నా మధ్య మహీకి కూడా చెప్పాను.. నా దృష్టి పెళ్ళి మీదకి మళ్ళిందని” అన్నారు శ్రీధర్.

“మీ మనసులో ఎవరైనా ఉన్నారా?” అన్నాడు తాతాయ్య.

“ఆ అమ్మాయి మీకు తెలిసినదే. ముందు మీతోనే చెబుదామని అన్నాను. అయితే అమ్మాయి ఒప్పుకోకపోతే? అందుకే ఆగాను” అన్నారు కళ్ళు వొంచి నేలకేసి చూస్తూ. నా గుండెల్లో రాయి పడింది. ఇదేమిటీ? నాకు ఊహలోనైనా యీ ఆలోచన లేదే.

“అమ్మాయి ఎవరూ?” తాతయ్య అడిగారు.

“అమ్మాయి పేరు చెప్పే ముందు నా జీవితం గురించి కొంత మీకు చెప్పాలి. నాకు తల్లి తండ్రి లేరు. చుట్టాలుపక్కాలు ఉన్నారు. కానీ వారి దృష్టి నా ఆస్తి మీదే. అందుకే అందరికీ దూరంగా ఉండి నా చదువు నేను చదువుకున్నాను. ఒకవేళ పెళ్ళి అయినా నా బంధువులనే వారికి నేను చెప్పదలచుకోలేదు” ఆగారు. ఇప్పుడు నా గుండెల్లో పడింది రాయి కాదు బండ. ఆయన పర్సనల్ విషయాలు మాతో చెప్పడానికి మరో కారణం నాకు కనిపించలా.

“అందుకే నా మనసులో మాట మహీకి చెబుదామనుకున్నాను”

“మహీకా.. ఏమంటున్నారు మీరు? అది చిన్న పిల్ల” తాతయ్య షాక్‍తో అన్నాడు.

“చిన్న పిల్లే, కానీ తనకి వున్న విజ్ఞత నాకు ఎవరిలోనూ కనబడలేదు. అందుకే నా మనసులో మాట చెప్పి..” – ఆగారు శ్రీధర్. నేను తాతయ్య ఇద్దరం సైలెంటయ్యాం. “మహీ అయితే శ్యామలకి నా విషయాలన్నీ చెప్పి ఒప్పించగలదని నాకు అనిపించింది.” అన్నారు డాక్టర్. ఒక్క గెంతులో నేను డాక్టర్ గారిని చేరుకుని చేతులు ఊపేసి.. “శ్యామల గార్ని ఒప్పించే బాధ్యత మాదే” అన్నా.

“నూటికి నూరు పాళ్ళూ శ్రీధర్” అన్నాడు తాతయ్య.

“మహీ.. ఒకవేళ శ్యామల ఒప్పుకుంటే, పెళ్ళిపీటల మీద గౌతమ్ గారూ, అహల్య కూర్చోవడానికి ఒప్పుకుంటారా?” అన్నారు డా. శ్రీధర్.

“అవన్నీ నాకు వదిలెయ్ శ్రీధర్. శ్యామలని నేను చూశాను. అందంగా పొందిగ్గా ఉంటుంది. తను డాక్టరే గనక మీ వృత్తిలో వున్న కష్టాలు తనకీ తెలుసు గనక పొరపొచ్చాలు రావు. అబ్బ. ఎంత సంతోషంగా ఉందో” శ్రీధర్‍కి షేక్‌హ్యాండ్ ఇస్తూ అన్నాడు తాతయ్య, ఓ అరగంట పాటు శ్రీధర్ చెప్పారు.. డా. సూరి గారి ద్వారా శ్యామల పరిచయం etc వివరాలు.

నా గుండె ఎంత తేలికై పోయిందంచే మబ్బు పింజలా గాల్లో తేలుతోంది. అమ్మకీ, నాన్నకీ యీ విషయం చెప్పాలని చాలా వుబలాట పడ్డాను గానీ తాతయ్య నన్ను ఆపాడు.

“డా. సూరి శ్యామల నిర్ణయం మనకి చెప్పాకా ఫోన్ చేద్దాం. అప్పటి వరకు సైలెంట్‍గా ఉంటేనే మంచిది” అన్నాడు తాతయ్య.

ఆ రాత్రే నేను డా. సూరికి ఫోన్ చేసి తీపి కబురు చెప్పాను.

“అమ్మయ్య.. ఓ పెద్ద భారం తీరింది మహీ! ఎందుకంటే శ్రీధర్ చాలా మంచివాడే కాదు. చాలా సెన్సిటివ్. శ్యామల కూడా అంతే. ఆమె జీవితమూ శ్రీధర్ లాగా ఒంటరి జీవితమే. వాళ్ళిద్దరూ ఒకటి అయితే ఎంతో బాగుంటుందని కనీసం వెయ్యి కాకపోయినా అయిదారు దేవుళ్ళకు మొక్కాను. అమ్మయ్య.. రేపే శ్యామలతో మాట్లాడుతాను. 100% నా మాట తీసెయ్యలేదని నాకు నమ్మకం ఉంది” అన్నారు డా. సూరి.

ఆ రాత్రి రెండు మూడు స్పెషల్స్ చేశాను. నేతిబీర బజ్జీలు (తాత ఫేవరెట్), పులిహోరా, రవ్వ కేసరి, బంగాళా దుంప వేపుడు, మిరియాలు టమాటా రసం + పెరుగు.

హాయిగా ఉన్న మనసుతో భోజనాల్ని వరండాలో మెండుగా పడుతున్న వెన్నెలలో వడ్డించాను.

బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. మనసు ఎంతో తేలికపడింది. అలకి ఉత్తరం వ్రాయాలనిపించింది. జరుగుతున్న విశేషాలనన్నీ తూచా తప్పకుండా అర్ధరాత్రి వరకూ ఉత్తరంలో పొందుపరుస్తూనే ఉన్నాను.

***

అమ్మనాన్న వచ్చారు. అమ్మ మామూలు గానే ఉంది. ఏ మాత్రం నా మీద కోపాన్ని తాపాన్ని ప్రదర్శించ లేదు గదా, “మంచిగా సెటిల్ చేశావు మహీ.. తాతయ్య నిన్ను ఒకటే మెచ్చుకున్నాడు!” అన్నది. తమ్ముడూ చెల్లెలూ చాలా క్లోజ్‌గా వున్నారు. వాళ్ళ దృష్టిలో నేను ‘పెద్దదాన్ని’ కదా! అదీ గాక age group వేరు.

తాతయ్యే శ్రీధర్ గారికీ శ్యామల గారికీ చెప్పాడు “జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అరుదైన పండుగ పెళ్ళి.. దాన్ని కలకాలం గుర్తుంచుకునేలా చేసుకోండి. ఏర్పాట్లు అన్నీ నేనే చేస్తాను” అని.

అన్నట్లు గానే అన్ని ఏర్పాట్లూ తాతయ్యే చేశాడు. మా పాకనే పెళ్ళి వేదికగా మార్చేశాం. కొత్త తాటాకులతో పాకని కప్పించి, పెద్ద పెళ్ళిపందిరి కూడా వేయించాం. మామిడాకుల తోరణాలతో అద్భుతంగా వుంది.

వంటలకి బందంచర్ల నించి సుబ్బారాయుడు గార్నీ, సత్యానీ పిలిపించాము. శ్యామల విషయాలన్నీ త్రిపుర గారూ, వనజ గారూ, శ్రీమతి సూరి గారూ చూసుకుంటే, శ్రీధర్ గారి విషయాలన్నీ తాతయ్యా, నేనూ, అమ్మానాన్నలు చూసుకున్నాం.

“శ్రీధర్.. నువ్వే మా పెద్దకొడుకు వనుకుంటాం. మా సురేన్‌కి ముందు నువ్వు పుట్టావనుకుంటాం” పట్టుబట్టలు ఇస్తూ అన్నది మా అమ్మ. శ్యామలకి పట్టుచీరలు అవన్నీ త్రిపురగారే కానుకగా ఇచ్చి స్వయంగా పెళ్ళికూతురిని చేశారు.

ఊరు ఊరంతా తరలివచ్చింది. వింత ఏమిటంటే పెళ్ళికి ఒకరోజు ముందే కూరగాయలూ, పప్పులూ ఉప్పులూ వంటివన్నీ కుప్పలు తెప్పలుగా ఊరి జనాలే తెచ్చి మా పాక దగ్గర పేర్చడం. ఇక బియ్యం అయితే ఏకంగా ఓ పది బస్తాలు వచ్చాయి. వంటనూనెలకీ, నెయ్యికీ లెక్కలేదు రైతులయితే బిందెలతో పాలూ పెరుగూ తెచ్చారు. శ్రీధర్ గారి కళ్ళు జనాల ప్రేమకి కరిగి కరిగి కంటి వెంట ధారలుగా ప్రవహిస్తున్నాయి.

ఎంతో సింపుల్‍గా చేద్దామన్న పెళ్ళి దేవుని పెళ్ళి లాగా అత్యంత వైభవంగా జరిగింది. దేవుని పెళ్ళికి అందరూ పెద్దలేగా మరి!

“ఏదో అన్నాను. ఏదో చెప్పాను. ఏదో జరిగింది. సమయం అలా అన్న మాట. కానీ మహీ.. ఒక నిర్ణయం కోసం కాలాన్ని వ్యర్థం చేస్తున్న మాట మాత్రం నిజం. ఇవాళా రేపు ఏది చెయ్యాలన్నా మినిమమ్ క్వాలిఫికేషన్ కావాలి. మనకి డబ్బుకి ఇబ్బంది లేదు గనక పరవాలేదు. అదే రెక్కాడితే గానీ డొక్కడని జనాల సంగతి?

ఈ బంధుత్వాలు, యీ సంపదలు శాశ్వతం కావు. జీవితం ఎవరిని ఎప్పుడు పైకి లాగుతుందో ఎవరిని అణగదొక్కుతుందో ఎవరికి తెలుసూ? ఇదో జైంట్ వీల్. పైవాడిని కిందకీ, కిందవాడిని పైకీ తిప్పుతూనే వుంటుంది. ఓ తల్లిగా నేను చెప్పేది ఒక్కటే. ప్రతి మనిషి ముందు నేర్చుకోవలసింది తన కాళ్ళ మీద తను నిలబడటం. అలా నిలబడలేనివారు, ఎవర్ని నిలబెట్టగలరూ?” అన్నది అమ్మ.

ఆవిడ అన్న మాటల్లో ఒక్క అక్షరం కూడా వ్యర్థమైనది లేదు. ఎవరిని ప్రజల కోసం అభ్యర్థించాలన్నా ఓ ఐడెంటిటీ ఉండాలిగా!

నేనెవరూ అని అడిగితే నేనేం చెప్పనూ? కర్రావూరి ఉప్పలపాడులో నాకు కొంత పరపతి ఉండొచ్చు. పక్క వూళ్ళో యీ పేరూ పరపతీ పనికొస్తాయా?

“అంతగా ఆలోచించకు. నీ స్వాతంత్రం నీదే. ఓ సంవత్సరం టైమ్ నువ్వు అడిగావు. ఓ.కే. ఏదేమైనా నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నీ మాట నువ్వు నిలబెట్టుకో. ఏమి కావాలనుకుంటున్నావో నిర్ణయించుకో” అన్నది అమ్మ నా తల నిమిరి.  ఆ స్పర్శ అదివరకు ఉన్నట్టు లేదు. ఏదో అయింది. అదేదో నాకు తెలీదు. బహుశా నాకు తెలియనివ్వదు.

మా నాన్నని గమనించా. నాన్న మామూలుగానే ఉన్నట్టు పైకి అనిపించినా, అది వరకూ లేని ఓ వ్యగ్రత నాకు కనిపించింది. ఆ మార్పు నేను గమనించగలిగాను గానీ, పిల్లలు గమనించలేదు. అయినా పిల్లల ముందు తల్లిదండ్రులు అన్ని విషయాలు చర్చించరు గదా.

సడెన్‍గా ఏదో స్ట్రైక్ అయింది. హరగోపాల్ ఏమైనా అమ్మానాన్నల ఎదుట పిచ్చిమాటలు మాట్లాడాడా? ఆ విషయం కూలంకుషంగా తెలుసుకోవాలంటే అల హైదరాబాద్‍కి తిరిగి వచ్చినపుడే తెలుస్తుంది. అదో అనిర్విచనీయమైన ఆనందంతో ఉత్తరాలు రాస్తుంటే, నేను యీ విషయాలన్నీ రాసి దాని మైండ్‍ని పాడు చెయ్యిడం తగదు గదా. మరోసారి నా తల నిమిరి అమ్మ నాన్నా, పిల్లలు వెళ్ళిపోయారు.

“వారం రోజుల పాటు శ్రీధర్‍నీ, శ్యామలనీ బెంగుళూరు పంపిస్తున్నాను తాతయ్య గారు. అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు. అఫ్‍కోర్స్ వాడు శ్రీధర్‍కి తెలిసినవాడే. వాడు కార్ అరేంజ్ చేస్తాడు. వీళ్ళు మైసూరులో ఓ మూడు రోజులూ, బెంగుళూరులో మూడు రోజులూ హాయిగా గడిపి ఇక్కడికి వస్తారు. అయితే ఉండటానికి..” అని డాక్టర్ సూరి అనేలోగానే “ఆ విషయంలో ఆలోచించాల్సిన పనే లేదు. ఇద్దరూ యీ ఇంట్లోనే వుంటారు. ఇంత పెద్ద ఇంట్లో వారికి చోటు లేదనా. సూరి బాబూ, ఏనాడు అహల్య గౌతమ్ పెళ్ళి పీటల మీద కూర్చుని పెళ్ళి చేయించారో, అప్పటినించీ శ్రీధరూ శ్యామలా కూడా మా కుటుంబ సభ్యులే అయ్యారు.” అన్నాడు తాతయ్య.

అనటమే కాదు మంచాలు, కుర్చీలూ ఇతర సామాను కూడా దగ్గరుండి మరీ కొన్నాడు.

శ్రీధర్ ఆదరంగా తాతయ్య చేతులు పట్టుకున్నారు. అతని గొంతు లోనించి మాటలు రావడం లేదు.

“హాయిగా వెళ్ళి రండి. అన్ని చూసి ఆనందించండి” తల నిమిరి ఆశీర్వదించాడు తాతయ్య వాళ్ళని కారు ఎక్కిస్తూ.

***

“మహీ.. అమ్మ ప్రవర్తనలో చాలా తేడా ఉంది. ఏదో బాధ గడ్డకట్టినట్టుగా అనిపిస్తోంది”. ఆరోజు రాత్రి తాతయ్య అన్నాడు. ఎంత పిచ్చిదాన్ని నేను! నేనే అమ్మ ప్రవర్తనలో తేడా గమనించగలిగినప్పుడు జీవితాన్ని క్షుణ్ణంగా చదువుకున్న తాతయ్య గమనించలేడా!

“నేనూ గమనించాను తాతయ్యా. కానీ కారణం అంతుబట్టటం లేదు. అడిగినా చెబుతుందని నేను అనుకోను” అంటూ అమ్మ నాకు ఫోన్ చేసి మాట్లాడిన మాటలు చెప్పాను.

“అంటే, నెల క్రిందటే ఏదో జరిగిందన్నమాట” సాలోచనగా అన్నాడు తాతయ్య. నేను వింటున్నా.

“గౌతమ్‍లో కూడా ఏదో తెలియని చికాకు కనిపిస్తోంది” మళ్ళీ అన్నాడు తాతయ్య.

ఆ తరవాత పెద్దగా చర్చలు జరగలేదు. చాలా సేపటి వరకూ తాతయ్య నిద్రపోలేదని నాకు తెలుస్తూనే అంది. నేను నిద్రపోలేదు. ఒక సమస్య తెలిసి ఆలోచించడం వేరు. అసలు సమస్య ఏమిటీ? అని ఆలోచించడం వేరు. మొదటి దానికి పరిష్కారం దొరుకుతుంది. రెండోది గడ్డివాములో గుండు సూదిని వెదకడం లాంటిది.

ఎప్పుడోగాని నిద్రాదేవి దయ నాకు కలగలేదు.

(ఇంకా ఉంది)

Exit mobile version