Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహతి-57

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[అల, కల్యాణి, మహతి – కళ్యాణి గారింట్లో కూర్చుని మాట్లాడుకుంటారు. ముందుగా చక్కగా భోంచేసి, అప్పుడు చర్చ మొదలుపెడతారు. పాయసంలో తేలుతున్న జీడిపప్పును చూసి అలకి పాలకడలిలో విష్ణుమూర్తి గుర్తొచ్చి, ఎస్.పి. బాలసుబ్రమణ్యం ఆ పాట పాడి జానకి గారి ఆశీర్వాదాన్ని అందుకుని సినీ పరిశ్రమలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదగడం ఆ తరువాత పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎందరో యువ గాయనీగాయకులని పరిచయం చేయడం గుర్తు చేసుకుంటుంది అల. అవన్నీ తలచుకుని నవ్వేసరికి, ఎందుకు నవ్వుతున్నావని మహీ ఆశ్చర్యంగా అడుగుతుంది. అప్పుడు ఎస్. పి. బాలు గారి ద్వారా వెలుగులోకి వచ్చిన గాయనీ గాయకుల గురించి, జానకి గారి ఆశీర్వాదం గురించి చెబుతుంది అల. కల్యాణి గారు, మహతి ఏకీభవిస్తారు. అందరి మూడ్ మార్చటానికే తాను సినిమా పాటల ప్రస్తక్తి తెచ్చానని చెబుతుంది అల. అసలు తాము ఆలోచిస్తున్న పద్ధతిలోనే లోపం ఉందనిపిస్తోందని అంటుంది మహీ. నువ్వు దీన్ని నీ ఒక్కదాని సమస్యలా కాకుండా, వేరే వాళ్ళ సమస్యలా ఆలోచిస్తే, పరిష్కారం కనబడుతుందని అంటుంది అల. మర్నాడు ఉదయం అల నిద్ర లేచేసరికి కల్యాణిగారూ, మహీ కాఫీ తాగుతుంటారు. అలకి కూడా కాఫీ ఇస్తూ యోగా అంటే ఏమిటో తెలుసా అని అడిగితే, జవాబు చెప్తుంది అల. ఆ జవాబుకి మహీ ఆశ్చర్యపోతుంది. ఇక అసలు సమస్య గురించి చర్చిద్దామనుకునే లోపు ఫోన్ మోగుతుంది. కల్యాణి చాలా నెమ్మదిగా సుమారు 20 నిముషాలు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు. ఆవిడ ముఖం వాడిపోతుంది. హాస్పటల్‍లో ఇందిరగారు హిస్టీరిక్‌గా ప్రవర్తించడమే కాక, మేడమీద నించి కిందికి దూకుతానని బెదిరించారని తెలుస్తుంది. ఈ పరిస్థితులలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలని ముగ్గురూ తీవ్రంగా ఆలోచిస్తారు. తన ఒకప్పటి ప్రవర్తనని గుర్తు చేసుకుంటూ ఇందిరగారి ప్రవర్తననని అర్థం చేయించడానికి ప్రయత్నిస్తుంది అల. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-4

మహతి ఉవాచ:

“అయితే ఇందిరగారు చేస్తున్నది బెదిరింపుల ఆర్భాటమే తప్ప మరేదీ కాదని నమ్మవచ్చా అలా?” అడిగారు కల్యాణి.

“నేను కేవలం నా అనుభవంలో చెప్పాను. ఆ విషయాన్ని మహీ విశ్లేషిస్తే బాగుంటుంది. చర్చ కాస్త ముందుకు వెళుతుంది” అన్నది అల.

“ఆంటీ, మీ కంటే గొప్పగా ఆలోచిస్తానని నేను అనుకోవడం లేదు. కానీ, అల జీవితంలో జరిగిన సంఘర్షణ నాకు క్షుణ్ణంగా తెలుసు గనుక నాకున్న పరిధిలో నేను విశ్లేషిస్తాను” అని కల్యాణి గారితో అని, అల వైపు తిరిగి,.

“అలా.. మొదట నువ్వు నీ అప్పటి ప్రవర్తన ఘోరంగా ఉందోనో క్రూరంగా ఉందనో అనుకోవటం మానుకో. ఎందుకంటే, నీ వల్ల తిమ్ము కొంచెం బాధపడ్డే తప్ప, దేన్నీ పోగ్గొట్టోలేదు. నిజం చెబితే చాలా లాభపడ్డాడు. ఆ విషయం తరవాత చర్చిద్దాం. ఈ రోజు నించీ ఏ రోజూ నువ్వేదో తప్పు చేశావనే ఆత్మన్యూనతతో బాధపడకు. నీ ప్రగతి చూసి తిమ్ము ఎంత ఆనందపడుతున్నాడో నీకు తెలీదు. కావాలంటే మాట్లాడిస్తా” అన్నాను.

“నిజమా మహతీ?” సంభ్రమంగా అన్నది అల.

“యస్. నూటికి నూరుపాళ్ళు. యస్.. యస్.. యస్.. ఇక విశ్లేషణకి వస్తే నీ పరిస్థితులు వేరు. ఆవిడ పరిస్థితులు వేరు. నువ్వు తిమ్ము మీద పెంచుకున్న పగ కేవలం తెలిసీ తెలియని యవ్వన మూర్ఖత్వం. ఇందిరది అది కాదు. మరొకటి ఏమంటే, ఆ పరిస్థితుల్లో కంటిన్యూగా నువ్వుంటే ఏమీ జరిగేదో పక్కన పెడితే, ఆ చిన్న లోకంలో లోంచి సినిమా అనే మహాద్భుత లోకానికి వచ్చి పడ్డావు. దిగ్భ్రమ గొలిపే యీ లోకంలోకి రాగానే, అప్పటి నీ ఆలోచటనలన్నీ పటాపంచలైపోయి, నువ్వేమిటో నువ్వు తెలుసుకునే అవకాశం కలిగింది. నీ ఆలోచన ఎంత తప్పో నీకే తెలిసింది గనుక పశ్చాత్తాపంతో నీ తప్పుని నువ్వు తెలుసుకున్నావు. నిజమైన వ్యక్తిత్వం సంతరించుకున్నావు” నేనో క్షణం ఆగాను.

“ఇక ఇందిరగారి విషయం వేరు. మా నాన్న వాళ్ళింట్లో పెరిగింది నిజం. ఇందిర తల్లీ తండ్రీ మా నాన్నగారి ఆస్తిని కొట్టేసి వుండవొచ్చు. కానీ, ఆ విషయాన్ని కూతురికి చెప్పి ఆమె దృష్టిలో దోషులుగా నిలుస్తారా? కనుక, వాళ్ళేదో కట్టుకథ చెప్పి ‘యీ ఆస్తి మాదే’ అని నమ్మించి ఉండొచ్చు. పెద్దవాళ్ళు మా నాన్నని చులకనగా చూస్తూండటంతో ఆమెకీ అదే అలవాటు అయి ఉండొచ్చు. యథా రాజా తథా ప్రజాగా. పెద్దల ప్రవర్తనేగా పిల్లలకి వచ్చేదీ” ఆగాను. కల్యాణీ, అలా కూతూహలంగా నా వంక చూస్తున్నారు.

“కల్యాణి ఆంటీ చెప్పినట్టు ఆ ఏజ్‌లో మా నాన్నతో ఆవిడ ఎలా ప్రవర్తించేదనేది పెద్ద ప్రశ్న. మొదట తన పేరెంట్స్ లాగా చులకన చేసి ఉండొచ్చు. తరువాత ఆస్తి బావదని తెలుసుకుని మనసు మార్చుకుని ఉండొచ్చు. అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయి ఉండొచ్చు. అంటే, మా నాన్న పెళ్ళి చేసుకుని మమ్మల్ని కని చెక్కగా పెంచడం” మళ్లీ ఆగాను. ఈసారి ఆగింది వారి కూతుహలాన్ని పెంచడానికి కాదు. నా రీజనింగ్ రైటా రాంగా అని తెలుసుకోవడానికి.

ఓ చిత్రం ఉంది. ఓ చర్చ జరిగేప్పుడు మన గడ గడగడా మాడ్లాడేస్తాం. మన ఉపన్యాసం ఓ జలపాతంలా సాగుతుంది. అంతకు ముందు మన మనసులో లేని పాయింట్స్ ఎలా గడగడా వస్తాయా? నిజం చెబితే ఆ మాటలు ఎదుటి వారికి ఎంత కొత్తో మనకీ అంతే కొత్త. అందుకే ఓ క్షణం ఆగి, మననం చేసుకునేది.

“బహుశా అందుకే ఆవిడ పెళ్ళి చేసుకోకుండా తన తల్లిదండ్రుల్ని టార్చర్ పెట్టి ఉండొచ్చు. సరే.. వాళ్ళు వెళ్ళిపోయారు. తను ఒంటరిదైపోయింది. అప్పుడు తన కోపాన్నీ వ్యథనీ ఇటు వైపు మళ్ళించింది. ఆవిడ మనసులోనూ ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ లేకపోతే, యీ గోల మా నాన్న పెళ్ళయిన మరుక్షణమే మొదలు పెట్టేదిగా? అసలు పెళ్ళే కానిచ్చేది కాదుగా. కాని అలా చెయ్యలేదేం. ఆవిడ మాన్నని టార్గెట్ చెయ్యడం మొదలు పెట్టి కేవలం 8 నెలలు మాత్రమే అయింది. అంటే?”

నాకు నేనే ప్రశ్న వేసుకుని ఆగాను. వాళ్ళు శ్రద్ధగా మౌనంగా నావంక చూస్తున్నారు.

“బహుశా ఎనిమిది నెలల క్రితమే అనారోగ్యం బయటపడి ఉండాలి. దాంతో ఒక్క పక్క ఒంటరితనం, మరో పక్క నిస్సహాయతలోంచి యీ ప్రవర్తన ఇందిరగారిలో మొదలై ఉండాలి. లేకపోతే ఇన్నేళ్ళపాటు మనసులోని బాధనీ, ప్రేమనీ నిగ్రహించుకున్న మనిషి,. ఇప్పుడు ఎందుకు బయటపడాలీ?” ఆవేశంగానే అన్నాను.

ఓ ఒంటరితనం, ఓ నిస్సహాయత, ఓ ప్రేమరాహిత్యం, ఇంత కన్నా ఏం కావాలీ ఓ స్త్రీని ఇలా మార్చడానికి!

“అయితే మాత్రం ఇంత శాడిస్టుగా బిహేవ్ చెయ్యాలా?” అంది అల.

“నో.. నో.. నో అలా. ఇందిర గారు ఇంకా శాడిస్టు స్థితికి చేరుకోలేదని నా నమ్మకం. ఒక వేళ శాడిస్టుగా మారినా, అందులో ఆశ్చర్యం ఏముంటుందీ? ఆవిడ పరిస్థితికి మా నాన్న కారణం కాదు. ఆవిడ తల్లిదండ్రులు కొంత కారకులైనా వాళ్ళు లోకంలో లేరు. మరేం చేస్తుందీ?” సూటిగా అలనే అడిగాను. నిజం చెబితే ఇందిరగారి పరిస్థితి నిజంగా దుర్భరమే అని నాకు అనిపించింది.

“అయితే ఇప్పుడు ఏం చెయ్యాలీ?” అడిగారు కల్యాణి.

“సైకియాట్రిస్టుల సహాయం తీసుకుంటే?” అన్నది అల. నాకు ఆ ఆలోచన ఎప్పుడో వచ్చింది.

“సైకియాట్రిస్టుల హెల్ప్ తీసుకోవచ్చును. కానీ, ఆవిడ వాళ్ళకి కో-ఆపరేట్ చెయ్యాలిగా? అంటే సహకరించాలిగా? ఏ మాత్రం సెన్స్ ఉన్న వాళ్ళైనా, ‘నీకు పిచ్చీ నీ తాతకి పిచ్చీ’ అంటారు గానీ, ‘నా మనః స్థితి సరిగాలేదు డాక్టర్’ అని ఒప్పుకోరుగా. కనుక ఆ కోణాన్ని మనం మరిచిపోవచ్చు. ఎందుకంటే, తను చేస్తున్నదేదో ఇందిర గారికి స్పష్టంగా తెలుసు. మా నాన్న హింసకి గురువడం తప్ప మరేమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాడనీ కూడా ఆమెకి తెలుసు. అందుకే ‘నాన్న ఆదరించి తీరాలి’ అని పట్టుబట్టి కూర్చుంది” అన్నాను నేను.

“మరి దూకి చస్తానని బెదిరించడం ఎందుకూ?” అల అడిగింది సీరియస్‌గా. నేను నవ్వేశాను. అల కూడా పకపకా నవ్వి “రాంగ్ ప్రశ్న వేశాను మహీ.. సారీ, కొన్ని వందల సార్లు నేనూ బెదిరించానుగా! ఇప్పుడు అర్థమైంది, ఆవిడదీ బెదిరింపేనని!” నన్ను కావలించుకుని అన్నది.

“చాలా వేడి వేడిగా చర్చించాం. కాస్త ఏదైనా కొత్తది టై చేద్దామా?” అన్నారు కల్యాణి.

“ఓ.. వడియాలు వేసిన మాంఛి పచ్చిపులుసు, దానికి తోడు అప్పడాలు చాలు గదా స్వర్గాన్ని నేలకి దించడానికి” అన్నది అల.

“మహీ నీ రీజనింగ్ నాకు అద్భుతంగా నచ్చింది. ఆఫ్ట్రాల్ ఇందిర కూడా మనలాగే ఆడపిల్ల. నిస్సహాయత స్థితిలో ఉన్నది. ఒంటరి బతుక్కు తోడు యీ జబ్బు. చక్కగా ఆమె మనసుని స్టడీ చేసే ప్రయత్నం చేశావు. నిజంగా ఇప్పుడు మనం పచ్చి పలుసు వడియాలూ అప్పడాలుతో లంచ్ సరి పెట్టుకోవచ్చు. కానీ అక్కడ మరో ముగ్గురు అనిశ్చిత స్థితిలో, అంతులేని ఆలోచనలతో ఉన్నారు. చాలా చాలా మంచి భోజనాన్ని వాళ్ళతో తినిపిద్దాం. నిజం చెబితే, నిద్ర ఎంత దయామయో, మంచి భోజనం కూడా అంతే దయామయి. మనసుకి విశ్రాంతినిచ్చి శరీరాన్ని నిద్రపుచ్చుతుంది” అన్నారు కల్యాణి.

100% మేమిద్దరం ఏకీభవించాం.

అల తన నార్త్ ఇండియా స్టైల్‌లో ఆలూ పరోటా, దహీ భల్లా, చింతపండు పచ్చిడి చస్తే, నేను గుత్తొంకాయ కూరా, చక్కగా అందంగా బంగాళదుంప వేపుడు+పచ్చిపులుసుకి దగ్గరి చుట్టంగా మాంఛి కందిపచ్చడి చేశాను.

కల్యాణిగారు కొత్త ముత్తైదువులా పచ్చగా మెరిసిపోయే పులిహోర, సీతని చూసి తీయగా నవ్వే రాముడిలాంటి పాయసం చేశారు. ముంత మామిడి పప్పు(జీడిపప్పు), కిస్‌మిస్‌లు పాయసంలో తేలుతూ ఊరిస్తున్నాయి.

అందరూ కలిసి ‘పప్పు వెరైటీ’లో డిసైడు చేసింది టమోటా పప్పు. అప్పడాలు వడియాలకి మరో చెలికత్తెగా ఊరమిరపకాయలన్ని కూడా చేర్చాం.

నా ఆలోచనా సరళి సరిగ్గా, ఉన్నా లేకపోయినా, మనసుకి ఓ ‘నిర్భయత్వం’ కలిగింది. ముగ్గురం చర్చించడం వల్ల తెలియని ఓ రిలీఫ్ కలిగి ఉత్సాహంగా మా మనసుల్ని వంటల వేపు మళ్ళించాం.

“యస్.. సమస్యని తలుచుకుంటేనే దీని పరిష్కారం ఎలా వుంటుందా అని భయం కలిగేది. ఇప్పుడు కాస్త నిర్బయం” అన్నది అల నా మనసుని చదివినట్టు.

“నిర్భయం అంటే నాకు జ్ఞాపకం వచ్చేది –

‘బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా

అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్’

అనే శ్లోకం. అది తలుచుకున్నప్పుడల్లా భలే ధైర్యం వస్తుంది” అన్నారు కల్యాణిగారు.

ఈ శ్లోకం మా అమ్మమ్మ బట్టీ పెట్టించింది నా చిన్నప్పుడు. ఎంత మంచి విషయాలు నేర్పేవాళ్ళు పెద్దలు!

ముగ్గరం మా వంటకాన్నిరెండు జెయింట్ సైజూ కేరేజీల్లో సర్ది, విస్తరాకులతో సహా, మంచి నీళ్ళతో సహా, నేప్‌కిన్ లతో సహా కారెక్కాం.

అందరూ కలిసే భోంచేయాలని నిర్ణయించుకున్నాం. అలా చెయ్యడం అమ్మకి చాలా ఇబ్బంది కలిగిస్తందని నాకు తెలుసు. కానీ, అదీ ఒకందుకు మంచిదే. ఎందుకంటే, అమ్మని చూస్తే ఇందిరగారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుస్తుంది. అదే అన్నాను కల్యాణిగారితోనూ, అలతోనూ.

“ఆ ఆలోచన నాకూ వచ్చింది. ఇద్దరినీ ఒకేసారి చూసి, మీ అమ్మగారి, నాన్నగారి, ఇందిరగారి ఆలోచనా పద్దతిని మనం గమనించవచ్చు” అన్నారు కల్యాణి.

“ఇందిరగారు ఒప్పుకోకపోతే?” అన్నది అల.

“అప్పుడు హాయిగా ఎవరి ప్లేటు వారిది. అప్పుడు కూడా మహీ, నువ్వు ఇందిరగారి దగ్గరికి వెళ్ళి తినిపించు.. బహుశా ఆమె రియాక్షన్స్‌ని బట్టి మనం నిర్ణయానికి రావచ్చు” అన్నారు కల్యాణి.

“కోపంతో తిట్టిపోస్తే” నవ్వి అన్నది అల.

“ఓ మహానుభావుడు, అవతారపురుషుడు చెప్పిన మాట చెప్పనా మీ ఇద్దరికీ?” నవ్వి అన్నారు కల్యాణిగారు.

“చెప్పండి. ఆంటీ చెప్పండి” ఉత్సాహంగా అన్నది అల.

“రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్. యాక్షన్ చర్య అయితే, రియాక్షన్ ప్రతిచర్య. తిట్టడం అనేది చర్య అనుకుందాం. ఆ చర్య ఎవరిదీ? ఇందిరగారిది. ఆ చర్యకి ప్రతిచర్య ఏమిటీ? 1. తిరిగి తిట్టడమో, దూషించడమో. 2. బాధపడి మనసు పాడు చేసుకోవడం 3. నలుగుర్నీ పిలిచి సన్నివేశాన్ని వివరించి న్యాయం చెప్పమడం. కానీ, అన్నిటికన్నా బెస్ట్ ‘ప్రతిచర్య’ చేయకుండా ఉండటం.

ఎందుకంటే, చర్య ఎవరిదైనా కావచ్చు, ఇందిరే కాదు లక్షలాది మంది మనని వెక్కిరిస్తారు, తిడతారు, అవమానపరుస్తారు. ఎన్నో ఎన్నో చేసారు. అది వారి చేతుల్లో ఉంది గనక.

కానీ, ప్రతిచర్య మన చేతుల్లో ఉంది. వాళ్ళన్న మాటకి అసలు మనం ఎందుకు, ప్రతిస్పందించాలీ? ఒక వేళ స్పందిస్తే? అప్పుడు చర్యకి ప్రతిచర్య, ప్రతిచర్యకు ప్రతిచర్య ఇలా అనంతంగా రావణకాష్టంలా రగులుతూనే ఉంటుంది. ఏక్షన్, అనగా చర్య ఎవరిదైనా, ప్రతిచర్య మనం కంట్రోల్ చేసుకుంటే సమస్యే ఉండదు. No reaction, no resound, no reflection. యీ వాక్యం గుర్తు పెట్టుకో, ప్రతి – చర్యకూ మనం చెక్ పెట్టొచ్చు” అన్నారు కల్యాణి గారు.

“ఓహ్ ఫెంటాస్టిక్. వెరీ గుడ్ లెసన్. ఆవిడ ఏమన్నా మనం పట్టించుకోకుండా మనలా మనం ఉండాలన్న మాట” ఉత్సాహంగా అన్నది అల.

“ఇంకోటి కూడా ఆ మహావతారుడే చెప్పారు – నీకో పార్సిల్ వస్తుంది. నువ్వు దాని రిసీవ్ చేసుకుంటే, అది నీకు ఇస్తారు పోస్ట్ వాళ్ళు.. దాని మీద ఎడ్రస్ ఉంది గనక. తీసుకునే ముందు ఏం చేస్తావూ? అది ఎక్కడినించి వచ్చిందో, ఎవరు పంపారో చూస్తావు కదా! మంచివాళ్ళు పంపితే తీసుకో. నువ్వంటే గిట్టని వాళ్ళు పంపితే? తీసుకోవడానికి నిరాకరించు. అది ఎవరు పంపారో వారికే తిరిగి వెళ్ళి చేరుతుంది. అర్థమేమంటే, ఎదుట వాళ్ళ మాటల్ని పట్టించుకున్నప్పుడే వ్యథో, బాధో. అలా చేయనప్పుడు? నువ్వు నువ్వే. అమ్మాయిలూ, పెద్దవాళ్ళకి అనేక ఈగోలు ఉంటాయి. ఆ ఈగోలని మనం పట్టించుకోకుండా ‘ఈగో’ కనబడగానే ‘యూ.. గో’ అనగలిగితే ప్రోబ్లమ్స్ నూటికి అరవైపాళ్ళు తీరిపోతై” చల్లగా అన్నారు కల్యాణిగారు.

“అబ్బ ఎంత మంచి మాటలో. మాటలతో మనసు నిండిపోయింది ఆంటీ, ఇక వంటలతో కడుపు నింపుకోవడమే తరువాయి” అన్నది అల సంతోషంగా.

నిజం. ఓ మంచి మాట వినడం, ఆచరించడం కన్నా గొప్ప సాధన మరేముంటుందీ. రోజుకి ఒక్క మంచి మాటైనా వినగలిగడం ఎంత అదృషం.

“ఇంకో మంచి మాట చెప్పండాంటీ!” అన్నాను నేను.

పకపకా నవ్వి అన్నార్.. “అమ్మాయ్ ఇలాగైతే గంటకో మంచి మాట చెప్పగలను. నాకు నచ్చిన మాట చెప్పనా? – కేష్‌ని కాదు పంచుకోవలసింది.. కష్టాన్ని, అంటే, కాసుని కాదు.. కష్టాన్ని పంచుకోవాలి” అన్నారు కల్యాణి.

“ఇంకో మాట?” అడిగింది అల.

“జీవితాన్ని నేను మోస్తున్నానని ఎప్పుడూ చింతించకు. నిజం ఏమంటే నువ్వు కాదు జీవితాన్ని మోస్తున్నది.. జీవితమే నిన్ను మోస్తోంది. Ok Ok.. మరో రచయిత గొప్పగా ఓ మాట అన్నారు – చచ్చేదాకా చచ్చినట్టు బ్రతకాలని, నేనేమంటానంటే, చచ్చినట్టు బ్రతక్కు.. హాయిగా బ్రతుకు ఆనందంగా బ్రతుకు” అన్నారు కల్యాణి. హాస్పటల్ వచ్చింది.

(ఇంకా ఉంది)

Exit mobile version