Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహతి-70

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[షూటింగ్ శరవేగంతో సాగుతూంటుంది. అల ఇంగ్లీషు ప్రాక్టీసు, డాన్సు ప్రాక్టీసు నిరాటంకంగా జరుగుతుంటాయి. ఓ రోజు షూటింగ్ విరామంలో ఓ చెప్పుల జత కనబడితే, ఏదో ఆలోచన మనసులో మెదిలి అప్పటికప్పుడు ఓ కవిత రాస్తుంది అల. దాన్ని చదివిన సరోజ్ అలని మెచ్చుకుంటుంది. అందులోని భావం గురించి మాట్లాడుతుంది. ఆశ్చర్యపోయిన అల – నువ్వేం చదివావు సరోజ్ – అని అడిగితే కఠినమైన లోకమనే విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేశానని అంటుంది. సరోజ్ అల ప్రేమలో ఉన్నట్టు అనుమానిస్తే, సంభాషణని మార్చడానికి ఆమెది ఏ ఊరు అని అడుగుతుంది అల. ఆ వివరాలెందుకులెండని అంటుంది సరోజ్. సినీ పరిశ్రమలో సరోజ్‍కి తాను తోడుగా ఉంటానని మాట ఇస్తుంది అల. ఇంతలో ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్‍గా నటిస్తున్న నైనా మెహతా అక్కడిచ్చి ఏంటి విషయం అని అడిగితే, సరోజ్ అల రాసిన కవిత గురించి చెప్పి, దాన్ని హిందీలోకి అనువదిస్తుంది. తెలుగు కవితని, హిందీ అనువాదాన్ని నైనా మెచ్చుకుంటుంది. అక్కడే ఉన్న తరుణీ కిద్వాయ్ కూడా సరోజ్‍ని అభినందించి, ఆమెకి ఇష్టమైతే, డైరక్షన్ విభాగంలోకి రావచ్చని తాను అమిత్‍గారికి చెప్తాననీ అంటుంది. వద్దని అంటుంది సరోజ్. తాను డాన్స్ విభాగాంలోనే స్వయంకృషితో పైకి రావాలనుకుంటున్నట్లు చెప్తుంది. ఒకరి సపోర్టుతో వెళ్తే తరువాత అవకాశాలు ఉండవని అంటుంది. నిజమేనని అంటుంది తరుణి. సాయంత్రానికి ఈ కవిత గురించి యూనిట్ మొత్తానికి తెలుస్తుంది. ఆ చెప్పులు తనవైతే ఎంత అదృష్టమో అని అంటాడు వినోద్. అప్పుడు డైరక్టర్ అమిత్ ఆ కవితలోని అసలైన భావాన్ని అందరికీ వివరిస్తాడు. ఈ కోణం తమకి తట్టలేదని అంటారు నైనా, తరుణీ, సరోజ్. తరువాత పాదచారి రాసిన మరో కవితని వినిపిస్తుంది అల. ఈ కవితని కూడా గొప్పగా విశ్లేషిస్తాడు అమిత్. టీ, స్నాక్స్ తీసుకుని అందరూ తరువాతి రెండు గంటలు మహా ఉత్సాహంగా షూటింగ్‍లో పాల్గొంటారు. ఆ చెప్పులు వినోద్‍వని తర్వాత అలకి తెలుస్తుంది. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-17

మహతి:

హించని సన్నివేశాలు ఎదురవడమే జీవితం. అటువంటి దాన్ని నేను జీవితంలో చూస్తానని అనుకోలేదు. నాలుగు రోజులయినా డా. శ్రీధర్, డా. శారదలు కేస్ స్టడీ పూర్తి చెయ్యలేదు. అది పూర్తయితే గానీ ఓ నిర్ణయానికి రాలేము. ఆ కేస్ షీట్ నకలుని టాటా ఇన్‌స్టిట్యూట్‌కి పంపారట. వాళ్ళు స్టడీ చేసి ఫోన్‍లో వివరిస్తారట. ఇందిర గారు ప్రస్తుతం ఏ మందులు వాడడం లేదు. అయితే అక్కడి నించి తెచ్చిన మందులు వాడకానిని సిద్ధంగా ఉన్నాయి.

తాతయ్య వీలయినంత ఎక్కవ సేవు ఇందిర గారితో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా ఏ విషయమూ ఉండదు. కానీ ఆ మాటల్లో ఓ ఉత్సాహం నిండివుండటం గమనించా. ఇందిర స్పందన కూడా బాగానే ఉంది.

త్రిపుర గారు గ్రామం గురించి, ఇక్కడ జరిగిన ఎలెక్షన్ల గురించి ఇందిరతో చెబుతున్నారు. అవన్నీ ఇందిరగారు శ్రద్ధగానే వింటున్నారని నాకు అనిపించింది.

ఓనాడు త్రిపురగారు, “మహీ. ఇందిర చాలా చాలా ఇంటలిజెంట్. నేను చెప్పిన కొన్ని సమస్యలకి ఆవిడ చెప్పిన పరిష్కారాలు విని నా బుర్ర తిరిగిపోయింది. సంభాషణలో తెలిసింది తను పోస్ట్ గ్రాడ్యుయేట్ అని. చాలా షార్ప్ మైండ్” అన్నారు. అప్పుడు మేము రైతు మార్కెట్‍లో ఉన్నాము వెజిటబుల్స్ కొంటూ.

“ఈజిట్?” ఆశ్చర్యంగా అన్నాను. ఇప్పటి వరకూ ఆవిడ క్వాలిఫికేషన్స్ తెలియకపోవడం, కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించకపోవడమూ నా తప్పేగా!

“మరో విషయం ఏమంటే నువ్వంటే ఇందిర గారికి చాలా ఇష్టం. ఆవిడ నీ గురించి మాట్లాడేటప్పుడు ఆ ఇష్టం తెలుస్తుంది. నీ చదువు గురించి అడిగి, నువ్వు మధ్య లోనే చదువు మానేసావని చాలా నొచ్చుకుంది. బిల్డింగ్‍కి పునాది ఎంత ముఖ్యమో మనిషికి చదువూ అంతే ముఖ్యమని నాతో అన్నది. ‘త్రిపురా, నీకు గొప్ప వైద్యం వచ్చి ఉండొచ్చు. కానీ ఎంబిబిఎస్ డిగ్రీ లేకపోతే మందులు ఇవ్వగలవా? ప్రభుత్వం ఇవ్వనిస్తుందా? నువ్వు గొప్ప వాక్చాతుర్యం గల దానివే కావొచ్చు, కానీ లా డిగ్రీ లేకుండా కోర్టులో వాదించగలవా? గొప్ప ఉపాధ్యాయినికి ఉండాల్సిన లక్షణాలున్నీ నీకు ఉండొచ్చు. కానీ కేవలం ఆ లక్షణాలతో స్కూల్లోనో, కాలేజీలోనో బోధించడానికి అనుమతి పొందగలవా? మహీకి నువ్వు స్నేహితురాలివీ, శ్రేయోభిలాషివీ గదా, మిగతావన్నీ పక్కన బెట్టి ముందు చదువు మీద కాన్సన్‌ట్రేట్ చెయ్యమను’ అన్నది” అన్నారు త్రిపుర.

ఇది మరో షాక్ నాకు. నేను షాక్‌లో ఉండగానే “మీరే చెప్పొచ్చుగా? అన్నాను నేను” అన్నది త్రిపుర.

“దానికి ఏమన్నారూ?” అడిగాను నేను.

“చాలా దీర్ఘంగా నిటూర్చింది. ఆ తరువాత, ‘నేను మంచి సలహాలిచ్చే స్థితిలో లేను. నిజం చెబితే ఇప్పటి నేను – నేను కాదు’ అన్నది” అన్నారు త్రిపుర.

నాకు అర్థం అయి అవనట్టుగా ఉంది. ఆవిడ సృష్టించిన తుఫానుని అందరూ అసహ్యించుకుంటారనేది ఆవిడకీ తెలుసు. మరి తెలిసీ ఎందుకిలా? నేను మౌనంగా నడుస్తున్నాను.

“అనారోగ్యం సంగతి పక్కన పెడితే, ఇందిర ఓ జీనియస్ అనడంలో సందేహమే అక్కర్లా. ఏదో బాధ పడుతుంది. ఆవిడ బాధ ఏంటో తెలిస్తే గానీ ఆవిడ ఆరోగ్యం బాగుపడడానికి మనం ఏం చెయ్యాలో ఆలోచించలేము. ధనం, తెలివితేటలు, సోషల్ స్టేటస్సూ, చదువు సంద్యలూ ఇవన్నీ శరీరానికి తొడిగే ఆభరణాలే. కానీ, మనసుకి కావల్సింది వేరు. అది ప్రతిక్షణం కోరుకునేది ఓ తోడుని, ఓ ప్రేమని, ఓ చల్లని స్నేహాన్ని” అన్నారు త్రిపుర గారు.

“తన గతం గురించి ఇందిర గారు ఏదైనా మాట్లాడారా?” అడిగాను, అడగకూడదనుకుంటూనే.

“ఊహూ! ఒక్క చదువు గరించి తప్ప మరేమీ మాట్లాడలేదు. అసలా ప్రసక్తే రానివ్వలేదు” అన్నారు త్రిపుర. మాట్లాడుతూనే ఇంటికి వచ్చాం.

ఇందిర మనసులో ఏముందో నాకు ఏ మాత్రం అర్థం కాలేదు. నాలుగయిదు సార్లు మా నాన్న చిన్న వయసు విషయాలు అడిగినా చాలా తక్కువగా ఆన్సర్ టు ది పాయింట్ లాగా మాట్లాడారు కానీ వాటి గురించి ఉత్సాహంగా వివరించలేదు.

అటు అమ్మ సంగతి చూస్తే మరో పద్థతిలో ఉంది. నేను ఫోన్ చేసినప్పుడల్లా మాట్లాడుతుంది, కానీ క్లుప్తంగా. ఇందిర గురించి గానీ, మరెవరి గురించి గానీ అసలు ఏ మాత్రం తెలియనట్టుగానే ఉంటోంది గానీ, ఏమీ మాట్లాడదు. కనీసం నన్ను నాలుగు తిట్లు తిట్టినా బాగుంటుంది అనిపించేది. కానీ అలా తిడితే అమ్మ విశిష్టత ఏముంటుందీ!

ఊరి విషయాలు పట్టించుకునే తీరిక కూడా నాకు లేకుండా పోయింది. శారద గారు ప్రెగ్నెంట్ కావడంతో, వంట నేనే చేస్తున్నా. త్రిపుర గారు పాపం చాలా సాయం చేస్తున్నా, పని పనే కదా! మహిళా మండలి సంగతి ఎలా ఉన్నా, ‘కుసుమ’ పేరు మీద పెట్టిన విస్తళ్ళ కేంద్రం మాత్రం బాగా పుంజుకుంది. ఊళ్ళోనే కాక, ఇతర ఊళ్ళకీ విస్తళ్ళు పంపిణీ చేసే ఎత్తుకి ఎదిగింది. కుసుమ వాళ్ళ అమ్మా, బామ్మా ఒక తపస్సుగా ఆ కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. తమ వల్లే కుసుమ చనిపోయిందనే ఆలోచన వారి మనసుల నుంచి తొలగలేదు. అందుకే మరింత మరింతగా శ్రమిస్తున్నారు. సత్యసాయి సేవా సమితి వారు హాస్పటల్ ప్రాంగణాన్ని అద్దంలా వుంచుతున్నారు, ప్రభుత్వ సహాయం తోనూ, ఇతర సేవా సంస్థల చేయూతతోనూ.

మహిళా మండలి పరిస్థితి మాత్రం యథాతథంగా ఉంది. వాటి జోలికి వెళ్ళాలంటేనే నాకు చికాకు పుడుతోంది.

పెద్దల్నీ, పిల్లల్ని ఒక చోట చేర్చి చదివించడం అనేది చాలా విజయవంతమైంది. అదీ దిగ్విజయంగా నడుస్తోంది.

“మహీ.. ఇందిర మనసు విప్పి మాట్లాడితే తప్ప, ఆమె ఆరోగ్యం బాగుపడదు. తను ఏదో తీవ్రమైన వ్యథలో ఉంది. ముందు మందు వెయ్యాల్సింది మనసుకి, శరీరానికి కాదు. పెద్దవాడిగా నేనెన్నిసార్లు ప్రయత్నించినా, నేనే సఫలం కాలేకపోయాను” అన్నారు తాతయ్య.

నేను విన్నానంతే. ఆ తరువాత తాతయ్య కూడా ఎవరో వస్తే వరండాలోకి వెళ్ళారు. ఆయనకి పూర్తి విషయాలు చెప్పి తీరాలి. లేకపోతే అసలు విషయం ఆయనకి తెలిసే అవకాశమే లేదు. అసలు విషయం తెలిస్తే ఆయన భరించగలరా? తట్టుకోగలరా?

ఈ సమస్య కాల పరిమితి లేనిది. ఒకవేళ ఇందిర గారి ఆరోగ్యం సంపూర్ణంగా బాగుపడిన తరువాత కూడా సమస్య సమస్యే కదా. విషయాలన్నీ తాతయ్యకి చెబితే చాలా చాలా ఉపయోగపడుతుందని నాకు తెలుసు, కానీ, అది ఆయనకు పిడుగుపాటు కాకూడదు.

“అమ్మా” అనే పిలుపుకి ఆలోచనల నుంచి బయటపడ్డాను. మా పాలేరు.

“ఏమిటి?” అన్నాను. అతని ముఖంలో కంగారు. “కుసుమ గారి బామ్మగార్ని హాస్పటల్లో చేర్చారమ్మా” అన్నాడు.

తాతయ్య వరండాలో కనిపించలేదు.

“తాతయ్యని చూశావా?” అన్నాను.

“తాతయ్యగారే ఆ విషయం మీతో చెప్పమన్నారమ్మా. తాతయ్య గారు హాస్పటల్‍లో ఉన్నారు” అన్నాడు పాలేరు.

ఒక్కసారిగా మనసంతా బరువెక్కిపోయింది. ఒకప్పుడు గుండ్రాయిలా ఉంటూ అందరినీ సతాయించే ఆవిడ – మనవరాలి జీవితాన్ని దుర్భరం చేసిన ఆవిడ – మనవరాలు పోగానే కుదేలైపోయింది. తన తప్పుని తెలుసుకుని మౌనంగానే జీవచ్ఛవంలా మిగిలిపోయింది. ఆవిడకేదైనా అయితే కుసుమ తల్లి గారి పరిస్థితి ఏమిటి? నాలో అన్నీ ప్రశ్నలే.

“త్రిపురగారిని కలిసి అర్జంటుగా ఇక్కడికి రమ్మని చెప్పు” అన్నాను పాలేరుతో. అతను వెళ్ళిపోయాడు.

ఆవిడ వస్తేగానే నేను వెళ్ళాడానికి లేదు. ఇందిర గారి దగ్గర ఎవరో ఒకరు ఉండాలిగా.

“మహతీ” అని సన్నగా పిలిచింది ఇందిరగారు. “ఏదైనా ప్రాబ్లమా?” అన్నది సూటిగా నా కళ్ళ లోకి చూస్తూ. విషయం చెప్పాను. కుసుమ సంగతి పూర్తిగా చెప్పాను. ఆ తరువాత కుసుమ పేరు మీద మేము విస్తళ్ళ సెంటర్ ప్రారంభించడం, కుసుమ అమ్మ బామ్మా నిరంతర శ్రమ ఇవన్నీ వివరంగానే చెప్పాను. కుసుమ చిట్టచివరి జీవితం గురించీ, నేను దాన్ని అపార్థం చేసుకోవడం, ఆ తరువాత డా. శ్రీధర్ అసలు విషయం నాకు చెప్పడం కూడా ఇందిరతో చెప్పాను.

ఒక బాధలో ఒక వరదలా అవన్నీ నా నోట్లోంచి ప్రవహించాయి. నా కళ్ళల్లో చెమ్మ. “ఇప్పుడావిడ జీవచ్ఛవంలా బ్రతుకుతోంది ఆంటీ. అయినా కుసుమ తల్లికి తోడు అనేది ఒకటుందిగా. ఈవిడకేమైనా అయితే కుసుమ తల్లి ఒంటరిదైపోతుంది” అని మాత్రం చెప్పగలిగా. ఆపైన నా గొంతు పెగలలేదు.

“మహీ.. నువ్వు హాస్పటల్‌కి వెళ్ళు. కుసుమ తల్లికి ధైర్యం చెప్పు. ఈ కష్ట సమయంలో తోడుండు” అన్నది ఇందిర.

“త్రిపుర గారికి కబురుపెట్టాను రమ్మని” అన్నాను గొంతు పెకల్చుకుని.

“ఫరవాలేదు. నేనేమీ అయిపోను. హాస్పటల్‌కి వెళ్ళు” అన్నాది ఇందిర.

“తాతయ్య ఉన్నారు. త్రిపుర వచ్చాక వెడతా ఆంటీ. ఎందుకంటే, మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేను” స్థిరంగా అని కుర్చీ లాక్కుని కూర్చున్నాను.

“అదీగాక, డా. శ్రీధర్ గారికి కుసుమ ఫేమిలీ అంతా పరిచయమే. అప్పటి సంగతి, ఇప్పటి సంగతి నుండి క్షుణ్ణంగా ఆయనకు తెలుసు. కుసుమ అమ్మగారికి నాకంటే మంచిగా తాతయ్య ధైర్యం చెప్పగలరు” నన్ను నేను సంబాళించుకుని అన్నాను, ఇందిర గారి చేతిని నా చేతిలోకి తీసుకుంటూ.

“నాకేమీ అవదు మహీ..” మధ్యలో మాటని ఆపేసింది ఇందిర. మొదటిసారి ఆమె కళ్ళల్లో నీరు.

నేను చేతిని అలాగే పట్టుకుని కూర్చున్నా. ఆ క్షణంలో నాకు అక్కడ కనిపించింది ఇందిర కాదు.. నిస్సహాయ స్థితిలో కన్నీళ్ళు పెట్టుకున్న కుసుమ కనిపించింది. చూస్తుండగానే ఇందిర ముఖమంతా చెమట పట్టింది. నేను లేచి ఆమెని మెల్లగా భుజాలు పట్టుకొని పడుకోబెట్టాను.

బెడ్ పక్కనున్న గ్లూకోజ్ ఓ స్పూన్ ఆమె నోట్లో వేసి మంచం మీద తన పక్కనే కూర్చున్నా. తను కళ్ళు మూసుకునే నా చేయి పట్టుకుంది. లక్ష మాటలు చెప్పలేని భావం ఒక్క స్పర్శ చెబుతుందన్న మాట ఎంత నిజం.

నేను పట్టుకున్నది ఇందిరని కాదు, దశాబ్దాలుగా తన ఒంటరితనాన్నీ, బేలతనాన్నీ తనలోనే దాచుకుని పైపైకి గంభీరంగా ఉన్న ఓ మౌనమూర్తిని. ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తున్నా. అవి నిశబ్ద సంగీతప్రక్రియలు అనిపించింది. ఎందుకో నాకూ కళ్ళు చెమ్మగిల్లాయి.

***

ఊహించనివి జరగడం అంటే ఇదే. హాస్పటల్లో చేర్చిన కుసుమ బామ్మగారు కోలుకుంది.. ఆ రోజే! కానీ, తెల్లవారు ఝామున కుసుమ తల్లి నిద్ర లోనే ప్రాణం విడిచింది. ఊరు ఊరంతా నిర్ఘాంతపోయింది.

కుసుమ బామ్మగారి ఏడుపుకి అంతులేదు.

“తల్లీ.. నువ్వు ఎంత చెప్పినా వినలేదు.. ఇప్పుడు చూడు, లోకంలో ఒక్కరూ నాకు మిగల్లేదు. ఎన్ని జన్మల పాపమో అందర్నీ కళ్ళముందే కాటికి పంపించేశాను. కనీసం నాకు చావునైనా ఇవ్వరా?” అని బిగ్గటిల్లి ఏడుస్తూనే ఉంది.

గోడ మీది కుసుమ ‘ఫోటో’ నిశ్చలంగా చూస్తూ వింటూ ఉన్నదని నాకనిపించింది. ఆ ఫోటోలోని కళ్ళు తల్లి శవాన్ని కూడా చూస్తున్నాయి ఆర్తిగా, బేలగా.

చాలా దూరపు చుట్టాలు ఎవరో వచ్చారు. ఆస్తి కోసం అని అందరికీ అర్థమైంది.

పంచాయతీ ప్రెసిడెంటు గారు ఇంటికి తాళం వేసి సీల్ చేశారు. కర్మకాండలన్నీ వూరిలో బ్రాహ్మల సహాయంతో ఒక పేద కమ్మవారబ్బాయితో జరిపించారు. చుట్టాలమని వచ్చిన వాళ్ళు చాలా గొడవలు లేవదీయడానికి ప్రయత్నించారు గానీ, ప్రెసిడెంటు గారు సాగనివ్వలేదు.

“పన్నెండు రోజులూ గడిచిపోయిం తరువాతే ఏ విషయమైనా. ముందర వాళ్ళ ఆస్తులన్నీ లెక్కకట్టాలి. అదీ మేము ఏర్పాటు చేసిన కమిటీ మెంబర్సు ఎదురూగా. ఆ తరువాత నిర్ణయిస్తాం ఏం చేయ్యంలో” అని స్పష్టంగా చెప్పారు. వచ్చిన వాళ్ళ పంతంగా కోర్టుకెడతామని బెదిరిస్తే, ప్రెసిడెంటు గారు నవ్వి, “మారాజులా వెళ్లండి” అన్నారు. ఆ నవ్వులోనే ఓ వార్నింగ్ అందరికీ వినిపించింది.

త్రిపుర గారు కూడా కుసుమ తల్లి మరణానికి  చాలా బాధపడ్డారు. పెద్దావిడని ప్రస్తుతానికీ హాస్పటల్‍ లోనే ఉంచారు. ఆవిడకి మాట సరిగ్గా రావడం లేదు. సగం మగతలో, సగం అయోమయంలో ఉన్నదావిడ. ఉండీ ఉండీ కోడల్ని ఆవిడ పిలవడం అందరికీ కన్నీరు తెప్పించింది.

“జీవితం ఎంత పెద్దదో, అంత చిన్నది మహీ.. కుసుమ తల్లిదండ్రుల పెళ్ళి నేను చూశా. కుసుమ వివాహాన్ని, మరణాన్ని చూశా. కుసుమ తండ్రీ, తల్లీ కూడా వెళ్ళిపోయారు. అన్నీ జరిగింది నా కళ్ళ ముందే. అదీ నిన్నో మొన్నో జరిగినట్టు” నిట్టూర్చి అన్నారు తాతయ్య.

“అవును తాతయ్య గారూ. దుఃఖం ఆటలాడుకోని మనిషి ఈ లోకంలో ఒక్కడైనా ఉన్నాడా? మనుషులే కాదు, ఏ జీవి అయినా యీ లోకంలో కొంతకాలం ఉండి వెళ్ళిపోయే అతిథే! రాక, పోక రెండూ మన చేతిలో లేవు” అన్నది త్రిపుర.

“అవును తాతయ్యా, మా ఇంటి పక్క నుండే ‘మామి’ ఓ పాట సరదాగా పాడుకునేది. ఆ పాట వ్రాసింది తమిళ సినిమా కవి ‘కణ్ణదాసన్’. అందులో ఒక లైను ‘వందవ రెల్లాం తండి విట్టాల్ ఇండ మణ్ణిల్ నమక్కు ఇడ మేదు’ అని. దాని అర్థం, ‘ఈ లోకానికి వచ్చిన వారంతా ఇక్కడే వుండిపోతే, మనిషికి నిలవడానికైనా చోటు వుంటుందా?’ అని” అంది శారద.

“‘ఉదయానికి మూలం అస్తమయం
జననానికి మూలం ప్రతి మరణం
కన్నీరే నవ్వుకి మూలధనం
పడిలేచే కెరటమే యీ జీవితం’,

అన్నాడో కవి, పాదచారి అని.

ఏదైనా మనిషికి తెలియనిది జనన మరణాల రహస్యం ఒక్కటే. అది తెలిస్తే చాలు.. లోకం మొతం ఛిన్నాభిన్నం అయిపోతుంది” అన్నాను నేను.

అందరం మాట్లాడుతున్నాం, ఇందిర గారు తప్ప. మౌనంగా వింటూ కూర్చుంది. మొహంలో ఏ భావమూ లేదు.

ఒకటి మాత్రం నిజం. కుసుమ బామ్మగార్ని హాస్పటల్లో చేర్చిన రోజు నుంచీ, ఇందిత నాతో ఎక్కువ సేపు గడపడానికి ఇష్టపడుతోందని నాకు అర్థమైంది. మా చిన్నప్పటి విషయాలూ, నా చదువు విషయాలూ అడుగుతోంది. నేను అవన్నీ చెప్పేటప్పుడు చాలా ఆసక్తిగా వింటుంది. నేను కూడా అమ్మమ్మ వంటల గురించి, అమ్మమ్మ తాతయ్యల ఆనందకరమైన సంసారం గురించీ, అందరి గురించి చెప్పేదాన్ని. అమ్మానాన్నల గురించి మాత్రం ఎత్తేదాన్ని కాదు. తనూ ఆ విషయం అడిగేది కాదు. అల గురించి నుంచి ఇందిర గారికి చెప్పా. మా స్నేహం గురించీ, అల తన ప్రేమతో ‘తిమ్మూ’ని వెంటాడిన సంగతి కూడా. తను విన్నది. ఓ చిన్న నిట్టూర్పు విడిచి, “మనిషి ఎంత ఎదిగినా ఎదగకపోయినా, ఏ భావాన్ని ఎలా ప్రకటించాలో, పోనీ ఎలా దాచుకోవాలో మాత్రం తెలుసుకోడు. ఎందుకంటే అది నిజంగా తెలియదు కనుక! పోనీలే.. అల అదృష్టవంతురాలు. సరైన సమయంలో ఊబి నుంచి బయటపడింది” అన్నది.

ఆ రాత్రి చాలా సేపు నిద్రపట్టలేదు. ఓ కవిత వ్రాయాలనిపించింది. అభిమన్యు గుర్తొచ్చి –

‘మృదువైన మాట సెలవీవా
క్షణమైన గొంతు విననీవా
మురిపాలు రేపు చూపులతో
తమకాల వీణ శృతి చెయ్ వా’ అని.

కుసుమ, వాళ్ళు అమ్మ తాలూకు జనన మరణాలు గుర్తొస్తే, మనసులో ఉన్న అభిమన్యుని తలచుకుని –

‘మరణంలోని మౌనం నేనైతే
మరణాన్ని చంపే జననానివి నువ్వు
అందుకేనేమో..
మౌనం మాటగా మారింది’ అని.

మరో కవిత –

‘కడలిని కలిసేవరకూ
నది ప్రవహిస్తూనే ఉంటుంది.
మరణాన్ని తాకేవరకూ
మనసు కొత్తగా ప్రతి క్షణం
పుడుతూనే ఉంటుంది’ అని.

ఎప్పటికో నిద్ర పట్టింది.

(ఇంకా ఉంది)

Exit mobile version