Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహతి-71

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[కర్రావూరి ఉప్పలపాడులో డా. శ్రీధర్, డా. శారదలు -ఇందిర గారి కేస్ స్టడీ పూర్తి చేయలేదు. ఆ కేసు వివరాలను వారు టాటా ఇన్‌స్టిట్యూట్‌కి పంపారట. వాళ్ళు స్టడీ చేసి ఫోన్‍లో చెప్పాలి. ప్రస్తుతానికి ఇందిర ఏ మందులు వాడడం లేదు. తాతయ్య ఆవిడని నిరంతరం ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు.  తనకీ ఇందిరకీ మధ్య జరిగిన సంభాషణలో – మహతి అంటే ఇందిరకి బాగా ఇష్టమని, ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనీ, ఆవిడది చాలా షార్ప్ మైండ్ అనీ తెలిసిందనీ త్రిపుర మహతికి చెప్తారు. మహతిని చదువు మీద దృష్టి పెట్టమని చెప్పమని తనకి ఇందిర చెప్పిందని త్రిపుర చెప్తారు. ఇంటి పనులతో మహతికి ఊరి సమస్యలు పట్టించుకునేంత తీరిక ఉండదు. ఓ రోజు కుసుమ బామ్మగారిని హాస్పటల్లో చేర్చారని పాలేరు వచ్చి చెప్తాడు. హాస్పటల్‍కి వెళ్ళాలనుకుంటుంది మహతి. కానీ ఇందిర దగ్గర ఎవరూ లేకపోవడంతో, త్రిపురకి కబురు పెట్టి ఆమె వచ్చాకా వెళ్ళాలనుకుంటుంది. విషయం తెలుసుకున్న ఇందిర – తనకేమీ కాదనీ, మహతిని వెళ్ళమని అంటుంది. కానీ ఊహించని విధంగా కుసుమ బామ్మ కోలుకుంటుంది, కానీ ఆ తెల్లవారు జామున కుసుమ తల్లి నిద్రలోనే ప్రాణాలు విడుస్తుంది. బామ్మగారిని ఓదార్చడం ఎవరి వల్లా కాదు. కుసుమ తల్లి వైపు చుట్టాలు వచ్చి ఆస్తి కోసం గొడవ చేయాలని చూసినా, ప్రెసిడెంట్ గారు పడనీయరు. కుసుమ బామ్మగారిని హాస్పటల్‍లో చేర్చిన రోజు నుంచి ఇందిర తనతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్న సంగతి గ్రహించిన మహతి వీలైనంత సేపు ఆవిడతో గడుపుతుంది. కుసుమ గురించి, అల గురించి, తిమ్మూ గురించి చెబుతుంది. ఆ రాత్రి నిద్రపట్టక, అభిమన్యుని తలచుకుని కవితలు రాసుకుంటుంది మహతి. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-18

అల:

“కళ్ళ లోంచి జారిన కన్నీటి బిందువు వెనక్కి తిరిగి పోగలదా? సముద్రంలో కలసిన నది ఏనాడైనా ఉప్పునీటితో విడివడగలదా? నాశిక నుంచి వెడలి పోయిన చివరి శ్వాస మళ్ళీ శరీరాన్ని చేరుకోగలదా? కొమ్మనించి విడివడి నేలకు రాలిన పండు మళ్ళీ కొమ్మని చేరుకోగలదా? చెప్పు.. చెప్పరా. బాస్టర్డ్.. చెప్పవేం?” విలన్ రైట్ హ్యాండ్ గాడి జుట్టు పట్టుకుని ‘ధీర’ అడిగే సన్నివేశం అది.

‘కట్’ చెప్పాకా, వచ్చి కుర్చీలో కూర్చున్నాను. టచప్ విమన్ వచ్చి చల్లని క్లాత్‌తో ముఖాన్ని అద్దింది, మేకప్ చెరగకుండా. షాట్ అయిపోయినా నా గుండె ఆవేశంతో కొట్టుకుంటూనే ఉంది.. వేగంగా.

“ఫెంటాస్టిక్ అలగారూ.. మీ కళ్ళల్లో ఎంత కోపం కనిపించిందంటే నిజంగా మీరు నన్ను చంపేస్తేరేమో అని భయపడ్డాను” అన్నాడు విలన్ రైట్ హ్యాండ్‌గా నటించిన యువ నటుడు ముస్తఫా. నేను చిన్నగా నవ్వే ప్రయత్నం చేశా; ఇంకా సీన్ లోంచి బయటపడలేదని నాకు తెలుసు.

“గ్రేట్ ఫెర్ఫార్మెన్స్ అలా. ఐ నో.. నువ్వు చాలా చాలా ఇన్వాల్వ్ అయి చేశావు. మిగతా డైలాగ్ పార్ట్ కూడా ఇప్పుడే తీస్తే ఇంపాక్ట్ బాగుంటుంది.. సరేనా?” అన్నారు అమిత్.

‘యస్’ అన్నట్టుగా నేను తలాడించాను. అదీ మంచిదే.

“ఓకే దెన్. ఫిఫ్టీన్ మినిట్స్” అని మళ్ళీ సెట్ లోకి వెళ్ళారు అమిత్.

“అలా, నటనని సీరియస్‌గా తీసుకోవాల్సిన మాట నిజమే, కానీ.. పాత్ర నీవై పోకూడదు. అలా నీవే పాత్రవైపోతే, ఆ పాత్ర తాలూకూ రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా మీ మనసు మీద పడతాయి. ‘I am only acting’ అనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన మాట. నేను నీకు ఉచిత సలహా ఇవ్వడం లేదు. నా ఎనిమిదవ ఏట నుంచే నేను stage మీద నటిస్తున్నాను. మొదట్లో నీలాగే నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని. తద్వారా చాలా మానసిక సమస్యలు వచ్చాయి. అటువంటి ఇన్వాల్వ్‌మెంట్‌లో నుంచి బైట పడటానికి చాలా సాధన చేయాల్సి వచ్చింది. నీకంటే పెద్దదాన్ని గనక చెబుతున్నాను. సరేనా!” వాత్సల్యంగా నా తల నిమిరి అన్నది నందినీ సోల్గాంకర్. ఈ సినిమాలో నా తల్లి పాత్రధారిణి.

సరేనన్నట్లు తలాడించాను. నందినీ చాలా గొప్ప ఆర్టిస్టు.

సరోజ్ నా దగ్గరకు వస్తూ ఓ చాక్లెట్ ఇచ్చింది. ‘ఎందుకు’ అన్నట్లు చూశాను.

“చాక్లెట్ అద్భుతమైన మెడిసిన్ మేడమ్. ఎంతటి టెన్షన్‌లో అయినా మెత్తటి చాక్లెట్ చప్పరిస్తే మనసూ, శరీరమూ క్షణాల్లో సెట్ అవుతాయి. జస్ట్ ట్రై చేసి చూడండి” అన్నది సరోజ్. రేపర్ విప్పి నోట్లో వేసుకున్నాను. చిత్రమయిన ఫీలింగ్.

సరోజ్ వెళ్ళిపోయాకా, “సరోజ్ అన్న మాట 100% కరెక్ట్ అలా. కానీ, ఇంకెప్పుడు ఎవరు ఏదిచ్చినా నిస్సంశయంగా తినొద్దు. ఇది నా సలహా కాదు, హెచ్చరిక. ఇదో పద్మవ్యూహం లాంటిది. నిజం చెబితే ఇదో వైకుంఠపాళి. నిచ్చెనలూ ఉంటాయి, పాములూ ఉంటాయి. ఏది నిచ్చెనో ఏది పామో మాత్రం ఎప్పటికీ తెలీదు. కొందరు గొప్ప యాక్టర్లే మట్టికొట్టుకుపోయారు – చుట్టూ చేరిన చెంచాగాళ్ళ వల్లా, స్నేహం నటించిన శత్రువర్గపు వాళ్ళ వల్ల. ఓ గొప్ప నటుడి పక్కన చేరిన చెంచాలు అతడ్ని ఆకాశానికెత్తేసి, ‘నువ్వు లేనిదే ఇండస్ట్రీయే లేద’ని ఉబ్బేసి, ఆ హీరోని సర్వనాశనం చేశారు. తొమ్మిది గంటలకి షూటింగ్ అయితే సాయంత్రం ఐదు గంటలకి వెళ్ళేవాడు సదరు హీరో. నటిస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కింది ఇండస్ట్రీ. అలా నాశనమైన వాళ్ళు నటులే కాదు, డైరెక్టర్లూ, టెక్నీషియన్సూ, మ్యూజీషియన్స్ కూడా ఉన్నారు. మరో పద్ధతి చెడ్డ అలవాట్లు నేర్పించడం. ఆ అలవాటుకి బానిస చెయ్యడం. మీనా కుమారీ, మీ సావిత్రి గుర్తు లేరా. ఇంకో పద్థతి ఫుడ్ పాయిజనింగ్. సరోజ్ చాలా మంచి పిల్లని నాకు తెలుసు. కానీ, మిగతా వారు ఎలాంటి వారో ఏ ఉద్దేశంతో వస్తారో మనకి తెలీదుగా! ప్రివెన్షన్ యీజ్ బెటర్ దాన్ క్యూర్” అని సుదీర్ఘ ఉపన్యాసమిచ్చింది నందినీ సోల్గాంకర్. ఆమె అన్నది అక్షరాలా నిజమే. “థాంక్యూ నందినీజీ. తప్పక జాగ్రత్తలు పాటిస్తాను” అన్నాను నందినిని హగ్ చేసుకుని. మంచి ఎవరు చెప్పినా వినడం మంచి లక్షిణం అనేది మా అమ్మ.

“గురువు ఏ రూపంలో అయినా లభించవచ్చు, అలాగే భగవంతుడూ బంధువులూ కూడా ఏ రూపంలోనైనా మనకి అగుపడవచ్చు. ఎందుకంటే దైవం మానుష రూపేణా అంటారుగా. అందువల్లనే” అన్నారు కమల్‍జీత్. సాయంకాలం టైంలో మాంచి సమాసాల్ని తింటున్నాం. వేడి జిలేబీలూ ఉన్నాయి, సమాసాలకి తోడుగా.

“ఎందుకలా?” అన్నాడు జులూ ద కమేడియన్.

“దైవత్వమంటే ఏమిటో మనిషికి బోధించాలంటే మనుజ రూపంలో వచ్చినప్పుడే అది సాధ్యపడేది కదా అది సాధ్యపడేది” అన్నారు కమల్‍జీత్.

 “ఆవులు గేదెలు మేకలు గొర్రెలు వాటికి దేవుడూ దైవత్వమూ అవసరం లేదా?” జులూ గొంతులో చిన్న వెక్కిరింపు.

“ఎందుకవసరం లేదు, వాళ్ళ దేవుడు వాటికి వాటి రూపంలోనే కనిపిస్తాడు. ఎటొచ్చీ వాటికి అక్కర్లేనివి మాత్రం నేను చెప్పగలను” నవ్వి అన్నారు కమల్‍జీత్.

“చెప్పండి” వెటకారంగా అన్నాడు జులూ. మేమంతా ఎదురు చూస్తున్నాం.. కమల్ ఏమి చెబుతారా అని.

“సినిమాలు టీవీలూ సీరియల్సూ, పరిశ్రమలు, రాజకీయాలూ, పత్రికలూ, ప్రభుత్వాలూ, ప్రయాణ సాధనాలూ ఇవేమీ వాటికి అక్కరలేదు. అన్నట్టు నాలాంటి కెమరామన్, నీలాంటి కమేడిషన్ వాటికి అక్కరలేదు” నవ్వి అన్నారు కమల్. ఫక్కున నవ్వారు అందరూ. జూలూ మొహం మాడిపోయింది. “యూ ఆర్ టార్గెటింగ్ మీ” అన్నాడు కోపంగా.

“మీరు అడిగిన ప్రశ్నకే నేను సమాధానం చెప్పిందీ! జూలూ భాయ్ ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. అయినా ఒకటి మాత్రం నిజం. సహాయం కోరి ప్రార్థిస్తే, అది ఏ దేవుణ్ణి ప్రార్థించినా సరే, తక్షణం సహాయం అంది తీరుతుందని నా జీవితంలో అనేకసార్లు రుజువైంది. దేవుళ్ళు ప్రత్యక్షం కాలేదు – కానీ మనుషుల లోని దైవత్వం అంటే ఏమిటో మాత్రం నాకు స్పష్టంగా అర్థమయింది” చిరునవ్వుతో వివరించారు కమల్.

“అలాంటి అనుభవాలూ నాకూ చాలానే ఉన్నాయి” అన్నది తరుణి.

సరదా సరదాగా షూటింగ్ సాగిపోతోంది. ఒక భాష లోంచి మరో భాషలోకి రీమేక్ చేసేటప్పుడు, ఆ ప్రాంతానికి తగినట్టుగా మార్పులు చేర్పులు చేయాలని నాకు అర్థం అయింది.

(క్షమించండి. నవలకి సంబంధం లేని విషయం రాస్తున్నందుకు. ఈమధ్య తమిళం నుంచీ మలయాళం నుంచీ దిగుమతి అవుతున్న సినిమాల పేర్లు కూడా యథాతథంగా వస్తున్నాయి. కనీసం వాటి పేర్లనైనా తెలుగు లోకి మార్చాలనే కనీస ‘విజ్ఞత’ లేకుండా పోయింది. ఒకటీ రెండూ కాదు. ఎందుకిలా జరుగుతోందో నాకే అర్థం కావడం లేదు. ‘కురుప్’, ‘మామాంగం’, ‘తంగలాన్’, ‘పేట’ ఇలా యథాతథంగా తెలుగులోకి దించేస్తున్నారు. ఆ సినిమా పేరుకి అర్థం తెలుగు ప్రజలకి ఏం తెలుస్తుందనీ! కారణాలు కనీసం చెప్పినా అర్థం చేసుకోవచ్చు.)

ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ప్రతి జాతికీ తనదైన పద్ధతులు, సంస్కృతి ఉంటుంది. తెలుగు ‘ధీర’ తెలుగు సంస్కృతిని ప్రతిబించిస్తే, హిందీ ‘ధీర’ ఇక్కడి సంస్కతిని ప్రతిబింబించేలా అన్ని జాగ్రత్తలూ తీసుకంటున్నారు.

“అలా.. షూటింగ్ పూర్తి అవుతోందంటే కాస్త దిగులుగా ఉంది” అన్నాడు వినోద్ షాట్ గాప్‌లో. నిజానికి నాకూ అదే అనిపించినా చెప్పలేకపోతున్నా.

“అవును” అన్నాను. నా గొంతులోని దిగులు నా చెవులకి వినిపించింది.

“నా తరువాతి సినిమా ప్లానింగ్ ఎప్పుడో అయిపోయింది. దాని తర్వాత సినిమాలో హీరోయిన్‍గా చేస్తావా?”

“ఆనందంగా” అని మాత్రం అన్నాను. నిజం చెబితే నేనేం చెప్పాలో కూడా తెలియలేదు.

ఠక్కున లేచి, నా ఊహకి అందక ముందే నన్ను హగ్ చేసుకుని, “థాంక్స్, థాంక్స్ ఎలాట్” అన్నాడు వినోద్. దాదాపు యాభై మంది ఆ దృశ్యాన్ని చూసి ఉంటారు. నా మొహం సిగ్గుతో ఎర్రబడింది.

“కమల్ సార్.. అలా జీ మళ్ళీ నా సినిమాలో నటించడానికి ఒప్పుకుంది.” మా వంక ఆశ్చర్యంగా చూస్తున్న కమల్‌తో అన్నాడు వినోద్.

ఆ ఎనౌన్స్‌మెంట్ విన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టి అభినందించారు. జులూ అయితే “వావ్.. ఫస్ట్ పిక్చర్ పూర్తి కాకుండానే యంగెస్ట్ డైనమిక్ హీరోతో సెకండ్ పిక్చర్. వాటే లక్ అలాజీ” అని హడావిడి చేస్తూ కరచాలనానికి చెయ్యి ఇవ్వబోయాడు గానీ, “సారీ జులూ.. ఇది మీ అందరి ముందు నేను చేసిన ఎనౌన్స్‍‌మెంట్. అల కూడా ఆలోచించుకోవాలిగా! ఫార్మల్‍గా ఒప్పుకుంది, అంతేగానీ డేట్స్ ఎలాట్ చెయ్యడం కుదురుతుందో లేదో” అన్నాడు వినోద్ మధ్య లోకి వచ్చి. జులూ అసలు ఉద్దేశం కరచాలనం పేరుతో నా చేతిని స్పృశించాలని. వినోద్ కావాలనే ఆ వ్యవహారాన్ని ఆపాడని నాకు క్షణంలో అర్థమైంది.

“ఓహ్.. సరే సరే.. అయినా వినోద్ సార్, మీతో హీరోయిన్‌గా చెయ్యాలంటే ఎన్ని జన్మల పుణ్యమో!” అన్నాడు వినోద్‌ని పాంపర్ చేస్తూ జులూ. అతని మొహంలో మాత్రం డిజప్పాయింట్‌మెంట్.

***

“అలా.. నువ్వో మేనేజర్‌ని పెట్టుకోవాల్సిన తరుణం వచ్చింది. ఎవరో ఒకరు నీ బాగోగులు చూడటానికీ, కాల్‍షీట్స్ సర్దుబాటు చెయ్యటానికీ, పర్సనల్ పనులూ, సెక్యూరిటీ చూడడానికీ ఉండాలి. ఈ ఫీల్డు ఎటువంటిదంటే, చాక్లెట్ చేతిలో పెట్టి చచ్చేంత వరకూ పనులు చేయించే మహానుభావులతో నిండి వున్న ఫీల్డు. అప్రమత్తంగా వుండకపోతే శ్రమ తప్ప ఫలితం దక్కదు. సో..” అని ఆగారు కమల్‍జీత్.

“ఇప్పుటి వరకూ అవసరం పడలేదు గానీ, ఇకపై అవసరం ఉంటుందని తెలుస్తుంది పాపాజీ”అన్నాను. ‘పప్పాజీ’ అని పిలిచేది తండ్రిని.

“ఓహ్!” ఆయన కళ్ళు చెమర్చాయి.

“మంచివాళ్ళని మీరే సెలెక్ట్ చెయ్యాలి. కూతుర్ని కదా!” ఆయన చేతులు పట్టుకుని అన్నాను.

ఆయన మీద ‘తండ్రి’ భావన కలగడానిని మరో మూలం వినోద్ నన్ను మరో సినిమాకి హీరోయిన్‌గా అందరి ముందు చెప్పిన తరవాత జరిగిన సంఘటన.

***

షూటింగ్ అయ్యాక మేం బయలుదేరుతుండగా, “వినోద్, తరుణీ, అలా.. రేపు షూటింగ్ లేదు కదా. నేను మా ఊరికి వెళ్ళాలనుకుంటున్నా. అఫ్‍కోర్స్ ఎల్లుండి పొద్దున్న కల్లా వచ్చేస్తాను” అన్నారు.

“ఏమన్నా విశేషమా?” అన్నాడు అమిత్.

“నా వైఫ్ బర్త్‌డే” చిన్నగా అన్నారు కమల్.

“అయితే నేనూ వస్తా” అన్నాను. అంతకు ముందు మేము కమల్ గారి గ్రామానికి వెళ్ళిన సంగతి అందరికీ తెలుసు.

“నాకు కూడా రావాలనే ఉంది. కానీ ఎల్లుండి షూటింగ్ కోసం చాలా రెడీ చేయాలి” నిరుత్సాహంగా అన్నది తరుణి.

“నాకూ రావాలనే ఉంది. కానీ, నేను అమిత్ మరోసారి స్క్రిప్ట్‌ని స్టడీ చేద్దామనుకున్నాం ఇందాకే!” అన్నాడు వినోద్.

షూటింగ్ అయ్యాకా కమల్‍జీత్ గారితో పాటు కారులో కూర్చున్నాకా, ఆయన డ్రైవ్ చేస్తూ, “అలా, నెవర్ బీ ఎమోషనల్.. వినోద్ చాలా మంచివాడు. మిగతా వాళ్ళూ మంచివాళ్ళే. కానీ, ఎప్పుడెవరు మిత్రుడవుతాడో, ఏ మిత్రుడు ఏ క్షణంలో శత్రువవుతాడో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా సినిమా ఫీల్డులోనూ, పొలిటికల్ ఫీల్డు లోనూ. కళాకారులు అత్యంత సున్నిత స్వభావులు. అందుకే ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా స్పందిస్తారు. కానీ ఏదీ ‘లోతుగా’ ఉండదు. ఆ క్షణంలో అప్పుడనిపించేది మాట్లాడుతారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఢక్కామొక్కీలు తిన్నవాళ్ళ సంగతి వేరు. నాకు తెలిసి ఇప్పటి వరకూ నువ్వు నీ వ్యక్తిత్వాన్నీ, స్త్రీత్వాన్నీ నిలబెట్టుకున్నావు. ఈ వైకుంఠపాళీలో నిచ్చెనలే చూశావు. అది భగవంతుడి వరం. కానీ నిచ్చెనలు మాత్రమే కాదు పాములూ ఉంటాయి. దీవించే దేవతలే కాదు, నిష్కారణంగా మనసులు బలి చేసే రాక్షసులూ ఉంటారు. బేటీ, తస్మాత్ జాగ్రత. ఇది నేనేమీ నిన్ను భయపెట్టడానికి చెప్పట్లా. జాగ్రత్త పడాలని చెబుతున్నాను..” అన్నారు.

ఆయన నా కోసం పడుతున్న తాపత్రయానికి నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఓ క్షణం సంబాళించుకుని, “అవునూ, అమ్మ దగ్గరికి కదా వెళ్ళేదీ.. ఏదన్నా గిఫ్ట్ కొందాం” అన్నాను.

“నిజం చెబితే నువ్వు రావడమే తనకి గిఫ్ట్. నువ్వు రావాలనే అందరి ముందూ డల్జీత్ బర్త్ డే సంగతి చెప్పాను.  నువ్వొస్తున్నావు. నాకు చెప్పలేని సంతోషంగా ఉంది. నువ్వు రావడమే డల్జీత్‌కి ఓ సర్‍ప్రైజ్ గిఫ్ట్” అన్నారు.

చేరేసరికి రాత్రి 10.30 అయింది. వెళ్ళేటప్పుడే దారిలో భోంచేశాం. రాత్రి మేం రావడం డల్జీత్ జీ కి ఎంత సంతోషం కలిగించిందంటే, నన్ను తన దగ్గరే కూర్చోబెట్టుకుంది.

“అడ్వాన్స్ బర్ద్ డే మా” అన్నాను గట్టిగా కౌగిలించుకుని.

“‘మా’ అని కదూ అన్నదీ!” అంటూ నన్ను వదిలిపెట్టలేదు. అప్పుడనిపించింది, ‘అమ్మ’ అంటే స్త్రీ కాదు. సర్వజీవుల్లోనూ ఉండే అమ్మదనాన్నే ‘మాతృత్వం’ అంటారని. నిజం చెబితే మా అమ్మ ఒడిలో ఉన్నట్లే నాకు అనిపించింది. ఓ రచయిత అన్నాడు – “గంగా మేరీ మాతా నామ్.. బాప్ కా నామ్ హిమాలా” అని (మా అమ్మ పేరు గంగ – నాన్న పేరు హిమాలయం). ఈ సంస్కృతి యీ ప్రపంచంలో ఉన్నది ఒక్క భారతదేశంలోనే.

చిత్రమేమిటంటే, పుట్టినరోజు నాకో, డల్జీత్ ‘మా’ కో నాకే అర్థం కాలేదు. బట్టలేనా, గాజులేనా, బంగారపు ఉంగరమూ, ముక్కు పుడకనేనా – ఓహ్.. బహుమతులన్నీ నాపైనే కురిశాయి. “నువ్వొస్తే బాగుంటుందనుకున్నా – లక్ష్మీ – నువ్వొచ్చావు. చనిపోయిన నా బిడ్డే బతికొచ్చింది” అన్నది కన్నీళ్ళతో. ఏమనగలనూ! అనంతమైన ప్రేమ వర్షంలో తడిసిపోయాను. ఊరికి దగ్గరగా ఉన్న ఓ చెప్పుల తయారీ వారికి కబురు పంపించి ‘రాజస్తానీ చెప్పులు, హఫ్ షూలు’ తెప్పించి, తొడిగి సంబరపడింది. నన్ను ‘లక్ష్మి’ అనే రోజంతా పిలిచింది. అందరూ ‘అల’ అనడమే గానీ ‘లక్ష్మీ’ అని ఇప్పటి వరకూ ఎవరూ పిలవాలేదు. నాకు నేనే కొత్తదాన్నయ్యాను. నాకు నేనే డల్బీర్ కౌర్‌కి కన్నదాన్నయ్యాను.

చాలా చాలా బాధతో వీడ్కోలు తీసుకోవలసి వచ్చింది. మధ్యాహ్నం భోం చేసి బయల్దేరితే గానీ, రాత్రికి షూటింగ్ స్పాట్‍కి చేరలేము. అంతేకాదు, ఆ మరుసటి రోజు షూటింగ్ నాతోనే గనక తగిన విశ్రాంతి తీసుకోకపోతే ముఖం ఫ్రెష్‍గా ఉండదు.

“బేటీ.. ఐ థింక్.. డల్జీత్ ఇంత సంతోషంగా ఉండటం ఈ రోజే చూశాను.. చాలా చాలా ఏళ్ళ తరువాత. ఎక్కడికో ఎగిరి వెళ్ళిపోయిన మేఘం మళ్ళీ తిరిగొచ్చినంత సంతోషంగా ఉంది” నా తల నిమిరి అన్నారు కమల్‌జీత్.

***

నా కాటేజ్‌కి వచ్చాకా ఓ పుస్తకంలో రాసుకున్నా… ఆ రాతకి కారణం – సడన్‌గా వినోద్ నన్ను కౌగిలించుకుని తన తరువాత సినిమాకి హీరోయిన్‌గా యూనిట్ ముందు ఎనౌన్స్ చేయడం.

‘ప్రేమే ఓ పుస్తకం
కనుచూపులు తొలి పేజీ
పలకరింపు మలి పేజీ
ఊహలు మూడవ పేజీ
మాటలు నాల్గవ పేజీ
ఆపై మాటలు అర్థం లేనీ
తియ్యని తియ్యని తియ్యనివి
ఎక్కడో అక్కడ ఉంటుందీ
మౌనమనే పేజీ ఒకటి
ప్రేమ పెరిగి పెళ్ళి అయితే
పుస్తకమే బ్రతుకౌతుంది
ఏమైనా ప్రియ నేస్తం
పై అట్టవు నీవైతే
క్రింది అట్ట నేనంటా!’

~

‘నేనేదో నీకిచ్చాను
నీవేదో నాకిచ్చావు
ఇచ్చింది మరింత ఇవ్వు
తీస్కున్నది మరింత తీస్కో
ప్రేమ పాఠం ఇదేలే
పట్టుబడితే సుఖాలే!’

~

చల్లగా ముఖం కడుక్కుని పడుకున్నా. కనులు మూసే ముందు దీనంగా మా అమ్మ, సంతోషంగా డల్జీత్ మా ఇద్దరూ కనబడ్డారు. ఒక్క క్షణం మనస్సు కలుక్కుమంది. ఇక్కడ నాకు డల్జీత్  ఓతల్లిలా ప్రేమ పంచింది, అపురూపంగా చూసుకుంది. మరి అక్కడ నా తల్లి నాతో కనీసం మాట్లాడనైనా లేని పరిస్థితిలో ఉంది. ఏం చెయ్యాలీ? కళ్ళు మూసుకుని నా ఆలోచనలను తగ్గించేశా. రేపొద్దున షూటింగ్. నా ముఖం తేటగా ఫ్రెష్‌గా ఉండాలి. అంతే!!!

(ఇంకా ఉంది)

Exit mobile version