[8 మార్చ్ 2025 మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళా మొగ్గలు’ అనే కవితని అందిస్తున్నారు శ్రీమతి చంద్రకళ దీకొండ.]
పురిటినొప్పులెన్నింటినో భరించి
నూతన సృష్టికి నాంది పలుకుతుంది
ప్రకృతికి ప్రతిరూపం పడతి!
తాను ఉన్నత విద్యావంతురాలైతే
భావితరానికి దిక్సూచియై నిలుస్తుంది
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు!
సంగీత సాహిత్యాలతో మురిపించడమే కాదు
ప్రజాపరిపాలన సైతం సమర్థంగా చేయగలదు
వనితలు లేని విద్య ఇలలో లేదు!
భరించలేని వేదనలను సైతం
చిరునవ్వుతో పరిష్కరిస్తుంది
ఇలలో సహనశీలి మహిళ!
నీ ఉనికికి కారణమై
నీ ఉన్నతికి తోడ్పడునది
కన్నతల్లిని జన్మభూమిని మించినది లేదు!
చంద్రకళ దీకొండ గారు విశ్రాంత ఉపాధ్యాయిని. రచనా వ్యాసంగం వారి ప్రవృత్తి. కవితలు, వ్యాసాలు, గేయాలు పేరడీ వంటి ప్రక్రియల్లో ముందుకు సాగుతున్నారు. వీరి కవితలు పలు ప్రింట్, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురితమయ్యాయి. పలు రేడియో ఎఫ్.ఎమ్. ఛానెల్స్‌లో ప్రసారమయ్యాయి. సున్నిత చంద్రికలు అనే లఘు కవితాసంపుటి, సాహితీచంద్రికలు అనే శత వచనకవితా సంపుటి, కవితా చంద్రికలు అనే వచనకవితల సంపుటి వెలువరించారు. నవభారత్ నిర్మాణ సంఘం వారి సాహితీరత్న పురస్కారం, తపస్వీ మనోహరం వారి రైటర్ ఆఫ్ ది ఇయర్ 2021-2022 పురస్కారం, విశ్వ సాహితీ కళావేదిక వారి కీర్తి పురస్కారం పొందారు. పలు కవిసమ్మేళనాలలో పాల్గొన్నారు. తమ కవితలకు అనేక బహుమతులు పొందారు.
