[2026 అక్టోబర్ 20 న విజయదశమి సందర్భంగా డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘మహిళా విజయం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
శరదృతువు ప్రవేశిస్తుండగా
శరత్కాలము నాటి
తెల్లని చల్లని వెన్నెలల చల్లదనంతో
అమ్మవారి చల్లని చూపులు
మనపై ప్రసరిస్తుండగా
నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాం.
ఉదయమే బాలపూజలతో ప్రారంభమయి
సంరంభంగా సాగే కుంకుమార్చనలతో
సువాసినీ పూజలతో
సాయంత్రం భక్తుల అర్చనలతో
దేవీఆలయాలు
శోభాయమానంగా ప్రకాశిస్తుంటాయి.
తొమ్మిదిరోజులు తొమ్మిది
అవతారాలతో దర్శనమిచ్చిన
ఆ లలితాపరాభట్టారిక
విజయదశమినాడు
ఉగ్రరూపధారిణియై మహిషాసురుడను
రాక్షస సంహారంచేసింది ఆ తల్లి.
రావణసంహారం జరిగిన రోజు
పాండవుల విజయానికి బీజం పడిన రోజు
మహిళల గొప్పతనాన్ని చాటిన రోజు.
మహిళలను పూజించి గౌరవించాలని
అన్యాయం జరిగితే ఎదురు తిరిగి
ప్రతి స్త్రీ ధైర్యస్థైర్యాలతో పోరాడాలని
అప్పుడే దేశం సుభిక్షంగా
సుందరంగా రూపొందుతుంది
అదే ఈ పండుగ నేర్పేది
స్త్రీలు వెన్నెలలా
చల్లదనం కురిపించగలరు
అన్యాయం జరిగితే ఆగ్రహించి
నిప్పులు కురిపించి
అన్యాయాలను అణచివేయగలరు
ఇదే ఈ పండుగ చెప్పిన
మహిళా విజయము.
