[బాలబాలికల కోసం ‘మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచిన జానకీ అమ్మాళ్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
వృక్ష శాస్త్రంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, భారత ప్రభుత్వ శాస్త్ర సలహా బోర్డు సభ్యత్వం, పద్మశ్రీ పురస్కారం ఉన్న శాస్త్రవేత్త జానకీ అమ్మాళ్ గురించి తెలుసుకుందాం.
శాస్త్రీయ ఆలోచనలతో ఉన్నత పదవులందుకున్న మహిళా శాస్త్రవేత్తలలో జానకీ అమ్మాళ్ కూడా ఒకరు. ఢిల్లీలోని వృక్ష పరిశోధనా సంస్థలో జానకీ అమ్మాళ్ స్మారక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
జానకీ అమ్మాళ్ 1897లో నవంబరు 4వ తేదీన కేరళలో జన్మించారు. బాల్యమంతా తలస్సేరి పట్టణంలోనే గడిచింది. ఆమె తన చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి కనబరిచారు. కుటుంబం కూడా ఆదర్శ భావాలు కలిగిన కుటుంబం కావున, ఆమెకు నచ్చినట్లుగా చదువు చెప్పించారు. చెన్నైలోని క్వీన్స్ మేరీ కాలేజీలో చదివారు. వృక్ష శాస్త్రంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత చదువు కోసం విదేశాలు వెళ్ళారు. స్కాట్లాండ్‌లోని మిచిగాన్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పూర్తి చేశారు. విదేశీ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి పట్టా సాధించిన తొలి భారతీయ మహిళగా పేరు పొందారు. ఆమె వృక్షాల జన్యు పరమైన నిర్మాణాల మీద అత్యంత కఠిన పరిశోధన కావించారు. వృక్ష శాస్త్రంపై ప్రేమతో నిరంతర సాధన పరిశ్రమతో గొప్ప శాస్త్రవేత్తగా పేరు పొందారు.
భారతదేశ వన సంపద ఆధారంగా అనేక పరిశోధనలు చేశారు. పరిశోధనా ఫలితాలను ఆంగ్ల జర్మల్స్‌కు పంపేవారు. ఫలితంగా ఆమె పరిశోధనలు భారతదేశంలోనే కాక అనేక దేశాలలో ప్రసిద్ధి పొందాయి. ఆమె చేసిన పరిశోధనలు, భారతీయ వ్యవసాయ రంగంలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చాయి. బాంబాయి, మద్రాసు, లాహోర్ వంటి నగరాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేసి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు.
జానకీ అమ్మాళ్ ప్రధానంగా చెరుకు గడల జన్యు నిర్మాణం వంటి అభివృద్ధిపై పరిశోధనలు చేశారు. ఆమె చేసిన విస్తృత పరిశోధనల వలన చెరుకు గడలలో కొత్త జాతి అభివృద్ధి చెందింది. వీటి వలన ఎక్కువ ఉత్పత్తి జరిగి, మనకు అధిక లాభాలు సమకూరేవి. రైతులకు మహదానందం కలిగేది. ఆమె వ్యవసాయ ఉత్పత్తులలోనే కాకుండా, ఔషధ మొక్కలపై కూడా అధికంగా పరిశోధనలు చేశారు. ఔషధ మొక్కల పనితీరు, ఉపయోగాల గురించి పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆమె పరిశోధనల వలననే అనేక వృక్ష జాతులు పరిరక్షించబడ్డాయి.
జానకీ అమ్మాళ్‌ను భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ బృందాల్లో సభ్యురాలిగా నియమించింది. ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. ప్రకృతి పరిరక్షణ, అడవుల సంరక్షణ, అరుదైన మొక్కల పెంపకంలో ఆమె చేసిన కృషి అపూర్వమైనదిగా కొనియాడబడింది. భారత ప్రభుత్వ పర్యావరణ శాఖలో అత్యున్నత పదవులు పొందారు. హిమాలయన్ సేంద్రీయ వృక్ష సంపద గురించి ఎంతో అధ్యయనం చేసి, పలు ప్రామాణిక పత్రాలు వెలువరించారు. రాయల్ హార్చికల్చర్ సొసైటీలో వృక్ష కణ శాస్త్రంలో పరిశోధనలు చేశారు. కేంద్రక ఆమ్లాలలో ఉన్న నత్రజని ఆధారాన్ని విశ్లేషించారు. కణాలకు నష్టం కలిగించే విషపూరిత పదార్థాలను కనుగొన్నారు.
జానకీ అమ్మాళ్ రాసిన ‘క్రోమోసోమ్ అట్లాస్ ఆఫ్ ద కల్టివేటెడ్ ప్లాంట్’ అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథం దేశ విదేశాల్లోని శాస్త్రవేత్తలకు కల్పతరువుగా మారింది. విద్యార్థుల పాఠ్య పుస్తకంగా కీర్తి పొందింది. చెరుకు ముక్కలలోని సూక్ష్మమైన బీజ మాతృ కణముల గురించి చేసిన ప్రయోగాలలో నూతన అంశాలను వెలికి తీసిన ఘనత ఈమెకె దక్కింది. చెరుకు ముక్కల జీవ పరిణామాన్ని తొలిసారిగా అన్వేషించారు.
బొంబాయిలోని బాబా అటామిక్ రీసెర్చి సెంటర్‌లోనూ, సెంటర్ ఫర్ ఆద్యాన్స్‌డ్ స్టడీస్‌లోనూ గౌరవ శాస్త్రవేత్తగా బహుముఖ సేవలు అందించారు. అలహాబాద్‌లోని సెంట్రల్ బొటానికల్ లేబరేటరీలో డైరెక్టర్‌గా పని చేశారు. కలకత్తాలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో స్పెషల్ ఆఫీసర్‌గా చేరి, నూతన విధానాలను అనుసరించారు. బొటానికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు కార్యదర్శిగాను, గౌరవ అధ్యక్షురాలిగాను బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, బ్రిటన్‌లోని లినేయం సొసైటీ, లండన్‌లోని రాయల్ జియోగ్రాఫికల్ సోసైటీ, జెనిటికీ సోసైటీ ఆఫ్ అమెరికా వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు జానకీకి గౌరవ ఫెలోషిప్‌లను అందించాయి. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్‌కు ఉపాధ్యక్షురాలిగా పని చేసి, ఆయా సంస్థల పురోభివృద్ధికి కృషి చేశారు.
జానకీ అమ్మాళ్ సాధించిన విజయాలు ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. పరిశోధన రంగం వైపు మళ్ళాలనే ఆలోచన, ఆకాంక్ష బాలికల్లో కలిగించింది. తన జీవితం మొత్తం మహిళా విద్య కోసం తపించారు. ఆమె శాస్త్ర రంగంలో చేసిన కృషి మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచింది.
1984 ఫిబ్రవరి 7వ తేదీన జానకీ అమ్మాళ్ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆమె మరణం భారతదేశ వృక్షశాస్త్ర రంగానికి తీరని లోటు. ఆమె స్మారకార్థం అనేక వృక్ష శాస్త్ర పీఠాలు నెలకొల్పబడ్డాయి. వారి పరిశోధనలు విద్యార్థులకు పాఠ్యాంశాలుగా మారాయి. ఆమె జీవితం, కృషి చరిత్రలో చెరగని అక్షరాలతో లిఖించారు. ముందు తరాలకు వారి జీవితం స్ఫూర్తిదాయకం.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
