[యం. ధరిత్రీ దేవి గారు రచించిన ‘మహిళలు.. మహరాణులు’ అనే కవితని అందిస్తున్నాము.]
మహిళలు..
మకుటం లేని మహరాణులు..
నట్టింట నడయాడే వెన్నెల కెరటాలు..
ఏ సిరిసంపదలు కొనలేవు.. ఆమె చిరునవ్వులు..
అతివ లేక ఆ గృహం..
చీకటి అలుముకున్న గుయ్యారం
ఇంటి దీపమై వెలుగులు వెదజల్లే ఇంతి..
ఇల వెలిసిన ఆ కనిపించని ఇలవేలుపే..!
కనుల ముందు కదిలే కాంతిపుంజమే!!
మెడలో మెరిసే తాళి.. వెలకట్టలేని
అమూల్య ఆభరణమై భాసిల్లుచుండగా..
మెట్టెల సవ్వడి.. మట్టిగాజుల గలగలలు
సమ్మిళితమై.. సరిగమల సంగీతం సృష్టిస్తూ
వీనులవిందు చేస్తుండగా..
ఆ స్వర్ణకుటీరం స్వర్గధామమే కాదా..!
మగనికి కుడి భుజమై.. భూషణమై..
ఇంటిల్లిపాదికీ ఆసరాయై.. భరోసాయై
నిలిచే గృహలక్ష్మీ.. నీవు లేక గడియైనా గడవదే..!
నీ ఉనికి కరువైన.. ఈ జగతి శూన్యమే..!!
సేవలందించడమే తన ధ్యేయం..
ప్రతిఫలమాశించని శ్రమైక జీవన
సౌందర్యం.. ఆమె సొంతం..
సమయపాలన తనకు కరతలామలకం..
ఇంటా బయటా.. సమన్వయం అద్వితీయం!!
అందుకే మరి.. మహిళలు మహరాణులు..
నట్టింట నడయాడే వెన్నెల కెరటాలు..!!
యం. ధరిత్రీ దేవి విశ్రాంత అధ్యాపకురాలు. వీరి కవితలు, కథలు, వ్యాసాలు కొన్ని ప్రింట్ పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో ప్రచురింపబడినవి.
